డి.కె.చదువులబాబు

రచయిత

డి.కె.చదువులబాబు తెలుగు కథా రచయిత. అతను రాసిన సుమారు 50 కథలు, 250 బాలసాహిత్య రచనలు వివిధ వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అతని కథలు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జ్యోతి, విశాలాంధ్ర, వార్త, జాగృతి, ప్రజాశక్తి మొదలగు ప్రముఖ పత్రికలలో రెగ్యులర్‌గా ప్రచురిస్తున్నాయి.

డి.కె.చదువులబాబు

అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దక్కింది[1]. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారాలు - 2023 ను జూన్ 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది[2]. తెలుగుకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారాన్ని డీకే చదువుల బాబు చిరు కథల పుస్తకం ' వజ్రాల వాన ' దక్కించుకుంది[3]. అతను ప్రస్తుతం కమలాపురం మండలం పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నారులను ఆకట్టుకునేలా ఆయన ఎన్నో చిరు కథలు, నవలలు రాశారు. 2003 సంవత్సరంలోనే ' బాలల కథలు' సంపుటిని వెలువరించారు.

జీవిత విశేషాలు

మార్చు

అతను ఆంధ్రప్రదేశ్ లోని వై.ఎస్.ఆర్ జిల్లా కు చెందిన పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలో 1967 జూన్ 1 న జన్మించాడు. తర్వాత అతను పొద్దుటూరు లో స్థిరపడ్డాడు. ఒక వైపు సాంఘిక కథలు రాస్తూనే మరోవైపు బాలసాహిత్యంపై కృషిచేస్తున్నాడు. చందమామ, బొమ్మరిల్లు (పత్రిక), బాలమిత్ర, బాలజ్యోతి, బాలభారతం(పత్రిక), బాలతేజం, బుజ్జాయి, అటవిడుపు, చిన్నారి, మొదలగు బాలల పత్రికల్లో సుమారు 250 కథలు ప్రచురితమైనాయి. అతను వివిధ వార్తాపత్రికలలో సుమారు 50కి పైగా సాంఘిక కథలు రాసాడు. పిల్లలకోసం విజ్ఞానాన్ని అందించే "మాటలకొలువు" శీర్షికను బాలల పత్రికల్లో నిర్వహించాడు. బాలల నవలలు రాసాడు. శ్రీ వెంకటేశ్వర నాటక కళామండలి స్థాపించి "మర్మలోకం", "సమలోకం" అనే సాంఘిక నాటకాలను రచించి దర్శకత్వం వహించి ప్రదర్శింపజేసాడు. అతని "కనువిప్పు" కథను మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. 1994లో పల్లకి వారపత్రిక నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో వీరి "అమ్మకథ" ప్రథమ బహుమతి పొందింది. స్టేట్ టీచర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన కథల పోటీలో అతని కథ "నేను సైతం(మాష్టారు గారి బడి)" ప్రథమ బహుమతి పొందింది. ఆయన రచనా ప్రస్థానంలో ఎన్నో సత్కారాలు పొందాడు. "సాహితీ సౌరభం" మొదలగు సంకలనాల్లో వీరి రచనలు చోటు చేసుకున్నాయి. 2005లో కాటన్ మర్చంట్స్ అసోసియేషన్ వారి రజతోత్సవంలో "విశిష్ట వ్యక్తి" సన్మానం పొందాడు. వివిధ పత్రికల్లో ప్రచురించిన వీరి 300 కథల నుండి 150 కథలను ఎన్నికచేసి ఆరు కథా సంపుటాలుగా ప్రచురించారు.[4] 2003లో బాలల కథలు అనే సంపుటిని ప్రచురించాడు.[5]

  • మనసున్న మనిషి (సాంఘిక కథలు)
  • బాలల కథలు (కథా సంపుటి)
  • బంగారు రెక్కలు, అప్పు-నిప్పు (బాలల కథలు - విశాలాంధ్ర వారి ప్రచురణ)
  • విజయ రహస్యం (కథా సంపుటి)
  • చిన్నారి మనసు (కథలు - విజ్ఞాన విషయాలు)
  • కడప జిల్లా సాహితీమూర్తులు
  • .మనసున్నమనిషి
  • దేశభక్తి కరాళకథలు.
  • నీరు-కాలుష్యం
  • దిక్సూచి.
  • ఆకాశం అందుతోంది.
  • వజ్రాలవాన.
  • బంగారుకల.
  • బహుమతి.
  • గజ్జెలగుర్రం అను పుస్తకాలను ప్రచురించారు.
  • వీటిలో'కడపజిల్లా సాహితీ మూర్తులు'465 మంది కవులు, రచయితల వివరాలతో కూడిన గ్రంథం.
  • ఆకాశంఅందుతోంది'కవితాసంపుటి
  • డి.కె.చదువులబాబు శిక్షణలో విద్యార్థులు వ్రాసిన కథలను 'కొత్తపేటకలాలు'శీర్శికతో పుస్తకంగా ప్రచురించారు.

సాహిత్య సేవ

మార్చు

బాలసాహిత్య సాంస్కృతిక సేవాసమితి 2012లోస్థాపించి, విద్యార్థులకు  కథారచన,గేయరచన,వ్యాసరచన,పద్యపఠనం,చిత్రలేఖనం మొదలగు పోటీలు నిర్వహిస్తూ బాలసాహిత్య పుస్తకాలు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలుఅందజేస్తున్నారు.వేసవి శిక్షణా శిబిరాల్లో విద్యార్థులకు కథారచన, గేయరచనలో శిక్షణ ఇస్తున్నారు.  కేంద్ర సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పత్రసమర్పణలు చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ వారి సర్వశిక్షాఅభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలసాహిత్య కార్యక్రమాల్లో సేవలందించారు.బాలరత్నాలు పత్రికకు ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా సేవలందించారు.చదువుల సాహిత్య కళావేదికను స్థాపించి సాహిత్య సేవ చేస్తున్నారు.

పురస్కారాలు

మార్చు

వీరి కృషికి గుర్తింపుగా వివిధ ప్రముఖ సంస్థలనుండి బాలలకథా భాస్కర. బాలసాహిత్యరత్న. బాలసాహితీ భూషణ్. బాలప్రియ,బాలరత్న మొదలగు బిరుదులను,శతాధిక సత్కారాలను అందుకున్నారు.2007లోముఖ్యమంత్రి డా.శ్రీ వై.యస్. రాజశేఖరరెడ్డి గారి నుండి సాహిత్య పురస్కారం. 2014లోముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నుండి రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ తెలుగు కళావేదిక పురస్కారం.సి.పి.బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం సాహిత్య పురస్కారం. గురుజాడ తెలుగు కవితా విశిష్ట సాహిత్య సేవా పురస్కారం. శ్రీశ్రీ సాహిత్య పురస్కారం. శ్రీ గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం, శ్రీనారంశెట్టి బాల సాహితీపీఠం ప్రధాన పురస్కారం. సాహితీలహరి మంచుపల్లి సత్యవతి గారి స్మారక ప్రధాన పురస్కారం. బాలగోకులం సంస్థ ప్రధాన పురస్కారం, సమతారావు బాలసాహిత్య పురస్కారం మొదలగు శతాధిక సత్కారాలు అందుకున్నారు.

మూలాలు

మార్చు
  1. "ఇద్దరికి సాహిత్య అకాడమీ పురస్కారాలు". Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2023-09-01. Retrieved 2023-09-02.
  2. telugu, NT News (2023-06-24). "సుధామూర్తికి బాల సాహిత్య పురస్కారం". www.ntnews.com. Retrieved 2023-09-02.
  3. "వైయస్సార్‌ జిల్లాను వరించిన సాహిత్య అకాడమీ అవార్డులు". EENADU. Retrieved 2023-09-02.
  4. విశాలాంధ్ర ప్రచురణ "మాయా విసనకర్ర" పుస్తకంలో రచయిత వివరాలు[permanent dead link]
  5. "Appu - Nippu - అప్పు - నిప్పు". Archived from the original on 2017-07-12. Retrieved 2016-11-18.

ఇతర లింకులు

మార్చు