రేవూరి అనంత పద్మనాభరావు
రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి లో సుదీర్ఘ కాలం పనిచేసిన తరువాత, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో నాలుగేళ్లు పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఎన్నో అష్టావధానాలు చేసిన ఆయన 120 గ్రంథాలు (కథలు, నవలలు, అనువాదాలు, ఆధ్యాత్మికాలు, వ్యాసాలు) వ్రాశాడు. పదవీ విరమణ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానములో పనిచేశాడు. [1]
రేవూరి అనంత పద్మనాభరావు | |
---|---|
జననం | రేవూరి అనంత పద్మనాభరావు జనవరి 29, 1947 చెన్నూరు, నెల్లూరు జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
ఇతర పేర్లు | ఆర్. అనంత పద్మనాభరావు |
వృత్తి | రచయిత అవధాని కర్త అధ్యాపకుడు ప్రసారమాధ్యమాల సంచాలకుడు |
మతం | హిందూమతం |
భార్య / భర్త | రేవూరి శోభాదేవి |
తండ్రి | లక్ష్మీకాంతరావు |
తల్లి | శారద |
పురస్కారాలు | డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు, దోమ వెంకటస్వామి గుప్తా అవార్డు, అవధాని, కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ అనువాదక బహుమతి |
వ్యక్తిగత జీవితం
మార్చురేవూరి అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న నెల్లూరు జిల్లా చెన్నూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శారద,లక్ష్మీకాంతారావు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని చెన్నూరు గ్రామంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. నెల్లూరు వి.ఆర్.కళాశాల నుండి బి.ఏ. పట్టభద్రులయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.లో సర్వ ప్రథములుగా స్వర్ణ పతకాన్ని 1967లో పొందారు. కందుకూరి రుద్రకవి పై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పొందారు.
శోభాదేవిని వివాహం చేసుకున్నారు. ఈమె ఒక ఆధ్యాత్మిక రచయిత్రి.
వృత్తి
మార్చు1967 నుండి 1975 వరకు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. ఆ కాలంలో 50కి పైగా అష్టావధానాలు చేశారు. ఆ తరువాత 1975 ఆగస్టు 16న ఆకాశవాణి కడప కేంద్రంలో తెలుగు ప్రసంగ శాఖ ప్రొడ్యూసర్‌గా చేరాడు. 2001 వరకు అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా, వాణిజ్య ప్రసార విభాగం అధిపతిగా, ప్రసంగాల శాఖ డైరెక్టర్ గానే కాక, శిక్షణ సంస్థలో డిప్యూటి డైరెక్టర్, పాలసీ విభాగ డెరెక్టర్ లాంటి వివిధ హోదాలలో, దేశంలోని వివిధ కేంద్రాలలో పనిచేశారు.
2001 ఆగస్టు నుంచి దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో పనిచేసి 2005 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశాడు. ఆ తరువాత వివిధ ఐఎఎస్ అకాడమీలలో పనిచేశాడు. కవిగా, రచయితగా పద్మనాభరావు వివిధ గ్రంథాలు ప్రచురించారు. [1]
అవధాన హేల
మార్చుఅనంత పద్మనాభరావు తన 22వ ఏట 1969 జనవరి 31 న కందుకూరులో తొలి అష్టావధానం నిర్వహించారు. 1978 వరకు 10 సంవత్సరాలు వివిధ ప్రాంతాలలో అవధాన ప్రతిభ ప్రదర్శించారు. పలు పట్టణాలలో ప్రసిద్ధ పండితులు పృచ్ఛకులుగా/సభాధ్యక్షులుగా/ముఖ్య అతిథులుగా వ్యవహరించారు.
నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో జరిగిన అష్టావధానం ఆసాంతం తిలకించిన ఉత్తర ప్రదేశ్ గవర్నరు డా|| బెజవాడ గోపాలరెడ్డి సత్కరించారు. రాష్ట్రేతర ప్రాంతం బెంగుళూరులో 1977 జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలుగుభాషా సమితి ఆధ్వర్యంలో శతావధాని నరాల రామారెడ్డి అధ్యక్షతన జరిగిన అవధానాన్ని అప్పటి ఆకాశవాణి డైరెక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు రికార్డు చేసి గంటకు పైగా ప్రసారం చేశారు.
వీరు అవధానాలు చేసిన కొన్ని పట్టణాలు - కందుకూరు, కనిగిరి, పొదిలి, వేటపాళెం, విజయవాడ, నెల్లూరు, వెంకటగిరి, దామరమడుగు, దగదర్తి, కడప, ప్రొద్దుటూరు, తిరుపతి తదితర ప్రాంతాలు.
అవధాన సభలలో పాల్గొన్న పెద్దలు:
ఆచార్య జి.ఎన్. రెడ్డి, ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, కామిశెట్టి శ్రీనివాసులు, చెన్నాప్రగడ తిరుపతిరావు, కోట సోదర కవులు, ఏలూరిపాటి అనంతరామయ్య, కోట సుబ్రహ్మణ్య శాస్త్రి, మరుపూరు కోదండరామిరెడ్డి, ఉడాల సుబ్బరామ శాస్త్రి, డా|| బెజవాడ గోపాలరెడ్డి, తిక్కవరపు రామిరెడ్డి, పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, యస్.వి. భుజంగరాయ శర్మ, వింజమూరి శివరామారావు, జంధ్యాల మహతీశంకర్, శనగన నరసింహస్వామి, పైడిపాటి సుబ్బరామ శాస్త్రి, నరాల రామారెడ్డి, సి.వి.సుబ్బన్న శతావధాని, డా|| పుట్టపర్తి నారాయణాచార్యులు, నవులూరి పాలకొండయ్య ప్రభృతులు.
లభ్యమైన అవధాన పూరణ పద్యాలను 2008 లో "అవధాన పద్మ సరోవరం" పేర ప్రచురించి, అమెరికాలోని ఫ్రిమాంట్ లో, వంగూరి ఫౌండేషన్ వారి సభలో గొల్లపూడి మారుతీరావు ఆవిష్కరించారు. ఈ గ్రంధానికి సహస్రావధాని డా. మేడసాని మోహన్ ముందుమాట వ్రాసి, ప్రశంసలందించారు. పద్మనాభరావు Deccan Chronicle లో "ART OF ASHTAVADHANA" అనే వ్యాసం ప్రచురించారు.
ఢిల్లీలో పదవీ విరమణ చేసి విమానంలో తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి శర్మ తారసపడ్డారు. రిటైర్‌మెంట్ అనంతరం ఏం చేయాలనుకుంటున్నారని ఆయన అడిగితే పదవీ విరమణ అనంతరం తనకు శ్రీవెంకటేశ్వరుని సేవలో స్వచ్ఛంద సేవలు చేయాలని ఉందని చెప్పారు.[ఆధారం చూపాలి] దీంతో [ఆధారం చూపాలి] ఈఓ విజ్ఞప్తిపై 2005వ సంవత్సరంలో టీటీడీ ప్రాజెక్ట్సు కోఆర్డినేటర్‌గా చేరారు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సమన్వయకర్తగా అయిదేళ్లు పనిచేశారు. అప్పుడే భక్తి ఛానల్ పనులు పర్యవేక్షించారు.తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానంపై 2005-07 మధ్య శ్రీ వేంకటేశ్వర దృశ్య శ్ర వణ ప్రాజెక్టు కో ఆర్డినేటరుగానూ, 2007-10 మధ్య శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్, తిరుపతి కో ఆర్డినేటరుగానూ వ్యవహరించారు.
పదవీ విరమణ అనంతర సేవలు
మార్చుసివిల్ సర్వీసులో శిక్షణ ఇస్తున్న నారాయణ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు సభ్యుడిగా ఉంటూ సివిల్స్‌లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పాఠాలు చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసి, పలు కళాశాలల విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా పాఠాలు చెబుతున్నారు. హైదరాబాద్ స్టడీ సర్కిల్, అప్పా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు ఉస్మానియా, అంబేద్కర్ ఓపెన్, హైదరాబాద్, పద్మావతి విశ్వవిద్యాలయం, ఢిల్లీ జామియా మిలియా తదితర 15 యూనివర్శిటీల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
రచనలు-పలువురి పరిశోధనలు
మార్చుకేంద్ర సాహిత్య అకాడమీ వారికి "ప్రభాతవదనం" తెలుగులోకి అనువదించారు. ముల్క్ రాజ్ ఆనంద్ "Morning Face"కు అది తెలుగు అనువాదం. ఈ గ్రంథం 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ అనువాదకుని బహుమతి తెచ్చిపెట్టింది. వీరి మారని నాణెం, సంజ వెలుగు, వక్రించిన సరళరేఖ నవలలపై శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో శ్యాంప్రసాద్ పరిశోధన చేసి M. Phil. పట్టా పొందారు.
- డా.ఆర్. అనంత పద్మనాభరావు రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు
- పద్మనాభరావు నవలలు (ఎంఫిల్ )- టి. శ్యాం ప్రసాద్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
- పద్మనాభరావు అనువాద రచనలు (ఎంఫిల్ )-కట్టమంచి చంద్రశేఖర్, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం
- పద్మనాభరావు రచించిన జీవిత చరిత్రలు(పిహెచ్ డి)- కట్టమంచి చంద్రశేఖర్, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం
- పద్మనాభరావు సమగ్ర సాహిత్యం (పిహెచ్ డి)-ధన్యంరాజు నాగమణి, తెలుగు విశ్వవిద్యాలయం
- పద్మనాభరావు సృజనాత్మక రచనలు (పిహెచ్ డి)-బి. చిట్టెమ్మ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
- జర్మనీలో భారత దేశ ప్రతినిధిగా - జర్మనీ రేడియో వారి ఆహ్వానం మేరకు 1996 ఆగస్టు నెలలో ప్రసార మాధ్యమాలపై జర్మనీలోని కొలోన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పద్మనాభరావు భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 12 దేశాల ప్రతినిధులతో పాటు ఇందులో పాల్గొనడం ప్రత్యేక అంశం.
మరి కొన్ని విదేశీ ప్రయాణాలు :
మార్చు- జర్మనీ రేడియో సదస్సు 1996
- అమెరికాలో చికాగో సదస్సు 2002
- బ్రిటన్ లో బర్మింగ్ హాం 1998
- ఆటా సభలు-న్యూయార్క్ 2008
- ఫిల్మ్ గోయెర్స్ సన్మానం, దుబాయ్ 2014
కళలు- వ్యాఖ్యానాలు
మార్చుఅవధాన కళకు సంబంధించి పద్మనాభరావు భావాలు-అనుభవాలపై ఆంగ్ల పత్రిక 'వీక్' 2013లో సమగ్ర కథనం ప్రచురించింది. ఇందులో ఆయన ధారణ, నైపుణ్యం, సాహితీ సవాళ్ళను స్వీకరించే సామర్ధ్యాల గురించి అనేక వివరాలున్నాయి.
ప్రత్యక్ష వ్యాఖ్యానాలు :
(రేడియో, దూరదర్శన్)
- భద్రాచల సీతారామ కల్యాణం వ్యాఖ్యానం 1982-
- శ్రీశైల శివరాత్రి కల్యాణం 1984 నుంచి
- తిరుమల బ్రహ్మోత్సవాలు 1980 నుంచి
- యస్. వి. బి.సి. కల్యాణోత్సవాలు 2008 నుంచి
రచనలు
మార్చుThis section may be too long and excessively detailed. |
జీవితచరిత్రలు
మార్చు- రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి జీవితచరిత్ర
- ఆంధ్రకేసరి ప్రకాశం
- శంకరంబాడి సుందరాచారి
- బెజవాడ గోపాలరెడ్డి
- రాయలసీమ రత్నాలు - 2 భాగాలు
- ప్రసార ప్రముఖులు[2] (1996)
- ప్రసార రథసారథులు
- ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు
- జమలాపురం కేశవరావు
- మన ప్రకాశం
- బాల గంగాధర తిలక్
- పింగళి వెంకయ్య
- కాంతయ్య
- శారదా మంజీరాలు
- అనంత సాహితీ మూర్తి
- రాయలసీమ మహారథులు
- నరుని సేవలో నారాయణుడు
- దుర్గాబాయ్ దేశ్ ముఖ్
- యతీంద్రులు
పరిశోధన గ్రంధాలు.
మార్చు- కందుకూరి రుద్రకవి Ph D. పరిశోధన
- ప్రకృతికాంత Ph D. పరిశోధన
అనువాద గ్రంథాలు
మార్చు- ప్రభాత వదనం Mulk RaJ Anand - Morning Face అనువాదం)[3] (1992)
- ఛాయారేఖలు (Amitar Ghosh - Shadow Lines అనువాదం)
- నీరు (RAMA- WATER అనువాదం)
- రామాయణంలో స్త్రీ పాత్రలు (ఆంగ్లానువాదం)
విమర్శ
మార్చు- భారత సుప్రసిద్ధ గ్రంథాలు - తెలుగు[4] (1997)
- కందుకూరి రుద్రకవి
- ప్రకృతి కాంత
- తెలుగు పత్రికల సాహిత్య/ సాంస్కృతిక సేవ
- రేడియో నాటకాలు-పరిశీలన
- కావ్య పరిమళం
నవలలు
మార్చు- మారని నాణెం (రెండు ముద్రణలు)
- సంజ వెలుగు
- వక్రించిన సరళరేఖ
- వారసత్వం
- స్వగతాలు-నవలిక
కథలు
మార్చు- కథా కమామీషు
- గోరింట పూచింది
- కథా మందారం
- కథా దర్పణం
ప్రసార మాధ్యమాలు
మార్చు- తెలుగులో ప్రసార మాధ్యమాలు
- ఆకాశవాణి తీరుతెన్నులు
- రేడియో నాటకాలు
- రేడియోకి ఎలా వ్రాయాలి?
- ఆకాశవాణి పరిమళాలు
- అలనాటి ఆకాశవాణి
- జ్ఞాపకాలు-వ్యాపకాలు
- పద్య నాటక పంచకం
- ప్రసార మాధ్యమాలు
ఆంగ్ల గ్రంథాలు
మార్చు- లిటరరీ హెరిటేజ్
- రేడియో 2002
- ఇండియన్ క్లాసిక్స్ - తెలుగు
- జాబ్ ఇంటర్వూస్
- మారథాన్ రేస్ టు సివిల్ సర్వీసెస్
- వేయిపడగలు - విశ్వనాథ -ఆంగ్లానువాదం (4 ప్రకరణాలు)
- సివిల్స్ మారథాన్
- సంకరంబాడి సుందరాచారి
- ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాటిట్యూడ్
తెలుగులోకి అనువాదాలు
మార్చు- ప్రభాత వదనం - ముల్క్‌రాజ్ ఆనంద్ - Morning Face
- ఛాయారేఖలు - అమితాబ్ ఘోష్ - Shadow Lines
- వాల్మీకి - ఐ.పాండురంగారావు - Valmiki
- నీరు
- చెట్లు
- బోధనోపకరణాలు
- మధుక్షీరాలు - హీబ్రూ కథలకు అనువాదం - Not Just Milk & Honey
- మదర్ థెరిసా - మెహతా - Mother Teresa - Inspiring Incidents
ఆధ్యాత్మిక గ్రంథాలు
మార్చు- రామాయణంలో స్త్రీ పాత్రలు
- యశోద (బాల సాహిత్యంతి.తి.దే ప్రచురణ)
- హరివంశం (ఆకాశవాణి ధారావాహికం)
- భక్తి సాహిత్యం (వ్యాస సంపుటి)
- ఆంధ్ర మహాభారత వ్యాఖ్యానం - విరాటపర్వం
- ఆంధ్ర మహాభాగవతం - చతుర్థ స్కంధం
- వర్ణన రత్నాకరం - వ్యాఖ్యానం
- ముత్తుస్వామి దీక్షితులు[5] (1985)
- ఋషి పరంపర
- తిరుమలేశుని సన్నిధిలో
- ధర్మ సందేహాలు
- అంతరంగ తరంగం (సీతాయనం)
- సంగ్రహ వాల్మీకి రామాయణం
- తరిగొండ వెంగమాంబ
- మన పండుగలు
- పండుగలు-సంప్రదాయాలు
- పండుగలు-పరమార్థం
- కృష్ణా పుష్కర వేణి
- ప్రసిద్ధ క్షేత్రాలు
- కీచక వధ
- శతక ద్వయం
సివిల్స్ పుస్తకాలు:
మార్చు- సివిల్స్ ప్లానర్
- నీతి-నిజాయితీ
- పరిపాలనలో నీతి-నిజాయితీ
- సివిల్స్ పరీక్షలు-గెలుపు గుర్రాలు
- పోటీ పరీక్షలు- లక్ష్యసాధన
పరిష్కరణలు:
మార్చు- మాల్యాద్రి స్థల పురాణం
- నిరంకుశోపాఖ్యానం
- సుగ్రీవ విజయం
- రుక్మాంగద చరిత్ర
పద్యాలు:
మార్చు- పద్మ సరోవరం
- అవధాన పద్మ సరోవరం
- ఇతర రచనల వివరాలు
- దాంపత్య జీవన సౌరభం
- తలపుల తలుపులు
- భయం వేస్తోందా భారతీ?
- ఆంధ్ర మణిహారాలు-పబ్లికేషన్ డివిజన్ ప్రచురణ
పొందిన అవార్డులు
మార్చుతెలుగు సాహిత్యానికి పలు సేవలందించిన డాక్టర్ అనంత పద్మనాభరావుకు వివిధ అవార్డులు లభించాయి. వాటిలో కొన్నింటి వివరాలు.
- 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ అనువాదక బహుమతి లభించింది.
- 1999లో ఢిల్లీ, మద్రాసు తెలుగు అకాడమీల అవార్డులు వచ్చాయి.
- 2004లో డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవార్డు, దోమ వెంకటస్వామి గుప్తా అవార్డు,
- 2003లో చెన్నయ్‌లో భారతీయ సమైక్యతా పురస్కారం,
- 2002లో ఢిల్లీలో రాష్ట్రీయ ఏక్తా అవార్డు,
- 2000 సంవత్సరంలో నాగభైరవ కళాపీఠం అవార్డు,
- 1996లో విజయవాడలో ఈకే అవార్డు,
- 1991లో కవిత్రయ అవార్డు,
- 1992లో ఎస్. ఆంజనేయులు పురస్కారం
- 1993లో ప్రభాత వదనం పుస్తక రచనకు ఉత్తమ అనువాదకుడిగా తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం[6]
- సనాతన దర్మ ఛారిటబుల్ ట్రస్టు శ్రీరామ నవమి పురస్కారంతో సత్కరించింది.
- 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో అవధానిగా అనంత పద్మనాభరావును సన్మానించారు.
- న్యూయార్క్ లో జరిగిన ఆటా సభలో సత్కరించారు.
- రేడియో నాటకాలపై పరిశోధన చేసేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ పద్మనాభరావుకు ఫెలోషిప్‌నిచ్చింది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "అవిశ్రాంతం అరవై తర్వాత". Sakshi. 2015-03-02. Retrieved 2021-03-06.
- ↑ రేవూరి అనంత పద్మనాభరావు (1996). ప్రసార ప్రముఖులు. విజయవాడ: ఆకాశవాణి. Retrieved 7 March 2021.
- ↑ ఆర్. అనంత పద్మనాభరావు (1992). ప్రభాత వదనం. న్యూఢిల్లీ: సాహిత్య అకాదెమి. Retrieved 7 March 2021.
- ↑ ఆర్. అనంత పద్మనాభరావు (1997). భారత సుప్రసిద్ధ గ్రంథాలు. Retrieved 7 March 2021.
- ↑ ముత్తుస్వామి దీక్షితులు, తితిదే ప్రచురణ, 1985 ఆర్కీవు.కాంలో.
- ↑ "ఉత్తమ అనువాద రచనకు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం" (PDF). Archived from the original (PDF) on 2017-09-09. Retrieved 2021-03-07.
వనరులు
మార్చు- రాయలసీమ రచయితల చరిత్ర మూడవ సంపుటి - కల్లూరు అహోబలరావు - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన అంతరంగ కథనం