ప్లూటో

సౌర వ్యవస్థలోని మరుగుజ్జు గ్రహం

ప్లూటో (Pluto; చిహ్నాలు: ⯓[6] లేదా ♇[7]) సౌర కుటుంబం లోని అతిపెద్ద మరుగుజ్జు గ్రహాల్లో ఎరిస్ తరువాత రెండవది. సూర్యుని చుట్టూ పరిభ్రమించే అతిపెద్ద ఖగోళ వస్తువుల్లో దీనిది 10 వ స్థానం. కైపర్ బెల్ట్ లో ఉన్న వస్తువుల్లో ఇదే అతి పెద్దది.[8] 1930 లో ప్లూటోను కనుగొన్నపుడు, దాన్ని సౌరకుటుంబం లోని తొమ్మిదవ గ్రహంగా పరిగణించారు. 1990 లో ప్లూటో పరిమాణంలో ఉన్న అనేక ఇతర ఖగోళ వస్తువులను సౌర కుంటుంబంలో కనుక్కోవడం మొదలయ్యాక, దాని గ్రహం హోదా విషయమై ప్రశ్నలు తలెత్తాయి. 2006 లో ఇంటర్నేషనల్ ఏస్ట్రనామికల్ యూనియన్ గ్రహానికి చెప్పిన నిర్వచనంతో ప్లూటో హోదా ఒక గ్రహంగా కాక, ఒక మరుగుజ్జు గ్రహంగా మారిపోయింది. సూర్యుని చుట్టూ తిరిగే తన కక్ష్యలో ప్లూటో సూర్యునికి నెప్ట్యూన్ గ్రహం కంటే దగ్గరగా వస్తుంది. అంటే ప్లూటో కక్ష్య నెప్ట్యూన్ కక్ష్యను ఖండిస్తుంది. అయితే ఈ రెండు గ్రహాల కక్ష్యల మధ్య ఉన్న అనుకంపన స్థిరత్వం కారణంగా అవి ఢీకొనవు.

ప్లూటో ⯓

ప్లూటో
Discovery
Discovered by: Clyde W. Tombaugh
Discovery date: ఫిబ్రవరి 18 1930
MPC designation:134340 Pluto
Minor planet category: మరుగుజ్జు గ్రహం
కక్ష్యా లక్షణాలు
Epoch J2000
అపహేళి: 7,375,927,931 km
49.30503287 AU
పరిహేళి: 4,436,824,613 km
29.65834067 AU
Semi-major axis: 5,906,376,272 km
39.48168677 AU
అసమకేంద్రత (Eccentricity): 0.24880766
కక్ష్యా వ్యవధి: 90,613.3055 day
248.09 yr
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: 366.73 day
సగటు కక్ష్యా వేగం: 4.666 km/s
వాలు: 17.14175°
11.88° to Sun's equator
Longitude of ascending node: 110.30347°
Argument of perihelion: 113.76329°
దీని ఉపగ్రహాలు: సహజసిద్ధమైన 3 చంద్రులు
భౌతిక లక్షణాలు
సగటు వ్యాసార్థం: 1,195 km[1]
0.19 Earths
ఉపరితల వైశాల్యం: 1.795×107 km²
0.033 Earths
ఘనపరిమాణం: 7.15×109 km³
0.0066 Earths
ద్రవ్యరాశి: (1.305 ± 0.007)×1022 kg[2]
0.0021 Earths
సగటు సాంద్రత: 2.03 ± 0.06 g/cm³[2]
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 0.58 m/s²
0.059 g
పలాయన వేగం: 1.2 km/s
సైడిరియల్ రోజు: −6.387230 day
6 d 9 h 17 m 36 s
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 47.18 km/h
అక్షాంశ వాలు: 119.591 ± 0.014° (to orbit)[2][3]
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 133.046 ± 0.014°[2]
డిక్లనేషన్: -6.145 ± 0.014°[2]
అల్బిడో: 0.49–0.66 (varies by 35%)[1][4]
ఉపరితల ఉష్ణోగ్రత:
   కెల్విన్
కనిష్ఠసగటుగరిష్ఠ
33 K44 K55 K
Apparent magnitude: up to 13.65 (mean is 15.1)[1]
Angular size: 0.065" to 0.115"[1][5]
విశేషాలు: ప్లూటోనియన్
వాతావరణం
ఉపరితల పీడనం: 0.30 Pa (summer maximum)
సమ్మేళనం: నైట్రోజన్, మీథేన్

ప్లూటో, దాని పెద్ద ఉపగ్రహం కేరన్, (Charon) లను కలిపి బైనరీ వ్యవస్థగా అభివర్ణిస్తారు.[9] ఎందుకంటే ఈ రెండింటికీ ఉండే బేరీసెంటరు ఏ ఒక్క గ్రహం లోపల కూడా ఉండక, రెంటికీ బయట ఉంటుంది. ఆ బిదువు చుట్టూనే ఈ రెండూ తిరుగుతూంటాయి.

ప్లూటో చరిత్ర

మార్చు

1. యూరెనస్‌

మార్చు

సా. శ. 1781 లో శని గ్రహానికి అవతల మరో గ్రహం ఉందని విలియం హెర్షెల్ (William Herschell) కనుక్కున్నప్పుడు వార్తాపత్రికలలో అదొక పతాక శీర్షిక అయిపోయింది. అంతవరకు ఖగోళశాస్త్ర వేత్తలకి తెలిసిన గ్రహాలు ఆరు మాత్రమే: బుధ, శుక్ర, భూ, కుజ, గురు, శని గ్రహాలు.

హెర్షెల్ కొత్తగా కనుక్కున్న గ్రహానికి యూరెనస్ (యురేనస్ కాదు, దీర్ఘం ‘యు’ మీద, ‘ర’ మీద కాదు అని కారల్ సేగన్ పదే పదే చెప్పేవాడు) అని పేరు పెట్టేరు. దీనికి భారతీయులు వరుణుడు అని పేరు పెట్టేరు.

యూరెనస్ ఉనికి మనకి తెలియని రోజులలో, భూమి మీద ఉన్న మనకి మన ఆకాశంలో కదలాడుతూ కనబడే నభోమూర్తులు ఎనిమిది. అవి పైన చెప్పిన ఆరు గ్రహాలతో పాటు సూర్యుడు (రవి), చంద్రుడు, వెరసి మొత్తం ఎనిమిది.

2. గ్రహశకలాలు

మార్చు

పూర్వం, ఖగోళశాస్త్రం పరిధిలో “గ్రహాలు ఎన్ని?” అని ఎవ్వరిని అడిగినా ఠకీమని “ఆరు” అని నిర్మొహమాటంగా సమాధానం వచ్చేది. ఎందుకంటే హెర్‌షెల్ కాలం వరకు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఆరే ఆరు గ్రహాలు కంటికి కనిపించేవి. మన దృష్టికి ఆననంత దూరంలో మరో గ్రహం ఉందని చెప్పేసరికి అదొక నమ్మశక్యం కాని నిజం అయి కూర్చుంది.

ఆరుకి ఏమీ ప్రత్యేకత, పవిత్రత లేదని తెలిసిన తరువాత ఏడుకి మాత్రం ఎందుకు? అందుకని యూరెనస్ అవతల మరో గ్రహం ఉండొచ్చేమో అని అనుమానం వచ్చింది. ఆకాశంలో దుర్భిణితో వెతుకుతూ ఉంటే, సా. శ. 1801 జనవరి ఒకటో తేదీన, మరొక నభోమూర్తి కనిపించింది – కుజ గ్రహానికి, గురు గ్రహానికి మధ్య ఉన్న జాగాలో దానికి సీరీస్ (Ceres) అని పేరు పెట్టేరు. మరి కొద్ది సంవత్సరాలలో సీరీస్ పేరు పాఠ్య పుస్తకాలలో నమోదు అయిపోయింది. అంతే కాదు. మరో రెండేళ్లల్లో ఒక కొత్త రసాయన మూలకం ఉనికి కనుక్కున్నప్పుడు, తర్జనభర్జనలు లేకుండా ఆ మూలకానికి, సీరీస్ గౌరవార్థం సీరియం (Cerium) అని పేరు పెట్టేసేరు.

సీరీస్‌ని కనుక్కున తరువాత సంవత్సరంలో మరొక “గ్రహం” కనబడింది. ఈ తొమ్మిదో గ్రహానికి పల్లాస్ (Pallas) అని పేరు పెట్టేరు. సా. శ. 1803 లో మరొక కొత్త రసాయన మూలకం కనుగొన్నప్పుడు దానికి – ఇంకా ఆలోచన ఎందుకు – పల్లాస్ గౌరవార్థం పెల్లేడియం (Palladium) అని పేరు పెట్టేసేరు. ఈ పల్లాస్ వెలిసిన వేళా విశేషం ఏమిటో కాని, “మారకం”తో పుట్టినట్లుంది. పైపెచ్చు దీని “గ్రహచార దోషం” వల్ల సీరీస్‌కి కూడా మారకం తీసుకొచ్చింది. ఇదెలాగో చూద్దాం.

ఇంతవరకు గ్రహాలు, వాటి లక్షణాలు ఒక బాణీ ప్రకారం ఉంటూ వచ్చేయి కాని ఈ సీరీసు, పల్లాసు వరస కొంచెం భిన్నంగా కనిపించింది. ఉదాహరణకి – గ్రహాలని దుర్భిణిలో చూసినప్పుడు గుండ్రంగా చిన్ని పళ్లెం ఆకారంలో కనిపిస్తాయి (చంద్రుడు మన కంటికి కనిపించినట్టు). కాని ఈ సీరీసు, పల్లాసు మినుకు మినుకు మంటూ నక్షత్రాల వలె చుక్కలుగా కనిపించేయి కాని, గ్రహాల మాదిరి పళ్లేలలా కాదు. పోనీ ఇవి ఎంతో దూరంలో ఉండబట్టిన్నీ, మన దుర్భిణిలు మరీ శక్తిమంతం కానట్టివీను అవటం వల్ల చిన్నగా కనిపిస్తున్నాయనుకోటానికి వీలు లేదు. ఈ రెండూ కూడా భూమికి అతి సమీపంలో, కుజుడికీ, గురుడుకీ మధ్య ఉన్నాయి. అంతే కాదు. ఇంతవరకు మన జాబితాలో ఉన్న గ్రహాల మధ్య దూరాలతో పోల్చి చూస్తే ఈ రెండు దరిదాపు ఒకే కక్ష్యలో ఉన్నంత దగ్గరగా ఉన్నాయి. ఈ వికారాలన్నిటిని చూసి పెద్దలు ఇవి గ్రహాలు కావు అని తీర్మానించేరు. వీటికి ఇంగ్లీషులో ఏస్టరోయిడ్స్ (asteroids) అని పేరు పెట్టి, గ్రహాల జాబితాలోంచి తీసేసేరు. వాటి పేరు మీద ఉన్న రసాయన మూలకాల పేర్లు మాత్రం మారలేదు.

ఇక్కడ ఏస్టర్ (aster) అంటే గ్రీకు భాషలో నక్షత్రం, ఓయిడ్ (oid) అంటే “లాంటిది” అని అర్థం. కనుక ఏస్టరోయిడ్ (asteroid) అంటే “నక్షత్రం లాంటిది” అని అర్థం. కాని ఈ రెండు నక్షత్రాలలాంటివి కానే కావు; రాళ్లలాంటివి అంటే సరిపోయేది. కాని ఏస్టరోయిడ్ అన్న పేరు అతుక్కుపోయింది. కొంతమంది వీటికి గ్రహశకలాలు (ప్లేనెటోయిడ్‌స్, planetoids) అని పేరు పెట్టేరు.

3. నెప్టూన్‌, ప్లూటో

మార్చు

సా. శ. 1851 నాటికి మహాసాగరంలాంటి ఆకాశపు లోతుల్లోకి దుర్భిణి అనే గేలాన్ని వేసి వెతకగా, వెతకగా దరిదాపు ఇరవై గ్రహశకలాలు, మరొక గ్రహం కనబడ్డాయి. ఈ గ్రహం పేరే నెప్టూన్ (Neptune). దుర్భిణి సహాయంతో ఆకాశం గాలిస్తే యూరెనస్ కక్ష్యకి అవతల నెప్టూన్ కనిపించింది. రోమక పురాణాలలో నెప్టూన్ సముద్రాలకి అధిపతి. అందుకని భారతీయులు సగరుడు అని పేరు పెట్టేరు. ఈ నెప్టూన్ గౌరవార్థం మరొక రసాయన మూలకానికి నెప్టూనియం (Neptunium) అని పేరు పెట్టేరు. కావలిస్తే ఈ మూలకానికి తెలుగులో “సగరము” (తగరముతో ప్రాస కుదిరింది కదా!) అని పేరు పెట్టుకోవచ్చు!!

ఇలా ఉండగా, 1930 ఫిబ్రవరి 18 నాడు ఆకాశపు లోతుల నుండి మరో గ్రహం ఊడి పడింది. గ్రహశకలాలలా కాకుండా ఈ కొత్త గ్రహం నెప్టూన్ కి అవతల, ఇంకా చాలా దూరంలో, "మినుకు మినుకుమంటూ" దుర్భిణితో ఆకాశానికి తీసిన ఛాయా చిత్రాలలో, పెర్సివల్‌ లోల్ వేధశాలలో పని చేసే క్లైడ్‌ టాంబా అనే 24-ఏళ్ల కుర్రాడికి, కనబడింది. మిగిలిన ఎనిమిది గ్రహాలు సూర్యుడి చుట్టూ దరిదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటే ఈ కొత్త గ్రహం దీర్ఘవృత్తాకారంలో తిరుగుతోందని నిర్ధారణ చేసేరు. పైపెచ్చు ఈ కొత్త గ్రహం పరిభ్రమించే తలం, మిగిలిన గ్రహాలు అన్నీ పరిభ్రమిస్తూన్న తలంలో కాకుండా వాటన్నికి ఏటవాలుగా మరొక తలంలో ఉంది.

ఈ కొత్త గ్రహానికి ఏ పేరు పెట్టాలా అని తర్జనభర్జనలు పడ్డ తరువాత ఇంగ్లండ్‌లో వెనెసియా బర్నే అనే 11-ఏళ్ల బాలిక సూచించిన "ప్లూటో" అనే పేరుని స్థిరపరచేరు. రోమనుల పాతాళ లోకానికి అధిపతి పేరు ఇది. ప్లూటోలో మొదటి రెండు అక్షరాలు పెర్సివల్‌ లోల్ పేరులోని మొదటి రెండక్షరాలతో సరి తూగేయి కనుక పెర్సివల్‌ లోల్ వేధశాల వారు అభ్యంతరం చెప్పలేదు.

“చుక్కలా కనిపిస్తూన్న ఇది గ్రహం కాదు, ఇది కూడా గ్రహశకలమే” అన్నారు, కొందరు. కాని అప్పటికే “గ్రహశకలం” (asteroid) అన్న పేరు కుజ-గురు గ్రహాల మధ్య ఉండేవాటికే కేటాయించటం అయిపోయింది. కనుక దీనికి కొత్త పేరు పెట్టాలి, లేదా గ్రహశకలం అన్న పాత మాట నిర్వచనం మార్చాలి. “అది తోక చుక్కేమో” అన్నారు కొందరు. “తోకచుక్కలో చుక్క అలుక్కుపోయినట్లు ఉంటుంది. ఈ చుక్క ఖణిగా ఉంది. పైపెచ్చు దీనికి తోక లేదు. కనుక తోక చుక్క అనటానికి వీలు లేదు” అన్నారు మరికొందరు. ఇలా ఎటూ తేలకుండా ఉండిపోయింది దీని పరిస్థితి. ఏదో తేలే వరకు, అందాకా, దీనిని గ్రహం అనే నిర్ణయించి, ప్లూటో (Pluto) అని పిలవటం మొదలు పెట్టేరు. దీని గౌరవార్థం ఒక రసాయన మూలకానికి “ప్లూటోనియం” అని పేరు కూడా పెట్టేసేరు. సీరీస్ కీ పల్లాస్ కీ పట్టిన గతి దీనికి కూడా పట్టలేదని పిల్లలు సంతోషించేరు. మళ్లా పాత పుస్తకాలు పారేసి కొత్త పుస్తకాలు అచ్చుకొట్టేరు. గ్రహాల పేర్లు జ్ఞాపకం పెట్టుకోటానికి వీలుగా - “మై వెరీ ఎక్సలెంట్ మదర్ జస్ట్ సెర్వెడ్ అజ్ నైన్ పిజ్జాస్” (My Very Excellent Mother Just Served Us Nine Pizzas) - అని కొత్త స్పోరక వాక్యం తయారు చేసేరు. కార్టూన్ బొమ్మలలో ఒక కుక్కకి కూడా ప్లూటో అని పేరు పెట్టుకున్నారు.

4. గ్రహం అంటే ఏమిటి?

మార్చు

ఆధునిక విజ్ఞానశాస్త్రం అంటే – ఒక విధంగా - పేర్లు పెట్టటం; భావాలకి పేర్లు పెట్టటం. ఒకదానిని ఒక పేరు పెట్టి పిలుస్తున్నామంటే ఆ పేరు వెనక కచ్చితమైన భావం ఒకటి ఉంటుంది. కనుక “గ్రహం” అన్న పేరు వాడినప్పుడల్లా నాకు, మీకు, ప్రపంచం అంతటికీ ఒకే ఒక భావం స్పురించాలి; లేకపోతే నేను అనేది ఒకటి మీకు అర్థం అయేది మరొకటి.

గ్రహం అన్న మాటనే తీసుకుందాం. తెలుగులో “గ్రహం” అనగానే రెండు అర్థాలు స్పురిస్తాయి. ఒకటి, సూర్యుడి చుట్టూ తిరిగే బుధ, శుక్రాదుల వంటి నభోగోళం. రెండవది భూత, ప్రేతాదుల వంటి అదృశ్య శాల్తీ. ఈ రెండవ అర్థం ఈ రోజుల్లో ఎక్కువ వాడుకలో లేదు.

సూర్యుడి చుట్టూ తిరిగేవన్నీ గ్రహాలు కాదు. సీరీస్, పల్లాస్ వంటి గ్రహశకలాలకి గ్రహాల స్థాయి, అంతస్తు ఇవ్వలేము. అవి సూర్యుడి చుట్టూ తిరిగే నభోమూర్తులైనా అవి గ్రహాలు కావని తీర్మానించేరు. “అవి కేవలం పెద్ద రాళ్లు,” అన్నారు.

గ్రహం అన్న మాటకి నిర్వచనం చెప్పటానికి బదులు గ్రహాలు ఏమిటో ఒక జాబితా చెప్పవచ్చు. అప్పుడు “బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యూరెనస్, నెప్టూన్, ప్లూటో – ఈ తొమ్మిది గ్రహములనబడును” అని వ్యాకరణంలో సూత్రంలా చెప్పెయ్యవచ్చు.

ఈ రకం నిర్వచనాలతో ఒక చిక్కు ఉంది. “అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాంసు – ఈ అయిదు దేశాలే అణుబాంబులు పేల్చవచ్చు, అణ్వస్త్రాలని తమతమ ఆయుధాగారాలలో నిల్వ చేసుకోవచ్చు” అని తీర్మానించి ఇవే అగ్ర దేశాలు, మిగిలినవి అన్నీ బడుగు దేశాలు అంటే ఊరుకుంటున్నామా? నిర్వచనానికి అర్థం ఉండాలి, దాని వెనక తర్కం ఉండాలి. ఉదాహరణకి ప్లూటో వంటి నభోమూర్తి మరొకటి ఉంటే దానిని కూడా గ్రహాల జాబితాలో చేర్చుకోమని అడగమా?

ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహాల వరకు ఎందుకు? “గుట్ట” అని ఎప్పుడనాలి? “కొండ” అని ఎప్పుడనాలి? “పర్వతం” అని ఎప్పుడనాలి? సెలయేరు, ఏరు, నది – వీటి నిర్వచనాలు ఏమిటి? ఆస్ట్రేలియా దేశమా? ఖండమా? ఇవన్నీ నిర్వచనాలు లేకుండా సంప్రదాయానుసారంగా వాడుకునే మాటలే. కాని సంప్రదాయం అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉరుకోలేము కదా.

కనుక అందరూ ఏది ఒప్పుకుంటే అదే గ్రహం. కాని అందరూ ఏదీ ఒప్పుకోరు కదా!

5. ప్లూటో గ్రహం కాదా?

మార్చు

మరో కోణంతో చూద్దాం. గ్రహాలని వదిలేసి నక్షత్రాల సంగతి చూద్దాం. ఒరాయన్ (మృగవ్యాధుడు) రాశిలో ఉన్న ఆర్ద్రా నక్షత్రాన్ని ఇంగ్లీషులో బీటెల్‌జూస్ అంటారు. అంటే అరబ్బీలో “భారీ వ్యక్తి చంక” అని అర్ధం. ఒరాయన్ అంటే వేటగాడు. ఈ నక్షత్రం ఆ వేటగాడి చంక దగ్గర ఉంది. దీనిని “ఎచ్.డి. 39801” (HD39801) అని కూడా పిలుస్తారు. అంటే హెన్రీ డ్రేపర్ (Henry Draper) అనే ఆసామీ రాసుకున్న జాబితాలో 39801 వ నక్షత్రం. మరొకరి జాబితాలో దీని పేరు 2MASS J05551028+0724255. ఒకే నక్షత్రానికి ఇన్ని పేర్లు ఉన్నప్పుడు నభోమూర్తులని ఎవరికి తోచిన విధంగా వారు వర్గీకరించి, పేర్లు పెట్టి పిలిస్తే వచ్చిన నష్టం ఏమిటి?

వచ్చిన తంటా అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సమితి (IAU) వారితో వచ్చింది. “నక్షత్రాల ప్రసక్తి ఇప్పుడు అప్రస్తుతం కాని, ఏ గ్రహానికి ఏ పేరు పెట్టాలో, ఉపగ్రహాల పేర్లు ఎలా ఉండాలో, అసలు ఏవి గ్రహాలో, ఏవి కావో నిర్ణయించే బాధ్యత మాది” అన్నారు వీరు. అనటం అన్నారు కాని వీరికి ఎవ్వరూ పట్టం కట్టి ఆ హక్కు ఇవ్వలేదు; వారంతట వారే నియామకం చేసేసుకున్నారు. నిజానికి ఇప్పడు వాడుకలో ఉన్న గ్రహాలు వేటికీ వీరు పేరు పెట్టలేదు. కాని పెత్తనం అంకించుకున్నారు కనుక వేటికో కొన్నింటికి పేర్లు పెట్టాలి కదా. అందుకని బుధ గ్రహం మీద ఉన్న గోతులకి కవుల పేర్లు, కళాకారుల పేర్లు మాత్రమే పెట్టాలని వీరు తీర్మానించేరు. రంగారావుకి ఒక గొయ్యి, రామారావుకి ఒక గొయ్యి, సావిత్రికి మరొక గొయ్యి, శ్రీశ్రీకి ఇంకొక గొయ్యి – ఇలా కేటాయిస్తారు మనం దరఖాస్తు పడేసుకుంటే.

ఇంత గురుతర బాధ్యత తమ భుజస్కందాల మీద ఉన్నా ఆకాశంలో ఉన్న నభోమూర్తులలో వేటిని గ్రహాలు అనాలి, వేటికి ఆ మర్యాద దక్కకూడదు అన్న విషయాన్ని వీరెవరూ కూలంకషంగా ఆలోచించినట్లు లేదు. ప్లూటో ప్రసక్తి వచ్చే వరకు! అంతవరకు సందిగ్ధానికి అవకాశం రాలేదు.

ప్లూటో ప్రస్తావన వచ్చేసరికి, “ఇది మరీ నాసిగా ఉంది, దీనిని గ్రహం అనటానికి వీల్లేదు” అని కమిటీలో ఒకరు అభ్యంతరం చెబితే, “ఇది మరీ తోకచుక్కల మండలంలో ఉంది, దీనిని పోతరించిన తోకచుక్క అనాలి” అని మరొకరు. మిగిలిన ఎనిమిది గ్రహాలు ఒకే సమతలంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే ఇదొక్కటీ అదే తలంలో ఉండకుండా, ఏకాకిలా, మరొక తలంలో తిరుగుతున్నాది కనుక ఇది సూర్య మండలానికి చెందినది కానే కాదు” అని ఇంకొకరు. ఇలా అభ్యంతరాలు చెప్పటం మొదలు పెట్టేరు. ఈ చిన్న చిన్న విషయాలని విస్మరించి ప్లూటో ని గ్రహం కింద లెక్క వేసుకుందామా అనుకుంటే “ప్లూటో కంటె వెంట్రుక వాసి చిన్నగా ఉన్న మరి కొన్ని నభోమూర్తులు ఉన్నాయి, వాటి మాటేమిటి?” అన్నారు కొందరు సమతావాదులు.

భద్రతా సంఘంలో ఇండియాకి శాశ్వత సభ్యత్వం కావాలని మనం పోరాడుతూ ఉంటే “మిమ్మల్ని ఒక్కళ్లనీ చేర్చుకుంటే సరిపోతుందా? బ్రెజీలు, జపాను, జెర్మనీ, లని చేర్చుకోపోతే ఎలా?” అనటం లేదూ. ఆఫ్రికాలో ఎవ్వరికీ సభ్యత్వం లేకపోతే ఎలా? ఇజ్రయెల్ దగ్గర బాంబు ఉంది కనుక వారిని కూడా చేర్చుకోవాలి కదా. ముస్లిం రాజ్యాలకి సభ్యత్వం లేకపోతే ఎలా?" అభ్యంతరాలు వచ్చేయి కదా. ఇదే విధంగా గ్రహాల జాబితాలో ప్లూటో సభ్యత్వానికి ఎన్నో సవాళ్లు ఎదురయాయి. హోరాహోరీగా ప్రసంగాలు జరిగేయి.

ఎవ్వరికీ కనిపించని, ఒక రాతి గుట్ట గ్రహమా, కాదా అని ఇంతలా కొట్టుకోవటం ఎందుకని ఈ అంతర్జాతీయ సంస్థ 2006లో ఒక రోజు అర్ధరాత్రి “ప్లూటో గ్రహం కాదు, ఈ తీర్మానంతో ఏకీభవించలేని వారు ఎవరి దారి వారు చూసుకొండి” అని ఒక కాగితం ముక్క మీద ప్రకటన రాసేసి, “మరో పదేళ్లవరకు ఈ కమిటీ కలుసుకోదు” అని చెప్పి చీకట్లోకి జారుకున్నారు.

6. గ్రహం లక్షణాలు

మార్చు

రాజకీయాలని పక్కకి పెట్టి ప్లూటో గ్రహమా కాదా అని తేల్చాలంటే ముందస్తుగా గ్రహం అనే మాట అర్థం ఏమిటో మనందరికీ ఒక ఒప్పందం కుదరాలి.

సూర్యరాయాంధ్ర నిఘంటువుని సంప్రదించగా అక్కడ ఉన్న అనేకమైన అర్థాలలో ప్రస్తుతానికి పనికొచ్చేవి ఇవి: (1) సూర్యాది; (2) రాహువు; (3) రాహువు సూర్యచంద్రులను పట్టుట. అంటే ఈ నిఘంటువు ప్రకారం సూర్యుడు కూడా ఒక గ్రహం అనేది మొదటి అర్థం. ఇక్కడ మనం అవలంబిస్తూన్న శాస్త్రీయ పద్ధతి ప్రకారం సూర్యుడు గ్రహం కాదు. రెండవ అర్థం ప్రకారం రాహువు ఒక గ్రహం. కాని ఈ రాహువు ఆకాశవీధులలో ఎంత వెతికినా, దుర్భిణి వేసి వెతికినా, కనబడడు. మూడవ అర్థం ప్రకారం గ్రహం అన్నా గ్రహణం పట్టటం అన్నా ఒకటే! ఆధునిక శాస్త్రం ప్రకారం ఇవేవీ “ప్లేనెట్” అనే భావాన్ని సూచించటమే లేదు కనుక సూర్యరాయాంద్ర నిఘంటువు ఇప్పుడు, ఇక్కడ మన అవసరాలకి పనికిరాదని తేలిపోయింది.

దాశరథి నిఘంటువులో “గ్రహం” అంటే “ఎ ప్లేనెట్ లైక్ ద సన్, మార్స్, ఎట్‌సెటరా” (a planet like the sun, Mars, etc.) అని ఉంది. సూర్యుడిని “ప్లేనెట్” అంటే నవ్విపోవటమే కాదు నన్ను తన్నినా తంతారు.

బ్రౌన్ నిఘంటువులో గ్రహం అంటే “ప్లేనెట్స్, సన్, అండ్ మూన్” (planets, sun and moon) అని ఉంది. ఈయన గ్రహాలని, ఉపగ్రహాలని, సూర్యుడిని, గుత్త గుచ్చి ఒకే మూసలో పోసేసేడు.

గ్విన్ నిఘంటువులో మాత్రం గ్రహం అంటే ”ప్లేనెట్” (planet) అని ఉంది. ఇదొక్కటే ఇక్కడ పనికొచ్చే అర్థం.

అంటే ఏమిటన్నమాట? పూర్వ కాలం నుండి తెలుగులో గ్రహం అన్న మాటకి ఇతమిద్ధమైన అర్థం లేదు. సూర్యుడు, చంద్రుడు, రాహువు, బుధ, శుక్ర, కుజ, గురు, శని గ్రహాలు, భూత ప్రేతాదులు, … ఇవి గ్రహం అన్న మాటకి చలామణీలో ఉన్న అర్థాలు. ఆధునిక ఖగోళశాస్త్రం దృష్ట్యా ఈ రకం నిర్లక్ష్యం పనికి రాదు; ఈ జాబితాలో ఉన్నవన్నీ గ్రహాలు అంటే శాస్త్రవేత్తలు ఒప్పుకోరు, ఎవ్వరూ ఒప్పుకోరు.

మనం వాడే ప్రతి మాటకి ఒక నిర్దిష్టమైన అర్థం ఉండటం అనేది ఆధునిక శాస్త్రం ఆయువుపట్టు. పేర్లు పెట్టటం ఎంత ముఖ్యమో, ఆ పేర్లు సూచించే శాల్తీలని వర్గాలుగా విడగొట్టటం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి ప్రాణికోటిని జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం అని రెండు వర్గాలుగా విడగొట్టేరు. జంతువులని గాలిలో ఎగిరేవి, నేల మీద నడిచేవి, నీటిలో ఈదేవి, అంటూ విడగొట్టేరు. విడగొట్టినప్పుడల్లా ఆ జాతికి ఒక పేరు పెట్టాలి కదా. అందుకని వాయుచరాలు, భూచరాలు, జలచరాలు అని పేర్లు పెట్టేరు. ఒక కొత్త జంతువు తారసపడినప్పుడు అది ఏ జాతిలో ఇముడుతుందో చూస్తారు. ఎక్కడా ఇమడకపోతే కొత్తపేరు, కొత్త జాతి. ఉదాహరణకి గాలిలో ఎగిరేదీ, నీటిలో ఈదేదీ అయి, నేలని తాకకుండా ఉండే జంతువు ఉందనుకుందాం. దానికి ఏ పేరు పెట్టాలి? ఉభయచరం అన్న పేరు అప్పుడే మరొక రకం ప్రాణికి వాడుతున్నాం కనుక మరొక కొత్తపేరు పెట్టాలి. కదా?

ఇదే విధంగా సూర్య కుటుంబంలోని శాల్తీలని అధ్యయనం చేసినప్పుడు మొట్టమొదట ఆకాశంలో నగ్న నయనాలకి గురుడు, శని, శుక్రుడు, బుధుడు కనబడ్డారు. వాటిని పాశ్చాత్యులు “ప్లేనెట్” అని పేరు పెట్టి పిలచేరు, మనం గ్రహం అని పేరు పెట్టి పిలచేం. ఇంగ్లీషులో “ప్లేనెట్” అంటే సంచారి అని అర్ధం.

సూర్య చంద్రుల ప్రసక్తి వచ్చే సరికి మనవాళ్లు అవి కూడా కూడా గ్రహాలే అన్నారు. వీరిద్దరు ఆకాశంలో సంచరిస్తూ కనపిస్తారు కనుక వీటిని కూడా “ప్లేనెట్” అన్న మాటతో పిలిస్తే తప్పేమిటి?

అలా కాదు. సూర్యుడు గ్రహరాజు. ఈ గ్రహరాజు చుట్టూ తిరిగేవే గ్రహాలు అని అనుకుందాం. ఈ లెక్కన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు గ్రహం కాకూడదు.

కనుక ప్లేనెట్ లేదా గ్రహం అన్న మాట సూర్యుడు చుట్టూ తిరిగే నభోమూర్తులకే వాడదాం అని ఒక ఒప్పందానికి వద్దాం.

ఇప్పుడు సీరీసు, పల్లాసు అనే నభోమూర్తులు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి కనుక వాటిని గ్రహాలు అనొచ్చు. కాని కేవలం పెద్ద పెద్ద రాళ్ల మాదిరి ఉన్న ఈ శాల్తీలని గ్రహాలు అంటే గురుడు, శని వంటి పెద్ద పెద్ద గ్రహాలని అవమానించినట్లే కదా? అంతే కాదు. ఈ రెండు నభోమూర్తుల కక్ష్యలూ దరిదాపు ఒక్కటే. “ఒకే కక్ష్యలో రెండు గ్రహాలు” అన్న విపరీతం కని, విని ఎరగం. ఇందుమూలంగా సీరీసుని, పల్లాసుని గ్రహాల జాబితాలో వేస్తామంటే నవ్వి పోతారు.

గురుడితో పోల్చి చూస్తే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు చిన్న గోళీకాయలలా కనిపిస్తారు. అటువంటప్పుడు వీటిని మాత్రం గ్రహాల జాబితాలో ఎందుకు వెయ్యాలి?

ఈ తర్కం ఉపయోగిస్తే గురుడు, శని, యూరెనస్, నెప్టూన్ పోతరించిన భారీ గ్రహాలు. అప్పుడు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు గిడసబారిన చిన్న గ్రహాలు. “పెద్ద గ్రహాలు”, “చిన్న గ్రహాలు” అని రెండు వర్గాలు ఉన్నప్పుడు ప్లూటోని బుల్లి గ్రహం అనిన్నీ, సీరీస్‌నీ, పల్లాస్‌ని చిట్టి గ్రహం అనిన్నీ అనొచ్చు కదా.

ఈ దారిని వెళితే సీరీస్, పల్లాస్ లాంటివి వేల కొలదీ ఉన్నాయి. ఈ రాళ్లని, చిళ్లపెంకులని కూడా గ్రహాలనెస్తే ఎలా? ప్లూటోని పోలిన మధ్య తరగతి “బంతులు” మరో పాతిక వరకు ఉన్నాయి.

7. అయితే ప్లూటో గ్రహం కాదు!

మార్చు

ఈ ప్రమాదాన్ని గుర్తించి గ్రహం అనబడటానికి రెండో లక్షణం ఉండాలన్నారు. సూర్యుడి చుట్టూ తిరిగినంత మాత్రాన అది గ్రహం అవదు, అది గుండ్రంగా కూడా ఉండాలన్నారు. ఈ రెండో నిబంధనతో రాళ్లు, రప్పలు, చిల్లపెంకులు ఎన్ని సూర్య ప్రదక్షిణాలు చేసినా గ్రహాలు కాలేవు.

సూర్యుడి చుట్టూ తిరిగే రాళ్లు ఎప్పుడు గుండ్రంగా ఉంటాయి? సీరీసు, పల్లాసు కొండల్లాంటి పెద్ద రాళ్లు. అవి గ్రహాలు కావు. ఇలాంటి కొండలు పదో, వందో కలిసి కొండల గుంపులా ఉందనుకుందాం. అవి గుంపుగా సూర్యుడి చుట్టూ తిరుగుతాయి తప్ప పెద్ద విశేషం ఏమీ ఉండదు. కాని ఈ గుంపులో వేల కొద్దీ కొండలు ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి పనిచెయ్యటం మొదలు పెట్టి ఈ కొండలని గట్టిగా దగ్గరకి లాగుతుంది. గురుత్వాకర్షణ బలానికి అవి చూర్ణం అయిపోయి లడ్డుండలా తయారవుతాయి. ఇప్పుడు ఆ చుట్టుపట్ల ఉన్న చిన్న చిన్న రాళ్లు ఈ లడ్డుండకి వచ్చి అతుక్కుంటాయి. ఇలా కాలక్రమేణా లడ్డుండ గుండ్రటి ఆకారం పొందినప్పుడు ఆ నభోమూర్తిని గ్రహం అనొచ్చు. అంటే ఏమిటన్నమాట? గుండ్రంగా ఉండటం, భారీగా ఉండటం కవల లక్షణాలు.

“అలా అయితే ప్లూటో గుండ్రంగానే ఉంటుంది. గత డెబ్భై ఏళ్ల బట్టి ఇది గ్రహాల జాబితాలో ఏ ఆక్షేపణా లేకుండా ఉంది. ఇప్పుడు దానిని ఎందుకు గ్రహాల జాబితాలోంచి తీసేయ్యాలి?” అంటూ ప్లూటో తరఫున వకాల్తా పుచ్చుకుని కొందరు వాదించేరు.

వచ్చిన గొడవ ఏమిటంటే ఇటీవలి కాలం వరకు ప్లూటో సూర్య మండలానికి సరిహద్దు అనుకున్నారు. అంటే అటుపైన ఏమీ లేదు – నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరం వెళితే అక్కడ మరొక నక్షత్రం తగులుతుంది. కనుక ప్లూటో ప్రవర్తన కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ, “ఏదో, పోనీలే” “కడసారం” అని ఊరుకున్నారు. ఇటీవల శక్తిమంతమైన దుర్భిణిలు వచ్చిన తరువాత ప్లూటోని పోలిన “గ్రహాలు” ఒకదాని తరువాత మరొకటి చొప్పున కనిపించటం మొదలుపెట్టేయి. వీటిల్లో కొన్ని, ప్లూటొ కంటే రవంత చిన్నవి, కొన్ని రవంత పెద్దవి. ఇంత దూరం నుండి చూసినప్పుడు “రవంత” తేడా ఉన్నప్పుడు ఏది పెద్దదో, ఏది చిన్నదో నిశ్చయించటం కూడా కష్టం. ప్లూటోని పోలిన ఇలాంటి గ్రహాలు పాతిక వరకు కనబడ్డాయి. వీటిని కనుక్కున్న వ్యక్తులకి కూడా సన్మానాలు చేయించుకోవటం అంటే ఉబలాటంగానే ఉంటుంది కదా. ఈ సన్మానాల తొక్కిసలాటలో గ్రహాలు ఏ పాతికో, ముప్ఫయ్యో అయిపోతే – మళ్లా పుస్తకాలు అచ్చు కొట్టాలి, పిల్లల చేత ఆ పేర్లన్నీ కంఠస్థం చేయించాలి. చాల తతంగం ఉంది.

అందుకనో, మరెందుకనో గ్రహాలు సంతానంలా పెరిగిపోతే బాగులేదని ఒక లక్ష్మణరేఖ గియ్యాలన్నారు. ఎక్కడ? ప్లూటో తరువాత గీస్తే మిగిలిన పాతిక మంది ఒప్పం కాక ఒప్పం అన్నారు. ప్లూటో ముందు గీస్తే ఏడ్చుకునేది ఒక్కడే – ప్లూటోని కనుక్కున్న వ్యక్తి. వాడెప్పుడో చచ్చిపోయాడు. అందుకని కాబోలు, “ప్లూటో తోకచుక్కల మండలం లోంచి వచ్చింది. అది తోక ఊడిపోయిన, బలిసిపోయిన, గుండ్రంగా ఉన్న తోకచుక్క తల” అంటూ మొండిగా వాదించి, ప్లూటో ముందు లక్ష్మణ రేఖ గీసి, ఇటుపైన ప్లూటో గ్రహం కాదు అని తీర్మానించేరు, సా. శ. 2006 లో, అర్ధరాత్రి వేళ.

ఇప్పటికే పాఠ్య పుస్తకాలలో, విజ్ఞాన సర్వస్వాలలో, పిల్లల పరిహాస చిత్రాలలో, అంతర్జాలంలో, అన్ని చోట్లా ప్లూటో ఒక గ్రహం అనే భావన పాతుకుపోయింది. అర్ధరాత్రి వేళ అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సమితి ఎలా తీర్మానిస్తే మాత్రం? ప్లూటో ప్లూటోనే!

నభోనౌక నూ హొరైజన్‌స్

మార్చు

ప్లూటో గ్రహమా కాదా అన్న తగాదా లేవక ముందే అమెరికాలో, నాసా వారు, ప్లూటోని సందర్శించడానికి "నూ హొరైజన్‌స్" (New Horizons) అనే నభోనౌకని పంపేరు. జనవరి 2006 లో బయలుదేరిన ఈ నభోనౌక, సగటున రోజుకి మిలియను మైళ్లు చొప్పున ప్రయాణం చేస్తూ ఫిబ్రవరి 2007 కి గురు గ్రహం చేరుకుంది. గురు గ్రహం అందించిన గురుత్వ త్వరణపు తోపుతో నాల్గింతలు ఎక్కువ జోరు అందుకుని జూన్‌ 2008 కి శని గ్రహం కక్ష్య దాటి, మార్చి 2011 లో యూరెనస్‌ కక్ష్య దాటి, ఆగస్టు 2014 లో నెప్టూన్ కక్ష్య కూడ దాటి, జూలై 14, 2015 న ప్లూటో చేరుకుంది. చేరుకుని ఛాయాచిత్రాలు తీసి పంపింది.

http://www.wired.com/2015/09/first-pluto-photos-new-horizons-massive-data-dump/

ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం ప్లూటో మన చంద్రుడి పరిమాణంలో మూడింట రెండు వంతులు ఉంటుందని తేలింది. ప్లూటో మీద సూర్యుడు పడమర ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. సూర్యమండలంలో ఇలా అపసవ్యదిశలో పరిభ్రమిస్తూన్న నభోమూర్తి ఇదొక్కటే. ప్లూటో వంటి "గ్రహం కాని కుబ్జ సంతతి"లో చేరడానికి కనీసం వంద పైబడి ఆ తోకచుక్కల మండలంలో ఉన్నాయని అర్థం అవుతోంది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Pluto Fact Sheet అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 2.3 2.4 M. W. Buie; W. M. Grundy; E. F. Young; L. A. Young; S. A. Stern (2006). "Orbits and photometry of Pluto's satellites: Charon, S/2005 P1, and S/2005 P2". Astronomical Journal. 132: 290. arXiv:astro-ph/0512491.
  3. Based on the orientation of Charon's orbit, which is assumed the same as Pluto's spin axis due to the mutual tidal locking.
  4. Dwarf Planet Pluto
  5. Based on geometry of minimum and maximum distance from Earth and Pluto radius in the factsheet
  6. JPL/NASA (2015-04-22). "What is a Dwarf Planet?". Jet Propulsion Laboratory. Retrieved 2022-01-19.
  7. John Lewis, ed. (2004). Physics and chemistry of the solar system (2 ed.). Elsevier. p. 64.
  8. Pluto is the largest Kuiper belt object (KBO); According to Wikipedia convention, which treats the Scattered disc as distinct, Eris, although larger than Pluto, is not a KBO.
  9. Olkin, C.B.; L.H. Wasserman; O.G. Franz (2003). "The mass ratio of Charon to Pluto from Hubble Space Telescope astrometry with the fine guidance sensors-" (PDF). Lowell Observatory. Icarus. pp. 254–259. doi:10.1016/S0019-1035(03)00136-2. Retrieved 2007-03-13.

బయటి లింకులు

మార్చు
Pluto గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

  నిఘంటువు విక్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోట్ నుండి
  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి


"https://te.wikipedia.org/w/index.php?title=ప్లూటో&oldid=4148386" నుండి వెలికితీశారు