బంకుపల్లె మల్లయ్యశాస్త్రి
బంకుపల్లె మల్లయ్యశాస్త్రి ప్రముఖ పండితుడు. సంఘసంస్కర్త. రచయిత.

జననం సవరించు
ఇతడు 1876వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీకి సరియైన ధాత నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు పునర్వసునక్షత్రము, తులాలగ్నములో గంజాం జిల్లా సింగుపురం గ్రామంలో తన మాతామహుని ఇంటిలో జన్మించాడు[1]. ఇతని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలానికి చెందిన ఉర్లాం గ్రామం. ఇతని తల్లిదండ్రులు సూరమ్మ, గంగన్న. ఇతనిది కృష్ణ యజుశ్శాఖ, ఆపస్తంబ సూత్రుడు, భారద్వాజ గోత్రుడు.
బాల్యం, విద్యాభ్యాసం సవరించు
ఇతడు తన ఐదవ యేట తన తండ్రివద్ద వేదాధ్యయనము ప్రారంభించాడు. తరువాత ఉర్లాం జమీందారు కందుకూరి బసవరాజు గారి ఆస్థాన పండితుడైన భళ్లమూడి లక్ష్మణశాస్త్రి వద్ద సంస్కృతము నేర్చుకున్నాడు. తన పదహారవ యేడు వచ్చేసమయానికి పంచకావ్యాలు పూర్తిగా చదివాడు. తరువాత పర్లాకిమిడి రాజా వారి సంస్కృత కళాశాలలో చేరి అక్కడ భళ్లమూడి వెంకటశాస్త్రివద్ద శృంగారనైషధము, అభిజ్ఞాన శాకుంతలము చదివాడు. తరువాత పరవస్తు రంగాచార్యుల వద్ద సిద్ధాంతకౌముది పూర్తిచేశాడు. కూరెళ్ల సూర్యనారాయణశాస్త్రి వద్ద తర్కశాస్త్రము చదువుకున్నాడు. పోకల సింహాచలం వద్ద సంగీతము నేర్చుకున్నాడు. బంకుపల్లి కామశాస్త్రి వద్ద మంత్రశాస్త్రాన్ని అభ్యసించాడు. భళ్లమూడి దక్షిణామూర్తి శాస్త్రివద్ద పంచదశ ప్రకరణములు, గీతాభాష్యము చదువుకున్నాడు. శ్రీకూర్మం సంస్కృత పాఠశాలా పండితుడైన నౌడూరి వెంకటశాస్త్రి వద్ద మనోరమ, శబ్దరత్నములు, పారిభాషేందుశేఖరము చదివాడు. గిడుగు రామమూర్తి పంతులు వద్ద ఇంగ్లీషు చదివాడు. మంత్రశాస్త్రవిద్యలో తన సహాధ్యాయి అయిన గంటి సూర్యనారాయణశాస్త్రి వద్ద వేదాంత, మీమాంస శాస్త్రాలను నేర్చుకున్నాడు. నీలమణి పాణిగ్రాహి వద్ద సూర్యసిద్ధాంత దర్పణాలను చదివి దృక్సిద్ధ పంచాంగాలను ఐదారు సంవత్సరాలు వెలువరించాడు.
ఉద్యోగము సవరించు
ఇతడు తన 21వ యేట శ్రీకాకుళం హైస్కూలులో తెలుగు పండిత పదవికి 18మంది పండితులతో పోటీపడి ప్రథముడిగా నెగ్గి ఆ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ రెండు సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత కొంతకాలం లుకలాం గ్రామంలో కన్నేపల్లి రామావధాని కుమారులకు సంస్కృతం బోధించాడు. ఆ తర్వాత పర్లాకిమిడి రాజా వారి ఇంగ్లీషు కళాశాలలో తెలుగు పండితపదవిని చేపట్టాడు. బరంపురం సిటీ కాలేజీలో కూడా సంస్కృతాంధ్రపండితుడిగా కొంతకాలం పనిచేశాడు.
కుటుంబము సవరించు
ఇతనికి ఇరువురు భార్యలు, ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. ఇతని రెండవ భార్యపేరు వెంకటరత్నమ్మ. ఈమె పర్లాకిమిడి సంస్థాన సంగీత విద్వాంసుడైన పోకల నరసింహంగారి కుమార్తె. విదుషీమణి. ఈమె సంగ్రహ రామాయణము (ద్విపద), జానకీ విజయము, బాల భారతము వంటి రచనలు గావించింది. మల్లయ్య శాస్త్రి కుమార్తె పేరు కృష్ణవేణమ్మ. ఇతడు తన కుమార్తెకు శతావధాని వేదుల సత్యనారాయణశాస్త్రికి ఇచ్చి పునర్వివాహం చేశాడు.
రచనలు సవరించు
- చైతన్య చరిత్ర (యక్షగానము)
- కంసవధ (యక్షగానము)
- శ్రీకృష్ణజననము (యక్షగానము)
- రామకృష్ణపరమహంస చరిత్ర (యక్షగానము)
- భాగవతకలాపము
- కొండవీటి విజయము[2] (పద్యకావ్యము)
- అస్పృశ్యత
- వివాహతత్వము
- ఆంధ్ర వేదములు (1940)
- శ్రీ సర్వదర్శన సిద్ధాంత సంగ్రహము
- విద్యారణ్యస్వామి విరచిత అనుభూతి ప్రకాశము
సంఘసంస్కరణ సవరించు
సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన మల్లయ్యశాస్త్రి హైందవ సాంప్రదాయంలో ఉన్న మూఢాచారాలను వ్యతిరేకించాడు. తన రెండవభార్యవలన కలిగిన ప్రథమకుమారుని జనన సమయంలో వారి ఆచారం ప్రకారం నల్లమేకను శక్తికి బలి ఇవ్వవలసి ఉండగా ఇతడు ఆ ఆచారాన్ని విసర్జించాడు. స్త్రీ పునర్వివాహము శాస్త్రీయమని అనేక సభలలో వాదించి నిరూపించాడు. స్త్రీ విద్య ఆవస్యకత గురించి ఉపన్యాసాలు చేశాడు. అంతే కాకుండా తన ద్వితీయభార్యకు విద్య నేర్పించి మూడు ప్రభందములు, భారత భాగవత పురాణాలను నేర్పించాడు. ఇతడు నేర్పిన విద్య కారణంగా ఆమె సంగ్రహ రామాయణము, మరికొన్ని గ్రంథాలను రచించగలిగింది. ఇతడు ఆంధ్రపత్రిక, భారతి పత్రికలద్వారా ధర్మశాస్త్రములను పరిశీలించి అందలి విషయాలను సప్రమాణకంగా ప్రకటించేవాడు. రజస్వలానంతరమగు పురుష సంయోగార్హ కాలమే స్త్రీలకు వివాహకాలం అన్న సిద్ధాంతాన్ని ప్రకటించి నిరూపించాడు. స్త్రీ పునర్వివాహము పూర్వాచారము కాకపోయినప్పటికి శాస్త్రీయము కాబట్టి ఆచరణీయమని ఇతడు వాదించాడు. సతీ శాసనము వచ్చిన తర్వాత పునర్వివాహము అవశ్యకత కలిగినదని ఇతడు వాదించి పత్రికలలో చర్చ కొనసాగించాడు. శారదా చట్టం ప్రతిపాదించిన కాలంలో ఆ చట్టానికి అనుకూలంగా మద్రాసు మొదలైన పలు ప్రాంతాలలో పెద్దపెద్ద సభలలో చర్చలు చేసి పండితులతో రజస్వలానంతర వివాహమే శాస్త్రీయమని అంగీకరింపచేశాడు. తన కుమార్తె కృష్ణవేణమ్మకు పునర్వివాహం చేయడమే కాకుండా శాఖాంతర వివాహం చేసి ఆకాలంలో ఆదర్శంగా నిలిచాడు. అస్పృశ్యతావ్యతిరేకంగా ఆంధ్రపత్రిక, త్రిలిఙ్గ పత్రికలలో వ్యాసములు వ్రాశాడు. మద్రాసు, నెల్లూరు, గుంటూరు, గోదావరి, కృష్ణ, విశాఖపట్నం, గంజాం మండలాలలో తిరిగి అస్పృస్యతాప్రచారం చేశాడు. శూద్రులను తన ఇంటికి పిలిచి వారితో పాటు భోజనము చేసేవాడు. అప్పారావు అనే ఒక బ్రాహ్మణేతరుడిని తన ఇంటిలోనే ఉంచుకుని తన కుమారులతో పాటుగా చదువు సంధ్యలు చెప్పాడు.
వ్యక్తిత్వము సవరించు
ఇతడు ధనవంతుడు కాకపోయినా అనేక విద్యార్థులకు తన ఇంటనే బసను ఇచ్చి భోజనాలను ఏర్పాటు చేసిన ఉదార స్వభావుడు. అందరిని జాతిభేదాలు లేకుండా, హెచ్చు తగ్గులు గణించకుండా సమానదృష్టితో చూసేవాడు. ఇతడు ఆర్భాటాలకు పోకుండా నిరాడంబర జీవనం గడిపాడు. ఇతడికి భూతదయ అపారం. హింసను చూస్తే చాలా పరితపిస్తాడు. విషజంతువుకు కూడా అపాయం తలపెట్టరు. ఇతని ఇంటి పైకప్పు చూరులో ఒక నాగుపాము చాలా కాలం అందరికీ కనిపించే విధంగా నివసించింది. ఇతని వంటి దయాస్వభావులను మునుపెన్నడూ ఎరుగమని అతని సమకాలికులచే ప్రశంసలను పొందాడు.
బిరుదములు సవరించు
- 1912లో కలకత్తా సంస్కృతవిద్యాపీఠంలో పరీక్ష ఉత్తీర్ణుడై కావ్యతీర్థ బిరుదాన్ని పొందాడు.
- చిత్కిటి సంస్థానంలో సంస్కృతంలో సీతాకళ్యాణము, జానకీ వహ్ని ప్రవేశము అనే పురాణ హరికథలుగా వ్రాసినందుకు సంస్థానం రాజు "పురాణవాచస్పతి" అనే బిరుదును ప్రదానం చేశాడు.
- ఆంధ్ర విద్యారణ్య
- విద్యారత్న
మరణం సవరించు
ఇతడు కాశీయాత్రను ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఖరగ్‌పూర్ వద్ద 1947, సెప్టెంబరు 26న తనువు చాలించాడు[3].
మూలాలు సవరించు
- ↑ కావ్యతీర్థ, పురాణవాచస్పతి బంకుపల్లె మల్లయ్యగారు - పట్నాల అన్నయ్యశాస్త్రి - భారతి మాసపత్రిక- సంపుటి 13, సంచిక 5 - 1936, మే - పేజీలు 561- 567[permanent dead link]
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కొండవీటి విజయము పుస్తకప్రతి
- ↑ "కావ్యతీర్థ పురాణవాచస్పతి కీ.శే.బంకుపల్లి మల్లయ్యశాస్త్రి - వేమకోటి సీతారామశాస్త్రి - ఆంధ్రపత్రిక - తేదీ: మార్చి 8, 1981 - పేజీ:7". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-15.