కోటగిరి వేంకట కృష్ణారావు

గంపలగూడెం రాజా కోటగిరి వెంకటకృష్ణారావు, కృష్ణా జిల్లా లోని గంపలగూడెం జమీందారు. స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త. వెంకటకృష్ణారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న తొట్టతొలి ఆంధ్ర ప్రాంతానికి చెందిన జమీందారు. ఈయన ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమాలలో పాల్గొని, అనేక మార్లు జైలుకెళ్ళాడు.

గంపలగూడెం రాజా కోటగిరి వేంకట కృష్ణారావు
జననంకోటగిరి వెంకటకృష్ణారావు
1890
కృష్ణా జిల్లా లోని గంపలగూడెం
ఇతర పేర్లుకోటగిరి వెంకటకృష్ణారావు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు , సంఘ సంస్కర్త
తండ్రిచిన్నయ్య
తల్లిసుబ్బాయమ్మ
Notes
ఈయన ఉప్పు సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమాలలో పాల్గొని, అనేక మార్లు జైలుకెళ్ళాడు.

జననం , బాల్యం మార్చు

వెంకటకృష్ణారావు 1890లో ఖర సంవత్సర ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడు నూజివీడులో పద్మనాయక వంశానికి చెందిన కుటుంబంలో చిన్నయ్య, సుబ్బాయమ్మలకు జన్మించాడు. ఈయన్ను జగన్నాథరావు, సుబ్బాయమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. ఈయన శృంగార తిలకము, యౌవననిగర్హణము, చాటు పద్యములు, శ్రీకృష్ణరాయనాటకావళి (అభినవ పాండవీయము, పాదుషా పరాభావము, బెబ్బులి, ప్రణయాదర్శణము అను నాలుగు నాటకాల సంపుటం), మాతృదేశము, విధి (పద్యకావ్యము), దేవదాసి (నాటకము), ఘోషావ్యాస ఖండనము మొదలగు రచలను చేశాడు. శ్రీకృష్ణరాయనాటకావళి నాటక సంపుటికి విశ్వనాథ సత్యనారాయణ పీఠిక వ్రాశాడు.[1] తొలి మూడు కృతులలో శృంగార రసాన్ని పండించిన కోటగిరి ఆ తరువాత రచనలలో అంతే చక్కగా వీరరసాన్ని పండించాడని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఈయన గురించి పేర్కొన్నాడు.

ఉప్పు సత్యాగ్రహం మార్చు

ఉప్పు సత్యాగ్రహం సమయంలో వెంకటకృష్ణారావు, విజయవాడ నుండి 120 మంది స్వచ్ఛందసేవకులతో కాలినడకన కోనసీమను చేరి అక్కడ ఉప్పును తయారుచేసి చట్టాన్ని ధిక్కరించాడు. సాధారణంగా బ్రిటీషు వారికి అనుకూలంగా ఉండే జమిందారీ కుటుంబానికి చెందిన వెంకటకృష్ణారావు శాసనోల్లంఘనంలో పాల్గొనటం పలువురిని ఆశ్చర్యపరచింది. బ్రిటీషు పాలనలో జమీందారుదైనా, సామాన్యప్రజలదైనా బానిస బ్రతుకేనని, తన నాయకుడు మహాత్మా గాంధీ, ఆయన మాటే తనకు వేదమని చాటి, తీరాంధ్రలో ఉప్పు సత్యాగ్రహానికి మంచి ఊతమిచ్చాడు.[2]

సత్కారం మార్చు

1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయన్ను కళాప్రపూర్ణ సత్కారంతో గౌరవించింది.

బెబ్బులి మార్చు

' బెబ్బులి 'లో నున్న పద్యములు కొన్ని యే ప్రబంధకవులు వ్రాయలేని తీరులలో వీరు వ్రాసిరి.

సీ. ఆత్మగౌరవ రక్షణార్థమై యుసురు తృ
          ణప్రాయ మంచు బెనంగవలయు
వెల్మ కులద్వేషి విజయరాముని సంహ
          రింప గంకణము ధరింపవలయు
బాశ్చాత్యసేనకు భరతపుత్రుల బలో
          ద్రేక మీతూరి బోధింపవలయు
జచ్చియో వగతుర వ్రచ్చియో దశదిగ్వి
          శద యశశ్చట వెదచల్లవలయు

గీ. మరణ మున్న దొకప్పుడు మానవులకు
సద్యశం బొక్కటే చిరస్థాయి గాన
యుద్ధరంగాని కురుక సన్నద్ధ పడుడు
దళిత పరిసంధులార ! ఓ వెలమలార !

శా. వాలున్ డాలును గేల గీల్కొలిపి దుర్వారాహవ ప్రాభవో
ద్వేలాభీల కరాళ విక్రమ కళావిస్తారులై భారతీ
యాలోక ప్రతిభావిశేషమున రాజ్యస్థాపనోత్సాహులై
లేలెండీ ! యిక వెల్మవీరులు యశోలేశంబు నాసింపుడీ !

సీ. హైదరు జంగు పాదాశ్రయ మొనరించి
          దురము గల్పించిన ద్రోహబుద్ధి
ఉన్నంతలో దృప్తి నొందక వెలమరా
          జ్యం బేల గోరు దురాశయంబు

ఖండాంతరుల మైత్రి గావించి భారతీ
          యుల కెగ్గు రోసిన తులువతనము
పద్మనాయకకుల ప్రాభవ ధ్వంసనో
          పాయ పంకిలమయౌ పాపవృత్తి

గీ. యొక్కటై విధిబలము చేయూతనొసగ
తాండ్రకులుడు నిమిత్తమాత్రంబుగాగ
నీదు వధ విధానంబును నిర్వహించు,
నాత్మ సంరక్షణోపాయ మరసికొనుము.

మ. తరమౌనేనియు రామరాజ వరరక్తస్నిగ్ధ కాషాయ వి
స్ఫుర దాభీల తను ప్రకాశితుడనై చూపట్టునన్ దాకు డో
పరిపంధుల్ ! చవిగొండ్రు తాండ్రకుల పాపారాయ బాహాభయం
కర శాస్త్రీయ రణ ప్రభాకలిత తీక్ష్ణక్రోధ విక్రాంతినిన్.

మూలాలు మార్చు