పనప్పాకం అనంతాచార్యులు

న్యాయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు, కాంగ్రెసు అధ్యక్షుడు
(పి.ఆనందాచార్యులు నుండి దారిమార్పు చెందింది)

పనప్పాకం అనంతాచార్యులు (పనప్పాకం ఆనందాచార్యులు) (1843 - 1907) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు.[1] ఈయన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశేష స్థానం కలిగినవారు. 1884 సంవత్సరములో స్థాపించబడ్డ మద్రాసు మహాజనసభ అను కార్యాలోచన సభ వ్యవస్థాపకుడు, పీపుల్స్ మాగజీన్ అను మాసపత్రికకు సంపాదకుడుగానూ ఉన్నాడు. "ఆయన పేరు పి. ఆనందాచార్యులని ప్రసిద్దిచెందిననూ ఆయన ఎప్పుడూ పి. అనంతాచార్లు అని సంతకం చేస్తూ తనను తెలుగు వాడిగా ప్రకటించుకుంటూ ఉండిరి" అని 1948 మే 5వ తేది ఆంధ్రపత్రికలో మద్రాసు మహాజన సభ అనే వ్యాసములో దిగవల్లి వేంకటశివరావు వ్రాశాడు.[2]

పనప్పాకం అనంతాచార్యులు (ఆనందాచార్యులు)
పనప్పాకం అనంతాచార్యులు

పనప్పాకం ఆనంతాచార్యులు


భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు
ముందు ఫిరోజ్ షా మెహతా
తరువాత వుమేష్ చంద్ర బెనర్జీ

వ్యక్తిగత వివరాలు

జననం 1843
కడమంచి, చిత్తూరు జిల్లా
మరణం నవంబరు 11,1907
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కనకవల్లి
మతం హిందూ
వెబ్‌సైటు [1]

జీవిత విశేషాలు

మార్చు

అనంతాచార్యుల వారి పూర్వులు చంగల్ పట్టు జిల్లా పొన్నేరు తాలూకా లోని గ్రామం పనప్పాకం వాస్తవ్యులు. వీరి తండ్రిగారు శ్రీనివాసా చార్యులు గారు ఇప్పటి చిత్తూరు జిల్లా (అదివరకటి నార్త్ ఆర్కాట్ జిల్లాలో కడమంచి అను తెలుగు గ్రామంలో ఇల్లు కట్టుకుని స్థిర పడ్డారు. అనంతాచార్యులు కడమంచి గ్రామంలోనే 1843లో జన్మించారు. వారి 12 ఏటనే తండ్రి శ్రీనివాసాచారి మరణించాడు.

ఈయనచిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రి సహాయంతో 1863 లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. వీరు 1889లో మద్రాసు అడ్వొకేట్ల సంఘాన్ని స్థాపించారు.[3] లండనులో ఇంపీర్యల్ కౌన్సిల్లో ఇద్దరే ఇద్దరు భారతీయ (నేటివ్) సభ్యులోలో వీరు 1895 నుండి 8 ఏండ్లు సభ్యలుగా వుండి భారతీయుల దీనస్థితిగతులను వైస్రాయి సమక్షంలో కూడా ధైర్యముగా వెల్లడించేవారు. 1885 డిసెంబరు 28 న జాతీయ కాంగ్రెస్ మహాసభ స్దాపించుటకు బొంబాయి నగరములో జరిగిన ప్రప్రథము సభలో పాల్గోన్న 72 మందిలో అనంతాచార్యులు గారు తెలుగువారవటం గర్వించతగిన విషయం. అటు తరువాత 1891 డిసెంబరులో నాగపూరులో జరిగిన 7 వ కాంగెస్ మహాసభకు అధ్యక్షుడైనారు. 1878 లో స్దాపించబడ్డ హిందూ మహాజన సభలో సభ్యులు గానున్న సర్ టి. మాధవరావు, దివాన్ బహదూర్ ఆర్ రఘునందన రావు, న్యాపతి సుబ్బారావు గార్లతోపాటు గావీరు గూడా సభ్యులు, వీరందరూ తిరునల్ వేలి లటరరీ సదస్సులోకూడా ప్రముఖ సభ్యులు. హిందూ పత్రికలో 1878 నుండి వారి వ్యాసములు ప్రచురితమైనవి.1882 లో "How to reform the Courts" అను గ్రంథమును 1883లో“The Legal Profession, how to reform it” అను గ్రంథముప్రచురించారు. Madras Native Public Opinion అను ఇంగ్లీషు పత్రికలో వ్యాసములు వ్యాసేవారు వారు న్యాయవాదిగా చేసిన కేసులలో వారి వాదనలు Indian Law Report లో తరచు రిపోర్టు అవబడుతూవుండేవి.

అనంతాచార్యులు గారిని గురించి ఆదిభట్ల నారాయణదాసు కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసి యున్నారు. ఆంతటి విశేష మైనవ్యక్తి జీవితచరిత్ర లేకపోవటం, వేరెవరూ కూడా వ్రయకపోవటం అంతేకాక వారిని గురించి 1966 తరువాత వచ్చిన మూలాధారములు వారి పేరు “ఆనందాచార్యులు” అని ఉండటం చాల నొచ్చుకోతగ్గవిషయం. దీనికి కారణం వారిని గూర్చిన మూలాధారము ఒకటి మద్రాసులోని వారి మిత్రులొకరు అరవభాషలో వ్రాసియుండటం తదుపరి మూలాధారాలైన కాంగ్రెస్ చరిత్ర పుస్తకంలో వారి పేరు “ఆనందాచార్యులు” అయిపోవటం మరీ దురదృష్టకరమని వాపోయారు చరిత్రకారులు.[4]

న్యాయవాది వృత్తి, రావుబహదూర్ బిరుదు

మార్చు

1870లో మద్రాసు హేకోర్టులో న్యాయవాదిగా చేరారు.కావలి వెంకటపతిరావుగారి జూనియర్ గా కేసులు చేయటం ప్రారంభించిన కొద్దిరోజులలోనే వీరికి ప్రతిపక్షంగా బారిస్టర్ H.D Mayne అనుఆఖండన్యాయది (హిందూధర్మశాస్త్రాన్ని గూర్చి రచించిన ఉద్ఘ్రంధ కర్త ) తో భేటి పడిన ఒక కేసులో వీరు కేసు నడిపించి వాదాన చేయటం ఆ వాదనను హైకోర్టు ప్రధానన్యాయమూర్తి స్వయముగా ప్రసన్నించటము వీరి న్యాయవారి వృత్తిలో ఒక మైలు రాయి లాగ అయి అప్పటినుండి వీరి సీనియర్ కావలి వెంకటపతిగారు వీరిని జూనియర్ గా కాక తన భాగస్వామిగా స్వీకరించటం జరిగింది. త్వరలోనే వీరు చన్నపట్ణంలో అప్పటిలోనున్న అగ్రశ్రేణి న్యాయవాదులైన భాష్యం అయ్యంగార్, సర్ సుబ్రమణ్య అయర్ కోవకి చేరుకునటం జరిగింది. వీరి గొప్ప సమర్ధత ప్రావీణతకు హైకోర్టు ప్రధాన్యాయమూర్తి సిఫారసుపై రావుబహదూర్ బిరుదును విక్టోరియా రాణీ జాబిలీ సందర్భమున వీరికి ఇవ్వబడింది. వీరు గొప్ప ధైర్యసహాసములు గలవారు. ఆరోజులలోని ఇండియన్ పీనల్ కోడ్ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడులోని నిషేధనలోని లోటుపాటులను నీరు తీవ్రముగా విమర్శించి ఖండించారు. అప్పటి ప్రభుత్వము ఆయా శాసనములను సవరించుటకు నియమించబడ్డ ఉపసంఘములో ఇద్దరే ఇద్దరు నేటివ్ సభ్యులగల ఉపసభలో వీరొకరు, దర్భాంగ మహారాజ గారిని సభ్యులుగా నియమించారు. మిగతావారందరు ఆంగ్లేయదొరలగుట వారి అధిక సంఖ్యతో వీరి ప్రతిపాదనలు తిరస్కరించటం వీరు తీవ్రంగా డిసెంట్ ప్రకటించారు. వీరి ధైర్యసాహసాలు గణనీయము. నిర్మొహమాటంగా అన్యాయమును ఖండించగల ధైర్యసాహసి. 1881-1886 మధ్యకాలంలో మద్రాసు గవర్నరుగా నుండి అతి కఠినముగా భారతీయలపై పక్షపాతముగా నిర్దయుడైన గ్రాంటు దొర గారి వీడ్కోలుకు ప్రభు భక్తులు సంసిద్ధులగుతుండగా అనంతాచార్యులుగారొక బహిరంగసభలో నిర్మొహమాటంగా ఆప్రతిపాదనను తిర్కరించి ప్రసంగించటంతో ఆ వీడ్కోలు సన్నాహం ఆపటం జరిగింది.

రచయితగా

మార్చు

మొదట్లో ఆనందాచార్యులు జర్నలిజం, రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన ‘నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మద్రాసి’ అనే మ్యాగజైన్లకు వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత హిందూ పత్రిక స్థాపనకు సహాయం చేసి, వ్యాసాలు రాశారు. రాజకీయాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా సేవలందించారు.[5]

రాజకీయ నేతగా

మార్చు

వీరు 1885లో బొంబాయిలో సమావేశమైన నాటి నుండి భారత జాతీయ కాంగ్రెసు సభా సమావేశాలలో పాల్గొని గణనీయమైన సేవచేశారు. 1891 నాగపూర్లో జరిగిన 7వ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు వీరు. వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు. 1896లో భారతీయ సామ్రాజ్య శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు. వీరు నవంబరు 28 1907 న పరమపదించారు.

సత్కారాలు

మార్చు

ఈయన ప్రతిభకు మెచ్చి 1887లో ఆనాటి ప్రభుత్వం రాజబహుదూర్ బిరుదుతో సత్కరించారు. ఆంధ్ర భాషా సారస్వత పోషకుడిగా కీర్తి గడించడమే కాకుండా ‘పద్యావినోద’అనే బిరుదుతో ఆనాటి సాంస్కృతిక సమాజాలు సత్కరించి గౌరవించాయి.

అనంతాచార్లుగారా? ఆనందాచార్లుగారా?

మార్చు

ఈయన పేరు వివిధ పుస్తకాలు, అంతర్జాల వనరులలో రెండు విధాలుగా ఉంటుంది. ఈయన పేరు అనంతాచార్యులైనా అనేక గ్రంథములలో ఆనందాచార్యులుగా ప్రచురితమైనది. అది తేలేవరకూ నేలటూరి వెంకట రమణయ్య విజ్ఞాన సర్వస్వం లో వ్రాసినట్లు అనంత(ఆనందా)చార్యులు గారే.[6] ఇది తమిళ- ఆంగ్ల తర్జుమాల గడబిడ. మద్రాసు హైకోర్టు సెంటినెరీ సంకలన పుస్తకములో కూడా " ఆనందాచార్యులు " అని వుండటం.[7]. అంతకన్నాముందే ఇంకో మూలాధారము ఒకటి మద్రాసులోని వారి మిత్రులొకరు, కె సుందర రాఘవన్ అను వారు తమిళం లో వ్రాసిన గ్రంథము"Rao Bhadur P.Anandacharyulu" మూలాధారముచేసి 1965 Freedom Struggle in Andhra Pradesh Volume I Document No.86 pp235–245 అను ప్రభుత్వ ప్రచురితమైన గ్రంథములో ఇంగ్లీషు తర్జుమాల లోను వచ్చిన గడబిడ. ప్రభుత్వప్రచురణ గీటురాయి యై తదుపరి ప్రచురణలకు కారణభూతమైనది . 19 వశతాబ్దమునాటి ఆంధ్రమహాపురుషుని గూర్చిన విషయ సేకరణ ఇప్పుడు 21వ శతాబ్దములో విషయ స్పష్టతకి మార్గం తిరిగి మరోమారు

మూలాధార సేకరణ
  1. ఆయన స్వయంగా రచించిన వ్యాసములు, వారు 1890 -1895 మధ్య నడిపించి న పత్రిక “వైజయంతి “ అను పత్రిక, న్యాయవాదిగా వారి వాదనలు రిపోర్టు చేసిన I L R reports [Indian Law Reports back issues ]
  2. హరికథా పితామహుడుగా బిరుదు పొందిన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (1864- 1945) గారి ఆత్మకథలో అనంతాచార్యులుగారిని గురించి వ్రాశారు[8]
  3. 1891 నాగాపూరులో జరిగి న అఖిలజాతీయ కాంగ్రెస్ మహాసభ రిపోర్టు (2) ఉద్ధండులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 05/03/1944ఆంధ్రపత్రికలో వీరిని గురించి వ్రాసిన వ్యాసం.[9]
  4. ఆంధ్ర విజ్ఞాన సర్వసంలో డా నేలటూరి వెంకటరమణయ్య గారి వ్యాసం.
  5. మద్రాసు మహాజనసభ లోఅనంతాచార్యులుగారి కృషి.[10]
  6. 1924 నుండి అనేక చారిత్రక విశేషాలు రచించిచి అనేక మన్ననలందుకుని నిర్మహొమాటంగా నిజం చప్పగలిగినవారని పేరుపొంది,19వ శతాబ్దమునాటి అనేక ప్రముఖులతో (వేటూరి ప్రభాకరశాస్త్రి, వడ్డాదిసుబ్బారాయడు, న్యాపతి సుబ్బారావు మొదలగు ఇంకా ఎందరి తోనో) స్వయంగా పరిచయముకలిగి అనేక చారిత్రకవిషయనులు త్రవ్విపోసినట్టి చరిత్రకారుడు 1966 లోనే ఈ లోపమును బయటపెట్టిన చారిత్రాత్మక ప్రచురణ.[11].
  7. దిగవల్లి వేంకట శివరావు గారు 1988 లో సమాలోచనలో వ్రాసిన వ్యాసములో అనంతాచార్యులు గారిని గూర్చిచాల అమూల్యవిశేషాలు వ్రాస్తూ స్వాతంత్ర్యపోరాటములో 1930 -1933 మధ్య వారితో పాటు ఒకసహగ్రంధకర్తగా నుండిన డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా స్వతంత్రోద్యమచరిత్రలో అనంతాచారిగారి పేరును'ఆనందాచారి'గా చరిత్రలోకెక్కించారని చెప్పక తప్పదని వాపోయారు.
ఛాయాచిత్రములో "పి. ఆనందాచార్యులు"

1944 లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వ్యాసంలో మొత్తం అంతా అనంతాచార్యులు గారనే అనేక సార్లు సంబోధించి యుండగా ఆవ్యాసములో ప్రచురించిన ఛాయాచిత్రము క్రింద ఆనందార్యులు అని వుండటం ఆశ్చర్యమైన విషయం. కానీ ఆంధ్ర విజ్ఞానసర్వస్యం లోనేలటూరి వెంకటరమణయ్యగారి వ్యాసంలో మాత్రం ఛాయాచిత్రము క్రింద "చిత్రము 128 పనస్పాకము అనంతాచార్యులు" అని వుండటం గమనీయం.[12]

సాహిత్యకృషి

మార్చు

సర్ టి మాధవరావు, మరియూ దివాన్ బహదూర్ ఆర్ రఘునాధ రావు గారు నిర్వహించిన The Madras Native Public Opinion అను ఇంగ్లీషు పత్రికలో అనంతాచార్లుగారు వ్యాసాలు వ్యాశారు. ఆ పత్రిక కొన్నాళకు ఆగిపోయినతరువాత దాని స్ధానంలో మద్రాసీ అను తెలుగు పత్రికలో వ్యాసాలు వ్రాశారు. 1878 లో స్దాపించ బడ్డ హిందూ పత్రికలో అనేక వ్యాసాలు వ్రాశారు. అనేక బహిరంగ సభలలో ఉపన్యాసాలుచ్చారు. 1890-1899 మధ్యన వారు వైజయంతి అను తెలుగు పత్రిక నడిపించారు. ఆ పత్రికలోకొక్కొండ వెంకటరత్నం గారు రచించిన మహాశ్వేత అను నవలను ప్రకటించారు. శబ్దరత్నాకరం రచించిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారు గూడా ఆ వైజయంతి పత్రికలో వ్యాసాలు వ్రాసేవారు. అనంతాచార్లుగారు మంజువాణీవిజయము అనే నాటకమును రచించి తన పత్రిక వైజయంతిలో ప్రచురించారు. ఆ వైజయంతి పత్రికలో అనేక గొప్ప గొప్ప పూర్వప్రబంధములను ప్రచురించారు అందులో ఎర్రాప్రగడ విరచితమైన నృసింహపురాణము, మాడభూషి వెంకటనరసిహాచారి గారు రచించిన పల్లవీపల్లవోల్లాసమను శకుంతలా పరిణయము (కృష్ణకవిరచించిన) మొదలగునవి ప్రచురించారు. అనంతాచారి గారి చరమదశలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు స్నేహితులైనారు. అనంతాచారిగారిని స్వయంగా ఎరిగి వారిని గూర్చి 5-3-1944 లో ఆంధ్రపత్రికలో వ్యాసము వ్రాశారు.

పనప్పాకం అనంతా చార్యులు గారు 28/11/1907 న దివంగతులైనారు

మూలాలు

మార్చు
  1. అనంతా (ఆనందా) చార్యులు, పనప్పాకం (1843-1907), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వన్విద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 11 - 12.
  2. "మద్రాసు మహాజన సభ" దిగవల్లి వేంకటశివరావు(1948) ఆంధ్ర పత్రిక 1948 మె 5-వతేది
  3. the great inidan patriots by M.N.roy
  4. "శ్రీమాన్ పనప్పాకం అనంతాచార్యులు", దిగవల్లి వేంకట శివరావు బి.ఎ. బి.యల్. జాతీయ పక్షపత్రిక సమాలోచన 01/09/1988,01/10/1988
  5. శ్రీ పనప్పాకం ఆనందాచార్యులు
  6. "అనంతా(ఆనందా)చార్యులు" డా.నేలటూరి వెంకట రమణయ్య, విజ్ఞానసర్వస్వము
  7. A century completed (A History of Madras High Court) 1862-1962 by V.C Gopalratnam published by Madras Law Journal Office, Madras pp 261-263
  8. ఆత్మకధ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు
  9. "క్షేత్రయ అక్షరాక్షమును పరమప్రమాణమే",శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ఆంధ్ర పత్రిక ఆదివారం మార్చి 5,1944
  10. "మద్రాసు మహాజనసభ",శ్రీ దిగవల్లి వేంకట శివరావు ఆంద్రపత్రిక మే 5, 1948
  11. " 'ఆంధ్రలో స్వాతంత్రోద్యమ చరిత్ర' ప్రభుత్వ ప్రకటించిన గ్రందములోని ముఖ్యమైన లోపాలు",దిగవల్లి వేంకట శివరావు. ఆంధ్రజ్యోతి 06/11/1966
  12. "అనంతా(ఆనందా)చార్యులు) పనపాక్కం", నేలటూరు వెంకటరమణయ్య. ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం

బయటి లింకులు

మార్చు