కపిలవాయి రామనాథశాస్త్రి

(కపిలవాయి రామనాధశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)

ప్రసిద్ధ రంగస్థల నటులు, గాయకులైన కపిలవాయి రామనాథశాస్త్రి గారు 1890 కృష్ణా జిల్లా విజయవాడ తాలూకా మంతెనలో జన్మించారు.

కపిలవాయి రామనాథశాస్త్రి
జననంకపిలవాయి రామనాథశాస్త్రి
1890
మరణం1935
ప్రసిద్ధిప్రసిద్ధ రంగస్థల నటులు , గాయకులు.
కపిలవాయి రామనాథశాస్త్రి

రంగస్థల ప్రస్థానం మార్చు

వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. యడవల్లి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో నటనలోను, పద్యపఠనంలోనూ మెరుగులు దిద్దుకున్నారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి నటన, గాయక శైలి ఎందరినో ప్రభావితుల్ని చేసింది. వీరిలాగా పాడాలని చాలామంది నటులు, నటీమణులు ఆరాటపడేవారు. పద్యంలోని భావం చెడకుండా ప్రతి అక్షరాన్ని చివరకు పూర్ణానుస్వారాన్ని సైతం స్పష్టంగా పలికి సంగీత మాధురిని దానికి జతకూర్చేవారు. వీరి శ్రావ్యమైన కంఠధ్వని తోడై వీరి గానం ప్రజలను అత్యద్భుత రీతిలో ఆకట్టుకొనేది. ఆనాడు ఈయనకు ఈనాటి సినిమా తారలకున్నంత అభిమానులు ఉండేవారు. ఈయన పద్యం పాడితే వన్స్ మోర్ కొట్టి మళ్లీ మళ్లీ పాడించుకునేవారు. ఒకే రాత్రి రెండు పట్టణాలలో ప్రదర్శించే నాటకాలలో పాత్రలు ధరించిన రోజులు ఉన్నాయి. ఈయన నాటకానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. మైలవరం కంపెనీ మూతపడిన తర్వాత కిరాయి నాటకాలలో నటించారు.

ఈయన స్వరంతో వెలువడినన్ని గ్రామఫోన్ రికార్డులు ఆ రోజుల్లో ఏ నటుడు ఇవ్వలేదు. ఈ రికార్డులు ఆ రోజుల్లో కొన్ని వేలు అమ్ముడుపోయాయి. పెళ్ళిళ్లలోనూ, ఇతర శుభకార్యాలలోనూ కపిలవాయి రికార్డులనే విరివిగా పెట్టేవారు. ఇవి తమిళనాడు, మైసూర్ రాష్ట్రాలలో కూడా ప్రజాదరణపొందాయి. అతి తక్కువకాలంలో ఆంధ్రదేశమంతటా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు చేతులా సంపాదించాడు కానీ, సంపాదనంతా దురభ్యాసాలకు ఖర్చు చేశాడు.

ధరించిన పాత్రలు మార్చు

  • సారంగధరలో సారంగధరుడు
  • రామదాసులో రామదాసు
  • చింతామణిలో భవానీ శంకరుడు
  • పాదుకలో రాముడు
  • గయోపాఖ్యానంలో అర్జునుడు
  • శ్రీకృష్ణతులాభారంలో నారదుడు
  • సావిత్రిలో సత్యవంతుడు
  • విప్రనారాయణలో విప్రనారాయణుడు మొదలైనవి.

టాకీ చిత్రాలు వచ్చిన తర్వాత సక్కుబాయి, కృష్ణ తులాభారం (నారదుడిగా, 1935) వంటి కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు.

బిరుదులు మార్చు

  • రంగమార్తాండ

మరణము మార్చు

తెలుగు నాటకరంగంలో ధ్రువతారగా వెలిగిన శాస్త్రి ధనార్జన బాగా చేసినా అవసానదశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు. అతి తక్కువ వయస్సులో అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించిన శాస్త్రి 1935, అక్టోబరు 1వ తేదీన విజయవాడలో పక్షవాతంతో మరణించారు.[1]

మూలాలు మార్చు

  1. సంపాదకుడు (5 October 1935). "రంగమార్తాండ కపిలవాయి రామనాథశాస్త్రి గారు పరమపదమలంకరించిరి". శ్రీ సాధన పత్రిక. 8 (7): 6. Retrieved 12 June 2017.[permanent dead link]