వేటూరి సుందరరామ్మూర్తి
వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 - మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద[1] శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 6నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.[2]
వేటూరి సుందరరామ్మూర్తి | |
---|---|
జననం | వేటూరి సుందరరామ్మూర్తి 1936 జనవరి 29 పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా |
మరణం | 2010 మే 22 హైదరాబాదు | (వయసు 74)
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
ఇతర పేర్లు | వేటూరి |
వృత్తి | సినీ గీత రచయిత పాత్రికేయుడు (పూర్వం) |
మతం | బ్రాహ్మణ హిందూ |
భార్య / భర్త | సీతామహాలక్ష్మి |
పిల్లలు | ముగ్గురు కుమారులు |
జీవిత విశేషాలు
వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు.[3] మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.[4]
సినీ ప్రస్థానం
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్, ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన, నాదవినోదము....
పుస్తకాలు, ప్రచురణలు
పుస్తకం ముఖ చిత్రం | ఇతర వివరాలు |
---|---|
| |
|
పురస్కారాలు
మూడు దశాబ్దాల కెరిర్‌లో ఆరు నందులు వేటూరికి దక్కాయి.
సినీ గేయాల పట్టిక
1970వ దశకం
- ఓ సీత కథ (1974) (పాట: భారతనారీ చిత్రము (హరికథ))
- అడవి రాముడు (1974) (పాటలు: కృషి ఉంటే మనుషులు, అమ్మతోడూ అబ్బతోడూ నీ తోడూ నాతోడూ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ ఎన్నెల్లే తిరిగొచ్చే మాకళ్ళకూ, ఆరేసుకోబోయి పారేసుకున్నాను, కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చూడర చూడర చూడర ఒక చూపూ ఓ సులెమాన్ లియా)
- పంతులమ్మ (1978) (పాట: మానస వీణ మధుగీతం)
- సిరి సిరి మువ్వ (1978) (పాటలు: అందానికి అందం, ఎవరికెవరు ఈ లోకంలో, గజ్జె ఘల్లుమంటుంటే, ఝుమ్మంది నాదం సై అంది పాదం, మా ఊరి దేవుడమ్మా, ఒడుపున్న పిలుపు, రా దిగి రా దివి నుంచి భువికి దిగి రా)
- గోరింటాకు (1979 సినిమా) (1979) (పాట: కొమ్మ కొమ్మకో సన్నాయి)
- శంకరాభరణం (1979) (పాటలు: ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము, దొరకునా ఇటువంటి సేవ, రాగం తానం పల్లవి, శంకరా నాదశరీరాపరా)
1980వ దశకం
- మంచు పల్లకి (1982) (పాటలు:మేఘమా దేహమా ఉరమకే ఈ క్షణం)
- శుభలేఖ (సినిమా) (1982) (పాట: రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా)
- ఖైదీ (1983)
- మంత్రిగారి వియ్యంకుడు (1983) (పాటలు: మనసా శిరసా నీ నామమే పాడెద ఈ వేళ, కోకోనట్ మనకు దోస్తీ ఒకటే జాస్తి రా, జబర్దస్తీ చేస్తే నాస్తి రా, ఛీ ఛీపో పాపా ఒప్పులకుప్పా, బెక బెక బావురు కప్ప, కొలువైనాడే ఊరికి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే , ఏమని నీ చెలి పాడెదనూ, సలసలా నను కవ్వించవేల మిలమిలా)
- మేఘ సందేశం (సినిమా) (1983) (పాటలు: ఆకాశ దేశాన ఆషాఢ మాసాన, పాడనా వాణి కళ్యాణిగా గానం)
- ముందడుగు (1983 సినిమా) (1983)
- సితార (సినిమా) (1983) (పాటలు: అర్జున మంత్రం అపురూప, కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, కుక్కు కూ .. కుక్కు కూ, జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, నీ గానం, వెన్నెల్లో గోదారి అందం
- రుస్తుం (1984)
- అగ్ని పర్వతం (1985) (పాటలు: అగ్ని పర్వతం, ఈ గాలిలో)
- అన్వేషణ (1985) (పాటలు: ఎదలో లయ, కీరవాణి, ఏకాంత వేళ, ఇలలో కలసి)
- కృష్ణ గారడీ (1986) (అన్ని పాటలు)
- చంటబ్బాయి (1986) (పాటలు: ఉత్తరాన లేవన్నది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవన్నది మలయమారుతం, హరిలో రంగ హరీ, అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను )
- పడమటి సంధ్యారాగం (1986) (పాట: ఈ తూరుపు ఈ పశ్చిమం)
- ప్రతిఘటన (1986) (పాటలు: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, వయసు , హెచ్చరిక ఓ హెచ్చరిక )
- అనసూయమ్మ గారి అల్లుడు (1986) (అన్ని పాటలు)
- ఆఖరి పోరాటం (1988) (పాటలు: తెల్ల చీరకు, ఎప్పుడు ఎప్పుడు)
- మరణ మృదంగం (1988) (పాట: కరిగిపోయాను కర్పూర వీణలా)
- గీతాంజలి (1989) (పాటలు: జల్లంత కవ్వింత కావాలిలే, నందికొండ వాగుల్లో, జగడ జగడ జగడం, ఓం నమః నయన శృతులకు, ఓ పాపా లాలి, ఆమనీ పాడవే హాయిగా)
1990వ దశకం
- జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) (పాటలు: అబ్బనీ తియ్యనీ దెబ్బ, మన భారతంలో, అందాలలో అహో మహోదయం, జై చిరంజీవా! జగదేకవీరా!, యమహో నీ యమా యమా అందం, ప్రియతమా, నను పలకరించు ప్రణయమా, ధినక్కుతా కసక్కురో)
- ఆయుధం (1990) - అన్ని పాటలు
- చంటి (1991) (పాటలు: పావురానికి పంజరానికి, ఇది తైలం పెట్టి , ఎన్నెన్నో అందాలు , ఓ ప్రేమా నా ప్రేమా, జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే)
- గ్యాంగ్ లీడర్ (1991) (పాటలు: పాలబుగ్గ , వయసు వయసు )
- నిర్ణయం (1991) (పాటలు: మిల మిల మెరిసెను తారా)
- ధర్మ క్షేత్రం (1992) (పాటలు: కొరమీను కోమలం)
- ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992) (పాటలు:నువ్వు మల్లె తీగ, పరువాల కోడి, మండూరి ఆంబోతు, ఆ వద్దు ఈ వద్దు, ఉమ్మ కావాలి, కందిరీగ నడుము దాని)
- సుందరకాండ (1992) (పాటలు: ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకు, కోకిలమ్మ కొత్త పాట పాడిందీ, సుందరాకాండకు సందడే సందడి , ఇంకా ఇంకా, అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ , ఉలికిపడకు )
- గోవిందా గోవిందా (1993) (పాటలు: ఓ నవీన, ఇందిర మందిర సుందర తార )
- మాతృదేవోభవ (1993) (పాటలు: రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వేణువై వచ్చాను భువనానికి , కన్నీటి కాలువలు , రాగం అనురాగం)
- మెకానిక్ అల్లుడు (1993)
- సూపర్ పోలీస్ (1994)
- రాముడొచ్చాడు (1996) (పాటలు: మా పల్లె రేపల్లంట, గుమ్మ గుమ్మ ముద్దు గుమ్మ, వారెవా, గువ్వ కూసె పువ్వు పూసె, శృంగార కావ్యాల )
- ఇద్దరు (1997),
- శీను (1997) (పాటలు: ఏమని చెప్పను ప్రేమా .. ఎగిరే చిలకమ్మా , ఏ కొమ్మకాకొమ్మ )
- రావోయి చందమామ (1999) (పాటలు: నంద నందనా, జగడం జవానీ, స్వప్న వేణువేదో, మల్లెపువ్వా, లేత లేత, లవ్ టు లివ్, ఝుమ్మని ఝుమ్మని)
2000వ దశకం
- బద్రి (2000) (పాటలు: వేవేల మైనాల గానం చలి పిడుగుల్లో)
- అన్నయ్య (2000) (పాటలు: హిమసీమల్లో, గుసగుసలే, వాలా వల్లప్ప)
- సఖి (2000) (పాటలు: సఖియా చెలియా, అలై పొంగెరా కన్నా, కాయ్ లవ్ చెడుగుడు, కలలై పోయెను నా ప్రేమలు, స్నేహితుడా స్నేహితుడా, సెప్టెంబరు మాసం సెప్టెంబరు మాసం, ఏడే ఏడే వయ్యారి వరుడు)
- బావ నచ్చాడు (2001) (పాట: అక్కా బావ నచ్చాడా)
- మృగరాజు (సినిమా) (2001) (పాటలు: రామయ్య పాదాలెట్టి, శతమనమన్నదిలే, యేలే యేలాలమ్మ)
- రూపాయి (2001) (పాటలు: భారతదేశం భూమికి స్వర్గం,శ్రీవారికే సిగ్గాయనా,బాలా బంగారం బుగ్గాల్లో మందారం)
- ఇంద్ర (సినిమా) (2002) (పాట: అమ్మడూ అప్పచ్చి)
- ఠాగూర్ (సినిమా) (2003) (పాట: మన్మధా మన్మధా మామ పుత్రుడా)
- సింహాద్రి (సినిమా) (2003)
- ఆనంద్ (సినిమా) (2004) (పాటలు: వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా, యమునాతీరం, నువ్వేనా నా నువ్వేనా, చారుమతీ ఐ లవ్ యూ, తెలిసి తెలిసి వలలో పడినె మనసు, యదలో గానం)
- అర్జున్ (2004 సినిమా) (2004) (పాట: మధుర మధుర మీనాక్షీ)
- ఆర్య (సినిమా) (2004)
- యువ (march,2004)
- ఛత్రపతి (సినిమా) (2005)
- గోదావరి (సినిమా) (2006) (lyrics: ఉప్పొంగెలే గోదావరి)
- సైనికుడు (2006)
- మధుమాసం (2007)
- హ్యాపీ డేస్ (2007)
- దశావతారం (2008)
- కంత్రి (సినిమా) (2008) (పాట: వయస్సునామి తాకెనమ్మీ)
- సుందరకాండ (2008 సినిమా) (2008)
- సూర్య s/o కృష్ణన్ (2008)
- బెండు అప్పారావు RMP (2009)
- వరుడు (2010) (అన్ని పాటలు)
- లీడర్ (2010 సినిమా)(2010)
- విలన్ (2010)
ఆఖరి సినిమా
- బద్రీనాధ్ (సినిమా) (2011) (ఓంకారేశ్వరి)
వేటూరి పై ప్రముఖుల అభిప్రాయాలు:
- గానం కోరుకునే గీతం వేటూరి - గాయకుడు కోరుకునే కవి వేటూరి—మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- యాభై సంవత్సరాలు పైబడిన నా సినీ జీవిత ప్రయాణంలో నాకు తారసపడిన మహాకవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కణ్ణదాసన్ ఇంకొకరు వేటూరి- 'రాజన్-నాగేంద్ర'
- "పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే! నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే"—సిరివెన్నెల సీతారామశాస్త్రి
- "మొదటిసారి వేటూరి గారిని అనుకోకుండా చూసినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టేసి శరీరం వణికి పోయింది. ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి...”గోపికలు కృష్ణుని అవ్వాక్కయి అలా చూస్తూ ఉండిపోయారని పోతన గారు రాస్తే అతిశయోక్తి అనుకున్నానండి. కానీ ఇప్పుడు మీ ముందు నిలుచున్న నా పరిస్థితి అదే!" అని చెప్పి వచ్చేశాను". -- సిరివెన్నెల సీతారామశాస్త్రి
వేటూరి వారిపాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర, నా
పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరేనంది నవ్వి వెంకటరమణా!
- సినీలాకాశంలో ఇంద్రధనుష్పాణి వేటూరి - విఖ్యాత విమర్శకుడు ఎమ్వీయల్
మరణం
75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.
ఇవి కూడా చూడండి
పాటల పూదోట వేటూరి - రంజని తెలుగు సాహితీ సమితి ప్రచురణ
బయటి లింకులు
మూలాలు
- ↑ ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి తెలుగు సినిమా పాట Archived 2013-12-30 at the Wayback Machine ఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి... వేటూరి...జూన్ 21,2008న సేకరించబడినది.
- ↑ ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010
- ↑ వార్త దినపత్రిక, తేది 23-05-2010
- ↑ ఈనాడు దినపత్రిక తేది 23-05-2010
- ↑ 5.0 5.1 ఏ.వి.కె.ఎఫ్.ఫౌండేషన్ వారి అధికారిక వెబ్సైట్ నుండి వేటూరి సుందరరామ్మూర్తి వారి రచనల పుస్తకాల వివరాలుజూన్ 21,2008న సేకరించబడినది.