ఆది పర్వము ద్వితీయాశ్వాసము
మహాభారతం ఇతిహాసంలో మొదటిభాగము పేరు ఆదిపర్వము. ఆ పర్వంలో రెండవ ఉపభాగం ఆది పర్వము ద్వితీయాశ్వాసము.
ద్వితీయాశ్వాసము
మార్చుఈ అశ్వాసమునందు, గరుడుని కథ, దేవదానవులు సముద్రము మదించి అమృతము సాధించుట, దేవదానవ యుద్ధం, వినతా దాస్యం, నాగుల శాపం, గరుడుని జనం, వినతా దాస్య విముక్తి, పరీక్షిత్తు మహారాజు శాపం, సర్పయాగ విశేషాలు వర్ణించ బడ్డాయి.
ద్వితీయాంవాసం లోని ప్రధానాంశాలు;-
నాగులకు శాపము
మార్చుకశ్యప ప్రజాపతి భార్యలైన వినతా, కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు. కశ్యపుడు వారిని " మీకు ఎలాంటి పుత్రులు కావాలి " అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది. వినత తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. యాగ ఫలితంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకు రెండు అండాలు కలిగాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది వెయ్యి మంది నాగ కుమారులు జనించాయి. అందుకు వినత ఉక్రోష పడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది. దాని నుండి సగము దేహంతో జన్మించిన అనూరుడు " ఎందుకు అమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు. నీ వలన నేను సగం దేహంతో పుట్టాను. ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివి అగుదువుగాక " అని శపించాడు. ఆ తరువాత తాను సూర్యునికి సారథిగా వెళ్ళాడు. అనూరుడు వెళుతూ తన తల్లితో " అమ్మా రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు మహా బల సంపన్నుడు. అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు " అని చెప్పి వెళ్ళాడు.
ఇలా ఉండగా దేవ దానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా చేసి మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని మధించడం మొదలు పెట్టారు. ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు. ఆ తరువాత పుట్టిన ఉచ్చైశ్వం, ఐరావతం ఇంద్రుడు స్వీకరించాడు. కౌస్థుభ మణిని, లక్ష్మీ దేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు. ఆ తరువాత కల్పవృక్షం, కామధేనువు, అప్సర కాంతలు, సుర మొదలైనవి లభించాయి. చివరగా ధన్వంతరి అమృత కలశంతో అవతరించాడు. అమృత కలశాన్ని రాక్షసులు లాక్కుని వెళ్ళారు. అమృతం
కోసం దేవ దానవులు కలహించారు. విష్ణుమూర్తి మోహిని అవతారంలో రాక్షసులను వంచించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు. ఇది గ్రహించిన రాహువు, కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు. సూర్య చంద్రులు ఇది గ్రహించి విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణుమూర్తి వారి శిరస్సును చక్రా యుధంతో ఖండించాడు. అప్పటికే గొంతు వరకూ దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది. అది మొదలు వారు సూర్య చంద్రులపై వైరం పెంచుకున్నారు. వంచించ బడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేసారు. యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు. దేవతలు మంధర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు.
వినతా కద్రువల పందెం
మార్చుఇంద్రుని ఉచ్ఛైశ్వం సముద్రతీరంలో తిరగటం చూసిన కద్రువ వినతతో అంతటి తెల్లని అశ్వం తోక మాత్రం నల్లగా ఉందని చెప్పింది. అందుకు వినత తోక తెల్లగా ఉంది కదా అని చెప్పింది. దీనితో సవతులకు పంతం పెరిగి పందెం కాచారు. ఆ పందెం ప్రకారం గెలిచిన వారు ఓడిన వారికి దాస్యం చేయాలని ఒప్పందం కుదుర్చు కున్నారు. వినత అప్పుడే కావాలంటే దగ్గరకి వెళ్ళి చూద్దామని చెప్పింది. కద్రువ వినతను వారించి మరునాడు చూద్దామని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన కద్రువ తన కుమారులను పిలిచి ఆగుర్రం తోక నల్లగా మార్చి తల్లిని దాస్య బాధ నుండి కాపాడమని అడుగింది. అది అధర్మమని చేయలేమని నిరాకరించిన కుమారులను జనమేజయుని సర్పయాగంలో పడి మరణించమని శాపం ఇచ్చింది. ఇది చూసి భయపడిన కర్కోటకుడు అశ్వం తోకకు చుట్టుకున్నందు వలన తోక నల్లగా ఉందని భ్రమపడిన వినత కద్రువకు దాస్యం చేయటం మొదలుపెట్టింది.
వినత దాస్యవిమిక్తి
మార్చుతరువాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు. గరుత్మంతుడు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు. ఒక రోజు కద్రువ గరుడా ! నీ తల్లి నాకు దాసి నీవు దాసీ పుత్రుడవు. కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికిని వెళ్ళు" అన్నది. ఒక రోజు గరుత్మంతుడు నాగులను రెక్కలమీద ఎక్కించుకుని సూర్య మండల సమీపానికి వెళ్ళాడు. వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయాయి. కద్రువ ఇంద్రుని ప్రార్ధించి వర్షం కురిపించి పుత్రులను సేద తీర్చింది. పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది. అది సహించలేని గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు. తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు. గరుత్మంతుడు తమ దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రువను అడిగాడు. ఆమె తన కుమారులకు అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులు కాగలరని చెప్పింది. గరుత్మంతుడు అమృతం తీసుకు రావడానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో తనకు తీవ్రంగా ఆకలి అయింది. ఆకలి తీర్చమని తండ్రిని అడిగాడు. కశ్యపుడు " కుమారా విభావసుడు సుప్రీతకుడు అనే అన్నదమ్ము ఉన్నారు. తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడి ఏనుగువు కమ్ము అని విభావసుడు శపించాడు. తమ్ముడు కోపించి అన్నను తాబేలువు కమ్ము అని ప్రతి శాపం ఇచ్చాడు. అప్పుడు వారిరువురు మూడు యోజనములు పొడవు పది యోజనము వెడల్పు గల తాబేలు
గానూ, ఆరు యోజనముల పొడవు పన్నెండు యోజనముల వెడల్పు కలిగిన ఏనుగుగానూ మారి పోయారు. కానీ ఇప్పటికీ కలహించుకుంటూ ఉన్నారు. నీవు వారిరువురిని పట్టి తిని ఆకలి తీర్చుకో ". గరుడుడు సంతోషించి విభావసుడు అనే ఏనుగుని సుప్రతీకుడు అనే తాబేలును తీసుకుని రోహణుడు అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ వృక్షపు శాఖలో తపసు చేసుకుంటున్న మునులను చూసాడు. వారు క్రింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏమి చేయాలి అని అడిగాడు. కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొమ్మని ప్రార్ధించాడు. మునులు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్ళారు. గరుత్మంతుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి చేరాడు. దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృత రక్షకులను ఓడించి అమృతాన్ని తీసుకు వెళుతున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి గరుడుని వద్దకు వచ్చి " నీ సాహసానికి మెచ్చాను వరం ఏమి కావాలి " అని అడిగాడు. అందుకు గరుత్మంతుడు " దేవా సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి, విష్ణుమూర్తికి వాహనం కావాలి " అని కోరుకున్నాడు. ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునపై వజ్రాయుధాన్ని వేసాడు. తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈకను మాత్రం తుంచమని చెప్పాడు. ఇంద్రుడు గరుడుని బలానికి అచ్చెరువు చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు. గరుడా క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకొన్నాడు. అందుకు సమ్మతించిన గరుత్మంతుడు "నేను అమృతాన్నిచ్చి నా తల్లితో సహా దాస్య విముక్తులము అవుతాము. ఇంద్రా నీవు వారు అమృతం సేవించే లోపు తిరిగి తీసుకొని వెళ్ళు" అని చెప్పాడు. అలాగే చేసి తల్లిని దాస్య విముక్తి చేసి తన రెక్కలపై పెట్టుకొని తీసుకు వెళ్ళాడు. అమృతం త్రాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకు వెళ్ళాడు. నిరాశ పడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి. ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలి పోయాయి. ఆనాటి నుండి నాగులు ద్విజిహ్వులు అయ్యారు. అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రం అయ్యాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్య పడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. అతని సత్య సంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మ దేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆది శేషునకు అప్పగించాడు.
నాగులను రక్షించే ప్రయత్నం
మార్చుఆది శేషువు వెళ్ళగానే కద్రువ కుమారులకు సర్పయాగం భయం పట్టుకుంది. అందు వలన కలత చెందిన వాసుకి నాగులను పిలిచి తనకు పాలసముద్ర మధనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చిరంజీవత్వం లభించేలా చేసారు. మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పాడు. అది విని ఏలా పుత్రుడు అనే పాము " అమ్మ శాపం ఇచ్చే సమయంలో నేను అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను. దేవతలంతా " బ్రహ్మదేవా ఏ మాత్రం దయ లేకుండా కద్రువ కుమారులకు శాపం ఇచ్చింది. దీనికి విమోచన లేదా " అన్నారు. బ్రహ్మ దేవుడు దేవతలతో " పాములు లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే. అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తీకుడు చేస్తాడు " అని దేవతలు చెప్పగా విన్నాను. ఆ తరువాత వాసుకి తన సోదరి జరత్కారువుని వివాహమాడటానికి జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు. జరత్కారువు ఒక ముని. అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. ఒక రోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కొరకగా మిగిలిన రెల్లు దుబ్బులను చూసాడు. వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి " మహాత్ములారా ఇలా తలకిందులుగా ఎందుకు వేలాడుతున్నారు. ఇదేమి తపస్సు" అని అడిగాడు. అందుకు వారు " మా వంశంలో పుట్టిన జరత్కారువు అనే పాప కర్ముడు వివాహం చేసుకుని వంశాభివృద్ధి చేయలేదు. అందువలన అతని పితృ దేవతలమైన మాకు ఉత్తమ గతులు కలుగలేదు. నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతులు కలుగచేయమని చెప్పు " అన్నారు. అది విని జరత్కారువు పితృరుణం తీర్చుకొనే నిమిత్తం వివాహం చేసుకోవడానికి తనపేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు. కానీ అతనికి తన పేరు కలిగిన కన్య లభ్యం కాలేదు. అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెలిని తీసుకుని జరత్కారుని దగ్గరకు వెళ్ళాడు. వాసుకి జరత్కారునితో " మహాత్మా ఈమె నీ పేరు కలిగిన కన్య ఈమెను వివాహం చేసుకోండి " అన్నాడు. అందుకు సమ్మతించి జరత్కారువును వివాహం చేసుకున్నాడు. అతడు భార్యతో "నీవు నా మాటను ఎప్పుడూ మన్నించాలి నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను విడిచి తపస్సు చేసుకోవడానికి వెళతాను" అన్నాడు. ఆమె అందుకు అంగీకరించింది. జరత్కారువు గర్భవతి అయింది. ఒకరోజు సంధ్యా వందనం చేసుకునే సమయం అయిందని తన తొడపై తల పెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్ర లేపి చెప్పింది. అందుకు జరత్కారుడు కోపించి " నన్ను నిద్ర లేపి అవమానించావు. కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళతాను. నీవు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు " అన్నాడు. జరత్కారువు వాసుకి ఇంటికి వెళ్ళింది. వాసుకి ఇంటికి చేరిన జరత్కారువు ఆస్తీకునికి జన్మ ఇచ్చింది. ఆస్తీకుడు చ్యవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేసాడు.
పరీక్షిత్తు శాపం
మార్చుతక్షకుని మీద పగ పట్టిన ఉదంకుడు జనమేజయునికి అతని తండ్రి పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పి సర్పయాగానికి ప్రోత్సహించాడు. జనమేజయుడు మంత్రులను రావించి తన తండ్రి మరణ వృత్తాంతం వివరించమని కోరాడు. మంత్రులు ఇలా వివరించ సాగారు. అర్జుని కుమారుడు అభిమన్యుడు. అతని భార్య ఉత్తర. ఉత్తరాభిమన్యుల కుమారుడు మీ తండ్రిగారైన పరీక్షిత్తు. పరీక్షిత్తుఒకరోజు మహారాజు వేట నిమిత్తం అడవిలోకి వెళ్ళి దప్పిగొన్నాడు. అడవిలో ఒక మృగాన్ని వేటాడుతూ శమీకుని ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ దీర్ఘ తపస్సులో ఉన్న శమీకుని " అయ్యా ఇటు వైపు నేను వేటాడుతున్న మృగం వచ్చిందా" అని అడిగాడు. ధ్యాన మగ్ధుడైన శమీకుడు బదులివ్వలేదు. ఆ కారణంగా ఆగ్రహించి పరీక్షిత్తు అక్కడ చచ్చి పడిన పాముని తీసి అతని మెడలో వేసాడు. ఆ తరువాత హస్థినాపురం వెళ్ళాడు. ఆ సమయంలో శమీకుని కుమారుడైన శృంగి లేడు. శమీక మహర్షి కుమారుడైన శృంగి సహధ్యాయి, మిత్రుడైన కృశుడు ఇది చూసాడు. కృశుడు శృంగి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాడు. అది విన్న శృంగి " అడవిలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి ఏడు రోజులలో తక్షకుడు అనే సర్పరాజుచే మరణించు గాక" అని శపించాడు. జరిగినదంతా శృంగి ద్వారా తెలుసుకున్న శమీకుడు బాధపడి " కుమారా కోపం అనర్ధ హేతువు. మనం అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి కారణం మనలను రక్షించే రాజే కారణం. పరీక్షిత్తు ధర్మ రక్షకుడు. ఆకలి దప్పులకు ఆగలేక విసుగులో ఈ పని చేసాడు. నీ శాపాన్ని ఉపసంహరించు " అన్నాడు. అందుకు శృంగి అంగీకరించ లేదు. శమీకుడు గౌరిముఖుడు అనే శిష్యుని పిలిచి పరీక్షిత్తుని కలసి జరిగినది వివరించి ఆపద తొలగే ఉపాయం ఆలోచించమని చెప్పాడు. గౌరిముఖుని ద్వారా విషయం తెలుసుకున్న పరీక్షిత్తు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.ఏడవ రోజు వచ్చింది. పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయని బ్రహ్మ దేవుడు పాము కాటుకు మరణించిన వారిని రక్షించే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేసించాడు. కశ్యపుడు శాపోపహతుడైన పరీక్షిత్తుని రక్షించడానికి బయలుదేరాడు. శాపాన్ని అమలు చేయడానికి బయలుదేరిన తక్షకుడు కశ్యపుని మార్గ మధ్యంలో కలిసాడు. తక్షకుడు కశ్యపుడు పరీక్షిత్తుని రక్షించడానికి వెళుతున్నాడని తెలుసుకున్నాడు. తక్షకుడు కశ్యపునితో పరీక్షిత్తుని రక్షించడం అసంభవం అన్నాడు. కశ్యపుడు అంగీకరించ లేదు. తక్షకుడు పక్కన ఉన్న వృక్షాన్ని కాటు వేసి దాన్ని బతికించు చూద్దాం అన్నాడు. కశ్యపుడు ఆ బూడిదను మంత్రించి జీవింప చేసాడు. తక్షకుడు కశ్యపునితో " మహాత్మా శృంగి ఇచ్చిన శాపం తిరుగు లేనిది. మహారాజు ఇచ్చేవాటికన్నా నేను అధికం ఇస్తాను తిరిగి వెళ్ళు " అన్నాడు. కశ్యపుడు జరగబోయే దానిని దివ్య దృష్టితో గ్రహించి తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళాడు.. తర్వాత తక్షకుడు నాగ కుమారులను పిలిచి బ్రాహ్మణ వేషాలలో వెళ్ళి పరీక్షిత్తుకు పండ్లు తీసుకుని ఇవ్వండి అని చెప్పి తాను ఆ పండ్లలో క్రిమి రూపంలో దాక్కున్నాడు. పరీక్షిత్తు దగ్గరకు చేరిన తక్షకుడు ఆయన పండును వలవగానే బయటకు వచ్చి విషాగ్నులు చిమ్ముతూ కాటు వేసి పరీక్షిత్తును చంపాడు. ఓ మంత్రులారా! తక్షకుడికి కాశ్యప బ్రాహ్మణుడికి మధ్య జరిగిని ఈ సంభాషణ మీకు ఎలా తెలిసిందని జనమేజయ మహారాజు అడుగగా మంత్రులు తక్షకుడు కాటువేసిన పచ్చని వృక్షం కొమ్మమీద అంతకు ముందే ఓ కట్టెలు కొట్టేవాడు ఎక్కి వున్నాడు. వాడిని తక్షకుడు గాని బ్రాహ్మణుడు గాని చూడలేదు. వాడు తక్షకుని కాటుతో కాలి బూడిద అయి మరల కశ్యపుని మంత్రప్రభావంచేత ఆ చెట్టుతో పాటు బ్రతికి మా వద్దకు వచ్చి ఆ విషయమును చెప్పాడు. మేము విన్నది చూసినది మీకు వివరించాము. మీకు ఏది ఉచితం అనిపిస్తే దానిని ఆచరించండి అని అన్నారు.
సర్పయాగము
మార్చుజనమేజయునకు పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు " మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమైయ్యాడు. కనుక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి " అన్నారు. ఈ ఉదంతం విన్న జనమేజయుడు ఆగ్రహించి ఋత్విక్కులను రావించి సర్పయాగానికి ఏర్పాట్లు చేసాడు. ఆ సందర్భంలో వాస్తు శాస్త్ర నిపుణుడు ఒకడు జనమేజయునితో " సర్పయాగం మంచిదే కాని ఈ యజ్ఞ ప్రదేశము, కొలతలు జరుగుతున్న ఈ సమయమును బట్టి ఈ యాగం ఒక బ్రాహ్మణుడి కారణంగా పూర్తికాదు. మధ్యలో ఆగిపోతుంది " అని చెప్పాడు. జనమేజయుడు అతడిపై కోపించి "నా అనుమతిలేకుండా యజ్ఞశాలలోనికి ఎవరిని రానివ్వవద్దని" సేవకులను ఆదేశించి సర్పయాగం ఆరంభించాడు.
యాగం మొదలైంది. పాములన్ని యాగంలోపడి మరణిస్తున్నాయి.తక్షకుడు ఇది చూసి కలత చెందాడు. మిత్రుడైన ఇంద్రుని వద్దకువెళ్లి శరణు వేడాడు. ఇంద్రునికి బ్రహ్మ దేవుడు కొన్ని పాములకు అభయం ఇచ్చిన సంగతి తెలుసు. కనుక " తక్షకా నీకేమి భయం లేదు " అని చెప్పాడు. ఎన్నో భయంకరమైన, క్రోసుల పొడవు గలిగిన అనేక సర్పాలు యజ్ఞ గుండంలో పది అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఇలా సర్పాలు సర్పయాగంలో పడి మరణించడం చూసిన వాసుకి తన చెల్లెలితో " అమ్మా పాములన్నీ సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి. ఇందుకు పరిష్కారం నీ చేతిలో ఉంది. నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తీకుడు ఈ సర్పయాగం ఆపు చేయగలడని బ్రహ్మ దేవుడు చెప్పాడు. కనుక ఆస్తీకుని పంపి ఈ యాగాన్ని ఆపించు " అన్నాడు. అది విన్న జరత్కారువు ఆస్తీకుని పిలిచి "కుమారా నీ మేనమామ మాట విన్నావు కదా నీవు వెళ్ళి సర్పయాగాన్ని నిలుపు" అని కోరింది. ఆస్తీకుడు జనమేజయుని వద్దకు బయలు దేరి వెళ్ళి యజ్ఞశాలలో వున్న జనమేజయునితో "జనమేజయా నీ పూర్వీకులైన రఘువు, మాంధాత, దశరధుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞ యాగాదులు చేసి పునీతుడివి అయ్యావు. నీవు చేస్తున్న యాగం గొప్పది. సర్వ శాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించ పడుతుంది. వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది. నీకు శుభం కలుగుతుంది" అన్నాడు. ఆ స్తుతికి సంతోష పడి జనమేజయుడు ఆస్తీకునితో " మహాత్మా ఏమి వరం కావాలో కోరుకో " అన్నాడు.ఆస్తీకుడు " జనమేజయా ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను రక్షించు " అన్నాడు. జనమేజయ మహారాజు ఈ సర్పయాగం తన తండ్రిని తక్షకుడు చంపాడని అందుకు ప్రతీకారంగా ఈ యాగాన్ని చేస్తున్నానని ఇది కాకుండా మరి ఏదైనా కోరామని ప్రార్ధిస్తున్నాడు. ఆ సమయంలో తక్షకుడిని లక్ష్యంగా పెట్టుకుని ఋత్విక్కులు మంత్ర పూర్వకంగా ఒకటికి రెండు సార్లు ఆహ్వానిస్తున్నా తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుని శరణు వేడినట్లు దివ్య ద్రుష్టి ద్వార తెలుసుకుని జనమేజ మహారాజుకు తెలుపగా ఆ రాజు ఇంద్రునితో సహా తక్షకుని అగ్నిగుండంలో పదవేయమని ఆజ్ఞాపించగా ఆ యజ్ఞ హోత ఏకాగ్రచిత్హుడై ఇంద్రుడితో సహా తక్షుకుడిని ఆహ్వానించగా ఇంద్రుడు మంత్ర ప్రభావంచేత తక్షకుదితోసహా ఆకాశంలో భయపడుతూ వచ్చి, భయపడి " తక్షకా నీవు నీ దారిన వెళ్ళు. ఇక నేను నిన్ను రక్షించ లేను " అని తక్షకుడిని అక్కడే వదిలి తన భవనమునకు వెళ్ళాడు. తక్షకుడు భయంకరంగా భయంతో అరుస్తూ మంత్రశక్తికి ఆదీనుడై యజ్ఞగుండం లో పడబోతూ వుండగా ఆస్తికుడు"తక్షకా! ఆగు అగు అగు" అని మూడుసార్లు అనగా తక్షకుడు అక్కడే ఆగిపోయి ఆకాశంలో వ్రేలాడుతున్నాడు. అప్పుడు యజ్ఞమునకు ఆహ్వనించ బడిన సదస్యులందరూ తపస్వి అయిన ఆస్తికుడి కోరికను మన్నింప వలసినదిగా కోరాగా జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు.తక్షకుడు వెను తిరిగి నాగలోకం చేరాడు. ఆస్తీకుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు. జనమేజయ మహారాజు ఋత్విక్కులకు, సభాసదులందరికి వేలకోలాది ధనాన్ని ఇచ్చి సత్కరించాడు. జనమేజయ మహారాజు ఆస్తికుడిని మెచ్చుకుని "ఆస్తిక మహాశయా! భావిష్యతోలో నేను అశ్వమేధయాగం చేస్తాను. అందులో మీరు సదస్యులుగా ఉండా"లని కోరగా ఆస్తికుడు "అలాగే" అని చెప్పి సన్మానములను స్వీకరించి ఇంటికి వచ్చి తల్లికి, మేనమామకు నమస్కరించి యజ్ఞసభలో జరిగినదంతా చెప్పగా వారు సంతోశించి "నీ కోరిక చెప్పు తీరుస్తామని కోరాగా ఆస్తికుడు "ఈ కథను స్మరించిన వారికి సర్పభయం లేకుండా చేయ"మని కోరాడు. వారు సంతసించి అలాగేనని వరమిస్తారు. ఇలా నాగుల్ని ఉద్ధరించి ఆస్తికుడు వివాహం చేసుకుని పుతపౌత్రులతో ఆనందగా జీవితంను గడిపి మోక్షమును పొందాడు.