బంగాళాఖాతం హిందూ మహాసముద్రపు ఈశాన్య భాగం. దీనికి పశ్చిమ, వాయవ్య దిశల్లో భారతదేశం, ఉత్తరాన బంగ్లాదేశ్, తూర్పున మయన్మార్, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. శ్రీలంక లోని సంగమన్ కందా కు, వాయవ్య కొన వద్ద ఉన్న సుమత్రా (ఇండోనేషియా) కూ మధ్య ఉండే రేఖ, బంగాళాఖాతానికి దక్షిణ సరిహద్దు. ఇది, అఖాతం అని పిలువబడే నీటి ప్రాంతాల్లో ప్రపంచంలో కెల్లా అతి పెద్దది. దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలో దీనిపై ఆధారపడిన దేశాలు ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో, బంగాళాఖాతాన్ని కళింగ సాగర్ అనేవారు. తరువాత బ్రిటిషు భారతదేశంలో, చారిత్రాత్మక బెంగాల్ ప్రాంతంలోని కలకత్తా రేవు, భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్యానికి ముఖద్వారం కావడంతో, ఆ ప్రాంతం పేరుతో ఇది బంగాళాఖాతంగా పిలవబడింది. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు బీచ్ అయిన కాక్స్ బజార్, అతిపెద్ద మడ అడవులూ బెంగాల్ పులికి సహజ ఆవాసమూ అయిన సుందర్బన్స్ బంగాళాఖాతం తీరం లోనే ఉన్నాయి.

బంగాళాఖాతం
బంగాళాఖాతం పటం
ప్రదేశందక్షిణ ఆసియా, అగ్నేయ ఆసియా
అక్షాంశ,రేఖాంశాలు15°N 88°E / 15°N 88°E / 15; 88
రకంఅఖాతం
ప్రాథమిక ప్రవేశంహిందూ మహాసముద్రం
బేసిన్ దేశాలుబంగ్లాదేశ్,
భారతదేశం
ఇండోనేషియా
మయన్మార్,
శ్రీలంక[1][2]
గరిష్ట పొడవు2,090 km (1,300 mi)
గరిష్ట వెడల్పు1,610 km (1,000 mi)
2,600,000 km2 (1,000,000 sq mi)
సగటు లోతు2,600 m (8,500 ft)
అత్యధిక లోతు4,694 m (15,400 ft)

బంగాళా ఖాతం విస్తీర్ణం 2,600,000 square kilometres (1,000,000 sq mi). దీనిలోకి అనేక పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి: గంగా - హుగ్లీ, పద్మ, బ్రహ్మపుత్ర - జమునా, బరాక్ - సుర్మా - మేఘనా, ఇర్వాడ్డి, గోదావరి, మహానది, బ్రాహ్మణి, బైతారాణి, కృష్ణ, కావేరి. దీని అంచున చెన్నై, ఎన్నూర్, చిట్టగాంగ్, కొలంబో, కోలకతా - హల్దియా, మొంగ్ల, పరదీప్, పోర్ట్ బ్లెయిర్, మాతర్బారి, తూతుకూడి, విశాఖపట్నం, ధర్మా మొదలైన ముఖ్య నౌకాశ్రయాలు. గోపాల్పూర్ పోర్ట్, కాకినాడ, పేరా చిన్న ఓడరేవులు వున్నాయి.

పేరు ఉత్పత్తి సవరించు

బంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషు వారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు.

బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని బెంగాలు ప్రావిన్సు అని పిలిచేవారు. ఇందులో ప్రస్తుతపు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, ఒడిషా, బీహార్‌, జార్ఖండ్ రాష్ట్రాలు అంతర్భాగాలుగా ఉండేవి. ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు బెంగాలు విభజన వరకూ కొనసాగింది. తరువాత ముక్కలైంది. ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు బే ఆఫ్ బెంగాల్ అని పిలిచారు. అదే పేరు స్థిరపడింది. తరువాత తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం (బెంగాల్+అఖాతం) అయినది.

ఉనికి సవరించు

 
విశాఖపట్నం వద్ద బంగాళాఖాతం

హిందూ మహా సముద్రపు ఈశాన్య ప్రాంతపు సముద్రాన్ని బంగాళాఖాతం (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలో ఉండే బంగాళాఖాతానికి తూర్పున మలై ద్వీపకల్పం, పశ్చిమాన భారత ఉపఖండం ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన భారతదేశపు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతం అనే పేరు వచ్చింది. దక్షిణాన శ్రీలంక, అండమాన్‌ నికోబార్‌ దీవుల వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది. విస్తీర్ణపరంగా బంగాళాఖాతం ప్రపంచంలో అతి పెద్దనైన అఖాతం (Bay).

నదులు సవరించు

భారతదేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి:
ఉత్తరాన, గంగ, మేఘన, బ్రహ్మపుత్ర నదులు, దక్షిణాన మహానది, గోదావరి, కృష్ణ, కావేరి నదులు.
గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను సుందర్బన్స్‌ అంటారు.
మయన్మార్‌ (బర్మా) లోని ఇరావతి కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.

నౌకాశ్రయాలు సవరించు

భారతదేశంలో చెన్నై (ఇదివరకటి మద్రాసు), విశాఖపట్నం, కొల్కతా (ఇదివరకటి కలకత్తా), పరదీప్‌, పాండిచ్చేరి బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు. ఇవి కాక అండమాన్‌ నికోబార్‌ దీవులలోని పోర్ట్‌ బ్లెయిర్‌ తోపాటు మయన్మార్‌లో కూడా రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి.

మూలాలు సవరించు

  1. "Map of Bay of Benglal- World Seas, Bay of Bengal Map Location – World Atlas".
  2. Chowdhury, Sifatul Quader (2012). "Bay of Bengal". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.

వెలుపలి లంకెలు సవరించు