పల్నాడు

(పలనాడు నుండి దారిమార్పు చెందింది)

పలనాడు లేదా పల్నాడు, లేదా పల్లవనాడు పూర్వపు గుంటూరు జిల్లాకు ఉత్తర ప్రాంతాన ఉంది. 2022లో జిల్లాల పునర్య్వస్థీకరణలో భాగంగా పల్నాడు ప్రాంతం నరసరావుపేట ప్రధాన పరిపాలనా కేంద్రంగా పల్నాడు జిల్లాగా ఏర్పడింది. నరసరావుపేట పట్టణం పల్నాడు ప్రాంతానికి ముఖద్వారం అని నానుడి. పల్నాడు ప్రాంతంలో piduguralla దాచేపల్లి గురజాల, మాచర్ల, కారంపూడి ముఖ్య పట్టణాలు. ఆంధ్ర కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్ట.ఆంధ్ర పల్లవులు నివసించినప్రదేశమే పల్లవనాడని, తరువాత నేడు పల్నాడని పిలవబడింది.[1][2]

పల్నాడు గురించి

మార్చు
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు

-ఇది శ్రీనాథ కవిసార్వభౌమ విరచితం.

"పలనాడు వెలలేని మాగాణిరా!" ఇది పులుపుల వెంకట శివయ్య అన్న మాట.

వీరారాధనోత్సవాలు

మార్చు

మహాభారతం తీరునే దాయాదుల పోరుగా పల్నాటి యుద్ధం జరిగింది. నాటి రణానికి సాక్షీభూతంగా నిలిచిన కారంపూడిలో (కార్యమపూడి) శతాబ్దాల నుంచి యుద్ధంలో అమరులైన వీరులను స్మరిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. పల్నాడు వీరారాధనోత్సవ పరిరక్షణ సమితి అధ్వర్యంలో కారంపూడిలో వీరారాధనోత్సవాలు జరుగుతుంటాయి.11వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం జరిగిందని చరిత్రకారుల నిర్ధారించారు.సమసమాజ స్థాపన కోసం బ్రహ్మనాయుడు హరిజన, గిరిజన ఆలయ ప్రవేశం చేయించాడు. తన ఆశయ సాధనకు చెన్నకేశవాలయ అర్చకులుగా మాలదాసరులైన పిడుగు వంశీకులను, చాకలి, మంగలి, గొల్లలను సేవకులుగాను నియమించాడు.కులాంతరవివాహాలను ప్రోత్సహించాడు. మాలకన్నమదాసును దత్తపుత్రునిగా స్వీకరించి సైన్యాధ్యక్షుడిగా నియమించాడు.ఉత్సవాల్లో మందపోరు రోజున చాపకూడు నిర్వహిస్తారు. రాయబారం, మందపోరు, కోడిపోరు, కళ్ళిపాడులుగా అలనాటి చరిత్రను కథకులు గానం చేస్తుండగా అప్పటి సన్నివేశాలైన కోడిపోరు, లంకన్న ఒరుగు, కత్తిసేవలను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుంచి ఆచారవంతులు తమ తమ కొణతాలతో ఉత్సవాలలో పాల్గొని మొక్కులు చెల్లించి కత్తిసేవచేసి వెళ్తుంటారు. కార్తీక అమావాస్య నాడు వీర్ల దేవాలయంపై ఎర్రజండా ఎగురవేసి పీఠాధిపతి ఉత్సవాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తాడు. ఆచారవంతులు అర్ధరాత్రి నుంచి తమ కొణతాలతో వీర్లదేవాలయం వద్దకు చేరతారు.

బాలుడే ప్రస్తుత వీర్లదేవాలయ పీఠాధిపతి

మార్చు
 
వీర్లదేవాలయం, కారంపూడి

ప్రపంచంలో అమరవీరులకు ఆరాధనలు రోమ్ తరువాత కారంపూడిలోనే నిర్వహిస్తారు. ఇంతటి ఘనచరిత్రకు 12 ఏళ్ళ బాలుడైన పిడుగు తరుణ్ చెన్నకేశవ పీఠాధిపతి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని నిలబెడుతూ ఉత్సవాలను నిర్వహిస్తున్నాడు. సంతానం కోరే మహిళలు ఉత్సవాల్లో వీర్ల కొణతాల జలదరింపు కోసం బారులు తీరుతారు. కొణతాల జలదరింపులో పూలరేకులు వడిలో పడితే వాటిని ఆరగిస్తే సంతానం కలుగుతుందని నమ్మకంతో వందలాదిగా మహిళలు వేచి ఉంటారు.

పల్నాటి చరిత్ర వీరగాధను 800 సంవత్సరాలకు పైబడి గానాభినయం చేస్తుండడం విశేషం. దాన్ని 30 రాత్రులు గానం చేసే విద్యావంతులు పది కులాల్లో ఉన్నారు. వీరిలో మాలదాసులది ప్రత్యేకం. 17వ శతాబ్ది మధ్యభాగంలో జీవించిన వీరభద్ర కవి పల్నాటి యుద్ధ చరిత్రను కావ్యంగా రాశారు. సి.పి. బ్రౌన్ వీరుల గాథను తాళపత్ర రూపంలో కొంత సేకరించారు. శ్రీనాథ విరచిత పల్నాటి చరిత్రను అక్కిరాజు ఉమాకాంతం 1911లో ప్రచురించారు. ఆ తర్వాత 1961లో పింగళి లక్ష్మీకాంతం శ్రీనాథ కావ్య మూలంగా పల్నాటి చరిత్ర ద్విపదను వెలువరించారు. ప్రేమ కోసం ప్రియుడితో కోటను వదిలి యుద్ధం చేసిన శివనాగరాణి గాథ ఆద్యంతం రసవత్తర ఘట్టం.

పిడుగురాళ్ల సమీపంలోని జానపాడుకు చెందిన అలిశెట్టి గాలెయ్యతో 30 రాత్రులు పాడించుకుని దాన్ని తెలుగు నుంచి ఇంగ్లీషులోకి జి.హెచ్. రొఘెయిర్ అనువదించారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన వెల్చేరు నారాయణరావు ఆయనకు కొంతమేర సహకరించారు.

నాయకురాలు నాగమ్మ జన్మస్థలం గామాలపాడు నేటికీ ఉంది. అక్కడ నాగమ్మ కోట, శివాలయం ఉన్నాయి. వీరత్వం ఉప్పొంగి చనిపోయిన ఇద్దరు ముస్లిం సైనికుల సమాధులు సైతం వీరుల గుడిలో పూజలందుకోవడం విశేషం. శంకుతీర్థ మండపం నాగులేటి సమీపంలో ఉంది. వీరులు యుద్ధానికి వెళ్లే ముందు బ్రహ్మన్న ఇచ్చిన తీర్థం తాగిన వెంటనే వీరత్వం ఉప్పొంగేదని వీరగాధ చెపుతోంది.

పలనాటి యుద్ధం చరిత్ర

మార్చు

పలనాటి అనుగు మహారాజుకి మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం నలగామ రాజు, నర్సింగ రాజులు. రెండవ భార్య ద్వారా కలిగిన సంతనం మలిదేవ రాజు. ఆనుగు రాజు, బలుదైన నలగమ రాజుకి పటాభిషేకం చెసి, అప్పటి రాజ్య మంత్రివర్యులు బ్రహ్మనాయుడను రాజ సంరక్షుకులుగా నియమించి చనిపొయాడు. బ్రహ్మనాయుడు యువరాజులను పెంచి పెద్ద చేసి రాజ్యన్ని అప్పగించాడు. అభ్యుదయ భావాలతో అంటరానితనం, మత భేదాలను రూపుమాపటానికి బ్రహ్మనాయుదు చేస్తున్న కృషి ఉన్నత కులాల వారి వ్యతిరేకతకు గురిఅవుతుంది.

మూలాలు

మార్చు
  1. చిలుకూరి వీరభద్రరావు (1910).   ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము. వికీసోర్స్. 
  2. ఆంధ్రజ్యోతి ఆదివారం ముఖచిత్రకథనం 21-12-2008
"https://te.wikipedia.org/w/index.php?title=పల్నాడు&oldid=4153021" నుండి వెలికితీశారు