ఐ.కె.గుజ్రాల్

13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త.

ఇందర్ కుమార్ గుజ్రాల్ (హిందీ: इन्द्र कुमार गुजराल) (డిసెంబర్ 4, 1919 - నవంబరు 30, 2012) 12వ భారతదేశ ప్రధానమంత్రి,[1] దౌత్యవేత్త.

ఇందర్ కుమార్ గుజ్రాల్
ఐ.కె.గుజ్రాల్


పదవిలో
ఏప్రిల్ 21 1997 – మార్చి 19 1998
మునుపు హెచ్.డి.దేవెగౌడ
తరువాత అటల్ బిహారీ వాజపేయి

జననం (1919-12-04) 1919 డిసెంబరు 4 (వయసు 104)
జీలం, పంజాబ్, బ్రిటీషు ఇండియా
మరణం నవంబరు 30, 2012
రాజకీయ పార్టీ జనతా దళ్
భార్య/భర్త షీలా గుజ్రాల్

అవిభాజిత పంజాబ్ లోని జీలం (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది) లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ[2][3] (వర్తక కులం) కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళాడు.

బాల్యం మార్చు

ఇందర్ కుమార్ గుజ్రాల్. 1919 డిసెంబర్ 4న  అవతార్ నారాయణ్, పుష్ప గుజ్రాల్ దంపతులకు జన్మించాడు. జలియన్ వాలాబాగ్ ఊచకోత ఆయన పుట్టడానికి కొద్ది నెలల ముందు జరిగింది, ఈ అనాగరికత  చర్య పంజాబీలను రాజకీయ రంగాలకు అతీతంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడానికి పురికొల్పింది. అతని తల్లిదండ్రులు 1920 లలో లాలా లజపతి రాయ్ కు అభిమానులుగా మారారు, లాలాజీ హిందూ సంస్కరణ, రాజకీయ చర్య వారసత్వాన్ని కొనసాగించారు. అదే సమయంలో, గుజ్రాల్ తల్లి పుష్ప 1931 లో భగత్ సింగ్ ఉరితీయబడినప్పుడు  మద్దతుగా ఉంది. 1929 లాహోర్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పార్టీ జాతీయవాద దార్శనికతను గుర్తించిన గాంధేయవాదుల కుటుంబం.

గుజ్రాల్ తన బాల్యం నుండి రాజకీయ అనుబంధాలకు అతీతంగా వలసవాద వ్యతిరేక చర్యలో పాల్గొనడం ప్రారంభించాడు. స్వాతంత్య్రానికి మద్దతుగా బాలల సత్యాగ్రహం నిర్వహించినందుకు 11 ఏళ్ల వయసులోనే పోలీసులు ఆయనను అరెస్టు చేసారు. లాహోర్ లో విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా మారి 18 ఏళ్ల వయసులోనే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ పంజాబ్ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ సమయంలో, అతను తరచుగా జైలు శిక్షను అనుభవించాడు, ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అతని కుటుంబ సభ్యులు 'పూర్ణ స్వరాజ్యం' పట్ల నిబద్ధతతో ఉన్నందుకు చాలా మంది అరెస్థ కావడం, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వలసవాద వ్యతిరేక, జాతీయవాద నాయకులతో అతని రాజకీయ నిర్మాణం విడదీయరాని సంబంధం కలిగి ఉంది[4].

రాజకీయ జీవితం మార్చు

భారత రాజకీయాలలో సంచలనాత్మక సమయమైన 1975 జూన్ లో ఇందిరా గాంధీ మంత్రివర్గములో సమాచార, ప్రచార శాఖా మంత్రిగా పనిచేశాడు. 1975 జూన్ 12న అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1971 ఎన్నికలలో ఇందిరాగాంధీ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని నిర్ణయించి ఆమె ఎన్నికను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇందిరాగాంధీకి మద్దతుగా ఆమె కుమారుడు సంజయ్ గాంధీ పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము నుండి ప్రజలను లారీలలో రాజధానికి తరలించి, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు. ఈ నిరసన ప్రదర్శనలకు ప్రభుత్వాధీనములో ఉన్న రేడియో, టీవీలలో చూపించాలని గుజ్రాల్ ను సంజయ్ గాంధీ ఆజ్ఞాపించినట్టు వెల్లడైంది. అయితే రాజ్యంగబద్ధ అధికారమేదీ లేని సంజయ్ ఆజ్ఞను గుజ్రాల్ అంగీకరించలేదు. ఆ వెనువెంటనే సమాచార శాఖా మంత్రిగా గుజ్రాల్‌ను తొలగించి విద్యాచరణ్ శుక్లాను నియమించడం వెనుక ఇదే కారణమని పలువులు భావిస్తున్నారు.

ఆ తరువాత, గుజ్రాల్ రష్యాలో భారతీయ రాయబారిగా నియమితుడయ్యాడు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారము చేపట్టేసరికి, మాస్కోలో భారతీయ దౌత్యవేత్తగా గుజ్రాల్, 1979లో సోవియట్ సమాఖ్య యొక్క ఆఫ్ఘానిస్తాన్ దురాక్రమణను ఖండించేందుకు ఆమెను ఒప్పించాడు. అప్పటివరకు హంగేరీ, చెకోస్లవేకియాలలో సోవియట్ యొక్క సైనికచర్యలను సమర్ధించిన భారతదేశానికి ఇది మునుపటి దౌత్య వైఖరి కంటే భిన్నమైనది. దీని పర్వవసానముగానే ఇందిరాగాంధీ ఏకాంత సమావేశములో సోవియట్ నాయకుడైన లియొనిడ్ బ్రెజ్నేవ్‌కు ఆఫ్ఘానిస్తాన్ విషయంలో మాస్కో పొరపాటు చేసిందని తెలియజేసింది. దేశానికి 12వ ప్రధానిగా 1997 ఏప్రిల్‌ నుంచి 1998 మార్చి వరకు గుజ్రాల్‌ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1980లో కాంగ్రెస్‌ పార్టీని వీడారు. 1989లో జలంధర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేవెగౌడ తర్వాత యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గుజ్రాల్‌ సతీమణి షీలా గుజ్రాల్‌ పంజాబీ, హిందీ, ఆంగ్ల.. తదితరభాషలో అనేక రచనలు చేశారు. గుజ్రాల్‌ సోదరుడు సతీశ్‌ గుజ్రాల్‌ ప్రముఖ చిత్రకారుడు.

1975లో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు గుజ్రాల్‌ కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రిగా ఉన్నారు. అనంతరం కొంతకాలం సోవియట్‌ యూనియన్‌లో భారత రాయబారిగా పదవీబాధ్యతలు నిర్వహించారు. వీపీసింగ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌లో చేరిన పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. 1989లో వీపీ సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. 1996లో దేవెగౌడ సారథ్యంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారులోనూ విదేశాంగమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టడం విశేషం. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు గుజ్రాల్‌ సిద్దాంతం అనే నూతన సిద్దాంతాన్ని విదేశీవిధానంలో ప్రవేశపెట్టారు[5].

ఐకే గుజ్రాల్‌ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. వూపిరితిత్తుల సంబంధిత వ్యాధితో గుర్గావ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

గుజ్రాల్ సిద్ధాంతం మార్చు

ఐకే గుజ్రాల్ దేవెగౌడ ప్రభుత్వంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 'గుజ్రాల్ సిద్ధాంతాన్ని' ప్రతిపాదించారు. భారత విదేశాంగ విధానంలో ఇదొక మైలురాయిగా భావిస్తారు. గుజ్రాల్ సిద్ధాంతం ఐదు సూత్రాల రోడ్ మ్యాప్, ఇందులో  భారతదేశం, దాని పొరుగు దేశాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి, దౌత్య సంబంధాలలో తక్షణ ప్రేరేపణలను తొలగించడానికి ప్రయత్నించింది. భారత పొరుగు దేశాలతో స్నేహపూర్వక, ఆత్మీయ సంబంధాలను, దక్షిణాసియాలో పెద్ద దేశమైన భారత్ తన చిన్న పొరుగు దేశాలకు ఏకపక్ష రాయితీ ఇవ్వాలని, వారితో సుహృద్భావ సంబంధాలు కలిగి ఉండాలని సిద్ధాంతం చెబుతోంది[6].

గుజ్రాల్ సిద్ధాంతం వాస్తవాలు:

1. పొరుగు దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంకలతో భారత్ పరస్పరం సహకరించుకొని,విశ్వాసంతో తనకు చేతనైనంత అందిస్తుంది.

2. ఏ దక్షిణాసియా దేశమూ తన భూభాగాన్ని మరో దక్షిణాసియా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడుకోవడానికి అనుమతించకూడదు.

3. దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు.

4. దక్షిణాసియా దేశాలన్నీ ఒకరి ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించుకోవాలి.

5. శాంతియుత ద్వైపాక్షిక చర్చల ద్వారా తమ వివాదాలన్నింటినీ పరిష్కరించుకోవాలి. దక్షిణాసియాలో అతి పెద్ద దేశమైన భారత్ ఉపఖండంలోని పొరుగు దేశాలకు ఏకపక్ష రాయితీలు ఇవ్వగలదన్నది గుజ్రాల్ సిద్ధాంతం సారాంశం.


మూలాలు మార్చు

  1. "Shri Inder Kumar Gujral".
  2. "Contact Us - IndiaInfoline". www.indiainfoline.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-06.
  3. Ghai, Rajat (2014-05-07). "The office of Prime Minister: A largely north Indian upper-caste, Hindu affair". Business Standard India. Retrieved 2020-08-06.
  4. "IK Gujral: Son of Punjab who improved India's relations with neighbours". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-12-03. Retrieved 2023-12-24.
  5. "Inder Kumar Gujral | Biography, Education, Party, & Date of Birth | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 2023-11-30. Retrieved 2023-12-24.
  6. "Remembering IK Gujral, former PM who improved India's foreign relations". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-12-24.