జవాహర్ లాల్ నెహ్రూ

స్వాతంత్ర్య భారతదేశ మొదటి ప్రధాన మంత్రి
(జవహర్‌లాల్ నెహ్రూ నుండి దారిమార్పు చెందింది)

జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889మే 27, 1964) భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

పండిత్ జవాహర్‌లాల్ నెహ్రూ
జవాహర్ లాల్ నెహ్రూ


భారతదేశపు మొదటి ప్రధానమంత్రి
పదవీ కాలం
ఆగష్టు 15 1947 – మే 27 1964
రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ , సర్వేపల్లి రాధాకృష్ణన్
ముందు (ఎవరూ లేరు)
తరువాత గుల్జారీలాల్ నందా (ఆపధర్మం)

భారతదేశపు మొదటి విదేశాంగ మంత్రి
పదవీ కాలం
ఆగష్టు 15 1947 – మే 27 1964
ముందు (ఎవరూ లేరు)
తరువాత గుల్జారీలాల్ నందా

పదవీ కాలం
అక్టోబర్ 8 1958 – నవంబర్ 17 1959
ముందు టి. టి. కృష్ణమాచారి
తరువాత మొరార్జీ దేశాయ్

వ్యక్తిగత వివరాలు

జననం (1889-11-14)1889 నవంబరు 14
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్,
India ఇండియా
మరణం 1964 మే 27(1964-05-27) (వయసు 74)
కొత్త ఢిల్లీ, భారతదేశం
జీవిత భాగస్వామి కమలా నెహ్రూ
బంధువులు నెహ్రూ-గాంధీ కుటుంబం
సంతానం ఇందిరా గాంధీ
వృత్తి బారిస్టరు
మతం హేతువాది[1] or నాస్తికుడు[2]
సంతకం జవాహర్ లాల్ నెహ్రూ's signature

తొలినాళ్ళు

జననం, కుటుంబ నేపథ్యం

జవాహర్‌లాల్ నెహ్రూ బ్రిటీష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులోని అలహాబాదు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భాగం) నగరంలో 1889 నవంబరు 14న రాత్రి 11.30 గంటలకు కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టర్, తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు. తల్లి స్వరూపరాణి తుస్సు లాహోర్‌లో స్థిరపడ్డ కాశ్మీరీ పండిట్‌ కుటుంబానికి చెందినది. మోతీలాల్ మొదటి భార్య బిడ్డను ప్రసవిస్తూ, బిడ్డతో సహా చనిపోగా స్వరూపరాణిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవాహర్‌లాల్ తొలి సంతానం.[3]

 
1894లో తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణిలతో జవాహర్‌లాల్ నెహ్రూ

జవాహర్‌లాల్ నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్‌కు చెందినవారైనా తరాల క్రితం రాజ్‌కౌల్ అన్న పూర్వీకుడు ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డాడు. నెహ్రూ వంశస్థులు ఢిల్లీలో మొఘల్ పాలకుల ఆదరాభిమానాలకు పాత్రులై ఉన్నతస్థితి, ఆర్థికాభివృద్ధి పొందారు. కౌల్ అన్న అసలు వంశం పేరుకు తోడు నెహ్రూ అన్న మరొక వంశనామం కూడా చేర్చి కౌల్-నెహ్రూగా పెట్టుకునేవారు. క్రమేపీ కౌల్ అన్నది పోయి నెహ్రూ స్థిరపడింది.[నోట్స్ 1] మోతీలాల్ నెహ్రూ తండ్రి అతను జన్మించడానికి కొద్ది నెలల ముందే మరణించినా, అప్పటికే భారతీయ సంస్థానాల్లో ఉన్నతోద్యోగులైన అన్నలు అతన్ని చదివించారు. మోతీలాల్ నెహ్రూ న్యాయవాదిగా మంచి పేరు సంపాదించి, బాగా సంపద ఆర్జించాడు. జవాహర్‌లాల్ జన్మించడానికి మూడేళ్ళ ముందే మోతీలాల్ కుటుంబం, ఆయన వృత్తి రీత్యా, కాన్పూర్ నుంచి అలహాబాద్ చేరుకుని స్థిరపడింది.[4][5]

జవాహర్‌లాల్ నెహ్రూ పుట్టేసరికే కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండేది. తల్లి స్వరూపరాణి ప్రభావంతో ఇంట్లో భారతీయ సంప్రదాయాలు, పండుగలు పబ్బాలు జరిగేవి. స్త్రీల నుంచి జవాహర్‌లాల్, అప్పటి భారతీయులందరిలానే, పురాణగాథలు, జానపద కథలు విన్నాడు. గంగాస్నానం, దైవదర్శనం వంటివి తల్లి జవాహర్‌తో చేయించేది. జవాహర్ జననం నాటికే తండ్రి పేరొందిన న్యాయవాది, తర్వాతి కాలంలో బ్రిటీష్ బారిస్టర్ అయిన మోతీలాల్ నెహ్రూ బ్రిటీష్ పెద్దమనిషి తరహాలో వ్యవహరించేవాడు. ఇంటిలో విలాసవంతమైన ఈతకొలను, టెన్నిస్ కోర్టు వంటివి ఉండేవి. ఇలా కొన్ని భారతీయ, మరికొన్ని ఆంగ్లేయ పద్ధతులు కలిగిన ఈ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం, అప్పటి అలహాబాద్ హిందూ అగ్రవర్ణ జీవనంలో పూర్తిగా కలవలేదు. అలహాబాద్‌కి కొత్తవారు కావడం, కాశ్మీరీ పండిట్లకు సహజంగా కొంత ఆచార వ్యవహారాల్లో పట్టింపు తక్కువ కావడం[నోట్స్ 2] వంటి కారణాలకు మోతీలాల్ 1899లో సముద్రయానం చేసివచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోకపోవడం తోడుకావడంతో వీరి కుటుంబాన్ని అలహాబాద్ బ్రాహ్మణులు వెలివేశారు. కాశ్మీరీ పండితుల్లో కూడా కాస్త చాందసంగా ఉండే కుటుంబాలకు నెహ్రూ కుటుంబం దూరంగానే ఉండేది. వెరసి ఈ కుటుంబం మతాచారాల విషయంలో పట్టింపు చూపేది కాదు.[4]

బాల్యం

 
15 సంవత్సరాల వయసులో హేరో పాఠశాలలో జవాహర్‌లాల్ నెహ్రూ

సుసంపన్నమైన కుటుంబంలో తల్లిదండ్రుల తొలి సంతానం కావడంతో జవాహర్‌లాల్ బాల్యం ముద్దుమురిపాల నడుమ, అతిగారాబంగా సాగింది.[4] జవాహర్‌లాల్‌ను తండ్రి కొద్దినెలల పాటు స్థానిక కాన్వెంటుకు పంపి ఆ ప్రయత్నం విరమించి, ఇంట్లోనే ప్రైవేటుగా చదివించడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అతనికి మహాపండితుడైన గంగానాథ ఝా సంస్కృత విద్య, అనీ బిసెంట్ సూచించిన ఫెర్డినాండ్ టి. బ్రూక్స్ అనే దివ్యజ్ఞాన సమాజ యువకుడు ఆంగ్ల విద్య బోధించేవారు. తండ్రి ఆంగ్ల విద్యకే ప్రాధాన్యం ఇచ్చాడు, అందుకు అనుగుణంగానే జవాహర్‌కి సంస్కృత విద్య ఒంటబట్టలేదు.[నోట్స్ 3] బ్రూక్స్ అతనికి విజ్ఞానశాస్త్రం పట్ల ప్రాథమిక అవగాహన, దివ్యజ్ఞాన సమాజ తాత్త్వికత పట్ల ఆసక్తి, ఆంగ్ల కవిత్వం, సాహిత్యం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పలు అంశాలను పరిచయం చేశాడు.[6][7] దివ్యజ్ఞాన సమాజం పరిచయం నెహ్రూకు బౌద్ధ, హిందూ మతగ్రంథాల పట్ల ఆసక్తి కలిగించి అధ్యయనానికి పురిగొల్పింది. మూడు సంవత్సరాల పాటు బ్రూక్స్ నెహ్రూకు ట్యూటర్‌గా వ్యవహరించాడు.[8] అతని గురించి తర్వాతికాలంలో నెహ్రూ మాట్లాడుతూ "దాదాపు మూడేళ్ళు (అతను) నాతో ఉన్నాడు. ఎన్నో విధాలుగా అతను నన్ను గొప్పగా ప్రభావితం చేశాడు" అన్నాడు.[9]

పాఠశాల విద్యాభ్యాసం

మోతీలాల్ జవాహర్‌లాల్ ప్రైవేటు విద్యను ముగింపజేసి, 1905 మే నెలలో కుటుంబ సమేతంగా బ్రిటన్ వెళ్ళి ప్రతిష్ఠాత్మక హేరో పాఠశాలలో కుమారుడికి ప్రవేశం సంపాదించాడు. హేరోలో ప్రతిభా పాటవాలు చూపి పేరుతెచ్చుకున్నా,[7] క్రమేపీ హేరో పాఠశాల జీవితం అతన్ని విసుగెత్తించింది.[10] హేరో పాఠశాల విద్యాకాలం మొత్తం మీద అధికారుల శిక్షణ కోర్‌ మాత్రం అతన్ని ఆకట్టుకుని, ఉత్సాహభరితంగా పాల్గొనేలా చేసింది. మరోవైపు 1905లో భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు అతనికి ఆసక్తి కలిగించడం ప్రారంభించాయి. 1905లో జరిగిన బెంగాల్ విభజన, అది బెంగాల్‌లోని జాతీయోద్యమాన్ని బలహీనపరిచే చర్యగా ఆందోళనలు పెరుగుతూండడం, ఆ ఆందోళనలు కాంగ్రెస్ పార్టీలో అతివాదులు, మితవాదుల విభజన సృష్టించడం వంటి పరిణామాలను జవాహర్‌లాల్ ఆసక్తిగా పరిశీలించసాగాడు. తండ్రికి ఉత్తరాలు రాసి ఎప్పటికప్పుడు వార్తాపత్రికలు తెప్పించుకుంటూ ఉండేవాడు. ఆ దశలో అతనికి అతివాదుల మీద సానుభూతి ఏర్పడింది.[11] మరోవైపు షుషిమా వద్ద నౌకాయుద్ధంలో రష్యాపై జపాన్ ఘనవిజయం సాధించిందన్న వార్త అతనిని చాలా సంతోషపరిచింది. ఆసియా దేశాలు ఐరోపా వలసపాలనలో మగ్గుతూ ఉన్న ఆ దశలో తోటి ఆసియా దేశమైన జపాన్ ప్రదర్శించిన సైనిక పాటవం, శక్తి సామర్థ్యాలు అతనికి ఉత్సాహం కలిగించాయి.[10] హేరో పాఠశాలలో అతని విద్యావిషయమైన ప్రతిభకు బహుమతిగా బ్రిటీష్ చరిత్రకారుడు జి. ఎం. ట్రావెల్యాన్ ఇటలీ జాతీయవాది, సైన్యాధ్యక్షుడు అయిన గారిబాల్డ్ గురించిన పుస్తకాలు లభించాయి.[12] ఇవి జవాహర్‌లాల్‌ను ప్రభావితం చేశాయి. తన మనసులో భారతదేశ స్వేచ్ఛ కోసం అద్భుతమైన పోరాటాలు చేసినట్టు కొన్ని దృశ్యాలు తళుక్కుమనేవని, ఆ పుస్తకాలు చదివేప్పుడు ఆలోచనల్లో అతను వర్ణించే ఇటలీ, తన మాతృభూమి భారతదేశం గొప్పగా కలగలిసిపోయేవని జవాహర్‌లాల్ పేర్కొన్నాడు.[9]

కేంబ్రిడ్జి విద్యాభ్యాసం

 
కేంబ్రిడ్జిలో విద్యార్థిగా ఉండగా కుటుంబంతో జవాహర్‌లాల్ నెహ్రూ

జవాహర్‌లాల్ 1907లో కేంబ్రిడ్జి ప్రవేశపరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడై, ఆ సంవత్సరం అక్టోబరు నెలలో ట్రినిటీ కళాశాలలో చేరాడు. ప్రవేశపరీక్షకు, ట్రినిటీ ప్రవేశానికి మధ్యలో వేసవి కాలంలో కొన్ని వారాల పాటు ఐర్లాండును సందర్శించాడు. స్వయంపాలన కోసం పోరాటం చేస్తున్న ఐర్లాండు అతని ఆసక్తిని చూరగొంది. క్రియాశీలంగా ఆందోళనలు చేస్తున్న ఐరిష్ అతివాద ఆందోళనలు అతనికి నచ్చాయి. ఈ దశలో అతను తండ్రికి రాసే ఉత్తరాల్లో జాతీయవాద ఉద్యమాలు, వాటిలో ప్రత్యేకించి అతివాదం పట్ల తనకు ఏర్పడుతున్న అభిమానాన్ని వెల్లడించేవాడు.[13][10] కేంబ్రిడ్జిలో అతను రసాయనశాస్త్రం, భూవిజ్ఞాన శాస్త్రం, భౌతికశాస్త్రాలను అధ్యయనాంశాలుగా స్వీకరించి కొన్నాళ్ళకే భౌతికశాస్త్రాన్ని విడిచిపెట్టి వృక్షశాస్త్రం స్వీకరించాడు. కేంబ్రిడ్జిలో జవాహర్‌లాల్ అంతగా శ్రమించి చదవలేదు. యువకులకు ఉత్సాహభరితంగా ఉండే కేంబ్రిడ్జి వాతావరణం అతని నిరాసక్తతను మార్చలేకపోయింది. ఆ దశలో జవాహర్‌లాల్‌కి టెన్నిస్ ఆట, గుర్రపుస్వారీ, పందెపు పడవల జట్టులో ఆడడం వంటి వ్యాపకాలు ఉండేవి కానీ ఆ వ్యాపకాలు వేటిలోనూ పూర్తి అభినివేశం కానీ, మంచి ఉత్సాహం గానీ చూపించలేదు. ఫైనల్ ట్రైపోన్ పరీక్షలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడైనవారిలోనూ అతని పేరు కింది వరుసలోనే వచ్చింది.[14] అలా 1910లో ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఈ దశలో అతను రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం చదువుకున్నాడు. జార్జి బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎం.కీన్స్, బెర్ట్రాండ్ రస్సెల్, లూయీస్ డిక్సన్, మెరెడిత్ టౌన్సెండ్ వంటి వారి రచనలు అతని రాజకీయ, ఆర్థిక చింతనపై ప్రభావం చూపాయి.[9]

న్యాయవిద్యాభ్యాసం

కేంబ్రిడ్జిలో ఫైనల్ ట్రైపోన్ పరీక్షకు ముందే ఇన్నర్ టెంపుల్‌లో చేరాడు. ఇన్నర్ టెంపుల్ అన్నది న్యాయవిద్య అభ్యసించి బారిస్టర్ కావడానికి అవసరమైన నాలుగు ఇన్‌లలో ఒకటి. కనీసం న్యాయవిద్య తన కుమారుడి ఆసక్తిని చూరగొందని, ఇకపై ఉత్సాహంగా చదువుతాడని మోతీలాల్ నమ్మాడు. కానీ తన ఇష్టంతో ప్రమేయం లేకుండా సాగుతున్న తన జీవితం పట్ల ఆనాసక్తితో ఉన్న జవాహర్‌లాల్ న్యాయవిద్యాభ్యాసంలోనూ పెద్ద చురుకుదనం, ఉత్సాహం ప్రదర్శించలేదు..[15] ఇన్నర్ టెంపుల్‌లోని రెండేళ్ళ కాలంలో జవాహర్‌లాల్ ప్రాణానికి ప్రమాదమైన సాహసకార్యాలు చేశాడు, పాత మిత్రులను తిరిగి కలిశాడు, ఫాషన్లు అనుసరించాడు, అప్పులు చేశాడు. ఇలా లండన్ జీవితంలోని సందడి చవిచూశాడు. అంతేతప్ప విద్యాభ్యాసంలో మంచి పట్టుదల కనబరచలేదు. ఫలితంగా 1912లో స్కాలర్‌షిప్‌లు, బహుమానాలు వంటివి ఏమీ సాధించకుండా బార్ ఎట్ లా పరీక్షల్లో సాధారణంగా ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటికి ఇంగ్లాండులో ఏడేళ్ళ విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భారతదేశానికి తిరిగివచ్చాడు. భారతదేశం తిరిగివచ్చేనాటికి అతని మనస్సు, బుద్ధి ఒక వృత్తి కోసం కాక, భవిష్యత్తులో రాబోయే పిలుపును అందుకోవడానికి సంసిద్ధంగా తయారైంది.[16] నెహ్రూ జీవితచరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ ప్రకారం జవాహర్‌లాల్ విద్యభ్యాసం ముగించుకుని భారతదేశానికి తిరిగివచ్చేనాటికి చక్కని శిక్షణ పొందిన మనస్సు, మంచి భావనాశక్తితో పాటుగా జీవితాంతం శాశ్వతంగా అంటిపెట్టుకున్నవి మరో రెండు తెచ్చుకున్నాడు: అవి బ్రిటన్ పట్ల ప్రేమాభిమానాలు, బ్రిటీష్ విలువలు.[17]

న్యాయవాద వృత్తిలో

 
నెహ్రూ -గాంధీ కుటుంబం, కా 1927

బారెట్లా ఉత్తీర్ణుడై ఇన్నర్ టెంపుల్‌లో బారిస్టరుగా నమోదుకాగానే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి 1912 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చాడు. జవాహర్‌లాల్ అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకుని, తండ్రి ప్రాక్టీసులో సహ న్యాయవాదిగా వృత్తి ప్రారంభించాడు. తండ్రి వలె కాక జవాహర్‌లాల్‌ న్యాయవాద వృత్తిలో పెద్ద ఆసక్తి కనబరచలేదు. తత్ఫలితంగా అతను న్యాయవాదిగా పెద్దగా రాణించిందీ లేదు, తోటి న్యాయవాదుల సాంగత్యంలో ఇమడగలిగినదీ లేదు. న్యాయవాదిగా ప్రాక్టీసుచేసిన రోజుల గురించి జవాహర్‌లాల్ మొత్తం మీద ఆ వాతావరణం మేధోపరంగా ఉత్తేజితంగా ఉండేది కాదని, తనకు జీవితం పట్ల విపరీతమైన నిరాసక్తత పెరిగిపోయిందని పేర్కొన్నాడు. తండ్రి జవాహర్‌లాల్‌కు కక్షిదారులను తీసుకువచ్చేవాడు. జవాహర్ క్రమశిక్షణతోనే కేసులను నడిపేవాడు. కానీ జీవితోత్సాహం లోపించేది. బ్రిటన్‌లో ఉన్నకాలంలో అతను జాతీయవాదంపైనా, అతివాదంపైనా చూపిన ఆసక్తి క్రియారూపంలోకి రాలేదు. ఈ దశలో సంపన్న పాశ్చాత్య ప్రభావితమైన భారతీయ జీవనంలో ఇమిడిపోవడానికి అదేమీ అడ్డురాలేదు. జవాహర్ ఈ దశలో కొంతమేరకు సామాజిక సేవ కూడా చేసేవాడు. వాటిలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యమానికి మద్దతుగా నిధుల సేకరణ ఒకటి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యమాలకు సూత్రప్రాయంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వ సానుభూతి ఉండేది కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు. జవాహర్‌లాల్ ఈ క్రమంలో ముందుకుపోయి బ్రిటీష్ పారామిలటరీలో చేరి, తోటి భారతీయ యువకులను ఆ దళంలో చేర్చడానికి అవసరమైన ప్రయత్నాలు చేసేవాడు. అప్పటికే అంతరంగంలో జాతీయవాద పోరాటాలు, అతివాద ఉద్యమాల పట్ల ఆరాధనాభావం ఉన్నా, ఈ దశలో అతని క్రియాశీల రాజకీయ అవగాహన దయాళువులైన బ్రిటీష్ వారు భారతీయుల న్యాయమైన కోర్కెలు తీరుస్తారన్న నమ్మకానికి పరిమితమై ఉండేది.

సహాయ నిరాకరణోద్యమం నుంచి పూర్ణ స్వాతంత్ర్యం వరకు (1919 - 1930)

రాజకీయాల్లోకి ప్రవేశం: రెండవ ప్రపంచయుద్ధం, హోంరూల్ లీగ్

అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో తండ్రి చాటు న్యాయవాదిగా పనిచేస్తున్న జవాహర్‌లాల్ తండ్రితో పాటుగా 1912లో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు హాజరయ్యాడు.[18] జీవితకాలం పాటు అనుబంధం పెంచుకున్న ఆ సంస్థ అప్పటి దశలో చేస్తున్న రాజకీయాలు జవాహర్‌లాల్‌కు కనీస ఆసక్తి కలిగించలేదు. అతనికి ఆ సమావేశాలు - "ఇంగ్లీషు తెలిసిన ఉన్నత వర్గాల వ్యవహారంగా మాత్రమే" అనిపించాయి.[19] ఆ దశలో కాంగ్రెస్ దాదాపుగా మితవాద రాజకీయ నాయకులతో నిండి ఉండేది.[18] మొదటి ప్రపంచయుద్ధం వచ్చిన ఆ దశలో తనకు ఒక స్పష్టమైన వైఖరి లేదని జవాహర్ తర్వాతి దశలో అంగీకరించాడు. నెహ్రూ జీవితచరిత్రకారుల్లో ఒకడైన ఫ్రాంక్ మోరిస్ రాసినదాని ప్రకారం "అతని (జవాహర్‌లాల్) సానుభూతి ఏ దేశంతో అయినా ఉందంటే అది ఫ్రాన్స్. ఫ్రెంచి సంస్కృతి పట్ల అతనికి ఎంతగానో గౌరవం ఉండేది."[20] యుద్ధసమయంలో జవాహర్ "సెయింట్ జాన్స్ అంబులెన్స్"కు స్వచ్ఛంద సేవకునిగా ఉన్నాడు. అలహాబాదులో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసు వారి ప్రాంతీయ కార్యదర్శుల్లో అతను ఒకడు.[18] కానీ ప్రభుత్వం అమలు చేసిన సెన్సార్‌షిప్ బిల్లులను వ్యతిరేకించాడు.[21] 1917లో ప్రాంతీయ సైన్యం నమూనాలో తయారుచేసిన భారతీయ రక్షణదళంలో చేరడానికి తన సమ్మతిని తెలియజేశాడు. తనవంటి యువకులను అందులో చేరేలా ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంసిద్ధుడైనాడు.[22]

కాంగ్రెస్ సంస్థలో అతివాదులకు ప్రవేశం ఇప్పించే ప్రయత్నాలు బెడిసికొట్టి మితవాదులు విజయం సాధించడంతో బాలగంగాధర తిలక్, అనీ బిసెంట్ హోంరూల్ లీగులు స్థాపించారు. స్వయంపాలన ఆవశ్యకతను ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపించారు. ప్రభుత్వం అనీబిసెంట్‌ని బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సుల నుంచి బహిష్కరించింది.[22] దీనిపై దేశవ్యాప్తంగా ఎందరో విద్యావంతులు, అనీబిసెంట్ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. అలా ప్రభుత్వ చర్యలను నిరసించినవారిలో జవాహర్‌లాల్ ఒకడు. ప్రతిస్పందనగా తాను భారతీయ రక్షణదళంలో చేరడానికి చేసిన దరఖాస్తు ఉపసంహరించుకుని, దళంలో చేరేలా ఇతరులను ప్రోత్సహించేందుకు నిర్వహించబోయిన సభ రద్దుచేశాడు. మోతీలాల్ అధ్యక్షతన జవాహర్‌లాల్ ఒకానొక కార్యదర్శిగా యునైటెడ్ ప్రావిన్సుల హోంరూల్ లీగ్ ఏర్పాటుచేశారు. అయితే హోంరూల్ సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విషయంలో జవాహర్‌లాల్‌కి స్పష్టత లేదు. హోంరూల్ నాయకులైన అనీబిసెంట్ ఆంగ్లో-సాక్సన్ పద్ధతి కానీ, తిలక్ తీవ్రమైన అతివాదం కానీ అతన్ని ఆకర్షించలేదు. అలాగని స్వంతంగా తనే కార్యాచరణ ఏర్పురుచుకోగల స్పష్టత కూడా లేదు.[23] సిరిసంపదల వల్ల దేశప్రజలకు సేవచేయగల స్థితిలో ఉండి కూడా తండ్రి స్థాపించిన ఇండిపెండెంట్ పత్రిక నిర్వహణలో సహకారం తప్ప మరేమీ చేయలేకపోతున్నందుకు అసంతుష్టితో గడిపేవాడు.[24]

సహాయ నిరాకరణోద్యమంలోకి

1919లో రౌలట్ చట్టం అమలులోకి రావడం, జలియన్ వాలాబాగ్ దురంతం జరగడం జవాహర్‌లాల్‌లో పెద్ద పరివర్తనానికి కారణమయ్యాయి. జలియన్‌ వాలాబాగ్ దురంతాన్ని గురించి నివేదించడానికి ఏర్పరిచిన కాంగ్రెస్ కమిటీకి జవాహర్‌లాల్ సహకరించేందుకు అమృత్‌సర్ సందర్శించాడు. ప్రత్యేకించి జలియన్ వాలాబాగ్ దురంతం పట్ల ఇంగ్లండులో వ్యక్తమైన అభిప్రాయం అతన్ని కలతపెట్టింది.[25] సర్వేపల్లి గోపాల్ ఈ దశలో వచ్చిన మార్పు గురించి - " (అంతవరకు) దయాసముద్రులైన బ్రిటీష్ పాలకులవల్ల ఉపకారం, మేలు జరుగుతాయని (జవాహర్‌లాల్) ఆశిస్తూ ఉన్నాడు. కాని స్వాతంత్ర్యమనేది ఒకరు ఆదరభావంతో ఇచ్చే కాన్క కాదనీ, ప్రతిఘటించి పోరాటం సల్పినందువల్ల దక్కే ఫలితమనీ దేశంలో సర్వసాధారణంగా చాలామందికి కనువిప్పు కలిగింది. దాని పర్యవసానమే జవహర్‌లో వచ్చిన పెద్ద పరివర్తనం." అని రాశాడు.[26] 1920లో పలువురు భారతీయ జాతీయోద్యమ నాయకులు, కార్యకర్తల వలెనే జవాహర్‌లాల్ ను కూడా గాంధీ భావాలు, కార్యాచరణ విపరీతంగా ఆకర్షించాయి. గాంధీ పిలుపును అనుసరించి సహాయ నిరాకరణోద్యమంలో తన కృషి ప్రారంభించాడు. జవాహర్‌లాల్ యునైటెడ్ ప్రావిన్సుల్లో సహాయ నిరాకరణోద్యమాన్ని నిర్వహించే బాధ్యత స్వీకరించాడు. యుపిలో ప్రముఖుడైన కాంగ్రెస్ నాయకుడిగా అతికొద్ది కాలంలోనే పేరు సంపాదించాడు.[27]

1920 జూలై నుంచి అలహాబాద్ జిల్లాకు ఉత్తరాన ఉన్న ప్రతాబ్‌గఢ్ జిల్లాలో జమీందార్లు చిత్తం వచ్చినట్టు కౌళ్ళు, జరిమానాలు, నజరానాలు విధిస్తూండడంతో తిరగబడ్డ[28] వెనుకబడ్డ కుర్మీ కులానికి చెందిన రైతుల పోరాటానికి జవాహర్‌లాల్ నాయకత్వం వహించాడు. రైతుల కోర్కెలకు న్యాయబద్ధమైన స్పష్టమైన రూపం ఇచ్చి, వారిని అహింసవైపు మళ్ళించి, వారి సమస్యలను వెల్లడించేందుకు కిసాన్ సభలను ఏర్పాటుచేశాడు. మరోవైపు రైతులను అక్రమంగా అరెస్టు చేసిన బ్రిటీష్ అధికారులతో సంప్రదింపులు జరిపాడు.[29][30] రైతుల్లోని క్రమశిక్షణ, వారికి జవాహర్ నాయకత్వం పట్ల గౌరవం అతన్ని కదిలించాయి. ప్రతాబ్‌గఢ్ ప్రాంతంలో ఒకచోట సభలో తాను ప్రసంగిస్తూండగా జనంలో చిన్న కలకలం రేగింది. మాట్లాడకున్నా వారిలో వారే తోసుకోవడం, మోచేతులతో పొడుచుకోవడం కనిపించింది. ఆగ్రహించి అదేమని ప్రశ్నిస్తే - అక్కడొక పాము ఉందని, ప్రాణభయం ఓవైపు ఉన్నా కూడా క్రమశిక్షణ తప్పకుండా అలా మౌనంగానే ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారని తెలిసింది. మూడున్నర దశాబ్దాల తర్వాత గుర్తుచేసుకునేంతగా జవాహర్ మీద ఈ సంఘటన ముద్రవేసింది.[31] జమీందార్ల విధానాలకు తోడు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల 1921 సంవత్సరంలో హింసాత్మకమైన రైతాంగ ఆందోళన అవధ్ అంతటా వ్యాపించింది.[32] జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో పోలీసుల దాడులు, నాయకుల అరెస్టుల వల్ల రెచ్చిపోతున్న గుంపుల ఎదుట నిలిచి జవాహర్ వారికి సాహసోపేతంగా అహింస బోధించి శాంతపరిచాడు. ప్రభుత్వం ఒకపక్క సహాయనిరాకరణ ఉద్యమ నాయకులైన గాంధీ, నెహ్రూ వంటివారి పట్ల అనుమాన దృక్కులతో చూస్తూనే, ఉద్యమ నాయకత్వం కౌళ్ళు చెల్లించమని సూచించే జవాహర్‌లాల్, గాంధీ వంటివారి చేతిలో ఉండాలని,[33] ఏమీ చెల్లించవద్దని ఆజ్ఞాపించే సాధువుల చేతిలో ఉండరాదని ఆశించారు. పన్నులు, కౌళ్ళ చెల్లింపు నిరాకరించమనే నాయకులను క్రమేపీ ప్రభుత్వం అరెస్టు చేసి, రైతు ఉద్యమ నాయకత్వాన్ని పూర్తిగా కాంగ్రెస్ పాలు చేసింది. జవాహర్ సహా కాంగ్రెస్ వారు రైతు సమస్యల మీద తక్కువగా వ్యవస్థా నిర్మాణం, నిధుల వసూళ్ళపై ఎక్కువగా కేంద్రీకరించడంతో ప్రభుత్వానికి వీలుచిక్కింది.[34] తర్వాతి దశలో రైతాంగం మరో రాజకీయ ఆందోళన అయిన ఏకా ఉద్యమం ప్రారంభించింది. జవాహర్ వేరే పనిలో మునిగి, ఈ ఉద్యమంలో పాల్గొనకుండా ఉండిపోయాడు. అంతటితో ఆ రైతు ఉద్యమంలో జవాహర్ అనుబంధం ముగిసింది.[35]

1921లో నెహ్రూ ఒకపక్క అఖిలభారత కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ, ఇటుపక్క స్వంత రాష్ట్రంలోని కార్యాచరణలోనూ ఆసక్తిగా పాల్గొనసాగాడు. అలహాబాద్ జిల్లాలో కనీసం 50వేల మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్పించాలని, ప్రత్యేకించి స్త్రీలను హెచ్చుసంఖ్యలో చేర్చాలని లక్ష్యం నిర్ణయించుకున్నాడు. సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలను బలపరచడానికి యునైటెడ్ ప్రావిన్సుల్లోని జిల్లాలంతటా పర్యటనలు ప్రారంభించాడు. అనేక కార్యక్రమాలు, సభలు నిర్ణయించుకుని వాటికై విస్తారంగా ప్రయాణాలు చేశాడు. ఒకదశలో తాను చేరుకోవాల్సిన సభ కోసం రెండు ఊళ్ళ మధ్య పరుగులు కూడా పెట్టాడు.[36] మరో సందర్భంలో తప్పిపోయిన రైలును అందుకునేందుకు పక్క స్టేషనుకు రైల్వే ట్రాలీలో ప్రయాణించాడు. 1920, 21ల్లో స్వరాజ్యం సాధించడానికి స్వదేశీ వస్తువులు, దుస్తులు వినియోగించడమే ఏకైక మార్గమన్న అభిప్రాయంలో ఉండేవాడు. విదేశీ వస్త్ర బహిష్కరణ,[37] స్వరాజ్య నిధికి విరాళాల సేకరణ మంచి ఉత్సాహంతో చేస్తూండేవాడు. ప్రభుత్వాజ్ఞలను పూర్తిగా లెక్కచేయని మనస్థితి రాలేదు. సభల విషయంలో నిషేధాజ్ఞలు పాటించేవాడు.[38] అయితే ప్రభుత్వం హింసను ప్రేరేపించే రచనలు చేయనని పూచీ ఇమ్మని కోరగా, ప్రభుత్వానికి క్షమాపణ కానీ, పూచీ కానీ ఇవ్వనని నిరాకరించాడు. [39] 1921 డిసెంబరు 5న యునైటెడ్ ప్రావిన్సు స్వచ్ఛంద సేవకుల వ్యవస్థను చట్టవిరుద్ధమని ప్రకటించి, దాని కార్యదర్శి జవాహరలాల్‌ను, ఈ కార్యకలాపాలతో సంబంధం ఉన్న తండ్రి మోతీలాల్‌ను అరెస్టు చేశారు. జవాహర్‌లాల్‌కు ఆరునెలల సాధారణ జైలుశిక్ష, రూ.100 జరిమానా, అది చెల్లించకుంటే మరో నెల శిక్ష విధించారు. జవాహర్ అధికారులు అణచివేస్తున్నా, తాను నిర్బంధంలో ఉన్నా జైలు నుంచే యుపి కాంగ్రెస్ పని కొనసాగించాడు. ఏవో సాంకేతిక కారణాలతో సగం శిక్ష అనుభవించగానే 1952 మార్చిలో జవాహర్‌ని విడుదల చేశారు. చౌరీచౌరా సంఘటన వంటి హింసాత్మక ఘటనలు ఎక్కువ అవుతున్నాయన్న కారణంగా మహాత్మా గాంధీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జవాహర్‌లాల్ వంటి పలువురు కాంగ్రెస్ నాయకులకు ఆశాభంగం అయింది.[40]

రెండు జైలు శిక్షలు, పార్టీ చీలకలతో మధ్యవర్తిత్వం (1922-1923)

మహర్షి వంటివాడైన మా ప్రియతమ నాయకుని(గాంధీ)కి శిక్ష విధించిన తర్వాత జైలు మాకు స్వర్గమైంది. పవిత్రమైన యాత్రా స్థలమైంది.... నా అదృష్టానికి నేనే అబ్బురపడుతున్నాను.

— న్యాయస్థానంలో జవాహర్‌లాల్ నెహ్రూ ప్రకటనలో భాగం[41]

సహాయ నిరాకరణోద్యమం ఆపేయాలని మహాత్మా గాంధీ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం తీవ్రమైనదీ, ఆశాభంగం కలిగించేదీ అయినా జవాహర్‌లాల్ గాంధీ మార్గనిర్దేశానికే కట్టుబడ్డాడు. ఆ నిర్ణయంతో దెబ్బతిన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడం జవాహర్‌కి చాలా కష్టమైంది.[40] యునైటెడ్ ప్రావిన్సుల్లో రాట్నం తిప్పడం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాల్లోనూ, గాంధీ స్వరాజ్య కార్యక్రమాలను ప్రచారం చేయడంలోనూ గడిపేవాడు. అప్పటికే మహాత్మా గాంధీని అరెస్టు చేసి, జైలు శిక్ష విధించిన ప్రభుత్వం తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడసాగింది. ఈ నిర్బంధాల మధ్య నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా సాగడం కష్టమయ్యేది. 1922 మే 12న పికెటింగ్ జరుపుతూ, దాన్ని ప్రచారం చేస్తున్నాడన్న కారణంతో జవాహర్‌లాల్‌ని అరెస్టు చేశారు.[42] సహాయనిరాకరణ ఉద్యమ కార్యాచరణలో భాగంగా న్యాయస్థానాలు విడనాడాలన్న సూత్రం అనుసరించి జవాహర్‌లాల్ తన తరఫున వాదించడానికి, క్రాస్ పరీక్ష చేయడానికీ అంగీకరించలేదు. కోర్టులో న్యాయమూర్తి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు సుదీర్ఘమైన ప్రకటన ఒకటి చేశాడు. దానిలో తన దృక్పథాన్ని వివరిస్తూ, ప్రభుత్వ దమనకాండను నిరసించాడు. విదేశీ వస్త్రబహిష్కరణకు ఈ విధంగా ప్రాచుర్యం కలిగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. మహాత్మాగాంధీ వంటి నాయకుని కింద దేశసేవ చేయడం భాగ్యమని తోటి భారతీయులకు ప్రబోధిస్తూ ముగించాడు.[41] ప్రభుత్వం ఆశించని విధంగా విద్యావంతులైన భారతీయ యువతను జవాహర్ కోర్టు ప్రకటన ప్రభావితం చేసింది.

ఈసారి 18 నెలల కఠిన కారాగార శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టకపోతే మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అతనిని జైలుశిక్ష అనుభవించేందుకు లక్నో జైలుకు తరలించారు. ఆ జైలులో సందర్శకులను వేధిస్తారన్న చెడ్డపేరు ఉండడంతో స్నేహితులు, బంధువులను చూసే అవకాశం తానే వదులుకున్నాడు. జైలు జీవితం పేరిట బలవంతాన లభించే తీరికను జవాహర్ సద్వినియోగం చేసుకున్నాడు.[43] శారీరక వ్యాయామం, నూలు వడకడం, చరిత్ర, యాత్రా జీవనాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం, ఉత్తరాలు రాయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యాడు. జైలు జీవితం తాలూకు కష్టాలు, ఇబ్బందులు అతనికి బాగా సంతృప్తి కలిగించాయి. దేశం కోసం కష్టపడుతున్నందుకు ఒకవిధమైన సంతృప్తి చెందేవాడు. జైలు నుంచి విడుదల కోరుకోవట్లేదని ఒక లేఖలో జవాహర్‌లాల్ రాశాడు. అందుకు భిన్నంగా యునైటెడ్ ప్రావిన్సుల శాసన మండలి తీర్మానాన్ని అమలు చేస్తూ శిక్ష పూర్తికాకుండానే 1923 జనవరి 31న సార్వత్రిక క్షమాభిక్షలో భాగంగా జవాహర్ శిక్షాకాలం ముగిసింది.[44]

విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీ శాసనసభల్లో ప్రవేశించాలనే వారు, ప్రవేశించరాదనే వారి మధ్య చీలిపోయి ఉంది. ప్రవేశించాలనే మితవాద పక్షంలో తన తండ్రి మోతీలాల్ సహా తనకు సన్నిహితులు ఉన్నారు. స్వతాహాగా జవాహర్‌కి సహాయ నిరాకరణను తిరగదోడి శాసనసభల్లో చేరడం చేపట్టడం ఇష్టం లేదు. కానీ ఈ చీలికల విషయంలో సంస్థ దెబ్బతింటుందని కలతపడ్డాడు. సహాయ నిరాకరణమే స్వరాజ్యానికి మార్గమన్న తన విధానాన్ని పునరుద్ఘాటించినా శాసనసభల ప్రవేశం విషయంలో అప్పటికి ఏ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇరుపక్షాలూ తమ ప్రచారాలు రెండు నెలలపాటు ఆపివేసేలా 1923 ఫిబ్రవరి మాసాంతంలో జరిగిన అలహాబాద్ సభలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌తో కలిసి ఇరుపక్షాలనూ జవాహర్ ఒప్పించాడు.[45] తిరిగి మే నెలలో రెండు పక్షాల వారూ కలహానికి సంసిద్ధులయ్యే సరికి కాంగ్రెస్ చీలిక నివారించడానికి జవాహర్‌లాల్ ఓ రాజీ సూత్రాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రకారం శాసనసభల్లో ప్రవేశించరాదని 1922 డిసెంబరులో జరిగిన నిర్ణయాన్ని కొట్టివేయరు, అలాగని ప్రచారమూ ఇవ్వరు. అంటే సూత్రం అలానే ఉండనిచ్చి శాసనసభల్లో ప్రవేశించవచ్చని సారాంశం. ఇది శాసనసభల్లో ప్రవేశానికి ఆశిస్తున్నవారికే అనుకూలంగా ఉంది. ఈ తీర్మానం బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సైతం ఆమోదించింది. కానీ శాసనసభా ప్రవేశం ఇష్టంలేని ఆరుగురు సభ్యులూ రాజీనామా చేసి, ఆమోదించాలని పట్టుబట్టారు.[46] ఆ దశలో చివరకు కమిటీలో ఏ పక్షానికి మొగ్గకుండా ఉన్న జవాహర్‌లాల్ వంటివారు ఉండాలని ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. అయితే అతికొద్ది నెలల్లోనే ఈ రాజీ తీర్మానాన్ని పలు రాష్ట్ర కమిటీలు తిరస్కరించాయి. ఆ కమిటీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జవాహర్ పెట్టిన తీర్మానం వీగిపోవడంతో పార్టీ పదవులన్నిటికి రాజీనామా చేశాడు.[47]

అయిష్టమైన పార్టీ కలహాల నుంచి రాజీనామాతో విముక్తి పొందిన జవాహర్‌లాల్ తిరిగి కార్యాచరణపై దృష్టిపెట్టాడు. నాగపూరులో జాతీయ జెండాతో ఊరేగింపును అనుమతించేందుకు జిల్లా మొజిస్ట్రేటు నిరాకరించడంతో జెండా సత్యాగ్రహం ప్రారంభమైంది. దానిని వ్యవస్థీకరించి, ఎప్పటికప్పుడు స్థానిక కార్యకర్తలకు తోడుగా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తల బృందాలు వెళ్ళి ఊరేగింపుగా జెండాను తీసుకుపోతూ అరెస్టు అవుతూండేలా పంపుతూ వచ్చారు. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి జాతీయ జెండాను ఎగురవేసుకునేందుకు అనుమతి ఇచ్చేదాకా ఇది కొనసాగింది. ఆ తర్వాత అకాలీ ఉద్యమంలో ఆసక్తి కనబరిచి, క్రమేపీ ఆ ఉద్యమంలో మమేకమయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని సిక్ఖులకు గురుద్వారాల నిర్వహణలో సంస్కరణలు అమలు చేయాలని ప్రారంభించిన అకాలీల ఉద్యమం శాంతిభద్రతల సమస్య తెస్తుందని పంజాబ్ ప్రభుత్వం వారి ప్రయత్నాలు ప్రతిఘటించింది. అలా మతసంస్కరణల ఉద్యమం రాజకీయ ఉద్యమమై, మహాత్మా గాంధీ ప్రబోధించిన అహింసా సిద్ధాంతం స్వీకరించి ప్రభుత్వాన్ని ఎదిరించసాగారు. 1923 జూన్, జూలైల్లో వారి సభల్లో పాల్గొనడంతో ప్రారంభించి క్రమేపీ సెప్టెంబరు నాటికల్లా అకాలీలతో కలిసి అప్పుడప్పుడే పదవీచ్యుతుడై, సంస్థానం కోల్పోయిన సిక్ఖు సంస్థానాధీశ్వరుని ప్రాంతం- నాభా సంస్థానం వెళ్ళాడు. అధికారులు అప్పటికే సంస్థానంలో ప్రవేశించిన జవాహర్‌లాల్‌ని సంస్థానంలో ప్రవేశించవద్దన్న ఉత్తర్వు చూపించి, దానిని ఉల్లంఘించాడంటూ అరెస్టు చేశారు. జవాహర్‌లాల్‌నీ, అతని స్నేహితులనీ ఒకే గొలుసులకు కట్టివేసి, జనంతో కిక్కిరిసిన మూడో తరగతి రైలు పెట్టెలో నాభా పట్టణం తీసుకువెళ్ళి దారుణమైన స్థితిగతులు ఉన్న నాభా జైలులో నిర్బంధించారు. అతనిపై నేరారోపణలు అసంబంద్ధంగా ఉండడంతో సిక్ఖుల జాథాలలో ఉన్నాడనీ, వారంతా దౌర్జన్యం చేశారనీ అక్రమ కేసు బనాయించారు. కేసు నత్తనడకన సాగుతూండగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం కలగజేసుకుని కొన్ని సూచనలు చేసింది. తదనుగుణంగా నిందితులకు 30 నెలల కఠిన కారాగార శిక్ష విధించి, వెనువెంటనే నిలిపివేసి, సంస్థానాన్ని విడిచి వెళ్ళి తిరిగి రావద్దన్నారు.[48]

వ్యక్తిగత సమస్యలు, మున్సిపల్ పరిపాలన (1924-1926)

నాభా జైలు నుంచి తిరిగివచ్చాకా జవాహర్‌లాల్ ఉత్సాహలేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు తీసుకురావడం ఎలాగన్న ప్రశ్నపై సతమతమయ్యాడు. అప్పటికి జవాహర్‌ భావాల్లో సామ్యవాదం వంటివేమీ జొరబడలేదు, గాంధేయవాదానికే పూర్తి నిబద్ధునిగా ఉండేవాడు.[49] కాకినాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తూ - "భారతీయ స్వచ్ఛంద సేవకులకూ, పాశ్చాత్య దేశాల వలంటిర్లకూ మధ్య ఉభయ సామాన్యమైన విశేషం అంతగా లేదు. భారతీయ స్వచ్ఛంద సేవక సంస్థకు అహింస ప్రాథమిక సూత్రమై ఉండాలి. భారతదేశానికి అహింసను, క్రమశిక్షణను పాటించే సైనికులు అవసరమై వున్నారు" అంటూ అవే భావాలు గాంధీయమైన భాషలోనే వెల్లడించాడు. జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ముగ్గురిలో ఒకనిగా జవాహర్‌లాల్ పార్టీ నిర్వహణా భారాన్ని, అనుసంధాన కార్యకలాపాలను చాలావరకూ భుజాన వేసుకున్నాడు.[50] కాంగ్రెస్ పార్టీ ద్రవ్య వ్యవహారాలు, అకాలీ ఉద్యమాన్ని జాతీయోద్యమంతో అనుసంధానం చేసే కార్యకలాపాలతో తీరికలేకుండా పనిచేయసాగాడు.[51]

ఖిలాఫత్ ఉద్యమ స్ఫూర్తి నానాటికీ దెబ్బతింటూ దేశంలో హిందూ-ముస్లిం మత విద్వేషాలు రెచ్చిపోసాగాయి. 1924 ఫిబ్రవరిలో బ్రిటీష్ వారు ఆరోగ్యకారణాలతో విడుదల చేసిన గాంధీ సెప్టెంబరు నాటికి ఈ మతవిద్వేషాలు సమసిపోవాలంటూ 21 రోజుల ఉపవాస దీక్ష తీసుకున్నాడు. జవాహర్‌లాల్‌ను ఆ వార్త చాలా బాధించింది. అది తెలిసేనాటికే మతకలహాలు తగ్గించేందుకు, వాస్తవ స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటనలు చేస్తున్నాడు. హిందూ-ముస్లిముల నడుమ ఐక్యత సాధించే మార్గాన్వేషణకు యుపిలో ప్రతీ పట్టణంలో, ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు, స్వయంగా ఢిల్లీలో ఐక్యతా మహాసభలో పాల్గొన్నాడు.[51] అలహాబాద్‌ నగరంలో జరిగిన మత ఘర్షణల వివరాలను సేకరించి, గాంధీకి నివేదిక పంపాడు. మత ఘర్షణలు జవాహర్‌లాల్‌ మనస్సును చాలా గాయపరిచాయి. 1925 జనవరిలో ఈ అంశంపై జరిగిన అఖిల పక్ష మహాసభ విఫలమైంది. ఈ సభలో జరిగిన చర్చ వినాల్సిరావడమే అతనికి ఎంతో బాధాకరంగా పరిణమించింది. అతని ఉద్దేశంలో ఇది అవాస్తవికమైన, ఊహాత్మకమైన అంశాల చుట్టూ అల్లుకుపోతూండే సమస్య, కనుకనే ఈ సమస్యపై శక్తివంతమైన చర్యలు తీసుకోలేకపోయాడు.[52]

ఈ పరిస్థితులకు తోడు జవాహర్‌లాల్ సాంసారిక జీవితంలో కూడా పుట్టిన కుమారుడు పుట్టగానే చనిపోవడం, భార్యకు క్షయవ్యాధి పట్టుకోవడం, తాను ఆర్థికంగా ఆధారపడి ఉన్న తన తండ్రితో రాజకీయంగా వివాదాలు రావడం వంటి సమస్యలు చుట్టుముట్టాయి.[52] తండ్రిపై ఆర్థికంగా ఆధారపడకూడదని నిర్ణయించుకోవడంతో గాంధీ అతనికి పత్రికా విలేఖరిగా కానీ, కళాశాలలో ప్రొఫెసర్‌గా కానీ పని ఏర్పాటుచేయాలని ప్రయత్నించి చూశాడు. ఆపైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వేతనం స్వీకరించాలని గాంధీ అభ్యర్థించినా జవాహర్‌లాల్ అంగీకరించలేదు. తన పలుకుబడితో బొంబాయిలో టాటా సంస్థ మేనేజరు పదవి ఇప్పించాలని గాంధీ ప్రయత్నించగా, టాటా వారు సిద్ధపడినా జవాహర్‌కు అందుకు మనస్కరించలేదు. చివరకు భార్య కమల ఆరోగ్యం కోసం ఐరోపా పర్యటన చేయడానికి తప్పనిసరి స్థితిలో తనకేమాత్రం ఇష్టంలేని న్యాయవాది వృత్తి ఒకమారు చేపట్టాల్సివచ్చింది. తండ్రే కక్షిదారును తీసుకునివచ్చాడు. అతనికి న్యాయవాదిగా ముట్టింది రూ.పదివేలు కాగా ఆ వచ్చిన కక్షిదారు కూడా జవాహర్‌లాల్ వల్ల కాకుంటే మోతీలాల్ అయినా కేసు గట్టెక్కించకపోడని వచ్చాడు.[53]

నా ప్రియతమ నాయకుడు (గాంధీ) జైలులోపల మ్రగ్గుతూ ఉండగా నా సమయంలో అధిక భాగాన్ని ఏ పదవిలోనూ వ్యయపరచదలుచుకోలేదు. నాకు చేతనైనప్పుడల్లా యుద్ధం చేస్తాను. నాకు వీలైనప్పుడల్లా పోరాడుతాను, బలంగా దెబ్బతీస్తాను, స్వరాజ్యం వచ్చేదాకా అదే నా ముఖ్యమైన పని. తక్కినదంతా శిక్షణ, తయారీ.

— యుపి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా జవాహర్‌లాల్ నెహ్రూ 1923 ఏప్రిల్ 5న కాంగ్రెస్ కమిటీలకు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులకు పంపిన సర్క్యులర్‌లో భాగం.[41]

సహాయ నిరాకరణోద్యమ విరమణ తర్వాత ఐరోపా ప్రయాణంలోపు సంక్షుభిత సంవత్సరాల్లో జవాహర్‌ జీవితంలో చెప్పుకోదగ్గ విశేషం - అలహాబాద్ పురపాలక సంఘ అధ్యక్షునిగా చేసిన కృషి. 1923 ఏప్రిల్ నుంచి 1925 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో ఉన్న జవాహర్ పరిపాలనలో తొలి అనుభవాన్ని ఇక్కడే గడించాడు.[53] సర్వేపల్లి గోపాల్ ఉద్దేశంలో తర్వాతి కాలంలో ప్రధానమంత్రిగా నెహ్రూ కనబరిచిన "సహచరులపై తన ప్రాబల్యం చూపడం, సామర్థ్యాన్ని అభిలషించడం, సమర్థులైన తన క్రింది అధికార్ల పట్ల విడవని విశ్వాసం చూపడం, కొత్త ఆలోచనలతో అన్ని దిక్కులా ముందుకు సాగిపోయేందుకు గట్టిగా ప్రయత్నించడం వంటి లక్షణాలు" బీజప్రాయంగా అలహాబాద్ పురపాలక సంఘంలో చేసిన పనిలో చూడవచ్చు.[54] పదవి చేపట్టినందుకు శక్తివంచన లేకుండా పనిచేసినా అతను ఏనాడూ దీనికి స్వరాజ్యం కోసం చేసే పోరాటం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదలుపెట్టినప్పుడు అయిష్టమైనదైనా పరిపాలనా వ్యవహారాలు క్రమేపీ అతని ఆసక్తిని చూరగొన్నాయి.[55] పురపాలక సంఘ సభ్యుల అలసత్వం, క్రమశిక్షణా రాహిత్యం పదవిలోకి వచ్చిన తొలినాళ్ళలోనే బహిరంగ విమర్శలతో తొలగించి, క్రమశిక్షణ నెలకొల్పాడు. చిన్న చిన్న అంశాలకు స్వరాజ్య విధానంతో ముడిపెట్టి పట్టుపట్టేవారు స్వంత పార్టీ సభ్యులే అయినా అంగీకరించేవాడు కాదు.[56] ఆంగ్లేయులపై నిష్కారణంగా ప్రతీకారం చూపే విధానాలనూ సమర్థించలేదు. అవసరమైనప్పుడు, తగినంత స్థాయి ఉన్న విధానాలలో కాంగ్రెస్ విధానాల దృష్ట్యా నడుచుకునేవాడు.[57] బ్రిటీష్ వస్తువుల బహిష్కరణ, పాఠశాలల్లో నూలు వడకడం, కాంగ్రెస్ నాయకులకు సన్మానం, తిలక్ వర్థంతి, గాంధీకి శిక్షవేసిన రోజు జ్ఞాపకార్థంగా గాంధీ దినోత్సవం సెలవులు ఇవ్వడం వంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినా ఖాతరుచేయకుండా నిర్వహించాడు. ప్రజలకు మేలుచేకూర్చే పలు నిర్ణయాలు, క్రమం తప్పకుండా ప్రజలకు నివేదికలతో పారదర్శకత పాటించడం వంటి అనేక చర్యలు చేపట్టాడు. ప్రత్యక్షంగా కనిపించే న్యాయబుద్ధి, నీతి, నిజాయితీలతో పురపాలక సంఘ వ్యవహారాల్లోని అన్ని పక్షాల వారిలోనూ పలుకుబడి, ప్రాభవం సంపాదించాడు.[58] కమీషనర్ కూడా మునిసిపల్ వ్యవహారాలు మెరుగుకావడం వెనుక జవాహర్‌లాల్ కృషిని ప్రస్తావించాల్సిన స్థితి తీసుకువచ్చాడు. అయితే పురపాలక వ్యవహారాలు కేవలం గృహవసతి, పారిశుధ్యం వంటి అంశాలకే పరిమితమై విశాలమైన అర్థంలో సాంఘిక సంక్షేమాన్ని తమ పరిధిగా ఎంచే వీలులేకపోవడం, ఆ రంగంలో కృషిచేయలేకపోవడం అతనికి సంతృప్తి కలిగించలేదు.[59] 1925 ఏప్రిల్‌లో పార్టీ కార్యకలాపాల దృష్ట్యా బోర్డు పనులు చూడడానికి వీలుచిక్కడం లేదంటూ మునిసిపల్ బోర్డు ఛైర్మన్ పదవికీ, బోర్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు.[60]

ఐరోపా పర్యటన, నూతన రాజకీయ భావాల అంకురం (1926-1927)

జవాహర్‌లాల్ 1926 మార్చి 1న భార్య కమల, కుమార్తె ఇందిరలతో బయలుదేరి ఐరోపా చేరుకున్నాడు. జెనీవాలో ఒక చౌక బసలో స్థిరపడ్డాడు. క్షయవ్యాధితో బాధపడుతున్న భార్య కోలుకునేందుకు ప్రధానంగా ఈ ఐరోపా నివాసం. అయితే అది ఆమె మీద ప్రభావం ఏమీ చూపించకపోగా జవాహర్‌లాల్ రాజకీయ, ఆర్థిక భావాలలో విప్లవాత్మకం అనదగ్గ పరిణామం తీసుకువచ్చింది. మరోవైపు భారతదేశంలో జాతీయవాద రాజకీయాల పరిస్థితి దారుణంగా తయారైంది. మతసామరస్యం లోపించి మతకల్లోలాలు వ్యాప్తిచెందుతూ ఉన్న వార్తలు జవాహర్‌కు అందుతూండేవి. ఈ వార్తలు ఆయనను కుంగతీసేవి. మతాన్ని అదుపులోకి తెచ్చుకుని, రాజకీయాలను లౌకిక తత్వం వైపు మళ్ళించడమే దీనికి పరిష్కారమని భావించేవాడు. ఈ దశలో అతను బౌద్ధికమైన పనులు కాక చేసినవి భార్యకు సేవ, కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్ళి, తీసుకురావడం. అంటే అతని కార్యాచరణయుతమైన జీవితంలో అధ్యయనానికి బోలెడంత ఖాళీ దొరికినట్టు. ఫ్రెంచి భాష నేర్చుకోవడం, బహు గ్రంథ పఠనం, వివిధ కోర్సులకు, ఉపన్యాసాలకు హాజరుకావడం వంటి పనులతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విస్తారమైన అధ్యయనం వల్ల ఆయన మనస్సు, బుద్ధి నూతన సిద్ధాంత బీజాలకు సిద్ధంగా ఉంది. ఆ ఏడాది ముగిసేనాటికి కమల ఆరోగ్యంపై ఐరోపా నివాసం మెరుగదల ఏమీ చూపించడం లేదని తేలిపోయింది. మోతీలాల్ కూడా ఐరోపా పర్యటనకు వస్తూండడంతో ఇక జవాహర్ కుటుంబం ఐరోపా ఖండాన్ని సందర్శించింది. ఈ సందర్శన జవాహర్‌లాల్ అధ్యయనానికి, ఐరోపా రాజకీయవేత్తలతో పరిచయాలు, వారి ఉద్యమాల పట్ల అవగాహన కలిగించి, తర్వాతికాలపు జవాహర్ ఆలోచనల్లో వినూత్నమైన గాఢత్వాన్ని కల్పించింది.

1927 ఫిబ్రవరిలో బ్రస్సెల్స్‌లో వలసపీడన, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ మహాసభలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా జవాహర్‌ అధ్యక్ష మండలి సభ్యుడి హోదాలో పాల్గొన్నాడు. సమావేశాల్లో వక్తగా, ఇష్టాగోష్ఠి సభ్యునిగా, ఒక సమావేశానికి అధ్యక్షునిగా, తీర్మానాల ముసాయిదా రచయితగా పలు హోదాల్లో చురుకుగా పాల్గొన్నాడు. సమావేశంలోని పలువురు రాజకీయవేత్తల సాంగత్యం అతనిని ప్రభావితం చేసింది. ఈ సమావేశాల్లో మాట్లాడుతూ జవాహర్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల్లో సాధారణాంశం వివరించాడు. భారతీయుల్లో విభేదాలు తీవ్రతరం చేయడం, ఫ్యూడల్ సమాజానికి చెందిన సంస్థానాధీశులను, భారతీయ భూస్వాములను కాపాడడం వంటి సామ్రాజ్యవాద ప్రబలమైన దృష్టాంతాలను భారతదేశంలో ఎత్తిచూపాడు. తొలిసారి జవాహర్ ఆలోచనల్లో రాజకీయ-ఆర్థిక అంశాల పరస్పర సంబంధం పట్ల స్పష్టత వచ్చింది. అలా కేవలం బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఖండించే జాతీయవాది స్థాయి నుంచి సామ్రాజ్యవాదపు ఉద్దేశాలు, తీరుతెన్నులు, అది పనిచేసే తీరును అవగాహన చేసుకోవడానికి తన రాజకీయ జీవితంలో తొలిసారి ప్రయత్నించాడు.

చైనా-భారత దేశ జాతీయవాద రాజకీయాల మధ్య సంబంధాలు ఏర్పడాలని ఆశించాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు చైనాకీ, భారతదేశానికి ఉండవలసిన సత్సంబంధాల విషయమై మారకుండా నిలబడిన జవాహర్ దృక్పథానికి పునాది మహాసభలోనే పడింది. ప్రపంచ రాజకీయాలను కూడా చాలా సదవగాహనతో అంచనా వేశాడు. అప్పటికి చైనాలో జాతీయవాదులైన కూమిటాంగులు, కమ్యూనిస్టులు కలిసి బ్రిటీష్ సామ్రాజ్యవాదం, దాని ప్రభావంలో ఉన్న చైనా చక్రవర్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండగానే - చైనీయులకు విజయం సిద్ధిస్తే ఆసియాలో సోవియట్ మహా ప్రజాతంత్ర రాజ్యం ఏర్పాటైనట్టేననీ, చైనా-సోవియట్ రష్యా కలిసి ఆసియా, ఐరోపా ఖండాలపై ప్రాబల్యం చూపుతాయనీ, చైనాలోని రైతాంగ ఒత్తిడి వల్ల శుద్ధ కమ్యూనిజం నుంచి చాలామేరకు చైనీయ కమ్యూనిజం వైదొలగుతుందనీ భావించాడు. మరోవైపు బ్రిటన్ ప్రపంచంలో తన స్థానాన్ని కోల్పోతోందని, పూర్తిగా కోల్పోకుండా అమెరికా ఉపగ్రహంగా అమెరికన్ పెట్టుబడిదారీ పక్షాన నిలిచి పోరాడవచ్చని గ్రహించగలిగాడు. బ్రిటన్ ఐరోపాదేశాలన్నిటి మద్దతూ తీసుకున్నా ఒక మహాఖండంలా ఉండబోయే చైనా-రష్యా ప్రభావాన్ని ఎదుర్కోవడం సులభసాధ్యం కాదనీ ఊహించాడు. 1927 నాటికే వీటన్నిటినీ గ్రహించి, కాంగ్రెస్ కార్యవర్గానికి రహస్య నివేదికలో పంపాడు. క్రమేపీ దశాబ్దాల కాలంలో ఈ అంశాలన్నీ వాస్తవరూపం దాలుస్తూ ఉండడాన్ని అతని జీవితచరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ వ్యాఖ్యానిస్తూ ఇవన్నీ "జవాహర్‌లాల్ ... ప్రపంచ వ్యవహారాల్లో దూరదృష్టి కల రాజకీయ ప్రవక్తగా" నిలిపాయన్నాడు.

ఈ మహాసభ ఫలితంగా ఏర్పడ్డ సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్‌కు గౌరవ అధ్యక్షునిగా, కార్యనిర్వాహక మండలి సభ్యునిగా జవాహర్‌లాల్ ఎన్నికయ్యాడు. లీగ్ మీద, మహాసభ మీద సోవియట్ రష్యా ప్రభావం పైకి కనిపించకుండా ఉండేది. దీన్ని గ్రహించినా ఉపేక్షించగలిగాడు. పీడిత జాతులతో సోవియట్ రష్యా తన ప్రయోజనం కోసం సన్నిహితంగా వ్యవహరిస్తోందనీ, ఇది మరో కొత్త సామ్రాజ్యవాదానికి సుదూర భవిష్యత్తులో దారితీయవచ్చుననీ అంచనా వేశాడు. 1927లో సోవియట్ రష్యా అక్టోబర్ విప్లవం దశమ వార్షికోత్సవాల సందర్భంగా సోవియట్ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని అనుసరించి జవాహర్‌లాల్, మోతీలాల్ సోవియట్ రష్యాను సందర్శించారు. సోవియట్ యూనియన్ చరిత్రలో సుఖశాంతులతో కూడిన మొదటి దశ ఆఖరు రోజుల్లో సందర్శించాడు. సోవియట్ యూనియన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు, వారు చూపించదలిచిన విషయాలు మాత్రమే చూస్తున్నామని తెలిసినా వ్యవసాయం, జైళ్ళ సంస్కరణ, స్త్రీల పట్ల ప్రవర్తన, అల్పసంఖ్యాకుల సమస్యల పరిష్కారం, నిరక్షరాస్యతా నిర్మూలన వంటి అంశాల్లో అభివృద్ధి త్వరితగతిన సాధించిందన్న అభిప్రాయానికి వచ్చాడు. వ్యవసాయ ప్రధాన దేశం కావడం, విస్తారంగా నిరక్షరాస్యత వేళ్ళూనుకొని ఉండడం వంటి పోలికల వల్ల భారతదేశానికి చాలా విషయాల్లో సోవియట్ యూనియన్ బోధించదగ్గ అంశాలు అనేకం ఉంటాయని నమ్మాడు. ఇలా రష్యా అతని తొలి సందర్శనలో గాఢమైన ముద్రే వేసింది.

మొత్తానికి నిఖార్సైన గాంధీ శిష్యునిగా, గాంధేయవాద మూసలో ఆలోచించే యువకుడిగా 1926 తొలి నెలల్లో ఐరోపా బయలుదేరిన నెహ్రూ దాదాపు పూర్తి కమ్యూనిస్టుగా, అంతర్జాతీయ తత్వంతో భారతదేశ సమస్యలు ముడిపెట్టగలిగే ఆలోచనా విధానంతో విప్లవాత్మకమైన మార్పుతో 1927 తుదినాటికి భారతదేశానికి తిరిగివచ్చాడు.

పూర్ణ స్వాతంత్ర్య వాదం, ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్

గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ అప్పటి వరకూ ఉపయోగిస్తూ వచ్చిన స్వరాజ్యమనే పదాన్ని అధినివేశ ప్రతిపత్తి కోరడం అనే సాంకేతిక అర్థంలో వాడుతూ వచ్చారు. అధినివేశ ప్రతిపత్తి అన్నది బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూనే అంతర్గతంగా కొంత స్వతంత్రాన్ని పొందే ఒక ఏర్పాటు. కాంగ్రెస్ వంటి సంస్థ అధినివేశ ప్రతిపత్తి కోసం పాకులాడడం ఐరోపా నుంచి వచ్చాకా జవాహర్‌లాల్‌కి నిరర్థకమని తోచింది. కాంగ్రెస్‌తో వీలైనంత త్వరగా సంపూర్ణ స్వాతంత్ర్యం తమ లక్ష్యం అని అంగీకరింపజేయడం కనీసం మొదటి మెట్టుగా తోచింది. అధినివేశ ప్రతిపత్తిలో విడిపోయే హక్కు ఉంటుందని చేసే వాదాల్లోని యుక్తి అతను అంగీకరించేవాడు కాదు. అసలు అధినివేశ ప్రతిపత్తికి అంగీకరించడమే భారతదేశ మానసిక భ్రష్టత్వానికి నిదర్శనమని భావించాడు. ఇది ఐరోపాలో అతనికి కలిగిన నూతన రాజకీయ, ఆర్థిక చైతన్యానికి సరిగా సరిపోయే కార్యాచరణ అని తోచింది.

జవాహర్‌లాల్ మద్రాసు కాంగ్రెస్ మహాసభలో పూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదింపజేయగలిగాడు. పూర్ణ స్వాతంత్ర్యానికి రక్షణ, ద్రవ్య, ఆర్థిక విషయాలు, విదేశాంగ విధానంపై పూర్తి అదుపు అని తీర్మానంలో అర్థం చెప్పాడు. అయితే ఈ తీర్మానాన్ని కేవలం జవాహర్‌లాల్‌ని సంతోషపరిచి, సంతృప్తుణ్ణి చేయడానికే గాంధీ ప్రధానంగా ఉద్దేశించాడు. కనుక కాంగ్రెస్ నియమావళిలో పూర్వ అర్థంలో స్వరాజ్యం అన్న పదమే కనిపిస్తుంది. అందుకే బ్రిటీష్ వారితో పూర్తి తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడని వారు కూడా కాంగ్రెస్‌లో కొనసాగ సాగారు. ఈ కారణాలన్నిటి దృష్ట్యా జవాహర్ నెగ్గించిన తీర్మానం పూర్తిగా పరిహాసాస్పదం అయింది. మహాత్మా గాంధీకి కానీ, అప్పటికి నెహ్రూ రిపోర్టు రాస్తున్న మోతీలాల్‌కి కానీ పూర్ణ స్వాతంత్ర్యం అనే లక్ష్యం ఆమోదయోగ్యం కాదు.[61]

కాంగ్రెస్‌లో ఉంటూనే స్వాతంత్ర్యం కోసం ఒత్తిడి తీసుకువచ్చే పక్షంగా ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ నెలకొల్పాడు. జవాహర్ ఉద్దేశంలో ఈ లీగ్ కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాక స్వాతంత్ర్యానంతరం భారతదేశం పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రాతిపదికలు మార్చివేసి, రాజ్యాన్ని సహకార ప్రాతిపదికపై వ్యవస్థీకరించేందుకు పనిచేయాలి. అంటే భారత స్వాతంత్ర్యంతో పాటుగా సామ్యవాద, ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వవాదం వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. దీనిని అంతర్జాతీయ వాదానికి ముడిపెడుతూ ఒక పెద్ద ప్రపంచ సహకార కామన్వెల్తుకు ఈ పరిణామాలు దారితీయాలని కూడా ఆశించాడు. తన ఉద్దేశాలను కాంగ్రెస్ నాయకత్వంలో చాలామంది ఆమోదించట్లేదని తెలిసిన జవాహర్ తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. జవాహర్ చేస్తున్న ఈ కార్యాచరణకు కాంగ్రెస్ వారెవరూ పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకపోవడంతో అతని రాజీనామా అంగీకరించలేదు. ఆ మాటకి వస్తే ఈ స్వాతంత్ర్యం అన్న డిమాండ్ అధినివేశ ప్రతిపత్తిని సాధించుకునేందుకు మంచి ఎత్తుగడగా వారు భావించారు.

ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ ఆశించిన లక్ష్యాలు చేరుకోలేకపోయింది. అందులో చేరినవారు ప్రధానంగా - గాంధీ వైఖరి పట్ల ఆగ్రహం ఉన్నవారు కొందరు, జవాహర్‌కి వస్తున్న పేరుప్రఖ్యాతులను తమ రాజకీయ ప్రాభవానికి వాడుకుందామనుకునేవారు మరికొందరు. చివరకు 1929 ప్రారంభానికి కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా ఆమోదించడంతో అప్పటికి క్రియారహితంగా ఉన్న లీగ్‌ అస్తిత్వానికి కూడా కారణం కోల్పోయింది.

సైమన్ కమీషన్ బహిష్కరణ

మరికొన్ని రాజ్యాంగ సంస్కరణలు చేయడానికి భారతదేశ సంసిద్ధత పరిశీలించాలంటూ బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సైమన్ కమీషన్‌లో భారతీయులు ఎవరూ లేకపోవడాన్ని కాంగ్రెస్‌ భారతదేశాన్ని అవమానించడమేనని భావించింది. సైమన్ కమీషన్‌ను బహిష్కరించడం, సైమన్ కమీషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టడం, హర్తాళ్ళు, ఊరేగింపులు నిర్వహించడం వంటి కార్యకలాపాలు నిర్ణయించుకుంది.[62] జవాహర్‌లాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్త ఆందోళనలను సమన్వయం చేసి, నిర్వహించాడు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పక్షాలను సమన్వయపరిచి కాంగ్రెస్ నిర్వహించిన హర్తాళ్ జవాహర్‌లాల్ ఆశించినదానికన్నా విజయవంతమైంది. సైమన్ కమీషన్ పర్యటించిన ప్రతీ ప్రాంతంలోనూ ఊరేగింపులు, నిరసనలు ఎదురయ్యాయి. ప్రభుత్వం లాఠీఛార్జిలు, కాల్పులు చేశారు. లాహోరులో పంజాబ్ కాంగ్రెస్ నేత లాలా లజపత్‌రాయ్‌ను ప్రాణాలకు ముప్పువచ్చేలా కొట్టి చంపారు.

ఆ వెంటనే 1928 నవంబరు 30న కమీషన్ లక్నోకి ఈ నేపథ్యంలో రానుండడంతో నవంబరు 23, 24 తేదీల్లో పోలీసుల అనుమతితోనే ఊరేగింపులు నిర్వహించారు.[63] నవంబరు 28 తేదీన మరో ఊరేగింపు తీయబోగా ముందస్తు అనుమతి ఇచ్చిన పోలీసులు చిన్న కారణం వంక చూపి రద్దుచేశారు. పోలీసుల నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కాంగ్రెస్ వారు ఊరేగింపు నిర్వహించగా లాఠీఛార్జి చేశారు. ముందస్తు అనుమతులు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఆందోళన జరుగుతుందని వేరే పనిపై లక్నో నుంచి బయలుదేరిన జవాహర్ హుటాహుటిన తిరిగివచ్చాడు. ముందురోజు పోలీసులు చేసిన పనికి ప్రతీకారంగా వారిని లక్ష్యపెట్టకుండా 30 తేదీన జవాహర్‌లాల్, గోవింద వల్లభ్ పంత్ నాయకత్వాన 12 మంది జట్టు ఊరేగింపుగా సభాస్థలానికి బయలుదేరారు. పోలీసుల లాఠీలతో ఆ జట్టును చెదరగొట్టబోయే క్రమంలో జవాహర్‌కి దెబ్బలు తగిలాయి. ఏదేమైనా జట్టు లొంగకపోవడంతో పోలీసులు వెన్నంటిరాగా సభాస్థలానికి చేరుకున్నారు.[64] 30న సైమన్ కమీషన్ లక్నోకు వచ్చే సందర్భంలో జవాహర్‌లాల్ నాయకత్వాన నిరసన తెలపడానికి పెద్ద ఊరేగింపు సాగింది. పోలీసులు వీరిపై తీవ్రమైన దాడిచేశారు. గుర్రాలతో తొక్కించడం, లాఠీలతో కొట్టడం చేయగా జవాహర్‌లాల్‌కి, ఇతర సహచరులకు గాయాలయ్యాయి. ఏదేమైనా వారు ప్రతీకారం చేయకుండా, వెనక్కితగ్గకుండా శాంతియుతంగా అక్కడే ఉండిపోయారు. ఈ సమయంలోనే ఒక విద్యార్థి వేషంలో పోలీసు ఏజెంటు అక్కడికి వచ్చి జవాహర్‌కి రెండు రివాల్వర్లు ఇవ్వజూపగా అతను మర్యాదగా నిరాకరించాడు. గడచిన రెండు రోజుల్లో పోలీసులను విజయవంతంగా ఆందోళనకారులు ప్రతిఘటించడంతో వారి నాయకుడైన జవాహర్ మీద కక్షపూని అతన్ని మరింత ప్రమాదకరమైన, కాంగ్రెస్ మౌలిక లక్ష్యాలకు విరుద్ధమైన కేసుల్లో ఇరికించేందుకు చేసిన కుట్ర అది.[65]

ఈ సంఘటనలో జవాహర్‌లాల్‌ను పోలీసులు గాయపరిచారన్న విషయం దేశమంతా పొక్కింది. ప్రజల్లో బ్రిటీష్ పాలన పట్ల, ఆగ్రహావేశాలు జవాహర్‌లాల్ మీద ప్రేమ పెల్లుబికాయి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా జవాహర్‌కి ఉన్న జనప్రియత్వం బోధపరిచింది.[66]

కాంగ్రెస్ అధ్యక్ష పదవి, పూర్ణ స్వాతంత్ర్య ప్రకటన

మోతీలాల్ నెహ్రూ తయారుచేసిన నెహ్రూ రిపోర్టును 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతిపాదించినట్టుగా అధినివేశ ప్రతిపత్తితో సంతృప్తి పడడం జవాహర్‌కు సరిపడని సంగతి. అయితే కాంగ్రెస్‌ను ఆ ప్రాతిపదికన చీల్చడం ఇటు జవాహర్‌కు,[66] అటు గాంధీకి కూడా ఇష్టం లేదు. జవాహర్‌లాల్‌, సుభాష్ చంద్ర బోస్, తదితరులు కాంగ్రెస్‌ను చీల్చకుండా చూసేందుకు - రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం నెహ్రూ రిపోర్టును అంగీకరించి అధినివేశ ప్రతిపత్తిని ఇవ్వకపోతే కాంగ్రెస్ పూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరవచ్చని గాంధీ అన్నాడు. జవాహర్‌లాల్‌తో ఇంకొంత చర్చించాకా ఆ కాలావధిని ఏడాదికి తగ్గించారు. [67] ఏడాది పాటు అధినివేశ ప్రతిపత్తి కోరే అంశంపై రాజీని కమిటీ స్థాయిలో అంగీకరించిన జవాహర్‌‌లాల్, సుభాష్ చంద్ర బోస్ బహిరంగ సమావేశంలో వ్యతిరేకించడంతో నొచ్చుకున్న గాంధీ "మీరు మీ మాటపై నిలవకపోతే ఇక స్వాతంత్ర్యం పరిస్థితి ఏమిటి?" అని ఆక్షేపించాడు.[68] అయితే జవాహర్‌లాల్ మనస్థితిలో పరిస్థితికి తలవంచినా, సాంకేతికంగా కూడా అధినివేశ ప్రతిపత్తికి రాయితీ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే జవాహర్‌లాల్ ఏదోమేరకు అయిష్టంతో అంగీకరించినా, కనీసం కాగితంపై కూడా అధినివేశ ప్రతిపత్తి తనకు సమ్మతం కాదన్న విషయాన్ని చెప్పడానికి తీర్మానం ఆమోదించిన ఆఖరు సమావేశానికి హాజరు కాలేదు.[67]

ప్రభుత్వం ఎలాగూ నెహ్రూ రిపోర్టును ఆమోదించి, అధినివేశ ప్రతిపత్తి ఇవ్వదన్న నమ్మకం ఉండబట్టి జవాహర్‌లాల్ 1929 సంవత్సరాన్ని రాబోయే పోరాటానికి ఉద్యమాన్ని, పార్టీని సంసిద్ధం చేసే తయారీ సంవత్సరంగా వినియోగించాలని ప్రయత్నించాడు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాల తనిఖీ, మెరుగైన పనితీరు కోసం సిఫార్సులు, కాంగ్రెస్ స్వచ్ఛంద సేవాదళాలైన హిందుస్తానీ సేవాదళ్, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వంటి పనులు చేపట్టాడు.[69] 1929 మార్చిలో పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులను, కొందరు అమాయకులను కమ్యూనిస్టులు అన్న పేరిట అరెస్టు చేసి, పెట్టిన మీరట్ కుట్ర కేసు విషయంలో వారికి సహాయంగా వాదించడానికి, ఆ కేసు నడిపించేందుకు నిధులు వసూలు చేయడానికి పనిచేశాడు.[70] ఈ దశలోనే జవాహర్‌లాల్‌ మీదా కేసు పెట్టాలని ప్రయత్నించినా ప్రత్యక్ష సాక్ష్యం లేనందున, జాతీయోద్యమం నుంచి కమ్యూనిస్టులను వేరుపరచాలన్న భావన ఉన్నందున అతనిపై ప్రభుత్వం కేసు పెట్టలేదు.[71]

1929లో కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి బార్డోలీ సత్యాగ్రహాన్ని విజయవంతం చేసి బార్డోలీ హీరోగా పేరొందిన వల్లభ్ భాయి పటేల్‌ను ఐదు స్థానిక కాంగ్రెస్ కమిటీలు ప్రతిపాదించాయి, జవాహర్‌ను మూడు కమిటీలే ప్రతిపాదించాయి.[71] అయితే రానున్న శాసనోల్లంఘనకు పూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరే, యువకుడిని అధ్యక్ష స్థానంలో ఉంచితేనే మంచిదని వృద్ధ నాయకత్వం భావించింది. ప్రత్యేకించి మహాత్మా గాంధీ అధ్యక్ష స్థానానికి జవాహర్‌లాల్‌ ఉండాలని పట్టుబట్టాడు.[72] సుభాష్ చంద్ర బోస్, జవాహర్‌లాల్ నెహ్రూ వంటివారి వామపక్ష భావాలు, స్వతంత్రం గురించి అభిప్రాయాలు తెలిసి ఉండడంతో జవాహర్ అధ్యక్షుడు అయితే సంస్థలో ఐకమత్యాన్ని సాధించడమే కాక అతనిని కూడా అదుపులో ఉంచవచ్చని గాంధీ భావించాడు.[73] రాజాజీ గాంధీని అధ్యక్ష స్థానానికి ప్రతిపాదించాడు. అయితే ఆ పదవిలో జవాహర్ ఉంటే తాను ఉన్నట్టేనని కూడా ప్రకటించాడు. అయితే జవాహర్‌కు ఈ పదవిని స్వీకరించడం ఇష్టం లేదు. కుమారుడు అధ్యక్ష పదవి చేపట్టాలని లోపల ఎంతవున్నా, జవాహర్ విముఖత చూసి మోతీలాల్ గాంధీకి నచ్చజెప్పబోయాడు. అయితే చివరకి జవాహర్‌లాల్ తన పట్టు వదులుకుని అంగీకరించగా, 1929 సెప్టెంబరులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జవాహర్‌ను కాంగ్రెస్ అధ్యక్షునిగా సంశయిస్తూనే ఎన్నుకుంది.[72]

వైశ్రాయ్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ దృఢవైఖరి అవలంబించకపోవడంతో పదవి చేపట్టిన కొద్ది నెలలకే జవాహర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోయాడు.[74] అయితే కాంగ్రెస్-వైశ్రాయ్‌ల నడుమ జరిగిన సంప్రదింపులు పూర్తిగా విఫలం కావడంతో జవాహర్ వైఖరే సరైనదని నిర్ధారణ అయ్యి పార్టీ అంతా అతని వైఖరినే అవలంబించారు.[75] రాజీనామా అగత్యం తప్పిపోయింది. జవాహర్‌లాల్ లాహోరు కాంగ్రెస్ అధ్యక్షత వహించేనాటికి అతని వైఖరి పట్ల ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయి పూర్ణ స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా అంగీకరించడం అనివార్యమే అయింది.[76] అధ్యక్షోపన్యాసంలో జవాహర్‌లాల్ తాను సామ్యవాదిని, ప్రజాస్వామ్యవాదిని అని సుస్పష్టంగా చెప్పాడు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి వ్యవస్థీకృతమైన హింసకు దిగడానికి కాంగ్రెస్‌కు సాధన సంపత్తి కానీ, శిక్షణ కానీ లేవనీ, వ్యక్తిగతమైన హింసాత్మక చర్యలు నిరాశా నిస్పృహలను వెల్లడించడం తప్ప మరేం చెయ్యవనీ, కాబట్టి పన్నుల చెల్లింపు నిరాకరణ, సార్వత్రిక సమ్మెల రూపంలో శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ చేపట్టాలని పేర్కొన్నాడు.[77]

భారత స్వాతంత్ర్య ప్రకటన

జవాహర్‌లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య ప్రకటన చిత్తుప్రతిని తానే తయారుచేశాడు. దీనిని లాహోర్ కాంగ్రెస్‌ ఆమోదించింది. ఇందులో ఒక భాగం ఇలా పేర్కొంటూంది:

స్వేచ్ఛ, శ్రమకు తగ్గ ఫలితాన్ని అనుభవించగలగడం, జీవితావసరాలు సంపాదించుకుని ఎదగడానికి అవకాశాలు పొందడం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల్లాగానే భారత ప్రజల మార్చలేని హక్కు. ఈ హక్కులను ఏ ప్రభుత్వం అయినా నిరాకరించి అణచివేస్తూంటే దాన్ని మార్చడానికి కానీ, ఆ ప్రభుత్వాన్ని రద్దుచేయడానికి కానీ ప్రజలకు హక్కు ఉంటుందని మేం నమ్ముతున్నాం. భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వం కేవలం భారత ప్రజలకు స్వేచ్ఛను నిరాకరించడమే కాదు, దేశంలోని ప్రజలను దోపిడీ చేసి, భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా నాశనం చేస్తున్నది. దాంతో మేం నమ్మేదేంటంటే: భారతదేశం బ్రిటీష్ వారితో సంబంధాలు తెంపివేసుకుని, పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్ర్యం సంపాదించాలి.[78]

1929 డిసెంబరు 31 అర్థరాత్రి నాడు జవాహర్‌లాల్ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు.[79] జవాహర్, గాంధీ రాసిన పన్నుల నిరాకరణకు సైతం సిద్ధంగా ఉండడం కలిగివున్న స్వాతంత్ర్య ప్రమాణాన్ని అందరూ చదివి ప్రమాణాలు చేశారు. 172 మంది కేంద్ర, ప్రాంతీయ శాసన సభ్యులు ఈ ప్రకటనకు అనుగుణంగా రాజీనామా చేశారు. లాహోర్ కాంగ్రెస్‌లో 1930 జనవరి ఆఖరి ఆదివారం (అది జనవరి 26 అయింది) పూర్ణ స్వాతంత్ర్య ఆకాంక్షను వ్యక్తం చేస్తూ స్వాతంత్ర్య దినాన్ని జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. తన స్వీయచరిత్రలో జవాహర్‌లాల్ ఆరోజును ఇలా వర్ణించాడు - "1930 జనవరి 26న స్వాతంత్ర్య దినం వచ్చింది, ఒక్క మెరుపులో దేశపు పట్టుదల, కుతూహలపు చిత్తవృత్తి మాకు తెలియవచ్చిందీ. ప్రతిచోటా పెద్ద సమావేశాలు జరిగాయి, వాటిల్లో ఆకర్షవంతమైందేదో ఉంది. అక్కడ ఉపన్యాసాలు లేవు, ఉద్బోధలు లేవు. ప్రశాంతంగా, గంభీరంగా స్వాతంత్ర్య ప్రమాణాలు స్వీకరించటం జరిగింది." కలకత్తా, బొంబాయిల్లో పెద్ద పెద్ద సమావేశాలు జరిగాయి. చిన్న పట్నాల సమావేశాలకు కూడా జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు.[80]

పూర్ణ స్వాతంత్ర్య తీర్మానం నుంచి రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు వరకు (1930-1945)

ఉప్పు సత్యాగ్రహం, గాంధీ-ఇర్విన్ ఒప్పందం

పూర్ణ స్వాతంత్ర్య తీర్మానాన్ని ఆమోదించాకా శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాను నిశ్చయించినప్పుడు ప్రారంభించవచ్చన్న అధికారాన్ని కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గం మహాత్మా గాంధీకి ఇచ్చింది. ఉప్పు పన్ను చట్టాన్ని ఉల్లంఘించాలని, ఉప్పు సత్యాగ్రహం చేయాలని గాంధీ నిర్ణయించి దండి వరకు పాదయాత్ర చేసి ఏప్రిల్ 6న జలియన్ వాలాబాగ్ దురంతపు స్మారక దినాన దండిలో ఉప్పు తయారు చేశాడు. మొదట జవాహర్‌లాల్ గాంధీ నిర్ణయం అర్థరహితమని భావించినా,[81] క్రమేపీ దానిని అర్థంచేసుకుని ఉత్సాహం ప్రోదిచేసుకున్నాడు. జవాహర్‌లాల్ గుజరాత్‌లోని దండియాత్రలో ఒక మజిలీ వరకు గాంధీతోపాటు నడిచాడు.[82] దేశ వ్యాప్తంగా శాసనోల్లంఘన ఉద్యమానికి జవాహర్‌లాల్ పిలుపునిచ్చాడు. అలహాబాద్ జిల్లాలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించడానికి సమీపంలో సముద్రతీరం లేకపోవడంతో ఏప్రిల్ 9న చట్టవిరుద్ధంగా తయారుచేసిన ఉప్పు పొట్లాలు అమ్మడం వంటి పనులతో శాసనాన్ని ఉల్లంఘించారు. రాయ్ బరేలి జిల్లాలో కౌళ్ళ చెల్లింపు మానుకుంటూ కౌలు రైతులతో సత్యాగ్రహం ప్రారంభించాడు. ఈ చర్యతో ప్రభుత్వం ఆందోళనపడి జవాహర్‌లాల్‌ను ఏప్రిల్ 14న అరెస్టు చేసింది.[83]

నైనీ జైల్లోనే విచారించి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అత్యంత ప్రమాదకరమైన, కరడుకట్టి నేరస్తులను ఉంచే చోట జవాహర్‌ను బంధించారు. జైలు జీవితాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు పరుగు, నడక, వ్యాయామం, నూలు వడకడం, పుస్తకాలు చదివి నోట్సు రాసుకోవడం వంటివి చేసేవాడు.[84] జైలులో అతనిది దాదాపు ఏకాంతవాసమే అయినా కొందరు తోటి ఖైదీలు జవాహర్‌కు సేవలు చేస్తూ, జైలు కూలీలు చిన్న చిన్న కానుకలు సమర్పిస్తూ ఉండేవారు. రెండున్నర నెలలకు మోతీలాల్ నెహ్రూ, సయ్యద్ మహమూద్‌లు అదే జైలుకు రావడంతో తండ్రికి సేవలు, రాజకీయ సంప్రదింపులు చేయడం ప్రారంభించాడు.[85] సత్యాగ్రహం నిలిపివేసే అవకాశాలను పరిశీలించమంటూ యరవాడ జైలులోని గాంధీని మితవాదులైన తేజ్ బహదూర్ సప్రూ, జయకర్ కలవగా, కాంగ్రెస్ అధ్యక్షుడైన జవాహర్‌లాల్ నెహ్రూదే నిర్ణయం తీసుకునే అధికారమని గాంధీ తిప్పి పంపాడు. జవాహర్‌లాల్, మోతీలాల్ ఉద్యమాన్ని కొనసాగించడమే తమ అభిమతమని గాంధీకి గట్టిగా చెప్పినా వైశ్రాయ్‌కి చెప్పి వారిద్దరినీ గాంధీని కలిసేందుకు యరవాడ తీసుకువెళ్ళారు. అయితే చర్చలు ఫలప్రదం కాలేదు.[86] అక్టోబరు 11న ఆరునెలల శిక్షాకాలం పూర్తై జవాహర్‌లాల్ విడుదల అయి భూమిశిస్తు కౌళ్ళు, ఆదాయపు పన్నులు నిలిపివేసేలా ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించడంతో పదిరోజుల్లో మళ్ళీ అరెస్టుచేశారు. ఈసారి రెండేళ్ళ కఠిన శిక్ష విధించారు. ఈసారి పరిశీలించేందుకు పుస్తకాలు లేవన్న కారణాన్ని పక్కన పెట్టి తన కుమార్తె ఇందిరకు ప్రపంచ చరిత్రపై లేఖలు రాయడం కొనసాగించాడు. [87] 1931 ఫిబ్రవరి 6న మోతీలాల్ మరణించాడు. తండ్రి అంత్యక్రియల సందర్భంగా రాజకీయాలలో సమయం వెచ్చించలేని జవాహర్‌లాల్ తరఫున తనకు తానై స్వంత బాధ్యతతో గాంధీ నడుమ గాంధీ-ఇర్విన్ సంధి కుదుర్చుకుని శాసనోల్లంఘనాన్ని నిలిపివేశాడు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, అల్పసంఖ్యాక వర్గాల స్థితి వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగే చర్చలకు కాంగ్రెస్ హాజరవుతుందని అంగీకరించాడు. అందుకు బదులుగా హింసాత్మకమైన అభియోగాలు లేనివారి విడుదల, ఉప్పుతయారీకి అనుమతి, శాంతియుతమైన పికెటింగుకు అవకాశం ఇస్తుంది. జవాహర్‌లాల్‌కు ఈ సంధి ఆమోదయోగ్యం కాలేదు.[88] ఇది స్వాతంత్ర్యాన్ని కాకపోయినా కనీసం పన్నుల చెల్లింపు నిరాకరణలో పాల్గొన్న బార్డోలీ తదితర ప్రాంతాల రైతుల జప్తు అయిన ఆస్తులు తిరిగి, ఉప్పు తయారీకి, సేకరణకు పూర్తి హక్కులు ప్రభుత్వం ఇవ్వడం కూడా సాధించలేకపోయింది.[89] అయితే గాంధీ జవాహర్ ఊహిస్తున్నదాని కన్నా ఎక్కువగా ఉద్యమం వల్ల దేశం నీరసించి శక్తి, ఉత్సాహాలు కోల్పోయిందని అంచనా వేశాడు.[88]

తనకు నచ్చకపోయినా గాంధీ స్వంత పూచీకత్తు మీద చేసుకుని వచ్చిన ఒప్పందాన్ని ఆమోదించాల్సినదిగా కోరుతూ కరాచీ కాంగ్రెస్ మహాసభలో జవాహర్‌లాలే స్వయంగా ప్రవేశపెట్టాడు. భవిష్యత్తులో కాంగ్రెస్ ఆమోదించబోయే ఏ రాజ్యాంగంలోనైనా ప్రాథమిక హక్కులు, వయోజన ఓటింగు హక్కు, ఉచిత ప్రాథమిక విద్య మొదలైన హక్కులతో పాటు వాస్తవమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కూడా చేర్చేలా కాంగ్రెస్‌తో ఆమోదింపజేసుకున్నాడు.[89] ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ ఆమోదించే రాజ్యాంగ హక్కుల్లో చేర్చినందుకు రాజకీయంగా గాంధీకి నెహ్రూ ఇచ్చిన రాయితీ అని కొందరు వాదిస్తూంటారు. కానీ అలాంటి కారణంతో కాదని, తాము నిర్ణయించుకున్న స్వాతంత్ర్య లక్ష్యాలకు విఘాతం కాకపోగా కేవలం సమరంలో యుద్ధ విరమణ వంటిది కాబట్టి నెహ్రూ సమాధానపడ్డాడని సర్వేపల్లి గోపాల్ భావించాడు.[90]

భూ సమస్యల్లో పోరాటం, జైలు జీవితం

యునైటెడ్ ప్రావిన్సుల్లో 1930ల్లో కొనసాగుతున్న దుర్భిక్షం వల్ల కౌలురైతులు చాలా బాధలు పడ్డారు. శిస్తులు, కౌళ్ళు చెల్లించలేక అలమటిస్తున్న పరిస్థితిలో భూస్వాములకు, కౌలుదార్లకు జరుగుతున్న సంప్రదింపుల్లో తహశీల్ స్థాయి కాంగ్రెస్ సంస్థలు కౌలుదార్ల ఏజెంట్లుగా పనిచేశారు. ఈ వ్యవహారాన్ని జవాహర్‌లాల్ పర్యవేక్షించాడు.[91] కాంగ్రెస్ వ్యవహారశైలి ప్రభుత్వానికి అభ్యంతరకరంగా లేకపోయినా ఈ మధ్యవర్తి పాత్ర కాంగ్రెస్‌ను చేయనిస్తే వారు గ్రామీణ ప్రాంతాల్లో బలపడతారని ప్రభుత్వం భయపడింది. ప్రభుత్వాధికారులు జవాహర్‌లాల్ వర్గపోరాటాన్ని తీసుకురాబోతున్నాడని అసత్యాలతో గాంధీకి, జవాహర్‌కీ కొంతమేరకు విభేదాలు సృష్టించగలిగారు. ప్రభుత్వానికీ, ప్రజలకూ కాంగ్రెస్ మధ్యవర్తిత్వం నెరపవచ్చన్న వాదన గాంధీ ఉపసంహరించుకున్నాడు. అంతేకాక జవాహర్‌లాల్ అనారోగ్యం వల్ల గాంధీ నేరుగా యుపి రైతుల సమస్యను కాంగ్రెస్ తరఫు నుంచి చూడాల్సివచ్చినప్పుడు కౌలుదార్ల పరిస్థితులకు, యుపి రాజకీయ మహాసభ చేసిన తీర్మానాలను లక్ష్యపెట్టకుండా సాధ్యమైనంతవరకూ పన్ను చెల్లించెయ్యాలంటూ, యుపి కాంగ్రెస్ సిఫారసు చేసినదాన్ని మించి ఒక గరిష్ఠ శాతాన్ని సూచించి ఆమేరకు పన్ను చెల్లించాలని చెప్పాడు.[92]

రైతుల పట్ల గాంధీ వైఖరి ఏమంత అనుకూలంగా లేదని అర్థం చేసుకున్న యుపి ప్రభుత్వం కాంగ్రెస్‌కి, కౌలుదార్లకీ ఉన్న సంబంధాలు విచ్ఛిన్నం చేయడానికి దమనకాండ ప్రారంభించింది. కౌళ్ళ వసూలు సీజన్ ముగిసిపోయింది, అప్పటికే 60 నుంచి 80 శాతం చెల్లింపులు రైతులు చేశారు కాబట్టి ఇప్పటికి వసూళ్ళు ఆపాలన్న కాంగ్రెస్ న్యాయమైన విజ్ఞప్తిని కూడా ప్రాంతీయ ప్రభుత్వం అంగీకరించలేదు. ఆపైన బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో సంప్రదించిన మీదటే శిస్తు వసూలు, కౌలు నిర్ణయం చేయాలన్న గాంధీ సూచనను పరిశీలించడానికి సుముఖంగా ఉన్నా యుపి ప్రభుత్వం మాత్రం బిగిసిపోయింది.[93] క్రమేపీ కేంద్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించసాగింది. అప్పటికి రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న గాంధీ తనకు ఉచితమన్న రీతిలో అవసరమైతే ఎటువంటి చర్య అయినా తీసుకొమ్మని జవాహర్‌కి అధికారం ఇచ్చినా, జవాహర్ గాంధీని ఇరుకునపెట్టడం ఇష్టం లేక శిస్తు చెల్లింపు నిరాకరణోద్యమం వాయిదా వేస్తూ వచ్చాడు. మరోవైపు యుపి ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపి విఫలమైంది.[94] ఈ దశలో జవాహర్‌లాల్ అనివార్యమైన శిస్తు చెల్లింపు నిరాకరణోద్యమాన్ని అలహాబాద్, రాయబరేలీ, ఎటావా, కాన్పూర్, ఉన్నావ్ జిల్లాల్లో ప్రారంభించాడు. ఈ జిల్లాల్లో శిస్తు చెల్లింపు పూర్తిగా నిలిచిపోవడమే కాక ఇతర జిల్లాలూ అటువంటి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వం జవాహర్‌కి, కాంగ్రెస్‌కి రైతుల్లో గట్టి పట్టు దొరుకుతోందని గమనించి, రైతులకు నీటితీరువా తగ్గింపు, ఋణాల మాఫీ వంటి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ ఈలోపు ఆయా జిల్లాల్లో జవాహర్ పర్యటించినా అరెస్టు చేయకుండా ఉపేక్షించింది.[95] ఒక్కసారి తాము అనుకున్న ఉపశమన చర్యలు పూర్తిచేసి, అలహాబాద్ తిరిగివచ్చిన జవాహర్ పట్టణం విడిచి వెళ్లరాదని నిషేధించింది. 1931 డిసెంబరు 26న గాంధీకి స్వాగతం చెప్పేందుకు బొంబాయి వెళ్తూండగా ఆగ్రా సమీపంలోని ఇరాదాత్ నగర్ స్టేషన్‌లో అరెస్టు చేసి, వారం రోజుల తర్వాత రెండేళ్ళ జైలుశిక్ష విధించారు.[96]

ఈసారి సుదీర్ఘకాలం జవాహర్‌లాల్ జైల్లో గడిపాడు. జైలు జీవితం అతని ఆరోగ్యాన్ని క్షీణింపజేసింది. జైల్లో తన కుమార్తెకు ప్రపంచ చరిత్ర గురించి రాస్తున్న ఉత్తరాలు కొనసాగించాడు. మొదట నైనీ జైల్లో నిర్బంధించి, కొద్దివారాలకు బరైలీ జైలుకు తరలించారు. బరైలీ జైల్లో పరిస్థితులు, మనుషులూ దారుణంగా ఉండేవారు. జైలర్ జవాహర్‌ని చూడడానికి వచ్చిన భార్యనీ, తల్లినీ అవమానించడంతో,[97] ఆ అవకాశం ఇవ్వరాదని నెలల తరబడి సందర్శకులను చూడడానికి అంగీకరించలేదు. 1932 జూన్‌లో జవాహర్‌లాల్‌ను డెహ్రాడూన్‌లోని జైలుకు మార్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం, అనువైన జైలు భవనాలకు తోడు ఐరిష్ జాతీయవాది డివెలరా శిష్యుడైన సూపరింటెండెంట్ కెప్టెన్ ఫాల్వే జవాహర్‌కు చాలా సౌకర్యాలు కలుగజేశాడు. తోటి ఉద్యమకారులకు లేని సౌకర్యాలు తనకు ఉండడం సిగ్గుచేటుగా భావించి జవాహర్ ఇతరులతో సమానంగా చూడమని కోరాడు. తన కుటుంబసభ్యులను తలచుకుని బాధపడేవాడు. జవాహర్ జైల్లో ఉండగా రెండుసార్లు గాంధీ చేసిన నిరాహారదీక్షలు అతన్ని కలచివేశాయి.[98] 1933లో ఉపవాసదీక్ష ప్రారంభించగానే గాంధీని ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడం, అతను శాసనోల్లంఘనాన్ని నిలిపివేయడం జరిగాయి. శాసనోల్లంఘనోద్యమాన్ని నిలిపివేయడం తెలసి నెహ్రూ నిర్ఘాంతపోయినా గాంధీ మరణిస్తాడేమోనన్న ఆతృత దాన్ని జయించింది. జవాహర్ ఆ చర్యను ఆమోదించాడు.[99] 1933 ఆగస్టులో జవాహర్‌ను నైనీ జైలుకు మార్చి, అదే నెల 30వ తేదీన గడువు కన్నా 12 రోజుల ముందు విడుదల చేశారు.[100]

తిరిగి జైలుకు, భార్య మృతి

గాంధీ ఆలోచన, ఆచరణలకు, లక్ష్యాలకు జవాహర్ ఆలోచనలకు, లక్ష్యాలకు చాలా భేదమున్నట్లు ఆ దశలో జవాహర్‌ అవగాహన చేసుకుంటూనే ఉన్నాడు.[99][100][101] 1933 సెప్టెంబరు ఆరంబంలో జవాహర్ చేసిన పలు ప్రకటనలు జవాహర్ కాంగ్రెస్ నుంచి విడిపోయి, స్వాతంత్ర్యమే ప్రధాన లక్ష్యమైన వేరే పార్టీ నెలకొల్పుతాడన్న ఊహాగానాలకు అవకాశమిచ్చాయి.[100] సామ్యవాదం అవలంబించకుండా వచ్చిన స్వాతంత్ర్యం స్వాతంత్ర్యమే కాదని అభిప్రాయపడుతూ ఉన్నా బ్రిటీష్ సామ్రాజ్యవాదంపై పోరాడి స్వాతంత్ర్యం సముపార్జించేవరకు ఆర్థికాంశాలపై పోరాటం వృధా అన్న అభిప్రాయానికి వచ్చాడు. రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి కాంగ్రెస్, దాన్ని నడిపించడానికి గాంధీ కీలకమని గ్రహింపు, నేరుగా గాంధీని కలిసి ముఖాముఖీ చేసిన చర్చలు కలగలిసి గాంధీ నాయకత్వాన్ని తాను ఆమోదిస్తున్నట్టు చేసిన ప్రకటన రూపంలో వెలువడ్డాయి. ఈ దశలో జవాహర్ తన వైఖరి వెల్లడిస్తూ కాంగ్రెస్ విధానాలకు తనకు అనుకూలమైన వ్యాఖ్యానాన్ని వివరిస్తూ తెలిపిన కొన్ని అంశాలను గాంధీ పెద్ద చర్చ లేకుండా ఆమోదించాడు.[102]

అలా గాంధీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ సంస్థను జవాహర్ ఆమోదించాకా గ్రామోద్ధరణ, హరిజనోద్యమం వంటివి ఉపప్రదర్శనలుగా పక్కనపెట్టాడు. తాను కీలకమని భావిస్తున్నదీ, ఇన్నేళ్ళుగా బుద్ధిపూర్వకంగా ఉపేక్షించినదీ అయిన మతతత్వంపై దృష్టిసారించాడు.[103] ప్రధానంగా హిందూమహాసభపై తన విమర్శలు ఎక్కుపెట్టి, గాంధీ సహా ఎవరు చదివినా చాలా తీవ్రమని అంచనావేసిన భాషలో దుయ్యబట్టాడు.[104] ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక దుస్థితి భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్న ఆ తరుణంలో జవాహర్‌లాల్ ఏదైనా విప్లవాత్మకమైన కార్యాచరణ ప్రబోధిస్తే ప్రజలు అందుకుంటారన్న భయం ప్రభుత్వానికి ఉంది. పైగా గ్రామీణ ప్రాంతంలో అతను చేపడుతున్న కార్యకలాపాలు, అతని రచనలు, ప్రసంగాలు మధ్యతరగతిపై చూపుతున్న ప్రభావం చూసి ప్రభుత్వం బెదిరింది. ఈ స్థితిలో కలకత్తాలో అతను 1934 జనవరిలో చేసిన ప్రసంగాన్ని కారణంగా చూపి బెంగాలు ప్రభుత్వం వారెంటు జారీచేసింది.[105] 1934 ఫిబ్రవరి 12న అలహాబాదులో జవాహర్‌ని అరెస్టు చేసి కలకత్తా తీసుకువెళ్ళి నాలుగు రోజులకు రాజద్రోహ నేరంపై రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించారు.[106]

మూడు నెలల పాటు ఆలీపూర్ జైలులో ఉంచారు, మే నెల మొదట్లో డెహ్రాడూన్ జైలుకు పంపించారు. గాంధీ 1934 ఏప్రిల్‌లో సహాయనిరాకరణోద్యమాన్ని పూర్తిగా నిలిపివేసి, కాంగ్రెస్ వారు నేరుగా కౌన్సిళ్ళకు పోటీచేసి ప్రవేశించవచ్చని నిర్ణయం వెల్లడించాడు. ఇది నెహ్రూను చాలా దెబ్బతీసింది. సైద్ధాంతికంగా ఏకత్వం లేని గాంధీతో స్వాతంత్ర్య సంపాదన లక్ష్యం ఐక్యంగా ఉందని కలిసి పనిచేయడం పొరబాటేమోనని నిందించుకున్నాడు.[107] నెహ్రూ తన మొహం చెల్లకుండా పోయిందన్నాడు, చివరకు గాంధీతో తెగతెంపులు చేసుకోవలసి రావచ్చేమోనని తన డైరీలో రాసుకున్నాడు.[108] అయితే నెహ్రూ చేస్తున్నది తన వేదనను, కోపాన్ని వెళ్ళగక్కడమే తప్ప పార్టీకి ప్రమాదం ఏమీ లేదని గాంధీ సరిగానే అంచనావేశాడు.[109] 1930కల్లా భారతదేశంలో సామ్యవాద చైతన్యానికి నెహ్రూ గొప్ప ప్రతీకగా నిలిచాడు.[110] 1934లోనే కాంగ్రెస్‌లో సామ్యవాద ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి, జాతీయవాదంతో సామ్యవాదాన్ని కలపడానికి పార్టీలోనే ఏర్పడిన సామ్యవాద పక్షం బహిరంగంగా తాము జవాహర్‌లాల్‌నే ప్రతిధ్వనిస్తున్నామని ప్రకటించింది. అయితే జవాహర్ వారిని సమర్థించలేదు.[109]

1934 ఆగస్టులో జవాహర్‌లాల్ భార్య కమల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం మానవతా దృష్టితో విడుదల చేసింది. ప్రభుత్వం చూపిన సద్భావాన్ని గౌరవిస్తూ జవాహర్‌లాల్ ఈ కాలంలో ఏ రాజకీయ కార్యకలాపంలోనూ ప్రత్యక్షంగా పాల్గొనకుండా ఉండిపోయాడు..[109] పదకొండు రోజుల వ్యవధిలో ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో తిరిగి జైలుకు తీసుకువెళ్ళారు. ఈసారి నైనీ జైలులో ఉంచి వారానికి ఒకసారి కమలను చూసేందుకు బయటకు అనుమతించేవారు..[111] ఆమెను చికిత్స కోసం వేరే ప్రాంతానికి తరలిస్తే, ప్రభుత్వం జవాహర్‌ను అక్కడికి దగ్గరలోని ఆల్మోరా జైలుకు మార్చారు. ఆమె ఆరోగ్యం ఏమీ కుదుటపడకపోవడంతో ఐరోపా తీసుకువెళ్ళాలని ప్రయత్నించారు. ఆమె అనారోగ్యం జవాహర్‌ మానసిక దారుఢ్యాన్ని దెబ్బతీసింది. అతని ఆలోచనల్లో మరేవీ రాకుండా వ్యాకులతతో నింపేసేది. [112] ఆ తీవ్రవేదన నుంచి మనసును బయటపడేసేందుకు జవాహర్‌లాల్ రచనా వ్యాసంగాన్ని ఆశ్రయించాడు. మనస్సును మళ్ళించుకోవడానికి, ఆ జైలుగోడల మధ్య రాయడం ప్రారంభించిన స్వీయచరిత్ర అతనికి ప్రపంచవ్యాప్తంగా పాఠకులను, విమర్శకుల ప్రశంసలను సంపాదించిపెట్టింది. కమల ఆరోగ్యరీత్యా ఐరోపా ప్రయాణించాల్సి వచ్చింది. ప్రభుత్వం కమల పరిస్థితి విషమించిందని తెలుసుకుని సెప్టెంబరు 2న జవాహర్ శిక్ష నిలిపివేసింది. రాజకీయ సంబంధమైన ప్రసంగాలు చేయవద్దని, అయితే ఐరోపాలో అతని కదలికలపై ఏ నిర్బంధం ఉండదనీ ప్రభుత్వం తెలిపింది.[113] ప్రయాణానికి, ఐరోపాలో నివాసానికి అయ్యే పెద్దమొత్తాన్ని భరించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి కాంగ్రెస్ నాయకుల్లో కొందరికి ఇచ్చినట్టే పెద్ద మొత్తంలో ఎలవెన్సు ఇస్తానని పారిశ్రామికవేత్త బిర్లా ముందుకువచ్చినా నెహ్రూ ఇబ్బందులు తనకు తానే భరించి స్వంత ఖర్చులపైనే 1935 చివరిలో ప్రయాణమయ్యాడు.[114] జర్మనీలో కమలా నెహ్రూను వైద్యశాలలో చేర్చారు. ఆమె కోరిక మేరకు స్విట్జర్లాండులోని మరో వైద్యశాలకు తరలించారు.[113] క్షణానికి ఒక తీరుగా ఉన్న ఆమె ఆరోగ్యం గురించి ఆశనిరాశల్లో జవాహర్ కొట్టుకులాడాడు. చివరకు 1936 ఫిబ్రవరి 28న కమలా నెహ్రూ మరణించింది.[115]

కాంగ్రెస్ నాయకత్వం, ఎన్నికలు

జవాహర్‌లాల్ 1936లో ఐరోపాలో ఉండగానే గాంధీ నిర్ణయం ఆమోదిస్తూ కాంగ్రెస్ పార్టీ జవాహర్‌ని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుంది. 1935 భారత రాజ్యాంగ చట్టంపై, దానిని అనుసరించి రానున్న ఎన్నికలలో నెగ్గి పదవులు స్వీకరించడం పట్ల జవాహర్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు. పార్టీలో అత్యధికులు పదవుల స్వీకారానికి సుముఖులుగా ఉన్నారు. గాంధీ కూడా వారి అభిప్రాయానికి తలవొగ్గినా, ఈ విషయంలో ఏకాకి అయిపోయిన జవాహర్‌ని నొప్పించే ఉద్దేశం లేక ఎన్నికలు అయ్యేదాకా నిర్ణయాన్ని వాయిదా వేశాడు.[116] కాంగ్రెస్ సమస్త సామ్రాజ్యవాద శక్తుల ఐక్యసంఘటనగా రూపొంది, కార్మిక కర్షక తరగతులను కూడా తమ ఉద్యమంలో చేర్చుకునేలా నియమావళి సరళించాలని నిర్ణయం జరిగింది.[117] జవాహర్‌లాల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా సాగిస్తూ వచ్చాడు. సమస్త శక్తియుక్తులు కాంగ్రెస్‌ని గెలిపించడానికి ధారపోశాడు. రైళ్ళ నుంచి గుర్రాల వరకూ పలు వాహనాలపై విస్తారంగా ప్రయాణించాడు. ఒకచోట సమయం అయిపోతూండడంతో సభాస్థలానికి దాదాపు కిలోమీటరు దూరం నెహ్రూ, అతని వెంట జనం పరుగులుతీశారు. సభల్లో నెహ్రూకి ఉన్న ప్రజాకర్షణ ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యేది.[118] రాజ్యాంగ తిరస్కరణ, సామ్యవాద ధోరణి, విప్లవాత్మక ప్రవర్తన వంటివాటి దృష్ట్యా జవాహర్‌లాల్‌ని ఏదోక అభియోగంపై తిరిగి అరెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. జవాహర్‌ను అత్యంత ప్రాముఖ్యమైన అంతర్గత ప్రమాదంగా పరిగణించి, అతను ప్రసంగించిన ప్రతీచోటకు పోలీసులను నోటు పుస్తకాలతో పంపి నోట్ చేసుకునేవారు. సుదీర్ఘకాలం శిక్ష విధించడానికి తగ్గ అభియోగం మోపడానికి తగినది ఏదైనా అతని ప్రసంగాల్లో లభిస్తాయేమో చూసేవారు. అయితే వారి ప్రయాస వృధాగా మిగిలింంది.[119]

1937 మొదట్లో ఎన్నికల ఫలితాలు వెలువడి కాంగ్రెస్‌కు పలు ప్రావిన్సుల్లో ఆధిక్యత లభించింది. ముందు అనుకున్నట్టుగా చర్చించి అధికార స్వీకరణ గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే మంత్రివర్గాల ఏర్పాటు, కూర్పు వంటివాటి గురించి కాంగ్రెస్ వర్గాలు చర్చించుకోవడం నెహ్రూకు మనస్తాపం కలిగించింది. ఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నెహ్రూ అధికార స్వీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాడు. అయితే కార్యనిర్వాహక వర్గంలో అత్యధికులు అధికార స్వీకరణకు అనుకూలంగా ఉండడంతో గాంధీ వారినే సమర్థించాడు. కాంగ్రెస్ తిరస్కరించిన రాజ్యాంగానికి బద్ధులై వ్యవహరించాల్సిన పదవులు స్వీకరించబోతున్నారు కనుక ఆ ఇరకాటాన్ని తప్పించేందుకు మంత్రులు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి వచ్చినా గవర్నర్లు జోక్యం చేసుకోరని శాసనసభలోని కాంగ్రెస్ నాయకులకు నమ్మకం కలిగితే అధికార స్వీకరణకు అడ్డం లేదని నిర్ణయించారు. అయితే తర్వాత కొద్దికాలానికే ఈ హామీలు గవర్నరు ఇవ్వకపోయినా అధికారాన్ని స్వీకరించాలని నిర్ణయించారు. ఈ పరిణామాన్ని విషాదంతో వ్యాఖ్యానిస్తూ పదవులు స్వీకరించడానికి కారణాలేమిటీ అని ఎవరూ చూడడం లేదని, పదవులు స్వీకరించాలి కనుక కారణాలు వెతుకుతున్నారనీ వాపోయాడు.[120][121]

కాంగ్రెస్ ప్రభుత్వాలు, మరోమారు ఐరోపా ప్రయాణం

పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నెహ్రూ అంగీకరించినా, అధికార స్వీకరణ పట్ల ఉన్న వ్యక్తిగత వైముఖ్యాన్ని దాచుకోలేకపోయాడు. పార్టీ అధ్యక్ష స్థానంలో కొనసాగినా మంత్రివర్గాలను సమన్వయపరిచి, వాటికి దారిచూపే పార్లమెంటరీ బోర్డులోనూ, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు వ్యవహారాల్లోనూ అతను పాల్గోలేదు. ఆ పనిని వల్లభ్‌భాయ్ పటేల్ వంటి ఇతర నాయకులకు వదిలిపెట్టేశాడు. మొదటి కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటుకు కొద్ది నెలల తర్వాత అస్సాం, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. ఈ ప్రభుత్వాల మీద కాంగ్రెస్ వారు చిన్న చిన్న అంశాలు లేవదీసి విమర్శిస్తే బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షునిగా వాటిని విమర్శకుల నుంచి కాపాడుతూ వచ్చాడు. ఈ ప్రభుత్వాలు కొన్ని విశేషాలు సాధించినప్పుడు ప్రశంసించినా, ఆంతరంగికంగా అవి మితవాద ధోరణితో నడుచుకోవడాన్ని విమర్శించేవాడు.1938లో హరిపురా కాంగ్రెస్‌లో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించాక లభించిన విశ్రాంతిని అప్పటికి పలు తావుల సంక్షోభాలతో ప్రపంచయుద్ధానికి నాందీసూచకంగా ఉన్న ఐరోపా పర్యటించడానికి నిర్ణయించుకన్నాడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకుంటూన్న కుమార్తె ఇందిరా ప్రియదర్శినిని చూడడానికి బయలుదేరినా ఎప్పటివలెనే ఐరోపాలోని పలు రాజకీయ వ్యవహారాలతో గాఢమైన ప్రమేయం పెట్టుకుని, ప్రభావితుడయ్యాడు.

1938 జూన్‌లో ఓడలో బయలుదేరి మార్గమధ్యంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో రాజకీయ నాయకులను కలిశాడు. ఇటలీలో ఓడ దిగగానే అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న స్పెయిన్‌ చేరుకుని రిపబ్లికన్ ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించాడు. పలవురు స్పెయిన్ రిపబ్లికన్ ప్రభుత్వాధికారులను కలిశాడు. స్వాతంత్ర్యం కోసం స్పానిష్ స్థానిక సైన్యం చేస్తున్న పోరాటానికి ముగ్ధుడై అక్కడే సైనికుడిగా ఉండిపోదామని అనుకునే స్థాయిలో ప్రభావితుడయ్యాడు.[122] ఇంగ్లాండు వెళ్ళినప్పుడు అంతకుముందు పర్యటనలకు భిన్నంగా బ్రిటన్ రాజకీయ నాయకుల్లో ప్రముఖులను కలుసుకున్నాడు. అక్కడ నుంచి పారిస్, జర్మనీ మీదుగా ప్రేగ్, జెనీవా, లండన్ అక్కడి నుంచి భారతదేశానికి ప్రయాణించాడు. ఈ పర్యటనల్లో పలువురు రిపబ్లికన్లు, వామపక్షీయులు అయిన రాజకీయ ముఖ్యులను కలుసుకున్నాడు.[123] అతను జెనీవాలో ఉన్నప్పుడు సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది, ఆపైన లండన్ చేరుకున్నప్పుడు అతనికొక గ్యాస్ మాస్క్ అమర్చారు. వీసా దొరకని కారణంగా మధ్య ఆసియా రిపబ్లిక్‌ల మీదుగా భారతదేశానికి వద్దామనుకున్న వాడల్లా, నౌకలో తిరిగివచ్చాడు.[124]

పార్టీలో సంక్షోభాలు, ప్రపంచ యుద్ధారంభం (1939)

1938 చివర్లో భారతదేశానికి తిరిగిరాగానే దేశ రాజకీయాల్లో నిమగ్నుడయ్యాడు. ముస్లింలీగ్‌ని మంత్రివర్గాల్లో చేర్చుకోకపోవడం కాంగ్రెస్ అహంకారమనీ, ద్రోహమనీ భావించిన జిన్నా అప్పటినుంచీ కాంగ్రెస్‌పై దారుణమైన విమర్శలు చేయసాగాడు. కాంగ్రెస్ ఫాసిస్ట్ సంస్థ అనీ, ఇస్లాం ప్రమాదంలో పడిందనీ జిన్నా విమర్శలు చేయసాగాడు. వీటి విషయంలో సూటిగా ఉదాహరణలు ఇవ్వమనీ నెహ్రూ సవాలు చేసినా, అది పట్టించుకోకుండా జిన్నా మళ్ళీ వేర్వేరు ఆరోపణలు చేస్తూ పోవడమనే వ్యూహాన్ని తొలిసారిగా అమల్లో పెట్టసాగాడు.[124] ముస్లింలను ఆకట్టుకునేందుకు ముస్లిం రైతులతో సభలు ఏర్పాటుచేసి వారికి ప్రయోజనకరంగా ఉండేలా ఋణాలను, తాలూక్దారి విధానాన్ని రద్దుచేయమని కోరాలని, తద్వారా ముస్లిం నాయకులు భయాందోళనలు రేకెత్తించే విధానాలకు విరుగుడుగా ముస్లిం జనబాహుళ్యపు ఆర్థిక ప్రయోజనాల ద్వారా ఆకర్షించగలమని నెహ్రూ భావించాడు. కానీ దీర్ఘకాలం సాగాల్సిన ఈ వ్యూహాలు మతకల్లోలాలు, హింస, అభద్రతాభావం వ్యాప్తి మధ్యలో సాగలేదు.[125]

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్‌కీ, గాంధీకి నడుమ అంతర్గత వివాదం ప్రారంభమైంది. 1938లో జవాహర్ నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించిన బోస్ 1939లో మరోమారు కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీచేశాడు. అతనిపై పోటీకి కాంగ్రెస్‌లో గాంధీ అనుయాయుల నుంచి పట్టాభిని అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే పట్టాభి మీద బోసు గెలిచాడు. గాంధీ ఆ ఓటమిని తన ఓటమిగా ప్రకటించడం, కాంగ్రెస్ కార్యవర్గంలో ముఖ్యులైన 12 మంది రాజీనామా చేయడం జరిగాయి. గాంధీ, ఇతర మితవాద నాయకులు తనకు సహకరించరని గ్రహించిన బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. క్రమేపీ బోస్ కాంగ్రెస్ నుంచి దూరమయ్యాడు. ఈ సంక్షోభంలో నెహ్రూ తటస్థంగా, ఎటూ తేల్చక ఉండిపోయాడు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైన బోస్‌ను ఆ పదవి నుంచి దించిన విధానం నెహ్రూకు నచ్చలేదు. మరోవైపు బోస్ విధానాలను కూడా వ్యతిరేకించాడు.[నోట్స్ 4] రెండు పక్షాలకు ప్రైవేటు చర్చల్లో రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. సుభాష్ చంద్రబోస్ మాత్రం గాంధీ, తదితరులు ప్రత్యక్షంగా చేసిన దాడి కన్నా జవాహర్‌లాల్ నెహ్రూ అనిశ్చిత వైఖరి వల్లే ఎక్కువ దెబ్బతిన్నాడు. బోస్ నెహ్రూని ఈ వైఖరికి మరెన్నటికీ క్షమించలేకపోయాడు.[126] అయితే జవాహర్ వైఖరీ, బోస్ వైఖరీ, ప్రత్యేకించి అంతర్జాతీయమైన అంశాల్లో, అప్పటికే చాలా దూరం విభేదించి ఉన్నాయి.[127]

ఈ సమయంలో జవాహర్‌లాల్ నెహ్రూ అఖిల భారత సంస్థానాల ప్రజల మహాసభకు అధ్యక్షత వహించి సంస్థానాల సమస్యపైన, ప్రణాళికా రంగంలో జాతీయ ప్రణాళికా రచనలోనూ పనిచేశాడు. సంస్థానాల్లో జరిగే ఉద్యమాలు, ఆందోళనలను భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న జాతీయోద్యమంతో ప్రమేయం కల్పించి రెంటినీ ముడివేయాలని అతను భావించేవాడు. మరోవైపు గాంధీ పలు అంశాల్లో బ్రిటీష్ వారికీ, తనకీ మధ్య సంస్థానాధీశులను మధ్యవర్తులుగా అంగీకరిస్తూండడం నెహ్రూకు ఈ అంశంలో సమస్యలు తెచ్చిపెట్టినా ఆసక్తితో పనిచేస్తూండేవాడు. ప్రావిన్సుల్లో కొంతమేరకు స్వతంత్రంగా పనిచేయగల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడడంతో పనితీరును దిశానిర్దేశం చేసే జాతీయ ప్రణాళికా రచన పనిని నెహ్రూ మొదలుపెట్టాడు.[127] దీనికి తక్షణ కాంగ్రెస్ వాదులతో పాటు శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలను చేర్చుకుని కమిటీని ఏర్పరిచి, సుదీర్ఘమైన ప్రశ్నావళి ఏర్పరుచుకుని నిర్దిష్టమైన అంశాలపై సవివరమైన సిఫార్సులు చేసేందుకు 30 ఉపసంఘాలు ఏర్పరిచాడు.[128] 1940 ఏప్రిల్ నాటికి 17 ఉపసంఘాలు తాత్కాలికమైనవి కానీ, తుది నివేదికలు కానీ సమర్పించాయి. 1940 మే, జూన్ నెలల్లో కార్యవర్గం సమావేశమై సమగ్ర నివేదిక రూపొందించసాగారు. అయితే 1940 అక్టోబర్ నాటికి జవాహర్‌లాల్ నిర్బంధానికి గురికావడంతో ప్రణాళికా కార్యక్రమం ఆగిపోయింది.[129]

రెండవ ప్రపంచ యుద్ధం, నెహ్రూ నిర్బంధం

1940 సెప్టెంబరులో చైనాలో పలువురు నాయకులను సందర్శించాడు. మావోనూ, కమ్యూనిస్టులను కూడా కలుసుకోవాలని ఆశిస్తుండగా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి జవాహర్‌లాల్ భారతదేశం తిరిగిరావాల్సి వచ్చింది. మహాత్మా గాంధీ ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంతో హింసకే జయం కలిగినందుకు ఏవగించుకుని, తక్షణ ప్రతిచర్యగా బ్రిటన్‌కి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాడు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో అక్షరాజ్యాల దుశ్చర్యలకు వ్యతిరేకంగా బ్రిటన్ చేస్తున్న పోరాటాన్ని తానెంత సమర్థిస్తూన్నా దాన్ని వ్యక్తిగతంగానే ఉంచాడు. వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టి కాంగ్రెస్ వైఖరిని జవాహర్‌లాల్ మలిచాడు. దాని ప్రకారం - బానిసత్వంలో మగ్గుతున్న భారతదేశం వేరే దేశాల స్వాతంత్ర్యం కోసం యుద్ధంలో పాల్గొనలేదు, బ్రిటీష్ వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి ప్రజాస్వామికంగా పాలింపబడేదైతే అప్పుడు బ్రిటన్‌తో సమస్కంధంగా వారికి సహకరిస్తుంది. బ్రిటన్ సమస్యల్లో ఉన్నప్పుడు దాన్ని అవకాశంగా తీసుకోవాలని కాంగ్రెస్ భావించకున్నా తన నిర్ణయాన్ని వేరొకరు తీసుకోవడం, దాన్ని మౌనంగా ఆమోదించడం భారతదేశానికి తగదు.[128] ఈ భావాలకు అనుగుణంగా కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వం ఈ క్రమంలో సాగుతున్నట్టు సదుద్దేశాన్ని నిరూపించుకోవడానికి ఏదోక చర్య తీసుకోవాని తీర్మానించింది. కనీసం యుద్ధానంతరం తన భవితవ్యాన్ని భారతదేశం తానే నిర్ణయించుకుంటుందన్న ప్రకటన చేసినా చాలని కాంగ్రెస్ వారు వైశ్రాయితో పేర్కొన్నారు. అటువంటి ప్రకటన తర్వాత ఏదోక యుద్ధమండలికి తమ సేవలను ఉపయోగించుకోవచ్చని జవాహర్‌లాల్ సూచన చేశాడు.[130]

అయితే ప్రభుత్వం ఈ అంశాలపై ప్రతికూలంగా స్పందించింది. అందుకుతోడు యుద్ధ పరిస్థితులను సంయుక్తంగా ఎదుర్కొందామని జిన్నాకు సూచించి కాంగ్రెస్‌ని దారికి తెచ్చుకోజూసింది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రావిన్సుల్లో కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. బ్రిటన్ సామ్రాజ్యవాద విధానాలు కొనసాగించినంతవరకూ సహాయ నిరాకరణం సాగాల్సిందేనని కాంగ్రెస్ నిర్ణయించింది. తానే మలచిన కాంగ్రెస్ వైఖరి కారణంగా బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలు సహకరించలేకపోవడం, సోవియట్ రష్యా జర్మనీతో సహకరిస్తూ సాగడం వంటివాటి వల్ల జవాహర్ వ్యక్తిగతంగా చాలా వ్యాకులతతో బాధపడ్డాడు.[131] ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం ప్రారంభించింది. జవాహర్‌లాల్‌ వార్థా నుంచి అలహాబాద్ వెళ్తూండగా 1940 అక్టోబరులో అరెస్టు చేశారు. కేసులో తన తరఫున వాదించుకోవడానికి జవాహర్ తిరస్కరించినా సుదీర్ఘమైన ప్రకటన చేశాడు. "మీరు విచారణ జరిపి శిక్షింప చూసేది నన్ను కాదు, కోట్లాది భారత ప్రజలను" అంటూ చారిత్రకమైన ప్రసంగం చేశాడు. అందరికీ హెచ్చరికగా ఉండేందుకు అంటూ జడ్జీ నాలుగేళ్ళ జైలు శిక్ష విధించాడు. ఇలాంటి శిక్ష గురించి తెలుసుకుని లండన్, ఢిల్లీ, లక్నోల్లోని బ్రిటీష్ అధికారులు, నాయకులే దిగ్భ్రాంతి చెందారు. జవాహర్‌లాల్‌ను సాధారణ నేరస్థునిగా చూడరని, శిక్ష కాఠిన్యం తగ్గిస్తారని ఆశిస్తున్నట్టు చర్చిల్ లండన్‌లోని ఇండియా ఆఫీస్ ద్వారా వైశ్రాయికి టెలిగ్రాం పంపించినా స్పందన లేకపోయింది.[132]

నెహ్రూ జైలుశిక్ష ఈమారు మరింత కఠినంగా సాగింది. అతనికి బయట నుంచి ఏ ఉత్తరాలూ అనుమతించలేదు. జైలు జీవితం కఠినంగా సాగింది. లక్నో క్యాంపులోని రాజకీయ ఖైదీలు అనుభవిస్తున్న కష్టాలు తెలిసి ఉన్న కాస్త సౌకర్యాలను కూడా ఏవగించుకున్నాడు, ఆ ప్రత్యేక సౌకర్యాలను తొలగించకుంటే జైలు క్రమశిక్షణ ధిక్కరిస్తానని అధికారులకు రాశాడు. బ్రిటీష్ రాజకీయవేత్త క్రిప్స్‌ను భారతదేశానికి క్రిప్స్ కమీషన్ పేరిట రాయబారానికి పంపించ నిర్ణయించారు. ఈ సంప్రదింపుల కోసం మిగిలిన కాంగ్రెస్ నాయకులతో పాటు జవాహర్‌లాల్‌ను కూడా విడుదల చేశారు. ఏడాది రెండు నెలల పాటు సాగిన ఈ జైలు శిక్ష 1941 డిసెంబరు మొదట్లో ముగిసింది.[133][134]

గాంధీ వారసత్వం, క్రిప్స్ రాయబారం

జైలు బయటకు వచ్చేనాటికి ప్రజల్లో బ్రిటీష్ వారి పట్ల వ్యక్తమైన ఆగ్రహావేశాలే అతనిలో ప్రతిఫలించాయి. అయినా యుద్ధాన్ని గురించి అంచనా వేస్తూ జర్మనీ నేతృత్వంలోని అక్షరాజ్యాల కూటమి ప్రగతి వ్యతిరేక శక్తుల ఐక్య సంఘటన అని అవగాహన చేసుకున్నాడు. అప్పటికి యుద్ధం రష్యాకు కూడా విస్తరించింది. బ్రిటన్, రష్యా, చైనా, అమెరికాలతో కూడిన అభ్యుదయ శక్తులే విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసినా భారతదేశంలో పాత వ్యవస్థ మారిందన్న సూచనను అందించాకే భారతదేశం మిత్రమండలి పక్షాన మనస్ఫూర్తిగా యుద్ధం చేయడం సాధ్యపడుతుందని తేల్చాడు. మరోవైపు కాంగ్రెస్ అంతటా ఇదే వైఖరి వ్యక్తం కాలేదు. చక్రవర్తుల రాజగోపాలాచారి బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ కార్యనిర్వాహకవర్గ సమావేశంలో గాంధీ, నెహ్రూలను అలక్ష్యం చేసి జాతీయ ప్రాతిపదికపై దేశరక్షణకు స్వతంత్ర భారత సహకారాన్ని అందించేందుకు అనుకూలంగా కార్యనిర్వాహకవర్గాన్ని ఒప్పించాడు. అయితే బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ఇస్తామన్న సూచన కూడా చేయనందున స్వతంత్ర భారతదేశం ఏ వైపు నిలబడుతుందని ఇప్పుడు ప్రకటించడం కేవలం సైద్ధాంతిక వ్యవహారమని నెహ్రూ కొట్టిపారేశాడు. [135]

రాజాజీ కాదు. జవహర్‌లాల్ నాకు వారసుడవుతాడు. నా భాష తనకు అర్థంకావడంలేదనీ, నాకు అన్యమైన వేరొక భాషలో తాను మాట్లాడతాననీ జవహర్‌లాల్ అంటాడు. ఇది నిజంకావచ్చు, కాకపోవచ్చు. అయితే హృదయాలు కలవడానికి భాష ఆటంకము కాదు. నాకీ సంగతి బాగా తెలుసు - నేను పోయిన తర్వాత ఆయన నా భాషలోనే మాట్లాడుతాడు.

మహాత్మా గాంధీ, 1942.

యుద్ధానికి ఏ ప్రాతిపదికన సమర్థన ఇవ్వాలన్న చర్చలో ఉండడం కూడా ఇష్టంలేని గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి వైదొలిగాడు. ఆ సమయంలోనే రాజకీయాలలో తన వారసత్వాన్ని నెహ్రూకి అందిస్తూ కీలకమైన ప్రకటన చేశాడు. చక్రవర్తుల రాజగోపాలాచారి గాంధీ స్థానాన్ని స్వీకరిస్తాడేమోనన్న వాదాలు వినవస్తూ ఉండడంతో సూటిగా రాజాజీ కానీ, పటేల్ కానీ తనకు వారసులు కాదని కూడా నొక్కివక్కాణించాడు.[136][నోట్స్ 5] నెహ్రూకీ, తనకీ మధ్య అభిప్రాయ భేదాలు ఉంటూ వచ్చినా, తామిద్దరినీ ఆ భేదాలు విడదీయలేవన్నాడు. అలా నెహ్రూకి గాంధీ అందించిన వారసత్వం క్రమేపీ భారతదేశ నాయకత్వాన్ని అందించింది.[137]

రెండో ప్రపంచ యుద్ధంలో జపాను పురోగతి భారతదేశ తీరానికి దగ్గరగా వచ్చిన స్థితిలో బ్రిటీష్ వారిని సంకట స్థితిలో పెట్టకుండా సహాయ నిరాకరణ విరమించారు. యుద్ధానికి కలకత్తా చాలా సన్నిహితంగా ఉన్న ప్రాంతం కావడంతో జవాహర్ ప్రజలను భయభీతులు కాకుండా ప్రయత్నాలు చేశాడు. రంగూన్ శరణార్థుల విషయంలో భారతీయులకు, ఐరోపీయులకు మధ్య ప్రభుత్వం భేదం చూపి అప్రతిష్ఠ మూటకట్టుకుంది. ఈ దశలో ఫిబ్రవరి 19న బ్రిటీష్ ప్రభుత్వపు యుద్ధ కాలపు మంత్రిమండలిలో క్రిప్స్ చేరాడు. భారతీయ రాజ్యాంగ వ్యవహారాలు చర్చించడానికి అట్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశాడు. యుద్ధం తర్వాత దామాషా పద్ధతిలో రాజ్యాంగ సభ ఏర్పడడం, ఏ రాష్ట్రానికైనా కొత్త డొమినియన్ రాజ్యాంగం ఇష్టం లేకుంటే అది ప్రస్తుతం ఉన్న స్థితిని కొనసాగించడం, అంతవరకూ యుద్ధంలో బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా రక్షణ బాధ్యత వహించడం ప్రధానాంశాలు.[138] పై ప్రతిపాదనలను తీసుకుని భారతదేశంలో వివిధ పక్షాలను ఒప్పించేందుకు క్రిప్స్ బయలుదేరి వచ్చాడు.

దేశీయ సంస్థానాల్లోని ప్రజలకు బదులు సంస్థానాధీశులకు రాజ్యాంగ సభలో స్థానం ఉండడం, దేశ విభజనకు అనుకూలంగా క్లాజులు ఉండడంతో ఈ ప్రతిపాదనల పట్ల కాంగ్రెస్ వ్యతిరేకతతో ఉంది. దేశ విభజనకు ప్రతిపాదనలో అవకాశం ఉండడంతో గాంధీ వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటన చేశాడు.[139] దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ సహకారాన్ని తీసుకోవడం అంగీకారమైతే గాంధీ అభ్యంతరాన్ని కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళే స్థితిలో నెహ్రూ ఉన్నాడు. అందుకు తగ్గట్టు నెహ్రూను కలుసుకునే ముందు భారతదేశ రక్షణ భారత ప్రజల సహకారంతో నిర్వహించగలమన్న విషయంపై ఆమోదాన్ని, అందుకు తగ్గట్టు అవసరాన్ని బట్టి పేరాలు తిరగరాసేందుకు చర్చిల్ ఆమోదాన్ని క్రిప్స్ తీసుకున్నాడు. అటువంటి అవకాశాన్ని గండికొడుతూ వైశ్రాయ్ సర్వసైన్యాధ్యక్షుడి విధులపై ఆక్రమణ లేకుండా, ఇండియా ప్రభుత్వ రక్షణ బాధ్యతల్లో ఏదో ఒక పనిలో భారతీయుణ్ణి నియమిస్తామన్న విధంగా సంకుచితపరిచాడు.[140] వైశ్రాయ్ కౌన్సిల్ విషయంలో చర్చలు ప్రారంభమయ్యాయి. వైశ్రాయ్ కౌన్సిల్ క్యాబినెట్ తరహాలో ఉంటుందని మొదట్లో క్రిప్స్ మాట ఇచ్చాడు.[141] లిన్‌లిత్‌గో ఈ అంశంపై క్రిప్స్‌ను తప్పించి నేరుగా బ్రిటీష్ ప్రభుత్వంతో సంప్రదించగల అధికారం సంపాదించాడు. మరోవైపు జవాహర్‌లాల్, ఆజాద్‌లతో వేవెల్ ఇంటర్వ్యూ విఫలమైంది. వీటన్నటి మధ్యా వైశ్రాయ్ కౌన్సిల్ స్వరూప స్వభావాలను మార్చవద్దని బ్రిటన్ యుద్ధకాలపు మంత్రిమండలి క్రిప్స్‌కు నిర్దేశించింది.[141] అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ వ్యక్తిగత ప్రతినిధిగా వచ్చిన లూయీ జాన్సన్ ఈ విషయంలో ఏదైనా పరిష్కారానికి సహకరిస్తాడని అంతా ఆశించారు. కానీ అమెరికా కలగజేసుకోవడానికి నిరాకరించడంతో ఈ ప్రయత్నమూ వీగిపోయింది.[142] ఈ రాయబారం అన్నివిధాలా విఫలమైన స్థితికి చేరుకున్నాకా, ఏదో విధంగా దీన్ని సఫలం చేయమని తన పాత మిత్రుడైన జవాహర్‌లాల్‌కు క్రిప్స్ విజ్ఞప్తి చేశాడు. అయితే తరచు మారుతూ వస్తూ, నిలకడగా లేని క్రిప్స్ వైఖరి జవాహర్‌లాల్‌కు నమ్మకం కలిగించలేదు. "కొన్ని పరిమితులు దాటి నేను కాంగ్రెస్‌ను అవతలికి తీసుకుపోలేను, కాంగ్రెస్ కూడా కొన్ని పరిమితులను దాటి దేశాన్ని అవతలికి తీసుకుపోజాల"దని జవాహర్‌లాల్ క్రిప్స్‌కు స్పష్టం చేశాడు. చివరకు క్రిప్స్ రాయబారం విఫలమైంది.[143]

క్విట్ ఇండియా

క్రిప్స్ రాయబారం విఫలమై, ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటు వెనక్కి వెళ్ళాకా కూడా యుద్ధ స్థితిగతుల్లో బ్రిటీష్ వారిని ఇరకాటంలో పెట్టని స్థితినే కొనసాగిస్తామని ప్రకటించాడు. యుద్ధసామగ్రి ఉత్పత్తిని ఆటంకపరచవద్దని ప్రజలకు ఆలిండియా రేడియో ద్వారా చెప్తానని ముందుకు రాగా ఆజాద్ వద్దని సూచించాడు. కలకత్తా వెళ్ళి పారిశ్రామిక సమ్మెలు నిలిపేందుకు ప్రచారానికి సిద్ధమయ్యాడు. అక్షరాజ్యాల పక్షాన ఉన్న జపాన్ ఆగ్నేయాసియాలో చేస్తున్న దండయాత్రలో ముందు సింగపూర్, తర్వాత రంగూన్ పతనమయ్యాయి. యుద్ధం అప్పటికే బర్మా నుంచి భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లోని అస్సాం దాకా వచ్చింది. ఈ స్థితిలో బ్రిటీష్ సైన్యంలో అక్షరాజ్యాలకు దొరికిపోయిన భారత సైనికులను పోగుచేసి భారతదేశ స్వాతంత్ర్యాన్ని యుద్ధంలో సంపాదిస్తానంటూ జపాన్ పక్షాన వారితో సుభాష్ చంద్రబోస్ అజాద్ హింద్ ఫౌజ్ కూడా తలపడుతున్నాయి.

నెహ్రూ ఈ పరిణామాల్లో జపాన్ ని భారతదేశం ప్రతిఘటించాలని, అవసరమైతే అక్షరాజ్యాల తరఫున వస్తున్న సుభాష్ బోస్ నూ, అతని సైన్యాన్ని కూడా ఎదిరించాలని విధాన నిర్ణయం చేసుకున్నాడు. భారతీయులు గెరిల్లా యుద్ధం, భూదహన విధానాలు అవలంబించి జపాన్ పురోగతిని నిరోధించాలని నెహ్రూ ప్రకటించాడు.[143] ఈ ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ కూడా సమర్థించింది.[144] ఈ వైఖరి వల్ల కాంగ్రెస్ నాయకత్వం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించి, నెహ్రూ ప్రకటనను వెనక్కి తీసుకునేలా బలవంతం చేసి ఒప్పించాడు.[143] భారతదేశం నుంచి బ్రిటీష్ ఉపసంహరణ తక్షణం జరగాలని, ఆ తర్వాత జపాన్ భారతదేశంపై దాడిచేస్తే సంపూర్ణమైన అహింసాయుతమైన సహాయ నిరాకరణతో జపాన్ వారిని ఎదుర్కొంటామని గాంధీ తీర్మానం తయారుచేశాడు. దాన్ని విపరీతంగా భావించిన నెహ్రూ తీవ్రంగా ప్రతిఘటించి, మిత్రపక్షాలకు అనుగుణంగా ఉన్న తన వైఖరికి కట్టుబడి ఉన్నాడు. కాంగ్రెస్ నెహ్రూ వాదాన్నే అంగీకరిస్తూ అతని వైఖరిని ఆమోదించింది.[145] మిత్రమండలికి మద్దతునిచ్చి ప్రాతినిధ్య ప్రభుత్వం విషయమై రాబట్టుకునేందుకు నెహ్రూ అమెరికాను నమ్ముకుని ఉన్నాడు. అయితే ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోదని రూజ్వెల్ట్ స్పష్టం చేయడంతో ఇండియా ప్రభుత్వం కాంగ్రెస్ తో మరింత కఠినంగా వ్యవహరించసాగింది. మిత్రమండలికి అనుకూలంగా ఉన్న నెహ్రూ వైఖరి ఇలా అన్ని విధాలా దెబ్బతిని, గాంధీ వాదానికి పరిణామాలన్నీ బలం చేకూర్చాయి.[146] భారతదేశంలో బ్రిటీష్ ఉపసంహరణ తర్వాత ప్రపంచయుద్ధం విషయమై దేశ రక్షణ కోసం మిత్రమండలి సైన్యాల భారతదేశంలో ఉండవచ్చనీ, జాతీయ ప్రభుత్వం చేపట్టే మొట్టమొదటి చర్య మిత్రమండలితో సంధి కుదుర్చుకోవడమేనని గాంధీ తన వైఖరిని సవరించుకుని నెహ్రూ మద్దతునిచ్చేందుకు వీలిచ్చాడు.[147][148] గాంధీ ప్రతిపాదించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 జూలై 14న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. పెద్ద ఎత్తున అహింసాయుతమైన ప్రజా పోరాటాన్ని ప్రారంభించేందుకు గాంధీకి అధికారమిచ్చింది. ఆగస్టులో గాంధీ బొంబాయిలో ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్యం మినహా మరేమీ ప్రభుత్వం నుంచి స్వీకరించేది లేదనీ, అందరం చావో రేవో తేల్చుకుందామనీ పిలుపునిచ్చాడు.

సుదీర్ఘ కారాగారవాసం

ఉద్యమానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం వెనువెంటనే తమ తమ నివాసాల్లోనే కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసింది. ఆ క్రమంలో అరెస్టు అయిన జవాహర్లాల్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి ప్రత్యేక రైలులో ప్రయాణించి అహ్మద్ నగర్ కోటలోని ప్రత్యేక జైలులో బందీలయ్యారు.[149] ఈసారి జవాహర్లాల్ తన జీవితంలోకెల్లా అత్యంత సుదీర్ఘకాలంలో జైలుజీవితం అనుభవించాడు. 1942 ఆగస్టు 9 తేదీ నుంచి 1945 జూన్ 15 తేదీ వరకూ దాదాపుగా 2 సంవత్సరాల 10 నెలల పాటు జైల్లో గడిపాడు. 12 మంది కార్యవర్గ సభ్యులనూ అహ్మద్ నగర్ కోటలోని జైల్లోనే 2 సంవత్సరాల 7 నెలల పాటు బంధించారు. అరెస్టు చేసిన తొలినాళ్ళలో బయట నుంచి ఏ రకమైన సంబంధం లేకుండా ఉత్తరాలు, ఇంటర్వ్యూలు, పత్రికలు అనుమతించకుండా కటువైన నియమాలు అమలుచేశారు. ప్రజలకు అసలు వీరిని అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో కూడా తెలియనివ్వలేదు. క్రమేపీ ఈ పరిస్థితిని కొంత సడలించి పత్రికలను, పరిమితంగా కుటుంబ సభ్యులకు వ్యక్తిగతాంశాలను రాసేందుకు అనుమతించారు. అయితే జవాహర్లాల్ కుమార్తె ఇందిర, సోదరి విజయలక్ష్మి కూడా జైళ్ళలోనే మగ్గుతున్నందున ఇదేమీ అతనికి లాభించలేదు.[150] రెండేళ్ళు గడిచాకా అనుమతించిన ఇంటర్వ్యూలను జవహర్లాల్, ఇతర కార్యవర్గ సభ్యులు తామే తిరస్కరించారు.

సంవత్సరాల పాటు ఒకే కారాగారంలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించడం వల్ల జవాహర్లాల్, మౌలానా ఆజాద్, వల్లభ్ భాయ్ పటేల్, తదితరులైన 12 మంది కార్యవర్గ సభ్యులు ఉద్రేకంతో వాగ్వాదాలకు దిగడం, వివాదాలు పెట్టుకోవడం చేసేవారు. తమకు ప్రియమైనవారు మరణించారని తెలుస్తూ ఉండడం, కటువైన జైలు నియమావళి వల్ల ప్రపంచంతో సంబందం లేకపోవడం వంటివి వీరి మధ్య కలహాలకు కారణమయ్యేవి.[151] జవాహర్లాల్ ఈ సమస్యల నుంచి ఊరటపొందేందుకు ఉమ్మడి జీవనాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేశాడు. ప్రతీ వ్యక్తికీ కొన్ని విధులు అప్పగించాడు. ఆ విధులు వారంవారం మారుతూండేవి. నెహ్రూ వంటపని చూసేవాడు. అస్వస్థులకు సేవ చేసేవాడు. బాడ్మింటన్, వాలీబాల్ వంటి ఆటలు ఆడేవారు. మానసికమైన వ్యాయామం లేకపోవడాన్ని భర్తీ చేసేందుకు తోటపనిలో శరీరం అలసిపోయేలా పనిచేసి సంతుష్టి చెందేవాడు.[152]

పుస్తకాలు, పత్రికలు అనుమతించగానే తాను 1941లో ప్రారంభించిన "డిస్కవరీ ఆఫ్ ఇండియా" పుస్తక రచన పున:ప్రారంభించి పూర్తిచేశాడు. భారతదేశ చరిత్రను అవలోకించేందుకు ఉద్దేశించింది ఈ రచన.[153] రెండు సంవత్సరాల 9 నెలల పాటు జవాహర్లాల్ ను, ఇతర కార్యవర్గ సభ్యులతో అహమ్మద్ నగర్ లోని ప్రత్యేక జైలులో ఉంచిన ప్రభుత్వం 1945 మార్చి నెలలో విడదీసి వేర్వేరు జైళ్ళకు పంపించింది. నెహ్రూను నైనీ జైలుకు, అక్కడ నుంచి బెరైలీకి, అటునుంచి అల్మోరాకు పంపారు. తుదకు 1945 జూన్ 15న విడుదల చేశారు.[150]

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు నుంచి భారత స్వతంత్ర్యం వరకు (1945-1947)

శాసన సభలకు ఎన్నికలు

గాంధీ, కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం బ్రిటీష్ జైళ్ళలో మగ్గుతున్న కాలంలో వారు అందించిన క్విట్ ఇండియా నినాదం అప్పటికే యుద్ధకాలంలో ప్రభుత్వం అనుసరిస్తున్న దారుణమైన విధానాలకు విసిగి వేసారిపోయిన ప్రజలు అందుకుని దిశానిర్దేశం చేసే నాయకులు లేకున్నా ఉజ్జ్వలమైన పోరాటం చేశారు. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం అత్యంత దారుణంగా అణచివేసిన ఈ ఉద్యమం ఇరువైపులా హింసాత్మకమైన ఘటనలతో, ప్రభుత్వ ఆస్తి నష్టం, ఆందోళనకారుల ప్రాణనష్టాలతో సాగింది. కాంగ్రెస్, గాంధీ భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులుగా తిరిగి నిలబడ్డారు. మరోవైపు ముస్లింలీగ్ యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేసి, భారత ప్రభుత్వానికి చేరువై, కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యక్షంగా ప్రభావితం చేయలేని ఈ దశలో ముస్లింలపై తన పట్టును అపరిమితంగా పెంచుకుంది. ఈ పరిణామాలన్నిటినీ 1946లో కేంద్ర, రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి.

ఎన్నికలకు ముందు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు 1945లో వైశ్రాయ్ వేవెల్ జరిపిన చర్చలకు ఆహ్వానితుల్లో లేకపోయినా సిమ్లాలోనే ఉన్న జవాహర్లాల్ ప్రభుత్వ ఉద్దేశాలపై వేసిన అంచనాలకు తగ్గట్టే అవి జరిగాయి. కాంగ్రెస్ నుంచి ప్రభుత్వంలోకి ముస్లిం సభ్యులు ఉండరాదన్న ముస్లింలీగ్ కోర్కెను వేవెల్ మన్నించినా, అందరు ముస్లిం ప్రతినిధులే లీగ్ సభ్యులే కావాలన్నది మాత్రం ఒప్పుకోలేకపోయాడు. జిన్నా ప్రతిపాదనలు ఉపసంహరించుకోగానే మొత్తం సంప్రదింపులు రద్దయ్యి, కాంగ్రెస్ సూచనలకు కనీస విలువ కూడా దక్కలేదు. 1945 చివర్లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ ముస్లింలలో తాను సాధించిన పట్టు నుంచీ, ప్రభుత్వ వర్గాల్లో సంపాదించిన మొగ్గు నుంచీ లాభం సంపాదించుకుంది. జనరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికశాతం గెలిచినా, కేంద్ర శాసన సభకు కేటాయించిన ముస్లిం నియోజకవర్గాల్లో చాలావరకూ సంపాదించింది. ముస్లిం మెజారిటీ ఉన్న పంజాబ్, సింధ్, బెంగాల్ ప్రావిన్సుల్లో లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది. అయితే ఈ ధోరణికి భిన్నంగా ముస్లింలు అత్యధిక దామాషాలో ఉన్న వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు చేసింది.[154]

ఫలితాల్లో ముస్లింలపై లీగ్ పట్టు స్పష్టంగా కనిపిస్తున్నా దీన్ని నెహ్రూ, కాంగ్రెస్ వేరేగా విశ్లేషించారు. భారతదేశం నుంచి విడిపోయే హక్కు ఇస్తే అది వారి భయాలు వదిలించుకోవడానికి పనికివస్తుందే తప్ప విడిపోయేందుకు దాన్ని వినియోగించుకోరని నెహ్రూ భావించాడు.[నోట్స్ 6] ఈ మేరకు కాంగ్రెస్ భారతదేశం నుంచి బ్రిటీష్ ప్రభుత్వం ఉపసంహారం జరగాలని, రాజ్యాంగ పరిషత్తు ఏర్పడాలని కోరుతూనే కాస్త తటపటాయిస్తూ ఏదైనా ప్రాంతం విడిపోవడానికి కోరుకుంటే అందుకు వారికి హక్కు ఉండాలని పేర్కొంది.[155]

క్యాబినెట్ మిషన్

1946 ఫిబ్రవరిలో బ్రిటీష్ ప్రభుత్వం ముగ్గురు బ్రిటీష్ మంత్రి మండలి సభ్యులతో ఏర్పాటుచేసిన బృందం భారత స్వాతంత్ర్యాన్ని ప్రాతిపదికగా రాయబారానికి వచ్చింది. దీన్నే క్యాబినెట్ మిషన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల దామాషా ప్రాతినిధ్యంతో భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పడుతుందని, దానిలో చేరేందుకు ఇష్టం లేని రాష్ట్రాలను ప్రస్తుతానికి విడిచిపెట్టేయవచ్చు. వెనువెంటనే తాత్కాలిక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలి. ఇదీ ప్రస్తుతానికి చేయదలచింది.[156] భవిష్యత్తు ఏర్పాటు విషయంలో ఒక ప్రతిపాదన బయటపెట్టారు. కేంద్రం, హిందూ ప్రాబల్యం కలిగిన రాష్ట్రాల గ్రూపు, ముస్లిం ప్రాబల్యం కలిగిన రాష్ట్రాల గ్రూపులుగా ఏర్పాటుచేస్తారు. అధికారాలు కేంద్రం, గ్రూపులు, రాష్ట్రాలకు నడుమ విభజితమై ఉంటాయి. కేంద్రం చేతిలో చాలా పరిమితమైన, బలహీనమైన అధికారాలు ఉంటాయి. సిమ్లాలో ఈ అంశంపై జరిగిన చర్చల్లో జిన్నా కేంద్రానికి ఒప్పుకుంటే, నెహ్రూ గ్రూపులకు ఆమోదం చెప్పాడు. సమాఖ్యలో యూనిట్లు శాశ్వతంగా ఉండిపోయేలా తాము నిర్బంధించమని నెహ్రూ అంగీకరించాడు.[157] అయితే యూనియన్ స్థాయిలో శాసన సభ ఉండరాదన్న జిన్నా ప్రతిపాదనకు నెహ్రూ, గ్రూపింగుల విషయంలో రాష్ట్రాలు వాటికవే నిర్ధారించుకోవాలన్న నెహ్రూ ప్రతిపాదన మీద జిన్నా ఒకరినొకరు వ్యతిరేకించుకున్నారు. అయితే స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులుగా తానూ, నెహ్రూ సమస్కంధులమని విడిగా సామరస్యపూర్వకంగా చర్చించుకుంటామని జిన్నా క్యాబినెట్ మిషన్ తో అన్నాడు. ఇలాంటి సమయంలో మే 8న క్యాబినెట్ మిషన్ ముస్లిం, హిందూ మెజారిటీ రాష్ట్రాల నుంచి దామాషా ఉండేలా రాజ్యాంగ సభ కొలువుతీరుతుందని, రాష్ట్రాలు "గ్రూపింగులుగా ఏర్పడితే ఏర్పడవచ్చు" అని అంతకుముందులా కాక గ్రూపింగు ప్రతిపాదనను బలహీనం చేస్తూ చేసిన ప్రతిపాదన కాంగ్రెస్ ను సంతోషపరిచి, లీగును భగ్గుమనేలా చేసింది.[158] గ్రూపింగులన్నీ ఐచ్ఛికమైనవే కావాలనీ, ఈ అంశం రాజ్యాంగ సభే నిర్ణయించాలనీ, లీగ్ అనుకూలించకపోతే కాంగ్రెసుతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడాలని కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేసింది. వివాదాస్పదమైన అంశాలను భారతీయులో, ఆంగ్లేయులో కాని మధ్యవర్తులకు నివేదించాలంటూ జవాహర్లాల్ సూచించాడు. ముందు ఆలోచించుకుంటానన్న జిన్నా, తర్వాత కాంగ్రెస్ వారు మధ్యవర్తులుగా ఉండదగ్గవారి పేర్లను సూచించగానే అసలు మధ్యవర్తిత్వాన్నే అంగీకరించేది లేదన్నాడు. దాంతో ఇరుపక్షాలూ తమ బిర్రబిగిసిన వైఖరులకు తిరిగిపోయాయి.[159]

క్యాబినెట్ మిషన్ మధ్యేమార్గంగా ఒక రాజీ ప్రతిపాదన చేసింది. ఇందులో కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండేలా కొన్ని అంశాలు, లీగ్ కి నచ్చే విధమైన మరికొన్ని అంశాలు చేర్చారు. ఈ క్రమంలో గ్రూపింగులు ఐచ్ఛికమైనవని ఒక క్లాజు చెప్తున్నప్పటికీ, మరో క్లాజు దాన్ని నిర్బంధం చేస్తున్న సంగతి ముందుగా కాంగ్రెస్ కు తెలియదు, అయితే మంత్రిమండలి సభ్యులు దీన్ని ముస్లింలీగ్ కు వివరించారు. నిర్బంధ గ్రూపింగ్ విధానం ఉన్నందున మిషన్ పథకాన్ని అంగీకరిస్తున్నామని 1946 జూన్ 6 తేదీన ముస్లింలీగ్ అంగీకరిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఆజాద్ కు గ్రూపింగ్ నిర్బంధం కాదనీ, అసలు గ్రూపింగ్ ఏర్పాటుకావాలా వద్దా, అయితే ఎందులో చేరాలన్నది సెక్షన్లుగా ఏర్పడే రాజ్యాంగసభలో సమావేశమయ్యే రాష్ట్రాల ప్రతినిధులే నిర్ణయిస్తారని చెప్పి వేవెల్ ఒప్పించాడు. కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరడాన్ని నిరాకరిస్తూ, తనకు తెలిసిన వ్యాఖ్యానాన్ని బట్టి దీర్ఘకాలిక ప్రతిపాదనలకు అంగీకారం ఉందని, రాజ్యాంగ సభలో మాత్రం చేరింది.[160] క్యాబినెట్ మిషన్ పథకాన్ని రెండు పక్షాలూ ఆమోదించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, మిగిలిన సంప్రదింపుల పనిని వైశ్రాయికి వదిలివేసి జూన్ 29న ఇంగ్లండు వెళ్ళిపోయారు.

 
1946లో బొంబాయిలోని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో నెహ్రూ, గాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్

అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి వైశ్రాయ్ ప్రభుత్వం ఏర్పాటుచేయమని ఆహ్వానిస్తాడు. కాబట్టి 1946లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు కీలకమైనవి. అవి జరిగినప్పుడు మొత్తం 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల్లో 12 కమిటీల వల్లభ్ భాయ్ పటేల్ ని అభ్యర్థిగా ప్రతిపాదించాయి. అయితే గాంధీ మాత్రం నెహ్రూ అధ్యక్షత వహించడానికి అనుకూలంగా నిర్ణయించాడు. దాంతో కొందరు వర్కింగ్ కమిటీ సభ్యులు నెహ్రూ పేరును ప్రతిపాదించారు. అలానే నెహ్రూకు అనుకూలంగా తప్పుకొమ్మని పటేల్ ని ఒప్పించారు. నెహ్రూ తప్పుకునేందుకు ఒక వీలిచ్చే ఉద్దేశంతో పటేల్ తప్పుకుంటున్నట్టు సంతకం పెట్టే ముందు గాంధీ "పటేల్ పేరును 12 కమిటీలు ప్రతిపాదించాయి. మీ పేరును ఒక్కటీ ప్రతిపాదించలేద"ని నెహ్రూను ఉద్దేశించి అన్నాడు. సమాధానమివ్వకుండా నెహ్రూ మౌనం వహించాడు. నిర్ణయం తీసుకున్న గాంధీ ఇక పటేల్ చేత సంతకం పెట్టించాడు. అలా నెహ్రూ మూడోమారు కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.

1946 జూలై 7న నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలోనూ, ఆ తర్వాత విలేఖరులతో ఇష్టాగోష్ఠిలోనూ "రాజ్యాంగ పరిషత్తులో చేరడానికి మేం నిర్ణయించాం. అంతకుమించి క్యాబినెట్ మిషన్ వారి ప్రతిపాదనల్లో మరేవీ అంగీకరించలేద"ని ప్రకటించడం సంచలనం అయింది. ఒక బహిరంగ సమావేశంలో తిరిగి జూలై 10న దీన్నే పునరుద్ఘాటించాడు. దీని ప్రకారం రాజ్యాంగ సభ సర్వోన్నతమైన అధికారం కలిగివుంటుంది. [నోట్స్ 7] ఈ రెచ్చగొట్టే ప్రకటన తర్వాత జిన్నా క్యాబినెట్ మిషన్ కు ఇచ్చిన ఆమోదాన్ని వారాల వ్యవధిలో ఉపసంహరించుకున్నాడు.[నోట్స్ 8]

తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, వేవెల్ నిష్క్రమణ

జిన్నా జూలై చివర్లో కేబినెట్ మిషన్ పథకాన్ని తిరస్కరించాకా, బ్రిటీష్ ప్రభుత్వ వైఖరిని అనుసరిస్తూ వేవెల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన జవాహర్లాల్ ను ప్రభుత్వం ఏర్పాటుచేయమని కోరాడు.[161] లండన్ నుంచి తమకు లభిస్తున్న మద్దతును వినియోగించుకుని జవాహర్లాల్ వైస్రాయ్ వేవెల్ తో గట్టిగా వ్యవహరించసాగాడు. అయిదుగురు సవర్ణ హిందువులు, అయిదుగురు ముస్లిములు, షెడ్యూల్డ్ కులస్తులు ఒకరు, మరో నలుగురు మిగతా అల్పసంఖ్యాకవర్గం వారూ అన్న దామాషా మీద ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ఈ ఐదుగురు ముస్లింలలో నాలుగు స్థానాలు లీగుకు వదిలి, ఒకటి జాతీయవాద ముస్లిం ఒకరికి ఇస్తున్నారు.[162] సంప్రదింపుల ప్రక్రియలో తాను అనుభవిస్తున్న వీటో అధికారాన్ని, బ్రిటీష్ వారి పాక్షికతను కోల్పోయిన సంగతి, దాన్ని అర్థం చేసుకుని స్వతంత్రించి ముందుకు వెళ్తున్న నెహ్రూ చర్యల పూర్వాపరాలను అర్థం చేసుకున్న జిన్నా ప్రక్రియ మీద హింస ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహంలోకి దిగాడు. ఆగస్టు 16 తేదీన ప్రత్యక్ష కార్యాచరణ దినం కోసం పిలుపునిచ్చిన జిన్నా వేలాదిమంది హిందూ-ముస్లింల ప్రాణాలు బలిగొని ఉపఖండంలో హింసను రాజేశాడు.

 
1946లో ప్రమాణ స్వీకారం తర్వాత తాత్కాలిక ప్రభుత్వ సభ్యులు; కుడి నుంచి రెండో వ్యక్తి జవాహర్‌లాల్ నెహ్రూ
 
1946లో వాయవ్య సరిహద్దు ప్రావిన్సులో పర్యటిస్తున్న జవాహర్లాల్ నెహ్రూతో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్

ఈలోగా నెహ్రూ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలికి ఉపాధ్యక్షునిగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. భారతదేశానికి, ఆఫ్ఘనిస్తాన్ కీ సరిహద్దుల్లో 97 శాతం మంది ముస్లింలు, అత్యధికంగా పఖ్తూన్ జాతీయులైన గిరిజన ముస్లింలే ఉన్న వాయవ్య సరిహద్దు ప్రావిన్సు మొత్తం ఉపఖండంలోని ముస్లింలందరికీ ఏకైక ప్రతినిధిగా నిలవడంలో జిన్నాకు, అలాంటి హోదా అతనికి ఇవ్వడంలో వేవెల్, అతని ప్రభుత్వానికి అడ్డంకిగా నిలిచింది. 1946లో జరిగిన ఎన్నికల్లో దాదాపు అరవై శాతం ఓట్లు సంపాదించి కాంగ్రెస్ వారైన ఖాన్ సోదరులు గెలిచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంపై పట్టు పెరగనివ్వకూడదని, వీలైతే దెబ్బతీయాలని ప్రయత్నంలో ఉన్న రాష్ట్ర గవర్నరు గిరిజన శాఖను చూస్తున్న నెహ్రూ స్వయంగా వెళ్ళి ప్రభుత్వంలో లీగ్ చేరేవరకూ వాయవ్య సరిహద్దు ప్రావిన్సును సందర్శించబోగా వద్దని ఢిల్లీకి వచ్చి మరీ నచ్చచెప్పాడు.[163] ఆ మాటలు పక్కనపెట్టి జవాహర్లాల్ తన పర్యటన సాగించగా ముస్లిం లీగ్ వ్యతిరేక ప్రదర్శనలు చేసి, రాళ్ళు విసిరారు. బ్రతికి బయటపడడం గొప్ప విషయంగానే ఎంచాలి. అయినా ధైర్యంగా తన సందర్శన పూర్తిచేసుకున్నాడు. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అధికారులు విజయవంతంగా బలహీనపరిచారు.[164]

వేవెల్ లండన్లో మంత్రివర్గం మద్దతు సంపాదించి ప్రభుత్వంలోకి ముస్లిం లీగ్ ను తీసుకురావడానికి జిన్నాతో సంప్రదింపులు మొదలుపెట్టి, అంతవరకూ రాజ్యాంగ పరిషత్తును సమావేశపరచకుండా నిలిపివేశాడు. ప్రతిష్టంభన, అల్లర్లు నిలిపివేయడానికి లీగ్ ప్రభుత్వంలో చేరడం వీలిస్తుందన్న ఆలోచనతో నెహ్రూ స్వయంగా జిన్నాను కలిసి అతనికీ ఆమోదయోగ్యమైన కొన్ని సూచనలు చేశాడు.[165] అయితే జాతీయవాది అయిన ముస్లింను కాంగ్రెస్ మంత్రివర్గంలో నామినేట్ చేయకపోతే చేరతానన్న అంశం మీదే జిన్నా పట్టుబట్టాడు. కానీ నెహ్రూ వ్యక్తిగతంగానూ, సంస్థాగతంగానూ అత్యంత కీలకమైన ఈ అంశంపై వెనక్కి తగ్గలేదు. తుదకు వేవెల్ షెడ్యూల్డ్ కులాలతో సహా ఐదుగురు వ్యక్తులను వైస్రాయ్ కౌన్సిల్ కి నామినేట్ చేసే అధికారాన్ని ఇస్తూ జిన్నాను ప్రభుత్వంలో చేరడానికి వేవెల్ ఒప్పించాడు. ఇందుకు ప్రతిగా వేవెల్ కేబినెట్ మిషన్ పథకానికి ఆమోదం కానీ, మత హింసను రాజకీయ సాధనంగా మలిచిన ప్రత్యక్ష చర్య విధానాన్ని విడనాడతానన్న హామీ కానీ, కనీసం తాము చేరబోయే ప్రభుత్వానికి సహకారం ఇస్తానన్న పూచీ కానీ జిన్నాను అడిగి తీసుకోలేదు. దీనిపై జవాహర్లాల్ ఎన్నోమార్లు నిరసన తెలిపినా, మరెంతగా వ్యతిరేకించినా వేవెల్ లక్ష్యపెట్టలేదు.[166]

దీనికి ఫలితం వెంటనే కనిపించింది. తాత్కాలిక ప్రభుత్వానికి లీగ్ నామినేట్ చేసిన సభ్యుల్లో ఒక్క లియాఖత్ అలీ ఖాన్ మినహా మిగతా వారెవరూ ఆ స్థాయికి చెందినవారు కారు.[167] పైగా తాత్కాలిక ప్రభుత్వంలోని ఇరుపక్షాల సభ్యులు సహచరుల్లా కాక ప్రతీ అంశంలోనూ ఒకరికొకరు ప్రత్యర్థుల్లా చర్చంచుకునేలా, తాను మధ్యవర్తిగా వ్యవహరించేలా వేవెల్ పనితీరు సాగింది. బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్న హత్యాకాండకు ప్రతిగా బీహార్లో హిందూ రైతులు ముస్లింలపై దాడులు, హత్యాకాండ సాగించడం ప్రారంభమైంది.[168] వైస్రాయ్, జవాహర్లాల్, జిన్నాలు ముగ్గురూ దీన్ని ఆపాల్సిందేనని భావించినా ప్రభుత్వానికి చర్య తీసుకోగల సమర్థత, తీసుకున్న దాఖలా ఏమీ లేదు. జవాహర్లాల్, మరొక ముస్లింలీగ్ మంత్రిని వెంటపెట్టుకుని పర్యటించి, ఈ అంశంపై వ్యక్తిగత స్థాయిలో శ్రద్ధ తీసుకుని శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురాగలిగాడు. రాజ్యాంగ పరిషత్తు విషయమై దీర్ఘకాలిక ప్రణాళికను లీగ్ ఇంకా ఆమోదించలేదు కనుక సమావేశపరచనని వేవెల్ తేల్చాడు.[169] ఆట్లీ ప్రభుత్వం నేరుగా జోక్యం కలిగించుకుని లండన్లో ఏర్పాటుచేసిన చర్చల్లో లీగ్, అక్కడి ప్రభుత్వం కలిసి కాంగ్రెస్ తతన వ్యాఖ్యానాన్ని విడిచిపెట్టి, లీగ్ వ్యాఖ్యానాన్నే స్వీకరించాలని ఒత్తిడి చేశారు. చివరకు అలా రాజ్యాంగ సభ డిసెంబరు 9 నాటికి కొలువు తీరింది. జిన్నాకు రాజ్యాంగ సభలో చేరకుండేందుకు కారణం ఉండకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ తన వ్యాఖ్యాన్ని విడిచిపెట్టింది. అయినా రాజ్యాంగ సభను కానీ, ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగానూ జిన్నా పనిచేయనివ్వలేదు.[170] మతకలహాలు ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించడం, జిన్నా చూపించిన బాటలోనే సంస్థానాధీశులు కూడా పయనిస్తూండడం, తాత్కాలిక ప్రభుత్వం ఏ ప్రభావం చూలేకపోవడం వంటి నిరాశామయమైన స్థితిగతుల మధ్య ముస్లిం లీగ్ కు చెందిన ఐదుగురు సభ్యులు తప్ప మిగిలిన వైస్రాయ్ కార్యనిర్వాహకవర్గం అంతా 1947 ఫిబ్రవరి 5న రాజీనామా చేశారు.[171] భారతదేశంలో పునరుద్ధరణకు సాధ్యంకాని రీతిలో పరిపాలన దెబ్బతిందని వేవెల్ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని ఆట్లీ అతన్నే తొలగించి, వైస్రాయ్ గా మౌంట్ బాటన్ ను నియమించాడు. ఫిబ్రవరి 20వ తేదీన బ్రిటీష్ పార్లమెంటులో భారతదేశంలో అధికార బదిలీ పూర్తికావడానికి గడువుగా 1948 జూన్ 30 తేదీని నిర్ణయించినట్టు ప్రకటించాడు.[172]

భారత విభజన, ప్రధానమంత్రిత్వం

ఆట్లీ ప్రకటన అనంతరం "[భారతదేశ రాజకీయ] చిత్రం నుంచి బ్రిటీష్ వారు క్రమేపీ కనుమరుగవుతున్నారు, నిర్ణయం తీసుకోవాల్సిన భారం మన మీదే ఉంది. కాబట్టి మనం సమస్యను సూటిగా ఎదుర్కోవాలని, ఒకరితో ఒకరు దూరాన్నుంచి మాట్లాడుకునే పద్ధతి మానుకుందామని" లియాఖత్ అలీ ఖాన్‌కు నెహ్రూ విజ్ఞప్తి చేశాడు. అధికార బదిలీ తేదీని ప్రకటన వెలువడ్డాకా పాకిస్తాన్ వాస్తవరూపం దాల్చుతుందని మరెన్నడూ లేనంత నమ్మకం ఏర్పడ్డ జిన్నా సాధ్యమైనంత అధికారాన్ని సాధించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ క్రమంలో హింసాత్మకమవుతున్న పంజాబ్ ప్రావిన్సులో సహాయ నిరాకరణను ప్రారంభించి, కాంగ్రెస్-అకాలీదళ్ ప్రభుత్వం పతనం చేశాడు.[172] ఈ దశలో దేశాన్ని విభజించకుండా బ్రిటీష్ ప్రయోజనాలకు భంగం కాని రీతిలో అధికార బదిలీ చేసేందుకు వచ్చిన మౌంట్ బాటన్ అప్పటికే దెబ్బతినిపోయిన క్యాబినెట్ పథకానికి జీవం పోసే ప్రయత్నాలు సాగించాడు. ఒక పౌరయుద్ధం స్థాయిలో సాగుతున్న మతకల్లోలాలు, దాని ఆధారంగా తన సిద్ధాంతాన్ని, స్థానాన్ని బలపరుచుకుంటూ తాత్సారం సాగిస్తున్న జిన్నా వైఖరి, వీటి మధ్య దెబ్బతింటూన్న బ్రిటీష్ ఆసక్తులు కలిసి మౌంట్ బాటన్‌కు పాకిస్తాన్ ఏర్పాటును అనివార్యమని భావించేలా చేశాయి. బ్రిటన్ ఆసక్తులకు భంగం కాని ఒక దేశానికి అధికార బదిలీ బదులు, బ్రిటన్‌తో సఖ్యంగా ఉంటూ కామన్వెల్త్‌లో కొనసాగే రెండు దేశాలను సృజించినా ఫర్వాలేదన్న అవగాహనకు వచ్చాడు. ఆ క్రమంలో పలు రకాలైన ప్రతిపాదనలు చేయసాగాడు. ఇక ఈ సంప్రదింపుల ఆటలో జవాహర్‌లాల్ పాల్గొనకుండా కేవలం ప్రేక్షకునిలా చూస్తూ ఊరుకున్నాడు.[173] జవాహర్ తనకెంతో ఆసక్తిదాయకమైన కార్యరంగం: ఆసియా వ్యవహారాల మహాసభ నిర్వహణలో పనిచేశాడు. 1946 మార్చి 23 నుంచి ఏప్రిల్ 2 వరకూ ఈజిప్టును కూడా కలుపుకుని ఆసిా దేశాల అభిప్రాయాలన్నిటికీ ప్రాతినిధ్యం వహించేలాంటి ప్రతినిధులతో కొత్త ఢిల్లీలో ఈ మహాసభ జరిగింది. 1945 డిసెంబరు నుంచే అలాంటి మహాసభ జరపాలన్న ఆలోచనతో ఉన్న జవాహర్‌లాల్ నెహ్రూ ఇందుకోసం 1946 సెప్టెంబరు నుంచి పనిచేస్తూ వచ్చాడు.

ఈ మహాసభ పూర్తయ్యాకా కూడా రాజ్యాంగ సంబంధమైన చర్చల్లో జవాహర్‌లాల్ క్రియాశీలకంగా పాల్గొనలేదు.[174] వాయవ్య సరిహద్దు ప్రావిన్సులో అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఉండగా (ఇక్కడ 97 శాతం మంది గిరిజనులైన ముస్లింలు), దాన్ని రద్దుచేసి గవర్నరు పాలన ఏర్పరచకుండా, మరో ఎన్నికలకు వెళ్ళకుండా నేరుగా భారత, పాకిస్తాన్‌లలో దేన్ని ఎంచుకుంటారన్న అంశంపై తన నిర్వహణలో జనాభిప్రాయ సేకరణకు చేద్దామని, అందుకు ప్రావిన్సు ప్రధాని డాక్టర్ ఖాన్ సాహెబ్‌ను ఒప్పించమని మేలో మౌంట్ బాటన్ జవాహర్‌లాల్‌కు రాశాడు. ఈ అంశంపై వర్కింగ్ కమిటీ నిర్ణయం లేకుండా ఏమీ తేల్చలేనని, అంతిమ నిర్ణయాలు తీసుకునేముందు ప్రజల అభిప్రాయం తీసుకోవడానికి, అందుకు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి ఉండాలన్నదానికి మాత్రమే సూత్రప్రాయంగా ఆమోదించాడు.[175] మే నెల చివరిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో జరిగిన వాడివేడి చర్చల్లో సుదీర్ఘ ఉద్యమ సహచరుడు, పఖ్తూన్ల నాయకుడు అయిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని వాయవ్య సరిహద్దు ప్రావిన్సును భారతదేశంలో కలిపేందుకు వైస్రాయ్‌కి ప్రతిపాదన పంపమనీ, అలా చేయలేని పక్షంలో కనీసం పాకిస్తాన్, స్వతంత్ర పఖ్తూన్ దేశాల మధ్య జనాభిప్రాయ సేకరణ కోసమైనా అడగమని కోరాడు. ఇవే ప్రాతిపదికలు మొత్తం భారతదేశానికి వర్తింపజేసే సంభావ్యతకు భయపడి, నెహ్రూ, పటేల్ ఇందుకు సమ్మతించలేదు.[176][177][178] చివరకు జనాభిప్రాయ సేకరణే ఖాయమై, ఖాన్ సోదరులు దాన్ని బహిష్కరించడంతో పాకిస్తాన్‌లో చేరడానికి అనుకూలంగా ఓటు పడి వాయవ్య సరిహద్దు ప్రావిన్సు తుదకు పాకిస్తాన్ పరమైంది.

రాజకీయ సిద్ధాంతాలు

"జవాహర్‌లాల్ ఎల్లప్పుడూ కూడా యూరపీయ సంప్రదాయ తీవ్రవాది. తీవ్రవాద సిద్ధాంతాన్ని తన దేశానికి వర్తింపజేయ చూస్తూ, దానిని తన దేశపరిస్థితికి తగినట్లు అనుకూలంగా మలచుకుంటూపోయే తీవ్రవాది. ఇది ఆయన బలమూ, బలహీనతా కూడా కావచ్చు" అన్నాడు ఎస్. గోపాల్.[179]

జవాహర్‌లాల్ తొలి నుంచీ లౌకిక వాది. దానికి బీజాలు బాల్యంలోనూ, ముస్లింలతో సాధారణంగా కాశ్మీరీ పండిట్లు చూపే ఏకీభావంలోనూ లోతుగా ఉన్నాయి. మతసమస్యను జవాహర్‌లాల్ ఏనాడూ విలువనిచ్చి చర్చించదగ్గ విషయంగా భావించలేదు. అందుకు ప్రతిగా మతకలహాలు కేవలం ఊహాత్మకమైన విషయాలపై ఆధారపడ్డవని తిరస్కరించేవాడు. ఇందుకు జవాహర్ దృష్టిలో ఉన్న పరిష్కారం మతమనే దాన్ని దుర్బలపరిచి అదుపులో పెట్టడం, రాజకీయాల్లో లౌకిక భావనలు వ్యాప్తిచేయడం. ఈ అభిప్రాయాలు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మతకలహాలను ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రతీసారీ దృఢపడుతూనే వచ్చింది. ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు అనే మూడిటి పట్టు నుంచి భారతదేశాన్ని విముక్తం చేయాలని అభిప్రాయపడేవాడు. మత హింసపై ఇస్లాంకి నమ్మకం లేదనీ, గజినీ వంటివారు కేవలం దోపిడీ కోసమే ఆలయాల మీద పడ్డారు తప్ప దానిలో ఇస్లాం ప్రమేయం లేదని వాదించేవాడు.[180] 1933లో హిందూ మత తత్వంపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన జవాహర్‌లాల్ ఇస్లాం మత తత్వాన్ని మాత్రం కొంత మృదువైన ధోరణిలో ఖండించాడు. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండడం, మైనారిటీలు కావడం వల్ల వారి భయాలు అర్థం చేసుకోవాలని నమ్మేవాడు. నిష్కపటమైన మతతత్వం భయం వల్ల, బూటకపు మతతత్వం రాజకీయ ప్రతీపవాదమనీ వర్గీకరించేవాడు.[104] జవాహర్ జీవితచరిత్రకారుడు ఎస్.గోపాల్ ఈ అంశాన్ని "ఈ సమస్యను జవాహర్‌లాల్ జాగ్రత్తగా పరిశీలించనిమాట నిజమే... హిందూ ముస్లిం మతతత్వాల మధ్య ఒక దానిని మనం మంచిదని ఎంపిక చేసుకోవచ్చునని చెప్పడం అనేక ప్రమాదకరమైన సంభావ్యతలకు చోటిచ్చే అవాంఛనీయ విషయం" అని వ్యాఖ్యానించాడు.[105]

ఐరోపా పర్యటన (1926-1928)కు ముందు జవాహర్‌లాల్ రాజకీయ పరమైన అంశాలను ఆర్థికపరమైన విషయాలతో ఏ సంబంధం లేని శుద్ధ రాజకీయాలుగా చూసేవాడు. 1929-30 నాటికి జవాహర్‌లాల్ రాజకీయ భావజాలంలో ఆర్థికాంశాలు విడదీయరాని అంశాలుగా ముడిపడిపోయాయి. ఈ దశలోనే అతనికి సోషలిజంపై తీవ్ర అభిమానం ఏర్పడింది. వ్యవసాయ భూములను చిన్న చిన్న కమతాలుగా ఏర్పరిచి జమీందారీ రద్దుచేసి, ఒక్కో రైతుకు ఒక్కో కమతాన్ని ఇవ్వాలని, భూములు కమ్యూనిస్టు దేశాల్లోలాగా జాతీయీకరించకూడదు కానీ ఆ కమతాలను రైతు అమ్మే వీలు ఉండకూడదనీ, వ్యావసాయిక ఋణాలను కొంత చెల్లించాకా మాఫీ చేయాలని భావించేవాడు. కీలకమైన పరిశ్రమల జాతీయీకరణ గురించి 1929లోనే ఆలోచించాడు.

1928 నుంచి అహింసను మౌలిక సిద్ధాంతంగా కాక స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పద్ధతిగా మాత్రమే స్వీకరించాడు. ప్రధానంగా సోషలిజం సాధించే క్రమంలో వివిధ వర్గాల ప్రయోజనల వల్ల పుట్టే ఘర్షణను అహింసా సిద్ధాంతం పేరుతో నిరాకరించరాదనీ, అవసరమైతే పోరాడి సాధించుకోవచ్చనీ భావించేవాడు. తీవ్రమైన అహింసాత్మక సహాయ నిరాకరణాన్ని స్వీకరించింది భారతదేశ పరిస్థితుల రీత్యా దౌర్జన్యకరమైన పద్ధతులు అనుసరించడం చివరకు విప్లవ ప్రతీఘాతమైన ఫలితాలు లభిస్తాయన్న కారణంతోనే. లాహోర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో ఉండి భారతదేశం తన లక్ష్యాలను చేరుకోవడానికి హింసాత్మక విధానాలు అవలంబించడం సరైనదైతే అవలంబించవచ్చనీ, కానీ కాంగ్రెస్ ప్రస్తుత స్థితిలో వ్యవస్థీకృతమైన హింస చేపట్టలేదని, ఆ కారణంగా అహింసాత్మక శాసనోల్లంఘన చేపట్టాలని పేర్కొన్నాడు.

సామ్యవాదం అన్న ఆర్థిక ప్రణాళిక జవాహర్‌ను 1928 తర్వాత ఎప్పుడూ ఉత్తేజితం చేస్తూనే ఉండేది. 1930ల తొలినాళ్ళలో జమీందారీలను స్వాధీన పరుచుకోవడం, వ్యవసాయం చేస్తున్న రైతులను భూమికి స్వంతదారులను చేయడం, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను ప్రభుత్వం నిర్వహిస్తూ రైతులను వాటిలో ప్రయోగాలు చేయమని ప్రోత్సహించడం వంటి ఆలోచనలు చేశాడు.[181] ఆ క్రమంలో పన్నులు ఎలా ఉండాలన్న వరకు అతని ఆలోచనలు సాగాయి. కానీ వీటన్నిటినీ సుదూర భవిష్యత్తులో అమలులోకి తేగలిగినవిగా భావించాడు. రాజకీయ కారణాల దృష్ట్యా వీటికై వెనువెంటనే ప్రయత్నాలు ప్రారంభించి జమీందార్లను, పెట్టుబడిదార్లను కాంగ్రెస్ శత్రువులను చేసుకోవడం అవివేకమనీ అతని భావన. పైగా పేద, మధ్య తరహా రైతులకూ, జమీందార్లు, పెట్టుబడిదార్లకు మధ్య వర్గ సంఘర్షణ పోరాట రూపం తీసుకోకుండా కాంగ్రెస్ పనిచేస్తోందని, అది మంచికేననీ నమ్మాడు.[182] 1933 నాటికి ప్రపంచశక్తుల అల్లికలో భాగంగా భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. సార్వత్రికంగా ఒక ఊపు కనిపిస్తోందని, ప్రపంచం అటు నిర్దుష్టమైన సోవియట్ పద్ధతిలోనిది కాని సామ్యవాదాన్ని కానీ, ఇటు ఫాసిజాన్ని కానీ - ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని భావించాడు. జవాహర్‌లాల్ మొగ్గు సామ్యవాదం వైపు ఉండేది.[100] జాతీయవాదులు రాజకీయంగా స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూనే ఆర్థికంగా జమీందార్లు, సంస్థానాధీశులు, పెట్టుబడిదారులను తమ పూర్వ స్థితిలో ఉండనిస్తే, అది స్వాతంత్ర్యం కాదని భావించేవాడు. కానీ బ్రిటీష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం సాధించకుండా ఆర్థిక దుస్థితిని మార్చే ప్రయత్నాలు చేయడమంటే శక్తిని వృధా చేయడం కాబట్టి ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాల్లో తనకు అంతగా పొసగకున్నా, గాంధీ సమర్థత మీద విశ్వాసం ఉంచి అతన్నే బలపరుస్తూ వచ్చాడు.[102]

జవాహర్‌లాల్ అతి సున్నిత హృదయుడైన ఆసియాఖండ జాతీయవాది అని ఎస్.గోపాల్ భావించాడు. అయితే జాతీయవాదం వల్ల వచ్చే చెడు ప్రభావాలను కూడా అతను అర్థం చేసుకునే ఉన్నాడు. ప్రపంచ శక్తుల పరస్పర క్రియ అయిన చరిత్ర గతిలో ఏ అంశాన్నీ ఏ ఒక్క వ్యక్తికో, జాతికో ముడిపెట్టలేమని జవాహర్ విశ్వసించాడు. కాబట్టే సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూనే బ్రిటీష్ వారిని ద్వేషించలేదు.[183] అంతర్జాతీయ వ్యవహారాలు నెహ్రూ 1926-1928ల్లో ఐరోపా వెళ్ళిన నాటి నుంచీ ప్రత్యేక శ్రద్ధతో అవగాహన చేసుకుంటూనే ఉన్నాడు. 1931-1933 నడుమ జైలులో ఏడాదిన్నర కాలం గడిపినప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలను విపులంగా అధ్యయనం చేశాడు.[100]

వ్యక్తిత్వం, స్వభావం

[స్వభావరీత్యా] నేనేమీ రాజకీయాల మనిషిని కాను. కాకుంటే రాజకీయాలు నన్ను చుట్టుముట్టి, వాటి బాధితుణ్ణి చేశాయి

— జవాహర్‌లాల్ నెహ్రూ.[184]

గాంధీతో అనుబంధం

1931లో యునైటెడ్ ప్రావిన్సుల్లో జవాహర్ రైతు సమస్యలు పరిశీలిస్తున్నప్పుడు గాంధీ ఆ ఆందోళనను పలచబడేలా చేశాడు. గాంధీ పట్ల తనకున్న భక్తి విశ్వాసాల వల్ల యుపి రైతుల సమస్యను అతను బలహీనపరుస్తున్నాడని కనీసం లోపల్లోపల కూడా నెహ్రూ అనుకోలేదు.[185] విచిత్రమైన దేశంలో దారితప్పిపోయిన తనకు సుపరిచితుడైన స్థానంలో కేవలం గాంధీయే ఉన్నాడని జవాహర్‌లాల్ భావించేవాడు. గాంధీ నిరాహారదీక్షలకు దిగినప్పుడల్లా తన జీవితంలో ఉన్న ముఖ్యమైన ఆధారం కోల్పోయేవాడిలా తల్లడిల్లేవాడు. గాంధీ కూడా జవాహర్‌లాల్ ఇటువంటి మన:స్థితిలో ఉంటాడని అర్థం చేసుకుని హృదయాన్ని ఊరిడించి, హత్తుకునే లేఖలు రాసేవాడు.[186] అయితే 1933కల్లా గాంధీకి, తనకు ఉన్న సైద్ధాంతిక విభేదాలు అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. పునరుద్ధరణవాదం ప్రధానంగా ఉన్న గాంధీ వైఖరికీ, విప్లవం కేంద్రంగా ఉన్న తన వైఖరికీ చాలా భేదముంది.[99]

రచయిత, చరిత్రకారుడు

జవాహర్‌లాల్ తన కుమార్తె ఇందిరకు రాసిన ఉత్తరాల్లో ప్రపంచ చరిత్రను వ్రాస్తూ పోయాడు. ఒక ప్రణాళికను అనుసరించి వ్రాసిన ఆ ఉత్తరాలే క్రమేపీ "గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ" గ్రంథంగా తయారయ్యాయి. 1928లో ఇందిర ముస్సోరీలోనూ, తాను దూరంగా భారత జాతీయోద్యమ కార్యకలాపాల్లోనూ ఉండగా భూమి ఎలా పుట్టింది అన్నదాని నుంచి మొదలుపెట్టి క్రమేపీ 1930 నాటికి వర్గాల ఏర్పాటు, వ్యవస్థీకృతమైన మతం ఏర్పాటు, భారతదేశానికి ఆర్యుల రాక వంటివి సంక్షిప్తంగా రాశాడు.[84] తర్వాత 1930లో రెండవ సారి అరెస్టు చేసినప్పుడు సహాయంగా ఆకర గ్రంథాలు లేకపోయినా జ్ఞాపకశక్తి మీద ఆధారపడి మొహంజదారో, ప్రాచీన గ్రీసు నుంచి తన సమకాలం వరకూ పలు అంశాలపై ఉత్తరాలు రాశాడు. 1931లో తిరిగి అరెస్టై సుదీర్ఘకాలాన్ని బారకాసుల వెనుక గడపాల్సివచ్చినప్పుడు కుమార్తెకు ఉత్తరాలు రాయడం మళ్ళీ కొనసాగించాడు.

ఒక్కో ఉత్తరంలో ఒక్కో అంశమో, విశేషమో తీసుకుని రాసేవాడు. ఆ అంశంపై తన భావాలు తెల్లకాగితంపై పెట్టడం, వాటిని 14 సంవత్సరాల బాలికకు అర్థమయ్యేంత తేటతెల్లమైన శైలిలో రాశాడు. విడివిడి లేఖలుగా రాసిన పుస్తకంలో గ్రంథవిషయమైన ఏకత, పరిశోధనకు పుస్తకాలు కూడా లేకుండా యథార్థాంశాలపై ఉన్న పట్టు పరిశీలకులను విస్తుగొలిపాయి. జవాహర్‌లాల్ రాజకీయ సైద్ధాంతికత ఈ గ్రంథం రాసేనాటికే స్పష్టంగా ఉండడంతో ప్రపంచ చరిత్రలోని వివిధ అంశాల సంకలనంగా కాక విశిష్టమైన ఏకసూత్రతతో సమగ్రంగా తయారైంది. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ప్రపంచ చరిత్రను వివిధ వ్యక్తుల చరిత్రగానో, వివిధ సంఘటనల చరిత్రగానో కాక ప్రపంచ శక్తుల చరిత్రగా ఒకే కథను చెప్తూ సాగింది.[187]

డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని నెహ్రూ 1941లో జైలు జీవితంలో ప్రారంభించి, తిరిగి అహమ్మద్ నగర్ జైలులో ఉన్నప్పుడు 1943 ప్రాంతంలో పున: ప్రారంభించి పూర్తిచేశాడు. ఈ పుస్తకాన్ని గురించి నెహ్రూ జీవితచరిత్రకారుడు ఎస్.గోపాల్ రాస్తూ "విషయాలను తారుమారుగా చేర్చిన పెద్ద కలగలుపు వంటిదీ గ్రంథం." అని రాశాడు.[152] 1943 ప్రాంతంలో తన మనస్సులో అనుభవిస్తున్న వ్యాకులతే పుస్తకరచనలో ప్రతిబింబించిందని గోపాల్ భావించాడు. ఈ గ్రంథం ముఖ్యభాగం బ్రిటీష్ వారు రావడానికి ముందు భారతదేశాన్ని అవలోకించడంగా సాగింది.[188]

వ్యక్తిగత జీవితం

తన వివాహ నిర్ణయాన్ని పూర్తిగా తండ్రికి వదిలివేయడంతో, జవాహర్‌లాల్ నెహ్రూ వివాహాన్ని తండ్రి మోతీలాల్ మధ్యతరగతి కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కమలతో నిశ్చయించాడు. ఆమె ఆనాటి స్త్రీల విద్యాస్థితిగతుల వల్ల చిన్నతనంలో పాఠశాల విద్య కూడా చదవలేదు. కాపురానికి వచ్చిన కొత్తల్లో నెహ్రూ కుటుంబసభ్యులు కమలను తమకు జవాహర్‌కు మధ్య చొరబడ్డ అగంతకురాలిగా చూసేవారు. ఆ అణచివేత, ప్రతిఘటనకు తోడు జవాహర్‌కీ, ఆమెకీ మానసికంగా, అభిరుచుల పరంగా ఎంతో భేదం ఉండడంతో మొదటి సంవత్సరాల్లో వారిద్దరి దాంపత్యం సర్దుకుపోయే ధోరణిలో సాగింది. వారిద్దరికీ 1917 నవంబరులో తొలి సంతానంగా ఇందిర జన్మించింది. 1925లో వారికి ఒక నెలలునిండని మగశిశువు జన్మించి, పురిటిలోనే మరణించాడు. తర్వాత కమలకు మరో గర్భస్రావం జరిగింది. అలా ఇందిర ఆమెకు ఏకైక కుమార్తెగా మిగిలింది. కమలకు 1919లోనే క్షయవ్యాధి ఉన్నట్టు వైద్యులు కనుగొన్నారు. ఎన్ని విధాల చికిత్సలు చేయించినా, ఐరోపాలో కొన్నాళ్ళు ఉన్నా ఆ జబ్బు క్రమేపీ ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతిస్తూనే పోయింది కాని మెరుగుపడలేదు.[115] క్రమేపీ జవాహర్, కమలలు సన్నిహితమయ్యారు. కమల భర్త మార్గాన్ని అనుసరిస్తూ స్వాతంత్ర్య సమరంలో పాల్గొంది. 1931లో శాసనోల్లంఘన చేసి జైలుకు వెళ్ళింది. మరోవైపు రామకృష్ణ మిషన్ కార్యక్రమాలతో అనుబంధాన్ని పెంచుకుంది. స్వంతంగా విద్యను కూడా అభ్యసించింది. క్రమక్రమంగా జవాహర్‌కి భార్య పట్ల అనురాగం పెరుగుతూ వచ్చి, తుదకు ఆమెకు పూర్తిగా అంకితమైన భర్త అయ్యాడు.[189] 1934-35 కాలంలో ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కాలంలో, జవాహర్ జైలు శిక్ష అనుభవిస్తూ ఆమె గురించి చాలా కలతపడ్డాడు. 1935 చివరిలో ఆమెకు మెరుగుపడుతుందేమోనన్న ఉద్దేశంతో ఐరోపా తీసుకువెళ్ళారు. ఐతే ప్రయోజనం లేకపోయింది. 1936 ఫిబ్రవరి 28న కమల మరణించింది. ఆమె మరణానంతరం కొద్ది నెలలకు ప్రచురించిన తన ఆత్మకథను జవాహర్ కమలకే అంకితం ఇచ్చాడు.[190]

తన 36 ఏట భార్యను కోల్పోయిన జవాహర్ మరి జీవితంలో మరో వివాహాన్ని చేసుకోలేదు. అయితే అతనిని ఆకర్షించిన, తనకు ఆకర్షితులైన ఇతర మహిళలతో మాత్రం సంబంధాలు కలిగివుండేవాడు.[191]

విమర్శలు

రాజకీయ విమర్శలు

సుదీర్ఘ రాజకీయ జీవితం, అందులోనూ 18 సంవత్సరాల పాటు జాతీయ స్థాయిలో అధికారం సాగించిన వ్యక్తి కావడంతో నెహ్రూ రాజకీయ నిర్ణయాలు దేశాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేసే స్థాయిలోనివి. వాటిలో కొన్నిటిపై వివాదాలు, విమర్శలు ఉన్నాయి. 1937లో యునైటెడ్ ప్రావిన్సుల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసేప్పుడు ముస్లిం లీగ్‌తో సంప్రదింపులు జరిగాయి. ఏర్పాటుకాబోయే మంత్రివర్గంలో రెండు పదవులు ఇస్తే ముస్లిం లీగ్ కాంగ్రెస్‌తో సహకరించేందుకు సిద్ధమైందని, కానీ ఒకటే మంత్రి పదవిని ఇస్తానని నెహ్రూ మొరాయించడంతో తాను కుదుర్చుకు వచ్చిన ఒప్పందం నాశనమైందని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చాలా కాలం తర్వాత ఆరోపించాడు. అయితే ముస్లింలీగ్‌తో 1937లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు విషయమై జరిగిన చర్చల్లో ఆఖరుగా లీగ్ నాయకుడు ఖులీకజ్జమాన్ తనకూ, ఇస్మాయిల్ ఖాన్‌కీ మంత్రిపదవులు ఇచ్చేట్టయితే లీగ్ నుంచి ఎలాంటి షరతులకైనా ఆమోదం తెస్తానని ఆజాద్‌తో అన్నారు. కానీ ముస్లిం భూస్వాముల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న లీగ్‌తో పొత్తుపెట్టుకుని యుపిలో భూసంస్కరణలకు అడుగడుగునా అడ్డుపడే వీలు ఇవ్వడం నెహ్రూకు ఇష్టం లేదు. కాబట్టి కాంగ్రెస్ కార్యక్రమానికి అంగీకరించి, ముస్లింలీగ్ పార్లమెంటరీ బోర్డును రద్దుచేసి, తాము కాంగ్రెస్ సభ్యులై, ఎప్పుడు కాంగ్రెస్ నిర్ణయిస్తే అప్పుడు మంత్రివర్గానికి రాజీనామా చేస్తేనే ఈ ఒప్పందానికి వీలుంటుందని ఆజాద్ నెహ్రూ, పంత్, కృపలానీ, నరేంద్రదేవ్‌లతో జరిగిన చర్చల్లో నిర్ణయించారు. అయితే దీన్నంతటినీ జిన్నా తిరస్కరించాడు.[192][193][194]

ఆఖరు బ్రిటీష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ భార్య లేడీ మౌంట్ బాటన్‌తో నెహ్రూకి ఉన్న సంబంధంపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. విభజన పథకాన్ని అంగీకరించడం వంటి జాతి ప్రయోజనాలు ముడిపడ్డ రాజకీయ అంశాలపై కూడా ఈ సంబంధం ప్రభావం ప్రసరించిందన్నది ఆ విమర్శల్లోకెల్లా తీవ్రమైనది.[195][నోట్స్ 9]

భారత దేశ మొదటి ప్రధాన మంత్రి

 
తీన్ మూర్తి భవన్, ప్రధాన మంత్రిగా నెహ్రూ యొక్క నివాసము, ప్రస్తుతం అయన జ్ఞాపకార్ధ మ్యూజియం.

బ్రిటిష్ కాబినెట్ మిషన్ అధికార బదిలీ ప్రస్తావన చేసేందుకు వచ్చినపుడు, నెహ్రూ , ఆయన సహచరులు విడుదల చేయబడ్డారు.

బ్రద్దలైన మతకలహాలు , గతి తప్పిన రాజకీయాలు, ప్రత్యేక ముస్లిం రాజ్య మైన పాకిస్తాన్ ఏర్పాటు కొరకు ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో నడుపబడుచున్న ముస్లింలీగ్ నుండి వ్యతిరేకతల నడుమ, నెహ్రూ అధిపతిగా నున్న తాత్కాలిక ప్రభుత్వం బలహీనపడింది. మిశ్రమ ప్రభుత్వం కొరకు చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత, నెహ్రూ 1947 జూన్ 3 న ఆంగ్లేయులచే ప్రతిపాదించబడిన భారతదేశ విభజనకు అయిష్టంగానే అంగీకరించారు. ఆయన 15ఆగస్టున భారత దేశ ప్రధాన మంత్రిగా పదవీ స్వీకారం చేసి ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ :గా ప్రసిద్దమైన తన మొదటి ప్రసంగాన్ని చేసారు.

చాలా సంవత్సరాల క్రితం మనము విధితో తల పడ్డాము, ఇప్పుడు మనం అమిత ధృడంగా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది. అర్ధరాత్రి సమయంలో, ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్ర జీవనానికై మేల్కొంది.మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమైనపుడు, చాలా కాలం అణగ ద్రొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది.భారతదేశం కొరకు , దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది." [196]

ఏమైనప్పటికీ, ఈ కాలం తీవ్రమైన మతహింసకు ఆనవాలుగా ఉంది. ఈ హింస పంజాబ్ ప్రాంతం, ఢిల్లీ, బెంగాల్ , భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. శాంతిని పెంపొందించేందుకు, కోపోద్రిక్తులై, దిక్కుతోచక యున్న శరణార్ధులను శాంతింప చేసేందుకు, నెహ్రూ పాకిస్తానీ నాయకులతో కలిసి పర్యటనలు నిర్వహించారు. నెహ్రూ, మౌలానా ఆజాద్ , ఇతర ముస్లింనాయకులతో కలిసి, ముస్లింలకు భద్రత కల్పించి, భారతదేశంలో ఉండేందుకు ప్రోత్సహించేలా చేసారు. ఈ కాలంలోని హింస నెహ్రూను తీవ్రంగా కలచి వేసి, కాల్పుల విరమణను పాటించేలా , భారత-పాకిస్తాన్ యుద్ధం 1947, ఆపడానికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించేలా చేసింది. మతవిద్వేషాలకు భయమునొంది హైదరాబాద్ రాష్ట్ర విలీనానికి మద్దతు ఇవ్వడానికి నెహ్రూ సంశయించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంవత్సరాలలో, తన బాగోగులు చూడడానికి , వ్యక్తిగత వ్యవహారాల నిర్వహణకు, నెహ్రూ తరచుగా తన కుమార్తె పై ఆధార పడేవారు. ఆయన నాయకత్వంలో, 1952 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీని సాధించింది. ఇందిర, తన తండ్రి సంరక్షణకై ఆయన అధికారికనివాసం లోనికి మారారు. వాస్తవానికి ఇందిర నెహ్రూ సిబ్బందిలో ముఖ్యురాలిగా ఉంటూ ఆయన భారతదేశంలో , ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలలో నిరంతరం తోడుగా ఉన్నారు.

 
తీన్ మూర్తి భవన్ లో నెహ్రూ అధ్యయనము

ఆర్ధిక విధానాలు

భారత ఆర్ధిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక , నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ, భారత ప్రణాళికా సంఘంన్ని నెలకొల్పి, 1951 లో మొదటి పంచ-వర్ష ప్రణాళికను రచించి, అందులో పారిశ్రామిక , వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచారు. వ్యాపార , ఆదాయ పన్ను పెరుగుదలతో, నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మైనింగ్, విద్యుత్ , భారీ పరిశ్రమలు, పౌర సేవలతో ప్రైవేటు రంగాన్ని అదుపులో వుంచే మిశ్రమ ఆర్ధిక విధానాన్ని యోచించారు. నెహ్రూ భూపునఃపంపిణి విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం , వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కమ్యూనిటీ అభివృద్ది పధకాలకు దారి తీసే లక్ష్యంతో గ్రామీణ భారత సామర్ద్యాన్ని ఇనుమడించే వివిధ కుటీర పరిశ్రమలను విస్తరింపచేసారు.భారీ ఆనకట్టలను ('నెహ్రూ వీటిని భారత దేశ ఆధునిక దేవాలయాలు' అనేవారు ) ప్రోత్సహించడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన ,జలవవిద్యుత్ ఉత్పత్తితో పాటు, నెహ్రూ భారతదేశ అణుశక్తి కార్యక్రమాలను కూడా ప్రవేశ పెట్టారు.

నెహ్రూ పదవీకాలంలో అభివృద్ధి , ఆహారోత్పత్తి పెరుగుదల జరిగినప్పటికీ, భారతదేశం తీవ్రమైన ఆహారపు కొరతను ఎదుర్కొంటూనే ఉంది.నెహ్రూ ఆర్ధిక విధానాలు, ఆర్ధిక విధాన ప్రకటన 1956 లో పొందుపరచబడి, విభిన్న ఉత్పాదక , భారీ పరిశ్రమలను [197] ప్రోత్సహించినప్పటికీ, దేశ ప్రణాళిక, నియంత్రణ , క్రమబద్దీకరణలు ఉత్పాదకత, నాణ్యత , లాభదాయకతలను బలహీన పరచాయి. భారతఆర్ధిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధిని సాధించినప్పటికీ, విస్తారమైన పేదరికం, దీర్ఘకాల నిరుద్యోగిత అనే అంటురోగాల బారిన ప్రజలు చిక్కుకున్నారు. నెహ్రూ ప్రజాదరణ చెక్కుచెదరక పోగా, ఆయన ప్రభుత్వం విస్తారమైన భారత గ్రామీణ ప్రజానీకానికి నీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య రక్షణ, రహదారులు , వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించడంలో విజయవంతమయ్యింది. స్రివత్సల్, హెమంథ్, సుమంథ్, స్రుథి,సరన్య\

విద్య , సంఘ సంస్కరణ

భారత దేశ బాలలు , యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమయిన కోరికగల నెహ్రూ, భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వం నెలకొల్పింది. భారత దేశ బాలలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్య అందించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు. దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కార్యక్రమాలను , వేలాది పాఠశాలల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అంతేకాక బాలలలో పోషకాహార లోప నివారణకై ఉచిత పాలు , ఆహార సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు. వయోజనుల కొరకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయోజన విద్యా కేంద్రాలు, వృత్తి , సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు.

కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణించుటకు , స్త్రీల యొక్క న్యాయ పరమైన హక్కులను , సాంఘిక స్వతంత్రతకు, హిందూ చట్టంలో పలు మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోని భారత పార్లమెంటు చేసింది.[198][199][200] [201] షెడ్యుల్డ్ కులాలు , తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను , అననుకూలతలను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు , విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. నెహ్రూ లౌకికవాదానికి, మత సామరస్యానికి , ప్రభుత్వంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి పూనుకున్నారు.

జాతీయ భద్రత , విదేశాంగ విధానం

ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందిన నూతన స్వేచ్ఛా భారతానికి నెహ్రూ 1947 నుండి 1964 వరకు నాయకత్వం వహించారు. యు.ఎస్. , యు.ఎస్.ఎస్.ఆర్.లు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారత దేశాన్ని తమ మిత్ర దేశంగా చేసుకోవడానికి పోటీ పడ్డాయి.

1948 లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జనాభిప్రాయ సేకరణకు నెహ్రూ అంగీకరించినప్పటికీ, తరువాతి కాలంలో ఐక్యరాజ్యసమితికి దూరమై 1953 లో జనాభిప్రాయ సేకరణకు నిరాకరించారు. అంతకుముందు తాను బలపరచిన షేక్ అబ్దుల్లా, వేర్పాటు వాద ఆశయాన్ని కలిగి ఉన్నారనే అనుమానంతో ఆయన అరెస్టుకు ఆదేశించి, ఆయన స్థానంలో బక్షి గులాం మొహమ్మద్ను నియమించారు. అంతర్జాతీయ రంగంలో నెహ్రూ ఒక శాంతి కాముక నాయకునిగా ఉండి ఐక్యరాజ్యసమితికి మంచి మద్దతుదారుగా నిలిచారు. ఆయన అలీన విధానాన్ని ప్రతిపాదించి, యు.ఎస్., యు.ఎస్.ఎస్.ఆర్. దేశాల నాయకత్వంలో ఉన్న వ్యతిరేక కూటముల మధ్య, తటస్థ వైఖరి అవలంబించే దేశాలతో అలీనోద్యమాన్ని స్థాపించి, దాని మూలధన ఏర్పాటుకు సహకారం అందించారు. స్థాపించిన వెంటనే పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాను గుర్తించి (అనేక పశ్చిమ కూటములు రిపబ్లిక్ అఫ్ చైనాతో సంబంధాలు కొనసాగించాయి), ఐక్యరాజ్య సమితిలో దానిని చేర్చు కోవాలని వాదించి, కొరియాతో వైరం వల్ల చైనీయులను కలహ కారకులుగా గుర్తించడాన్ని వ్యతిరేకించారు.[202] చైనా 1950 లో టిబెట్ను ఆక్రమించినప్పటికీ దానితో సుహృద్భావ , స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పాలని భావించి, కమ్యూనిస్ట్ దేశాలకు , పశ్చిమ కూటమికి మధ్య ఏర్పడిన ఒత్తిడులను తొలగించేందుకు మధ్యవర్తిగా ఉండాలని ఆశించారు. చైనాతో ఈ విధమైన శాంతి కాముక విధానం సమస్యాత్మకమైనదిగా,చైనా కాశ్మీర్ ప్రాంతంలో నున్న, టిబెట్ సరిహద్దుగా ఉన్న అక్సాయి చిన్ను ఆక్రమించి, భారత-చైనా యుద్ధం, 1962 కు దారి తీసినపుడు ఋజువైనది.

అణు ఆయుధాల బెదిరింపులను , ప్రపంచంవ్యాప్త వత్తిడులను తగ్గించడానికి నెహ్రూ కృషి పలువురి ప్రశంసలు అందుకుంది.[203] అణు విస్ఫోటనం వల్ల మానవ జాతికి కలిగే ఫలితాల తొలి అధ్యయనాన్ని ప్రారంభించి, తాను'వినాశకర భయానక యంత్రాలు'గా పిలిచే, వాటి నిరోధానికి నిరంతరం దండెత్తారు. అణు అస్త్రాల పోటి వల్ల దారితీసే అతి-సైనికీకరణ అభివృద్ధి చెండుతున్న దేశాలైన, తన దేశం వంటివి భరించలేనిదిగా భావించడం, ఆయన అణునిరాయుధీకరణకు వ్యతిరేకంగా ఉండడానికి కారణం.[204]

1956 లో సుఎజ్ కాలువపై ఆంగ్లేయ, ఫ్రెంచ్ ,ఇజ్రాయిల్ ల ఉమ్మడి దండయాత్రను విమర్శించారు. అనుమానం , అపనమ్మకము యు.ఎస్., , భారత దేశాల మధ్య సంబంధాలను బలహీనపరచి, నెహ్రూ వ్యూహాత్మకంగా సోవియట్ యూనియన్ను బలపరుస్తున్నారనే అనుమానాన్ని కలిగించింది.1960 లో పాకిస్తాన్ పాలకుడైన ఆయుబ్ ఖాన్ తో సింధు నదీ జలాల ఒప్పందం పై సంతకం చేయడం ద్వారా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పంజాబ్ ప్రాంతంలోని నదీ వనరుల పంపక సమస్య సాధనకు, యునైటెడ్ కింగ్డం , ప్రపంచ బ్యాంక్ల మధ్యవర్తిత్వానికి అంగీకరించారు.

ఆఖరి సంవత్సరాలు

1957 ఎన్నికలలో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ గొప్ప విజయాన్ని సాధించిన్పటికీ, ఆయన ప్రభుత్వం వెల్లువెత్తుతున్న విమర్శలను ఎదుర్కొంది . పార్టీ లోఅంతర్గతంగా ఉన్న అవినీతి అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన నెహ్రూ, పదవికి రాజీనామా చేసి, సేవను కొనసాగించాలని భావించారు.1959లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఎన్నిక బంధు ప్రీతి[ఆధారం చూపాలి] విమర్శలను రేకెత్తించింది, నెహ్రూ ఆమె ఎన్నికను ఆమోదించక, వంశానికి అపకీర్తిగా భావించి, దానిని పూర్తిగా అప్రజాస్వామికము , అవాంచనీయంగా భావించారు, తన మంత్రివర్గంలో స్థానాన్ని తిరస్కరించారు .[205] ఇందిరా గాంధీ తన తండ్రి విధానంతో విభేదించారు; ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో ఉన్న వ్యక్తిగత విభేదాలను ఉపయోగించుకొని, ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా కేరళ లోని కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాప్రభుత్వాన్ని రద్దు చేయించారు.[205] నెహ్రూ ఆమె దయలేని విధానాలు , పార్లమెంటరీ సాంప్రదాయం పట్ల అగౌరవానికి తీవ్రంగా కలత చెందారు, ఆమె తండ్రిచాటు బిడ్డగా కాక, అకారణంగా నిర్దిష్ట చర్యలు తీసుకొనుట ఆయనను బాధించింది.[206]

పంచ - శీల (శాంతియుత సహజీవనానికి ఐదు సూత్రాలు)టిబెట్ పై భారత-చైనా ఒప్పందం 1954కు ఆధారం ఐనప్పటికీ,తరువాతి సంవత్సరాలలో సరిహద్దు వివాదాలు , దలై లామాకు రాజకీయ ఆశ్రయం ఇవ్వాలనే నెహ్రూ నిర్ణయం చైనాతో పెరుగుతున్న విభేదాలు నెహ్రూ విదేశాంగ విధానానికి ఇబ్బంది కలిగించాయి.అనేక సంవత్సరాల చర్చలు విఫలమైన తరువాత, నెహ్రూ 1961 లో పోర్చుగల్ నుండి గోవాను స్వాధీన పరచుకోవలసినదిగా భారతీయ సైన్యాన్ని ఆజ్ఞాపించారు. చూడుము గోవా విముక్తి. సైనిక చర్య జరిపించినందుకు నెహ్రూ ప్రజాదరణతో పాటువిమర్శలను కూడా ఎదుర్కొన్నారు.

1962 ఎన్నికలలో, ఆధిక్యత తగ్గినప్పటికీ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలైన, సాంప్రదాయ వాద పార్టీలు భారతీయ జన సంఘ్ , స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్లు,కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాలు కూడా గెలుపొందాయి.

కొద్దినెలల కాలంలోనే,సరిహద్దు వివాదాలను చైనా బహిరంగ యుద్ధాలుగా మార్చింది.సామ్రాజ్యవాద బాధితులుగా (భారతదేశం ఒక వలస రాజ్యం)మనం ఐకమత్యంగా ఉండాలని భావించి, "హిందీ-చీనీ భాయి భాయి ", (భారతీయులు , చైనీయులు సోదరులు)అనే మాటలలో నెహ్రూ తన భావాన్ని వ్యక్తం చేసారు.అభివృద్ధి చెందుతున్న దేశాలమధ్య సోదర భావం , ఐకమత్యానికి ఆయన అంకితం అయ్యారు. నెహ్రూ స్వాభావికంగా ఒక సామ్యవాద దేశం మరొక సామ్యవాద దేశం పై పోరుసల్పదని భావించారు, ఏ సందర్భంలో నైనా భారతదేశం చొరబడలేని మంచు గోడలైన హిమాలయాల వెనుక సురక్షితమని భావించారు. చైనా ఉద్దేశాలు, సైనిక సామర్ధ్యాల ముందు రెండూ కూడా తప్పని తేలాయి. చైనా ఆక్రమించుకున్న వివాదాస్పద ప్రాంతాల్లో వారిని ఎదుర్కోవాలనే ఆలోచనను - "వారిని (చైనీయులను )బయటకు విసిరేయండి"-అనే జ్ఞప్తికి ఉంచుకోదగిన ప్రకటనలో సైన్యాన్ని ఆదేశించారు-చైనా ముందస్తు దాడిని ప్రారంభించింది.[207]

దస్త్రం:Nehrudeath.jpg
ప్రజల సందర్శనార్ధం నెహ్రూ భౌతిక కాయం, 1964

చైనా భారత యుద్ధం ప్రారంభించిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారతదేశంలోనిఅస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్య బలహీనతను బహిర్గత పరచింది.భద్రతపై అయన ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొని,రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ను తొలగించి, యు.ఎస్. సైనికసహాయం అర్దించవలసి వచ్చింది. క్రమంగా నెహ్రూ ఆరోగ్యం మందగించ సాగింది, కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కాశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఇబ్బందికి కారణం చైనా దండయాత్ర వలన అయన పొందిన అవమానం , విశ్వాస ఘాతుకంగా భావిస్తారు [208] కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుతో బాధపడి తరువాత మరణించారు. 1964 మే 27 వేకువ సమయంలో ఆయన మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున గలశాంతివన్లో నెహ్రూ అంత్య క్రియలు జరుప బడ్డాయి, వందల వేల మంది సంతాపం ప్రకటించడానికి ఢిల్లీ వీధులలో , అంత్యక్రియా స్థలం వద్ద గుమికూడారు.

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను నాలుగవ స్థానంలో ఎంపికైయ్యాడు.[209]

వారసత్వం

 
అల్ద్విచ్, లండన్ లో నెహ్రూ విగ్రహం

భారత దేశ మొదటి ప్రధానమంత్రి , విదేశాంగమంత్రిగా,జవహర్లాల్ నెహ్రూ నవ భారత ప్రభుత్వ విధానాలను, రాజకీయ సంస్కృతిని , శక్తివంతమైన విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించారు. సార్వత్రిక ప్రాథమిక విద్యా పధకాన్ని ప్రారంభించి, దేశంలోని మారుమూల గ్రామీణ బాలలకు విద్య అందించ గలిగినందుకు అయన ప్రశంశించబడతారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలైన అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్,[210] ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ,[211] ,ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్లు అభివృద్ధి చేసిన ఘనత నెహ్రూ విద్యా విధానానిదే.

భారతదేశ ప్రత్యేక జాతుల, అల్ప సంఖ్యాక వర్గాల, స్త్రీల, షెడ్యూల్డ్ కులాల , షెడ్యుల్డ్ తెగలకు సమాన అవకాశాలు , హక్కులు కల్పించేందుకు విస్తృతమైన విధానాన్ని రూపొందించి స్థిరమైన చర్యలను నెహ్రూ చేపట్టారు.[212][213]సమానత్వాన్ని నెలకొల్పాలనే నెహ్రూ ఆకాంక్ష, ఆయన స్త్రీలు , అణగారిన వర్గాల [214] కొరకు ప్రభుత్వ పధకాలు విస్తృతంగా రూపొందించి, వాటి అమలుకు ప్రయత్నించేలా చేసింది,కాని అవి ఆయన జీవిత కాలంలో పరిమితంగానే విజయవంతమయ్యాయి.

ఓటమి ఎరుగని జాతీయ వాదిగా నెహ్రూ స్థానం ఆయన,ప్రాంతీయ భేదాలను గుర్తిస్తూ నే అణచి వేయబడిన సామాజిక వర్గాల కొరకు విధానాలు అమలు పరచుటకు దారి చూపింది. స్వాతంత్ర్య -అనంతర కాలంలో ఆంగ్లేయులు ఉపఖండం నుండి విరమించు కొన్న తరువాత, ఉపఖండంలో అంతకు ముందు ఒకే సామాన్య విరోధికి వ్యతిరేకంగా మిత్రులుగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఇక నుండి ఒకరికొకరు సంబంధం లేకుండా విభేదాలు పొడసూపిన కాలంలో ఇది ప్రాముఖ్యతను సంతరించు కుంది. సాంస్కృతిక వైవిధ్యం ప్రత్యేకించి భాషా వైవిధ్యం దేశ ఐక్యతను భంగపరచేదిగా ఉన్న సమయంలో, నెహ్రూ నేషనల్ బుక్ ట్రస్ట్ , నేషనల్ లిటరసీ అకాడమీ వంటి సంస్థలను ఏర్పరచి వివిధ భాషల మధ్య అనువాదాలను ప్రోత్సహించారు , విషయ పరిజ్ఞాన బదిలీలను ప్రోత్సహించారు.సమైక్య భారతదేశం కోసం నెహ్రూ "కలసిఉండడం లేదా నశించడం ", అని నినదించారు.[215]

జ్ఞాపకార్ధం

 
జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్ధం 1989 లో USSR విడుదల చేసిన తపాలా బిళ్ళ
 
నోన్గ్పోలో పిల్లలకు మిఠాయిలు పంచుతున్న నెహ్రూ

తన జీవిత కాలంలో నెహ్రూ భారతదేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము , రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి. బాలల , యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు, విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా, ఆయన జన్మ దినమైన 14 నవంబర్,ను భారతదేశం బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బాలలు ఆయనను చాచా నెహ్రూ (నెహ్రూ అంకుల్)అని గౌరవిస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాదరణ పొందిన నాయకునిగా ఆయనను తరచూ వారు గుర్తు చేసుకుంటారు. కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు ఆయన వస్త్ర ధారణను, ప్రత్యేకించిగాంధీ టోపీని , అలవాట్లను అనుకరిస్తుంటారు. నెహ్రూ ఆదర్శాలు , విధానాలు కాంగ్రెస్ ప్రకటన పత్రము (ముసాయిదా)ను , మూల రాజకీయ తత్వాన్ని రూపొందించడంలో నేటికీ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆయన వారసత్వ ప్రతినిధిగా ఇదిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ , ప్రభుత్వ నాయకత్వాన్ని చేపట్టారు.

 
జవాహర్ లాల్ నెహ్రూ, హైదరాబాదు అబిడ్స్ దగ్గరి విగ్రహము

నెహ్రూ జీవితం పై ఎన్నోడాక్యుమెంటరీలు నిర్మింపబడ్డాయి.ఎన్నో కల్పిత చిత్రాలలో ఆయన చిత్రీకరింప బడ్డారు. 1982 లో రిచర్డ్ అటెన్ బరో చిత్రంగాంధీ లోను, నెహ్రూ చే రచింపబడిన ది డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంథం పై ఆధారపడి 1988 లోశ్యాం బెనెగల్ యొక్క టెలివిజన్ సీరియల్ భారత్ ఏక్ ఖోజ్ లోను, 2007 లో ది లాస్ట్ డేస్ అఫ్ ది రాజ్ అనే టెలివిజన్ చిత్రం లోను మూడు సార్లు నెహ్రూ పాత్రను పోషించినరోషన్ సేథ్ ఆ పాత్రకు పరిపూర్ణత నిచ్చారు.[216] కేతన్ మెహతా చిత్రం సర్దార్లో నెహ్రూపాత్రను బెంజమిన్ గిలానీ పోషించారు.

శేర్వాని ధారణను నెహ్రూ వ్యక్తి గతంగా ఇష్ట పడడం దానిని ఉత్తర భారతదేశంలో నేటికి కూడా ప్రత్యేక సందర్భ వస్త్ర ధారణగా నిలిపింది. ఒక రకమైన టోపీకి ఆయన పేరును ఇవ్వడంతో పాటు, ఆయన ప్రాధాన్యతనిచ్చిన కోటుకు కూడానెహ్రూ కోటు అనే పేరునిచ్చి గౌరవిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వరంగసంస్థలు, జ్ఞాపక చిహ్నాలు నెహ్రూస్మృతికి అంకితం ఇవ్వబడ్డాయి. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ముంబై నగరానికి దగ్గరలో నున్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ భారీ సరుకు రవాణాకు, రాకపోకలకు అనువుగా నిర్మించ బడిన ఆధునికమైన పోర్ట్ ,డాక్. ఢిల్లీ లోని నెహ్రూ నివాసము నెహ్రూ జ్ఞాపకార్ధ మ్యూజియం , గ్రంధాలయంగా సంరక్షించ బడుతోంది. నెహ్రూ కుటంబ భవనాలైన ఆనంద్ భవన్ , స్వరాజ్ భవన్లు నెహ్రూ జ్ఞాపకార్ధం , కుటుంబ వారసత్వంగా కాపాడబడుతున్నాయి. 1951 లో ఆయన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీసు కమిటీ (AFSC)ద్వారానోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించ బడ్డారు.[217]

ఇవికూడా చూడండి

 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

నోట్స్

  1. ఢిల్లీలో తమ పూర్వీకుల ఇల్లు ఒక కాలువ గట్టు మీద ఉండడంతో ఉర్దూలో కాలువను సూచించే నెహర్ పదాన్ని అనుసరించి నెహ్రూ అన్న పేరు వచ్చిందని మోతీలాల్ నెహ్రూ చెప్పేవాడు. జవాహర్‌లాల్ నెహ్రూ దీన్ని విశ్వసించి ఆత్మకథ ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. అయితే ఇప్పటికీ కాశ్మీర్‌లో నెహ్రూ వంశస్థులు ఉండడంతో పై కథను నెహ్రూ జీవితచరిత్రకారుడు ఎస్. గోపాల్ సంశయంతోనే స్వీకరించాడు.
  2. కాశ్మీర్ లోయలోని సామాజిక కారణాల దృష్ట్యా పండిట్‌లు ముస్లింల పట్ల వేరు భావం కలిగి ఉండేవారు కాదు. కులాల మధ్య అంతరాలు చూపే ఆచారాలు వారిలో అంతగా ఉండేవి కావు. ఇదంతా కలిసి వారికి ఆచార వ్యవహారాల్లో పట్టింపు తక్కువగా ఉండేది
  3. న్యాయవాదిగా ఆనాటి వలస సమాజంలో ఉన్నతస్థాయిని పొందిన మోతీలాల్ కుమారుడికి బ్రిటీష్ విద్యాబోధనే ప్రధానమని భావించాడు. మోతీలాల్ సహా కాశ్మీరీ పండిట్లయిన వారి పూర్వీకులంతా సంస్కృతం వంటి ఇతర భారతీయ భాషలకన్నా అరబ్బీ, ఫారసీ, ఉర్దూ వంటి భాషలలోనే ఎక్కువ ప్రవేశం కలవారు. ఇలా కుటుంబ సామాజిక స్థితి, సంప్రదాయానుశీలంగా వారి వాతావరణంలో ఈ భారతీయ విద్యల పట్ల ప్రత్యేకాభిమానం లేకపోవడం కూడా జవాహర్‌లాల్‌ సంస్కృతం నేర్వలేకపోవడాన్ని ప్రభావితం చేశాయి.
  4. నెహ్రూ చరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ ప్రకారం నెహ్రూ, బోస్‌లు అంతర్జాతీయ సమస్యలను, అందులో భాగంగా భారతదేశ స్వాతంత్ర్య సమస్యని అర్థం చేసుకున్న తీర్లు వేరు. నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన జర్మనీ, జపాన్, ఇటలీల అక్షరాజ్యాల కూటమి చర్యలను ఖండించడానికి కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో బోస్ వెనుకాడాడు. 1938 డిసెంరులో బొంబాయిలోని జర్మన్ కాన్సల్‌ను కలుసుకున్నాడు. చైనా, స్పెయిన్ దేశాల స్వాతంత్ర్య పోరాటాలను సమర్థించినందుకు నెహ్రూను బోస్ విమర్శించాడు.
  5. గాంధీ తనను వారసుడిగా ప్రకటిస్తున్నప్పుడు నెహ్రూ కూర్చున్న చోట నుంచి ఒక్కసారి పైకి గెంతి, బాలీసుపై కూర్చొన్నాడని అక్కడే ఉన్న రాజస్థాన్ కు చెందిన కార్యకర్త రామ్ నారాయణ్ చౌదరి గమనించాడు.
  6. ఈ ఆలోచన 1945 ఆగస్టులో జైలు నుంచి విడుదల కాగానే నెహ్రూకు ఎలా ఉందో, 1946 ఏప్రిల్ నాటికి కేంద్ర, రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో ముస్లింలీగ్ ప్రభావం స్పష్టమయ్యాకా కూడా అలానే ఉంది. అయితే ఆ సరికే కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన వల్లభ్ భాయ్ పటేల్ పాకిస్తాన్ ఏర్పాటు తప్పకపోవచ్చునన్న అవగాహనకు వస్తూ ఒకవేళ తప్పకపోతే అది పంజాబ్, బెంగాల్ విభజనల ద్వారా జరగాలన్న వ్యూహాన్ని కూడా ఆలోచించిపెట్టుకుంటున్నాడు.
  7. వేవెల్ ఎప్పటిలానే ముస్లింలీగ్ పక్షానే మాట్లాడుతూన్నా లండన్ లోని ఇండియా కార్యాలయం వారు మాత్రం స్వాతంత్ర్యానంతరం భారతదేశంతో బ్రిటీష్ సంబంధాలు బలంగా ఉండాలని ఆశించి కాంగ్రెస్ అనుకూలమైన విధానం నిర్ణయిస్తూ వస్తోంది. ముస్లింలీగ్ కి బ్రిటీష్ ప్రభుత్వంపై ఉన్న పట్టు సడలిపోయిందన్న అంచనాతో నెహ్రూ స్వతంత్రించి ఈ వ్యాఖ్య చేశాడు.
  8. నెహ్రూ జీవితచరిత్రకారుడు ఎస్.గోపాల్ ఈ నేరాన్ని నెహ్రూ మీద తోయడం సరికాదంటూ, తనకు సమ్మతం కాని క్యాబినెట్ మిషన్ పథకం నుంచి తప్పుకునేందుకు జిన్నా దీన్నొక సాకుగా వినియోగించుకున్నాడని అన్నాడు. జిన్నా దీన్ని సాకుగా వాడుకున్నాడనే చరిత్రకారుడు బిపిన్ చంద్ర కూడా పేర్కొన్నాడు. అయితే చాలామంది చరిత్రకారులు నెహ్రూ చేసిన ఈ వ్యాఖ్య రెచ్చగొట్టడాన్ని నమోదుచేశారు.
  9. జాతీయోద్యమ సహచరుడు, పఖ్తూన్ల నాయకుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1947లో వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో జనాభిప్రాయ సేకరణ చేయాలన్న వైస్రాయ్ మౌంట్ బాటన్ ప్రతిపాదనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తిరస్కరించాడు. అయితే నెహ్రూ, పటేల్ మాత్రం కమిటీలో ఆ ప్రతిపాదనకు మద్దతునిచ్చి, జనాభిప్రాయ సేకరణ జరగడానికి ఆమోదించారు. మరో 21 సంవత్సరాల తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో నెహ్రూ ఎందుకు ఈ పథకం ఆమోదించాడన్నదానిపై ఖాన్ అధికార స్వీకరణ తొందరతో పాటుగా మౌంట్ బాటన్ దంపతుల ప్రభావాన్ని కూడా సూచించాడు.

మూలాలు

  1. Tharoor, Shashi. "Gandhi & Nehru" (in ఇంగ్లీష్). TIME. Archived from the original on 2006-12-06. Retrieved 2008-04-15.
  2. In Jawaharlal Nehru's autobiography, An Autobiography (1936), and in the Last Will & Testament of Jawaharlal Nehru, in Selected Works of Jawaharlal Nehru, 2nd series, vol. 26, p. 612, ఏ రూపంలో ఉన్న దేవుడినీ తాను నమ్మనని నెహ్రూ చెబుతాడు.
  3. రఫీఖ్ జకారియా (1960). ఎ స్టడీ ఆఫ్ నెహ్రూ (in ఆంగ్లం). టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రెస్. p. 22.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  4. 4.0 4.1 4.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 13.
  5. సర్వేపల్లి గోపాల్ 1993, p. 14.
  6. సర్వేపల్లి గోపాల్ 1993, p. 15.
  7. 7.0 7.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 16.
  8. Bal Ram Nanda; The Nehrus. Oxford University Press. 1962. ISBN 978-0195693430. p. 65.
  9. 9.0 9.1 9.2 Om Prakash Misra; Economic Thought of Gandhi and Nehru: A Comparative Analysis. M.D. Publications. 1995. ISBN 978-8185880716. pp. 49–65
  10. 10.0 10.1 10.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 18.
  11. సర్వేపల్లి గోపాల్ 1993, p. 17.
  12. Moraes 2008, p. 36.
  13. కేంబ్రిడ్జిలో చేరిన కొత్తల్లో జవాహరలాల్ తండ్రికి రాసిన ఉత్తరాల్లో తండ్రి మితవాద ధోరణిని విమర్శించడం, కొండొకచో హేళన చేయడం కూడా కనిపిస్తుంది
  14. సర్వేపల్లి గోపాల్ 1993, p. 21.
  15. సర్వేపల్లి గోపాల్ 1993, p. 22.
  16. సర్వేపల్లి గోపాల్ 1993, p. 23.
  17. సర్వేపల్లి గోపాల్ 1993, p. 24.
  18. 18.0 18.1 18.2 Ghose 1993, p. 25.
  19. Moraes 2008, p. 49.
  20. Moraes 2008, p. 52.
  21. Moraes 2008, p. 53.
  22. 22.0 22.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 27.
  23. సర్వేపల్లి గోపాల్ 1993, p. 28.
  24. సర్వేపల్లి గోపాల్ 1993, p. 29.
  25. సర్వేపల్లి గోపాల్ 1993, p. 30.
  26. సర్వేపల్లి గోపాల్ 1993, p. 31.
  27. సర్వేపల్లి గోపాల్ 1993, p. 33.
  28. సర్వేపల్లి గోపాల్ 1993, p. 36.
  29. సర్వేపల్లి గోపాల్ 1993, p. 38.
  30. సర్వేపల్లి గోపాల్ 1993, p. 39.
  31. సర్వేపల్లి గోపాల్ 1993, p. 40.
  32. సర్వేపల్లి గోపాల్ 1993, p. 47.
  33. సర్వేపల్లి గోపాల్ 1993, p. 48.
  34. సర్వేపల్లి గోపాల్ 1993, p. 49.
  35. సర్వేపల్లి గోపాల్ 1993, p. 50.
  36. సర్వేపల్లి గోపాల్ 1993, p. 51.
  37. సర్వేపల్లి గోపాల్ 1993, p. 52.
  38. సర్వేపల్లి గోపాల్ 1993, p. 53.
  39. సర్వేపల్లి గోపాల్ 1993, p. 54.
  40. 40.0 40.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 55.
  41. 41.0 41.1 41.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 57.
  42. సర్వేపల్లి గోపాల్ 1993, p. 56.
  43. సర్వేపల్లి గోపాల్ 1993, p. 58.
  44. సర్వేపల్లి గోపాల్ 1993, p. 59.
  45. సర్వేపల్లి గోపాల్ 1993, p. 60.
  46. సర్వేపల్లి గోపాల్ 1993, p. 61.
  47. సర్వేపల్లి గోపాల్ 1993, p. 62.
  48. సర్వేపల్లి గోపాల్ 1993, p. 67.
  49. సర్వేపల్లి గోపాల్ 1993, p. 69.
  50. సర్వేపల్లి గోపాల్ 1993, p. 70.
  51. 51.0 51.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 71.
  52. 52.0 52.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 72.
  53. 53.0 53.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 73.
  54. సర్వేపల్లి గోపాల్ 1993, p. 74.
  55. సర్వేపల్లి గోపాల్ 1993, p. 75.
  56. సర్వేపల్లి గోపాల్ 1993, p. 76.
  57. సర్వేపల్లి గోపాల్ 1993, p. 78.
  58. సర్వేపల్లి గోపాల్ 1993, p. 80.
  59. సర్వేపల్లి గోపాల్ 1993, p. 82.
  60. సర్వేపల్లి గోపాల్ 1993, p. 81.
  61. టంగుటూరి ప్రకాశం (1972). "  గాంధీ - ఇర్విన్ ఒడంబడిక, మా విడుదల".   నా జీవిత యాత్ర-3. వికీసోర్స్. 
  62. సర్వేపల్లి గోపాల్ & 1993 104.
  63. సర్వేపల్లి గోపాల్ & 1993 105.
  64. సర్వేపల్లి గోపాల్ & 1993 106.
  65. సర్వేపల్లి గోపాల్ & 1993 107.
  66. 66.0 66.1 సర్వేపల్లి గోపాల్ & 1993 108.
  67. 67.0 67.1 సర్వేపల్లి గోపాల్ & 1993 109.
  68. రాజ్‌మోహన్ గాంధీ 1997, p. 132.
  69. సర్వేపల్లి గోపాల్ & 1993 110.
  70. సర్వేపల్లి గోపాల్ & 1993 111.
  71. 71.0 71.1 సర్వేపల్లి గోపాల్ & 1993 112.
  72. 72.0 72.1 సర్వేపల్లి గోపాల్ & 1993 113.
  73. రాజ్‌మోహన్ గాంధీ & 1997 139.
  74. సర్వేపల్లి గోపాల్ & 1993 114.
  75. సర్వేపల్లి గోపాల్ & 1993 115.
  76. సర్వేపల్లి గోపాల్ & 1993 117.
  77. సర్వేపల్లి గోపాల్ & 1993 120.
  78. "Declaration of independence". Archived from the original on 17 మే 2013. Retrieved 17 ఆగస్టు 2018.
  79. రాజ్‌మోహన్ గాంధీ & 1997 140.
  80. రామచంద్ర గుహా 2010, p. 4.
  81. రాజ్‌మోహన్ గాంధీ & 1997 142.
  82. సర్వేపల్లి గోపాల్ 1993, p. 123.
  83. సర్వేపల్లి గోపాల్ 1993, p. 124.
  84. 84.0 84.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 125.
  85. సర్వేపల్లి గోపాల్ 1993, p. 127.
  86. సర్వేపల్లి గోపాల్ 1993, p. 128.
  87. సర్వేపల్లి గోపాల్ 1993, p. 130.
  88. 88.0 88.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 133.
  89. 89.0 89.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 134.
  90. సర్వేపల్లి గోపాల్ 1993, p. 136.
  91. సర్వేపల్లి గోపాల్ 1993, p. 138.
  92. సర్వేపల్లి గోపాల్ 1993, p. 139.
  93. సర్వేపల్లి గోపాల్ 1993, p. 141.
  94. సర్వేపల్లి గోపాల్ 1993, p. 143.
  95. సర్వేపల్లి గోపాల్ 1993, p. 144.
  96. సర్వేపల్లి గోపాల్ 1993, p. 145.
  97. సర్వేపల్లి గోపాల్ 1993, p. 146.
  98. సర్వేపల్లి గోపాల్ 1993, p. 147.
  99. 99.0 99.1 99.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 152.
  100. 100.0 100.1 100.2 100.3 100.4 సర్వేపల్లి గోపాల్ 1993, p. 153.
  101. సర్వేపల్లి గోపాల్ 1993, p. 154.
  102. 102.0 102.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 155.
  103. సర్వేపల్లి గోపాల్ 1993, p. 156.
  104. 104.0 104.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 157.
  105. 105.0 105.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 158.
  106. సర్వేపల్లి గోపాల్ 1993, p. 159.
  107. సర్వేపల్లి గోపాల్ 1993, p. 160.
  108. రాజ్‌మోహన్ గాంధీ 1993, p. 189.
  109. 109.0 109.1 109.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 161.
  110. బిపిన్ et al. 1987, p. 298.
  111. సర్వేపల్లి గోపాల్ 1993, p. 162.
  112. సర్వేపల్లి గోపాల్ 1993, p. 163.
  113. 113.0 113.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 165.
  114. సర్వేపల్లి గోపాల్ 1993, p. 164.
  115. 115.0 115.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 166.
  116. సర్వేపల్లి గోపాల్ 1993, p. 177.
  117. సర్వేపల్లి గోపాల్ 1993, p. 178.
  118. సర్వేపల్లి గోపాల్ 1993, p. 184.
  119. సర్వేపల్లి గోపాల్ 1993, p. 180.
  120. సర్వేపల్లి గోపాల్ 1993, p. 186.
  121. సర్వేపల్లి గోపాల్ 1993, p. 187.
  122. సర్వేపల్లి గోపాల్ 1993, p. 197.
  123. సర్వేపల్లి గోపాల్ 1993, p. 199.
  124. 124.0 124.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 201.
  125. సర్వేపల్లి గోపాల్ 1993, p. 203.
  126. సర్వేపల్లి గోపాల్ 1993, p. 204.
  127. 127.0 127.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 205.
  128. 128.0 128.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 206.
  129. సర్వేపల్లి గోపాల్ 1993, p. 209.
  130. సర్వేపల్లి గోపాల్ 1993, p. 212.
  131. సర్వేపల్లి గోపాల్ 1993, p. 214.
  132. సర్వేపల్లి గోపాల్ 1993, p. 218.
  133. సర్వేపల్లి గోపాల్ 1993, p. 221.
  134. ఇండియాస్ జవాహర్‌లాల్ నెహ్రూ
  135. సర్వేపల్లి గోపాల్ 1993, p. 224.
  136. రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 582.
  137. సర్వేపల్లి గోపాల్ 1993, p. 225.
  138. సర్వేపల్లి గోపాల్ 1993, p. 227.
  139. సర్వేపల్లి గోపాల్ 1993, p. 228.
  140. సర్వేపల్లి గోపాల్ 1993, p. 229.
  141. 141.0 141.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 230.
  142. సర్వేపల్లి గోపాల్ 1993, p. 231.
  143. 143.0 143.1 143.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 233.
  144. రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 587.
  145. సర్వేపల్లి గోపాల్ 1993, p. 235.
  146. సర్వేపల్లి గోపాల్ 1993, p. 236.
  147. సర్వేపల్లి గోపాల్ 1993, p. 237.
  148. రాజ్‌మోహన్ గాంధీ 2006, p. 591.
  149. సర్వేపల్లి గోపాల్ 1993, p. 238.
  150. 150.0 150.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 239.
  151. సర్వేపల్లి గోపాల్ 1993, p. 240.
  152. 152.0 152.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 241.
  153. సర్వేపల్లి గోపాల్ 1993, p. 243.
  154. సర్వేపల్లి గోపాల్ 1993, p. 246.
  155. సర్వేపల్లి గోపాల్ 1993, p. 247.
  156. సర్వేపల్లి గోపాల్ 1993, p. 252.
  157. సర్వేపల్లి గోపాల్ 1993, p. 253.
  158. సర్వేపల్లి గోపాల్ 1993, p. 254.
  159. సర్వేపల్లి గోపాల్ 1993, p. 255.
  160. సర్వేపల్లి గోపాల్ 1993, p. 261.
  161. సర్వేపల్లి గోపాల్ 1993, p. 264.
  162. సర్వేపల్లి గోపాల్ 1993, p. 265.
  163. సర్వేపల్లి గోపాల్ 1993, p. 266.
  164. సర్వేపల్లి గోపాల్ 1993, p. 267.
  165. సర్వేపల్లి గోపాల్ 1993, p. 268.
  166. సర్వేపల్లి గోపాల్ 1993, p. 269.
  167. బిపిన్ et al. 1987, p. 494.
  168. సర్వేపల్లి గోపాల్ 1993, p. 270.
  169. సర్వేపల్లి గోపాల్ 1993, p. 271.
  170. సర్వేపల్లి గోపాల్ 1993, p. 272.
  171. సర్వేపల్లి గోపాల్ 1993, p. 273.
  172. 172.0 172.1 బిపిన్ et al. 1987, p. 495.
  173. సర్వేపల్లి గోపాల్ 1993, p. 274.
  174. సర్వేపల్లి గోపాల్ 1993, p. 275.
  175. సర్వేపల్లి గోపాల్ 1993, p. 276.
  176. రాజ్‌మోహన్ గాంధీ 2004, p. 182.
  177. రాజ్‌మోహన్ గాంధీ 2004, p. 183.
  178. రాజ్‌మోహన్ గాంధీ 2004, p. 184.
  179. సర్వేపల్లి గోపాల్ 1993, p. 95.
  180. సర్వేపల్లి గోపాల్ 1993, p. 150.
  181. సర్వేపల్లి గోపాల్ 1993, p. 131.
  182. సర్వేపల్లి గోపాల్ 1993, p. 132.
  183. సర్వేపల్లి గోపాల్ 1993, p. 149.
  184. జవాహర్‌లాల్ నెహ్రూ (25 October 2015). Madhav Khosla (ed.). Letters for a Nation: From Jawaharlal Nehru to His Chief Ministers 1947-1963. Penguin UK.
  185. సర్వేపల్లి గోపాల్ 1993, p. 140.
  186. సర్వేపల్లి గోపాల్ 1993, p. 151.
  187. సర్వేపల్లి గోపాల్ 1993, p. 148.
  188. సర్వేపల్లి గోపాల్ 1993, p. 242.
  189. సర్వేపల్లి గోపాల్ 1993, p. 167.
  190. సర్వేపల్లి గోపాల్ 1993, p. 173.
  191. సర్వేపల్లి గోపాల్ 1993, p. 168.
  192. సర్వేపల్లి గోపాల్ 1993, p. 191.
  193. సర్వేపల్లి గోపాల్ 1993, p. 192.
  194. సర్వేపల్లి గోపాల్ 1993, p. 193.
  195. రాజ్‌మోహన్ గాంధీ 2004, p. 186.
  196. Nehru, Jawaharlal (2006-08-08). "Wikisource" (PHP). Retrieved 2006-08-08.
  197. Farmer, B. H. (1993). An Introduction to South Asia. Routledge. pp. 120.
  198. Som, Reba (1994-02-01). "Jawaharlal Nehru and the Hindu Code: A Victory of Symbol over Substance?". Modern Asian Studies. 28 (1): 165–194. doi:10.1017/S0026749X00011732. ISSN 0026-749X. Retrieved 2008-05-29.
  199. Basu, Srimati (1999). She Comes to Take Her Rights: Indian Women, Property, and Propriety. SUNY Press. pp. 3. The Hindu Code Bill was visualised by Ambedkar and Nehru as the flagship of modernisation and a radical revision of Hindu law...it is widely regarded as dramatic benchmark legislation giving Hindu women equitable if not superior entitlements as legal subjects.
  200. Rothermund, Dietmar; Kulke, Hermann (2004). A History of India. Routledge. pp. 328. One subject that particularly interested Nehru was the reform of Hindu law, particularly with regard to the rights of Hindu women...
  201. Forbes, Geraldine; Johnson, Gordon (1999). Women in Modern India. Cambridge University Press. p. 115. It is our birthright to demand equitable adjustment of Hindu law....
  202. Robert Sherrod (19 January 1963). "Nehru:The Great Awakening". The Saturday Evening Post. 236 (2): 60-67.
  203. Bhatia, Vinod (1989). Jawaharlal Nehru, as Scholars of Socialist Countries See Him. Panchsheel Publishers. p. 131.
  204. Dua, B. D.; Manor, James (1994). Nehru to the Nineties: The Changing Office of Prime Minister in India. C. Hurst & Co. Publishers. p. 261.
  205. 205.0 205.1 Frank, Katherine (2002). Indira: The Life of Indira Nehru Gandhi. Houghton Mifflin Books. pp. 250.
  206. Marlay, Ross; Clark, D. Neher (1999). Patriots and Tyrants: Ten Asian Leaders. Rowman & Littlefield. p. 368.
  207. "A powder-keg on the border with China". Rediff. 2008-02-26. Retrieved 2008-02-26.
  208. Asia Society (1988). "Jawaharlal Nehru". In Ainslie Embree (ed.). Encyclopedia of Asian History. Vol. 3. New York: Charles Scribner's Sons. pp. 98–100. ISBN 978-0-684-18899-7.
  209. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  210. http://www.aiims.ac.in
  211. http://www.iitkgp.ac.in/institute/history.php
  212. Jackson, Thomas William (2007). From Civil Rights to Human Rights. Philadelphia: University of Pennsylvania Press. pp. 100. ISBN 0-8122-3969-5. Retrieved 2008-03-09.
  213. Manor, J; Dua, B.D. (1994). Nehru to the Nineties: The Changing Office of Prime Minister in India. C. Hurst & Co. Publishers. p. 240.
  214. Zachariah, Benjamin (2004). Nehru. New York: Routledge. pp. 265. ISBN 0-415-25016-1.
  215. Harrison, Selig S. (July 1956). ""The Challenge to Indian Nationalism"". Foreign Affairs. 34 (2): 620-636.
  216. ది లాస్ట్ డేస్ అఫ్ ది రాజ్ (2007) (టివి)
  217. "AFSC లాస్ట్ నోబెల్ నామినేషన్స్". Archived from the original on 2008-08-15. Retrieved 2009-10-07.

ఇవి కూడా చదవండి

  • నెహ్రూ: ది ఇన్వెన్షన్ అఫ్ ఇండియా బై శశి ధరూర్ (2003 నవంబర్) ఆర్కేడ్ బుక్స్ ISBN 1-55970-697-X
  • Frank Moraes (2008). Jawaharlal Nehru. Jaico Publishing House. ISBN 978-8179926956.
  • జవహర్లాల్ నెహ్రూ (ఎడిటెడ్ బై ఎస్. గోపాల్ అండ్ ఉమా అయ్యంగార్) (2003 జూలై) ది ఎస్సెన్షియల్ రైటింగ్స్ అఫ్ జవహర్లాల్ నెహ్రూ ఆక్స్ఫర్డ్ యునివెర్సిటీ ప్రెస్ ISBN 0195653246
  • ఆటోబయోగ్రఫీ:టువార్డ్ ఫ్రీడం,ఆక్స్ఫర్డ్ యునివెర్సిటీ ప్రెస్
  • జవహర్లాల్ నెహ్రూ : లైఫ్ అండ్ వర్క్ ఎం.చలపతి రావ్, నేషనల్ బుక్ క్లబ్ (1966 జనవరి 1)
  • జవహర్లాల్ నెహ్రూ బై ఎం. చలపతి రావ్ [న్యూ ఢిల్లీ ] పబ్లికేషన్స్ డివిజన్, సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము [1973]
  • లెటర్స్ ఫ్రం ఎ ఫాదర్ టు హిస్ డాటర్ బై జవహర్లాల్ నెహ్రూ, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్
  • నెహ్రూ: ఎ పొలిటికల్ బయోగ్రఫీ బై మైఖేల్ బ్రేచేర్ (1959). లండన్:ఆక్స్ఫర్డ్ యునివెర్సిటీ ప్రెస్
  • ఆఫ్టర్ నెహ్రూ, వ్హో బై వెల్ల్స్ హంగెన్ (1963). లండన్:రుపెర్ట్ హార్ట్-డవిస్.
  • నెహ్రూ: ది ఇయర్స్ అఫ్ పవర్ బై గెఒఫ్ఫ్రేయ్ టైసన్ (1966). లండన్: పాల్ మాల్ ప్రెస్.
  • ఇండిపెన్డేన్స్ అండ్ ఆఫ్టర్: ఎ కల్లెక్షన్ అఫ్ ది మోర్ ఇంపార్టంట్ స్పీచెస్ అఫ్ జవహర్లాల్ నెహ్రూ ఫ్రమ్ సెప్టెంబర్ 1946 టు మే 1949 (1949). ఢిల్లీ: ది పబ్లికేషన్స్ డివిజన్, గవర్నమెంట్ అఫ్ ఇండియా.
  • కమాండింగ్ హైట్స్. బై జోసెఫ్ స్టనిస్లా అండ్ డానిఎల్ ఎ. ఎర్గిన్. (సిమోన్ & స్చుస్టర్, ఇంక్: న్యూ యార్క్), 1998. http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharla.pdf
  • "ది ఛాలెంజ్ టు ఇండియన్ నేషనలిసం." బై సెలిగ్ స్. హర్రిసన్ ఫారిన్ అఫ్ఫైర్స్ వాల్. 34, no. 2 (1956): 620-636.
  • “నెహ్రూ, జవహర్లాల్.” బై ఐన్స్లీ టి. ఏమ్బ్రీ, ఎడ్., అండ్ ది ఆసియా సొసైటీ. ఎన్సైక్లోపీడియా అఫ్ ఆసియన్ హిస్టరీ. వాల్. 3. చార్లెస్ స్క్రిబ్నేర్స్ సన్స్. న్యూ యార్క్. (1988): 98-100.
  • “నెహ్రూ: ది గ్రేట్ అవేకెనింగ్.” బై రాబర్ట్ షెర్రొద్. సాటర్డే ఈవెనింగ్ పోస్ట్ వాల్ . 236, no. 2 (1963 జనవరి 19): 60-67.
  • సర్వేపల్లి గోపాల్ (1993). జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర. Translated by రామలింగం, డి,. సాహిత్య అకాడెమీ. ISBN 81-7201-212-8.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: translators list (link)
  • రామచంద్ర గుహా (2010). గాంధీ అనంతర భారతదేశం. Translated by చక్రపాణి, కాకాని. ఎమెస్కో ప్రచురణలు. ISBN 978-93-80409-25-2.
  • రాజ్‌మోహన్ గాంధీ (1997). రాజాజీ జీవిత కథ. Translated by అశోక్, టంకశాల. ఎమెస్కో ప్రచురణలు. ISBN 978-93-85231-30-8తెలుగు అనువాదం 2015లో ప్రచురితం{{cite book}}: CS1 maint: postscript (link)
  • బిపిన్, చంద్ర; మృదులా, ముఖర్జీ; ఆదిత్య, ముఖర్జీ; సుచేతా, మహాజన్; కె.ఎన్., పణిక్కర్ (1987). India's Struggle for Independence. Penguin Books. ISBN 9780140107814.
  • రాజ్‌మోహన్ గాంధీ (2006). మోహన్ దాస్:ఒక మనిషీ అతని ప్రజలూ ఒక సామ్రాజ్యపు యథార్థ గాథ. Translated by భాస్కరం, కల్లూరి. ఎమెస్కో ప్రచురణలు. ISBN 978-93-80409-82-5తెలుగు అనువాదం 2011లో ప్రచురితం{{cite book}}: CS1 maint: postscript (link)

బాహ్య లింకులు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Jawaharlal Nehru గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

  నిఘంటువు విక్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోట్ నుండి
  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి


ఇంతకు ముందు ఉన్నవారు:
-
భారత ప్రధానమంత్రి
15/08/1947—27/05/1964
తరువాత వచ్చినవారు:
గుర్జారీలాల్ నందా