తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగం

తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 12 ప్రాంతంలో 20 అంతస్తుల్లో నిర్మించిన భవనం.[1] దేశంలోనే తొలిసారిగా అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది. ఏ సమయంలోనైనా, ఎక్కడైనా ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్తు నుంచి చూస్తే, హైదరాబాద్ నగరం నలువైపులా కనిపిస్తుంది.[2] కమాండ్ సెంటర్ భవనం 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తన పరిధిలోకి తీసుకుంటూ తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని 360 డిగ్రీల పోలీసు రాడార్‌తో పర్యవేక్షిస్తుంది.[3] సెంటర్‌కు ఎడమ వైపున ఉన్న టవర్ ఎ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంతోపాటు పరిపాలనా విభాగాలను కలిగి ఉంటుంది. తెలంగాణలోని ప్రతి కెమెరాకు అందుబాటులో ఉండే రాష్ట్ర స్థాయి నిఘా కుడివైపున బి టవర్‌లో ఉంటుంది. ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా ఈ కేంద్రం ఏర్పాటుచేశారు. షీ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సంబంధిత ఏజెన్సీలు, హాక్ ఐ అసిస్టెన్స్, ట్రాఫిక్ కమాండ్ సెంటర్ కూడా టవర్‌లోనే ఉంటాయి. 2022 ఆగస్టు 4న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఈ సెంటర్ ను ప్రారంభించాడు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనం
సంస్థ అవలోకనం
స్థాపనం ఆగస్టు 4, 2022; 2 సంవత్సరాల క్రితం (2022-08-04)
అధికార పరిధి తెలంగాణ
ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్, హైదరాబాదు, తెలంగాణ
నినాదం ఫ్రెండ్లీ పోలీస్
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/లు మహమూద్ అలీ, రాష్ట్ర హోంమంత్రి
సీవీ ఆనంద్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్
మాతృ శాఖ తెలంగాణ పోలీస్

శంకుస్థాపన

మార్చు
 
తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఇతరులు

2015 నవంబరు 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ ఎంపీలు వి. హనుమంతరావు, కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఇన్‌ఛార్జ్ డీజీపీ సుదీప్ లఖ్తాకియా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.[4][5]

ప్రారంభం

మార్చు
 
తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

2022 ఆగస్టు 4న మధ్యాహ్నం గం. 12:50 ని.లకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తరువాత మధ్యాహ్నం గం. 1:16 ని.లకు కొబ్బరికాయ కొట్టి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించి, ఆ ప్రాంగణాన్ని పరిశీలించాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్ బ్రోచర్ ను ఆవిష్కరించి, కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణంలో పనిచేసిన అధికారులను, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థ ప్రతినిధులను సన్మానించి, వారికి జ్ఞాపికలు అందజేశాడు. పోలీసు ఉన్నతాధికారులతో ఫొటో సెషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, సీపీ సీవీ ఆనంద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.[6]

నిర్మాణం

మార్చు
  • 6.42 లక్షల చదరపు అడుగుల మొత్తం ప్రాజెక్టు నిర్మాణంలో 2.16 లక్షల చదరపు అడుగులు బేస్‌మెంట్‌ ఏరియా, 4.26 లక్షల చదరపు అడుగుల్లో సూపర్‌ స్ట్రక్చర్‌ ఏరియా ఉన్నది.
  • ఇందులో మొత్తం ఐదు బ్లాక్‌లు ఉన్నాయి. టవర్‌ ‘ఏ’లో గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు 19 అంతస్తులు, టవర్‌ ‘బీ’లో రెండు బేస్‌మెంట్లు గ్రౌండ్‌ఫ్లోర్‌, 15 అంతస్తులు, టవర్‌ ‘సీ’లో ఆడిటోరియం గ్రౌండ్‌ఫ్లోర్‌, రెండు అంతస్తులు, టవర్‌ ‘డీ’లో గ్రౌండ్‌ ప్లస్‌ మొదటి అంతస్తు, టవర్‌ ‘ఈ’లో సీసీసీని 4 నుంచి 7 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. మరో రెండు బేస్‌మెంట్‌ లెవల్‌లు .
  • అన్ని టవర్లలో ‘ఏ’ టవర్‌ ఎత్తయినది. దీనిలో మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. దీనిలోనే నాల్గో అంతస్తులో డీజీపీ చాంబర్‌, 18వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ చాంబర్‌ ఉంటాయి. 7వ అంతస్తులో ప్రముఖుల చాంబర్లు ఏర్పాటు చేశారు.
  • టవర్‌ ఏ, బీలను 14వ అంతస్తులో కలుపుతూ 400 మెట్రిక్‌ టన్నుల బరువుతో దేశంలోనే అత్యంత బరువైన స్కైవాక్‌ వంతెన నిర్మించారు. దీనికి సోలార్‌ ఫొటోవోల్టిక్‌ ప్యానల్స్‌తో రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేశారు.
  • ఈ టవర్లు అన్నీ డబుల్‌ గ్లాస్‌ కర్టెన్‌వాల్‌ సిస్టమ్‌లో నిర్మించారు. దీని థర్మల్‌ కంఫర్ట్‌ వల్ల విద్యుత్తు ఆదా అవుతుంది.
  • నైరుతివైపు ఉన్న టవర్‌పైన హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. వీవీఐపీ మూమెంట్స్‌కోసం హెలికాప్టర్‌ సేవలను వాడుకోవచ్చు.
  • టవర్లలోని కింది ఫ్లోర్లలో ఆడిటోరియం, కేఫ్‌, మల్టీపర్పస్‌హాల్‌, మీడియా సెంటర్‌, రిసెప్షన్‌ లాబీ ఏర్పాటుచేశారు.
  • టవర్‌ ఏలో 550 వర్క్‌స్టేషన్లు ఉంటాయి. వెయ్యి మంది సిబ్బంది పనిచేయవచ్చు.
  • టవర్‌ బీలో 580 వర్క్‌స్టేషన్లు ఉన్నాయి. 1500 మంది సిబ్బంది పనిచేయవచ్చు. అన్ని ఫ్లోర్లలోనూ వంటశాల అందుబాటులో ఉంది.
  • ఆడిటోరియంను 590 మంది సీటింగ్‌ కెపాసిటీతో ఏర్పాటు చేశారు.
  • రెండు బేస్‌మెంట్‌ పార్కింగ్‌ల్లో 299 కార్లు పార్కింగ్‌ చేయవచ్చు. 316 టూ వీలర్స్‌ పార్కింగ్‌ కెపాసిటీ ఉంది. మరో 301 కార్ల పార్కింగ్‌ కెపాసిటీని పెంచుకోవచ్చు.
  • టవర్‌ డీ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మీడియా బ్రీఫింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 125 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. మీడియా బ్రీఫింగ్‌ హాల్‌లో ఆడియో, వీడియో విజువల్‌ సిస్టం, లైటింగ్‌ వ్యవస్థ ఉన్నాయి. ప్రెస్‌ బ్రీఫింగ్‌లకు సంబంధించి లైవ్‌ కవరేజ్‌ నేరుగా అక్కడి నుంచే ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
  • మొత్తం పది ప్యాసింజర్‌ లిఫ్ట్‌లు, రెండు సర్వీస్‌ లిఫ్ట్‌లు ఉన్నాయి.[7]

పనితీరు

మార్చు

అన్ని ప్రభుత్వరంగ వ్యవస్థలను సమన్వయం చేసుకొంటూ విపత్తుల సమయంలో ప్రజలను సకాలంలో కాపాడటం, నష్టాన్ని తగ్గించడంతోపాటు నిరంతర పర్యవేక్షణతో రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు ఈ వ్యవస్థ ఏర్పాటుచేయబడింది. ఈ సెంటర్‌లో పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతివిపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ట్రై కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. నేరం జరిగినా, ట్రాఫిక్‌ రద్దీ పెరిగినా క్షణాల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సాధారణ కెమెరాలతో పాటు, ఏఎన్‌పీఆర్‌(ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌) కెమెరాలను సీసీసీకి అనుసంధానం చేసి ఉండడంతో వేగంగా దర్యాప్తు జరుగుతుంది. దీంతో పాటు ఎవరైనా ఆపదలో ఉంటే నగరంలో ఎమర్జెన్సీ కాయిన్‌ బాక్స్‌ల నుంచి వీడియోకాల్‌ చేసి పోలీసుల సహాయం పొందవచ్చు.[8]

రాష్ట్రంలో ఏం జరుగుతుందో సెకన్లలోనే తెలుసుకోవచ్చు. పోలీస్ అధికారులు, స్టాఫ్ ఎలా పని చేస్తున్నారో చూడొచ్చు. అనుమానిత వ్యక్తులను ఆరా తీయొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను కూడా కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీక్షించవచ్చు. అన్ని జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానం చేశారు. పోలీస్ స్టేషన్ల ఫీడ్‌ను డైరెక్ట్ గా సీసీసీకి జోడించారు. హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డులోని సీసీటీవీ కెమెరాలు, మెట్రోస్టేషన్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను సీసీసీతో లింక్ చేశారు. ట్రాఫిక్‌ నిర్వహణకూ హై టెక్నాలజీ వాడుతూ సెన్సర్లతో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి, మార్పు చేర్పులు సూచిస్తారు.[9]

ప్రజల సందర్శన

మార్చు

ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ను చూడడానికి ప్రజలను కూడా అనుమతిస్తారు. ఇందుకు నియమిత ఛార్జీ వసూలు చేస్తారు. 19 అంతస్తులున్న ఈ భవనంలోని 14, 15 అంతస్తుల వరకు వెళ్ళేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడినుండి హైదరాబాదు నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. అంతేకాకుండా ఆరో అంతస్తులోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వెళ్ళి బయటనుండే పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ అనుమతిని కూడా ఇస్తారు.[10]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Chronicle, Deccan (2022-07-26). "Command Control Centre will be Hyderabad's third eye: C.V.Anand". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-27. Retrieved 2022-07-28.
  2. Telugu, ntv (2022-07-23). "Police Command Control Center: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు". NTV Telugu. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-28.
  3. Bandari, Pavan Kumar (2022-01-30). "Telangana: Police Command Control Center in Hyderabad to be inaugurated in February". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-30. Retrieved 2022-07-28.
  4. "CM Assures Rs 700 Crore More for Police HQ, Command and Control Centre". The New Indian Express. 2015-11-23. Archived from the original on 2022-07-29. Retrieved 2022-07-29.
  5. Reporter, Staff (2015-11-23). "People should be police friendly: KCR". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2015-11-24. Retrieved 2022-07-29.
  6. telugu, NT News (2022-08-04). "పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-08-04. Retrieved 2022-08-04.
  7. "భాగ్యనగర సిగలోకి మరో నగ.. త్వరలోనే 'పోలీస్‌ కమాండ్‌ సెంటర్' ప్రారంభం.. ప్రతి అంగుళం పరిధిలోకి." Samayam Telugu. 2022-01-30. Archived from the original on 2022-01-30. Retrieved 2022-07-28.
  8. telugu, NT News (2022-08-03). "కంటికి రెప్పలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-08-03. Retrieved 2022-08-04.
  9. Velugu, V6 (2022-08-04). "హై టెక్నాలజీతో CCC.. ప్రత్యేకతలివే!". V6 Velugu. Archived from the original on 2022-08-04. Retrieved 2022-08-04.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. "Hyderabad Police: ప్రారంభానికి సిద్ధమైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్.. ప్రజలకూ అనుమతి". Samayam Telugu. 2022-07-24. Archived from the original on 2022-07-24. Retrieved 2022-07-28.