చేప

నీటిలో నివసించే సకశేరుక జంతువు (సాధారణంగా) మొప్పలు కలిగి ఉంటుంది
(మత్స్యం నుండి దారిమార్పు చెందింది)

చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో, ఉప్పునీటిలో జీవిస్తూ 25,000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసా అవయవాల అమరికను బట్టి" 1.ఊపిరితిత్తుల చేపలు,2.మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించ వచ్చును.చేపల ఆహారపు అలవాటును బట్టి 1.సర్వభక్షకచేపలు, 2.శాకాహారపు చేపలు, 3.మాంసాహారపు (స్వజాతి భక్షక) చేపలు అని గుర్తించ వచ్చును.అదే విధముగా అవి నివసించే అలవాటును అనుసరించి1. మంచినీటిచేపలు 2.ఉప్పునీటి చేపలు అనిచెప్పవచ్చును.చేపలు మానవఆహారముగా అత్యధిక ప్రాధాన్యతను కలిగిఉన్నాయి.అత్యధికచిన్న చేప 0.25 సెంటి.మీ.ఉంటే పెద్దచేప 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.డయోడాన్ అనే చేపఅత్యంత విష పూరిత మైనది.ఇది సముద్రజలాలలోనే నివసిస్తుంది.చేపలన్నీ మానవఆహారముగా వినియోగమవుతున్నాయి.చేపలను 1.ఆనందానికి, ఆహ్లాదకరానికి గాజు తోట్టెలలో పెంచు పద్ధతిని 2.ఆహారానికై చెరువులలో పెంపకము చేయు పద్ధతిని, 3.సముద్రము, నదులు.కాలువలలో పంజారాలలో (cage culture) పెంచు పద్ధతులను శాస్త్రీయ, సాంకేతికపరిజ్ఞానముతో పెంపొందించారు. (డా.చిప్పగిరి).మానవ ఆహారముగా వినియోగించు చేపలు, రొయ్యలు, నాచులు, ముత్యాలు, ఆలిచిప్పల పెంపకమును" జలవ్యవసాయము -Aquaculture" అంటారు (Aquaculture in India-C.Gnaneswar and C.Sudhakar-1997).చేపల మాంసము తెల్లనికండరాలతో, విటమిన్-A, D, E, Kలతో, రుచికరమైన, బలవర్ధకమైన, క్రొవ్వుపదార్థములు తక్కువగా కలిగిన, సులభముగా జీర్ణ మయే మానవ ఆహారము.నదులు, సముద్రాలు, కాలువలు, సరస్సుల నుండి చేపలను పట్టి తేవటముతో పాటు వాటి పిల్లలను ఉత్పత్తి చేసి, కృత్రిమముగా, శాస్ర్తియ పద్ధతులలో పెంపకము చేస్తున్నారు (.చేపలపెంపకము-చిప్పగిరిజ్ఞానేశ్వర్) చేపలపెంపకమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో దాదాపు 6లక్షల ఎకరాలలో చేపట్టారు

నీటి తొట్టిలో పెంచుకునే చిన్న చేప (గోల్డ్ ఫిష్)
పెద్ద గ్రూపర్ చేప చిన్నచేపలసమూహములో ఈదుతూ
చేపలు
సంధువ చేపలు

సామాన్య లక్షణాహక్షకలు సవరించు

 
The anatomy of Lampanyctodes hectoris
(1) - operculum (gill cover), (2) - lateral line, (3) - పృష్ఠ వాజం, (4) - fat fin, (5) - caudal peduncle, (6) - వాల వాజం, (7) - anal fin, (8) - photophores, (9) - pelvic fins (paired), (10) - ఉరో వాజాలు (paired)
  • ఇవి శీతల రక్త లేదా అస్థిరోష్ణ జీవులు.
  • ఇవి సముద్రంలోను, నదులలోను, కాలువలు, చెరువులు మొదలయిన నీరు గల ప్రాంతాలన్నిటిలోను ఉంటాయి.
  • శరీరం కండే ఆకారంలో ఉంటుంది. కొన్నింటిలో పొడవుగా సర్పాలలో లాగ ఉంటుంది. కొన్ని చేపలు పృష్ఠోదరంగా అణచబడి ఉంటాయి. జలచర జీవనానికి అనుకూలంగా మెడ లోపించింది.
  • మధ్యత్వచం నుంచి అభివృద్ధి చెందిన పొలుసులు, డెంటికల్స్, పలకాలు గల బాహ్యాస్థిపంజరం ఉంటుంది. చలనంలో ఘర్షణ లేకుండా ఉండేందుకు చర్మగ్రంధులు, శ్లేష్మగ్రంధుల యొక్క శ్రావం ఉపయోగపడుతుంది.
  • మెత్తటి లేదా కంటకాలు ఆధారంగా కలిగిన ద్వంద్వ, అద్వంద్వ వాజాలు కలిగిన జీవులు. పృష్ఠ, పాయు పుచ్ఛ వాజాలు అద్వంద్వ వాజములు. ఇవి జీవి సమతాస్థితి నిర్వహణకు ఉపయోగపడతాయి. ఉరో శ్రోణి వాజాలు ద్వంద్వ వాజాలు. ఇవి చలనానికి తోడ్పడతాయి. తోకపై గల పుచ్ఛవాజం జీవి ముందుకు కదిలేటట్లు చేసి, చలనంలో మార్గాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది.
 
చేప మొప్పలు
  • నాసికా రంధ్రాలు జతలుగా ఉంటాయి. శ్వాసాంగాలు మొప్ప చీలికలు. మొప్ప చీలికలకు ఆధారం కల్పిస్తూ మొప్పచాపాలు (Gillarches) ఉంటాయి. కొన్ని మంచి నీటి అస్థిచేపలలో అనుబంధ శ్వాసాంగాలను కలిగి ఉంటాయి. శ్వాసకోశ చేపలలో పరిసరాలు ఎండిపోయినప్పుడు శ్వాసించేందుకు అనుకూలంగా ఊపిరితిత్తులు ఉంటాయి.
  • హృదయం ఒక కర్ణిక, ఒక జఠరిక కలిగిన రెండు గదులు కలిగినదిగా వర్ణిస్తారు. హృదయంలోని రక్తం ఒక మొప్ప చీలికలకే ప్రవహించటం వల్ల దీన్ని 'బ్రాంకియల్ హృదయం' అంటారు. ఒక మలిన రక్తాన్ని మాత్రమే సరఫరా చేయడం వల్ల దీన్ని 'చెడురక్తం కలిగిన (Venous heart) హృదయం' అంటారు. హృదయం నుంచి శ్వాసావయాలకు మాత్రమే రక్తం సరఫరా కావడం వల్ల ఈ ప్రసరణను ఏకప్రసరణ (single circulation) అంటారు.
  • విసర్జకావయవాలు మధ్యవృక్కాలు. చేపల ముఖ్యవిసర్జక పదార్థం అమ్మోనియా కావడం వల్ల, వీటిని అమ్మోనోటెలిక్ జీవులంటారు. కొన్ని మృదులాస్థి చేపలు యూరియాను, సముద్రపు టీలియోస్టులు T.M.O.ను విసర్జిస్తాయి.
  • మెదడును ఒకే పొర కప్పి ఉంచుతుంది. దీన్ని 'మెనిక్స్ ప్రిమిటివా' అంటారు. కపాల నాడులు 10 జతలుంటాయి.
  • చేపలలో అంతర్ చెవి మాత్రమే ఉంటుంది. దీవి ముఖ్యవిధి సమతుల్యత. కనురెప్పలు లేవు.
  • పార్శ్వ రేఖా జ్ఞానేంద్రియ వ్యవస్థ లేదా న్యూరోమాస్ట్ అవయవాలను కలిగి ఉండటం చేపల విశిష్ట లక్షణం. ఇవి నీటి అలలలో సమతాస్థితిని కాపాడే రియోరెసెప్టార్స్ లు.
  • ఏకలింగజీవులు. ఫలదీకరణం బాహ్య లేదా అంతర్ ఫలదీకరణ. పిండదశలో ఉల్బం లేదు. అందువల్ల చేపలను ఉల్బరహిత జీవులంటారు.

ఆహారముగా చేపలు : చేపలు ఆరోగ్యనికి ఛాల మంచిది. చేపల్ని మూడు రకాల ప్రధాన తరహాలుగా గుర్తించవచ్చు .

వీటిలో శరీరంలో తైలం అధికముగా ఉండేవి ఒక రకము -- >సాల్ మన్, మాక్రెల్, ట్యూనా, హెర్రింగ్, సార్డినెస్ మున్నగునవి .వీటిలో తైలము ఎక్కువ & విటమిను ' ఎ, డి, ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికముగా ఉంటాయి . రెండో రకము ... వైట్ ఫిష్ -> వీటిలో తైలము తక్కువ ., ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ తక్కువగా ఉంటాయి . వీటిని తినడము వల్ల ఆరోగ్యము మెరుగవుతుంది . మూడోరకము -- > నిజానికి చేపలు కావు, అవి రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు వంటివి . వీటిలో ' సెలీనియం, జింక్, అయోడిన్, కాపర్ వంటివి చాలా ఎక్కువగా లభిస్తాయి . మానవుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి .

'బంగారుతీగ' రకం చేపలు మంచినీటిలోనే పెరుగుతాయి. 'ట్యూనా'ల్లాంటివి సముద్రపు నీటిలోనే పెరుగుతాయి. 'బంగారుతీగ' చేప ఉప్పునీటిలో చనిపోతే, 'ట్యూనా' మంచి నీటిలో చనిపోతుంది. ఇలాంటి చేపల్ని 'స్టెనోహాలిన్‌' చేపలు అంటారు. కానీ 'సాల్‌మన్‌, ఈల్‌'ల్లాంటి చేపలు ఉప్పు, మంచి నీళ్లలోనూ జీవించగలవు. కానీ వీటిని పరిసరాలకు అనుకూలంగా తయారుచేయాలి (అక్లైమెటైజ్‌). ఇలాంటి చేపలను 'యూరోహాలెన్‌' రకం చేపలంటారు.

Fish -------Calories ---TotalFat ---Saturated---Protein ---Cholesterol

Ocean-----110 --------2g -----------0g ------------21g----------50 mg

  • ప్రాచీనకాలం నుండి మానవులకు, కొన్ని జంతువులకు చేపలు ఒక ముఖ్యమైన ఆహారం. * చేపల్లోపోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు. * మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది. * చేపలు పట్టబడిన తర్వాత తేలిగ్గా పాడవుతాయి. కావున వీటిని వెంటనే వినియోగించాలి లేదా జాగ్రత్తగా నిల్వచేయాలి. ఎండబెట్టుట, స్మోకింగ్, ఉప్పు లేదా మంచు గడ్డలలో నిల్వచేయుట మంచిది. రోజుకు 3.3గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు... గుండెజబ్బుల ముప్పు 23శాతం మేర తగ్గినట్టే. చేపల్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభ్యమవుతాయి. దానివల్ల కలిగే లాభాలన్నీ పొందాలంటే చేపల్ని వండటంలో కొన్ని పద్ధతులు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఎండుచేపలు, ఉప్పుచేపల్లో ఈ ఆమ్లాలు ఉండవట. తాజా చేపల్ని కూడా వేపుడులాగా కాకుండా మామూలుగా కూరలాగా వండినప్పుడూ లేదా పులుసులో ఉడికించినప్పుడు మాత్రమే పూర్తిప్రయోజనాలు పొందగలమంటున్నారు.

పోషకవిలువలు సవరించు

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్‌ డి అవసరం. థయామిన్‌, నియోసిన్‌, రిబోఫ్లేమిన్‌ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్‌ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (చేతి పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా లభిస్తాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్‌ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్‌ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్‌ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్‌ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం.

రోజూ చేపలు తినటం సవరించు

రోజూ చేపలు తినటం మధ్యవయసు దాటిన పురుషులకు ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి. అప్పుడప్పుడు మాత్రమే చేపలు తినేవారితో పోలిస్తే.. ఇలా రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని వివరిస్తున్నారు. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం, ట్రైగ్జిరైడ్లు ఎక్కువ కావటం వంటివన్నీ మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం రావటానికి దోహదం చేస్తాయి. ఈ కారకాల్లో మూడు గానీ అంతకుమించి గానీ ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు రెట్టింపు అవుతోంది. అయితే చేపలు ఎక్కువగా తినేవారిలో లావు పొట్ట, అధిక రక్తపోటు వంటివి రావటం తగ్గుతుందని కొరియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా 40-69 ఏళ్ల వారిని ఎంచుకొని.. వారి ఆహార అలవాట్లు, తదితర అంశాలను పరిశీలించారు. చేపలు, ఎన్‌-ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవటం వల్ల గుండెజబ్బు, పక్షవాతం ముప్పులపై ప్రభావాన్ని అంచనా వేశారు. మిగతా వారితో పోలిస్తే రోజూ చేపలు తినేవారిలో ఈ అంశాలు 57 శాతం తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. చేపల్లో దండిగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి ట్రైగిజరైడ్ల మోతాదును కూడా తగ్గిస్తాయని వివరించారు. చేప నూనె మాత్రలు అధిక రక్తపోటుతో పాటు గుండెజబ్బు మూలంగా వచ్చే మరణాలనూ తగ్గిస్తాయని చెబుతున్నారు. అయితే చేపలను బోలెడంత నూనె పోసి వండితే ఈ ప్రయోజనాల కంటే ముప్పు ఎక్కువ. తక్కువ నూనెతో వండుకోవటం చాలా అవసరం.

చేపలు.. పెద్దపేగుకు మేలు సవరించు

మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇవి బొజ్జ, రక్తపోటు పెరగకుండా చేస్తూ.. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు దోహదం చేస్తాయి. తాజాగా చేపల గురించి మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. వీటిని దండిగా తినేవారికి పెద్దపేగు, మల ద్వారా క్యాన్సర్ల ముప్పూ తగ్గుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడిస్తోంది. అలాగే ఈ క్యాన్సర్లతో మరణించే అవకాశం కూడా 12% తగ్గుతుండటం గమనార్హం. వయసు, మద్యం అలవాటు, మాంసం తినటం, కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర వంటి ముప్పు కారకాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించినా.. చేపలతో మేలు జరుగుతున్నట్టు బయటపడింది. చేపల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ఈ ప్రయోజనాలు కలుగుతున్నాయని భావిస్తున్నారు. చేపలు తినే అలవాటు, క్యాన్సర్లకు గల సంబంధంపై గతంలో చేసిన 41 అధ్యయనాలను క్రోఢీకరించి ఈ ఫలితాలను అంచనా వేశారు. అందువల్ల చేపలను అంతగా తిననివారు వీటిని తరచుగా తీసుకోవటం ద్వారా గుండెజబ్బు, పెద్దపేగు క్యాన్సర్‌ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని న్యూజెర్సీ-రాబర్ట్‌ వుడ్‌ జాన్సన్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన డాక్టర్‌ మైఖేల్‌ గోచ్‌ఫెల్డ్‌ వివరిస్తున్నారు. అయితే ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని అధ్యయన కర్త డాక్టర్‌ జీ లియాంగ్‌ హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక ప్రాముఖ్యత సవరించు

ఆహారముగా చేపలు సవరించు

 
మంచు ముక్కలలో నిల్వ ఉంచిన చేప

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది.

  • ప్రాచీనకాలం నుండి మానవులకు, కొన్ని జంతువులకు చేపలు ఒక ముఖ్యమైన ఆహారం.
  • చేపల్లోపోషక పదార్ధాలు - మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు.
  • మంచి రుచిగా ఉండే చేపల మాంసం తేలికగా జీర్ణమవుతుంది.
  • చేపలు పట్టబడిన తర్వాత తేలిగ్గా పాడవుతాయి. కావున వీటిని వెంటనే వినియోగించాలి లేదా జాగ్రత్తగా నిల్వచేయాలి. ఎండబెట్టుట, స్మోకింగ్, ఉప్పు లేదా మంచు గడ్డలలో నిల్వచేయుట మంచిది.

పశువుల దాణాగా చేపలు సవరించు

కొన్ని రకాల చేపలు ఆహారంగా వినియోగించబడగా మిగిలిన భాగములు, తృణీకరించబడిన చేపలు ఎండబెట్టిన పిదప పొడి చేసి చేపల భోజనం (Fish Meal) తయారుచేస్తారు. కోళ్ళు, పందులు, పశువుల పెంపకములో దీనిని ప్రధానమైన కృత్రిమ ఆహారంగా ఉపయోగిస్తారు.

చేపల దాణా తయారీలో చేపల్ని పెద్దపెద్ద పాత్రలలో ఉడకబెట్టుట, బొగ్గులపై కాల్చుట లేదా ఆవిరిలో మెత్తబరుచుట జరుగుతుంది. వీనిలో 60 % మాంసకృత్తులు, ఎక్కువ కాల్షియం, ఫాస్ఫేట్లు, 5.6% నూనెలు ఉంటాయి. అధిక పోషక విలువలను కలిగివుంటాయి. కావున పశువుల్లో పాల దిగుబడి, కోళ్ళలో గుడ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.

జలవిశ్లేషిత మాంసకృత్తుల తయారీ సవరించు

సొరచేపలు మొదలైన చేపల్లోని అనవసరమైన మాంసమును చిన్నచిన్న ముక్కలుచేసి, కడిగి 80 వద్ద సజల ఎసిటికామ్లములో ఉడకబెట్టబడుతుంది. తర్వాత దీనిని ఆమ్లము, క్రొవ్వుల నుంచి శుద్ధిపరచుటకై నీటితో, పెట్రోలియంతో కడుగుతారు. దీనిని పొడిగాలిలో ఆరబెట్టిన పిదప 10 % కాస్టిక్ సోడాలో 80 వద్ద జలవిశ్లేషణ చేయాలి. మాంసం లోని ప్రోటీన్లు ద్రావణ రూపంలోకి మారతాయి. ఈ ద్రావణమును ఎసిటికామ్లముతో తటస్థపరచి ఆవిరిపై ఇగిర్చినప్పుడు సహజ పరిమళముగల మెత్తని పొడి తయారవుతుంది. దీనిలో 35 % మాంసకృత్తులుంటాయి.

జలవిశ్లేషిత ప్రోటీన్లు తేలిగ్గా జీర్ణమవుతాయి. కావున పోషక పదార్ధాల లోపముగలవారు అధికంగా వినియోగించడానికై సరఫరా చేయబడుతుంది. 10 % ఈ పొడి 90 % గోధుమ పిండితో కలిపి రొట్టెలు, బిస్కట్లు, కేక్ లు తయారీలో కూడా వాడవచ్చును.

మాధ్యమిక దిగుబడులు సవరించు

  • చేపల ఎరువులు: మానవులకు ఆహారంగా వినియోగపడని చేపలను ఎరువుల ఉత్పత్తికి వినియోగించవచ్చును. చనిపోయి చెడిపోయిన చేపలు ఎక్కువగా దొరికినప్పుడు వాటిని సముద్రతీరాల్లో ఎండబెట్టి, బూడిదతో కలిపి పొడిచేయుట ద్వారా ఎరువులు తయారుచేస్తారు. చేపల నుండి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పి నుండి కూడా ఎరువులు తయారుచేస్తారు. ఇలాంటి ఎరువులలో 5.7% నత్రజని, 3-4% ఫాస్ఫేట్ లు వుంటాయి. ఈ ఎరువుల వాడకం వలన మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడి నిస్తాయి.
  • చేప నూనెలు: చేపల నుండి రెండు రకాల నూనె (Oil) లను తయారుచేస్తారు. చేపల మొత్తము దేహాన్నుంచి తయారుచేయబడు నూనెలను 'చేప దైహిక నూనెలు'[1] (Fish body oil) అంటారు. చేపలను నీటిలో బాగా ఉడకబెట్టినప్పుడు నీటి ఉపరితలముపై ఏర్పడు నూనెలను తొలగించి మరుగుచున్న ఉప్పు నీటిలో శుద్ధిచేయుట ద్వారా దైహిక నూనెలను తయారుచేస్తారు. వీటిని రమ్గులు, క్రిమిసంహారక సబ్బులు, క్రొవ్వొత్తులు, తోలు, స్టీలు పరిశ్రమలలో వినియోగిస్తారు. షార్క్, స్కేట్, కాడ్ మొదలైన చేపల కాలేయము నుండి 'చేప లివర్ నూనె' (Fish liver oil) తయారుచేస్తారు. అప్పుడే పట్టిన చేపల్లోని కాలేయములను వెంటనే తొలగించి ఎక్కువనీటిలో మరగబెట్టినప్పుడు నీటి ఉపరితలముపై నూనె తేలుతుంది. దీనిని ఎప్పటికప్పుడు తొలగించి శుద్ధిచేయడం జరుగుతుంది. ఈ కాలేయ నూనెల్లో విటమిన్ ఎ, డి లతో పాటు 55-75% క్రొవ్వులు, 5-10% ప్రోటీన్లు వుంటాయి. ఈ నూనెలను ఔషధ ప్రాముఖ్యత కలిగివుంటాయి.

జీవ నియంత్రణ సవరించు

గంబూజియా, ఇసోమస్, ఖీలా, పుంటియస్, బెరీలియస్, డానియో, అంబాన్సిస్, పాంఛాక్స్ వంటి చేపలు దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. కావున ఇలాంటి చేపలను రిజర్వాయిర్లలో, బావులలో, చెరువులలో వాడుట ద్వారా దోమల సంతానాన్ని నియంత్రించి వానిద్వారా మానవులలో సంక్రమించే మలేరియా, బోద వ్యాధుల వంటి వ్యాధులను నియంత్రించవచ్చును. తెగిపోయిన అవయవాల స్థానంలో కొత్త అవయవాలను తయారు చేసుకోగలిగే సామర్థ్యం ఫ్లాట్‌ వార్మ్‌ ప్లానేరియా అనే చేపకుంది. ప్లానేరియా చేప 32 ముక్కలుగా విడిపోయిన తరువాత.. ప్రతి ముక్కకు తల, కళ్లు ఇలా అన్ని అ వయవాలు, అవయవ వ్యవస్థలు ఏర్పడి పూర్తిస్థాయి చేపలుగా మనుగడ సాగించగలదు.

చేపలు నిద్రపోతాయా? సవరించు

చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూసినా కళ్లు తెరిచే ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే అవి కూడా ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రివేళల్లో నిద్రిస్తాయి. నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటిలోతుల్లో ఉండే గుహల్లోకి, పగడపు లోయల్లోకీ వెళ్లి బంకమన్నులాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటుచేసుకుని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి. చేపలు నిద్రించేపుడు వాటి జీవ ప్రక్రియలు కొంతమేర నెమ్మదించడంతో అవి అంత చురుగ్గా ఉండవు. అంతే కానీ అవి తమ స్పృహను పూర్తిగా కోల్పోవు. నిద్రించే చేపలపై పరిశోధనల మూలంగా తేలిందేమంటే అవి గాఢనిద్రలోకి చేరుకోకుండానే నెమ్మదిగా నీటిలో ఈదుతూనే ఉంటాయి.

మూలాలు సవరించు

వర్గీకరణ సవరించు

పురాణాలలో సవరించు

ఇవి కూడా చూడండి సవరించు


మూలాలు సవరించు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  • Helfman, D.G; Collette, B.; Facey (1997). The Diversity of Fishes. Blackwell Publishing. ISBN 0-86542-256-7.
  • Helfman G, Collette BB, Facey DH and Bowen BW (2009) The Diversity of Fishes: Biology, Evolution, and Ecology Wiley-Blackwell. ISBN 978-1-4051-2494-2
  • Moyle, PB and Cech, JJ (2003) Fishes, An Introduction to Ichthyology. 5th Ed, Benjamin Cummings. ISBN 978-0-13-100847-2
  • Nelson, J. S. (2006). Fishes of the World. John Wiley & Sons, Inc. ISBN 0471250317.
  • Aquaculture in India-C.Gnaneswar and C.Sudhakar, 1997, published by Sri Sai Aquaculture Consultants, ISBN no 81–900822-03
  • చేపలపెంపకము-1994-చిప్పగిరి జ్ఞానేశ్వర్
  1. చేప నూనెలు చేప నూనెతో మీకు కలిగే లాభాలు
"https://te.wikipedia.org/w/index.php?title=చేప&oldid=3864592" నుండి వెలికితీశారు