మాష్టార్జీ (రచయిత)

తెలుగు సినీ గేయ రచయిత, దళిత కవి

మాష్టార్జీ పేరుతో సుపరిచితుడైన గంగాధరి శ్రీరాములు కవి, సినీగేయ రచయిత, గాయకుడు. జననాట్యమండలి కళాకారుడు.

మాష్టార్జీ
జననంగంగాధరి శ్రీరాములు
(1952-09-07) 1952 సెప్టెంబరు 7 (వయసు 72)
బొల్లారం, సికింద్రాబాద్
ఉద్యోగంభారత ఆహార సంస్థ
ప్రసిద్ధిసినీ గేయ రచయిత, దళిత కవి
భార్య / భర్తప్రమీల
తండ్రిగంగాధరి రాజయ్య
తల్లిసత్తెమ్మ

జీవిత విశేషాలు

మార్చు

ఇతని అసలు పేరు గంగాధరి శ్రీరాములు.[1] ఇతడు జననాట్య మండలి తరఫున తాండూరులో పిల్లలకు సంగీత నృత్య రూపకాలకు, ఒగ్గు కథలకు, బ్యాలేలకు అడుగులు, నృత్యం నేర్పిస్తున్నప్పుడు వారు ఇతడిని మాష్టార్జీ అని సంబోధించేవారు. అప్పటినుంచి ఇతడు తన పేరును 'మాష్టార్జీ'గా మార్చుకున్నాడు.[2] ఇతడు 1952, సెప్టెంబర్ 7వ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారంలో గంగాధరి సత్యమ్మ, రాజయ్య దంపతులకు జన్మించాడు. 1974లో మెట్రిక్యులేషన్ చదివాడు. తరువాత అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి., పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. (జానపదం) పట్టాలు పుచ్చుకున్నాడు. ఇతని తండ్రి వీధి భాగవత గాయకుడు. మేనత్త చంద్రమ్మ పాడే జానపద పాటలను విని ఇతడు తన గాన నైపుణ్యాన్ని అలవరచుకున్నాడు. ఇతడు బాల్యం నుండే భక్తిగీతాలు రచించడం ప్రారంభించాడు.[1] ఇతడు భారత ఆహార సంస్థలో పనిచేశాడు.[3]

రచయితగా

మార్చు

ఇతడు తన ఏడవ యేటి నుండే కవితారచన మొదలు పెట్టాడు. విద్యార్థిదశలో ఉర్రూతలూపే ఉద్యమగీతాలు, ప్రేమగీతాలూ వ్రాశాడు. ఆలిండియా రేడియోలో దేశభక్తి గీతాలు గానం చేశాడు. 400లకు పైగా ప్రైవేటుగీతాలను రచించి రసజ్ఞుల హృదయాలను గెలుచుకున్నాడు. అందులో 'అందుకో దండాలు బాబా అంబేద్కరా' అనే పాట 8 భాషల్లోకి అనువాదమై, అనేకమంది మన్ననలు అందుకుంది. 2001లో సౌత్‌ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచజాతుల సదస్సులో నల్లజాతీయులపై 'బ్లాక్‌ ఈజ్‌ బ్యూటీ' అనే ఇంగ్లీష్‌ పాటను ఇతడు అప్పటికప్పుడే రాసి పాడాడు.[1]

ఇతడు వ్రాసిన ప్రైవేటు పాటలలో కొన్ని ముఖ్యమైనవి:

  • ‘ఈ దేశం నీదన్నగాని రాజ్యం నీదన్ననా!’
  • ‘చేతిలో కత్తేది లేదు. చంకలో తుపాకి లేదు’
  • ‘ఎందరో పుట్టారు మహనీయులు అందరూ కాలేరు దీన బాంధవులు’,
  • ‘జోజోర దళితన్న జోర దళితన్న’,
  • ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా!’
  • 'శంభుకుని తల నరికివేసి జ్ఞానతృష్ణను హత్య చేసి'
  • 'సదువుకోను పోతానయ్య'
  • 'పట్నంలో పుట్టిన పట్టుబట్ట దీన్ని కట్టుకుని సూడరబ్బీ'

"మాష్టార్జీ మూల వాసుల పాటలు", "అఖండ విప్లవ జ్యోతి-అంబేద్కర్" (సాంఘిక నాటకం), "ఔనుమల్లా!" (వీధినాటకం), "అంగుళీమాలుడు" (చారిత్రక నాటకం), "బౌద్ధ గీతాలు", "మట్టిపూలు" (కవితాసంపుటి), "వెన్నెలగానం", "దళితగీతాలు", "స్త్రీ తత్త్వ గీతాలు", "గుడి గంటలు", "ముక్తకాల పల్లకి" మొదలైన గ్రంథాలను వెలువరించాడు.

కళాకారుడిగా

మార్చు

చిన్నప్పట్నించి ఇతడికి కళలపట్ల ఆసక్తి ఉండేది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మాస్టార్జీ చేసిన నృత్యం చూసి ప్రోత్సహించారు. బాలవినోదం రేడియో కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. భక్తి గీతాలు, భావగీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు రాసి పాడటం ప్రారంభించాడు. ఇతడు సెప్టెంబర్‌ 7, 1978న తన పుట్టిన రోజున దళిత కళామండలిని స్థాపించాడు. తన రచనలను గానమయం, ప్రదర్శన యోగ్యం చేసి లక్షలాది మందిని చైతన్య పరిచాడు. 1976లో విద్యాశాఖ డైరెక్టర్‌ యామర్తి గోపాలకృష్ణ తీసిన ఎంఎం నృత్యమాలికకు జానపద నృత్యాలకు మాస్టార్జీ దర్శకత్వం వహించాడు. జననాట్యమండలికి రగల్‌ జెండా బ్యాలే, దీపరాధన నృత్యం, బాంగ్డా డ్యాన్సు లాంటి కళారూపాలకు రూపకల్పన చేశాడు. కోయజాతుల వేషధారణతో జనకథను 1983లో రూపొందించాడు. మాదిగ చిందు భాగోతాన్ని, మహాచిందు పేర ప్రదర్శనలిచ్చి, జాంబవ పురాణాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చాడు. 1992లో ఏర్పడిన దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్య వేదిక (దరకమే)కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.[2] 2019లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు సాంఘిక సంక్షేమ పాఠశాలలో వేయిమంది విద్యార్థులతో పదహారు గంటలపాటు "అందుకో దండాలు బాబా అంబేద్కరా" పాటను జడ కోలాటం రూపంలో ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ బుక్ లో చేరి రికార్డ్ సృష్టించాడు.[4]

సినిమా రంగం

మార్చు

ఇతడు సినిమా గీత రచయితగా దాదాపు 20 సినిమాలలో 30కి పైగా పాటలు రచించాడు. మొదట ఇతడు రచించిన 'వీరులార మీకు.. ఎర్రెర్ర దండాలు' అనే పాటను శ్రీరాములయ్య (1999) సినిమాలో వాడుకున్నారు. తరువాత జాని (2003) చిత్రంతో ఇతడు సినిమా రంగంలో ప్రవేశించాడు. ఇతడు గుడుంబా శంకర్ (2004), తపన (2004), సూర్యం (2004), అన్నవరం (2006), అడవి నా తల్లిరో (2008), మనోరమ (2009), కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య (2016), గల్ఫ్ (2017) మొదలైన సినిమాలకు గీత రచన చేశాడు. నాలుగు సినిమాల్లో నటించాడు. మరో మూడు సినిమాల్లో పాటలుకూడా పాడి తన ప్రతిభను చాటాడు.[1]

పరిశోధన

మార్చు

మాష్టార్జీ రచనలపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మద్దెల రాజు అనే విద్యార్థి "మాష్టార్జీ దళిత గీతాలు: మూలవాసుల సిద్ధాంతం" అనే పేరుతో పరిశోధించి ఎం.ఫిల్.పట్టా పుచ్చుకున్నాడు.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 తిరునగరి శరత్ చంద్ర (30 May 2021). "పాటల మాష్టార్జీ". నమస్తే తెలంగాణ. Archived from the original on 9 ఫిబ్రవరి 2022. Retrieved 10 February 2022.
  2. 2.0 2.1 బి.ఎస్.రాములు (7 September 2021). "సమాంతర సాహిత్య స్రష్ట". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 7 September 2021. Retrieved 10 February 2022.
  3. సంపాదకుడు (15 August 2015). "ఉద్యమ పాటల వేగు చుక్క". నవ తెలంగాణా. Archived from the original on 9 ఫిబ్రవరి 2022. Retrieved 10 February 2022.
  4. ఎస్‌. ర‌ఘు (1 September 2021). "జాతి జనుల ఆత్మగీతం". కొలిమి. Retrieved 10 February 2022.
  5. దార్ల వెంకటేశ్వరరావు (27 July 2007). "మాష్టార్జీ సాహిత్యం లో మట్టి పరిమళాలు". ది హైదరాబాద్ మిర్రర్. Retrieved 10 February 2022.

బయటి లంకెలు

మార్చు