ప్రేమ్ నజీర్

భారత నటుడు
(ప్రేమ్‌ నజీర్ నుండి దారిమార్పు చెందింది)

ప్రేమ్‌ నజీర్ (అసలు పేరు అబ్దుల్ ఖాదర్ 07 ఏప్రిల్ 1926 – 16 జనవరి 1989)[1] ఒక భారతీయ చలనచిత్ర నటుడు. ఇతడు "నిత్య హరిత నాయకన్"(ఎవర్ గ్రీన్ హీరో)గా పేర్కొనబడ్డాడు. ఇతడు రంగస్థల నటుడిగా మొదలై 1952లో తొలి సినిమాలో నటించి మూడు దశాబ్దాలకు పైగా మలయాళ సినిమాలలో నటించాడు.

ప్రేమ్‌ నజీర్
జననం
అబ్దుల్ ఖాదర్

(1926-04-07)1926 ఏప్రిల్ 7
చిరయింకీళు, ట్రావన్కోర్
(ప్రస్తుతం కేరళ రాష్ట్రం, భారతదేశం)
మరణం1989 జనవరి 16(1989-01-16) (వయసు 59)
మరణ కారణంమీజిల్స్
సమాధి స్థలంచిరయింకీళు, అత్తింగల్
కేరళ, భారతదేశం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లునిత్యహరిత నాయకన్
(ఎవర్‌గ్రీన్ హీరో)
విద్యాసంస్థఎస్.బి.కాలేజి
చంగనస్సేరి, ఎస్.డి.కాలేజి,ఆలప్పుళా
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1952–1988
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మలయాళ సినిమాలు
జీవిత భాగస్వామిహబీబా బీవీ
పిల్లలులైలా, రసియా, రీటా, షానవాజ్
తల్లిదండ్రులుషాహుల్ హమీద్
ఆస్మాబీవీ
పురస్కారాలుపద్మ భూషణ్ (1983)

ఇతడు రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించాడు. మొదటిది 725 సినిమాలలో నాయకునిగా నటించడం[2][3] అయితే రెండవ రికార్డు ఒకే నటి (షీలా)తో కలసి 130 సినిమాలలో నటించడం.[4][5]

భారత ప్రభుత్వం ఇతడు కళారంగానికి చేసిన సేవలకు గుర్తుగా పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.[6]

ఆరంభ జీవితం మార్చు

ప్రేమ్‌ నజీర్ ట్రావన్కోర్ సంస్థానం (ప్రస్తుతం కేరళ రాష్ట్రం)లోని చిరయింకీళు గ్రామంలో అక్కోడ్ షాహుల్ హమీద్, ఆస్మా బీవీ దంపతులకు 1926, ఏప్రిల్ 7వ తేదీన జన్మించాడు. ఇతనికి ఇరువురు సోదరులు ప్రేమ్‌ నవాజ్, అష్రాఫ్, ఆరుగురు అక్కచెల్లెళ్లు సులేఖ, అలీఫా, అనీసా, ఉమైబా, సునైసా, సుహారా ఉన్నారు.[7] ఇతని తల్లి ఇతని పసి వయసులోనే మరణించగా ఇతని తండ్రి అదే పేరుగల స్త్రీని రెండవ వివాహం చేసుకున్నాడు. ఇతడు సాధారణ విద్యను కడినంకులం లోయర్ ప్రైమరీ స్కూల్, శ్రీ చితిరవిలాసం స్కూల్, ఎస్.డి కాలేజ్ ఆలప్పుళా, సెయింట్ బెర్చ్‌మన్స్ కాలేజ్ చంగనస్సేరి లలో చదివాడు. ఇతని విద్య పూర్తి అయ్యే సమయానికి గొప్ప రంగస్థల నటుడిగా పేరు సంపాదించాడు. ఇతని రెండవ సినిమా తీసే సమయంలో ఆ సినిమా దర్శకుడు తిక్కురుసి సుకుమారన్ నాయర్ ఇతని పేరును అబ్దుల్ ఖాదర్ నుండి ప్రేమ్‌ నజీర్‌గా మార్చాడు.

వృత్తి మార్చు

 
తన మిత్రులతో ప్రేమ్‌ నజీర్.

ఇతడు చంగనస్సేరి ఎస్.బి.కాలోజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు 1951లో తొలి సారి ది మర్చెంట్ ఆఫ్ వెనీస్ నాటకంలో షైలాక్‌ పాత్రను నటించడంతో నట జీవితాన్ని ప్రారంభించాడు. ఆ పాత్రకు అతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఇతని తొలి సినిమా మారుమకళ్ 1952లో విడుదలయ్యింది. ఇతడు 1950లోనే త్యాగసీమ అనే సినిమాలో పనిచేశాడు కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇతడు తన జీవితంలో మొత్తం 700కు పైగా మలయాళ చిత్రాలు, 55 తమిళ చిత్రాలు, 7 తెలుగు చిత్రాలు, 2 కన్నడ సినిమాలలో నటించాడు. ఇతని చివరి సినిమా ధ్వని 1988లో విడుదలయ్యింది. ఇతడు షీలా, జయభారతి, శారద, ఆడూర్ బాసీ, జయన్, సుకుమారన్, సోమన్, మోహన్, మోహన్‌లాల్ వంటి నటీనటులతో కలిసి పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

కుటుంబం మార్చు

ఇతడు హబీబా బీవీని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కూతుళ్ళు, లైలా, రసియా, రీటా ఒక కుమారుడు షానవాజ్ కలిగారు. ఇతని కుమారుడు షానవాజ్ కొన్ని మలయాళ సినిమాలలో నటించాడు కానీ తండ్రిలా రాణించలేకపోయాడు. షానవాజ్ కుమారుడు షమీర్ ఖాన్ కూడా సినిమా నటుడే. ప్రేమ్‌ నజీర్ తమ్ముడు ప్రేమ్‌ నవాజ్ (అబ్దుల్ వహాబ్), అతని కుమారుడు ప్రేమ్‌ కిషోర్‌లు కూడా సినిమాలలో నటించారు. వీరెవరూ ప్రేమ్‌ నజీర్ సినీ వారసత్వాన్ని కొనసాగించలేక పోయారు. ప్రేమ్‌ నజీర్ కొన్ని సినిమాలను నిర్మించాడు.

సమాజసేవ మార్చు

ఇతడు మద్యాన్ని ముట్టుకోలేదు. ఇతడు రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ ఎప్పుడూ ఎన్నికలలో నిలబడలేదు. ఇతనిది సేవా దృక్పథం. ఎందరికో సహాయం చేశాడు. తన స్వగ్రామం పరిసరాలలో కొన్ని సామాజిక అవసరాలకు ఇతడు ఇతోధికమైన ధన సహాయం చేశాడు. కుంతల్లూర్ స్కూలు (తరువాత ఇతని జ్ఞాపకార్థం ప్రేమ్‌ నజీర్ మెమోరియల్ గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్‌గా పేరు మార్చబడింది.), చిరయింకీళు ఆసుపత్రి, పాలకున్ను లైబ్రరీ ఇతడు సహాయం చేసిన వాటిలో కొన్ని. చిరయింకీళు లోని శర్కరాదేవి దేవాలయానికి ఇతడు ఒక ఏనుగును బహూకరించాడు. ఇతడు తను నటించిన సినిమా పాత్రలపై ఎన్నె తెడియాత కథాపత్రగళ్ అనే పుస్తకాన్ని వ్రాశాడు.

మరణం మార్చు

ఇతడు 1989, జనవరి 16వ తేదీ మద్రాసులోని ఒక ఆసుపత్రిలో మీజిల్స్ వ్యాధికి చికిత్స పొందుతూ మరణించాడు.[8]

అవార్డులు మార్చు

 
పద్మశ్రీపురస్కారం
  • ఇతడు కేరళ 1981లో కేరళ రాష్ట్ర స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుపొందాడు.
  • 1983లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును స్వీకరించాడు.
  • 1985లో 33వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కమిటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

రికార్డులు మార్చు

  • అత్యధిక చలనచిత్రాలలో (725 సినిమాలలో) కథానాయకుని పాత్ర ధరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
  • ఒకే నటి (శీల)తో 107 సినిమాలలో కలిసి నటించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.[9]
  • ఒకే ఏడాది (1979)లో అత్యధిక సినిమాలలో అనగా 39 సినిమాలలో ప్రధాన పాత్రలో నటించాడు.
  • అత్యధికంగా 89 మంది హీరోయిన్లతో కలిసి పనిచేశాడు.
  • మలయాళ చిత్రాలలో అత్యధికంగా 33 సినిమాలలో ద్విపాత్రాభినయం చేశాడు.

ఫిల్మోగ్రఫీ మార్చు

ఇతడు నటించిన తెలుగు సినిమా వివరాలు

క్రమ సంఖ్య. సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు వివరాలు
1 1952 ఆకలి తెలుగులో తొలి సినిమా, "విషప్పింటే విలి" సినిమాకు డబ్బింగ్
2 1953 తండ్రి "ఆచన్" సినిమా డబ్బింగ్
3 1956 సి.ఐ.డి. "సి.ఐ.డి" మలయాళ సినిమా డబ్బింగ్
4 1959 మంత్రవాది డబ్బింగ్ సినిమా
5 1961 సీత శ్రీరాముడు డబ్బింగ్ సినిమా
6 1966 అడవి పిల్ల డబ్బింగ్ సినిమా
7 1967 ముళ్ళ కిరీటం డబ్బింగ్ సినిమా

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-03. Retrieved 2017-09-23.
  2. Kisan World. Sakthi Sugars, Limited. 1989.
  3. "Magic of Sophia Loren" Archived 2003-11-30 at the Wayback Machine. The Hindu (2 November 2003). Retrieved 3 December 2011.
  4. Guinness World Records 2001. Guinness World Records. p. 91. ISBN 0553583751.
  5. Sheela's comeback Archived 2011-07-13 at the Wayback Machine. The Hindu. 05/01/2004. Retrieved 3 December 2011.
  6. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.
  7. "Narration about Prem Nazir at the end of movie". amritatv.com. Retrieved 2 April 2015.
  8. Lalita Dileep (15 February 1989). "A sad end". India Today. Retrieved 26 October 2015.
  9. నమస్తే తెలంగాణ, సినిమా (28 April 2020). "గిన్నిస్‌ రికార్డ్‌..107 సినిమాల్లో కలిసి నటించిన జంట". ntnews. Archived from the original on 28 ఏప్రిల్ 2020. Retrieved 28 April 2020.

బయటి లింకులు మార్చు