నచికేతుడు

(నచికేత మహర్షి నుండి దారిమార్పు చెందింది)

నచికేతుడు (సంస్కృతం:नचिकेता, IAST: Naciketā) వాజశ్రవుడు అనే బ్రాహ్మణుని కుమారుడు.

నచికేతుడికి బోధిస్తూ యముడు

"నాకు నచికేతుడిలా చెప్పినది మారుమాటాడక చేసే వాళ్ళుంటే ఒక పదిమందిని ఇవ్వండి. నేను ఈ ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తాను" అన్నాడు స్వామి వివేకానంద.

ఇంతకూ నచికేతుడు అంటే ఎవరు? అతని గొప్పతనం ఏమిటి?

కఠోపనిషత్తులో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.

వాజశ్రవుడు (ఉద్దాలకుడు) అను బ్రాహ్మణుడు ఒక యాగం చేయ సంకల్పించాడు. ఆ యాగంలో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి. కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను, గొడ్డులను, ముసలి ఆవులను దానం చేయసాగాడు. ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా! నేనూ నీకు గల సంపదనే కదా. మరి నన్ను కూడా దానం చెయ్యి" అన్నాడు. దీన్ని ఒక బాల్యచేష్టగా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు. కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను యముడికి ఇస్తున్నాను" అని అన్నాడు. (ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).

కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు. అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా! ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్య దోషం వస్తుంది. మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి." అని యముని వద్దకు వెళ్ళాడు.

నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయంలో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు. నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రోజులు నిరాహారంగా ఉన్నాడు. యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథిని మూడు రోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను. అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.

అప్పుడు నచికేతుడు " ఓ యమధర్మరాజా! మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి (ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమానపడకుండా ఉండడానికి), అతని పాపాలన్నీ పోవాలి. రెండవ వరంగా స్వర్గ ప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని, దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు. యముడు సంతోషంతో నేర్పించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేత యజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు. ఇక మూడవ వరంగా మరణానంతర జీవితం గురించి, బ్రహ్మఙ్ఞానం గురించి ఆడిగాడు. యముడు అది చెప్పడం ఇష్టం లేక ధన, వస్తు, కనక, వాహన, కాంతలను అనుగ్రహిస్తానని అన్నాడు. కాని నచికేతుడు నిరాకరించడం వలన యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.

తర్వాత నచికేతుడు సంతోషంతో తన ఇంటికి రాగా తన తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు.

ఈ కథను కఠోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది.

మూలాలు

మార్చు
  • Sister Nivedita & Ananda K.Coomaraswamy: Myths and Legends of the Hindus and Bhuddhists, Kolkata, 2001 ISBN 81-7505-197-3
  • Sri Krishna Prem: The Yoga of the Kathopanishad, London, John M. Watkins, 1955 (No ISBN)
  • కఠఉపనిషత్తు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు