నూకల రామచంద్రారెడ్డి

భారత స్వాతంత్ర్య నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి

నూకల రామచంద్రారెడ్డి (1919, జనవరి 11 - 1974, జూలై 27) భారత స్వాతంత్ర్య నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడు. శాసనసభ్యుడిగా ఎన్నికై నాలుగుసార్లు కేబినెట్ మంత్రిగా పనిచేశాడు.[1][2] భారత సంగ్రామ పోరాటంలో 1930లలో పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో 'వందేమాతరం ఉద్యమం'లో కూడా చురుకుగా పాల్గొన్నాడు. తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే స్థాపించిన భూదాన్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. నిజమైన గాంధేయవాదిగా తన జీవితమంతా నియోజకవర్గాల సంక్షేమానికి అంకితం చేసి, లాంబాడా కమ్యూనిటీ హక్కులు, వారి అభివృద్ధి కోసం పోరాడాడు.

నూకల రామచంద్రారెడ్డి
నూకల రామచంద్రారెడ్డి
నూకల రామచంద్రారెడ్డి
ఆహార, వ్యవసాయం, కార్మిక, భూ సంస్కరణల శాఖామంత్రి
In office
1960–1962
రెవెన్యూ, భూ సంస్కరణల శాఖామంత్రి
In office
1962–1967
ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖామంత్రి
In office
1973 – 1974 (చనిపోయే వరకు)
వ్యక్తిగత వివరాలు
జననం(1919-01-11)1919 జనవరి 11
జమండ్లపల్లి, మహబూబాబాద్ మండలం, మహబూబాబాదు జిల్లా, తెలంగాణ
మరణం1974 జూలై 27(1974-07-27) (వయసు 55)
హైదరాబాదు, తెలంగాణ
మరణ కారణంగుండెపోటు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తెలంగాణ ప్రజా సమితి
జీవిత భాగస్వామిభారతి దేవి
సంతానంరాధిక (రాధ) రెడ్డి, సరస్వతి రెడ్డి
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం
రాబర్ట్సన్ కళాశాల (బి.ఎ)
వృత్తి
  • రాజకీయ నాయకుడు

తెలుగు సినిమారంగం హైదరాబాదుకి తరలిరావాలన్న ఉద్దేశంతో నందమూరి తారక రామారావుతో మాట్లాడి హైదరాబాద్‌లో ఫిల్మ్‌ స్టూడియో కట్టించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేశాడు. పివి నరసింహరావుకు గురువుగా అతని రాజకీయ ఎదుగుదలకు తోడ్పాడునిచ్చాడు.[3]

బాల్యం, కుటుంబం

మార్చు

నూకల రామచంద్రరెడ్డి 1919, జనవరి 11న రంగసాయి రెడ్డి - రుక్మిణి దేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, మహబూబాబాద్ మండలంలోని జమండ్లపల్లి గ్రామంలో జన్మించాడు. రామచంద్రారెడ్డికి ముగ్గురు సోదరులు, ఒక సోదరి. రామచంద్రారెడ్డి తమ్ముడు నూకల నరోత్తమ్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉప కులపతిగా, గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశాడు.[4]

చదువు

మార్చు

అతని జమండ్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కొన్ని తరగతుల వరకు చదుకున్నాడు, తరువాత ఆర్‌బివిఆర్ రెడ్డి హాస్టల్‌లో బస చేస్తూ చాదర్‌ఘాట్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పొందాడు. ఉర్దూ మీడియంలో మెట్రిక్యులేషన్ చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు వందేమాతరం ఉద్యమంలో చేరడంతో బహిష్కరణకి గురయ్యారు. దాందో జబల్పూర్ లోని రాబర్ట్సన్ కళాశాలలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.

హాకీ ఆట అంటే విపరీతమైన ఇష్టం ఉన్న రామచంద్రారెడ్డి, కళాశాల టీంకు కాప్టెన్ గా నేషనల్ గేమ్స్ లో కూడా పాల్గొన్నాడు. నిజాం ప్రభుత్వంలోని పౌర సరఫరాల శాఖలో సెక్రటరీ పదవిలో చేరాడు. కానీ, పేదలకు సేవ చేయాలనే భావంతో ఆరునెలల్లోనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రామచంద్రారెడ్డికి భారతి దేవితో వివాహం జరిగింది. భారతి దేవి తమ్ముడు ఆర్. సురేంద్రరెడ్డి నాలుగుసార్లు ఎంపీగా గెలిచాడు. రామచంద్రారెడ్డి-భారతి దేవి దంపతులకు రాధిక (రాధ) రెడ్డి, సరస్వతి రెడ్డి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాధికారెడ్డికి వీఆర్‌గా పేరుగాంచిన వెలకచెర్ల రాజగోపాల్ రెడ్డితో వివాహం జరిగింది. వి.ఆర్‌.రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంపోజిట్ స్టేట్ మాజీ అడ్వకేట్ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. మనవరాలు దీపికారెడ్డి, కూచిపూడి నృత్య కళాకారిణి, నాట్య గరువు. 2022లో తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా నియమించబడింది.[5][6]

రాజకీయ జీవితం

మార్చు

1956లో రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యాడు. వరంగల్ జిల్లాలోని డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం నుండి 1957, 1962, 1967, 1972లలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.[7] 1972లో అతను పోటీ లేకుండా (ఏకగ్రీవంగా) గెలిచాడు.[8]

1960లో మొదటిసారిగా దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఆయన ఆహార, వ్యవసాయం, కార్మిక, భూ సంస్కరణల మంత్రిగా చేరాడు. 1962లో నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, భూ సంస్కరణల మంత్రిగా చేరాడు.

అతను 1964 ఏప్రిల్ 27న పరిపాలనా సంస్కరణల కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. క్షేత్రస్థాయి అధికారులకు అధికారాల వికేంద్రీకరణకు వీలు కల్పించే వినూత్న చర్యలను సూచించడంలో కీలకపాత్ర పోషించాడు.

1964 నుండి 1967 వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ భూ సంస్కరణల మంత్రిగా కొనసాగాడు. 1965లో ఎన్‌టి రామారావుతో సహా తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాల సహాయంతో ఇండో-పాక్ యుద్ధంలో ఉన్న మన సాయుధ బలగాల కోసం నిధుల సేకరణకు నాయకత్వం వహించి, హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి చెక్కును అందించాడు.

1969-1971ల మధ్య, అతను శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో తన గళం వినిపించాడు. 1973లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో ఆర్థిక, వాణిజ్య పన్నుల మంత్రిగా చేరాడు.[9]

పివీతో అనుబంధం

మార్చు

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి రామచంద్రారెడ్డికి పీవితో అనుబంధం ఏర్పిడింది. స్వాతంత్య్ర ఉద్యమంలో, వందేమాతరం ఉద్యమంలో ఇద్దరూ కలిసే పనిచేశారు. వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు నిజాం ప్రభుత్వం పీవీతోపాటు రామచంద్రారెడ్డిని కూడా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించింది. ఆ తరువాత ఉన్నత చదువులు చదివారు. దాదాపుగా ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చి, 1952 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన పీవీ ఓటమి చెందగా, హైదరాబాద్ నుంచి పోటీ చేసిన రామచంద్రారెడ్డి గెలుపొందాడు.

1962లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రామచంద్రారెడ్డికి మళ్ళీ మంత్రిగా అవకాశం రావడంతో రాజనీతిజ్ఞులకే గురువైన పివీ నరసింహరావుకు రాజకీయ గురువై ‘ఈ అబ్బాయిలో స్పార్క్‌ ఉంది. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా నేను మంత్రి పదవి తీసుకోలేను’ అని నీలం సంజీవరెడ్డికి చెప్పి, ఆతనని ఒప్పించి పీవీని మొదటిసారి మంత్రివర్గంలోకి తీసుకొచ్చాడు.[10][11]

పీవీలోని మేధాశక్తిని గుర్తించిన రామచంద్రారెడ్డి, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో పీవీని ఎంతగానో ప్రోత్సహించాడు. ప్రతి విషయంలోనూ, ప్రతి సమావేశంలోనూ పీవీ ఉండేలా చూసుకునేవాడు. అందరిలో పీవీకి ప్రత్యేక స్థానం ఇచ్చాడు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా రామచంద్రారెడ్డి, పీవీ పార్టీపరంగా విడిపోయి, రామచంద్రారెడ్డి తెలంగాణ ప్రజా సమితిలోకి వెళ్ళగా, పీవీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అయినప్నటికీ ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది.[12]

తెలంగాణ ఉద్యమం

మార్చు

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న అనేక ఇతర నాయకులతో కలిసి ఒక పెద్ద సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అరెస్టై ముషీరాబాదు జైలులో కొంతకాలం గడిపాడు. 1970లో తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన తెలంగాణ ప్రాంతానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలతో ‘తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్’ని ఏర్పాటు చేశాడు.

తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రితో సమావేశమైన నాయకుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాడు. ముల్కీలకు కేటాయించిన పోస్టుల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను వారివారి ప్రాంతాలకు పంపించాలని గట్టిగా పట్టుబట్టాడు. పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు చేయడంలో లోపాలను సరిదిద్దడం తెలంగాణ మిగులు ఆదాయాల పరిమాణాన్ని నిర్ణయించి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలని కూడా కోరాడు.[3]

నూకల రామచంద్రారెడ్డి తన 55 సంవత్సరాల వయసులో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే 1974, జూలై 27న గుండెపోటులో మరణించాడు.[2] అతను ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా, గౌరవసూచకంగా ఆయనకు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది.

మూలాలు

మార్చు
  1. Eenadu (18 November 2023). "చివరి శ్వాస వరకూ ప్రజా సంక్షేమమే ఊపిరిగా." Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
  2. 2.0 2.1 https://epaper.ntnews.com/Home/ShareArticle?OrgId=475664ea&imageview=1
  3. 3.0 3.1 అయినంపూడి, శ్రీలక్ష్మి (2023-01-13). "సకలజన బాంధవుడు నూకల". www.ntnews.com. Archived from the original on 2023-01-13. Retrieved 2023-02-03.
  4. "Osmania University centenary celebrations end on a spectacular note". The Times of India. 2017-04-30. ISSN 0971-8257. Archived from the original on 2017-04-30. Retrieved 2023-02-02.
  5. telugu, NT News (2022-07-25). "రాష్ట్ర సంగీత‌, నాట‌క అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా దీపికా రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
  6. Namasthe Telangana (5 August 2022). "భావితరాలకు మన కళలను అందిద్దాం". Archived from the original on 7 August 2022. Retrieved 7 August 2022.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-12. Retrieved 2020-06-12.
  8. Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  9. https://epaper.ntnews.com/home/index?date=02/07/2020&eid=1&pid=173745
  10. "కుల మత రాజకీయాలతో ముప్పే దేశరక్షణ కోసం నాతో కలిసి నడవండి కేసీఆర్". ETV Bharat News. 2023-01-13. Archived from the original on 2023-02-03. Retrieved 2023-02-03.
  11. "పీవీ నరసింహారావుకే గురువు నూకల రాంచంద్రా రెడ్డి...కేసీఆర్ వ్యాఖ్య". www.suryaa.com (in ఇంగ్లీష్). 2023-01-12. Archived from the original on 2023-02-03. Retrieved 2023-02-03.
  12. తాతయ్య పట్టుబట్టి మంత్రి పదవి ఇప్పించారు (నూకల రామచంద్రారెడ్డి మనవరాలు దీపికారెడ్డితో ఇంటర్వ్యూ), నమస్తే తెలంగాణ మెయిన్, 2020 జూలై 2, పేజీ 7.