ధన్వంతరి
ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.[1]
- భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
- బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
- కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") - ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.
- విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలుపు అయి ఉండవచ్చును.
వ్యుత్పత్తి
మార్చుధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. మనస్సు, శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.
భాగవతంలో గాధ
మార్చుభాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు."[2]
కాశీరాజ దివోదాస ధన్వంతరి
మార్చుభాగవతంలోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో ఉంది (9.17.4) - ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధవ్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. విష్ణుపురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు (దివోదాస ధన్వంతరి). ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించాడట. అవి [1]
- కాయ చికిత్స (Internal Medicine)
- కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)
- భూతవైద్యం లేదా గ్రహచికిత్స (Psychiatry)
- శలాక్యతంత్ర (Otto-Rhino-Laryngology & Opthalmology)
- శల్యతంత్ర (Surgery)
- విషతంత్ర (Toxicology)
- రసాయన తంత్ర (Geriatrics)
- వశీకరణ తంత్ర(The therapy for male sterility, impotency and the promotion of virility)
ఈ (సీనియర్) ధన్వంతరి కాశీరాజు దివోదాస ధన్వంతరికి ముత్తాత అయి ఉండాలి. కాశీరాజు దివోదాస ధన్వంతరి ఆయుర్వేద గ్రంధాలు ఏవైనా, ముఖ్యంగా శల్య సలాక్య తంత్రాల గురించి, వ్రాశాడో లేదో తెలియడం లేదు. బహుశా "చికిత్స తత్వ విజ్ఞానము", "చికిత్సా దర్శనము" అనేవి ధన్వంతరి దివోదాస రచనలు, "చికిత్సా కౌముది" అనేది కాశీరాజు రచన అయి ఉండవచ్చును. శుశ్రుతుడు రచించిన "శుశ్రుత సంహితము" అనే మనకు లభించే రచన అతని గురువైన కాశీరాజు బోధనలపై ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. వాటి ద్వారా ఆ కాలంలో శాస్త్రీయ విధానాలు స్పష్టంగా నెలకొన్నట్లు తెలుస్తున్నది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన ప్రమాణాల గురించి (scientific methodology comprising observation and inductive, deductive and analogical reasoning) చెప్పబడింది. శల్య తంత్ర, శలాక్య తంత్ర అనే రెండు శస్త్ర చికిత్సా విధానాలకు కాశీరాజ దివోదాస ధన్వంతరి ఆద్యుడు అనిపిస్తున్నది. ఇతను క్రీ.పూ.3000 కాలానికి చెందినవాడని ద్వారకానాధ్ అభిప్రాయపడుతున్నాడు కాని అది నిరూపించడం కష్టంగా ఉంది.[1]
ఆలయాలు
మార్చుధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం" (Central council for Research in Aurveda and Siddha) లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి.
తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.
కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు.
కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.
కర్ణాటక లో బెంగళూర్ లోని యశ్వంతపుర లోని గాయత్రి దేవస్తానం లో ధన్వంతరి దేవాలయం ఉంది.
కేరళ అష్టవైద్యం
మార్చుకేరళలో సిద్ధ, ఆయుర్వేద వైద్య విధానంలో "అష్టవైద్యం" అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది. ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా, పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది. ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తుంటారు. తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను, విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను, వడక్కంచేరి వద్ద, త్రిసూర్ పెరుంగ్వా వద్ద అలాంటి ఆలయాలున్నాయి. అలయిత్తూర్, కుట్టంచేరి, తైక్కాడ్, వయస్కార, వెల్లోడ్, చిరత్తమన్‌లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలున్నాయి.
ధన్వంతరి మంత్రం
మార్చుఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయవినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః
ధన్వంతరి వ్రతం
మార్చుఆయుర్వేద వైద్యులు ప్రతియేటా "ధన త్రయోదశి" (దీపావళికి రెండు రోజుల ముందు) నాడు భక్తితో జరుపుకొంటారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 ఇన్ఫినిటీ ఫౌండేషన్ "Does Ayurveda Begin With Dhanvantari, The Ancient Physician By D.P. Agrawal" - ఈ వ్యాస రచయిత డి.పి.అగర్వాల్ మరొక పరిశోధకుడైన ద్వారకానాధ్ రచనలనుండి ఉదాహరించాడు. - In the history of Indian medicine, Dhanvantari, though very famous, is an elusive name, shrouded in the mist of antiquity. According to some authorities, he was the giver of Ayurveda or the science of life to the world. In this essay we will try to trace his identity, as researched by Dwarkanath. We will also quote the legends associated with Dhanvatari.- ఇదే వ్యాసంలో ఈ రచయిత అగర్వాల్ పేర్కొన్న రచనలు (1) C. Dwarakanath. 1990. Dhanvantari. In Raghvan, V. (Ed.) Scientists: Cultural Leaders of India. New Delhi: Ministry of Information and Broadcasting. (2) Bag, A.K. 1997. History of Technology in India. Delhi: Indian National Academy of Science. (3) Mukhopadhyay, G. N. 1983. On the medical authorities. In History of Science in India ( Ed. Debiprasad Chattopadyaya). New Delhi: Editorial Enterprises. (4) Sharma, P.V. 1992. History of Medicine in India. Delhi: Indian National Academy of Science.
- ↑ "శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన" - రచన:ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణమఠము
బయటి లింకులు
మార్చు- Lord Dhanvantari
- Hindu God Dhanwantari: The promulgator of Ayurveda.
- Does Ayurveda begin with Dhanvantari, the ancient physician? By D.P. Agrawal
- Dhanvantari in the Bhagavata Purana