బత్తుల వేంకటరామిరెడ్డి
బత్తుల వేంకటరామిరెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుడు, రచయిత, పాత్రికేయుడు, గ్రంథాలయోద్యమకారుడు.
జీవిత విశేషాలు
మార్చుబత్తుల వేంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా, గుత్తి మండలం, ఇసురాళ్ళపల్లె గ్రామంలో 1932, జూలై 1వ తేదీన బత్తుల లక్ష్మిరెడ్డి, చెన్నమ్మ దంపతులకు జన్మించాడు.[1] పేదరికం కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేక పోయాడు. కూలి పని చేసుకుంటూ ఎస్.ఎస్.ఎల్.సి ప్రైవేటుగా ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలలో 1952 నుండి 1954 వరకు ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. అనంతరం 1954లో అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బేతాపల్లి గ్రామంలోని లండన్ మిషన్ స్కూలులో చేరి 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా సేవలనందించి 1990లో పదవీ విరమణ చేశాడు. వృత్తి రీత్యా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడే అయినా ప్రవృత్తి రీత్యా రచయితగా సమాజానికి సేవచేశాడు. 1955లో వయోజన విద్యాబోధనలో శిక్షణ పొంది వయోజన శిక్షణా శిబిరాలను నిర్వహించి ఎందరో గ్రామీణులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు. విద్యాసంబంధమైన పలువ్యాసాలు పత్రికలలో ప్రచురించాడు. ఇతడు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి దినపత్రికలకు గుత్తి ప్రాంత రిపోర్టర్‌గా ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలను పత్రికలలో ప్రస్తావించి వాటి పరిష్కారానికై పాటుపడ్డాడు. గ్రంథాలయోద్యమం పట్ల ఆకర్షితుడి బేతాపల్లి గ్రామంలో శ్రీ శారదా నికేతన మిత్రమండలి గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1954లో ఇతడు ఉపాధ్యక్షుడిగా, పప్పూరు రామాచార్యులు అధ్యక్షుడిగా, అమళ్ళదిన్నె గోపీనాథ్ కార్యదర్శిగా అనంతపురం జిల్లా గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో గ్రంథాలయ ఉద్యమానికి పాటుపడ్డాడు. జిల్లా గ్రంథాలయ సంస్థ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్రశాఖ కార్యవర్గ సభ్యుడిగా, సంయుక్త కార్యదర్శిగా సేవలను అందించాడు. గుత్తి పట్టణంలో అనంతసాహితి అనే సాహిత్య సంస్థను ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా పనిచేసి అనేక కవిసమ్మేళనాలు, అష్టావధానాలు, సాహిత్యసభలు నిర్వహించాడు. దాదాపు నాలుగు దశాబ్దాలు పత్రికారంగానికి, సాహిత్యరంగానికి, విద్యారంగానికి, గంథాలయోద్యమానికి సేవలను అందించిన బత్తుల వేంకటరామిరెడ్డి 2012, అక్టోబర్ 5న గుత్తిలో మరణించాడు.
రచనలు
మార్చుఇతడు సాహిత్య, సాహిత్యేతర, చారిత్రక, విద్యావిషయక, సామాజిక విషయాలపై అనేక వ్యాసాలు, సంపాదక లేఖలు దాదాపు అన్ని దిన, వార, మాసపత్రికలలో ప్రకటించాడు. అనేక అంశాలపై రేడియో ప్రసంగాలు చేశాడు. ఎన్నో బాలగేయాలను వ్రాశాడు.
ఇతని ముద్రిత గ్రంథాలలో కొన్ని:
- గాంధీ గీతాంజలి
- గుత్తి చరిత్ర
- రాయలసీమ రమణీయ ప్రదేశాలు
- 20వ శతాబ్దంలో అనంత ఆణిముత్యాలు
పురస్కారాలు
మార్చు- 1978లో జాతీయ విద్యావిషయక పరిశోధన శిక్షణ సమితి (NCERT) ఢిల్లీ వారు నిర్వహించిన పోటీలో "విద్యావిషయక సంస్కరణలు విద్య యొక్క గుణాత్మక, పరిణామాత్మక అభివృద్ధికి మార్గాలు" అనే అంశంపై వ్రాసిన వ్యాసానికి బహుమతి ప్రదానం.
- 1981లో ఉత్తమ గ్రంథాలయసేవకునిగా తిరుపతిలో అయ్యంకి అవార్డు.
- 1983 సెప్టెంబరు 5న భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.
- పాతూరి నాగభూషణం శతజయంతి ఉత్సవాలలో గ్రంథాలయోద్యమంలో ఇతడు చేసిన కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా సన్మానం.
మూలాలు
మార్చు- ↑ అనంతపురం జిల్లా సాహితీమూర్తులు - జయసుమన్ - పేజీలు: 83 నుండి 86