తెలంగాణ చరిత్ర (పుస్తకం)

తెలంగాణ చరిత్ర ఒకపుస్తకం పేరు. తెలంగాణ ప్రాంతం చరిత్రపై ఈ పుస్తకాన్ని డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసిండు. తెలంగాణ ప్రచురణలు సంస్థ దీన్ని ముద్రించింది. 2011 అక్టోబరు 29 నాడు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించిండు.[1][2] ఈ పుస్తకంలో మొత్తం 266 పేజీలు ఉన్నై. సుంకిరెడ్డి దీన్ని 12 భాగాలుగా అలగ్ చేసిండు. సెప్టెంబరు 2011లో దీన్ని తొలిసారి ప్రింటు చేసిన్రు. ప్రాచీనకాలం నుండి 1948 వరకు చరిత్ర ఇందుల రాసినరు. ఇది "తెలంగాణ ప్రచురణలు" ప్రింటు చేసిన మూడవ పుస్తకం.[3] (తొలి రెండు పుస్తకాలు ముంగిలి, సురవరం తెలంగాణ వ్యాసాలు). "సీమాంధ్రులు తెలంగాణకు చారిత్రక పునాది లేదని దుష్ప్రచారం చేస్తున్నరు. ఇది తప్పని తెలంగాణ భావనకు చారిత్రక పునాది ఉన్నదని, తెలంగాణ సుధీర్ఘమైన, ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కలిగి ఉందని ఈ పుస్తకం నిరూపిస్తుంది" అని "మామాట"లో రాసినరు. అట్లనే ముందుమాటలో ప్రొ. అడపా సత్యనారాయణ (చరిత్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం) "ఈ నాటి వరకు ఆంధ్రదేశ చరిత్ర పరిశోధన, రచనలల్లో తెలంగాణ ప్రాంత చరిత్రకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చరిత్రకారులు తగినంత ప్రాముఖ్యత ఇవ్వని లోటును పూడ్చడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం" అని చెప్పిండు.[4] ఒక మాటలో కుర్రా జితేంద్రబాబు "ఆంధ్రప్రదేశ్ చరిత్ర గ్రంథాల్లోతెలంగాణ చరిత్రను విస్మరించారు. ఒక రకంగా వివక్షచూపారు. ఆ చరిత్ర గ్రంథాల్లో మొత్తం తెలుగువారి చరిత్ర పేరుతో ఆంధ్రచరిత్రను రికార్డు చేశారు.దాన్ని సరిచేసి చరిత్ర అంతటా తెలంగాణ ప్రాంత ఉనికిని నిరూపించే ప్రయత్నం ఈ గ్రంథంలో చేశారు" అని చెప్పిండు.[5] సుంకిరెడ్డి ప్రవేశికలో "చరిత్ర ఎవరైతే రాస్తారో వాళ్ళ గురించి వాళ్ళ చరిత్రగానే దాన్ని ప్రచారం చేసుకుంటరు.[6] కాబట్టి తెలంగాణ చరిత్రను తెలంగాణ వారు రాసుకుంటేనే తెలంగాణ చరిత్రకు న్యాయం జరుగుతుందని అర్థమవుతున్నది"[7] అని తెల్పిండు.

తెలంగాణ చరిత్ర
రచయితసుంకిరెడ్డి నారాయణరెడ్డి
భాషతెలుగు
ప్రచురణ కర్తతెలంగాణ ప్రచురణలు
ప్రచురించిన తేదీ2011


మొదటి భాగంల తెలంగాణ ఉనికి-సరిహద్దులు గురించి 17 పేజీలల్ల రాసినరు. రెండో భాగంల చరిత్ర పూర్వయుగం గురించి తెల్పినరు. తొలి పాతరాతియుగం కాలంలోనే అసిఫాబాద్, బాసర, చిట్యాల, బోథ్, సిర్పూర్, నస్నూర్, వేములపల్లి, పెద్దపల్లి, రామగుండం, పాల్వంచ, చెర్ల, డిండి, హాలియా, చంద్రగుప్తపట్నం, ఈర్లదిన్నె, ఖ్యాతూర్, మంకాల్, సింగవరం, సోమశిల లాంటివి ఆవాసాలుగా ఉన్నట్లు తెల్పిండు.[8]


మూడవ భాగంల చారిత్రకయుగం గురించి తెల్పుతూ "పెద్దబంకూర్, కోటిలింగాల, కొండాపూర్, రాయపట్టణం పట్టణాలుగానూ, ఫణిగిరి, గాజులబండ, తిరుమలగిరి, ధూళికట్ట బౌద్ధక్షేత్రలుగానూ రూపొందినవి" అని రాసినరు. షోడస జనపదాలలో దక్షిణభారతదేశంల ఒక్క జనపదమేనని అదీ ఆశ్మక జనపదం అని తెల్పిండు. అది తెలంగాణకు చెందినదని దాని రాజధాని పోదన్ (బోధన్) అని రాసిండు[9] అశ్మక రాజ్యం అంటే పూర్తిగా తెలంగాణ పాంతమే నని చెప్పిండు. దక్షిణాపథమంటే కృష్ణానదికి ఉత్తరాన ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలేనని కూడా అర్థం చేసుకోవాలని తెల్పిండు.[10]


నాల్గవ భాగంల శాతవాహనయుగం గురించి వివరించిండు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలగా రుజువులు చూపెట్టిండు. "ఇంత విస్పష్టంగా శాతవాహనుల తొలి రాజధాని తెలంగాణలోని కోటిలింగాల అని రుజువైన తర్వాత కూడ కొంతమంది కోస్తాంధ్ర చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం అనీ ధాన్యకటకమనీ అనడం శోచనీయం" అని గుర్తుచేసిండు.[11]


ఐదవ భాగంల "శాతవాహనాంతర యుగం"లో ఉత్తరాన హర్షుడి రాజ్యం చేసె కాలంల దక్షిణాన వాతాపి రాజధానిగా పులకేశి రాజ్యం చేస్తుండెనని అందుల తెలంగాణ ప్రాంతం కూడా ఉండెనని సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికలో రాసిన మాటలు యాదుచేసిండు.[12] తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఇక్ష్వాకుల రాజ్యంలో ఉండెనని స్పష్టంగా చెప్పిండు. ఆ కాలంల ఉత్తర తెలంగాణ జిల్లాలను వాకాటకులు రాజ్యం చేసినట్టు రాసిండు.[13] విష్ణుకుండినులు తీరాంధ్ర ప్రాంతానికి చెందినవారని ఆంధ్రచరిత్ర కారులు రాసిన తప్పుతప్పు చరిత్రను విశ్లేషించిండు. తెలంగాణ ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శర్మ లోతైన పరిశోధన చేసి విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణ అని నిర్థారించినట్లు ఈ పుస్తకంల చూపెట్టిండు.[14]


6వ భాగంల చాళుక్యయుగం గురించి తెల్పుతూ ఆంధ్రచరిత్ర కారులన్నట్లు తెలంగాణల ఏమీ లేకుండెనన్న భావన తప్పు అని చెప్పిండు.[15] తెలంగాణ జాగ మొత్తం బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కందూరి చోడులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఏలినట్లు తెలిపిండు. వేంగీచాళుక్యులు మాత్రమే తిరాంధ్రను పాలించినట్లు వివరించిండు.


7వ భాగంల కాకతీయ యుగం గురించి తెల్పుతూ తొలి కాకతీయులు వేంగీ చాళుక్యులకు సామంతులుగా ఉండేవారని రాసి కోస్తాంధ్ర ప్రాధాన్యతను నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం తప్పని పి.వి.పరబ్రహ్మశాస్త్రి నిరూపించినట్లు తెల్పినాడు.[16]


8వ భాగంల కాకతీయానంతర యుగంలో కాకతీయ సామ్రాజ్య శిథిలాల నుంచే విజయనగర, రెడ్డి, వెలమ, నాయక రాజ్యాలు ఆవిర్భవించాయని రాసిండు[17] 9వ భాగంల కుతుబ్ షాహీయుగం, 10వ భాగంల మొఘలుల గురించి వివరించిండు. అట్లనే 11వ భాగంల ఆసఫ్ జాహీల గురించి చివరన 12వ భాగంల ముగింపునిచ్చిండు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

 1. http://www.tnewslive.com/regional.php?id=1250[permanent dead link]
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-08-27. Retrieved 2012-10-01.
 3. మామాట లో తెలంగాణ ప్రచురణలు ఇచ్చిన సమాచారం
 4. పేజీ XV
 5. పేజీ XVI
 6. పేజీ XX
 7. పేజీ XXI
 8. పేజీ 17
 9. పేజీ 29
 10. పేజీ 45
 11. పేజీ 43, 44
 12. పేజీ 57
 13. పేజీ 61
 14. పేజీ 69
 15. పేజీ 79
 16. పేజీ 109
 17. పేజీ 143