ప్రధాన మెనూను తెరువు

చందాల కేశవదాసు

నాటక కర్త, సినీ గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని

రసికప్రియ సృష్టికర్త హిందీ రచయిత కేశవదాసు గురించి ఇక్కడ చూడండి.

చందాల కేశవదాసు
Chandala Kesavadasu.JPG
చందాల కేశవదాసు
జననంచందాల కేశవదాసు
జూన్ 20, 1876
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి
మరణంమే 14, 1956 దుర్ముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ద పంచమి రోజున
ప్రసిద్ధిగీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త
తండ్రిచందాల లక్ష్మీనారాయణ,
తల్లిపాపమ్మ

చందాల కేశవదాసు (జూన్ 20, 1876 - మే 14, 1956) తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి[1], నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశాడు.

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించాడు.[2] [3] అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.

కళారంగంలో ప్రవేశంసవరించు

అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య ఈయనకు సంగీతంలోని మెలకువలు తెలియజేశాడు. గేయరచనలో, సంగీతం కూర్పులో, హరికథనంలో, రచనలో కేశవదాసు ఆరితేరాడు. కాంతయ్యనాటక సమాజంలోచేరి కవిగా, నటుడిగా పేరుగాంచాడు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థుడు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధా కృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చాడు. ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన ‘భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు’, అని శ్రీకృష్ణ తులాభారం సినిమాకు వన్నెతెచ్చిన గీతం కేశవదాసు రాసిందే. నాటకాల్లో మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుదే. ఈ ప్రార్థనా గీతాన్ని స్వరపరచిన ఖ్యాతి పాపట్ల కాంతయ్యకు దక్కింది. భక్త ప్రహ్లాద, కనకతార వంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు వ్రాశాడు. కొంతకాలం నాటకరంగానికి స్వస్తిచెప్పి తెలంగాణా అంతటా హరికథలు చెప్పాడు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, మూడు పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తి భావం, సరళత్వం తొణకిసలాడుతుంటాయి.

1930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను ప్రముఖ సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, అముల నరసింహారావులు పాడగా బెంగుళూరులో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశాడు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. "కనక తార", "లంకాదహనం" వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచాడు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశాడు.

రచనలుసవరించు

 
Sati Anasooya
 • కేశవ శతకం
 • కనకతార - (1926) నాటకం
 • బలి బంధనం - (1935) ఆరు అంకముల నాటకం
 • శ్రీరామ నామామృత గేయం
 • సీతాకళ్యాణం
 • రుక్మాంగద
 • మేలుకొలుపులు
 • జోలపాటలు
 • సత్యభామా పరిణయం (హరికథ)
 • సీతా కల్యాణం (హరికథ)
 • రుక్మాంగద (హరికథ)
 • నాగదాసు (హరికథ)

సినిమా పాటలుసవరించు

బిరుదులుసవరించు

 • ఆంధ్రసూత
 • కలియుగ దశరథ
 • నటనా వతంస

వివాదాలుసవరించు

1. శ్రీకృష్ణతులాభారం నాటకానికి చందాల కేశవదాసు 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని ‘మైలవరం బాలభారతి నాటక సమాజం’ వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో బలే మంచి చౌక బేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అనే మూడు పాటలే సినిమాల్లోకి ఎక్కాయి. (పైడిపాల రాసినట్లుగా) 1935, 55, 66 సంవత్సరాల్లో తీసిన మూడు సినిమాల్లోనూ ఈ మూడు పాటలున్నాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి... రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా టైటిల్స్‌లో కేశవదాసు పేరు చేర్చడం జరిగింది.[4]

2. పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు. అయితే, మొదట కవిగారు పాటలు చేర్చడానికి ఒప్పుకోలేదు. కాని మైలవరం బాలభారతి నాటక సమాజం పెద్దలు ఆయన్ని ఒప్పించారు. భక్తిగీతాలు మాత్రమే రాయాలని కవిగారు షరతు పెట్టి కేశవదాసుగారి పాటలతో నాటకాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. ఈ పాటలను 1929లో కురుకూరి సుబ్బారావు అచ్చువేశారు.[4]

3. సురభి నాటకంలోని మూడు పాటల్ని సినిమాలోకి ఎక్కించారని ‘ముక్తకంఠం’తో చెప్పిన పెద్దలు గౌరవనీయులు- వారి మాట శిరోధార్యమే. కాని నాటకం నుండి సినిమాకెక్కాయా? సినిమా నుండి నాటకంలోకి దిగినాయా? అనే సందేహానిక్కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే దాసు గారిపై పరిశోదన చేసిన డా॥ఎం.పురుషోత్తమాచార్య తండ్రిగారు వెంకట నరసింహాచార్యులు దాసుగారి సమకాలికులు. జగ్గయ్యపేటలో ఒక హరికథాగానంలో ఉండగా హెచ్.ఎం.రెడ్డిగారి నుండి పిలుపు వచ్చిందనీ, తాను వెళ్లి ‘ప్రహ్లాద’ సినిమాకు పాటలు రాసి వచ్చాననీ దాసుగారు చెప్పినట్లు తెలియజేసారు.[4]

మరణంసవరించు

కేశవదాసు 1956, మే 14న పరమపదించాడు.[3]

మూలాలుసవరించు

 1. సహజకవి చందాల కేశవదాసు పేరు తో నమస్తే తెలంగాణ వ్యాసం[1]
 2. మన వెండి వెలుగులు - నమస్తే తెలంగాణా
 3. 3.0 3.1 తెలంగాణ మ్యాగజైన్. "పరబ్రహ్మ! పరమేశ్వర!! గీతకర్త". magazine.telangana.gov.in. Retrieved 20 June 2017.
 4. 4.0 4.1 4.2 సాక్షి పత్రికలో పురుషోత్తమాచార్యులు గారి వ్యాసం[2]

బయటి లింకులుసవరించు