శర్వానంద్

సినీ నటుడు

శర్వానంద్ తెలుగు చలనచిత్ర నటుడు.[1] గమ్యం, ప్రస్థానం చిత్రాలలోని నటనకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఇతడు తమిళంలో కూడా నటించాడు.

శర్వానంద్
Sharwanand Myneni.jpg
జననం (1984-03-10) 1984 మార్చి 10 (వయస్సు 38)
ఇతర పేర్లుఆనంద
విద్యబి.కామ్
విద్యాసంస్థవెస్లీ కళాశాల, సికిందరాబాదు
ఎత్తు6'1 ft
తల్లిదండ్రులు
  • ప్రసాదరావు (తండ్రి)
  • వసుంధరా దేవి (తల్లి)
వెబ్‌సైటుశర్వానంద్.కామ్

బాల్యముసవరించు

విజయవాడలోని వీరి తాతగారింట్లో జన్మించాడు. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడు రాణా దగ్గుబాటి, రాంచరణ్ తేజ ఇతని క్లాస్‌మేట్స్‌గా ఉండేవాళ్లు. చాలా ఏళ్లు కలిసి చదువుకున్నా వీరి మధ్య ఎప్పుడూ సినిమాల ప్రస్తావన వచ్చేదికాదు. అప్పుడు ఎవరికీ వాటి గురించి అంత అవగాహన లేదు . ఇతనికి చదువు పట్ల ధ్యాస లేకుండేది. ఎప్పుడూ ఏదో ఒక కళా రంగంలోకి వెళ్లాలనుకునేవాడు. సబ్జెక్టుల కంటే సినిమా ఆలోచనలే ఎక్కువ. అందుకే స్కూల్లో డ్రామా, డాన్స్ పోటీల జాబితాలో ఇతని పేరే ముందుండేది. పరీక్షల ఫలితాల జాబితాలో చివరి స్థానంలో ఇతని పేరు ఉండేది. స్కూల్‌కి పంపిస్తే చాలా సార్లు కారులో నుంచీ, ఆటోలో నుంచీ దూకేసేవాడు. కానీ ఇతన్ని పెద్దలు బలవంతంగా స్కూల్లో దింపేసి వచ్చేవాళ్ళు. కానీ ఇతను అక్కణ్నుంచి ఎలాగోలా తప్పించుకుని సినిమాకు వెళ్ళేవాడు. పక్కనే ఉన్న ఆనంద్ థియేటర్‌లో క్రమం తప్పకుండా సినిమాలు చూసేవాడు.

విద్యాభ్యాసముసవరించు

నాన్న ప్రసాదరావు వ్యాపారవేత్త. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అన్నయ్య కల్యాణ్, అక్క రాధిక.. ఇతనికి చదువుకొని ఉద్యోగం చేయడం కన్నా సినిమాలపైన ఎక్కువ ఇష్టముండేది. అందుకే ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్లాలనుందని ఇంట్లో చెప్పాడు. పదిహేడేళ్ల కుర్రాడు అలా మాట్లాడితే వేరే ఎవరైనా చాలా తేలిగ్గా తీసుకుంటారు. పిచ్చి ఆలోచనలు మానేసి చదువుకోమంటారు. అందరిలా వీళ్ళ అమ్మా, నాన్నా ఎప్పుడూ వాళ్ల ఆలోచనలు పిల్లలపై రుద్దలేదు. వీరి ఆలోచన ఏంటనీ అడగలేదు. చేసేది కరెక్ట్ అని పిల్లలకు అనిపిస్తే చాలు, ధైర్యంగా ముందుకెళ్లమనేవాళ్లు. సినిమాల విషయంలోనూ వాళ్లు అలానే అంటారన్న ధైర్యంతో విషయం చెప్పాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలని వీళ్ళ అమ్మ ఒకేఒక్క షరతు పెట్టింది. ఒకే చెప్పి సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో బీకాంలో చేరిపోయాడు.

నట జీవితముసవరించు

మొదటి అవకాశముసవరించు

ప్రతిరోజూ జూబ్లీహిల్స్‌లో బ్యాడ్మింటన్ సాధన చేసేవాడు. ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ కూడా అక్కడికే వచ్చేవాడు. అతడితో మాట్లాడినప్పుడు ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ నట శిక్షణాలయం గురించి చెప్పాడు. వెంటనే వెళ్లి అందులో చేరిపోయాడు. నాలుగు నెలల శిక్షణ తరవాత హైదరాబాద్‌కి వచ్చాడు. ఎలాగైనా నటుణ్ని అవ్వాలన్న ఆశ ఉంది కానీ అదెలాగో మాత్రం తెలీలేదు. పరిశ్రమలో పెద్దగా ఎవరితోనూ పరిచయం లేదు. దీంతో సొంతంగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇతని యాక్టింగ్ స్కూల్ పట్టా పెట్టుకొని నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఒక్కోచోట ఒక్కో మాట. అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదు. ఒకటీ, రెండ్రోజులు కాదు... ఏకంగా రెండేళ్లు అదే పని. ఎన్నో ఆడిషన్లూ, ఎందరో నిర్మాతలూ. ఫలితం మాత్రం లేదు. ఎందుకిలా జరుగుతోందీ, నా నటనలోనే ఏదైనా లోపం ఉందా అనుకునేవాడు. అప్పుడే తెలిసిన వాళ్లు వైజాగ్‌లోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ గురించి చెప్పారు. అక్కడ శిక్షణ తీసుకుంటే అదృష్టం కలిసొస్తుందేమో అని వైజాగ్ బయల్దేరాడు. ఈసారి పరిస్థితి మారింది. ఓ నిర్మాతా, దర్శకుడూ నటుల కోసం వెతుకుతూ స్కూల్‌కు వచ్చారు. అక్కడ ఆడిషన్ తరవాత ఇతడిని ఎంపికచేసుకున్నారు. అలా పందొమ్మిదేళ్లకే హీరోగా అవకాశమొచ్చింది. కానీ ఏం లాభం... 'ఐదో తారీఖు' ఎలా వచ్చిందో అలానే పోయింది. పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.

మలి అవకాశాలుసవరించు

మొదట్లో యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్ ఒకటే ఉండేది. కానీ ఈసారి ఒక సినిమా అనుభవం కూడా దొరికింది. ఆ విషయాన్నే నిర్మాతలకు చెప్పేవాడు. కానీ ఆ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలీకపోవడంతో అవకాశాలు రాలేదు. ఆ సమయంలోనే 'గౌరీ' సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళినపుడు అక్కడ ఇతడిని గమనించిన దర్శకుడు రమణ, ఆ సినిమాలోనే హీరో స్నేహితుడిగా అవకాశమిచ్చారు. మొదటి సినిమాలో హీరో. రెండో సినిమాలో హీరో స్నేహితుడు. ఇది చేస్తే మళ్లీ ఎప్పటికి హీరో అవుతానో అనుకున్నాడు. కానీ చిత్ర పరిశ్రమలో కొనసాగాలంటే ఆ పాత్రకు ఒప్పుకోక తప్పని పరిస్థితి. అందుకే భవిష్యత్తు గురించి పక్కనబెట్టి నటించాడు. వెంటనే స్రవంతి రవికిషోర్ 'యువసేన' సినిమాలో నలుగురు హీరోల్లో ఒక పాత్ర ఇచ్చారు. అది హిట్టవడంతో మంచి పేరొచ్చింది కానీ సోలోగా అవకాశం రాలేదు. అప్పుడే 'శంకర్ దాదా ఎంబీబీఎస్'లో మరో పాత్ర. ఆ తరవాత 'సంక్రాంతి', 'లక్ష్మి' సినిమాల్లో వెంకటేష్ తమ్ముడిగా చేశాడు. 'రాజు మహారాజు'లో మోహన్‌బాబుతో కలిసి నటించాడు. పెద్ద హీరోల సినిమాలు చూసేవాళ్లు ఎక్కువ. వాళ్లతో నటించడం వల్ల ఇతడిని గుర్తుపట్టే వాళ్ల సంఖ్యా పెరిగింది. దీంతో మంచి పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. హీరోగా ఇతని రీఎంట్రీకి పునాదులు వేసింది ఆ పాత్రలే. మధ్యలో ఓసారి చిరంజీవితో కలిసి 'థమ్స్ అప్' ప్రకటనలోనూ చేశాడు.

విజయ ప్రస్థానముసవరించు

'సంక్రాంతి' తరవాత 'వెన్నెల' సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఓ రకమైన సైకో పాత్ర అది. ఇతడు అన్ని రకాల పాత్రలూ చేయగలనని నిర్మాతలకు నమ్మకం కలిగించిన సినిమా అది. ఆ తరవాత వచ్చిన 'అమ్మ చెప్పింది'లో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర. ఇతడు చేసిన వాటిల్లో చాలా కఠినమైంది అదే అని ఇతని అభిప్రాయము. 'గమ్యం'తో ఇతని నట జీవితము పూర్తిగా మారిపోయింది. నిజానికి ఆ సినిమా పూర్తవగానే కొన్నాళ్లు అమెరికా వెళ్లిపోయాడు. ఎందుకో సినీ జీవితము అనుకున్న విధంగా ముందుకెళ్లట్లేదేమో అనిపించింది. సినిమాలకు దూరమవ్వాలన్న ఆలోచనా వచ్చింది. కానీ గమ్యం ఇచ్చిన విజయంతో ఒత్తిడీ, నిరాశా అన్నీ ఎగిరిపోయాయి. ఆ తరవాత వెంటనే ప్రస్థానం. అదీ రొటీన్‌కు చాలా భిన్నమైన పాత్ర. ఇతని కంటే ఎక్కువ తెరమీద పాత్రే కనిపించాలి. ఆ చిత్రం కూడా విజయం సాధించడంతో నటుడిగా బాగా పేరు వచ్చింది . 'గమ్యం' తమిళ రీమేక్‌లోనూ నటించాడు. అక్కడా మంచి పేరుతో పాటు అవకాశాలొచ్చాయి. వాటిలో జర్నీ కథ బాగా నచ్చింది. నిజానికి అందులో చేసిన పాత్ర కోసం వేరే వ్యక్తిని అనుకున్నారు. నిర్మాత మురుగదాస్ ఇతనికి ముందే తెలుసు. అలాంటి కథలో నటించడమంటే ఇతనికి ఆసక్తి ఉందని చెప్పాడు. తరవాత ఏవో కారణాల వల్ల ఆ హీరో తప్పుకోవడంతో ఆ పాత్ర ఇతను పోషించాడు.తెలుగు, తమిళము రెండు భాషల్లోనూ అది విజయవంతమైనది.2014 లో వచ్చిన రన్ రాజా రన్ చిత్రంతో శర్వానంద్ ఒక స్టార్ గా ఎదిగాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు(2015) తో మళ్ళీ తన నటన తో మంచి మార్కులు సంపాదించాడు.2016 లో వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా చిత్రం లో మాస్ కారెక్టర్ చేసి యూత్ లో మoచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.2017 లో శతమానం భవతి సినిమా తో మరొక భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.2017 వేసవి లో వచ్చిన రాధ సినిమా నిరాశ పరిచినా తన నటన తో ఆకట్టుకున్నాడు..అలాగే ఇప్పుడు మారుతి దర్శకత్వం లో మహానుభావుడు చిత్రం లో నటిస్తున్నాడు.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

తమిళంసవరించు

  • గమ్యం

మూలాలుసవరించు

  1. మహమ్మద్, అన్వర్ (20 May 2018). "కేరళ కుట్టీలు ప్రాణం పెట్టేస్తారు". eenadu.net. ఈనాడు. Archived from the original on 21 May 2018. Retrieved 21 May 2018.
  2. "Aadavallu Meeku Joharlu review and rating". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-04. Retrieved 2022-03-04.

బయటి లింకులుసవరించు