దేవరకొండ బాలగంగాధర తిలక్

భారత రచయిత

దేవరకొండ బాలగంగాధర తిలక్ (ఆగష్టు 1, 1921 - జూలై 1, 1966) ఒక ఆధునిక తెలుగు కవి. భావుకత, అభ్యుదయం ఇతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు.

దేవరకొండ బాలగంగాధర తిలక్
Devarakonda balagangadhara tilak.jpg
దేవరకొండ బాలగంగాధర తిలక్
జననందేవరకొండ బాలగంగాధర తిలక్
ఆగష్టు 1, 1921
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక
మరణంజూలై 1, 1966
ప్రసిద్ధిఆధునిక తెలుగు కవి.

పద్యాలుసవరించు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు

అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలో అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త.

సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..

అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి దేవరకొండ బాలగంగాధర తిలక్ [1]

జీవితంసవరించు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు.

తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం ఉంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.

మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.

మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ, తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ, కవిత్వం వ్రాసినా, వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేత.

తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా ఉండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన 1966 జూలై 1 న అనారోగ్యంతో రాలిపోయాడు.

ప్రశంసలుసవరించు

రా.రా.: తిలక్ కవిత్వంలోని కొన్ని అనభ్యుదయకర ధోరణులను ఎత్తిచూపి విమర్శించినా, భావుకత్వం ముఖ్యమైన లక్షణంగా ఉండేది. తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం - కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. ఈ భావుకత్వానికి తోడు, తన హృదయంలోని అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తీ, అలంకారపుష్టీ, కలసి రావడంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగినాడు అంటూ ప్రముఖ మార్క్సిస్టు విమర్శకుడు రా.రా ప్రశంసించాడు.

దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రులనుండి, పతివ్రతలనుండి
పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి
నీతుల రెండునాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హేతుక కృపా సర్పాలనుండి
లక్షలాది దేవుళ్లనుండి వారి పూజారులనుండి
వారి వారి ప్రతినిధుల నుండి
సిద్ధాంత కేసరులనుండి
శ్రీమన్మద్గురు పరంపరనుండి...

చీకోలు సుందరయ్య : వీళ్లందరినుంచీ ఈ సమాజాన్ని కాపాడమని వేడుకొన్న కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన అమ్మాయిలు అని పేర్కొన్న ఈ కవి కవిత్వంలోనే కాదు, కథా రచనలోను బలమైన ముద్రవేశాడు. తన కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించుకొన్నాడు. ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు - [2]

యువ కవి లోక ప్రతి నిధి
నవభావామృత రసధుని
కవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్చ స్ఫటికా ఫలకం

అంటూ తన ఎలిజీలో (జవాబు రాని ప్రశ్న) శ్రీశ్రీ అభివర్ణించాడు.

గిరిజా మనోహర్ బాబు : కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు.[1]

వేలూరి వేంకటేశ్వరరావు : .. తిలక్‌ మనకి ఆరోజులనాటి (60 ల్లో) వీర అభ్యుదయవాది (ultra progressive) గా ముందుకొస్తాడు. .. తిలక్‌, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండుమెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి. కాకుంటే “రహస్యసృష్టి సానువులనుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు, మమ్మల్ని కనికరించు,” అని రాయలేడు. “మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం,” అని ఇంకే కవి రాయగలడు? . ..తను ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దేవుడు ఎవరైతేనేం, తన కోరికలు తీర్చలేడని తిలక్‌కి తెలుసు. నాకు చందమామలో జింక కావాలంటే, ఏ దేవుడు ఇవ్వగలడు? తిలక్‌ ప్రగతి శీలుడైన మానవతావాది. అంటే, ఎప్పటికైనా తన కోరికలు ఏదోరకంగా నెరవేరుతాయని నమ్మిన కవి. మనిషిలో మంచిని నమ్మిన కవి.[3]

కొట్టెకోల విజయ్‌కుమార్‌ : కవిత్వం మనస్సుకీ ఉద్రేకాలకీ సంబంధించింది. ఈ మనస్సునీ ఉద్రేకాల్ని కొలిచే సరైన మానం ఇదివరకు లేదు. ఇకముందు రాదు అని చెప్పవచ్చును. అంతవరకు కవిత్వానికి సరైన నిర్వచనం రాదు. మన లోపల్లోపల జరిగే ఒకానొక అనుభూతి విశిష్టత కవిత్వానికి ఆధారం అని తిలక్‌ ప్రకటించాడు, కవితాజ్ఞాని అయినాడు. తిలక్‌ కవిత్వానికి అసలు రూపం అమృతం కురిసిన రాత్రి దీనిలోని ప్రతి కవిత కొత్త శిల్పంతో కొత్త భావంతో రక్తి కడుతుంది. హృదయాన్ని కదిలిస్తుంది. మెదడుకి పదును పెడుతుంది. భావ తీవ్రతతో పాఠకులలో ఒకవిధమైన మానసికావస్థను కలిగించాడు. వచన కవితా నిర్మాణ శిల్పరహస్యవేది అయిన తిలక్‌ చిన్నవయస్సులోని జూలై 2న 45 సంవత్సరములకే మరణించాడు. 'తిలక్‌ మంచి అందగాడు, మానసికంగా మెత్తనివాడు, స్నేహశీలి కవి, రసజ్ఞుడు' అని కుందుర్తి అమృతం కురిసిన రాత్రి పీఠికలో అన్నాడు.[4]

శ్రీశ్రీ :

గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
వయస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి

తిలక్ రచనలుసవరించు

కవితా సంపుటాలు
కథానికా సంపుటాలు
 • తిలక్ కథలు (1967)
 • సుందరీ-సుబ్బారావు (1961)
 • ఊరి చివరి యిల్లు (1961)
నాటకాలు
 • సుశీల పెళ్ళి (1961)
 • సాలె పురుగు
నాటికలు
 • సుచిత్ర ప్రణయం (1961)
 • ఇరుగు-పొరుగు (1960)
 • సుప్తశిల (1967)
 • పొగ
 • భరతుడు
లేఖా సాహిత్యం

పురస్కారంసవరించు

తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

ఇవి కూడా చూడండిసవరించు

వనరులు, మూలాలుసవరించు

 1. 1.0 1.1 శత వసంత సాహితీ మంజీరాలు - వంద పుస్తకాలపై విశ్లేషణ - రేడియో ఉపన్యాసాల సంకలనం - ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, విజయవాడ వారి ప్రచురణ - ఇందులో "అమృతం కురిసిన రాత్రి" పుస్తకంపై ఉపన్యాసం ఇచ్చినవారు జి. గిరిజా మనోహర్ బాబు, హన్మకొండ
 2. ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం[permanent dead link]
 3. వేలూరి వేంకటేశ్వరరావు - "ఈమాట" అంతర్జాల పత్రికలో
 4. "కొట్టెకోల విజయ్‌కుమార్‌ - ఆంధ్రప్రభలో వ్యాసం". Archived from the original on 2008-03-29. Retrieved 2008-09-24.
 5. బాల గంగాధర్ తిలక్, దేవరకొండ. అమృతం కురిసిన రాత్రి.