షేక్ నాజర్

(బుర్రకథ బ్రహ్మ నుండి దారిమార్పు చెందింది)

బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ (1920 ఫిబ్రవరి 5, - (1997 ఫిబ్రవరి 22 ) బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత, గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.[1]

షేక్ నాజర్
షేక్ నాజర్
జననం
షేక్ నాజర్

(1920-02-05)1920 ఫిబ్రవరి 5
మరణం1997 ఫిబ్రవరి 22(1997-02-22) (వయసు 77)
వృత్తిబుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత, గాయకుడు
తల్లిదండ్రులు
  • షేక్ మస్తాన్ (తండ్రి)
  • బీబాబీ (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకులముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5 వ తేదీన షేక్‌ మస్తాన్‌, బీబాబీలకు దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". అతను కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణి, భక్త రామదాసులో ఛాందిని వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. పాఠశాల స్థాయిలో "ద్రోణ" పాత్రకు జీవం పోశారని ప్రముఖ హార్మోనిస్టు ఖాదర్ ప్రశంసించారు. ఖాదర్ అతనిని "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించాడు. పేదరికం వల్ల అచట ఉండలేకపోయారు. ఆ తరువాత అతను బాల మహ్మదీయ సభ పేరిట మళ్ళీ నాటకా లాడి మంచిపేరు గడించాడు. దర్జీగా మారాడు. ఆర్యమత సిద్ధాంతం నచ్చి మాంసాహారం తినటం మానివేసాడు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి పాత్రలు పోషించాడు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యాడు. కొండపనేని బలరామ్‌, వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. వేపూరి రామకోటి కథకుడు, నాజర్‌ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు.

బుర్రకథాపితామహుడు

మార్చు

ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, నటుడు, ప్రజారచయిత, గాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.

తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి పింజారీ అనే పుస్తకంగా ప్రచురించాడు. పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు. కొంతకాలం విరసం సభ్యుడు.[1]

కళాప్రతిభ

మార్చు

ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌., అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి. పూలరంగడు సినిమాలో అక్కినేనికి నేర్పించారు. చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు. అతని గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన సినీ సంగీత దర్శకులు ఎస్‌. రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆసామీ నాటకాన్ని రచించాడు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఆసామి నాటకం ప్రథమ బహుమతి పొందింది. నాజర్‌ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు.[1]

రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె. అబ్బాస్ నాజరును ఆంధ్ర అమరషేక్ అని అభివర్ణించడం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై 'నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు.

1997, ఫిబ్రవరి 22అంగలూరులో మరణించాడు

సత్కారాలు

మార్చు
  • ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది.
  • 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది.

గ్రంథాలు

మార్చు
  • నాజర్‌ ఆత్మకథ పింజారి చిన్న గ్రంథమే అయినా, తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్వడానికి ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చిందీ, అవగాహనా క్షేత్రం ఎంతగా విశాలం చేసిందీ వివరంగా చెప్పాడు. ఎవరు తనను మొదట్లో చేరదీసిందీ, అన్నం పెట్టిందీ విద్య నేర్పిందీ మహా పండితుల నుండి తనకంటే విద్యలో చిన్నవారైన వంతల నుండి తానేం నేర్చుకున్నదీ పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు.
  • జాతి జీవితం - కళా పరిణామం. చరిత్ర, మావన పరిణామ క్రమం, సాంస్కృతిక చరిత్రల వెనక దాగి వున్న విషయాలు వివరిస్తాడు.
  • పద్మశ్రీ నాజర్, జీవిత చరిత్ర. కందిమళ్ళ సాంబశివరావు .సి.పి.బ్రౌను ఎకాడమీ ప్రచురణ.
  • నాజర్ గారి జీవిత విశేషాలున్న కొన్ని గ్రంథాలు:
1.తెలుగు విజ్ఞాన సర్వస్వం – తెలుగు సంస్కృతి
2.తెలుగు జానపద గేయాలు – ఆచార్య నాయని కృష్ణ కుమారి
3.జాతి జీవితం –కళా పరిణామం – షేక్ నాజర్ 1997
4.పింజారి -అంగడాల వెంకట రమణమూర్తి
5.ఆంధ్ర నాటకరంగ చరిత్ర --డా.మిక్కిలినేని 2005
6.బుర్రకథ పితామహ పద్మశ్రీ షేక్ నాజర్ -- డా. కందిమళ్ళ సాంబశివరావు 2009
7.అక్షరశిల్పులు --సయ్యద్ నశీర్ అహమ్మద్ 2010
8.ఆసామి --సాంఘిక నాటకం 1954[2]

ప్రముఖుల అభిప్రాయాలు

మార్చు
  • నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్‌ దగ్గర శిక్షణ తీసుకోవటం నా నట జీవితానికి పట్టం కట్టింది --జమున
  • గుంటూరుకు ఎన్‌టిఆర్ వచ్చినప్పుడు నేను మీ అభిమానిని అని నాజర్ చెపితే ‘నేను మీ ఫాన్‌ను’ అని ఎన్‌టిఆర్ చెప్పి అందరినీ ఆనందపరిచారు.
  • నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది. హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు ---ముదిగొండ శివప్రసాద్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 డా. ఎ.వి.ఆర్‌.మూర్తి (27 January 2010). "బుర్రకథ పితామహుడు షేక్‌ నాజర్‌". visalandhra. Retrieved 1 May 2016.[permanent dead link]
  2. షేక్ నాజర్. ఆ సామి.

ఇతర లింకులు

మార్చు