పుట్టుపూర్వోత్తరాలుసవరించు

భారతదేశంలో ఉన్న అతిప్రాచీన అటవీ తెగల్లో కిరాత జాతి ఒకటి. కిరాతులు మంగోలియన్ తెగలవారని, వారు ఆర్యుల రాకకు పూర్వమే భారతదేశంలోకి ప్రవేశించారని పలు పరిశోధనలు చెబుతున్నవి. ఆదిమ పర్షియా నుండి వచ్చిన ఆర్యులకు వ్యతిరేకంగా పోరాడిన వీరు ఆర్యుల దృష్టిలో అనార్యులుగా, రాక్షసులుగా పిలువబడ్డారని, ఆర్యుల వేదాలను కిరాతులు అంగీకరించకపోవడంతో, వైదిక ధర్మాలను పాటించలేనందున కిరాతులు క్షత్రియ హోదాను కోల్పోయారని మనుస్మృతిలో ఆర్యులు వ్రాయడం జరిగింది. కిరాతులు ఎక్కువగా నేపాల్, అస్సాం, నాగాలండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తారు.

కిరాత అను పదము కిర్యాత్ లేక కిర్జాత్ అను పదమునుండి ఆవిర్భవించింది. ఈ పదమునకు అర్ధము మెడిటిరేనియన్ ప్రాంతంలో కోట లేక పట్టణం [1]. కిరాతులు జనాభా పెరిగిన తర్వాత కోటలు, పట్టణంలు నిర్మించి వాటిని కిర్యాత్-హైం, కిర్యాత్ యారిం, కిర్జాథ్ అర్బ, కిర్యాత్ బాల్, కిర్యాత్ హుజ్రొ, కిర్యాత్ సన్న, కిర్యాత్ సఫెర్ అను పేర్లతో పిలిచేవారు. వీటికి అర్ధాలుగా బాల్ దేవుడు, పుస్తకాల పట్టణం, ఈత చెట్ల పట్టణం అని వచ్చేవి. ఈ ప్రాంతాల్లో ఉండేవారిని కెరెటి అని పిలువబడేవారు. ఈ తెగవారి పూర్వీకులు - బాబిలోనులో అబ్రహాము చిన్న తమ్ముడైన నహోరు అని, మోషే నాయకుడిగా యూదులు ఈ దేశాన్ని ఆక్రమించగా, వీరు బహిష్కరింపబడ్డారు. క్రమంగా వీరు తూర్పు, ఈశాన్య దేశాలకు వలసవెళ్ళిపోయారు. క్రీస్తు పూర్వం 24,000 లో కిరాతుల్లో ఒక శాఖ మెసొపటేమియా వచ్చి, అక్కడ అషూరు ప్రజలతో కలిశారు [2]. ఆ తర్వాత వారు ఉత్తర పర్షియాలో నిషా, మెదియా ప్రాంతాల గూండా ఉత్తర భారత దేశానికి, హిమాలయ ప్రాంతానికి వలస వచ్చారు. నిషాలో వారు, యవనులు అని పిలువబడి తాము గ్రీకులమని చెప్పుకొన్నారు [3]. సంస్కృత యోగిని తంత్రంలో కిరాతుల తెగను యవనులు, పల్లవులు, కోచులు, పుళిందులతో పాటూ పేర్కొనబడ్డారు.

అస్సీరియన్ దేశము కొండల ప్రాంతమైనందున, కిరాతులు వేటాగాళ్ళైనందున, వారు కొండలప్రాంతాలైన కాబుల్, కాశ్మీర్, కరకోరం ప్రాంతాల్లోకి వలస వెళ్ళారు, అందులో కొంతమంది భారత భూమిలో పన్నెండు తరాల వరకూ నివసించారు [4]. పన్నెండు తరాల తర్వాత కిరాతుల్లో ఒక శాఖ శ్రీలంకకు వలసవెళ్ళిందని కిరాత వంశావళి చెబుతున్నది. దీనికి కారణం తూర్పు నేపాల్ లో యఖ (Yakkha) అనే తెగలవారిని పోలిన యక్కో (Yakho) అనే అటవీ తెగ శ్రీలంకలో ఉండటమే అయియుండవచ్చును. నేపాల్ లో కిరాతులు మూడు జాతుల సమ్మేళనంగా చెప్పవచ్చు. కిరాత ముందము ప్రకారం మంగోలులు, కంబోలులు, చైనీయులు - ఈ మూడూ కిరాత జాతులే. నేడు కిరాతులు భారత దేశంలో హిమాచల్ ప్రదేశ్ నుండి అస్సాంవరకూ,, మణిపూర్ నుండి చిత్తంగాంగ్ వరకూ విస్తరించియున్నారు. కాబూల్ లో కిరాత పురాణం ప్రకారం హజ్రా తెగ వారు కిరాత తెగలకు చెందినవారేనని నేపాల్, ఉత్తర బెంగాల్లో ఉన్న గుర్ఖా వారు కిరాత జాతివారే అని స్పష్టమగుచున్నది.

కిరాత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు మధ్య నేపాల్ లో ఉన్న కిరాత సామ్రాజ్యం గురించి తెలుసుకొని అక్కడకు భుక్తమన్ అను వీరుడి ఆధ్వర్యంలో యాదవ సైన్యాన్ని పంపాడు. ఆ ప్రకారం కిరాత రాజైన బనాషుర్ ని హతంచేసి క్రొత్త సామ్రాజ్యం స్థాపించాడు. అప్పటినుండి ఎనిమిది తరాల వరకూ యాదవ రాజుల మధ్య నేపాల్ ను పాలించారు. యలంబరుడు అను కిరాత రాజు తిరిగి మధ్య నేపాల్ ను జయించి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కిరాత ఇతిహాసం ప్రకారం ఆరవ కిరాత రాజైన హుమతి హంగ్ కాలంలో పాండు రాజు కుమారుడైన అర్జునుడు తూర్పు కిరాత దేశంలో ఉన్న ఇంద్రకీల పర్వాతనికి వచ్చాడు. భారవి అను సంస్కృత కవి తన కిరాతార్జునీయలో ఇంద్రకీల పర్వతం పై అర్జనుడికి, కిరాత రాజు రూపంలో ఉన్న శివుడికి మధ్య యుద్ధం జరిగినట్టు పేర్కొన్నాడు [5]. మార్కండేయ పురాణం ప్రకారం మహాభారత కాలంలో ఏడు ప్రముఖ కిరాత సామ్రాజ్యాలు ఏమనగా - అశ్వకుత్ (కాబుల్), కుల్య (కులు లోయ), మత్స్య (ఉత్తర బీహార్), పౌంద్ర (బెంగాల్), సుమర్ (అస్సాం), మలక్ (Mlek) (లోహిత్), కిన్నెర కిరాత్ (గర్వాల్), ల్ నేపాల్. చంద్రగుప్త మౌర్యుడు కిరాతుల సాయంతో నందులను ఓడించాడు, సెల్యుకస్ అను గ్రీకు గవర్నరును పంజాబ్ నుండి సింధు వరకూ తరిమాడు. చాణుక్యుడి రాజకీయంతో కిరాతులు ఉత్తర్ బీహార్ ను వదిలి తిరిగి కొండలపైకి వెళ్ళిపోయారు.

కిరాత-అషూరు తెగలు ఆర్యులకు మొదటిలో నాగరికులుగా కనిపించారు. అందువల్ల వారి ఋగ్వేదంలో కిరాత-అషూరు తెగలను దేవుళ్ళుగా పేర్కొన్నారు. తర్వాత యజుర్వేద, అధర్వణ వేద కాలాల్లో ఆర్యులకు కిరాత తెగలకు యుద్ధాలు జరిగేవి. అందువల్ల యజుర్వేదం, అధర్వణ వేదాల్లో రాక్షసులుగా పేర్కొనబడ్డారు [6]. అషూరు తెగ వారి మాతృభూమి టైగ్రిస్ నదికి తూర్పున, దక్షిణ పర్షియాకు ఆనుకొని ఉండేదని తెలుస్తున్నది. అషూరు తెగ వారి మాతృభూమి టైగ్రిస్ నదికి తూర్పున, దక్షిణ పర్షియాకు ఆనుకొని ఉండేదని, బైబిలులో నోవాహు మనుమడైన షెం యొక్క రెండవ కుమారుడు అషూరు అని బైబిల్ అట్లాస్ చెబుతున్నది [7]. బైబిలులో మొదటి సమూయేలు గ్రంథం 30:14 కిరాతులను పేర్కొన్నది. రెండవ్ సమూయేలు గ్రంథంలో దావీదు తన సైన్యంలో కిరాతులను నియమించుకున్నట్టుగా వ్రాయబడింది.

రిచర్డ్ టెంపుల్ గారి అభిప్రాయం ప్రకారం నేడు ఉత్తర భారత దేశంలో క్షత్రియులుగా పిలువబడుతున్న రాజపుత్రులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కిరాత జాతులవారేనని, వారు క్రమేణా హిందూమతాన్ని స్వీకరించి ఆర్యుల వంశస్తులమని చెప్పుకున్నారు. క్రీస్తు శకం 7 వ శతాబ్దానికి కిరాతుల్లో కొన్ని తెగలు హిందూ ధర్మాన్ని స్వీకరించి, రాజ్యాలు పాలించిన కుటుంబాలు హిందూ వర్ణంలోకి తీసుకోబడ్డాయి. క్రమేణా వారు రాజ పుత్రులుగా పిలువబడి క్షత్రియులుగా గుర్తించబడ్డారు. పర్వత ప్రాంతాల్లో కిరాతులు మాత్రం హిందువేతరులుగా మిగిలిపోయారు.[8] డాక్టర్ యస్.కె చటర్జీ గారు తన కిరాత జనకృతిలో గౌతమ బుద్ధుడు కిరాత జాతికి చెందినవాడని పేర్కొన్నారు.

విశ్వాసాలుసవరించు

కిరాతులు పంచభూతాలైన భూమిని, నీరుని, అగ్నిని, గాలిని, ఆకాశాన్ని ఆరాధిస్తారు, విగ్రహారాధనను విశ్వసించరు. దైవాన్ని అగ్ని లేదా వెలుగు స్వరూపంగా భావిస్తారు. వీరు చేసే ప్రార్థనలను మంగ్ సేవ అను అంటారు. మంగ్ సేవ అనే ప్రార్థనలు రోజుకు మూడు మార్లు నిర్వహిస్తారు. వీటిని తంఖో సేవ (ఉదయ ప్రార్థన) అని అంటారు, లెంజో సేవ (మద్యాహ్న ప్రార్థన), యంచ్హో సేవ (సాయంత్ర ప్రార్థన) అని అంటారు.

కిరాతుల మత గ్రంథం పేరు ముందం., అనగా గొప్ప బలము. ఇది తంగ్సప్ ముందము (Thungsap Mundhum), పెసాప్ ముందము (Peysap Mundhum) అను రెండు భాగాలుగా విభజించబడింది. మొదటిది కిరాత లిపి ఏర్పడక పూర్వం వాజ్మూలముగా (నోటి మాటగా) మాత్రమే ఉండేది. ఈ భాగంలో సాంబలు (కవులు) వ్రాసిన పాటలు మాత్రమే ఉంటాయి. పెసాప్ ముందము సాక్సాక్ ముందము (Soksok Mundhum), యహంగ్ ముదము (Yehang Mundhum), సప్జి ముందము (Sapji Mundhum), సప్ ముందము (Sap Mundhum) అను 4 భాగాలుగా విభజింపబడినది .

సాక్సాక్ ముందములో సృష్టి ఆరంభ చరిత్ర, మానవ చరిత్ర, పాపాల యొక్క కారణాలు - ఫలితాలు, కోపము- అసూయ - మత్సరము వంటి దుష్ట శక్తుల సృష్టి, బాల్యంలో మరణానికి కారణాలు -ఫలితాలు వంటివి ఉంటాయి.

యహంగ్ ముందములో జంతు జీవన స్థితి నుండి జ్ఞాన జీవన స్థికి మానవుడి పరిణామం కోసం, వాటిని తాత్విక బోధనల ద్వారా నియంత్రిచుటకు ఆజ్ఞలు పొందుపరచిన యహంగ్ అను ఆది మానవుడి చరిత్ర ఇవ్వబడింది. ఇందులో యహంగ్ వివాహం, విడాకులు, పరిశుద్ధత, మతము అను విషయాలకు సంబంధిచిన నియమ నిబంధనలు వ్రాశాడు. జల ప్రళయం వలన మానవాళి నాశనం, కిరాతుల్లో పలు భాషల పుట్టుక, దేవుడిని పూజించడంలో సాంఘిక ఆచారాలు, జనన మరణ విషయాల్లో పరిశుద్ధత వంటి విషయాలు ఇవ్వబడినవి.

కిరాతులకు మొదటిలో ఆలయాలు, విగ్రహాలు ఉండేవి కావు. దేవుడు అగ్నిలో గాని వెలుగులో గాని ఉండునని భావించేవారు. సాప్జీ ముందము ప్రకారం ఆత్మలు రెండు రకములు - మంచి ఆత్మ, చెడు ఆత్మ.[9]. జ్ఞానికి, బుద్ధికి మూలమైన మంచి ఆత్మను కిరాత ముందము నింగ్వఫుమ ( Ningwaphuma) అని గ్రహిస్తుంది. మానవాళిని రక్షించుటకు వచ్చే ఆత్మను ఆ ఆత్మను యుమ సమ్మాన్ (Yuma Sammang ) అను బామ్మగా కొలుస్తారు. కిరాతుల నమ్మకం ప్రకారం దేవుడు వారి అభ్యుదయం కోసం హీం సమ్మంగ్ (Heem Sammang) అను ఆత్మను గృహ అవసరాలకు, తొక్లంగ్ సమ్మంగ్ ( Thoklung Sammang) అను ఆత్మను మానవాళి ఆరోగ్యం కొరకు, నెహెంగ్మా సమ్మాంగ్ (Nehangma Sammang) అను ఆత్మను శక్తి కొరకు, థెబా సమ్మాంగ్ (Theba Sammang) అను ఆత్మ యుద్ధ సమయంలో సాయానికి, వ్యవసాయం కొరకు పుంగ్ సమ్మాంగ్ (Pung Sammang), ఉన్నత శ్రేణి పూజారులకు మార్గం చూపించడానికి ఖంబులింగ్ సమ్మాంగ్ (Khambhuling Sammang), జంతు బలులు అర్పించే పూజారికి మార్గం చూపించడానికి ఒక్వనమ సమ్మాంగ్ (Okwanama Sammang) అను ఆత్మలను పంపుతాడు. సమ్మాంగ్ అను పదానికి దేవుని ఆత్మ అని అర్ధము. ఈ పదమును కిరాతులు ప్రతిసారి పండితులు ఇవి చదువుతారు.

రెండవది చెడు ఆత్మ. చెడు ఆత్మలకు రాజు తంఫుంగ్ సమ్మాంగ్. (Tamphung` Sammang) . ఇతడు మానవాళికి ఇతర దుష్టాత్మల సాయంతో సమస్త శ్రమలు కలిగిస్తాడు. సమస్త వ్యాధులు ఈ ఆత్మ వల్లే వస్తాయి. కిరాతులు ఆత్మ చేత ప్రేరేపిస్తే గాని వ్యాధిగ్రస్తులను వ్యాధులనుండి నయంచేయడానికి ఔషధాలు ఉపయోగించరు. ప్రేరేపణ రాని పక్షంలో వ్యాధిగ్రస్తుడిని దూరంగా వెలివేస్తారు.

మరణం తరువాత ఆత్మ చెరుకొనే ప్రదేశాన్ని వేల సూర్య కిరణాలతో నిండియుంటుందని, అది చాల మహిమకరమైన ప్రదేశమని, అక్కడ దేవుళ్ళు ఉంటారని కిరాత ముందము చెబుతుంది [10]

కిరాత సామ్రాజ్యాలుసవరించు

కిరాతుల్లో 29 రాజులు నేపాల్ను 800 సంవత్సరాల పాటూ పాలించారు. వీరిని సోమ సామ్రాజ్యపు రాజులు ఓడించారు. మొదటి రాజు యలంబరుడు, ఆ తర్వాత పావి, స్కందర్, బలంబ, హృతి, హుమతి, జితేదాస్తి, గలింజ, పుష్క, సుయర్మ, పాప, బుంక, స్వనంద, స్తుంకొ, జింగ్రి, నానె, లూక, థార్, తోకొ, వర్మ, గుజ, పుష్కర్, కేషు, సుజ, సన్స, గుణం, ఖింబు, పటుక,, ఆఖరి రాజు గాస్తి.

అపోహలుసవరించు

కిరాతులు బోయవారి పూర్వీకులు అని, బోయ వారు కూడా కిరాత జాతులవారేనని తెలుగువారిలో ఒక అపోహ ఉంది. సంస్కృత మహాభారతంలోను, సంస్కృత భాగవతంలోను, సంస్కృత మనుస్మృతిలోను ఉత్తరభారత దేశపు అటవీతెగలైన కిరాతులు, నిషాడులు, నాగులు వంటి అటవీతెగలవారు ప్రస్తావించబడినారు. పోతన తన భాగవతంలో కిరాతులు అను పేరును యధావిధిగా ప్రస్తావించాడు. కిరాత అను పదము నిర్వచించుటకు కష్టమైనందున, తెలుగు పాఠకులకు కిరాత అనే పదము తెలియనందున, కొంతమంది తెలుగు కవులు తమ రచనల్లో కిరాతులు అనే పదం బదులు బోయ అని ప్రస్తావించారు. దీనికి కారణం కిరాతుల ధైర్యసాహసాలు దక్షిణభారత దేశంలో ప్రాచీన తెగలైన బోయల్లో కూడా ఉండటమే కారణమవ్వొచ్చును. భారవి వ్రాసిన సంస్కృత కిరాతార్జునీయాన్ని శ్రీనాధుడు తెలుగులోకి అనువదించి, కిరాతుడి రూపంలో ఉన్న శివుడిని బోయవాడిగా పేర్కొనడం మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చును. అయితే అయితే బోయవారు తాము ధ్రువుడి సంతానంగా భావిస్తారు.

ఇంకా చదవండిసవరించు

మూలాలుసవరించు

  1. New Biblical Atlas of London Religious Tract Society, London, page 78
  2. The History of Nations - Assyrians by Leonard W. King, Page 271
  3. Prachin Bharat ka Rajnitic aur Sanskritik Itihas by Rati Bhanu Singh Nahar, page 231
  4. Kirat Vansavali. The Political History of Ancient India by H.C. Ray Chowdhary, page 197-199
  5. Kirat Itihas, 1948 by I.S. Chemjong, page 17
  6. The Religion and Philosophy of Veda and Upanishad by Keith, page 231
  7. The New Biblical Atlas by Religious Tract Society of London, page 7
  8. History of Nations Prehistoric India by Sir Richard Temple Bart, CIE, pages 146,152,154
  9. Kirat MSS, Hodgson collection, 1840
  10. Kirat MSS, personal collection – 1930

లంకెలుసవరించు

https://web.archive.org/web/20120911030846/http://www.historyfiles.co.uk/KingListsFarEast/IndiaNepal.htm http://himalaya.socanth.cam.ac.uk/collections/journals/contributions/pdf/INAS_03_02_01.pdf[permanent dead link]https://web.archive.org/web/20120907103221/http://www.limbulibrary.com.np/pdf/HISTORY%20%26%20CULTURE-Iman.pdf http://en.wikipedia.org/wiki/Kirata_Kingdom http://en.wikipedia.org/wiki/Kirata http://en.wikipedia.org/wiki/Kirati_people

"https://te.wikipedia.org/w/index.php?title=కిరాతులు&oldid=3066178" నుండి వెలికితీశారు