నెల్లీ సేన్‌గుప్తా

భారత రాజకీయ నాయకురాలు

నెల్లీ సేన్‌గుప్తా (1886-1973) భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న బ్రిటీష్ మహిళ. ఈమె కలకత్తాలో 1933లో జరిగిన 47వ భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సదస్సుకు అధ్యక్షురాలిగా ఎంపికయ్యింది.

నెల్లీ సేన్‌గుప్తా
నెల్లీ సేన్‌గుప్తా


47వ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు
పదవీ కాలం
1933

వ్యక్తిగత వివరాలు

జననం (1886-01-12)1886 జనవరి 12
కేంబ్రిడ్జ్, ఇంగ్లాండ్
మరణం 1973 అక్టోబరు 23(1973-10-23) (వయసు 87)
కలకత్తా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయవేత్త
పురస్కారాలు పద్మవిభూషణ్ 1973

జీవిత విశేషాలు

మార్చు

ఈమె అసలు పేరు ఎడిత్ ఎల్లెన్ గ్రే. ఈమె 1886, జనవరి 12న ఇంగ్లాండులోని కేంబ్రిడ్జిలో ఫ్రెడరిక్ గ్రే, ఎడిత్ హెన్రిట్టా గ్రే దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి ఒక క్లబ్బులో పనిచేసేవాడు. ఈమె చిన్నతనంలోనే జతీంద్రమోహన్ సేన్‌గుప్తాతో ప్రేమలో పడిపోయింది. జతీంద్ర లా చదువు కోవడం కోసం కేంబ్రిడ్జికి వచ్చాడు. తల్లిదండ్రులు వ్యతిరేకించినా ఈమె జతీంద్రమోహన్‌ను 1909, ఆగష్టు 1న పెళ్ళి చేసుకుని కలకత్తాకు తిరిగి వచ్చింది. నెల్లీకి శిశిర్ సేన్‌గుప్తా, అనిల్ సేన్‌గుప్తా అనే ఇద్దరు కుమారులు కలిగారు.

సహాయ నిరాకరణోద్యమం

మార్చు

భారత దేశానికి తిరిగి వచ్చిన తరువాత ఈమె భర్త జతీంద్రమోహన్ కలకత్తాలో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతడు 1910లో తన భార్య నెల్లీతో కలిసి జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. ఇతడు బెంగాల్‌లో మహాత్మా గాంధీకి కుడి భుజంగా మెసలి స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. కలకత్తా నగర మేయర్‌గా మూడు పర్యాయాలు, బెంగాల్ లెజిస్లేచర్ అసెంబ్లీ నాయకుడిగా జతీంద్రమోహన్ సేన్‌గుప్తా పనిచేశాడు. 1921లో నెల్లీ సేన్‌గుప్తా తన భర్తతో కలిసి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనింది. చిటగాంగ్ లో ఖద్దరును అమ్ముతుండగా ఈమెను అరెస్టు చేశారు. 1930లో ఈమె ఢిల్లీ, అమృత్‌సర్ మొదలైన ప్రాంతాలను సందర్శించింది. ఢిల్లీలో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఈమెను అరెస్ట్ చేసి మూడు నెలలు కారాగారంలో ఉంచారు. ఈమె భర్త 1933 జూలై 23న జైలులో మరణించాడు. భర్త మరణించినా ఈమె దేశ స్వాతంత్ర్యం కోసం తన పోరాటాన్ని వదిలిపెట్టలేదు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు

మార్చు

ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైలుకు వెళ్ళారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ మాలవ్యా కూడా అరెస్ట్ కావడంతో 1933లో కలకత్తాలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఈమెను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అంతకు ముందు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా మహిళలు అనీబిసెంట్, సరోజినీ నాయుడు ఇద్దరే ఉన్నారు. ఈమె ఆ గౌరవం దక్కించుకున్న మూడవ మహిళ.

ఇంకా ఈమె కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్‌కు ఆల్డర్‌మాన్‌గా ఎంపిక కావడంతో పాటు 1940, 1946లలో కలకత్త లెజిస్లేచర్ అసెంబ్లీకి సభురాలిగా ఎంపికయ్యింది.

స్వాతంత్ర్యానంతరం

మార్చు

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈమె తూర్పు పాకిస్తాన్ లోని తన భర్త స్వగ్రామమైన చిట్టగాంగ్ లో నివసించడానికి ఇష్టపడింది. జవహర్ లాల్ నెహ్రూ ఈమెను తూర్పు పాకిస్తాన్ లోని హిందూ మైనారిటీల సంక్షేమాన్ని చూసుకోవలసిందిగా ప్రత్యేకంగా అభ్యర్థించాడు. ఈమె 1954లో తూర్పుపాకిస్తాన్ లెజిస్లేచర్ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఈమె మైనారిటీ బోర్డు మెంబరుగా, సంఘ సేవకురాలిగా కొనసాగింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఈమె చిట్టగాంగ్‌లోనే నివసించడానికి మొగ్గు చూపింది. అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రహ్మాన్కు ఈమె పట్ల ఎనలేని గౌరవం ఉండేది. 1972లో ఈమె తుంటి ఎముక విరిగినప్పుడు భారత ప్రధాని ఇందిరా గాంధీ చొరవతో ఈమెను కలకత్తాకు తీసుకువచ్చి భారత ప్రభుత్వం తన స్వంత ఖర్చులతో ఈమెకు చికిత్స చేసింది. ఈమె 1973, అక్టోబర్ 23న కలకత్తాలో మరణించింది.

 
1985లో విడుదలైన భారతదేశపు స్టాంపుపై నెల్లీ, జతీంద్ర మోహన్ సేన్‌గుప్తా

పద్మవిభూషణ్

మార్చు

ఈమె స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నందుకు, తూర్పు పాకిస్తాన్‌లో మైనారిటీల సేవ చేసినందుకు గుర్తుగా ఈమెకు 1973లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించారు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు