కార్యమపూడి రాజమన్నారు

కార్యమపూడి రాజమన్నారు (1846-1916) శతావధాని. వనపర్తి సంస్థానంలోపనిచేశాడు.

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా) పేరాల గ్రామంలో 1846లో పరాభవ నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు జన్మించాడు. ఇతడు బాల్యంలో రావుల శేషయ్య వద్ద అమరకోశము, ఆంధ్రనామ సంగ్రహము, బాలరామాయణము చదువుకొన్నాడు. తరువాత అద్దంకి తిరుమల శ్రీకుమార తిరుమలాచార్యుల వద్ద కావ్య, నాటక సాహిత్యం, వ్యాకరణాలంకార శాస్త్రాలు అభ్యసించాడు. వేదం వేంకటరాయశాస్త్రి, తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదరకవులు, కాశీ కృష్ణాచార్యులు, పిశుపాటి చిదంబరశాస్త్రి ఇతని సమకాలికులు. ఇతడు సుమారు 78 అవధానాలు చేశాడు. ఇతడు విజయనగరం, పిఠాపురం, నూజివీడు, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థాలను దర్శించి అక్కడి విద్వత్కవులు పెట్టిన పరీక్షలలో విజయం సాధించి ఆయా సంస్థానాధీశులచే సత్కారాలు పొందాడు. ఇతడు 1916లో రాక్షస నామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమినాడు మరణించాడు.[1]

అవధానాలు

మార్చు

ఇతడు అష్టావధానాలు, షోడశావధానాలు, శతావధానాలు అనేకం చేశాడు. ఇతని అవధానాలలో సమస్య, వర్ణన, దత్తపది, న్యస్తాక్షరి, నిషిద్దాక్షరి వంటి అంశాలతో పాటు ఆంధ్రీకరణం, చతురంగము, ఇచ్ఛాంకశ్లోకము, కీర్తన, జావళి, పులిజూదము వంటి అంశాలు కూడా ఉండేవి. ఇతడు భట్టిప్రోలు, గుడివాడ, మైపాడు, సిద్ధవటం, మద్రాసు, సేలం, షోలాపూర్, అప్పయరాజు పేట, కందుకూరు, నెల్లూరు, చెఱుకుపల్లి, పొన్నూరు, నిడుబ్రోలు, వీపూరుపాలెం మొదలైన చోట్ల అవధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేసి మెప్పుపొందాడు.

ఇతడు పూరించిన అవధాన పద్యాలు కొన్ని:

  • సమస్య: ఇద్దరు భార్యలుండిరి మహేశునకున్ బలె రామమూర్తికిన్

పూరణ:

సుద్దులలోఁ గనుంగొనఁగ సూనృతవాణి యొకర్తు, దిక్కులం
దద్దయు నాడు నాటికి నుదారత భాసిలు స్వచ్ఛకీర్తియన్
ముద్దియ యోర్తు జానకిని భూసుతఁ బెండిలి గాక పూర్వమే
యిద్దఱు భార్యలుండిరి మహేశునకున్ బలె రామమూర్తికిన్

  • సమస్య: తల్లికి కొమరుండు సూత్రధారణ చేసెన్

పూరణ:

 ఎల్లరు మ్రొక్కెద రెవతెకు?
బల్లిరుఁదనఁ బరఁగు నెవఁడు? పతిమొదటం దా
నిల్లాలి కేమి చేసెను
తల్లికి, కొమరుండు, సూత్రధారణ చేసెన్

  • వర్ణన: పెన్సిలు

పూరణ:

శ్రీవల్లిగాఁగఁ దగి లో
గా వల్మ కోరగంబు గతి ధాతు కృతిన్
ఠీవిన్ గన్పడి, యందర
భావంబులు వ్రాయఁగలుగు భళి పెన్సిలిలన్

రచనలు

మార్చు
  1. శ్రీమాదాంధ్ర భగవద్గీత
  2. మాధవస్వామి శతకము
  3. శ్రీ సూర్యారాట్ప్రభుదర్శనము
  4. హరిశ్చంద్ర చరిత్రము (జంగం కథ)
  5. రాజవంశ రత్నావళి
  6. సీతారామ భూపాల విలాసము
  7. మూల్పూరు అగస్త్యేశ్వర శతకము
  8. సమస్యాపూర్త్యష్టోత్తర శతకము
  9. కన్యకా పరమేశ్వరీ దండకము
  10. వినాయక దండకము
  11. భావనాఋషి స్తోత్రాలు

మూలాలు

మార్చు
  1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధన విద్యాధరులు". అవధాన విద్యా సర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 106–111.