కాన్సర్
క్యాన్సర్ని తెలుగులో "కర్క రోగం" అని అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి వాటిల్లో కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు. క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి.క్యాన్సర్ మహమ్మారి ఏటా రూ.41, 17, 000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడింట రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి.అందులో ఎక్కువ భాగం ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయంచేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో[1] వెల్లడించింది.
కాన్సర్ | |
---|---|
ఇతర పేర్లు | మాలిగ్నెంట్, నియోప్లాజం |
![]() | |
సి టి స్కాన్ చూపించే మాలిగ్నెంట్ కంతి. 1 & 3 ఊపిరితిత్తులు 2. వెన్నెముక, వెన్నుపాము 4 రిబ్స్, 5 బృహద్ధమని, 6 ప్లీహం, 7 & 8 మూత్ర పిండాలు, 9. కాలేయం | |
ఉచ్చారణ | |
ప్రత్యేకత | ఆంకాలజీ |
లక్షణాలు | మానని పుండు అసహజమైన రక్త స్రావం |
సాధారణ ప్రారంభం | ఏ వయసు వారైనా |
ప్రమాద కారకములు | కాన్సర్ కారకాలకు గురిఅవడం, పొగాకు, ఊబకాయం, పోషక ఆహారం తీసుకోకపోవడం, మద్యం సేవించడం, సంక్రమణాలకు గురి అవడం |
చికిత్స | రేడియేషన్, శస్త్ర చికిత్స, ఖీమో చికిత్స |
రోగ నిరూపణ | 66% సగటు 5 సంవత్సరాలు |
మరణాలు | 10 మిలియన్ (2019) |
When normal cells are damaged beyond repair, they are eliminated by apoptosis (A). Cancer cells avoid apoptosis and continue to multiply in an unregulated manner (B). | |
DiseasesDB | 28843 |
---|---|
m:en:MedlinePlus | 001289 |
MeSH | {{{m:en:MeshID}}} |
పేర్ల వెనక కథ
మార్చుఇంగ్లీషులో 'టుమర్' అన్న మాటకి 'వాపు' అన్నది వాచ్యార్ధం. కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది. అప్పుడప్పుడు ఈ వాపు చిన్న 'కాయ' రూపంలో తారస పడుతుంది. అప్పుడు దానిని 'కంతి' అంటారు. ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు: నిరపాయమైన కంతులు (benign tumors), ప్రమాదమైన కంతులు (malignant tumors).
నిరపాయమైన కంతులని మూడు లక్షణాల ద్వారా గుర్తు పట్టవచ్చు.
- అవి నిరవధికం (unlimited) గా, దూకుడుతనం (aggressiveness) తో పెరిగిపోవు
- అవి ఇరుగు పొరుగు కణజాలం (tissue) మీదకి విరుచుకు పడవు (do not invade neighboring tissue)
- శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize)
అయితే ఈ కాన్సర్ కు కారణం విటమిన్ B17 లోపం అనే ఒక అభిప్రాయం ఉంది.[2] అంతే గాని ఇది జబ్బు కాదని, జి. ఎడ్వర్డ్ గ్రిఫిన్ (G.Edward Griffin) అను ఒక రచయిత "World without Cancer: The story of Vitamin B12" పుస్తకాన్ని రాశాడు.[3]
కొన్ని రకాల కేన్సర్ల పేర్లు "-ఓమా" శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, లింఫోమా మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. మెలనోమా (melanoma) అంటే మెలనోసైట్ (melanocytes) లు (అంటే మెలనిన్ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించగలవు. అందుకనే పుట్టుమచ్చల కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
ట్యూమర్లు రకాలు
మార్చు- మాలిగ్నెంట్ ట్యూమర్లు (Malignant tumors) : ఈ రకమైన ట్యూమర్ల నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ (Metastasis) అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి.
- బినైన్ ట్యూమర్లు (Benign tumors) : ఈ రకమైన ట్యూమర్లు సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉండి, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్ర చికిత్స ద్వారా తొలగించవచ్చును.
కేన్సరు సప్త సూచికలు
మార్చు- మానని పుండు (Ulcer)
- అసహజమైన రక్త స్రావం (Bleeding)
- పెరుగుతున్న కంతి (Tumor)
- తగ్గని దగ్గు (Cough), బొంగురు గొంతు (Hoarseness of voice)
- మలంలో రక్తం, మలవిసర్జనలో మార్పు
- కడుపుబ్బరం, తినడం మొదలు కాగానే కడుపు నిండినట్లుండడం, తగ్గని అజీర్తి, ముద్ద మింగుటలో కష్టం
- పుట్టుమచ్చల పరిమాణంలో మార్పు, రంగు ముదరడం, దురద , మచ్చల నుండి రాసి, రక్తం కారడం
ఇతర లక్షణాలు - తరచూ జ్వరం; అతిగా బరువు తగ్గిపోవడం; ఆకలి లేకపోవడం; అలసట; నీరసం; శరీరం రంగు నల్లగా మారడం; నోరు, రొమ్ములు, మలం, మూత్రంలో రక్తం; గొంతు వద్ద ముఖ్యంగా మగవారిలో థైరాయిడ్ గ్రంథి ఉబ్బడం; రొమ్ములలో గడ్డలు ఏర్పడడం పరిమాణం పెరగడం , నోట్లో మానని పుండ్లు, చర్మం, గోళ్ల వెనకాల నుండి రక్త స్రావం; రాత్రిపూట అతిగా చెమట పట్టడం మొదలైనవి.[4][5]
కాన్సర్ ఉత్పరివర్తనాలు
మార్చు- వైరస్ ఆంకో జన్యువు (Oncogenic virus) ల ప్రభావం
- ట్యూమర్ అణచివేత జన్యువు (Tumor suppressor genes) లను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
- డి.ఎన్.ఎ. రిపేర్ జన్యువులను కోల్పోవడం. వాటిలో ఉత్పరివర్తనాలు కలగటం లేదా వాటిని ఉత్తేజరహితం గావించడం.
- క్రోమోజోములు అరుదుగా భ్రంశనం (Aberration) కు గురి కావటం.
పైన చెప్పిన అన్ని లేదా కొన్ని మార్పులు యాదృచ్ఛికంగా గాని లేదా అనేక కారకాల వల్ల జరగవచ్చును. ఈ మార్పులను ప్రేరేపించే కారకాలు: కొన్ని రకాల కాలుష్యం, రేడియేషన్, పొగాకు, ఆల్కహాల్, ఔషధాలు, రసాయనాలు. ఇవికాకుండా మారుతున్నా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, జంక్ పదార్ధాలు తినడం, పర్యావరణ కాలుష్యం, రసాయనాలు ఉపయోగించిన ఆహారపదార్ధాలు పండించడం, వినియోగించడం వంటివి కూడా కాన్సర్ కారకాలు . గుట్కా, పాన్ మసాలా, తంబాకు లు నమలడం వలన నోటి కాన్సర్ లు ఎక్కువ కనిపిస్తున్నాయి. [4]
క్యాన్సర్ రకాలు
మార్చుక్యాన్సరు ఏ అవయవంలో ప్రారంభమైంది, ఇది ప్రారంభమైన అవయవంలో కణం రకంపై ఆధారపడి ఇది అనేక రకాలుగా ఉండొచ్చు. [6][7]
- కార్సినోమా (Carcinoma) అనేది ఉప కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఈ కాన్సర్ లు చర్మం, శ్వాస, జీర్ణ, జనన వ్యవస్థలోని ఉప కణాల నుంచి ఏర్పడతాయి. లేదా దేహంలోని వివిధ గ్రంథులు ఉదా: ఊపిరితిత్తులు, పెద్దపేగు, క్షీరగ్రంధులు, ప్రోస్ట్రేట్, థైరాయిడ్, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్లు, నాడీ కణజాలం వంటివి. మన దేహంలో ఏర్పడే కాన్సర్ లలో 85 % కార్సినోమా రకానికి చెందినవి.
- సార్కోమా (Sarcoma) సంయోజక కణజాలాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి మధ్యస్త్వచం నుంచి ఏర్పడిన కండరాలు, ఎముకలు, మృదు కణజాలాలు, అవయవాల నుంచి గాని ఏర్పడతాయి. కాన్సర్ లలో సార్కోమా సుమారు 2 % ఉంటాయి.
- ల్యూకీమియా (Leukemia) : గ్రీకు భాషలో 'లూకోస్' అంటే 'తెలుపు', 'ఈమియా' అంటే 'రక్తానికి సంబంధించిన'. కనుక 'లూకీమియా' అంటే 'తెల్ల రక్తం' అని ఆర్ధం వస్తుంది. రక్తంలో తెల్ల కణాలు బాగా పెరిగినప్పుడు అది లుకీమియా అని పిలవబడుతుంది. ఇది ముఖ్యంగా అస్థిమజ్జలో (bone marrow) ఉన్న తెల్ల కణాలను ప్రభావితం చేస్తుంది. దీనిని 'ద్రవరూప కంతి' అని కూడా అంటారు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి 4 % ఉంటాయి.
- లింఫోమా (Lymphoma) ప్లీహం, శోషరస గ్రంథులలోని తెల్ల రక్తకణాలలో ఏర్పడే మాలిగ్నెంట్ ట్యూమర్లు. దేహంలో ఏర్పడే ట్యూమర్లలో ఇవి ఇంచుమించు 4 % ఉంటాయి.
- నాడీమండల కాన్సర్లు: ఇవి మెదడు వెన్నుపాములో ఏర్పడి, నాడీమండలం నియంత్రించే జన్యువులలో మార్పులు కణితులకు దారితీస్తాయి. కొన్ని సార్లు ఈ కణితులు క్యాన్సర్లుగా మారే అవకాశం ఉంది. [8]
- జెర్మ్ సెల్ ట్యూమర్: ప్లూరిపోటెంట్ కణాల నుండి ఉద్భవించే క్యాన్సర్లు, చాలా తరచుగా వృషణం లేదా అండాశయంలో కనిపిస్తాయి.
- బ్లాస్టోమా: అపరిపక్వ "పూర్వగా" కణాలు లేదా పిండ కణజాలం నుండి ఉద్భవించే క్యాన్సర్లు.
కాన్సర్ కు ప్రభావితమయే అవయవాలు
మార్చుక్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. అవి ఏర్పడిన చోటు బట్టి లక్షణాలు వేరుగా ఉంటాయి. గొంతు, అన్నవాహిక, జీర్ణాశయం, ప్రేగులు, గర్భాశయం, రొమ్ము కాన్సర్, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు, నోరు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ.
కణవ్యాప్తి (మెటాస్టాసిస్)
మార్చుమెటాస్టాసిస్ అంటే శరీరంలోని ఇతర ప్రదేశాలకు క్యాన్సర్ వ్యాప్తి చెందడం. ఈ కణితులను మెటాస్టాటిక్ కణితులు అంటారు. మొదటి కణితిని ప్రాథమిక కణితి అంటారు. దాదాపు అన్ని క్యాన్సర్లు మెటాస్టాసైజ్ చేయగలవు. చాలా వరకు మరణాలు ఈ కణవ్యాప్తి అయిన క్యాన్సర్ కారణంగా సంభవిస్తాయి. ఇది రక్తం లేదా శోషరస వ్యవస్థ ద్వారా లేదా రెండింటి ద్వారా సంభవించవచ్చు. మెటాస్టేసెస్ సంభవించే అత్యంత సాధారణ ప్రదేశాలు ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, ఎముకలు. మెటాస్టాసిస్‌లో సాధారణ దశలు: [9]
- స్థానికంగా అదే ప్రదేశంలో వ్యాప్తి చెందడం
- రక్తంలోకి లేదా శోషరసంలోకి చేరి వ్యాప్తి చెందడం
- శరీరం ద్వారా ప్రసరణ.
- కొత్త కణజాలంలోకి చేరి వ్యాప్తి చెందడం.
- కణాలు వృద్ధి ద్వారా వ్యాప్తి
- యాంజియోజెనిసిస్
నివారణ, జాగ్రత్తలు
మార్చుసుమారు 63 శాతం కాన్సర్లు నివారించతగినవే. కాన్సర్ గురించిన అవగాహనా కార్యక్రమాలు విస్తృతం చేయాలి. మహిళలు పాప్ స్మియర్ పరీక్ష , మమ్మోగ్రఫీ చేయించుకోవాలి. కాన్సర్ నివారణ, స్క్రీనింగ్, తొలిదశలో గుర్తించడం, రోగ నిర్ధారణలో కృత్రిమ మేధ ప్రక్రియలను వినియోగించాలి.[10]
ఆహార విహార అలవాట్లు, జీవన శైలి మార్పులు కాన్సర్ నివారణకు దోహదం చేస్తాయి. మాంసాహారం మితంగా, మిఠాయిలు, ఐస్ క్రీములు, చక్కెర, కొవ్వులు తీసుకోవడంలో సంయమనం పాటించాలి. శాకాహారంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, నట్స్ అధికంగా ఆహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన పదార్ధాలు తీసుకోవాలి. ఊబకాయం లేకుండా చూసుకోవడం, వ్యాయామం చాల ముఖ్యం. పొగాకు, పొగాకు ఉత్పత్తులు, మద్యం పూర్తిగా మానివేయాలి. ఆడవాళ్ళలో 27-28 సం. లోపు తోలి సంతానం కలిగి ఉండడం, బిడ్డకు తమ పలు ఇవ్వడం కూడా కాన్సర్ కు దూరంగా ఉంచుతుంది.[11]
కొన్ని క్యాన్సర్ కారక వైరస్‌ల ద్వారా సంక్రమణను నిరోధించే వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేశారు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ హెపటైటిస్ బి వైరస్‌తో సంక్రమణను నివారిస్తుంది, తద్వారా కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.[12]
క్యాన్సర్‌ను చంపే పసుపు
మార్చుపసుపుకు క్యాన్సర్ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు, పసుపులో ఉండే కర్కుమిన్ అనే రసాయనానికి 24గంటల్లోపే క్యాన్సర్ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.[13]
కాన్సర్ నిర్వహణ
మార్చుక్యాన్సర్కు అనేక రకాల చికిత్సలు ఉపయోగిస్తారు. ప్రాథమికంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ల చికిత్స, లక్ష్య (టార్గెటెడ్) చికిత్స, ఉపశమనం, సంరక్షణ ఉన్నాయి. ఏ చికిత్సలను ఉపయోగించాలో క్యాన్సర్ రకం, స్థానం, గ్రేడ్ అలాగే రోగి ఆరోగ్య స్థితి, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.
కీమో చికిత్స
మార్చుకెమోథెరపీ ఓక ప్రత్యేక నియమావళితో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సైటోటాక్సిక్ యాంటీ-నియోప్లాస్టిక్ ఔషధాలు (కెమోథెరపీటిక్ ఏజెంట్లు) ఉపయోగించి క్యాన్సర్ కు చేసే చికిత్స. ఇందులో వివిధ రకాల ఔషధాలను ఉపయోగిస్తారు. సాంప్రదాయ కీమోథెరపేటిక్ ఏజెంట్లు వేగంగా విభజించే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. ఇది వాటి కీలకమైన లక్షణం. ఒకే ఔషధం కంటే మిశ్రమ సైటోటాక్సిక్ ఔషధాలను ఈ చికిత్సలో అందించడం మెరుగైనదని కనుగొన్నారు. ఈ ప్రక్రియనే కాంబినేషన్ థెరపీ అని పిలుస్తారు.[14]
టార్గెటెడ్ థెరపీ అనేది క్యాన్సర్, సాధారణ కణాల మధ్య నిర్దిష్ట పరమాణు వ్యత్యాసాలను లక్ష్యంగా చేసుకునే ఒక రకమైన కీమోథెరపీ. మొదట్లో చేసిన లక్ష్య చికిత్సలలో ఈస్ట్రోజెన్ గ్రాహక అణువును నిరోధించి, రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను నిరోదించడం జరిగింది. మరొక చికిత్స ఉదాహరణలో Bcr-Abl ఇన్హిబిటర్లను, దీర్ఘకాలిక (క్రానిక్) మైలోజీనస్ లుకేమియా (CML) చికిత్సకు ఉపయోగించారు. ఇంకా మూత్రాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, లుకేమియా, కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లింఫోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్‌తో పాటు ఇతర క్యాన్సర్ రకాలకు లక్ష్యంగా చేస్తున్న చికిత్సలు ఉన్నాయి. [15]
కీమోథెరపీ సామర్థ్యం సాధారణంగా క్యాన్సర్ రకం, అది చికిత్స సమయానికి కొనసాగుతున్న దశపై ఆధారపడి ఉంటుంది. కొన్ని క్యాన్సర్ రకాల్లో శస్త్రచికిత్సతో కలిపి, కీమోథెరపీ ఉపయోగకరంగా ఉందని నిరూపించారు, ఉదా - రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఆస్టియోజెనిక్ సార్కోమా, వృషణ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఇంకా కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్‌లు. అయితే ఈ కీమోథెరపీ కొన్ని లుకేమియాలు, కొన్ని మెదడు కణితుల్లో, ఇతర క్యాన్సర్లలో ప్రభావం లేదు. మెలనోమా రకాలు, కొన్ని చర్మ క్యాన్సర్‌ల వంటివి వంటి వాటికి నివారణగా ఉంటుంది. కీమోథెరపీ ప్రభావం పరిమితంగా ఉన్నప్పటికీ కణితి పరిమాణం, నొప్పి వంటి లక్షణాలను తగ్గించడానికి ఉపయోగకరంగా ఉండవచ్చు.[16]
రేడియేషన్ చికిత్స
మార్చురేడియేషన్ చికిత్సలో లక్షణాలను నయం చేయడానికి లేదా మెరుగుపరచడానికి అయనీకరణ రేడియేషన్ ప్రక్రియను ఉపయోగించుతారు. ఇది క్యాన్సర్ కణజాలం DNAని దెబ్బతీస్తుంది, ఫలితంగా క్యాన్సర్ కణాలు చనిపోతాయి.[17] సాధారణ కణజాలాలు, చర్మం లేదా అవయవాలు వంటివాటిని కాపాడటానికి, రేడియేషన్ కిరణాలు కణితిని మాత్రం చికిత్స చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంటాయి, అక్కడ చాలా ఎక్కువ మోతాదును అందిస్తాయి. కీమోథెరపీలో వలె రేడియేషన్ థెరపీకి క్యాన్సర్లు ప్రతిస్పందనలో మారుతూ ఉంటాయి[18][19][20].
దాదాపు సగం కాన్సర్ కేసులలో రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తారు. రేడియేషన్ అంతర్గతంగాను (బ్రాకిథెరపీ) లేదా బాహ్య వనరుల నుండి కావచ్చు. రేడియేషన్ చర్మ క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి సాధారణంగా తక్కువ శక్తి గల ఎక్స్-కిరణాలు ఉపయోగిస్తారు, అయితే అధిక శక్తి గల ఎక్స్-కిరణాలు శరీరంలోని క్యాన్సర్‌లకు ఉపయోగించుతారు. రేడియేషన్ సాధారణంగా శస్త్రచికిత్స, కీమోథెరపీతో పాటు ఉపయోగించుతారు. తల, మెడ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌లకు, రేడియేషన్ చికిత్స ఒక్కటే చేయవచ్చు. ఎముక మెటాస్టేసెస్ పరిస్థితికి , రేడియేషన్ థెరపీ దాదాపు 70% మంది రోగులలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.[21] అయితే మెదడు మెటాస్టేసెస్‌కు శస్త్రచికిత్స తర్వాత రేడియేషన్ థెరపీ, శస్త్రచికిత్సతో పోలిస్తే మనుగడను మెరుగుపరచలేదని తెలుస్తోంది.[22]
శస్త్ర చికిత్స
మార్చుచాలా రకాల క్యాన్సర్లకు శస్త్రచికిత్స ప్రాథమిక చికిత్సా పద్ధతి, ఉపశమనానికి, మనుగడను కొనసాగించడంలో దోహదం చేస్తుంది. బయాప్సీలు సాధారణంగా అవసరం కాబట్టి, కణితుల వివిధ దశలలో ఖచ్చితమైన రోగ నిర్ధారణలో ఉపయోగించే ముఖ్యమైన ప్రక్రియ. సాధారణంగా క్యాన్సర్‌లో శస్త్రచికిత్స ద్వారా మొత్తం ద్రవ్యరాశిని స్థానికంగా తొలగించడము, కొన్ని సందర్భాల్లో, ఆ ప్రాంతంలోని శోషరస కణుపులతో పాటు కణితి (క్యాన్సర్)ను తొలగించడం జరుగుతుంది.
ఇమ్మ్యూనో చికిత్స
మార్చుక్యాన్సర్తో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే లేదా సహాయపడే వివిధ రకాల చికిత్సలు 1997 నుండి వాడుకలోకి వచ్చాయి. ఈ ప్రక్రియలు -
- మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స
- చెక్‌పాయింట్ థెరపీ (రోగనిరోధక వ్యవస్థలోని రోగనిరోధక నియంత్రకాలను లక్ష్యంగా చేసే చికిత్స)
- అడాప్టివ్ సెల్ బదిలీ - అడాప్టివ్ సెల్ ట్రాన్స్‌ఫర్ (ACT) అంటే రోగిలోకి కణాల బదిలీ, [23] రోగి నుండి లేదా మరొక వ్యక్తి నుండి ఉండవచ్చు. రోగనిరోధక లక్షణాలను మెరుగుపరచడం లక్ష్యంగా కణాలు సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ నుండి తీసుకుంటారు. ఆటోలోగస్ క్యాన్సర్ ఇమ్యునోథెరపీలో, T కణాలను రోగి నుండి సంగ్రహించి, జన్యుపరంగా మార్పు చేసి, ఇన్ విట్రోలో కల్చర్ చేసి, అదే రోగికి తిరిగి ఇస్తారు. తులనాత్మకంగా, అలోజెనిక్ చికిత్సలలో వేరు దాత నుండి వేరుచేయబడిన విస్తరించబడిన కణాలు ఉంటాయి.[24]
లేజర్ చికిత్స
మార్చులేజర్ థెరపీ అధిక-తీవ్రత కాంతి కణితులను లేదా ముందస్తు పెరుగుదలను కుదించడం లేదా నాశనం చేయడం ద్వారా క్యాన్సర్‌కు చికిత్స చేస్తుంది. లేజర్‌లను సాధారణంగా శరీరం ఉపరితలంపై లేదా అంతర్గత అవయవాల లైనింగ్‌లో ఉండే ఉపరితల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ వంటి ఇతర చికిత్సలతో కలిపి ఉంటుంది. లేజర్ శస్త్రచికిత్స కంటే మరింత ఖచ్చితమైనది, తక్కువ నొప్పి, రక్తస్రావం, వాపు, మచ్చలను కలిగిస్తుంది. [25]
ఉపశమనం, సంరక్షణ
మార్చుపాలియేటివ్ కేర్‌లో ముఖ్యంగా ఉపశమనం, సంరక్షణ ఉంటుంది. శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, మానసిక-సామాజిక బాధలను తగ్గించే ప్రక్రియ ఉంటుంది. ఇది రోగికి మెరుగైన అనుభూతిని కలిగించే చికిత్స. దీనిని క్యాన్సర్ చికిత్సతో కలిపి సిఫారసు చేస్తారు. పాలియేటివ్ కేర్ ప్రాథమిక లక్ష్యం జీవన నాణ్యతను మెరుగుపరచడం. అనేక దేశాల జాతీయ వైద్య మార్గదర్శకాలు ఈ ఉపశమన సంరక్షణను సిఫార్సు చేస్తున్నాయి. క్యాన్సర్ బాధితులకు వారి అనారోగ్యాన్ని ఎదుర్కోవటానికి సహాయం అవసరమైనప్పుడు, బహుళ మెటాస్టాటిక్ వ్యాధి నిర్ధారణ అయిన రోగులలో, ఇంకా తక్కువ జీవితకాలం ఉన్న రోగులకు ఉపశమన సంరక్షణ వెంటనే సూచింస్తారు.[26][27][28]
కాన్సర్ వ్యాధి - వ్యాప్తి
మార్చుప్రపంచ ఆరోగ్య సంస్థ - అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ అందించిన నివేదిక అనుసరించి ప్రపంచ వ్యాప్తంగా 2022లో మొత్తం 19976499 మంది కాన్సర్ కు గురైయ్యారు. వారిలో 9743832 మంది చనిపోయారు. ఆసియాలో 49% (98,26,539) కేసులు, ఐరోపాలో 22.4%, ఉత్తర అమెరికా 13.4%, లాటిన్ అమెరికా , కరేబియన్ 7.8%, ఆఫ్రికా లో 5.9%, ఓసియానియా లో 1.3% కేసులు ఉన్నాయి.[10]
భారతదేశంలో ఈ వ్యాధి గ్రస్తులు
మార్చుక్యాన్సర్ భారతదేశంలో 2020 సంవత్సరంలో 13.92 లక్షలు మంది ప్రజలు కాగా, 2021 సంవత్సరంలో 14.26 లక్షల మంది, 2022 సంవత్సరం లో 14.61 ప్రజల మంది ఈ మహమ్మారీ వ్యాధికి నమోదు అయ్యారు. క్యాన్సర్ మరణాల సంఖ్య 2018 సంవత్సరంలో 7.33 లక్షలు, 2022 సంవత్సరంలో 8.08 లక్షల మంది, ప్రజలు చనిపోయారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ,ఢిల్లీ ( ఎయిమ్స్ ) నివేదిక ప్రకారం 2026 సంవత్సరానికి ఈ క్యాన్సర్ మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం 20 లక్షలు. ఈ వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, ఈ వ్యాధిని కొంత వరకు నిరోధించ వచ్చని తగ్గుముఖం పట్టవచ్చని తెలిపింది.[29]
ఎం.ఎం.జె. కాన్సర్ వైద్యశాల, హైదరాబాద్ 2021 నుంచి 2024 వరకు వెలువరించిన 4 సంవత్సరాల గణాంకాలు:[4]
కాన్సర్ రకం | 2021 | 2022 | 2023 | 2024 |
---|---|---|---|---|
నోటి కాన్సర్ | 1912 | 2220 | 2473 | 2084 |
రొమ్ము కాన్సర్ | 1240 | 1477 | 1591 | 1791 |
గర్భాశయ ముఖద్వార కాన్సర్ | 1033 | 1095 | 1128 | 1262 |
ఊపిరితిత్తుల కాన్సర్ | 649 | 708 | 675 | 749 |
పొట్ట కాన్సర్ | 270 | 450 | 361 | 423 |
అండాశయ కాన్సర్ | 464 | 475 | 531 | 602 |
ఇతర కాన్సర్లు | 5144 | 5664 | 5969 | 6726 |
మందులు
మార్చుప్రపంచ కాన్సర్ అవగాహనా దినం
మార్చు- ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4.
- ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించబడుతోంది.
ఇవి కూడా చుడండి
మార్చువనరులు
మార్చు1. గవరసాన సత్యనారాయణ, కర్రీ తింటే కేన్సరు రాదా?: కేన్సరు వ్యాధిపై వ్యాసాలు, గవరసాన ఫౌండేషన్, గొల్లప్రోలు-533 455, ఇండియా, 2006
మూలాలు
మార్చు- ↑ https://www.who.int/health-topics/cancer
- ↑ https://www.google.co.in/imgres?imgurl=https://images-na.ssl-images-amazon.com/images/I/519aXD3-uVL._SX258_BO1,204,203,200_.jpg&imgrefurl=https://www.amazon.in/World-Without-Cancer-Story-Vitamin/dp/1943499039&h=260&w=260&tbnid=jYjlgPxET0DaDM:&q=world+without+Cancer+book&tbnh=122&tbnw=122&usg=AFrqEzd7MpH7xli1QO2ZrJhq3Base_mJqA&vet=12ahUKEwjwgN-Gv7_dAhWJOI8KHZJ0BQ8Q_B0wHHoECAYQFA..i&docid=OE8CgM_-KM3c_M&itg=1&sa=X&ved=2ahUKEwjwgN-Gv7_dAhWJOI8KHZJ0BQ8Q_B0wHHoECAYQFA[permanent dead link]
- ↑ Emanuel, Landau (1976). "World Without Cancer". American Journal of Public Health (Book Review) (in English). 66 (7). American Public Health Association, National Library of Medicine: 696. PMC 1653400. Retrieved 2025-03-13 – via PubMed Central.
{{cite journal}}
: CS1 maint: PMC format (link) CS1 maint: unrecognized language (link) - ↑ 4.0 4.1 4.2 (డా.) జి, శ్రీనివాస్ (2025-02-04). "అలవాట్లు మారుతున్నాయి .. క్యాన్సర్లు పెరుగుతున్నాయి". ఈనాడు.
- ↑ (డా.) సింహాద్రి, చంద్రశేఖర్ (2025-02-04). "కాన్సర్ కనికరించదు: లక్షణాలు రకరకాలు". ఈనాడు.
- ↑ "క్యాన్సర్ రకాలు". CancerInfo. India.[permanent dead link]
- ↑ "4 Deadliest Cancers In India And Theirs Symptoms. - Dollars Bag" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-02-21. Retrieved 2023-03-17.[permanent dead link]
- ↑ (డా.) డి, రఘునాధ రావు (2025-02-04). "కాన్సర్ కనికరించదు: కణితులు-క్యాన్సర్లు". ఈనాడు.
- ↑ "Metastatic Cancer: Questions and Answers". National Cancer Institute. 12 May 2015. Retrieved 28 March 2018.
- ↑ 10.0 10.1 (డా.) నోరి, దత్తాత్రేయుడు (2025-02-04). "కాన్సర్ పై పోరులో గెలిచేదెలా ?". ఈనాడు.
- ↑ (డా.) విజయ్, ఆనంద్ రెడ్డి (2025-02-04). "కాన్సర్ కనికరించదు: నివారించుకోండి, కాపాడుకోండి". ఈనాడు.
- ↑ "Cancer Vaccine Fact Sheet". NCI. 8 June 2006. Retrieved 28 March 2018.
- ↑ "క్యాన్సర్‌ను చంపే పసుపు". ఆంధ్ర జ్యోతి. 2009-10-29.
- ↑ Frei III E, Eder JP (2003). Combination Chemotherapy (in ఇంగ్లీష్). Retrieved 4 April 2020.
- ↑ "Targeted Cancer Therapies". cancer.gov. National Cancer Institute. 26 February 2018. Retrieved 28 March 2018.
- ↑ Holland Chp. 40
- ↑ Vitale I, Galluzzi L, Castedo M, Kroemer G (June 2011). "Mitotic catastrophe: a mechanism for avoiding genomic instability". Nature Reviews. Molecular Cell Biology. 12 (6): 385–392. doi:10.1038/nrm3115. PMID 21527953. S2CID 22483746.
- ↑ Bomford CK, Kunkler IH, Walter J. Walter and Miller's Textbook of Radiation therapy (6th ed.). p. 311.
- ↑ McMorran J, Crowther D, McMorran S, Youngmin S, Wacogne I, Pleat J, Clive P. "tumour radiosensitivity – General Practice Notebook". Archived from the original on 24 September 2015.
- ↑ Tidy C (23 December 2015). "Radiotherapy". Patient UK. Archived from the original on 9 July 2017. Last Checked: 23 December 2015
- ↑ Holland Chp. 41
- ↑ "Radiation Therapy for Brain Metastases: A Systematic Review". PCORI (in ఇంగ్లీష్). 13 August 2019. Retrieved 10 October 2023.
- ↑ Tran KQ, Zhou J, Durflinger KH, Langhan MM, Shelton TE, Wunderlich JR, Robbins PF, Rosenberg SA, Dudley ME (October 2008). "Minimally cultured tumor-infiltrating lymphocytes display optimal characteristics for adoptive cell therapy". Journal of Immunotherapy. 31 (8): 742–751. doi:10.1097/CJI.0b013e31818403d5. PMC 2614999. PMID 18779745.
- ↑ Marcus A, Eshhar Z (July 2011). "Allogeneic adoptive cell transfer therapy as a potent universal treatment for cancer". Oncotarget. 2 (7): 525–526. doi:10.18632/oncotarget.300. PMC 3248176. PMID 21719916.
- ↑ "Lasers in Cancer Treatment". National Institutes of Health, National Cancer Institute. 13 September 2011. Retrieved 15 December 2017. This article incorporates text from this source, which is in the public domain.
- ↑ "NCCN Guidelines". Archived from the original on 14 May 2008.
- ↑ "Clinical Practice Guidelines for Quality Palliative Care" (PDF). The National Consensus Project for Quality Palliative Care (NCP). Archived from the original (PDF) on 16 May 2011.
- ↑ Levy MH, Back A, Bazargan S, Benedetti C, Billings JA, Block S, Bruera E, Carducci MA, Dy S, Eberle C, Foley KM, Harris JD, Knight SJ, Milch R, Rhiner M, Slatkin NE, Spiegel D, Sutton L, Urba S, Von Roenn JH, Weinstein SM (September 2006). "Palliative care. Clinical practice guidelines in oncology". Journal of the National Comprehensive Cancer Network. 4 (8): 776–818. doi:10.6004/jnccn.2006.0068. PMID 16948956. S2CID 44343423.
- ↑ "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2023-02-06.