మన ఊరు - మన బడి (పథకం)

మన ఊరు - మన బడి (మన బస్తీ - మన బడి) అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం.[1] రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై ఈ పథకం రూపొందించబడింది. ఇందుకోసం 7,289 కోట్ల రూపాయలతో ‘మన ఊరు - మన బడి’ ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.[2] 2021-22 విద్యా సంవత్సరంలో మొదటి దశలో 65 శాతం (సుమారు 13 లక్షల మంది) విద్యార్థులను కవర్ చేసేలా మొత్తం పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న 9,123 (35 శాతం) పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభించబడుతోంది. ఇందుకోసం మొదటి దశలో దాదాపు రూ.3,497.62 కోట్లు ఖర్చు చేయనున్నారు.[3]

మన ఊరు - మన బడి పథకం
మ‌న ఊరు – మ‌న బ‌డి పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ విద్యార్థులు
స్థాపన2022
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

ప్రారంభం మార్చు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 2021 బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథక అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు లతో సబ్‌కమిటీ ఏర్పాటుచేయబడి 2021 మార్చి 23న, ఏప్రిల్‌ 8న, జూన్‌ 17న సమావేశాలు జరిపింది. ఈ నేపథ్యంలో సబ్‌కమిటీ ‘మన ఊరు.. మన బడి’ ముసాయిదా ప్రణాళికను తయారుచేసి, 2022 జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్‌ ముందు ఉంచింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో ‘మన ఊరు మన బడి’ ప్రణాళిక కోసం క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.[4]

2022, మార్చి 8న మధ్యాహ్నం 12:15 గంట‌ల‌కు వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదిక‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మ‌న ఊరు – మ‌న బ‌డి పథకం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక-ఎక్సైజ్-క్రీడీ శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5][6][7]

విధివిధానాలు మార్చు

  1. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌గా చేపట్టి, మూడు దశల్లో మూడేళ్ళ వ్యవధిలో విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలి.
  2. ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమాన్ని అమలుచేసి, ఈ కార్యక్రమం కింద నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్‌, పాఠశాల మొత్తం పెయింటింగ్‌ వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌, డిజిటల్‌ విద్య అమలు మొదలైనవి అమలుపరచాలి.
  3. ఎంపిక చేసిన పాఠశాలల్లో పనుల మంజూరు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించబడుతాయి.
  4. ఈ పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, అన్ని పనులను వేగంగా అమలు చేయడంకోసం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) లకు బాధ్యతలు అప్పగించబడుతాయి. అభివృద్ధి సంఘాలలో ఇద్దరు క్రియాశీల పూర్వ విద్యార్థులు, ఇద్దరు ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారు.
  5. ప్రతి పాఠశాలకు పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసి పాత విద్యార్థులను తమ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములను చేయనున్నారు.
  6. రాష్ట్ర ఐటి శాఖ డిజిటల్ తరగతి గదులు, ఇతర అంశాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది.[3]

నిధుల సమీకరణ మార్చు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో నుంచి 40% నిధులను, పంచాయితీరాజ్‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లలో కొంత శాతం నిధులను ఈ పథకంకోసం కేటాయించనున్నారు. అలాగే కార్పోరేట్ కంపెనీల నుండి విరాళాలు, కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్‌ల ద్వారా నిధులను సమీకరించడానికి ప్రయత్నాలు చేయబడతాయి.

పైలట్ ప్రాజెక్ట్ పనులు మార్చు

ఈ పథకాన్ని ప్రారంభించే నాటికి నాలుగు పాఠశాలలను ఆదర్శంగా అభివృద్ధిచేసి సిద్ధంగా ఉంచాలన్న నిర్ణయంతో 3.57 కోట్ల నిధులతో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎంపిక చేసిన పాఠశాలు:

• జడ్పీహెచ్‌ఎస్‌ జిల్లెలగూడ, బాలాపూర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా.

• ఎంపీపీఎస్‌, జడ్పీహెచ్‌ఎస్‌ శివరాంపల్లి, రాజేంద్రనగర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా.

• ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల మోడల్‌ ఆలియా, గన్‌ఫౌండ్రీ, హైదరాబాద్‌.

• ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, మహబూబియా (బాలికలు) గన్‌ఫౌండ్రీ, హైదరాబాద్‌.

ఇంగ్లీషు మీడియంకు ప్రత్యేక చట్టం మార్చు

తెలుగు మీడియంలో చదువుకొనే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేక పోతున్నారన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నారు. ఇప్పటికే మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన జరుగుతోంది. ఈ చట్టంతో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి.[8]

తొలి విడత 9,123 పాఠశాలలు ఎంపిక మార్చు

2021-22 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 9,123 (5,399 ప్రాథమిక, 1,009 ప్రాథమికోన్నత, 2,715 ఉన్నత) పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 517, రంగారెడ్డి జిల్లాలో 464, సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలు ఉన్నాయి. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు మొత్తం 12 అంశాలకు సంబంధించిన అంచనాలు, బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్లకు సమర్పించి, వారి నుండి పరిపాలనాపరమైన ఆమోదం తెలుపగానే పనులు మొదలుపెడతారు.[9]

ప్రజల భాగస్వామ్యం మార్చు

‘మన ఊరు-మన బడి’ అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలాగా కాకుండా ప్రజలు కూడా భాగస్వాములై ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ కోరాడు. ఒక ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు రూ.కోటి, అంతకుమించి ఆర్థిక సహాయం చేస్తే.. దాతలు సూచించిన పేరును ఆ పాఠశాలకు, రూ.10 లక్షలకు పైగా సహాయం అందిస్తే దాతలు సూచించిన పేరును ఒక తరగతి గదికి పెడుతారు.[10][11]

పాఠశాలలకు రంగులు మార్చు

ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలన్నింటికీ ఒకే కలర్‌ కోడ్‌ను అమలుచేస్తున్నారు. పాఠశాలల ఆరు బయట, ప్రహరీలకు ఒకేరకం రంగు, తరగతి గదుల్లో ఐదు రకాల రంగులు ఉపయోగించనున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 1,39,585 తరగతి గదులుండగా, తొలి విడతలో 71,115 గదులకు రంగులు వేయాలని అధికారులు నిర్ణయించారు. గోడలు, సీలింగ్‌, తలుపులు, కిటికీలు, గ్రిల్స్‌, గేట్లు, మూత్రశాలలు ఇలా అన్నింటికీ రంగులు వేయనున్నారు.[12]

రంగులు

ఆరుబయట వేసేందుకు నీలం, తెలుపు రంగులను ఎంపిక చేయగా, ప్రహరీకి సైతం ఇదే రంగులు వేస్తున్నారు. గదుల్లో మార్నింగ్‌ గ్లోరీ, నట్‌ బ్రౌన్‌, ఎనామిల్‌ ఓక్‌వుడ్‌, ఎనామిల్‌ వైల్డ్‌ మష్రూమ్‌, మిస్ట్రీవ్యాలీ, ఎనామిల్‌ ఇండియన్‌ స్పైస్‌, కాపర్‌ కోస్ట్‌ తదితర రంగులను ఎంపికచేశారు.

బాల కాన్సెప్ట్‌

బిల్డింగ్‌ యాజ్‌ ఏ లర్నింగ్‌ ఎయిడ్‌ (బాల) కాన్సెప్ట్‌తో పాఠశాలల గోడలపై అందమైన బొమ్మలను చిత్రీకరించనున్నారు. గోడలకు రంగులు వేయడంతోపాటు పాఠ్యాంశ సంబంధమైన పటాలు, చిత్రాలు, అక్షరమాల, ఇతరత్రా బోధనాభ్యసన సామగ్రి బొమ్మలను వేయనున్నారు. ఉన్నత తరగతుల్లో ముత్రపిండాలు, గుండె, మల్టిపులేషన్‌ చార్ట్‌, సౌరకుటుంబం వంటి చిత్రాలు... ప్రాథమిక తరగతుల్లో జంతువులు, రంగులు, తెలుగు, ఆంగ్ల, అక్షరమాల, పండ్లు, కూరగాయాలు, నెలలు, వారాలు వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పించేలా బొమ్మలు ఉంటాయి.[13]

పాఠశాలల ప్రారంభం మార్చు

తొలి విడతలో భాగంగా ఎంపికచేసిన 1,210 పాఠశాలలు 2023, ఫిబ్రవరి 1న ప్రారంభించబడ్డాయి. గంభీరావుపేట గ్రామంలోని ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను 2023, ఫిబ్రవరి 1న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 3 కోట్ల రూపాయలతో మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్‌ హబ్‌లా ఈ సముదాయం నిర్మించబడింది.[14][15] అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని పలు పాఠశాలలోని భవనాలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ప్రారంభించబడ్డాయి.

జిల్లాలవారీగా పాఠశాలల సంఖ్య

ఆదిలాబాద్‌ 37, భద్రాద్రి కొత్తగూడెం 46, హనుమకొండ 28, హైదరాబాద్‌ 32, జగిత్యాల 36, జనగామ 24, జయశంకర్‌ భూపాలపల్లి 22, జోగులాంబ గద్వాల 24, కామారెడ్డి 44, కరీంనగర్‌ 30, ఖమ్మం 62, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ 30, మహబూబాబాద్‌ 32, మహబూబ్‌నగర్‌ 32, మంచిర్యా ల 36, మెదక్‌ 42, మేడ్చల్‌ మల్కాజిగిరి 30, ములుగు 18, నాగర్‌కర్నూల్‌ 40, నల్లగొండ 62, నారాయణపేట 22, నిర్మల్‌ 38, నిజామాబాద్‌ 59, పెద్దపల్లి 28, రాజన్నసిరిసిల్ల 26, రంగారెడ్డి 55, సంగారెడ్డి 55, సిద్దిపేట 48, సూర్యాపేట 46, వికారాబాద్‌ 38, వనపర్తి 28, వరంగల్‌ 26, యాద్రాద్రి భువనగిరి 34 చొప్పున మొత్తంగా 1,210 పాఠశాలల్లో పనులు పూర్తిచేయబడ్డాయి.[16]

మూలాలు మార్చు

  1. "మూడేండ్లలో మూడు దశల్లో." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-17. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.
  2. "ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి..!". andhrajyothy. 2022-01-18. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.
  3. 3.0 3.1 "Telangana: Mana Ooru-Mana Badi to cover 9,123 schools in first phase". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-17. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.
  4. "మన ఊరు..మన బడి". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-17. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.
  5. telugu, NT News (2022-03-08). "వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న : సీఎం కేసీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-08. Retrieved 2022-03-08.
  6. Velugu, V6 (2022-03-08). "మేమంతా సర్కార్ బడుల్లో చదివాం". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-08. Retrieved 2022-03-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. "CM KCR: మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి పైకొచ్చాం: కేసీఆర్‌". EENADU. 2022-03-08. Archived from the original on 2022-03-08. Retrieved 2022-03-08.
  8. "TS News అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం". EENADU. 2022-01-18. Archived from the original on 2022-01-18. Retrieved 2022-01-18.
  9. telugu, NT News (2022-02-17). "'మన ఊరు మన బడి' జాబితా విడుదల". Archived from the original on 2022-02-20. Retrieved 2022-02-20.
  10. "'మన ఊరు-మన బడి'లో భాగస్వాములు కండి.. ! ఎన్‌ఆర్‌ఐలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు". andhrajyothy. 2022-02-13. Archived from the original on 2022-02-14. Retrieved 2022-02-20.
  11. "కోటిస్తే.. బడికి మీరు చెప్పిన పేరు". Sakshi. 2022-02-13. Archived from the original on 2022-02-13. Retrieved 2022-02-20.
  12. "మారుతున్న రూపురేఖలు". EENADU. 2022-10-14. Archived from the original on 2022-10-15. Retrieved 2022-10-19.
  13. telugu, NT News (2022-10-18). "బడులన్నింటికీ ఒకే రంగు". Namasthe Telangana. Archived from the original on 2022-10-19. Retrieved 2022-10-19. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-10-18 suggested (help)
  14. telugu, NT News (2023-02-01). "గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-02-01. Retrieved 2023-02-03.
  15. "కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". Prajasakti (in ఇంగ్లీష్). 2023-02-01. Archived from the original on 2023-02-03. Retrieved 2023-02-03.
  16. telugu, NT News (2023-02-01). "మన బడులకు మహర్దశ.. మొదటి విడతలో 1,210 స్కూళ్లు సిద్ధం". www.ntnews.com. Archived from the original on 2023-02-01. Retrieved 2023-02-09.