జెట్టి ఈశ్వరీబాయి

జెట్టి ఈశ్వరీబాయి (డిసెంబరు 1, 1918 - ఫిబ్రవరి 24, 1991) భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త.[1] సమాజ సేవికురాలు.

దస్త్రం:Eshwari Bai.jpg
ఈశ్వరీ బాయి

పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషి సలిపిన వారిలో ఒకరు జెట్టి ఈశ్వరీబాయి. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురి అవుతూ, బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషిచేశారు. హైదరాబాదు నగరంలో ఘోషా పద్ధతి పాటించే సాంప్రదాయం కొట్టిమిట్టాడుతున్న సమయంలోనే ఆమె సాంఘిక రంగంలో పనిచేశారు.

బాల్యం - వివాహంసవరించు

ఈశ్వరీబాయి 1918, డిసెంబరు 1 వ తేదీన సికింద్రాబాదు లోని చిలకలగూడ లో ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. తల్లి రాములమ్మ, తండ్రి బల్లెపు బలరామస్వామి. ఈమె తండ్రి నిజాం స్టేట్ రైల్వేస్‌లో పనిచేశారు. బలరామస్వామికి ఆరుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు- బాబురావు, పాండురంగం, కిషన్, రవీందర్. ఇద్దరు అమ్మాయిలు - ఈశ్వరీబాయి, మాణికమ్మ.[2] కొద్ది సంపాదనతోనే తన పిల్లలందరికీ చదువులు చెప్పించారు. ఈశ్వరీబాయి ప్రాథమిక విద్య ఎస్.పి.జి. మిషన్ పాఠశాలలో సాగింది. ఆ తరువాత కీస్ హైస్కూలులో ఉన్నతవిద్య చదువుకున్నారు. ఆమె వివాహం 13వ ఏటనే పూణేలోని ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు జెట్టి లక్ష్మీనారాయణ తో జరిగింది. ఆమెకు ఒక కూతురు పుట్టిన అనంతరం భర్త చనిపోగా, ఈశ్వరీబాయి కూతుర్ని తీసుకొని హైదరాబాదులోని పుట్టింటికి తిరిగి వచ్చారు.[3] తరువాత తన కాళ్ళపై తాను నిలబడి సాంఘిక అభ్యుదయానికి కృషి చేశారు. చిలకలగూడాలోని మురికివాడలకి వెళ్లి వయోజనులకు చదువు చెప్తానని ఈశ్వరీబాయి అక్కడ ఓ బోర్డు పెట్టి, ఓ వరండాలో అందరినీ పోగేసి చదువు చెప్పేది.

వృత్తి జీవితంసవరించు

ఈశ్వరీబాయి సోదరుడు రామకృష్ణ వామపక్షవాది. ఈయనే ఈశ్వరీబాయికి సామాజిక ధృక్పథం, రాజకీయ చైతన్యం కల్పించాడు.[3] భర్త చనిపోయి పుట్టింట్లో ఉన్నా ఈశ్వరీబాయి ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించింది. మెట్రిక్ పాసై పరోపకారిణి పాఠశాల అనే ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా వృత్తి జీవితం ప్రారంభించింది.. ఆ పాఠశాలలో పనిచేస్తూనే కొందరు సంపన్న కుటుంబాల పిల్లలకు బోధనా తరగతులను నిర్వహించేవారు. ఈశ్వరీబాయికి తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో మంచి పరిజ్ఞానం ఉండేది. పూణేలో ఉన్న రోజుల్లో మరాఠీ చేర్చుకున్నది.[3] హైదరాబాదు ప్రజలతో కలిసి పనిచేయడానికి బహుభాషా పరిజ్ఞానం ఆ రోజుల్లో ప్రత్యేక అర్హత. దానిని ఈశ్వరీబాయి సద్వినియోగపరుచుకున్నారు. ఎవరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే సమాధానమిచ్చేవారు. అలా అందరికీ ఆత్మీయులయ్యారు. ఓ వైపు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూనే ఇంకో వైపు సాంఘిక సేవలో పాల్గొనేది. ఈశ్వరీబాయి రెడ్‌క్రాస్ సొసైటీ యొక్క జీవితకాలపు సభ్యురాలు, చాలా కార్యక్రమాల్లో ఆమె భాగస్వామిగా పనిచేసింది. తన దగ్గరున్న డబ్బుతోనే గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు అనే విద్యాసంస్థలను మొదలుపెట్టింది.[3]

మున్సిపల్ కౌన్సిలర్‌గాసవరించు

1951లో హైదరాబాదు-సికింద్రాబాదు నగర పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆమెకు కాంగ్రెస్ అభ్యర్థి నుంచి బలమైన పొటీ ఎదురైంది. ఈశ్వరీబాయి ఇంటింటికీ వెళ్ళి ప్రచారం నిర్వహించి, ఆ ఎన్నికలలో ఆమె విజయం సాధించారు. ఆమె విజయానికి సోదరుడు కిషన్ ఎంతగానో కృషిచేశాడు. ముఖ్యంగా దళిత వర్గాల నివాస వీధులలో ఆమెకు అధిక ఓట్లు లభించాయి. కౌన్సిలరుగా మురికివాడల్లో మంచినీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణం ఇతర ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాక కార్మికులకు ఇళ్లస్థలాలను ఇప్పించారు. ఆమె అనేక కమిటీలలో సభ్యురాలుగా ఉన్నందున ఎందరో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మున్సిపల్ కౌన్సిలర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు.[2] ఈమె పురపాలక సంఘ కౌన్సిలరుగా రెండు పర్యాయాలు పనిచేసింది.

ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంసవరించు

వెనుకటి హైదరాబాద్ రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల ప్రజల సంక్షేమానికి 1950లో షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ అనే కొత్త కమిటీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఎ.పి. షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ గా రూపొందింది. దీనికి ఈశ్వరీ బాయి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

శాసనసభలోసవరించు

1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈశ్వరీబాయి నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడి, షెడ్యూల్డు కులాల వారికి రిజర్వు చేయబడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు పోటీచేశారు.[4] కానీ ఆ ఎన్నికలలో టి.ఎస్.సదాలక్ష్మి చేతిలో ఓడిపోయింది. కానీ 1967లో జరిగిన ఎన్నికలలో తిరిగి అదే స్థానం నుండి పోటీ చేసి దేవాదాయ శాఖమంత్రిగా పనిచేస్తున్న సదాలక్ష్మిపై విజయం సాధించారు. 1969లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలిదశలో ఆమె చేసిన కృషి ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ఉద్యమం కోసం సెపరేట్ తెలంగాణ పోరాట సమితి (ఎస్‌టిపిఎస్) అను పార్టీని స్థాపించారు. 1972లో తిరిగి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి సెపరేట్ తెలంగాణ పోరాట సమితి అభ్యర్థిగా పోటీ చేసి, సమీప కాంగ్రేసు పార్టీ అభ్యర్థి నంది ఎల్లయ్యపై గెలిచి రెండవ పర్యాయం శాసనసభలో అడుగుపెట్టింది.[4] ఆనాటి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకులలో తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, జి. శివయ్య గార్ల వరుసలో ఈశ్వరీబాయి కూర్చునేవారు. పది సంవత్సరాలపాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకులలో ముఖ్యమైన పాత్ర వహించారు. 1978లో జుక్కల్ నియోజకవర్గం నుండి రిపబ్లికన్ పార్టీ (కాంబ్లే) అభ్యర్థిగా శాసనసభకు పోటీచేసి సౌదాగర్ గంగారాం చేతిలో ఓడిపోయింది.[5]

మహిళా సంక్షేమంసవరించు

ఈశ్వరీబాయి కొంతకాలం మహిళా, శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా ఉన్నారు. మహిళాభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు జరిపారు. 1952 నుండి 1990 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాసేవా రంగంలో పనిచేస్తూ దళిత ప్రజలు, వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి ఈశ్వరీబాయి కృషి చేశారు. ఈశ్వరీబాయి జ్ఞాపకార్ధం ట్రస్టు, నర్సింగ్ కాలేజి నిర్వహించబడుతున్నాయి.

కుమార్తెసవరించు

ఈశ్వరీబాయి ఏకైక పుత్రికే జె. గీతారెడ్డి. ఆమెను వైద్య విద్యలో పట్టభద్రురాలను చేసి, విదేశాలలో ఉన్నత చదువులు చదివించి డాక్టర్ని చేశారు. తన వలెనే తన కూతురు కూడా సమాజసేవలో పాల్గొనాలని ఆమె అభిలషించారు. గీతారెడ్డి కొంతకాలం మంత్రిణిగా పనిచేశారు.

మరణంసవరించు

ఈశ్వరీబాయి అవసాన దశలో క్యాన్సర్ వ్యాధికి గురై 1991, ఫిబ్రవరి 24 వ తేదీన హైదరాబాదులో మరణించారు.[3]

ఇతర వివరాలుసవరించు

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహించబడుతున్నాయి.[6]

మూలాలుసవరించు

  1. "టైంస్ ఆఫ్ ఇండియాలో వ్యాసం". Archived from the original on 2011-09-16. Retrieved 2014-02-09.
  2. 2.0 2.1 "దళితుల కలికితురాయి ఈశ్వరీబాయి - ఆచార్య జి. వెంకట్రాజం, నమస్తే తెలంగాణ 23/2/2014". Archived from the original on 2016-03-05. Retrieved 2014-09-22.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 నేను..ఈశ్వరీబాయి బిడ్డను - నమస్తే తెలంగాణ పత్రికలో గీతారెడ్డి వ్యాసం[permanent dead link]
  4. 4.0 4.1 ఎల్లారెడి తోలి ఎమ్మెల్యేలు మహిళామణులే - ఆంధ్రజ్యోతి 13-04-2014
  5. Poll ticket: several women aspirants in fray - The Hindu Mar 08, 2004
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (25 February 2019). "తెలంగాణ ఆణిముత్యం ఈశ్వరీబాయి". Archived from the original on 25 February 2019. Retrieved 25 February 2019.