దొంగలున్నారు జాగ్రత్త (1958 సినిమా)
దొంగలున్నారు జాగ్రత్త ప్రతిభా పిక్చర్స్ బ్యానర్‌పై భీమవరపు నరసింహారావు దర్శకత్వంలో 1958లో విడుదలైన తెలుగు సినిమా. ఇదే చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలో తిరుడర్గళ్ జాక్కిరత్తై పేరుతో ఏకకాలంలో నిర్మించారు.
దొంగలున్నారు జాగ్రత్త (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భీమవరపు నరసింహారావు |
---|---|
తారాగణం | కొంగర జగ్గయ్య , జి.వరలక్ష్మి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | ప్రతిభా పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కొంగర జగ్గయ్య - రాజు
- సి.యస్.ఆర్.ఆంజనేయులు - నాగరాజు
- రాజనాల - సారథి
- చదలవాడ కుటుంబరావు - లింగరాజు
- గుమ్మడి - సి.ఐ.డి. మూర్తి
- రమణారెడ్డి - తాతయ్య
- కస్తూరి శివరావు - తొండ
- కోటేశ్వరరావు - సబ్ ఇన్స్పెక్టరు
- సీతారాం - హెడ్ కానిస్టేబుల్
- లంక సత్యం - కాళయ్య
- వల్లూరి బాలకృష్ణ - గుండు
- ఎ.వి.సుబ్బారావు - డి.ఐ.జి.
- గాడేపల్లి - కోయరాజు
- వై.వి.రాజు - ధర్మయ్య
- దొరస్వామి - బసవయ్య
- జి.వరలక్ష్మి - వనజ
- గిరిజ - సరస
- పి.హేమలత - కనకమ్మ
- కాకినాడ రాజరత్నం - కోయరాణి
- లలితారావు
- సరోజ
- చంద్ర
- నారీమణి
- బొడ్డపాటి
- శాస్త్రి
- గురజాడ గౌతం
సాంకేతికవర్గం
మార్చు- కథ, మాటలు: ఆత్రేయ
- పాటలు: ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, కొసరాజు
- నేపథ్య గాయకులు: ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పి.బి.శ్రీనివాస్, జిక్కి, టి.జి.కమలాదేవి, కస్తూరి, రాజేశ్వరి
- ఛాయాగ్రహణం: ప్రకాష్
- సంగీతం: కె.వి.మహదేవన్
- నృత్యం: చోప్రా
- కళ: సి.హెచ్.ఇ.ప్రసాద్
- కూర్పు: ఎ.ఆర్.బి.ఎస్.మణి
- దర్శకత్వం: భీమవరపు నరసింహారావు
- నిర్మాత: జి.కృష్ణమూర్తి
కథ
మార్చుసరస జమీందారు కూతురు. సరసకు యుక్త వయసు వచ్చేవరకూ జమీందారు ఆస్తిని ఆమె పినతండ్రి నాగరాజు సంరక్షకుడిగా ఉంటాడు. అతడు పరమ దుర్మార్గుడు. చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న ధర్మయ్య అనే మేనేజరును తీసివేసి అతని స్థానంలో సారథిని చేర్చుకుంటాడు. సరస పెరిగి పెద్ద అయ్యేసరికి నాగరాజు ఆస్తినంతా ఖర్చుపెట్టి ఎస్టేటును కూడా తాకట్టు పెడతాడు. వడ్డీవ్యాపారి లింగరాజు సరసను పెళ్ళి చేసుకుని ఆస్తిని కాజేసే ఉద్దేశంతో తాకట్టుమీద డబ్బు ఇస్తాడు. సరస 19వ పుట్టిన రోజును ఆమె బాల్యస్నేహితుడు రాజు, అతని తల్లిదండ్రులు, సోదరిలతో జరుపుకుంటుంది. సరస కోటకు తిరిగి రాగానే సారథి ఆమెకు రాజుతో చనువుగా ఉండవద్దని సలహా ఇస్తాడు. ఆమె అతని మాటను పెడచెవినపెడుతుంది. కోటలో విందులూ, వినోదాలతో డబ్బును ఖర్చుపెట్టుతూ ఉండడంతో తన ఆస్తిపాస్తుల అజమాయిషీ తనకు అప్పజెప్పమని నాగరాజును కోరుతుంది. నాగరాజు తానే ఈ ఆస్తికి వారసుణ్ణని, జమీందారు కోరిక కూడా అదే అని బెదిరిస్తాడు. తాత అనే ముసలి నౌకరు సహాయంతో నాగరాజు వద్ద ఉన్న దస్తావేజులను సంపాదించి ప్లీడరుకు పంపమని వాటిని ధర్మయ్యకు ఇస్తుంది సరస. దానిని పసిగట్టిన నాగరాజు ధర్మయ్యను హత్యచేసి ఆ కాగితాలను చేజిక్కించుకుంటాడు. హత్యానేరాన్ని రాజు మీదకు నెట్టి అతనికి యావజ్జీవ శిక్ష పడేలా చేస్తాడు. ఈ సంగతి తెలిసి రాజు తండ్రి బసవయ్య మరణిస్తాడు. దానితో రాజు నిర్దోషిత్వాన్ని నిరూపించే బాధ్యత చెల్లెలు వనజమీద పడుతుంది. బసవయ్య చావగానే అతని భార్య కనకమ్మను, కూతురు వనజను నాగరాజు ఎత్తుకుని పోతాడు. వనజ ఎలాగో తప్పించుకుని పోతుంది. ఆమెను సారథి వెంటాడుతాడు. ఆమె ప్రమాదానికి గురై కోయరాజుతో రక్షింపబడుతుంది. అక్కడ వాళ్ళకు ఆమె నాయకురాలై జమీందారు అత్యాచారాలకు గురౌతున్న రైతులకు సహాయం చేయాలని ముసుగు మనిషి వేషం ధరిస్తుంది. సారథి ఎవరో గజదొంగ ప్రజలను దోచుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఈ లోగా రాజు తప్పించుకు వచ్చి సరసకు లింగరాజుతో బలవంతంగా పెళ్లి జరుగుతోందని తెలిసి అక్కడికి వెడతాడు. కానీ సరస తప్పించుకుని పోతుంది. సరసను ఎవరో ముసుగుమనిషి లేవదీసుకు పోయాడని సారథి రాజుకు చెబుతాడు. ఆ ఇద్దరిపై పగతీర్చుకోవడానికి రాజు బయలుదేరుతాడు. తన పెళ్లి నిలిచిపోవడంతో అప్పు ఇవ్వడం మానుకుంటాడు లింగరాజు. ముసుగు వేషంలో లింగరాజు ఇంటిని కొల్లగొట్టమని సారథికి నాగరాజు చెబుతాడు. తన వేషంలో ఎవరో ప్రజలను దోచుకుంటున్నారని తెలుసుకున్న అసలు ముసుగు మనిషి వనజ ఎప్పటికప్పుడు కొల్లగొట్టిన ధనాన్ని చేజిక్కించుకుంటుంది. ముసుగు మనిషి ఆచూకీ తెలుసుకుంటాడు రాజు కానీ వాళ్ళ చేతుల్లో చిక్కుతాడు. ముసుగు మనిషి తాను ఎవరో రాజుకు తెలియనివ్వదు. వనజ పావురం ద్వారా తాతయ్యకు పంపిన ఉత్తరం సారథికి చిక్కుతుంది. దాంతో తాతయ్యను వనజ ఆచూకీ చెప్పమని హింసిస్తారు నాగరాజు, సారథి. తాతయ్య ద్వారా ఒక ఉత్తరాన్ని వనజకు పంపిస్తారు. వనజ దానిని నమ్మదు. కానీ ఆమె తల్లి కోటలో బందీగా ఉంటుంది. ఆమెను విడిపించాలని రాజు కోటలోకి వెళ్లి పట్టుబడతాడు. అతడిని ఉరి తీస్తున్నట్లు పోలీసులు ప్రకటిస్తారు. వనజ ఏమౌతుంది?, రాజు విడుదలవుతాడా?, సరస రాజును పెళ్లి చేసుకుంటుందా? అసలు నేరస్థులు నాగరాజు, సారథి, లింగరాజులను పోలీసులు పట్టుకుంటారా? అనే విషయాలు పతాక సన్నివేశంలో తెలుస్తాయి.[1]
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
వలపే పులకింత సరసాలే గిలిగింత | ఆరుద్ర | కె.వి.మహదేవన్ | ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ |
అయ్యోయ్ ఏమయ్యో అలా చూస్తావేమయ్యా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | జిక్కి |
కల్ల కాదు కలా కాదు కన్నెపిల్ల బాసలు | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | జిక్కి |
చమురుంటేనే దీపాలూ ఈ నిజముంటేనే కోపాలూ | శ్రీశ్రీ | కె.వి.మహదేవన్ | రాజేశ్వరి, కస్తూరి |
వినరా నాన్నా కనరా చిన్నా విస్సన్న చెప్పే వెర్రిమాటలో | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | మాధవపెద్ది |
హాసమా పరిహాసమా చందమామ ఓ చందమామ | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | జిక్కి |
ఏమనెనోయి ఆమనిరేయి ఎవ్వరికోయి తీయనిహాయి | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | జిక్కి, ఘంటసాల |
ఎరుక చెబుతానూ ఎరుక చెబుతా ఏడేడు లోకాల ఎరుక చెబుతానూ | కొసరాజు | కె.వి.మహదేవన్ | టీ.జి. కమలాదేవి |
తెలుసుకోండి ఈ నిజం వదలుకోండి మీ హజం | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | మాధవపెద్ది |
మూలాలు
మార్చు- ↑ బి.వి.రాజన్ (1958). దొంగలున్నారు జాగ్రత్త పాటల పుస్తకం. p. 12. Retrieved 2 August 2020.