అమ్మ

కన్న స్త్రీ
(తల్లి నుండి దారిమార్పు చెందింది)

కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.

  • కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
  • పెంపుడు తల్లి: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.
  • సవతి తల్లి: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.
  • పెత్తల్లి లేదా పెద్దమ్మ: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.

తల్లి పేరుకూ చోటు

మార్చు

ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల సర్టిఫికెట్లలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లి పేరు మాత్రమే లేక తండ్రి పేరు మాత్రమే ఉండాలనో కూడా విద్యార్థి కోరుకోవచ్చు. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అమృత వాక్యం అమ్మ కదా అలాంటి అమ్మ పేరు వ్రాయవలసినది సర్టిఫికెట్ల మీద కాదు హృదయంలో అని మనం అందరం తెలుసుకోవాలి .

పంచమాతలు

మార్చు
ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !

రాజు భార్య (రాణి), అన్న భార్య (వదిన), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి (అత్త), కన్న తల్లి - వీరిని పంచమాతలుగా భావించవలెను అని కుమార శతకము నుండి పద్యము.

శంకర సూక్తి

మార్చు

ఆది శంకరుని దృష్టిలో తల్లి : "కు పుత్రోజాయేత క్వచిదపి కు మాతా న భవతి" 'పుత్రుడు చెడ్డవాడైనా, తల్లి చెడ్డది కాబోదు ' అని తాత్పర్యం.

అమ్మ గురించి తెలుగు కవుల కమ్మని పలుకులు

మార్చు
  • ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
  • అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే -- ఆత్రేయ
  • పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ -- చంద్రబోస్‌
  • అమ్మను మించి దైవమున్నదా....జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
తప్పటడుగులేసిన చిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు...నింగికి నిచ్చెనలేసే మొనగాడినే ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే
కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ప్రతి తల్లికి మమకారం పరమార్థం మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం ----....-- సి. నారాయణ రెడ్డి
  • ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
అమ్మంటే అంతులేని సొమ్మురా, అది యేనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ ---దాశరథి కృష్ణమాచార్య
  • పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే---వేటూరి సుందరరామమూర్తి vamsi gari kai

అమ్మతో సామెతలు

మార్చు
  1. అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు (జేబు) చూస్తుంది
  2. అమ్మకడుపున పుట్టిన వాళ్లంతా నిక్షేపరాయుళ్ళే
  3. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
  4. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు
  5. అమ్మ తా పెట్టదు, అడుక్కొని తినా తిననివ్వదు
  6. అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు, తగుదునని తగవు తీర్చవచ్చాడు
  7. అమ్మ కడుపులో ఉన్న వాళ్ళూ సమాధుల్లో ఉన్నవాళ్ళే మంచివాళ్ళు
  8. అమ్మ కళ గుమ్మంలోనే తెలుస్తుంది
  9. అమ్మ గూటికి అయ్య కాటికి
  10. అమ్మ చెడ్డ చేటుకు ముసుగొకటా?
  11. అమ్మ దగ్గర కిందపడుకున్నా ఒక్కటే, అయ్య దగ్గర నేల పడుకున్నా ఒకటే
  12. అమ్మ మంచిదేకానీ తెడ్డు మంచిది కాదు
  13. అమ్మ దాసర్లకు, అయ్య జంగాలకు
  14. అమ్మను తిడతావేమిరా లంజాకొడకా అన్నాడట
  15. అమ్మ పెంచిన బిడ్డా?అయ్య పెంచిన బిడ్డా?
  16. అమ్మయినా అడగందే పెట్టదు
  17. అమ్మా అని పిలవని నోరు కుమ్మరి మను ద్రవ్విన గుంట
  18. అమ్మా నొప్పులెత్తుతున్నప్పుడు నన్ను లేపవే అంటే అలగా పడుకో బిడ్డా ఊటగా నొప్పులెత్తుకుంటే ఊరెల్లా నీవే లేపుతావు అన్నదట
  19. అమ్మా నీ అల్లుడొచ్చాడే అంటే నన్నేమి చేస్తాడమ్మా నిన్నే తీసికెళ్తాడు అందట
  20. అమ్మా పెట్టేవి నాలుగూ పెందలాడే పెట్టవే, దూడ గడ్డికి పోవాల అన్నాడట
  21. అమ్మా బాబు పిచ్చిగానీ, నాకు చదువు వస్తుందా?
  22. అమ్మా ఇలాంటి నాన్నతో ఎలా వేగేవే?

తల్లితో సామెతలు

మార్చు
  1. తల్లి అయినా ఏడవందే పాలు ఇవ్వదు
  2. తల్లి ఓర్చనిది దాది ఓర్చునా?తల్లికి కానివాడు దాదికవునా?తల్లికి లేని ముద్దు దాదికి కలుగునా?తల్లే రోసిన దాది రోయదా?
  3. తల్లి కడుపులో చొరకముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తరువాత యమదేవత
  4. తల్లికి కాకపోతే తిళ్ళీకకు (దీపానికి) దణ్ణం పెట్టమన్నారు
  5. తల్లికి కొట్టరా వసంతం అన్నట్లు
  6. తల్లికి తగిన బిడ్డ, ఇంటికి తగిన పందిరి
  7. తల్లికి తప్పిన వానికి పినతల్లి శష్ప సమానం
  8. తల్లికి వంచ గలిగిన, పిల్లకు బొక్క (ఎముక) కలుగుతుంది
  9. తల్లికొద్దీ బొల్లి కోడె
  10. తల్లి గండము పిల్ల గండమూ ఉందిగానీ మధ్యలో మంత్రసాని గండం ఉందా?
  11. తల్లిగల లంజను తగులుకొనుటే తప్పయా
  12. తల్లిగారింటినుంచి వచ్చిందని కుక్కమూతికి సద్దికట్టి పంపుతారా?
  13. తల్లి గూనిదైతే తల్లి ప్రేమ గూనిదౌతుందా?
  14. తల్లి గుణము కూతురే బయట పెడుతుంది
  15. తల్లి చచ్చినా మేనమామ ఉంటే చాలు
  16. తల్లి చచ్చిపోతే తండ్రి పినతండ్రితో సమానం
  17. తల్లి చస్తే కడుపు పెద్ద, తలలుమాస్తే కొప్పు పెద్ద
  18. తల్లి చస్తే తరంబాసె, తండ్రి చస్తే ఋణం బాసె
  19. తల్లి చస్తే నాలుక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు
  20. తల్లి చాలు పిల్లకు తప్పుతుందా?
  21. తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు, భార్య మెడలో పూసలు బందుగులకు (భోగాలకు)
  22. తల్లి చెవులు తెంపిన వానికి పినతల్లి చెవులు బీరపువ్వులు
  23. తల్లి చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
  24. తల్లి తర్పణానికే తక్కువైతే, పినతల్లికి పిండ ప్రధానమట
  25. తలిదండ్రి లేని బాల తన నాథునే కోరును
  26. తలిదండ్రులు అన్నదమ్ములున్నా పొలతికి పురుషుడు కొరవే
  27. తల్లిదే వలపక్షం ధరణిదే వలపక్షం
  28. తల్లి దైవము తండ్రి ధనము
  29. తల్లిని చూచి పిల్లను, పాడిని చూచి బర్రెను కొనాలి
  30. తల్లిని తిట్టకురా నీయమ్మనాయాలా అన్నట్లు
  31. తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడడు
  32. తల్లిని బట్టి పిల్ల, విత్తునుబట్టి పంట, నూలును బట్టి గుడ్డ
  33. తల్లి పాలు దూడ చెబుతుంది
  34. తల్లి పిత్తి, పిల్లమీదబెట్టిందట
  35. తల్లి పిల్ల వన్నెకాదు, వండిపెట్టదిక్కులేదు
  36. తల్లి పుస్తి బంగారమైనా కంసాలి దొంగలించకుండాఉండలేడు
  37. తల్లి పెంచాలి ధరణి పెంచాలిగాని పెరవారు పెంచుతారా?
  38. తల్లి మాటలేగానీ, పెట్టుమాత్రం పినతల్లిది (సవతితల్లిది)
  39. తల్లి ముఖం చూడని బిడ్డ, వాన ముఖం చూడని పైరు
  40. తల్లి మీదకోపం పిల్లమీద పోతుంది
  41. తల్లి లేక పెరిగి ధాత్రినెట్లేలెరా?ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
  42. తల్లిలేని పిల్ల, ఉల్లిలేని కూర
  43. తల్లి విషం, పెళ్ళాం బెల్లం
  44. తల్లి లేని పిల్లలు, అల్లులేని తీగలు
  45. తల్లిలేని పిల్ల, దయ్యాలపాలు
  46. తల్లీబిడ్డా ఒకటైనా, నోరూ కడుపూ వేరు
  47. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు
"https://te.wikipedia.org/w/index.php?title=అమ్మ&oldid=4309427" నుండి వెలికితీశారు