ప్రధాన మెనూను తెరువు
Paturi nagabhushanam.jpg

పాతూరి నాగభూషణం 1907 ఆగస్టు 20వ తేదీన గుంటూరు జిల్లా పెదపాలెం గ్రామంలో ధరణమ్మ, బుర్రయ్య దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య కూచిపూడి, పెదపాలెం గ్రామాలలో ఉన్నత విద్య నిడుబ్రోలులోని ఎడ్వర్డ్ హైస్కూలులో కళాశాల విద్య మద్రాసులోని లయోలా కళాశాలలో తర్వాత మదనపల్లెలోని బీసెంట్ థియోసాఫికల్ కాలేజీలో అభ్యసించాడు. గ్రంథాలయ నిర్వహణ, వయోజన విద్యాబోధన విషయాలలో అధ్యయనం చేశాడు.[1], [2]

గ్రంథాలయోద్యమంసవరించు

ప్రాథమిక విద్య అభ్యసించే రోజుల్లోనే ఇతడు తన గ్రామంలో బాలసరస్వతీ భండారము అనే గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత గ్రంథాలయ భవనం నిర్మించి, వేలకొలది గ్రంథాలను సేకరించి చుట్టుపక్కల నలభై గ్రామాలకు అందుబాటులో ఉంచాడు. పెదవడ్లపూడి, దుగ్గిరాల గ్రామాలలో శాఖాగ్రంథాలయాలను నెలకొల్పాడు. బ్యాంక్ కాలువ మీది ప్రయాణీకుల పడవలలో సంచార గ్రంథాలయాన్ని నడిపాడు. ఆంధ్రదేశ మంతటా గ్రంథాలయ నిర్మాణ, నిర్వహణలను ఒక మహోద్యమంగా నిర్వహించాడు. పల్లెపల్లెలలో సంచరించి ప్రచారం చేసి, ప్రోత్సహించి గ్రంథాలయాలను నెలకొల్పడానికి కారకుడయ్యాడు. గ్రంథాలయ మహాసభలను నిర్వహించాడు. గ్రంథాలయ విద్యలో శిక్షణనిచ్చి వాటి నిర్వహణకు కావలసిన కార్యకర్తలను సమకూర్చాడు. విజయవాడ పటమటలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, దాని ముద్రణాలయం ఇతని చేతులమీదుగా నిర్మించబడ్డాయి. ఆంధ్ర గ్రంథాలయ సంఘానికి కార్యదర్శిగాను, గ్రంథాలయ సర్వస్వము పత్రికకు సంపాదకునిగాను, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్‌కు కౌన్సిల్ మెంబరుగాను పనిచేశాడు.

వయోజన విద్యసవరించు

వయోజన విద్యాప్రచారంలో ఇతని పాత్ర ప్రశంసనీయమైనది. ఎడ్వర్డ్ హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే రెండేళ్లపాటు మాచవరంలో వయోజనులకొరకు రాత్రిబడిని నడిపాడు. ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడిగా, దక్షిణ భారత వయోజన విద్యా సంఘం ప్రాంతీయ కార్యదర్శిగా, దక్షిణ భారత వయోజన విద్యా సహకార ప్రచురణ సమితి (మద్రాసు) డైరెక్టరుగా, నూతన అక్షరాస్యుల పుస్తకాల ప్రభుత్వ బహుమతి నిర్ణాయక సంఘం పరిశీలకునిగా సేవలను అందించాడు. వయోజన విద్యను గూర్చి స్వయంగా ఎన్నో పుస్తకాలను ప్రచురించాడు.

జాతీయోద్యమంసవరించు

మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జాతీయోద్యమంలో పాల్గొని 1930లో మరియు 1932లో కఠిన కారాగారశిక్షను అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఇతడు. స్వాతంత్ర్యానంతరం నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకున్నాడు. ఇతడిని గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటిలోను, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోను సభ్యునిగా నియమించి గౌరవించారు. స్వాతంత్ర్య సమర యోధునిగా ఇతడు తామ్రపత్రంతో సత్కరించబడ్డాడు.

గాంధేయవాదిసవరించు

పాతూరి నాగభూషణం గాంధీ అడుగుజాడల్లో నడిచాడు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారకనిధి రాష్ట్ర బోర్డులో, గాంధీ తత్వప్రచారక్ విజయవాడ కేంద్రంలో, గాంధీ లిటరేచర్ పబ్లికేషన్ కమిటీ ఎడిటోరియల్ బోర్డులో సభ్యుడిగా పనిచేశాడు. పెదపాలెంలో 1928లో సేవాశ్రమం స్థాపించాడు. ఈ ఆశ్రమంలో జాతీయకళాశాల, ఖాదీ, స్వదేశీ స్టోరు, హిందీ భాషోద్ధరణ, ప్రకృతివైద్యం, వ్యవసాయం, పశుపోషణ, పుస్తకప్రచురణ మొదలైన వాటిని నడిపాడు. ఒక లిఖితపత్రికను కూడా ప్రారంభించాడు.

పారిశ్రామికవేత్తసవరించు

ఇతడు పరిశ్రమల రంగంలో కూడా తనదైన ముద్రను చూపాడు. నిడదవోలు కెమికల్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా, శ్రమజీవి ప్రెస్ లిమిటెడ్ (మద్రాస్) డైరెక్టర్‌గా, సర్వోదయ ప్రెస్ విజయవాడకు డైరెక్టర్‌గా, నిర్వాహకుడిగా పనిచేసారు.

గ్రంథాలుసవరించు

ఇతడు రచయితగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా శతాధిక గ్రంథాలను వెలువరించాడు.

స్వంతరచనలుసవరించు

 1. గ్రంథాలయములు (వ్యాసావళి) [3]

అనువాద గ్రంథాలుసవరించు

 1. మహనీయుల పుణ్యస్మృతులు
 2. దివ్యజీవన దృశ్యములు
 3. తపోవనంలో ప్రేమయోగి
 4. దాదాజీతో కొన్ని మధురక్షణాలు
 5. శీలము - సదాచారము
 6. సాధుపుంగవులు
 7. జ్ఞానబోధక గాథలు
 8. విద్యార్థి గాంధి
 9. బాపూ జీవిత ఘటనలు
 10. బాపూజీ ముచ్చట్లు
 11. బా - బాపు

సంకలనాలుసవరించు

 1. జీవితధర్మము[4]
 2. మదరాసు పౌరగ్రంథాలయముల చట్టము[5]

పురసారాలుసవరించు

 • ఇతడి సేవలను గుర్తించి ఆంధ్రకళాపరిషత్తు 1975లో కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.[6]

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు

 1. కె., వీరయ్య (Nov&Dec 1976). "కళాప్రపూర్ణ ప్రదాన సందర్భంగా చేసిన ప్రసంగ వ్యాసం". గ్రంథాలయ సర్వస్వము. 37 (8&9): 41. Retrieved 16 January 2015. Check date values in: |date= (help)
 2. Pinakini (1976 నవంబరు,డిసెంబరు). "Achivements of Kalaprapurna Sri Nagabhushanam". గ్రంథాలయసర్వస్వము. 37 (8&9): 174–179. Retrieved 16 January 2015. Check date values in: |date= (help)
 3. పాతూరి, నాగభూషణం (1951). గ్రంథాలయములు (1 సంపాదకులు.). హైదరాబాద్: ఆంధ్రసారస్వతపరిషత్. Retrieved 16 January 2015.
 4. పాతూరి, నాగభూషణము (1986 సెప్టెంబర్). జీవితధర్మము (1 సంపాదకులు.). విజయవాడ: సర్వోత్తమ ప్రచురణలు. Retrieved 16 January 2015. Check date values in: |date= (help)
 5. పాతూరి, నాగభూషణము (1951). మదరాసు పౌరగ్రంథాలయముల చట్టము (1 సంపాదకులు.). పటమటలంక: ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము. Retrieved 16 January 2015.
 6. సంపాదకుడు (1976 నవంబరు, డిసెంబరు). "గ్రంథాలయ సర్వస్వము". గ్రంథాలయ సర్వస్వము. 37 (8&9): 7. Retrieved 16 January 2015. Check date values in: |date= (help)