ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి

5500 కి.మీ. పైబడిన పరిధి గల బాలిస్టిక్ క్షిపణి

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, 5,500 కిమీ పైబడిన పరిధితో, అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి.[1]  అలాగే, సాంప్రదాయిక, రసాయనిక, జీవ  రసాయనిక ఆయుధాలను కూడా ఇవి మోసుకెళ్లగలవు. కానీ ఈ ఆయుధాలను ఖండాంతర క్షిపణులపై మోహరించిన దాఖలాలు లేవు. ఆధునిక క్షిపణులు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్  రీయెంట్రీ వెహికిల్ (MIRV) కు అనుకూలంగా ఉంటాయి. ఒకే క్షిపణి అనేక వార్‌హెడ్‌లను మోసుకుపోగలిగి, ఒక్కొక్కటీ ఒక్కొక్క లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని మిర్వ్ (MIRV) అంటారు.

SM-65 అట్లాస్, అమెరికా తయారు చేసిన మొట్టమొదటి ఖండాంతర క్షిపణి మొదటి ప్రయోగం 1957, పూర్తి పరిధి పరీక్ష 1958
The R-7 Semyorka was the world's first ICBM and satellite launch vehicle
Test launch of an LGM-25C Titan II ICBM from an underground silo at Vandenberg AFB during the mid-1970s

తొలినాళ్ళలో, ఖండాంతర క్షిపణుల కచ్చితత్వం పరిమితంగా ఉండేది (వర్తుల దోష పరిధి ఎక్కువగా ఉండేది).  వాటిని నగరాల వంటి చాలా పెద్ద లక్ష్యాల పైకి మాత్రమే ప్రయోగించే వీలుండేది. సైనిక  లక్ష్యాలపై దాడి చెయ్యాలంటే మరింత  కచ్చితత్వంతో కూడిన బాంబరు విమానాన్ని వాడాల్సిందే.

కచ్చితత్వం యొక్క ప్రాముఖ్యతను ఇన్వర్స్ స్క్వేర్ లా ఇలా చెబుతుంది - బాంబు పేలిన తరువాత ఏదైనా ఒక  బిందువు దగ్గర దాని ప్రభావం, బాంబు పేలిన బిందువు దగ్గర నుండి ఈ బిందువు ఉన్న దూరం యొక్క వర్గానికి విలోమంగా ఉంటుంది. దానర్థం, అణుబాంబు కూడా తలపెట్టిన చోట పేలకపోతే తలపెట్టిన నిర్మాణానికి జరిగే విధ్వంసం కూడా అనుకున్న దానికంటే తక్కువగా ఉంటుంది. అందుచేత బాంబు వలన కలిగే విధ్వంసం దాన్ని ప్రయోగించిన వాహనపు కచ్చితత్వంపై ఎంతో ఆధారపడి ఉంటుంది.

రెండవ, మూడవ తరం డిజైన్ల  (ఉదా: LGM-118 పీస్‌కీపర్) ద్వారా కచ్చితత్వాన్ని బాగా మెరుగుపరచారు. చిన్న చుక్క లాంటి లక్ష్యాలను కూడా ఈ క్షిపణులు విజయవంతంగా ఛేదించగలవు.

ఖండాంతర క్షిపణులకు ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఎక్కువ పరిధి, వేగం ఉంటాయి

చరిత్ర మార్చు

రెండవ ప్రపంచ యుద్ధం మార్చు

ప్రపంచపు మొట్టమొదటి ఖండాంతర క్షిపణి, A9/10, డిజైనును నాజీ జర్మనీ చేపట్టింది. న్యూయార్కు తోపాటు మరికొన్ని అమెరికా నగరాలు లక్ష్యంగా వెర్నర్ వాన్ బ్రాన్ నాయకత్వంలో ప్రొజెక్త్ అమెరికా పనిచేసింది. A9/A10 రాకెట్‌ను రేడియో గైడ్ చేస్తుందని తొలుత భావించారు. కానీ ఆపరేషన్ ఎల్‌స్టర్ వైఫల్యం తరువాత దాన్ని మార్చి, పైలటెడ్ క్రాఫ్టుగా మార్చారు. 1945 జనవరి, ఫిబ్రవరిల్లో A9/A10 రాకెట్‌ను కొన్ని సార్లు పరీక్షించారు. A9/A10 లకు మాతృక అయిన జర్మను V-2 రాకెట్‌ను కూడా వాన్ బ్రానే డిజైను చేసాడు. దీన్ని రెండవ ప్రపంచ యుద్ధం  చివర్లో బ్రిటిషుబెల్జియం నగరాలపై బాంబులు వేసేందుకు విస్తృతంగా వాడారు. ఈ రాకెట్లన్నీ  ద్రవ  ఇంధనాన్ని వాడాయి. యుద్ధం ముగిసాక,  వాన్ బ్రాన్ తో సహా ఇతర జర్మను శాస్త్రవేత్తలను అమెరికా తరలించి, వారిని అమెరికా సైన్యంలో క్షిపణులు, లాంచర్లూ  తయారుచేసేందుకు  నియమించారు. దీన్ని ఆపరేషన్ పేపర్‌క్లిప్ అని అంటారు.

 
సోవియట్ల R-36M (SS-18 శాటన్) చరిత్రలో అతి పెద్ద ఖం. క్షిపణి. ఇది 8,800 కెజి ల బరువును మోసుకుపోగలదు

ప్రచ్ఛన్న యుద్ధం మార్చు

 
భూస్థిత ఖం.క్షిపణుల మోహరింపు 1959-2014

యుద్ధం ముగిసిన వెనువెంటనే అమెరికా, సోవియట్ యూనియన్‌లు రాకెట్ పరిశోధన కార్యక్రమాలు చేపట్టాయి. ఇవి జర్మను వి-2 రాకెట్‌పై  ఆధారపడినవే. అమెరికాలో త్రివిధ సైనిక దళాలు వేరువేరుగా ఈ పరిశోధనను సాగించాయి. సోవియట్ యూనియన్లో రాకెట్ పరిశోధన కేంద్రీకృతంగా ఉండేది. మొదట్లో రెండు దేశాల్లోనూ తక్కువ పరిధి క్షిపణులనే రూపొందించినా, మెరుగైన డిజైన్లు కూడా వెంటవెంటనే వెలువడినాయి.

తొలినాళ్ళలో ఐరోపా లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణుల తయారీపై సోవియట్ యూనియన్ దృష్టి పెట్టింది. 1953 లో ఖండాంతర క్షిపణిని తయారు చెయ్యమని సెర్జీ కొరోల్యోవ్ ను ఆదేశించింది. అప్పుడే కొత్తగా కనిపెట్టిన హైడ్రోజెన్ బాంబును ఈ క్షిపణులు మోసుకు వెళ్ళాలి. నిధులు పుష్కలంగా ఉండడంతో R-7 అభివృద్ధి వేగంగా జరిగింది. మొదటి ప్రయోగం 1957 మే 15 న జరిగింది. అది ప్రయోగ స్థలం నుండి 400 కిమీ దూరంలో కూలిపోయింది. 1957 ఆగస్టు 21 న జరిపిన ప్రయోగం విజయవంతమైంది; 6,000 కిమీ ప్రయాణించిన R-7, ప్రపంచపు మొదటి ఖండాంతర క్షిపణిగా గణుతికెక్కింది.[2] 1959 ఫిబ్రవరి 9 న మొట్టమొదటి వ్యూహాత్మక క్షిపణి బలగం వాయవ్య రష్యాలోని ప్లెసెత్స్క్ లో మోహరించబడింది.[3]

1957 అక్టోబరు 4 న మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది కూడా ఈ R-7 రాకెట్టే. 1961 ఏప్రిల్ 12 న యూరీ గగారిన్‌ను తీసుకుని మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర  చేసిన వోస్తోక్ R-7 నుండి తయారైనదే. బాగా ఆధునికీకరించిన R-7 ను ఇంకా రష్యను సోయుజ్ అంతరిక్ష నౌకకు వాహకనౌకగా వాడుతూనే ఉన్నారు. సెర్జీ కొరోల్యోవ్ డిజైను చేసిన R-7, 50 యేళ్ళ పైగానే సేవలందించింది.

అమెరికా 1946 లో RTV-A-2 హిరోక్ ప్రాజెక్టుతో ఖండాంతర క్షిపణి పరిశోధన మొదలుపెట్టింది. మూడు దశల ఈ ప్రాజెక్టులో ఖండాంతర క్షిపణి అభివృద్ధి మూడో దశలో గానీ  మొదలుకాలేదు. 1948 లో రెండవదశను మూడుసార్లు పరీక్షించగా అవి పాక్షికంగా విజయవంతమయ్యాయి. ఆ తరువాత నిధుల కొరత ఏర్పడింది. ఖండాంతర పరిధి గల యుద్ధవిమానాలతో సంపూర్ణ గగనతల ఆధిపత్యం ఉన్న అమెరికా వైమానిక దళం, ఖండాంతర క్షిపణి అభివృద్ధికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. 1953లో సోవియట్లు హైడ్రోజెన్ బాంబును పరీక్షించడంతో పరిస్థితులు మారాయి. 1954లో అట్లాస్ క్షిపణి కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమంగా గుర్తించారు. 1957 జూన్11 న అట్లాస్-ఎ యొక్క మొట్టమొదటి పరీక్షను నిర్వహించారు; బయలుదేరిన 24 సెకండ్ల లోపే అది పేలిపోయింది. 1958 నవంబరు 28 న జరిపిన ప్రయోగం విజయవంతమైంది.[4] తొలి సాయుధ క్షిపణి, అట్లాస్-డి 1959 జనవరిలో మోహరించినట్లు ప్రకటించారు. అప్పటికింకా దాని పరీక్షే జరగలేదు. మొదటి పరీక్ష 1959 జూలై 9 న జరిగింది.[5][6] సెప్టెంబరు 1 న ఈ క్షిపణిని బలగాల్లోకి స్వీకరించారు.

R-7, అట్లాస్‌లు రెండింటికీ పెద్ద లాంచింగు స్టేషను అవసరం. దీంతో వాటిపై ఎదురుదాడులు చెయ్యడం తేలికగా ఉండేది. పైగా వాటిని ప్రయోగసిద్ధంగా ఉంచడం కుదిరేది కాదు తొలినాళ్ళలో వైఫల్యాలు చాలా ఎక్కువగా ఉండేవి. మానవసహిత యాత్రా కార్యక్రమాలు  (వోస్తోక్, మెర్క్యురీ,  వోస్ఖోద్,  జెమిని వగైరాలు) విజయవంతమవడంతో  వాటి  విశ్వసనీయత ప్రదర్శితమయింది. వాటి విజయాలు రక్షణ కార్యక్రమాలపై పడింది. అంతరిక్ష విజ్ఞానంలో అమెరికా సోవియట్ కంటే వెనకబడింది. అందుచేత అమెరికా  అధ్యక్షుడు జాన్ కెన్నెడీ అపోలో కార్యక్రమంపై దృష్టిపెట్టాడు. అపోలో, శాటర్న్ రాకెట్‌ను వాడుతుంది.

 
U.S. Peacekeeper missile after silo launch.

ఈ తొలి ఖండాంతర క్షిపణుల ఆధారంగానే అంతరిక్ష వాహనాలు రూపొందాయి. ఉదాహరణకు R-7, అట్లాస్, రెడ్‌స్టోన్, టైటాన్, ప్రోటాన్ మొదలైనవి. తరువాతి కాలంలో ఘన ఇంధనంతో పనిచేసే క్షిపణులను తయారు చెయ్యడం మొదలు పెట్టారు. తేలికైన వార్‌హెడ్‌లు, పెరిగిన కచ్చితత్వం, ఘన ఇంధన వాడకం, మొదలైన కారణాల వల్ల   ఈ ఆధునిక క్షిపణులు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. అందుచేత ఇవి అంతరిక్ష వాహనాలుగా అంతగా ఉపయోగ పడవు.

1950, 1960 ల్లో అమెరికా రష్యాలు రెండూ క్షిపణి వ్యతిరేక వ్యవస్థల అభివృద్ధిపై దృష్టిపెట్టాయి. 1972 నాటి ఎబిఎం ఒడంబడిక ఈ వ్యవస్థలను నిరోధించింది. 1961 లో మొట్టమొదటి ఎబిఎం పరీక్షను సోవియట్ యూనియన్ చేసింది. 1970 ల్లో మాస్కో రక్షణకై ఈ వ్యవస్థను మోహరించింది.

1972 నాటి SALT ఒడంబడిక, అమెరికా, రష్యాల ఖండాంతర క్షిపణి లాంచర్లను అప్పటికి ఉన్న సంఖ్యకు పరిమితం చేసింది. ఈ ఒడంబడిక ప్రకారం కొత్తగా జలాంతర్గామి లాంచర్లను తయారుచేసుకోవచ్చు, కానీ అంతే సంఖ్యలో భూస్థిత లాంచర్లను తొలగించాలి. SALT 2 ఒడంబడిక ప్రకారం, 1972, 1979 మధ్య అమెరికా రష్యాలు అణ్వాయుధాల సంఖ్యను తగ్గించుకున్నాయి. SALT 2 ను అమెరికా సెనేట్ ఆమోదించనప్పటికీ, 1986 వరకూ ఉభయపక్షాలూ ఆ ఒడంబడికను గౌరవించాయి. రీగన్ ప్రభుత్వం, సోవియట్ యూనియన్ ఒప్పందాన్ని ధిక్కరించిందంటూ ఆరోపించి దాని నుండి తప్పుకుంది.

1980ల్లో రోనాల్డ్ రీగన్ స్టార్‌వార్స్ అనే పేరున్న స్ట్రాటెజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ ను ప్రారంభించాడు. అలాగే MX, మిడ్జెట్‌మ్యాన్ ఖండాంతర క్షిపణి కార్యక్రమాలను కూడా మొదలుపెట్టాడు

1960ల్లో సోవియట్‌తో సైద్ధాంతిక వేర్పాటు తరువాత చైనా తన స్వంత అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. 1964 లో అణ్వస్త్రాన్ని పరీక్షించాక, అనేక వార్‌హెడ్లు,  క్షిపణులనూ అభివృద్ధి చెయ్యడం మొదలు పెట్టింది. 1970 ల్లో మొదలుపెట్టి ద్రవ ఇంధన DF-5 ఖండాంతర క్షిపణిని అభివృద్ధి చేసి 1975 లో ఉపగ్రహ వాహక నౌకగా వాడారు. 10,000 నుండి 12,000 కిమీ పరిధి గల DF-5, అమెరికా, రష్యాలను కొట్టగలుగుతుంది. అది సైలో నుండి ప్రయోగించబడుతుంది. 1981 లో మొదటి జత క్షిపణులు మోహరించ బడ్డాయి. 1990ల నాటికి 20 దాకా మోహరించి ఉండవచ్చు.[7] చైనా 1,700 కిమీ ల JL-1 మధ్యంతర పరిధి క్షిపణిని కూడా 92 రకం  జలాంతర్గాములపై మోహరించింది. కానీ ఈ జలాంతర్గాములు తదనంతర కాలంలో విఫలమయ్యాయి. [8]

ప్రచ్ఛన్న యుద్ధం తరువాత మార్చు

1991 లో అమెరికా, రష్యాలు తమ ఖండాంతర క్షిపణులను,  వాటి వార్‌హెడ్‌లను తగ్గించుకునేందుకు START-1  ఒడంబడికను కుదుర్చుకున్నాయి.

2009 నాటికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని శాశ్వత సభ్యు లైదు దేశాలూ సుదూర పరిధి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేసి మోహరించాయి. చైనా తప్ప మిగతా దేశాలకు జలాంతర్గామి ప్రయోగిత క్షిపణులుండగా,  రష్యా,  అమెరికా, చైనాలకు భూస్థిత ఖండాంతర క్షిపణు లున్నాయి. (అమెరికా క్షిపణులు సైలో ఆధారితం కాగా, చైనా, రష్యాలకు సైలో, రోడ్డు మొబైలు రెండింటి ద్వారా ప్రయోగించగల క్షిపణులున్నాయి (DF-31, RT-2PM2 Topol-M)).

ఇజ్రాయిల్ 2008లో జెరికో 3 అనే ఖండాంతర అణు క్షిపణిని మోహరించిందని భావిస్తున్నారు; దీని కంటే మెరుగైన క్షిపణి అభివృద్ధిలో ఉంది.[9][10] భారత్ 5,000 కిమీ పరిధి గల అగ్ని-5ను 2012 ఏప్రిల్ 19 న విజయవంతంగా పరీక్షించింది.[11] ఈ క్షిపణి యొక్క వాస్తవ పరిధి 8,000 కిమీ వరకూ ఉంటుందని విదేశీ పరిశోధకులు భావిస్తున్నారు. ఇతర దేశాలకు ఆందోళన కలగకుండా ఉండేందుకు గాను, భారత్ దీని పరిధిని తగ్గించి చెబుతోందని వారి ఉద్దేశం.[12]

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని అభివృద్ధి చేస్తోందని కొన్ని గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.[13] 2012 లో 32 మీటర్ల ఉన్హా-3 రాకెట్‌తో ఆ దేశం ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అది ఖండాంతర క్షిపణిని పరీక్షించడమేనని అమెరికా అభిప్రాయపడింది.[14]

2014 జూలైలో చైనా తన సరికొత్త ఖండాంతర క్షిపణి, డాంగ్‌ఫెంగ్-41 (DF-41),ను ప్రకటించింది. 12,000 కిమీ. పరిధి గల ఈ క్షిపణికి అమెరికా కూడా అందుబాటులో ఉంది. దానికి MIRV సామర్థ్యం ఉంది అని భావిస్తున్నారు..[15]

చాలా దేశాలు ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేసే క్రమంలో తొలుత ద్రవ ఇంధనాన్ని ఉపయోగించాయి. భారత్ మాత్రం అగ్ని-5 లో ఘన  ఇంధనాన్ని  ఉపయోగించింది. దక్షిణాఫ్రికాకు చెందిన [16] RSA-4,ఇజ్రాయిలీ జెరికో 3 కూడా ఘన ఇంధనాన్నే వాడాయి.[17]

ప్రయాణ దశలు మార్చు

ఖండాంతర క్షిపణి ప్రయాణంలో కింది దశలను గమనించవచ్చు:

  • బూస్ట్ దశ: ఇది 3 నుండి 5 నిముషాలు ఉంటుంది. ఘన ఇంధన దశ కంటే, ద్రవ ఇంధన దశ కొద్దిగా ఎక్కువ సేపు ఉంటుంది. బర్నౌట్ వేగం 4 కిమీ/సె, నుండి  7.8 కిమీ/సె వరకు ఉంటుంది. ఈ దశ ముగిసేసరికి క్షిపణి 150 నుండి 400 కిమీ ఎత్తుకు చేరుతుంది.
  • మధ్య దశ: ఇది దాదాపు 25 నిముషాలు ఉంటుంది. ఇది సబ్-ఆర్బిటాల్  అంతరిక్ష యాత్ర దశ. ఈ దశలో క్షిపణి నిట్టనిలువు దీర్ఘవృత్తాకార కక్ష్యలో  ప్రయాణిస్తుంది. ఈ దీర్ఘవృత్తపు పెరిజీ సుమారు 1,200 కిమీ దాకా ఉంటుంది.  క్షిపణి అనేక స్వతంత్ర వార్‌హెడ్లను విడుదల చేయగల సామర్థ్యం (MIRV) కలిగి ఉండవచ్చు.
  • పునఃప్రవేశ దశ: భూమివైపు తిరిగి వచ్చేటపుడు, 100 కిమీ ఎత్తులో మొదలైన ఈ దశ 2 నిముషాలు ఉంటుంది. తాకిడి సమయానికి వేగం 7 కిమీ/సె ఉంటుంది. 

సాధారణంగా పేలోడు బరువుకు అనుగుణంగా ఖండాంతర క్షిపణుల పథాన్ని నిర్ణయిస్తారు (కనిష్ఠ-శక్తి పథం). పేలోడు తక్కువగా ఉన్నపుడు, పెరిజీ తక్కువ ఎత్తులో ఉంటుంది. ఆ కారణంగా ప్రయాణ కాలం తక్కువగా ఉంటుంది.[18]

ఆధునిక ఖండాంతర క్షిపణులు మార్చు

 
External and cross sectional views of a Trident II D5 nuclear missile system. It is a submarine-launched missile capable of carrying multiple nuclear warheads up to 8,000 కిమీ (5,000 mi). Trident missiles are carried by fourteen active US Navy Ohio-class and four Royal Navy .

ఆధునిక ఖండాంతర క్షిపణులు ఒకటి కంటే ఎక్కువ వార్‌హెడ్‌లను మోసుకెళ్తాయి. వీటిని మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (MIRV) అంటారు. ప్రతీ దానికీ ఒక అణు వార్‌హెడ్ అమర్చి ఉంటుంది. దీనితో ఒకే క్షిపణి అనేక లక్ష్యాలను ఛేదించ గలదు. వేగంగా తగ్గిపోతున్న వార్‌హెడ్ పరిమాణం, బరువు, క్షిపణి నియంత్రణ ఒడంబడికల వలన తగ్గిపోతున్న క్షిపణుల సంఖ్య - వీటి కారణంగా MIRVల అవసరం ఏర్పడింది. క్షిపణి నిరోధక వ్యవస్థలకు ఇది సరైన సమాధానంగా కూడా భావించారు. అమెరికా సేఫ్‌గార్డ్ అనే తమ మొదటి క్షిపణి నిరోధక వ్యవస్థను 1975, 1976 ల్లో ప్రారంభించగా, సోవియట్ యూనియన్ తన గాలోష్ వ్యవస్థను 1970 ల్లో నెలకొల్పింది. ఇజ్రాయిల్ తన క్షిపణి నిరోధక వ్యవస్థను 1998 లో స్థాపించింది,[19] కానీ అది థియేటర్ బాలిస్టిక్ క్షిపణులకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తుంది. అలాస్కా లోని అమెరికా జాతీయ క్షిపణి రక్షణ వ్యవస్థ 2004 నుండి పనిచెయ్యడం మొదలైంది.[20]

 
TELs మిద నుండి కూడా ఖం. క్షిపణిని ప్రయోగించవచ్చు.. ఈ రష్యను RT-2PM2 తోపోల్-ఎం లాగా!

ఖండాంతర క్షిపణులను వివిధ ప్లాట్‌ఫారాల పైన మోహరించవచ్చు:

  • క్షిపణి సైలోల్లో: సైలోలు సైనిక దాడి నుండి క్షిపణులకు రక్షణ ఇస్తాయి  (అణు దాడుల నుండి కూడా రక్షించగలవని డిజైనర్లు భావిస్తారు)
  • జలాంతర్గాములపై: జలాంతర్గామి ప్రయోగిత (SLBMs) క్షిపణులు చాలావరకు ఖండాంతర క్షిపణులే
  • భారీ వాహనాలపై: స్వయంచాలిత రోడ్డు వాహనంపై క్షిపణులను మోహరించి, ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. దారిలో ఎక్కడినుండైనా ప్రయోగించే వీలుంటుంది.
  • రెయిళ్ళపై నడిచే మొబైల్ లాంచర్లు: ఉదాహరణకు RT-23UTTH "మోలోదెత్స్"—SS-24 "స్కాల్‌పెల్")

చివరి మూడు రకాలు చరంగా ఉంటాయి. అందుచేత వాటిని కనుక్కోవడం శత్రువుకు కష్టం. క్షిపణి, స్టోరేజిలో ఉండగా దాని నిర్వహణ  ఎలా చెయ్యడమనేది ఒక ప్రధానమైన అంశం. అమెరికా వారి మినిట్‌మ్యాన్ క్షిపణి విషయాం చూస్తే, అది పూర్తిగా కంప్యూటరు నియంత్రణలో ఉంటుంది. కంప్యూటరు సాయంతో ఈ క్షిపణి ఒక నిర్ణీత వ్యవధిలో తనను తానే పరీక్షించుకుంటూంటుంది.

క్షిపణిని ప్రయోగించగానే బూస్టరు, వార్‌హెడ్‌ను ముందుకు తోసి నిర్ణీత సమయానికి విడిపోయి పడిపోతుంది. ఆధునిక బూస్టర్లు ఘన ఇంధనాన్ని వాడుతాయి కాబట్టి,  ఇవి దీర్ఘకాల స్టోరేజీకి అనుకూలంగా ఉంటాయి. తొలినాళ్ళలో క్షిపణులు క్రయోజెనిక్ ద్రవాలను  ఇంధనంగా వాడేవి. వీటిని ముందే రాకెట్లో నింపి ఉంచడం సాధ్యం కాదు;  అతి శీతల స్థితిలో ఉండే ఈ ద్రవాలు ఆవిరైపోతాయి. అందుచేత క్షిపణిని ప్రయోగించడానికి ముందు ఇంధనం నింపడం అవసరం. దీనికి బాగా సమయం పడుతుంది.  ఈలోగా శత్రు  క్షిపణులు వీటిని ధ్వంసం చెయ్యవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంగ్లండు, క్షిపణి సైలోలను తయారు చేసింది. వీటిలో క్షిపణులకు శత్రు దాడుల నుండి  రక్షణ లభించడమే కాకుండా, ఇంధనం నింపే కార్యక్రమాన్ని భూగర్భంలో, శత్రువు కంటపడకుండా ఉంచగలిగారు.

బూస్టరు పడిపోయాక, వార్‌హెడ్ బాలిస్టిక్ పథంలో ప్రయాణం కొనసాగిస్తుంది. ఈ సమయంలో దానికి తోపుడు శక్తి ఏదీ ఉండదు, శతఘ్ని గుండు లాగా దూసుకుపోతుంది. వార్‌హెడ్, శంఖాకారపు పునఃప్రవేశ వాహనంలో ఉంటుంది. ఈ దశలో రాకెట్ నుండి ఎక్జాస్టు పొగ ఉండదు కాబట్టి, వార్‌హెడ్‌ను కనుక్కోవడం కష్టం. ఆత్యంత వేగంతో దూసుకు వచ్చే వార్‌హెడ్‌ను అడ్దగించడం కూడా కష్టమే. వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణులు దాదాపు అరగంటలోపే ఛేదించగలవు.

అణు వార్‌హెడ్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటపుడు దాని తీవ్రమైన వేగం గాలిపై వత్తిడిని కలగజేస్తుంది. దీనివలన ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. వార్‌హెడ్‌ను సరైన రక్షణ కవచంతో కప్పి ఉంచకపోతే అది ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. అందుచేత వార్‌హెడ్‌ను అల్యూమినియంతో తయారైన తేనెపట్టు లాంటి నిర్మాణంలో ఉంచుతారు. దీనిపై ఉష్ణ నిరోధకాన్ని అమర్చుతారు.

వర్తుల దోష పరిధి చాలా కీలకమైనది. అది సగానికి తగ్గితే, వార్‌హెడ్‌కు ఉండవలసిన శక్తి నాలుగో వంతుకు తగ్గుతుంది. క్షిపణి కచ్చితత్వం, దిశానిర్దేశక వ్యవస్థ  యొక్క కచ్చితత్వం పైన, జియోడెటిక్ సమాచారం పైనా ఆధారపడి ఉంటుంది.

సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన ఓ ఆయుధం - ఫ్రాక్షనల్ ఆర్బిటాల్ బొంబార్డ్‌మెంట్ సిస్టమ్ -కు పాక్షిక కక్ష్యా పథం ఉంటుంది. మిగతా ఖండాంతర క్షిపణుల్లాగా దీని లక్ష్యం ఏమిటో దీని పథాన్ని బట్టి తెలుసుకోలేరు. అయుధ నియంత్రణ చర్చల్లో భాగంగా రష్యా ఈ ఆయుధాన్ని పనిలోంచి తప్పించింది.

కొన్ని ఖండాంతర క్షిపణులు మార్చు

భూస్థిత ఖండాంతర క్షిపణులు మార్చు

 
పీస్‌కీపర్ క్షిపణి వార్‌హెడ్‌లు భూవాతావరణ పునఃప్రవేశ పరీక్ష. ఆ ఎనిమిదీ కూడా ఒకే క్షిపణి నుండి ప్రయోగించబడ్డవే. ఇక్కడ కనిపించే ఒక్కొక్క లైను, 300 కిలో టన్నుల TNT అణుబాంబును కలిగి ఉంటుంది. ఇది హిరోషిమాపై ప్రయోగించిన బాంబుకు 19 రెట్లు శక్తివంతమైనది.
 
Artist's concept of SS-24 deployed on railway.

ప్రస్తుతం రష్యా, అమెరికా, చైనా, ఇజ్రాయిల్, భారత్ ల వద్ద మాత్రమే భూస్థిత ఖండాంతర క్షిపణులున్నాయి.[21][22]

ప్రస్తుతం అమెరికా 450 ఖండాంతర క్షిపణులను మూడు వైమానిక స్థావరాల్లో మోహరించింది. ఈ క్షిపణులన్నీ LGM-30G మినిట్‌మ్యాన్-3 రకమే.

పాత మినిట్‌మ్యాన్-2 క్షిపణులన్నిటినీ START ఒడంబడికకు లోబడి నాశనం చేసారు. వాటి లాంచి సైలోలను మూసెయ్యడంగానీ, ప్రజలకు అమ్మెయ్యడం గానీ చేసారు. START 2 కు అనుగుణంగా చాలావరకు  MIRV లను తొలగించి, ఒకే వార్‌హెడ్ గల క్షిపణులను మోహరించారు. 2005 లో MIRV-సామర్థ్యం గల శక్తివంతమైన పీస్‌కీపర్ క్షిపణులను  తొలగించారు.[23] అయితే, START 2 ఒడంబడికను పక్కన పెట్టేసాక, 450 క్షిపణులపై ఉన్న 800 వార్‌హెడ్‌లను తొలగించకుండా ఉంచేసే ఆలోచన చేసింది.[24]

రష్యాకు చెందిన వ్యూహాత్మక రాకెట్ బలగాల వద్ద 1,247 అణు వార్‌హెడ్‌లను ప్రయోగించగల 369 ఖండాంతర క్షిపణులున్నాయి. వీటిలో 58 సైలో ఆధారిత R-36M2 (SS-18), 70 సైలో ఆధారిత UR-100N (SS-19), 171 మొబైలు RT-2PM "తోపోల్" (SS-25), 52 సైలో ఆధారిత RT-2UTTH "తోపోల్ M" (SS-27), 18 మొబైలు RT-2UTTH "తోపోల్ M" (SS-27), 6 (2011 డిసెంబరు నాటికి 15 [25]) మొబైలు RS-24 "యార్స్" (SS-29) ఉన్నాయి.

చైనా DF-31 లాంటి అనేక ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేసింది. 3 దశల ద్రవ ఇంధన DF-5 కు 13,000 కిమీ పరిధి ఉంది. 1971 లో DF-5 మొదటి పరీక్ష జరుపుకుని, తరువాత పదేళ్ళకు ఆపరేషన్‌లో చేరింది. దానిలో ఉన్న ఇబ్బంది, ఇంధనం నింపడానికి 30 నుండి 60 నిముషాలు పట్టడం. The DF-31 (అనగా CSS-10) మధ్యంతర పరిధి, 3 దశల, ఘన ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. జలాంతర్గామి నుండి ప్రయోగించే JL-2 కి ఇది భూస్థిత రూపం.

ఒక్కొక్క DF-41 లేదా CSS-X-10 పది అణు వార్‌హెడ్‌లను (MIRVలు) మోసుకుపోగలదు. దీని పరిధి 12,000–14,000 కిమీ.[26][27][28][29]  DF-41 ను జిన్‌జియాంగ్, కింఘాయ్, గన్షు, అంతర మంగోలియా ప్రాంతాల భూగర్భంలో మోహరించారు. ఇక్కడ నిర్మించిన భూగర్భ క్షిపణి వాహక వ్యవస్థలను భూగర్భ గ్రేట్‌వాల్ ప్రాజెక్టు (Underground Great Wall Project) గా పిలుస్తారు.[30]

ఇజ్రాయిల్ జెరికో 3 అనే రోడ్డు మొబైలు ఖండాంతర క్షిపణిని మోహరించినట్లు భావిస్తున్నారు. దీన్ని 2008 లో మోహరించారు.  ఈ క్షిపణిలో ఒక 750 కెజి ల అణు వార్‌హెడ్‌ను గానీ, 3 MIRV వార్‌హెడ్‌లను గానీ ఉంచవచ్చు. దీన్ని షావిత్ అంతరిక్ష వాహక  నౌక పై ఆధారపడి నిర్మించారు. దీని పరిధి 4,800 నుండి 11,500 కిమీ వరకు ఉండవచ్చు.[9] 2011 నవంబరులో, మెరుగుపరచిన జెరికో 3 ని ఇజ్రాయిల్ పరీక్షించినట్లు భావిస్తున్నారు.[10]

భారత్‌కు అగ్ని రూపంలో బాలిస్టిక్ క్షిపణుల శ్రేణి ఉంది. 2012 ఏప్రిల్ 19 న అగ్ని-5 ను భారత్ విజయవంతంగా  ప్రయోగించింది. ఇది 3 దశల ఘన ఇంధన, క్షిపణి. దీని పరిధి 7,500 కిమీ పైచిలుకు. 2013 సెప్టెంబరు 15 న దీని  రెండవ  పరీక్ష జరిగింది.[11] 2015 జనవరి 31 న వీలర్ ఐలండ్ నుండి విజయవంతంగా మూడవ పరీక్ష చేసారు. ఈ పరీక్షను టాట్రా  ట్రక్కుపై ఉంచిన క్యానిస్టరు ద్వారా చేసారు.[31]

జలాంతర్గామి ప్రయోగిత మార్చు

ప్రస్తుతం ఉన్న జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణులన్నీ ఖండాంతర పరిధి కలిగినవే, భారత్ అభివృద్ధి చేస్తున్న తక్కువ పరిధి క్షిపణులు తప్ప.[32] ఈ రకం క్షిపణులు కలిగి ఉన్న దేశాలు - అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్.[33]

క్షిపణి రక్షణ మార్చు

క్షిపణి నిరోధక క్షిపణి అంటే దాడికి వస్తున్న ఖండాంతర క్షిపణిని ఎదుర్కొని దాన్ని ఛేదించే క్షిపణి. ఖండాంతర  క్షిపణిని దాని పథంలో ఎదుర్కొనేందుకు మూడు అనువైన చోట్లున్నాయి: బూస్ట్ దశ, మధ్య దశ, అంత్య దశ. ప్రస్తుతం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, భారత్, ఇజ్రాయిల్ లు క్షిపణి నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో రష్యా తయారు చేసిన A-135 బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక వ్యవస్థ, అమెరికా వారి భూస్థిత మధ్య దశ రక్షణ, భారత్‌కు చెందిన పృథ్వి ఎయిర్డి ఫెన్స్, అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు అణు, రసాయనిక,  జీవరసాయనిక, సాంప్రదాయిక  క్షిపణులను ఎదుర్కొనగల సామర్థ్యం ఉంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు వనరులు మార్చు

  1. "Intercontinental Ballistic Missiles". Special Weapons Primer. Federation of American Scientists. Retrieved 2012-12-14.
  2. Wade, Mark. "R-7". Encyclopedia Astronautica. Retrieved 2011-07-04.
  3. "This Week in EUCOM History: February 6–12, 1959". EUCOM. 6 February 2012. Retrieved 2012-02-08.
  4. "Atlas". The Exploration of Space. Century of Flight. Retrieved 2012-12-14.
  5. "Atlas D". Missile Threat. Archived from the original on 2012-02-10. Retrieved 2016-07-28.
  6. "Atlas". Encyclopedia Astronautica. Astronautix. Retrieved 2012-04-19.
  7. "DF-5". Weapons of Mass Destruction / WMD Around the World. Federation of American Scientists. Retrieved 2012-12-14.
  8. "Type 92 Xia". Weapons of Mass Destruction Around the World. Federation of American Scientists. Retrieved 2012-12-14.
  9. 9.0 9.1 Feickert, Andrew (5 March 2004).
  10. 10.0 10.1 Pfeffer, Anshel (2 November 2011). "IDF test-fires ballistic missile in central Israel". Haaretz. Reuters. Retrieved 2011-11-03.
  11. 11.0 11.1 Mallikarjun, Y; Subramanian, TS (19 April 2012). "Agni-V successfully test-fired". The Hindu. Retrieved 2012-04-19.
  12. "India downplayed Agni-V's capacity: Chinese experts". Beijing, China: The Hindustan Times. Indo-Asian News Service. April 20, 2012. Archived from the original on 7 జూన్ 2014. Retrieved 13 July 2014.
  13. "North Korea's Taepodong and Unha Missiles". Programs. Federation of American Scientists. Retrieved 2012-04-19.
  14. "North Korea says it successfully launched satellite into orbit". NBC News. 12 December 2012. Retrieved 2013-04-13.
  15. "China 'confirms new generation long range missiles'". Telegraph.co.uk. 1 August 2014. Retrieved 1 April 2015.
  16. "South Africa". astronautix.com. Retrieved 2016-07-08.
  17. "Jericho". Encyclopedia Astronautica. Astronautix. Retrieved 2012-12-14.
  18. Science & Global Security, 1992, Volume 3, pp.101-159 Depressed Trajectory SLBMs: A Technical Evaluation and Arms Control Possibilities [1]
  19. "Israeli Arrow ABM System is Operational as War Butts Darken". Israel High-Tech & Investment Report. November 2002. Retrieved 2012-04-19.
  20. "Fort Greely". Systems. Missile Threat. 8 December 1998. Archived from the original on 2012-01-30. Retrieved 2016-07-28.
  21. "ICBM".
  22. India test launches Agni-V long-range missile, UK: BBC News, April 19, 2012, retrieved 2016-03-11 .
  23. Edwards, Joshua S. (20 September 2005). "Peacekeeper missile mission ends during ceremony". US: Air force. Archived from the original on 2012-10-18. Retrieved 2016-04-28.
  24. Norris, Robert S; Kristensen, Hans (January–February 2009). "Nuclear Notebook: U.S. and Soviet/Russian intercontinental ballistic missiles, 1959–2008". Bulletin of the Atomic Scientists. doi:10.2968/065001008. Archived from the original (PDF) on 2013-01-28. Retrieved 2012-12-14.
  25. "Second RS-24 regiment begins combat duty". Russian strategic nuclear forces. Russian forces. Retrieved 2012-12-14.
  26. "Five types of missiles to debut on National Day". Xinhua. 2 September 2009. Retrieved 2010-04-06.
  27. "DF-41, CSS-X-10". Weapons of Mass Destruction. Global security. Retrieved 6 April 2010.
  28. "DF-41 (CSS-X-10; China)". Jane's Strategic Weapon Systems. Jane's Information Group. 2 July 2009. Retrieved 2010-04-06.
  29. "DF-41 (CSS-X-10)". Missile Threat. Archived from the original on 2016-04-08. Retrieved 2016-07-28.
  30. Zhang, Hui. "China's underground Great Wall: subterranean ballistic missile". Power & Policy. Power and Policy, Belfer Center for Science and International Affairs, Kennedy School of Government, Harvard University. Archived from the original on 29 జనవరి 2016. Retrieved 14 June 2015.
  31. "Agni 5, India's Longest Range Ballistic Missile, Successfully Test-Fired". NDTV.com. Retrieved 2016-02-08.
  32. "Going ballistic: India looks to join elite missile club". The Times of India. Retrieved 1 April 2015.
  33. "Type 094 (Jin Class) Nuclear-Powered Missile Submarine". Sino defence. Retrieved 2012-12-14.