ముక్తినాథ్
నేపాల్ దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయపర్వతాలలో భాగమైన తొరంగ్ లా పర్వతపాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం ముక్తినాథ్. ముక్తినాథ్ కేవలం హిందువులకే కాదు, ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా (ఒక్కోసారి పొరపాటుగా దీనిని కుడా ముక్తినాథ్ అంటూ ఉంటారు) గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్ధం. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదనీ,ఆ తరువాత బౌద్ధుల ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం. 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ గ్యాస్థా అని పిలుస్తారు. టిబెట్ భాషలో చుమింగ్ గ్యాస్థా అంటే నూరు జలాలు అని అర్ధం. టిబెటిన్ బౌద్ధులు ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తారు.

ప్రధాన ఆలయం సవరించు
ముక్తినాథ్ ప్రధానాలయం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. అలాగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా శ్రీరంగం, శ్రీవైకుంఠం, తిరుమల, నైమిశారణ్యం, తోతాద్రి, పుష్కర్, బద్రీనాథ్. ఆలయం చాలా చిన్నది. విష్ణుభగవానుడి ఆలయాలలో ఇది చాలా పురాతనమయింది. సాధారణ మనిషి ఎత్తున ఉండే మహావిష్ణువు మూలమూర్తి బంగారుతో మలచబడింది. ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతలజలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాలు ఆలయప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి 108 పైపులద్వారా నంది ముఖాలలో ప్రవహింపజేస్తున్నారు. 108 దివ్యదేశాల పుష్కరిణీ జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భావిస్తారు.భక్తులు ఈ పవిత్రజలాలలో అంతటి చలిలో కూడా పవిత్రస్నానాలు చేస్తుంటారు. బౌద్ధుల ఆరాధనకు చిహ్నంగా ఆలయంలో ఒక బౌద్ధసన్యాసి నివసిస్తున్నాడు.
శక్తి పీఠం సవరించు
భారతీయ సంస్కృతిలో హిందూమత పురాణలలో దక్షయజ్ఞం, సతీదేవి దహనం గురించి విస్తారంగా ప్రస్తావించబడింది. సతీదేవి దేహత్యాగం పలు శక్తిపీఠాల స్థాపనకు దారితీసింది. శక్తి ఆరాధనకు ఈ శక్తిపీఠాలు తగినంత బలం చేకూరుస్తున్నాయి. పురాణాలలో దక్షయజ్ఞం గురించిన వివరణ విస్తారంగా కనిపిస్తుంది. శైవంలో ఇది అతిముఖ్యమైన సంఘటన. సతీదేవి దేహత్యాగం ఫలితంగా పార్వతీ జననం సంభవించింది. శివుడు గృహస్థుగా మారడం గణపతి, సుబ్రహ్మణ్యాలు ఆవిర్భవించడానికి దారితీసింది. శక్తి ఆరాధనకు శక్తిపీఠాలు మూలస్థానాలు. శక్తి పీఠాలు మహాశివుడు సతీదేవి దేహాన్ని భుజానవేసుకుని దుఃఖిస్తూ ఆర్యావర్తంలో సంచరించ సాగాడు.ఆ సమయంలో ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి మహావిష్ణువును ఈ దిగ్భ్రాంతి నుండి మహాశివుని వెలుపలికి తీసుకురమ్మని వేడుకున్నారు.మహాశివుని ఆ దిగ్భ్రాంతి నుండి వెలుపలికి తీసుకురావడానికి సతీదేవి దేహన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసాడు. సతీదేవి దేహం పడిన ప్రదేశాలన్ని 51 శక్తిపీఠాలు అయ్యాయి. .
పురాణం సవరించు
టిబెట్ బుద్ధిజం స్థాపకుడైన పద్మసంభవ ( గురురింపోచ్) టిబెట్‌కు వెళ్ళే సమయంలో ఈ ప్రదేశానికి చేరుకుని ద్యానం చేసాడని బుద్ధసంప్రదాయకులు భావిస్తారు. ఈ ఆలయాన్ని హిందూపురాణాలు కూడా పలుమార్లు ప్రస్తావించాయి. విష్ణుపురాణంలో గండకీ నదీ మహాత్యంలో ముక్తినాథ్ గురించి శ్లాఘించబడింది.
ముక్తినాథ్ నుండి ప్రవహిస్తున్న కాలిగండకి శిలామూర్తి లేక సాలిగ్రామశిలలకు ఆలవాలం. ప్రపంచంలో ఎక్కడ విష్ణాలయాలు నిర్మించాలన్నా ఈ శలిగ్రామశిలలు అత్యవసరం. హిందువుల అత్యంత పవిత్రక్షేత్రాలలో గండకీ నది ఒకటి అని భావించబడుతుంది. 108 జలప్రవాహాలు పలు హిందూ విశ్వాసాలకు ప్రాతిపదిక. హిందూ జ్యోతిషంలో రాశిచక్రంలో 12 స్థానాలు ఉంటాయి. అలాగే 9 గ్రహాలకూ అంతే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రాశులను గ్రహాలతో గుణించినప్పుడు వచ్చే సంఖ్య 108. జ్యోతిషంలో నక్షత్రాల సంఖ్య 27, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. ఈ నక్షత్రాలను పాదాలతో లెక్కిస్తే వచ్చే సంఖ్య 108. దేవతల అష్టోత్త్స్రంలో నామాల సంఖ్య 108. ఇలా హిందూ సమాజంలో 108కి ఒక ప్రత్యేకత ఉంది.
శ్రీ మూర్తి మహత్యం సవరించు
భూమిమీద పంచభూతాలు ఉపస్థితమై ఉన్న ఏకైక ప్రదేశం ఇది ఒక్కటే. బౌద్ధ, హిందూ సంప్రదాయకులు అగ్ని, జలం, ఆకాశం, భూమి, వాయువు అనే పంచభూతాలను విశ్వసిస్తారు. ఈ పంచభూతాలు ఒకే ప్రదేశంలో వివిధరూపాలలో దర్శనం ఇస్తుంటాయి. ముక్తినాథ్ సమీపంలోనే జ్వాలాదేవి ఆలయం ఉంది. నదితీరం అంతా సాలిగ్రామశిలలకు ఆలవాలమై ఉంది.ఆళ్వారులు ముక్తినాథ్ ఆయన్ని 108 దివ్యక్షేత్రాలలో ఒకటని శ్లాఘించారు. హిందువులు ముక్తినాథ్ ఆలయసందర్శన మహావిష్ణు తాయారు అమ్మల దర్శనం మహాభాగ్యంగా భావిస్తారు.
ప్రసాదాలు సవరించు
ఆలయపూజలను ఇక్కడ స్థానికులు నిర్వహిస్తుంటారు. దర్శనానికి వచ్చే భక్తులు దైవానికి ప్రసాదం కొరకు ఆహారపదార్ధాలను నివేదిస్తారు.
దర్శనం, సేవలు , ఉత్సవాలు సవరించు
ముక్తినాథ్ దర్శనానికి తగిన సమయం మార్చి నుండి జూన్. ఇతరమాసాలలో వాతావరణ పరిస్థితులు అనుకూలిచవు. భక్తులకు ఈ ప్రయాణంలో అనేక ఆలయాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.
శ్రీ వైష్ణవ సంప్రదాయం సవరించు
తిరుమంగై ఆళ్వార్ ముక్తినాథ్‌ను సందర్శించనప్పటికీ శ్రీమూర్తి సమీపప్రదేశాల గురించి తన పాటలద్వారా వర్ణించాడు. పెరియాళ్వార్ తన కీర్తనలలో శ్రిమూర్తిని సాలిగ్రామముడైయానంబి అని కీర్తించాడు. 2009లో జరిగిన మహాయజ్ఞం సందర్భంలో తమిళనాడులోని ముఖ్యమైన వైష్ణవవక్షేత్రాలలో ఒకటైన శ్రీవిల్లిపుత్తూరు పూజారి, శ్రీ మనవాళ మునిగళ్ మఠం, శ్రీ శ్రీ శ్రీ శఠగోప రామానుజ జీయర్‌లు ఆండాళ్ (గోదాదేవి), శ్రీరామానుజ, మనవాళ మునిగళ్ విగ్రహాలను పురాతన వైష్ణవక్షేత్రమైన ముక్తినాథ్ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. ఇది పవిత్రమైన ముక్తినాథ్ చరిత్రలో ఒక మైలురాయి అని భక్తులు భావిస్తారు. శ్రీవైష్ణవానికి చెందిన అనేకమంది భక్తులు ఈ పవిత్రక్షేత్రాన్ని దర్శిస్తారు. ఈ క్షేత్రంలో శ్రీపరాపధనాథ్ శ్రీ భూమి, నీలా, గోదాదేవిలతో పర్యవేష్టితమై ఉన్నాడు. భౌద్ధులకు ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైంది. బౌద్ధులు కూడా ముక్తినాథ్‌లో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తిని మోక్షప్రదాతగా ఆరాధిస్తారు. ఆలయం చుట్టూ నందిముఖాల నుండి వెలువడుతున్న పవిత్రజలాలు శ్రీరంగం, శ్రీవైకుంఠం, తిరుమల వంటి 108 దివ్యక్షేత్రాల పుష్కరిణికి ప్రతీకలుగా భావిస్తున్నారు.
ప్రయాణ వసతులు సవరించు
క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కాట్మండ్ నుండి పోక్రా లోని జాంసం విమానాశ్రయానికి ప్రయాణించి అక్కడి నుండి ట్రక్కులు, జీపుల ద్వారా ప్రయాణించి ముక్తినాథ్ చేరుకోవచ్చు. పరిస్థితులు అనుకూలించినపుడు కొంతమంది భక్తులు హెలికాఫ్టర్ ద్వారా ప్రయాణించి 40 నిముషాలకు ముక్తినాథ్ చేరుకోవచ్చు. హెలికాఫ్టర్‌లో వచ్చేవారిని సిక్నెస్ కారణంగా ఎక్కువసేపు ఉండడానికి అనుమతించబడరు. మౌంటెన్ పై ఇలా చేస్తుంటారు. రాణిపురా, జాంకర్‌కాట్, చొంగర్, కాగ్‌బెనీ లేక జాంసంలలో యాత్రీకులకు బసచేయడానికి వసతిగృహాలు లభ్యమౌతాయి.
చిత్రమాలిక సవరించు
-
-
-
-
మక్తినాథ్ ఆలయం
-
-
-
-
సమీప ప్రాంతాలు సవరించు
మూలాలు సవరించు
- https://web.archive.org/web/20131208201649/http://tirupatiholidays.com/tour/Muktinath.htm
- https://web.archive.org/web/20120825130634/http://www.muktinathtour.com/muktinath.html
- http://www.muktinathdarshan.com
- http://www.sharmatravelsnepal.com/muktinath Archived 2011-07-16 at the Wayback Machine
- https://web.archive.org/web/20120306230709/http://www.venturesnepal.com/muktinath
బయటి లింకులు సవరించు
- Muktinath Darshan
- Clickable Map of Muktinath Archived 2013-06-30 at the Wayback Machine
- UN map of the municipalities of Mustang District Archived 2008-08-28 at the Wayback Machine
- More backgrounds on Muktinath-Chumig Gyatsa Archived 2013-08-03 at the Wayback Machine
- Images from Muktinath (non-commercial website) Archived 2013-09-05 at the Wayback Machine
- Muktinath Trek Travelogue
- Muktinath Photo Gallery Archived 2013-08-02 at the Wayback Machine
- https://ramanuja.org/sri/BhaktiListArchives/Article?p=sep97/0045.html
- Napal Muktinath
- Pashupati Nath Darshan Archived 2013-08-16 at the Wayback Machine
- Muktinath Tour