ప్రేమకథా చిత్రమ్

2013 లోని భారతదేశపు చిత్రం

మారుతి టాకీస్, ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సంయుక్తంగా దాసరి మారుతి, సుదర్శన్ రెడ్డి నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం ప్రేమకథా చిత్రమ్. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. జె.బి. సంగీతాన్ని అందించగా జె.ప్రభాకర్ రెడ్డి ఛాయాగ్రహణం మరియూ ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటింగ్ విభాగాల్లో పనిచేసారు. 2013 మే 11న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో హరి కిషన్ దర్శకత్వంలో 2019, ఏప్రిల్ 6న దీనికి సీక్వెల్ గా ప్రేమకథా చిత్రమ్ 2 సినిమా విడుదల అయింది.

ప్రేమకథా చిత్రమ్
దర్శకత్వంజె. ప్రభాకర్ రెడ్డి
రచనదాసరి మారుతి
నిర్మాతమారుతి
సుదర్శన్ రెడ్డి
తారాగణంసుధీర్ బాబు
నందిత రాజ్
ప్రదీప్
సప్తగిరి
ఛాయాగ్రహణంజె. ప్రభాకర్ రెడ్డి
కూర్పుఎస్. బి. ఉద్ధవ్
సంగీతంజె.బి.
పంపిణీదార్లుమారుతి మీడియా హౌస్
విడుదల తేదీ
జూన్ 7, 2013 (2013-06-07)[1]
సినిమా నిడివి
130 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్2 కోట్లు
బాక్సాఫీసు20 కోట్లు

జీవితంలో ఓడిపోయి బ్రతకాలనే ఆశ కోల్పోయిన సుధీర్ (సుధీర్ బాబు), ప్రవీణ్ (ప్రవీణ్), నందిత రాజ్ (నందిత) అనే ముగ్గురు వ్యక్తులు ఒక సుఖవంతమైన ఆత్మహత్యకు ప్రణాళిక వేసుకోవడంతో ఈ సినిమా మొదలౌతుంది. మొదటగా చనిపోయే ముందు వాళ్ళు తమ చివరి కోరికలను తీర్చుకోవాలనుకుంటారు.ఒక కొత్త కారును దొంగిలించాలని నందిత కోరుకుంటే ఆ ప్రాంతపు ఎం.ఎల్.ఏ.ను తన ఇంటిలోనే కొట్టాలని సుధీర్ ఆశపడతాడు. ఒక కారును దొంగిలించి అక్కడి ఎం.ఎల్.ఏ.ను కొట్టి పోలీసులనుంచి తప్పించుకొని ఆ ముగ్గురూ ఒక హోటలుకు వెళ్తారు. కారుని ఒకడు దొంగిలించుకు పోయాక ఆ ముగ్గురూ హోటలుకు వెళ్ళి భోజనం చేయాలనుకుంటారు. అక్కడ నెల్లూరు సప్తగిరి (సప్తగిరి) అనే మరో యువకుడు వీళ్ళను కలిసి తను కూడా వాళ్ళతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. సప్తగిరితో కలిసి ఆ ముగ్గురూ దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అప్పటికే ప్రేమలో విఫలమై కుమిలిపోతున్న సుధీర్ ప్రాణాలను కాపాడాలని ప్రవీణ్, సుధీర్ ని ప్రేమిస్తున్న నందిత ప్లాన్ చేసి ఆత్మహత్యను మూడురోజులు వాయిదా వేయిస్తారు.

ఈ మూడు రోజుల్లో ఆ నలుగురూ ప్రాణస్నేహితులౌతారు. నందితపై ప్రేమను పెంచుకున్న సుధీర్ తన ప్రేమ గురించి నందితకు చెప్తే తనని నీచంగా చూస్తుందని భయపడి నిజాన్ని దాస్తాడు. మూడో రోజు రాత్రి ప్రవీణ్ నందితను సుధీర్ ప్రాణాలను కాపాడాలంటే వెళ్ళి తనని ముద్దుపెట్టుకోమని చెప్తాడు. మగాళ్ళ మనస్తత్వం ప్రకారం ఈ చర్యతో సుధీర్ మనస్తత్వంలో మార్పు వస్తుందని నమ్మిస్తాడు. ఇంకోవైపు ప్రవీణ్ సుధీర్ దగ్గరికి వెళ్ళి నందితను ముద్దుపెట్టుకుని తన చివరి ఆశలను తీర్చమని బలవంతపెడతాడు. వేరే దారి లేక సుధీర్ దీనికి ఒప్పుకుంటాడు. నందితకు ముద్దుపెట్టే సమయంలో నందిత శరీరంలోకి ఒక ఆత్మ ప్రవేశించి తనని బయటికి పొమ్మని కసురుతుంది. భయపడిపోయిన సుధీర్ అక్కడినుంచి పారిపోతాడు. ఆ క్షణం నుంచి నందితను దూరం పెడుతూ కాలం వెళ్ళదీస్తున్న సుధీర్ తనకు ఎప్పుడు దగ్గరైనా ఆ ఆత్మ కోపానికి బలైపోతానని కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలియని నందిత ఎంతో బాధపడుతుంది.

అప్పుడు సుధీర్ నందిత గురించి ప్రవీణ్ ద్వారా తెలుసుకుంటాడు. సుధీర్ ఎదురింటిలో ఉండే నందిత తొలిచూపులోనే తనని ప్రేమిస్తుంది. తనకోసం ఒక అమ్మాయి వేచి ఉందని తెలియని సుధీర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది తెలిసి ఎలాగైనా సుధీర్ ప్రేమను గెలవకముందే తన మనసులోని మాటను తెలియజేయాలనుకుంటుంది నందిత. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకోవలనుకున్న సుధీర్ ప్రాణాలను కాపాడాలని చూస్తున్న ప్రవీణ్ నందిత గురించి తెలుసుకుని తనతో కలిసి మరుసటిరోజు ఈ సామూహిక ఆత్మహత్య కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తాడు ప్రవీణ్. ఆపై సప్తగిరి, సుధీర్ తామిద్దరూ చావట్లేదని తెలుసుకుని ఆగిపోతారు.సుధీర్ నందితకి దయ్యం పట్టిందని, తనపై ప్రేమ ఎంతున్నా ఆ దయ్యానికి తను భయపడాల్సి వస్తోంది అని ప్రవీణ్ ముందు వాపోతాడుఇది విన్న ప్రవీణ్ నందిత రూనుకి వెళ్ళి తనని మందలించి సుధీరుకి దగ్గరవ్వమంటాడు. చివరికి తనలో ఆత్మ ప్రవేశించాక ఆ ఆత్మ కోపానికి ప్రవీణ్ బెదిరిపోతాడు. ఆత్మ ఆవహించిన నందిత చేతుల్లో దెబ్బలు తింటాడు. అదే రాత్రి సప్తగిరి కూడా సుధీర్, నందిత చదరంగం ఆడుతున్నప్పుడు కొన్ని కారణాల వల్ల సుధీర్, ప్రవీణ్ పారిపోయాక ఆ ఆత్మ నందితను ఆవహించడం, గాలి సోకిన నందిత విశ్వరూపాన్ని చూసి బెదిరి పారిపోయి సుధీర్, ప్రవీణ్ పక్కనే చేరి ఆ రాత్రి గార్డెనులో పడుకుంటారు. ఆ క్షణం నుంచీ ఆ ముగ్గురూ కలిసే తిరగాలనీ, నందితకు దూరంగా ఉండాలనీ నిర్ణయించుకుంటారు.

మరుసటి ఉదయం నుంచీ నందిత శరీరం నుంచి ఆ ఆత్మను బయటికి రప్పించాలని ప్రయత్నించి దారుణంగా విఫలమై ఆ ఆత్మ కోపాన్ని చవిచూస్తుంటారు ఆ ముగ్గురు. తనకి దయ్యం పట్టిందని తెలిసాక నందిత కూడా ఆ ముగ్గురితో కలిసి పారిపోవాలనుకుంటుంది. కానీ ఈ సారి కూడా పాచికలు పారవు. సుధీర్ తనని దూరం పెట్టడం భరించలేక నందిత తీవ్ర మానసిక సంక్షోభానికి లోనై చేతినరాలను కోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఇంతలో ఆ ఇంటి ఓనరు కొడుకు, వాడి ఇద్దరి స్నేహితులు ఆ ఇంట్లోకి వస్తారు. సుధీర్, ప్రవీణ్, సప్తగిరి కాకుండా వారితో ఒక అమ్మాయి ఉందని తెలిసి కామేఛ్ఛతో వారిని రెండు రోజుల దాకా ఇక్కడే ఉండమని అనుమతిస్తారు. నందిత రూములోకి వెళ్ళిన సుధీర్ చావుబ్రతుకుల్లో ఉన్న తన దగ్గరికి వెళ్తాడు. మరలా తనకి దయ్యం సోకడంతో అసలు నువ్వెవరని సుధీర్, ప్రవీణ్, సప్తగిరి అడుగుతారు. అప్పుడు ఆ దయ్యం తన గతాన్ని చెప్తుంది.

నందిత శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ పేరు లక్ష్మి. తన భర్తతో కలిసి తొలిరాత్రి జరుపుకోడానికి ఈ ఇంటికి కొన్నాళ్ళ క్రితం వచ్చింది. కానీ అప్పుడక్కడే ఉన్న ఆ ముగ్గురు యువకులూ తన భర్తని మందు సీసాతోతల పగలకొట్టి తనపై అత్యాచారానికి పాల్పడతారు. వారి కిరాతకానికి లక్ష్మి చనిపోగా తన భర్త ఒక గునపాం వల్ల గాయపడి స్విమ్మింగ్ పూలులో పడి చనిపోతాడు. ఇదంతా విన్న సుధీర్, ప్రవీణ్, సప్తగిరి ఆ ముగ్గురు యువకులను ఎదిరించి వారిని చంపేస్తారు. ఆత్మ నందిత శరీరాన్ని వదిలి వెళ్ళాక నందితను హాస్పిటలుకి తీసుకెళ్ళి కొంత రక్తాన్ని తనకి దానం చేస్తాడు సుధీర్. మేలుకున్న నందిత సుధీరుని దగ్గరకు తీసుకోవడాన్ని తలుపు చాటున ప్రవీణ్, సప్తగిరి ఆనందంగా చూడటంతో సినిమా ముగుస్తుంది.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • రచయిత - దాసరి మారుతి
  • దర్శకుడు - జె. ప్రభాకర్ రెడ్డి
  • ఛాయాగ్రహణం - జె. ప్రభాకర్ రెడ్డి
  • సంగీతం - జె.బి.
  • ఎడిటింగ్ - ఎస్. బి. ఉద్దవ్

పాటలు

మార్చు

ఈ సినిమాకి జె.బి. సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో పచ్చని కాపురం సినిమాలోని వెన్నెలైనా పాటని పునః ఉపయోగించారు. 2013 ఏప్రిల్ 12న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ఘట్టమనేని కృష్ణ మరియూ ఘట్టమనేని మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.[2]

పాట గానం రచన
ఐ జస్ట్ లవ్ యూ బేబీ లిప్సిక, రేవంత్ కె. శ్యామ్
వెన్నెలైనా చీకటైనా మాళవిక, రేవంత్ వేటూరి సుందరరామ మూర్తి
ప్రేమకథా చిత్రమిది రాహుల్ సిప్లిగంజ్ ఎ. కరుణాకర్
కొత్తగున్నా హాయే నువ్వా దీపు, రమ్య బెహ్రా కె. శ్యామ్
ఓ మై లవ్ లిప్సిక కె. శ్యామ్

విమర్శకుల స్పందన

మార్చు

ప్రేమకథా చిత్రమ్ విమర్శకుల నుంచి సానుకుల స్పందనను సంపాదించింది.

123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "మనషుల ఎమోషన్స్ కి మూలం హాస్యం, హర్రర్, రొమాన్స్ లను చెబుతారు. ఈ మూడింటిని సమర్ధవంతంగా డీల్ చేస్తే ప్రేక్షకులకి కథ ఈజీ గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి ‘ప్రేమ కథా చిత్రమ్’ అనే టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా సెకండాఫ్ థ్రిల్లింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమాని చూడటం మిస్ కాకండి ఫ్రెండ్స్" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.[3] వన్ ఇండియా వారు తమ సమీక్షలో "నిరాశ పరచని థ్రిల్లర్ మిక్స్ చేసిన హర్రర్ కామెడీగా ఈ చిత్రం నిలిచిపోతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగుని ఇచ్చారు.[4] గ్రేట్ అంధ్ర వారు తమ సమీక్షలో "ప్రేమకథా చిత్రమ్ ఒక ‘ప్రేత’కథా హాస్యమ్. హారర్, కామెడీ, రొమాన్స్ మిళితమైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని అందుకునే లక్షణాలు అయితే పుష్కలంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగుని ఇచ్చారు.[5] ఏపీహెరాల్డ్ వారు తమ సమీక్షలో "ప్రేమకథా చిత్రమ్ అనే బదులు ప్రేమకథా కామెడి చిత్రం అనిపించింది. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా. హారర్ కథాంశంతో నలుగురితోనే సినిమాను ఇంత కామేడీగా సినిమా తీయగలం అని చూపించిన సినిమా" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగుని ఇచ్చారు.[6] తెలుగువిశేష్.కామ్ వారు తమ సమీక్షలో "ఈ "ప్రేమ కథా చిత్రం". ఎక్కడా బోర్ కొట్టకుండా అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ హాయిగా సాగిపోతుంది. ఈ వేసవి సీజన్ ని ఓ మంచి సినిమాతో ముగించాలనుకునే సినిమా ప్రేమికులకు ‘ప్రేమకథా హాస్యమ్ ’ బాగా పనికొస్తుంది." అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగుని ఇచ్చారు.[7]

ఇతర విషయాలు

మార్చు
  • ఈ సినిమాని 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తే మొదటి రోజే ఈ సినిమా 3.4 కోట్ల రూపాయల వసూళ్ళను సాహించి వారం తిరగక ముందే దాదాపు 10 కోట్ల రూపాయల వసూళ్ళను సాధించింది.
  • ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించినా బూతు సినిమాల డైరెక్టరుగా పేరుపొందిన మారుతి ఈ సినిమాకి కథ, కథనంతో పాటు దర్శకత్వపర్యవేక్షణ వహించారు. ఈ సినిమా విజయంతో మారుతి ఆ నిందలనుంచి బయటపడ్డారు.[8]
  • ఈ సినిమా తమిళ్ పునః నిర్మాణ హక్కులు 80 లక్షల రూపాయలుకు మరియూ హిందీ పునః నిర్మాణ హక్కులు కోటి రూపాయలకు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారు కొనుగోలు చేసారు. కన్నడ, భోజుపురి, మలయాళం పునః నిర్మాణ హక్కులు మొత్తం కోటి రూపాయలు దాటి అమ్ముడుపోయాయి. తద్వారా తెలుగులో ఒక చిన్న సినిమా సాధించిన అతిగొప్ప సంఘటనగా అప్పట్లో చెప్పుకునేవారు.[9]
  • ఈ సినిమా 2013 జూలై 26న 53 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకుంది.[10]

మూలాలు

మార్చు
  1. "ముస్తాబవుతున్న "ప్రేమకథా చిత్రమ్"". వార్త.కామ్. Retrieved 1 May 2013.[permanent dead link]
  2. "'ప్రేమ కథాచిత్రమ్' పాటలు". ఆంధ్రభూమి. Retrieved 14 April 2013.[permanent dead link]
  3. "సమీక్ష : ప్రేమ కథా చిత్రమ్ – ఎంటర్టైనింగ్ గా సాగే థ్రిల్లర్". 123తెలుగు.కామ్. Retrieved 11 May 2013.
  4. "నవ్వుతూ..భయపడతూ....('ప్రేమ కథా చిత్రమ్‌'రివ్యూ)". వన్ ఇండియా. Retrieved 11 May 2013.
  5. "సినిమా రివ్యూ: ప్రేమకథా చిత్రమ్". గ్రేట్ అంధ్ర. Archived from the original on 2013-06-14. Retrieved 11 May 2013.
  6. "ప్రేమకథా చిత్రమ్ : రివ్యూ". ఏపీహెరాల్డ్.కామ్. Retrieved 11 May 2013.
  7. "సినిమా రివ్యూ: ప్రేమకథా చిత్రమ్". తెలుగువిశేష్.కామ్. Retrieved 11 May 2013.
  8. "'ప్రేమకథా చిత్రమ్'తో బూతు చిత్రాల నుంచి బయటపడ్డా". వెబ్ దునియా తెలుగు. Retrieved 13 June 2013.
  9. "ఆ "చిత్రమ్" ప్రాఫిట్స్‌తో ప్రకంపనలు !". తెలుగువన్.కామ్. Retrieved 2 July 2013.
  10. "ప్రేమకథా చిత్రమ్ 50 రోజుల పండగ". సాక్షి.కామ్. Retrieved 27 July 2013.