మేర్లపాక గాంధీ

సినీ దర్శకుడు రచయిత

మేర్లపాక గాంధీ ఒక సినీ దర్శకుడు, రచయిత.[2][1] ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత చెన్నైలోని ఎల్. వి. ప్రసాద్ సంస్థలో సినిమా రంగానికి చెందిన మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చి 2013 లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2016 లో ఇతను ఎక్స్‌ప్రెస్ రాజా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. నాని కథానాయకుడిగా వస్తున్న కృష్ణార్జున యుద్ధం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.[3] ఇతని తండ్రి మేర్లపాక మురళి ప్రముఖ రచయిత.[4]

మేర్లపాక గాంధీ
జననం
మేర్లపాక చే గువేరా

వెదుళ్ళచెరువు, రేణిగుంట మండలం, చిత్తూరు జిల్లా
విద్యఇంజనీరింగ్
వృత్తిదర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిసుష్మ[1]
పిల్లలులిపి[1]
తల్లిదండ్రులు

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఇతను చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, వెదుళ్ళచెరువు గ్రామంలో జన్మించాడు. తర్వాత వీరి కుటుంబం రేణిగుంటకు మారింది. తండ్రి మేర్లపాక మురళి ప్రముఖ రచయిత, విలేఖరి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన 24 నవలలు స్వాతి వారపత్రికలో ప్రచురించబడ్డాయి. ఈయనకు చే గువేరా అంటే అభిమానం ఉండటంతో కుమారుడికి అదే పేరు పెట్టాడు, కానీ ఊర్లోని వాళ్ళకి ఆ పేరు పలకడం చేతకాకపోవడంతో అతని ఐదో యేట గాంధీ అని పేరు మార్చాడు. నాలుగో తరగతి దాకా వెదుళ్ళ చెరువులో చదివాడు. తర్వాత రేణిగుంటలో కొన్ని సంవత్సరాలు చదివాడు. పదో తరగతి దాకా తిరుపతిలో చదివాడు. ఇంటర్మీడియట్ లో బై. పి. సి చదివి తర్వాత ఆళ్ళగడ్డలో బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివాడు. ఇతనితో పాటు తల్లి కూడా అక్కడే వార్డెనుగా పనిచేసింది.

కుటుంబం మార్చు

2014లో ఇతని వివాహం సుష్మ అనే అమ్మాయితో జరిగింది. ఇద్దరూ ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదివారు. తర్వాత గాంధీ ఆళ్ళగడ్డ లో బి. టెక్ చదివితే సుష్మ తిరుపతిలో డిగ్రీ పూర్తి చేసింది. వీరికి లిపి అనే ఒక కూతురు ఉంది.[1]

సినిమాలు మార్చు

పదో తరగతి నుంచే సినిమాల మీద ఆసక్తి ఉన్నా తండ్రి ప్రోద్భలంతో బి.టెక్ దాకా చదివాడు. తర్వాత తండ్రిని ఒప్పించి చెన్నైకి వెళ్ళి ఎల్. వి. ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరాడు కానీ దర్శకత్వానికి సంబంధించిన కోర్సుకు హాజరయ్యేవాడు. తండ్రి రచయిత కావడంతో స్వతహాగా పుస్తకాల మీద ఆసక్తి కలిగింది. చదివిన ప్రతి పుస్తకానికి తండ్రి 25 రూపాయల చొప్పున బహుమతిగా ఇచ్చేవాడు. ఫిల్మ్ స్కూల్లో చేరిన తర్వాత రాయడం కూడా అలవాటైంది. ఫిల్మ్ స్కూల్లో చదివిన ఒక సంవత్సరం తర్వాత కర్మరా దేవుడా అనే పేరుతో ఒక లఘుచిత్రం తీశాడు. దానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన కొంతమంది హైదరాబాదుకు రమ్మన్నారు. అలా 2012 లో ఫిల్మ్ కోర్సును మధ్యలోనే వదిలిపెట్టి హైదరాబాదుకు వచ్చాడు. ఒక స్నేహితుడి ద్వారా సందీప్ కిషన్ ని కలిశాడు. ఒక కథ చెబితే అతనికి బాగా నచ్చింది. అదే 2013 లో వచ్చిన గాంధీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. ఈ సినిమా విజయం సాధించింది. ఈ సినిమాకు ముందు ఎవరి దగ్గరా సహాయ దర్శకుడిగా పనిచేయలేదు. కానీ సందీప్ సహకారంతో మొదటి సినిమాకే పరిశ్రమలో వివిధ విభాగాల్లోని సీనియర్లతో పనిచేసే అవకాశం కలిగింది.

మొదటి సినిమా విడుదలయిన ఒకటిన్నర ఏడాది తర్వాత శర్వానంద్ కథానాయకుడిగా ఎక్స్‌ప్రెస్ రాజా అనే సినిమా తీశాడు. ఇది కూడా మంచి విజయం సాధించింది. 2017 లో నాని కథా నాయకుడిగా కృష్ణార్జున యుద్ధం అనే సినిమా ప్రారంభమైంది. ఇది 2018లో విడుదలైంది. మేర్లపాక గాంధీ కథ నందించిన ఏక్ మినీ కథ సినిమా 27 మే 2021న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.[5] సెప్టెంబరులో 2021 లో మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన మాస్ట్రో చిత్రం విడుదలైంది. హిందీ చిత్రం అంధాధున్ కి ఇది పునర్నిర్మాణం.

దర్శకత్వం వహించిన సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "షార్ట్‌ఫిల్మ్‌తో హైదరాబాద్‌ వచ్చేశా!". eenadu.net. Archived from the original on 8 April 2018. Retrieved 8 April 2018.
  2. వై, సునీత చౌదరి. "Merlapaka Gandhi on an expressway". thehindu.com. ది హిందు. Retrieved 25 January 2018.
  3. "Nani to play a dual role again in director Merlapaka Gandhi's next". timesofindia.indiatimes.com. Retrieved 25 January 2018.
  4. "Interview with Merlapaka Gandhi". idlebrain.com. Retrieved 25 January 2018.
  5. Sakshi (30 May 2021). "అలా 'ఏక్‌ మినీ కథ' పురుడు పోసుకుంది: మేర్లపాక గాంధీ". Sakshi. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.