పారుపల్లి రామక్రిష్ణయ్య
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు (1883-1951) కర్ణాటక సంగీత విద్వాంసుడు. త్యాగరాజ శిష్యపరంపరకు చెందినవారు.
జీవిత సంగ్రహం
మార్చువీరు కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో పారుపల్లి శేషాచలం, రంగమ్మ దంపతులకు వ్యయ నామ సంవత్సరం (1883)లో జన్మించారు[1]. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది విజయవాడలో స్థిరనివాస మేర్పరచుకొని గురుకుల పద్ధతిలో ఉచితంగా విద్యాబోధన చేశారు.
పంతులుగారు జంత్రగాత్రములతో కచేరి చేసేవారు. సంగీత, సాహిత్య, లక్ష్యలక్షణాలను పోషిస్తూ బాగా పాడేవారు. వర్ణంతో ఆరంభమై, శ్రోతల అభిరుచిని గమనించి, రాగం, స్వరం, నెరవులు మోతాదు మించకుండా ఆద్యంతం కచేరీని రక్తిగా నడిపేవారు. ప్రక్కవాద్యాలను ప్రోత్సహిస్తూ పాడేవారు. కచేరీలో అన్ని అంశాలు ఉండేవి; అనగా తాళముల మార్పు, మధ్యమకాల కీర్తనలు, తక్కువకాల కీర్తనలు, రాగం, తానం, పల్లవి, శ్లోకం, రాగమాలిక, పదం, జావళి, తిల్లాన, మంగళంతో కచేరిని ముగించేవారు.
గురు పరంపర
మార్చుశాస్త్రిగారి సంగీతానురక్తి ఆయన్ని స్వస్థలమైన కృష్ణా జిల్లా నుండి తమిళనాడు కాలినడక ప్రయాణం చేయించింది. వెంకటసుబ్బయ్య వద్ద సంగీతం నేర్చుకున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. త్యాగరాజు ఒక గొప్ప కర్నాటక సంగీత విద్యాంసుడు. ఆయన తన జీవితంలో చాలాకాలం తమిళనాడులోని తంజావూరు జిల్లా యందు నివసించి అనేకమంది మహావిద్వాంసులకు సంగీత శిక్షణనిచ్చి 1847 వ సంవత్సరంలో పరమపదించారు. అట్టివారిలో వారి జ్ఞాతి ఆకుమళ్ళ (మనంబుచావడి) వెంకటసుబ్బయ్య కూడా ఒకరు. వెంకటసుబ్బయ్య కూడా తన జీవితకాలంలో అనేక మంది శిష్యులను ఆకర్షించి సంగీతశిక్షణనిచ్చారు. వారిలో సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి (1860-1917) ఒకరు. త్యాగరాజు సంగీత పరంపరను ఆంధ్ర ప్రాంతానికి పరిచయంచేసిన శాస్త్రిగారి వలన చాలామంది విద్యార్థులు లభ్ది పొందారు. వారిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురువుగా పేరుగాంచిన ప్రముఖ గాత్రవిద్వాంసుడైన పారుపల్లి రామక్రిష్ణయ్య (1883-1951) ఒకరు.
సన్మానాలు
మార్చుఇతని సంగీత ప్రతిభను చూసి మాంగుడి చిదంబర భాగవతార్, తంజావూరు పంచాపకేశ భాగవతార్ వంటి సంగీతజ్ఞులు ప్రశంసించారు. 1915లో చెన్న రాష్ట్రాధిపతి పెంట్లండు ప్రభువు తెనాలిలో ఇతడిని బంగారు పతకంతో సత్కరించాడు. 1916లో బరోడాలో, బొంబాయిలో ఇతనికి సత్కారాలు జరిగాయి. 1921 నవంబరు 22న మద్రాసు త్యాగరాజగానసభ వారు ఇతడిని ఆహ్వానించి సన్మానం చేశారు. కాకినాడ, మద్రాసు తదితర ప్రాంతాలలో జరిగిన అఖిల భారత గాయక మహాసభలలో ఇతనికి సన్మానం జరిగింది. విజయనగరంలో జరిగిన ప్రథమాంధ్ర సంగీత పరిషత్సభకు ఇతడు అధ్యక్షత వహించాడు. కాకినాడ శ్రీరామ సమాజం వారు ఇతనికి బంగారు గొలుసు, బంగారు పతాకాన్ని సమర్పించి సత్కరించింది. 1931లో నరసరావుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో పిరాట్ల శంకరశాస్త్రి ఇతనికి గాయక సార్వభౌమ అనే బిరుదును ఇచ్చి సత్కరించాడు[1].
శిష్యవర్గం
మార్చువీరి శిష్యవర్గంలో అనేకులు, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి వహించారు. వారిలో గాత్ర విద్వాంసులు, వాద్య విద్వాంసులు, ఉత్తమ బోధకులు ఉన్నారు. పంతులుగారి శిష్యులలో కొందరు:
మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, అద్దంకి శ్రీరామమూర్తి, పారుపల్లి సుబ్బారావు, మంగళంపల్లి పట్టాభిరామయ్య, వంకదారి వేంకటసుబ్బయ్య గుప్త, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, శిష్ట్లా సత్యనారాయణ, దాలిపర్తి పిచ్చహరి, పరిదే సుబ్బారావు, దాలిపర్తి సూర్యుడు, భమిడిపాటి నరసింహశాస్త్రి, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, చల్లపల్లి పంచనద శాస్త్రి, అడుసుమల్లి వేంకట కుటుంబ శాస్త్రి, పువ్వుల ఆంజనేయులు, గుంటూరు సుబ్రహ్మణ్యం, చదలవాడ సత్యనారాయణ, లంక వేంకటేశ్వర్లు, ప్రపంచం కృష్ణమూర్తి, నేతి లక్ష్మీనారాయణ భాగవతార్ , ములుకుట్ల సదాశివశాస్త్రి, వేదాంతం సుబ్రహ్మణ్య కవి, రాజనాల వేంకట రామయ్య, సింగరాజు సూర్యనారాయణ రాజు, ఉండవల్లి కృష్ణమూర్తి, పాతూరి సీతారామయ్య చౌదరి, వంకమామిడి వీరరాఘవయ్య, ముసునూరి వేంకట రమణయ్య, దత్తాడ పాండురంగరాజు, ఏలూరు శ్రీరాములు, అలగోలు ఆంజనేయులు, బేతనబొట్ల సుబ్బయ్య, బేతనబొట్ల వేంకటరామయ్య, గొల్లపూడి వేంకటాచలపతి, అడుసుమిల్లి సూర్య వెంకట కుటుంబయ్య, శ్రీకాకుళం రాఘవులు, శ్రీకాకుళం వేంకటరాముడు, శ్రీకాకుళం సుబ్బారాయుడు, నేతి శ్రీరామశర్మ, వెలగలేటి భద్రయాచార్యులు, మంత్రవాది గంగాధరం, మండ రాఘవయ్య, మద్దిపట్ల శ్రీరాములు, మేడూరి రాధాకృష్ణ, గద్దె వెంకట రామకుమారి, తిరుపతి పొన్నారావు, చల్లపల్లి పురుషోత్తమశాస్త్రి, టి.కె.యశోదాదేవి, కొర్నెపాటి నరసింహారావు, చల్లపల్లి కృష్ణమూర్తి, మంత్రాల గోపాలకృష్ణమూర్తి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 కో.వేం.శ. (1 February 1932). "గాయక సార్వభౌమ బ్ర.శ్రీ. పారుపల్లి రామక్రిష్ణయ్య గారు". భారతి మాసపత్రిక. 9 (2): 350–351. Retrieved 24 May 2020.[permanent dead link]