ముంగండ

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల గ్రామం

ముంగండ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం.[1].

ముంగండ
—  రెవెన్యూ గ్రామం  —
ముంగండ is located in Andhra Pradesh
ముంగండ
ముంగండ
అక్షాంశరేఖాంశాలు: 16°35′38″N 81°53′25″E / 16.5940°N 81.8903°E / 16.5940; 81.8903
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కోనసీమ
మండలం పి.గన్నవరం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,297
 - పురుషులు 2,609
 - స్త్రీలు 2,688
 - గృహాల సంఖ్య 1,419
పిన్ కోడ్ 533214
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన పి.గన్నవరం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,470.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,711, మహిళల సంఖ్య 2,759, గ్రామంలో నివాస గృహాలు 1,313 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1419 ఇళ్లతో, 5297 జనాభాతో 539 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2609, ఆడవారి సంఖ్య 2688. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1592 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 66. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587788.[3] పిన్ కోడ్: 533214.

గ్రామ చరిత్ర మార్చు

"ముంగండ బ్రాహ్మణాగ్రహారమే. నేను విన్నంతవరకూ పందొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుంచి దేశచరిత్ర గతితో దాని పాత్రను వింటున్నాను. 20వ శతబ్దారంభం నుండి సామాజిక పరిణామ గతి ఛాయలను చూస్తున్నాను.....ముంగండ చరిత్ర గతిలో దేశంతో పాటు ముందుకు అడుగువేసింది. దేశం అంతటితో పాటు మంచి చెడ్డల్ని అనుభవించింది. ఈ దృష్టితోనే నేను ఒక్క కొల్లాయిగట్టితేనేమి?లోనే కాదు అన్ని నవల్లోనూ దానినే కార్యరంగంగా తీసుకున్నాను."

—కొల్లాయిగట్టితేనేమి? నేనెందుకు రాశాను? వ్యాసంలో మహీధర రామమోహనరావు.[4]

ముంగండ గ్రామం అగ్రహార గ్రామం. గ్రామంలో పలువురు మహాపండితులు, వేద శ్రౌతాది విద్యలను అభ్యసించినవారూ ఉండేవారు. ముంగండ పండితుల ఖ్యాతి ఆంధ్రదేశాన్ని దాటి వ్యాపించివుంది.

గ్రామానికి చెందిన పండితులు మార్చు

17వ శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ సంస్కృత ఆలంకారికుడు, సాహిత్యకారుడు జగన్నాథ పండితరాయలు ఇదే గ్రామానికి చెందినవారు. ఆయన పుట్టింది విద్యనభ్యసించింది ముంగండలోనే. ఆయన ఇంటిపేరు ఉపద్రష్ట, తల్లిదండ్రులు పేరుభట్టు, విద్వన్మణి. ఆయన గ్రామాన్ని విడిచిపెట్టి ఢిల్లీ చేరుకుని, ఢిల్లీపాదుషా షాజహాన్ గౌరవం పొంది వారి ఆస్థానపండితునిగా నియమితులయ్యారు. సుప్రఖ్యాతి చెందిన అలంకారశాస్త్ర గ్రంథం రసగంగాధరం సహా భామినీ విలాసమనే కావ్యం, వివిధ ప్రక్రియలు వర్ణించే ముక్తకమనే గ్రంథం, ఖండన గ్రంథాలు చిత్రమీమాంస ఖండనం, మనోరమా కుచమర్దనం (మనోరమ అనే గ్రంథానికి ఖండన), లహరీపంచకం పేరిట గంగాలహరి (గంగాస్తవం), అమృతలహరి (యమునాస్తవం), సుధాలహరి (సూర్యస్తవం), లక్ష్మీలహరి (లక్ష్మీస్తవం), కరుణాలహరి (విష్ణుస్తవం) స్తవాలు వంటివి ఎన్నో రచించారు.[5] 18వ శతాబ్దికి చెందిన మరాఠా పరిపాలకులు పీష్వాల కొలువులో ముంగండ పండితులకు ప్రవేశం, స్థానం ఉండేవి.

18, 19 శతాబ్దాలు మార్చు

బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సైన్యం, పీష్వా రెండవ బాజీరావు సైన్యానికీ నడుమ జరిగిన యుద్ధంలో పీష్వా సైన్యాలు ఘోరమైన ఓటమి చవిచూసినప్పుడు, శత్రువుల నుంచి తప్పించుకుని విశ్వనాథరావు అనే సైన్యాధిపతి ముంగండ వచ్చిచేరారు. తాను సైన్యాధిపతిగా ఉండగా సన్నిహితులైన ముంగండ పండితులతో పరిచయాన్ని పురస్కరించికుని వచ్చి, అక్కడ సన్యసించి జీవితాన్ని గ్రామంలోనే గడిపారు. 19వ శతాబ్ది తొలిభాగంలో పిండారీల దండు గ్రామంపై పడి గ్రామాన్ని ధ్వంసం చేసి కొల్లగొట్టి పారిపోతుండగా, తేరుకున్న యువకులు వారిలోని చివరివారైన రాజిగాడు, గన్నడు అనేవారిని పట్టుకున్నారు. వారు చేసిన ఘోర దుష్కృత్యాలకు ఆవేశించి ఇద్దరినీ బ్రతికివుండగానే కట్టివేసి మంటల్లో వేశారు. ఐతే ఆవేశంలో చేసిన పనికి పశ్చాత్తాపపడ్డ ఆ యువకులు అందుకు పరిహారంగా తమ కుటుంబాల్లో జన్మించే మొదటి ఇద్దరు పిల్లలకు రాజిగాడు, గన్నడు అనే పేర్లే పెట్టుకుంటామని ఆ సంప్రదాయాన్ని ఇటీవలి కాలం వరకూ కొనసాగింపజేశారు.[4]

ప్రథమ భారత సంగ్రామం మార్చు

ఉత్తరభారతదేశంలో ప్రముఖంగా వ్యాప్తిచెందిన 1857 నాటి ప్రథమ భారత స్వాత్రంత్ర సంగ్రామంలో కూడా ముంగండ వాసులు పాల్గొన్నారు. ప్రముఖంగా చెల్లూరి సుబ్బారాయుడు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో పోరాడారు. ఆమె మరణానంతరం ప్రముఖ సమరయోధుడు నానాసాహెబ్ తమ్ముడు రావు సాహెబ్ సైన్యంతో హైదరాబాద్ చేరుకుని, సైన్యం రద్దయ్యాకా తిరిగి ముంగండ వచ్చి స్థిరపడ్డారు. ఐతే ఆ పోరాటకాలంలో ఆయన బ్రిటీష్ పౌరులు, అందునా స్త్రీబాల వృద్ధులను కూడా చెరుకు గానుగల్లో వేసి చంపడం వంటివి గర్వంగా చెప్పుకోవడంతో ఆయనను అందరూ కొంత నిరసనగా చూసేవారు.[4]

జాతీయోద్యమం మార్చు

భారత జాతీయోద్యమంలో కూడా ముంగండ పాత్ర విశేషంగానే ఉంది. గ్రామంలోని సన్యాసుల మఠం 1930లో గ్రంథాలయంగా రూపుదిద్దుకుంది. ఆ గ్రంథాలయం గ్రామంలోని యువజనసంఘానికి స్థావరంగా నిలిచి, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం హింసాత్మకంగా మారగా పోలీసుల దాడులకు గురయ్యింది. 1929లో ఉప్పుసత్యాగ్రామం సందర్భంగా కాలినడకన సముద్రతీరానికి గ్రామం మీదుగా వెళ్ళిన జాతీయోద్యమ నేత బ్రహ్మాజోశ్యుల సుబ్రహ్మణ్యం, వందలాది కార్యకర్తలకు గ్రామంలో ఘనసత్కారం చేశారు. వీధివీధినా హారతులిచ్చి, ప్రసంగాలు ఏర్పాటుచేశారు. గ్రామాన్ని మహాత్మా గాంధీ సందర్శించి, ప్రసంగించి జాతీయోద్యమం వైపు యువకుల్ని ఉత్తేజపరిచారు. ఆ సందర్భంగా గ్రామానికి చెందిన వేదపండితుడు యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతు భారత/అభ్యుత్థానమధర్మస్య తథాత్మానాం సృజామ్యహం అన్న భగవద్గీతా శ్లోకాన్ని తాటాకుపై వ్రాసి, దానికి పసరు పూసి కనిపించేలా చేసి బహూకరించారు. ప్రముఖ రచయిత, కమ్యూనిస్టు మహీధర రామమోహనరావు తొలిదశలో కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నరోజుల్లో ముంగండ గ్రామం పలు సాంఘిక, రాజకీయోద్యమాలకు నిలయంగా ఉండేదని వ్రాశారు.[4]

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకొనేవారు కనుక ఈ ప్రాంతానికి ముని ఖండవరం అని పేరు కలిగిందని, కాలక్రమేణ అది వాడుకలో ముంగండగా మారినదనీ పండిత నిరుక్తి.

సాహిత్యంలో ప్రస్తావనలు మార్చు

మహీధర రామమోహనరావు తాను రాసిన నవలలన్నిటికీ ముంగండనే నేపథ్యంగా స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొంది, తెలుగు సాహిత్యరంగంలో ప్రఖ్యాతిపొందిన చారిత్రిక నవల కొల్లాయిగట్టితేనేమి?లో కథానాయకుడి స్వగ్రామమే కాక మొత్తం కార్యక్షేత్రం కూడా ముంగండ గ్రామమే. 1920ల దశకంలో జాతీయోద్యమం సాంఘిక సంస్కరణలతో పెనవేసుకుపోయిన వైనాన్ని చిత్రీకరిస్తూ సాగిన ఈ నవలకు కొనసాగింపుగా దేశం కోసం, జ్వాలాతోరణం అన్న చారిత్రిక నవలలు కూడా రామమోహనరావు వ్రాశారు. వాటికీ నేపథ్యంగా ముంగండ అగ్రహారాన్నే స్వీకరించారు.[4]

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల బత్తులపాలెం ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్ ముక్తేశ్వరంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పి.గన్నవరంలోను, అనియత విద్యా కేంద్రం మామిడికుదురులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అమలాపురం లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

ముంగండలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

ముంగండలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

ముంగండలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 78 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 5 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 455 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 122 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 333 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

ముంగండలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 97 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 235 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

ముంగండలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, అరటి, కొబ్బరి

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

బియ్యం, బెల్లం

గ్రామ ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. 4.0 4.1 4.2 4.3 4.4 మహీధర, రామమోహనరావు. కొల్లాయిగట్టితేనేమి? - నేనెందుకు రాశాను?. Retrieved 26 May 2015.
  5. మల్లంపల్లి, సోమశేఖరశర్మ. "లోచనము (గంగాలహరి అనువాదానికి ముందుమాట)". ఆంధ్రభారతి (పునర్ముద్రణ). Retrieved 26 May 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=ముంగండ&oldid=4111162" నుండి వెలికితీశారు