నీ మనసు నాకు తెలుసు
నీ మనసు నాకు తెలుసు 2003 లో జ్యోతికృష్ణ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో తరుణ్, శ్రీయ, త్రిష ముఖ్య పాత్రలు పోషించారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా ద్వారా ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకుడుగా పరిచమయ్యాడు.[1]
నీ మనసు నాకు తెలుసు | |
---|---|
దర్శకత్వం | జ్యోతికృష్ణ |
రచన | జ్యోతికృష్ణ |
నిర్మాత | ఎ. ఎం. రత్నం |
తారాగణం | తరుణ్ శ్రియా సరన్ త్రిష కృష్ణన్ |
ఛాయాగ్రహణం | ఆర్. గణేష్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
పంపిణీదార్లు | శ్రీ సూర్యా మూవీస్ |
విడుదల తేదీ | 5 డిసెంబరు 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుశ్రీధర్ (తరుణ్) ఓ కాలేజీలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతుంటాడు. క్యాంపస్ సెలెక్షన్స్ లో ఎంపికవుతాడు. ఇంటర్వ్యూ కోసం ముంబై వెళతాడు. అక్కడి నుంచి వస్తుండగా రైల్లో ప్రీతి (త్రిష) అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. శ్రీధర్ ఆ అమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరబోతోందనీ, ప్రీతి అతను డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉన్నాడనీ తెలుసుకుంటారు. శ్రీధర్, ప్రీతి ఇద్దరూ క్రికెట్ ను ఆరాధించే వాళ్ళే. అంతే కాకుండా శ్రీధర్ కు ఫుట్ బాల్ అంటే కూడా ఇష్టం. ఆ కళాశాల ప్రిన్సిపల్ రేష్మ (శ్రీయ) అనే మరో విద్యార్థిని శ్రీధర్ నాయకత్వం వహిస్తున్న ఫుట్ బాల్ టీముకు శిక్షకురాలిగా నియమిస్తాడు. ఒక వైపు శ్రీధర్ ప్రీతి కోసం అన్ని మహిళా కళాశాలల్లో వెతుకుంటే, మరో వైపు ప్రీతి శ్రీధర్ కోసం అబ్బాయిల కళాశాలల్లో వెతుకుతూ ఉంటుంది. ఒకసారి అనుకోకుంటా శ్రీధర్ తల్లికి గుండెపోటు వస్తే ప్రీతి సహాయం చేస్తుంది. ప్రీతిని వెతుకుతూ ఓ సారి శ్రీధర్ ఎల్. బి. స్టేడియంలో ఓ క్రికెట్ మ్యాచ్ కోసం వెళతాడు. అప్పుడే అక్కడ బాంబు పేలుడు జరిగి గాయపడుతాడు. అప్పుడే మళ్ళీ ప్రీతి, శ్రీధర్ లు ఒకరినొకరు చూసుకుంటారు కానీ గలాటా వల్ల ఇద్దరూ కలుసుకోలేరు.
తరువాత ప్రీతి తల్లిదండ్రులు ఆమె వెతుకుతున్న అబ్బాయిని గురించి మరిచిపోమనీ తాము చూసిన పెళ్ళి సంబంధం చేసుకోమనీ బలవంతం చేస్తారు. అదే సమయంలో శ్రీధర్ తల్లి కూడా అతని ప్రేమని కాసేపు పక్కనబెట్టి చదువు మీద దృష్టి కేంద్రీకరించమని, పై చదువుల కోసం విదేశాలు వెళ్ళమని సలహా ఇస్తుంది. అప్పుడే శ్రీధర్ కు ప్రీతి తమ ఇంటి వెనుకే ఉంటున్నారనీ, వాళ్ల తల్లిదండ్రులు ఆమె పెళ్ళి గురించి చెప్పడానికి వస్తే తెలుస్తుంది. శ్రీధర్ స్నేహితులు అంతర్ కళాశాల ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొని కప్ గెలుచుకుని వస్తారు. ఆ లోపే శ్రీధర్ తల్లికి మళ్ళీ గుండెపోటు వస్తుంది. అప్పుడు ప్రీతి తండ్రి ఆమెను ఆసుపత్రిలో చేరుస్తాడు. శ్రీధర్ బావను పోలీసులు అకారణంగా అరెస్టు చేస్తే ప్రీతి వెళ్ళి విడిపించుకుని వస్తుంది. కొద్ది రోజుల్లో శ్రీధర్ తల్లి చనిపోతుంది. శ్రీధర్ బావకు బెంగుళూరులో వేరే ఉద్యోగం రావడంతో ఆ కుటుంబం అక్కడికి ప్రయాణమవుతారు. శ్రీధర్ ఒంటరితనాన్ని భరించలేక మూడేళ్ళ పాటు విదేశం వెళ్ళి తిరిగి వస్తాడు. వచ్చేటపుడు ఈ రైల్లో ఎక్కగా అదే బోగీలో ప్రీతి కూడా ఉంటుంది. ఇన్నాళ్ళూ ఆమె అతని కోసమే ఎదురు చూస్తూ పెళ్ళి చేసుకోకుండా ఉన్నదని తెలుసుకున్న శ్రీధర్ ఆమెతో కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
మార్చు- శ్రీధర్ గా తరుణ్
- రేష్మగా శ్రీయ
- ప్రీతిగా త్రిష
- తనికెళ్ళ భరణి
- సునీల్
- ఎం. ఎస్. నారాయణ
- రీమా సేన్
- మనో (అతిథి పాత్ర)
- అర్చన పూరణ్ సింగ్ ప్రీతి తల్లి
- కలైరాణి
- సూర్య
- చంద్రమోహన్
- శరణ్య నాగ్
పాటలు
మార్చుUntitled | |
---|---|
ఈ సినిమాలు ఎ. ఆర్. రెహమాన్ స్వరపరచిన ఆరు పాటలున్నాయి.[2][3] తెలుగులో గ్యాంగ్ మాస్టర్ అనే సినిమా చేసిన తొమ్మిదేళ్ళ తర్వాత ఎ. ఆర్. రెహమాన్ మళ్లీ తెలుగు సినిమాకు పని చేశాడు.
పాట | గాయకులు |
---|---|
"అందని అందం అస్కావా" | సూర్జో భట్టాచార్య, శ్రేయా ఘోషాల్ |
"కలుసుకుందామా" | చిన్మయి, ఉన్ని మేనన్ |
"కామా కామా" | అనుపమ, అపర్ణ, కునాల్ గంజావాలా, బ్లాజ్, జార్జ్ పీటర్ |
"స్నేహితుడే ఉంటే" | చిన్మయి, మనో, ఉన్నికృష్ణన్ |
"ఏదో ఏదో నాలో" | కార్తీక్, గోపిక పూర్ణిమ |
"మస్తురా మస్తురా" | శ్రీరాం పార్థసారథి, చిత్ర శివరామన్, మాతంగి, జార్జ్ పీటర్ |
మూలాలు
మార్చు- ↑ "Keeping fingers crossed". The Hindu. 2003-12-04. Archived from the original on 2012-11-10. Retrieved 2012-08-04.
- ↑ "Nee Manasu Naaku Telusu Songs - Nee Manasu Naaku Telusu Telugu Movie Songs - Telugu Songs Lyrics Trailer Videos, Preview Stills Reviews". Raaga.com. Retrieved 2012-08-04.
- ↑ "Nee Manasu Naaku Telusu Songs, Nee Manasu Naaku Telusu Lyrics, Nee Manasu Naaku Telusu Videos, Download MP3 Songs, Telugu Music - Sangeethouse.com". Dishant.com. Archived from the original on 2011-03-16. Retrieved 2012-08-04.