మోటుపల్లి

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చినగంజాము మండలం లోని గ్రామం


మోటుపల్లి ప్రకాశం జిల్లా, చినగంజాం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చినగంజాం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చీరాల నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1068 ఇళ్లతో, 3567 జనాభాతో 1602 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1820, ఆడవారి సంఖ్య 1747. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 165. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591028[2].

మోటుపల్లి
పటం
మోటుపల్లి is located in ఆంధ్రప్రదేశ్
మోటుపల్లి
మోటుపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°43′33.38″N 80°16′56.93″E / 15.7259389°N 80.2824806°E / 15.7259389; 80.2824806
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంచినగంజాం
విస్తీర్ణం16.02 కి.మీ2 (6.19 చ. మై)
జనాభా
 (2011)[1]
3,567
 • జనసాంద్రత220/కి.మీ2 (580/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,820
 • స్త్రీలు1,747
 • లింగ నిష్పత్తి960
 • నివాసాలు1,068
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523184
2011 జనగణన కోడ్591028

గ్రామ చరిత్ర

మార్చు

1298లో ప్రసిద్ధ యాత్రికుడు మార్కోపోలో ఇక్కడే తీరాన్ని చేరాడని భావిస్తారు. చరిత్రకారులకు, పరిశోధకులకు ఈ ప్రదేశము చాలా ముఖ్యమైనది. ప్రాచీన ఓడ రేవైన మోటుపల్లి 1వ శతాబ్దము నుండి అనేక రాజ వంశాల పాలనలో విరాజిల్లినది. పూర్వము బౌద్ధ క్షేత్రమైన మోటుపల్లిలో అనేక బౌద్ధ స్థూపాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. మోటుపల్లిలో ఒక ప్రాచీన రామాలయం ఉంది. కాకతీయ గణపతి దేవుడు తన పాలనాకాలములో కట్టించిన ఏకైక దేవాలయము మోటుపల్లిలో 1249 ప్రాంతంలో కట్టించిన ఆలయమే.[3]

మార్కోపోలో సందర్శనా కాలములో మోటుపల్లిని ఒక తెలివైన రాణి పాలించేదని, ఆమె తన ప్రజలను న్యాయముగా సమానముగా పాలించేదని పేర్కొన్నాడు. ఆమె రాజ్యములోని ప్రజలు బియ్యము, మాంసము, పాలు, పండ్లు, చేపలు తిని జీవించేవారని రాసాడు. ఇతరత్రా చెప్పుకోదగిన విషయాలలో రాజ్యంలోని వజ్రాల ఉత్పాదన గురించి, రాజులకు తగినటువంటి సున్నితమైన వస్త్రాల గురించి, పుష్కలమైన మృగసంపద, భారీ గొర్రెలను గురించిన సంగతులు రాసాడు.[4]

ఈ గ్రామానికి తూర్పుదిశలో అరమైలు విస్తీర్ణంలో బౌద్ధమత స్థల ఆనవాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. 200 అడుగుల విస్తీర్ణం, 12 అడుగుల ఎత్తు ఉన్న దీనిని కాసులదిబ్బ అనిపిలుస్తున్నారు. ఇక్కడ నీటిగుంతలకోసం త్రవ్వడంతో ఇత్తడిసామాగ్రి, స్థూపానికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించినవి. ఒకప్పుడు ఇక్కడ మహా వెలుగు వెలిగిన బౌద్ధస్థూపం ఉన్నట్లు, తరువాత కాలగర్భంలో కలిసిపోయి, ఇక్కడ వీరభద్రస్వామి, కోదండరామస్వామి ఆలయాల నిర్మాణం జరిగినట్లు తెలియుచున్నది.

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవుగా దాదాపు 2000 సంవత్సరాలు విరాజిల్లిన ఘన చరిత్ర మోటుపల్లి కే దక్కింది. సా.శ. పూర్వం 260 వ సంవత్సరం నుండి సా.శ. 15వ శతాబ్దం వరకు మోటుపల్లి ఓడరేవు విదేశీ వర్తకంతో ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు పురాతన చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మోటుపల్లి పేరు చెవిన పడగానే కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి పాలించిన రోజులు ఇప్పటి తరం ప్రజానీకానికి గుర్తుకు వస్తాయి. కానీ అంతకు పూర్వం సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నుండే మోటుపల్లి ఓడరేవు ద్వారా విదేశీ వర్తకం జరిగిందనేది అందరికీ తెలియదు. ఇక్ష్వాకులు, బృహత్వాలయనులు, సాలంకాయనులు, విష్ణుకుండినులు, ఆంధ్ర శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, కొండవీటి రాజులు, విజయ నగర రాజులు మోటుపల్లి ఓడరేవు ప్రధాన కేంద్రంగా చేసుకొని విదేశీ వాణిజ్యం చేశారు. ఆ రాజుల పాలన అంతరించడంతో ఓడరేవుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న మోటుపల్లి పట్టణానికి ఆలనా పాలనా కరువై ప్రకృతి వైపరీత్యాలకు లోనై కాలగర్భంలో కలిసిపోయి ఉంటుందని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆనాడు నిర్మించిన వీరభద్ర స్వామి దేవాలయం, కోదండ రామ స్వామి దేవాలయం శిథిలావస్థలో నేటి తరానికి నాటి చారిత్రక ఆధారాలుగా మిగిలాయి. మోటుపల్లి ఇప్పుడు బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం అయినా వేటపాలెం మండలం లోని పందిళ్లపల్లి గ్రామం నుండి మాత్రమే మోటుపల్లికి రోడ్డు వసతి ఉంది. మోటుపల్లి సహజసిద్ధమైన ఓడరేవుగా ఆనాటి విదేశీ రాయబారులు పేర్కొన్నారు నౌకలు సముద్రం ఒడ్డుకు చేరేందుకు తగిన లోతు, అంతకు మించిన ప్రశాంతత మోటుపల్లి ఓడరేవులో ఉండేది. శ్రీ గంధం, పచ్చ కర్పూరం, చీనీ కర్పూరం, రత్నాలు, ముత్యాలు, రవసెల్లాలు, పన్నీరు, జువ్వాజి, దంతములు, కర్పూర తైలం, రాగి, సీసం, తగరం, పట్టు, పగడం, పత్తి, నార, అబ్రకం, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, సన్నని వస్త్రాలు, సమస్త ధాన్యాలు, ఏనుగులు మోటుపల్లి ఓడరేవు నుండి విదేశాలకు ఎగుమతి జరుగుతుండేవి. అప్పటి లోనే అరేబియా, ఈజిప్ట్, ఇటలీ, గ్రీసు, జర్మనీ, రొమేనియా, పారశీకం, జపాన్, చీనా, బర్మా, సుమిత్ర, జావా, బోర్నియో, సింహాళం దేశాలకు సముద్రయాన వాణిజ్య సంబంధాలు మోటుపల్లి ఓడరేవుతో ముడిపడి ఉన్నాయి. జామునకు ఏడు వేల బస్తాల వజ్రవైడూర్యాలు వారానికి కోటి వరహాల విలువ కలిగిన వస్త్రాలు నెలకు లక్ష సంచుల ఔషధాలు, జామునకుకు ఏడు లక్షల సంచుల అపరాలు మోటుపల్లి ఓడరేవు నుండి ఎగుమతి జరుగుతుండేది అని చరిత్ర చెబుతోంది . చంద్రగుప్తు మౌర్యుని కాలంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ క్రీస్తుపూర్వం 305వ సంవత్సరంలో భారతదేశం వచ్చాడు. పట్టణ వీధుల్లో రేగిపండ్లు మాదిరిగా రత్నాలు ముత్యాలు బంగారు ఆభరణాలు రాసులుగా పోసి అమ్ముతున్నట్లు మోటుపల్లి ఓడరేవు ప్రాముఖ్యత మెగస్తనీసు ప్రస్తావించాడు. క్రీస్తుశకం 405-411 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు పాహియాన్ నౌకాయానం ప్రాముఖ్యత తెలుపుతూ గంగానది తీరంలోని తామ్రలిప్తి నుండి సముద్రము తూర్పు తీరంగా విదేశీ వర్తకం దక్షిణ భారతదేశంలో మోటుపల్లి ఓడరేవు నుండి ప్రశస్తంగా జరుగుతున్నట్లు పేర్కొన్నాడు. 13వ శతాబ్దంలో కాకతీయ రాణి రుద్రమ దేవి పాలనా కాలంలో విచ్చేసిన ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తూర్పు పశ్చిమ దేశాలకు మోటుపల్లి ఓడరేవు నుండి వజ్రాలు నాణ్యమైన వస్త్రాలు ఎగుమతి అవుతున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాక ప్రసిద్ధ దేవాలయాలు కలిగిన పట్టణం అయినందున మోటుపల్లి ప్రముఖ యాత్రా కేంద్రంగా పేరెన్నికగన్న ట్లు తెలిపాడు. అప్పట్లో విదేశీ వర్తకులు మోటుపల్లి ఓడరేవు సముద్రతీరానికి సమీపంలో ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకుని దేవాలయ మండపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. అందువలననే కాకతీయ గణపతి దేవుడు వీరభద్ర స్వామి దేవాలయం మండపంలో అభయ శాసనాలు చెక్కించడం జరిగింది. ముకులపురం, మోహనపురం, దేశీయక్కొండ,[5] ముసలాపురము, వేలా నగరము, కరపట్టణము, మోహనగిరి పట్టణం, ముటఫీలి అనే పేర్లు కాలక్రమంలో రూపాంతరం చెందుతూ చివరకు మోటుపల్లి పేరు వాడుకలో ఉంది. క్రీస్తుశకం 106- 130 సంవత్సరాలలో గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి హయాంలో బౌద్ధమత వ్యాప్తి జరిగింది. ఆ సమయంలో బౌద్ధ సన్యాసులు మోటుపల్లి ఓడరేవు నుండి ఇతర దేశాలకు బౌద్ధమత వ్యాప్తికై ప్రయాణం చేసినట్లు ఆనాటి శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి. మోటుపల్లి ఓడరేవు సమీపంలోని కోదండరామ స్వామి దేవాలయంలో అగస్త్య మహాముని సీత రామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు కథ ప్రచారంలో ఉంది. దానికి ముందుగా మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయాలను ఏడెనిమిది శతాబ్ద కాలంలో నిర్మించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ దేవాలయాలలోని అంత్రాలయాల పైభాగంలో, మండపాలలో మహాబలిపురం తరహా శిల్ప కళ కనిపిస్తుంది. దేవాలయాల నిర్మాణం నల్ల రాతి స్తంభాలు గోడలకు నల్లరాయి వినియోగించారు. ఆలయ నిర్మాణంలో కేవలం ఒక రాయి పై మరొక రాయి పేర్చడం కనిపిస్తుంది. పల్లవులు 7, 8 శతాబ్ద కాలంలో సముద్ర వర్తకాన్ని ప్రోత్సహించిన దాఖలాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో మోటుపల్లి ఓడరేవుకు సమీపములో మల్లేశ్వర స్వామి, కోదండరామ స్వామి దేవాలయాలు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మల్లేశ్వర స్వామి దేవాలయం ఉత్తరముఖంగాను, కోదండరామ స్వామి దేవాలయం దక్షిణ ముఖంగాను ఉన్నాయి. ఇది దేవాలయ నిర్మాణం లోని అరుదైన విషయం. అయితే ఈ రెండు దేవాలయాల పై గోపురాలు ఆలయ నిర్మాణానికి భిన్నంగా ఇటుక రాయి సున్నంతో కట్టి ఉన్నాయి. గోపురాల పై ఉన్న శిల్పాలు చోళుల సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న ట్లు చెబుతున్నారు. ఆలయాల ఆవరణలోని బావులు కూడా లోపల నల్ల కొండ రాయి పలకలతో పైభాగము ఇటుక రాయి, సున్నము కట్టుబడితో ఉన్నాయి. కోదండరామ స్వామి దేవాలయ ఆవరణలో ఆ కాలంలో అతి తక్కువ లోతులో తవ్వి ఉన్న బావి లోని నీరు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఆ నీళ్ళు ఎంతో తియ్యగా ఉంటాయి. 1060 సంవత్సరాల ప్రాంతంలో ఉదయనుడు అనే మహారాజు కనపర్తిలో 101 శివలింగాలను ప్రతిష్ఠించి పెదగంజాంలో భావనారాయణ స్వామి దేవాలయం నిర్మించాడు. ఆ తరువాత మోటుపల్లి ఓడరేవు పై ఆసక్తి కనబరిచి ఈ పట్టణము నిర్మించి మోహనాపురము అని పేరు పెట్టాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న రెండు దేవాలయాలకు విశాలమైన మండపాలను నిర్మించాడు. ఆ తర్వాత ఆప్రాంతములో 95 శివలింగాలు ప్రతిష్ఠించి నూట ఒక్క బావులు తవ్వించాడు. ఆరు విష్ణు ఆలయాలు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతము అవి ఎక్కడా కనిపించడం లేదు. 13వ శతాబ్దంలో మోటుపల్లి ఓడరేవు ద్వారా వర్తకము జరిపి వారిని సముద్రపు దొంగల బారి నుండి రక్షించేందుకు కాకతీయ గణపతి దేవుడు తగిన కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నాడు. అందులో భాగంగా మోటుపల్లి వీరభద్ర స్వామి దేవాలయంలో తెలుగు సంస్కృత భాషల్లో అభయశాసనాలు చెక్కించాడు. అదేవిధంగా 14వ శతాబ్దంలో తమిళంలో కొండవీటి రాజు అనపోతారెడ్డి అభయ శాసనం చెక్కించాడు. కాకతీయ గణపతి దేవుని కుమార్తెలు రాణి రుద్రమదేవి, గణపమాంబ హయాంలో తూర్పు పశ్చిమ దేశాలతో మోటుపల్లి ఓడరేవు నుండి వర్తకము ఎంతో గొప్పగా జరిగినట్లు మార్కోపోలో స్పష్టం చేశాడు. దక్షిణ ప్రాంత పర్యటన సందర్భంగా మోటుపల్లి వీరభద్ర స్వామిని రాణి రుద్రమదేవి గణపమాంబలు పూజిస్తూ ఉండేవారని, ప్రజలను కన్న బిడ్డల్లా పాలించే వారని మార్కోపోలో పేర్కొన్నాడు. ఆ తరువాత 1362-80 సంవత్సరాల మధ్యకాలంలో అనవేమారెడ్డి తన తండ్రి అనపోతారెడ్డి పాలనా పద్ధతులను అనుసరించి మోటుపల్లి నుండి సముద్ర వర్తకాన్ని అభివృద్ధి పరిచేందుకు అనేక రాయితీలు ప్రకటించాడు విజయనగర సామ్రాజ్య అధినేత రెండవ హరిహర రాయలు మోటుపల్లి ఓడరేవును స్వాధీనపరచుకొని దేవరాయ వైద్యులకు పాలనా బాధ్యతలు అప్పగించాడు. సముద్ర వర్తకము సరళంగా సాగిపోయేందుకు 1390 సంవత్సరంలో ధర్మ శాసనం జారీ చేయడం జరిగింది. కర్ణాటక నుండి జరగవలసిన ఎగుమతులను మోటుపల్లి ఓడరేవు ద్వారా జరిగే విధంగా చేశారు. రెండవ హరిహర రాయలు మరణానంతరం ప్రోలయ వేమారెడ్డి మోటుపల్లి ఓడరేవు తిరిగి స్వాధీనం చేసుకొన్నాడు. ఆయన పాలనలో 1402-20 వరకు మోటుపల్లి ఓడరేవుకు పూర్వ వైభవం లభించినట్లు హరవిలాసం గ్రంథంలో శ్రీనాథుడు పొందుపరిచాడు. వేమారెడ్డి మరణానంతరం కొండవీడు సామ్రాజ్యం పతనమైంది. దీంతో 15వ శతాబ్దం నాటికి మోటుపల్లి ఓడరేవు ప్రాధాన్యత సన్నగిల్లింది. గోల్కొండ పాలకులైన బహమనీ సుల్తానులు మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధిని ప్రోత్సహించారు. ఈ విధంగా రెండు వేల సంవత్సరాల పాటు ప్రసిద్ధ ఓడరేవుగా విరాజిల్లిన మోటుపల్లిలో ఆ రూపు రేఖలు కనుమరుగయ్యాయి. కొన్నాళ్ళకు ప్లేగు వ్యాధి సంభవించి ప్రజలు అనేక మంది అసువులు బాశారు . దీంతో మోటుపల్లి పట్టణంలోని ప్రజలు సమీప ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ఆనాటి ప్రసిద్ధ పట్టణం పలు దేవాలయాలు క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయాయి. కాగా సముద్ర తీరానికి సమీపములో ఇసుక మేట వేసిన తిన్నెల నడుమ కోదండ రామ స్వామి దేవాలయం, వీరభద్ర స్వామి దేవాలయం శిథిలావస్థలో గత చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలాయి. గుప్త నిధులు దొంగిలించే ప్రయత్నంలో 1960 సంవత్సరం నుండి ఒక దశాబ్ద కాలంలో పలు పరిణామాలు చోటు చేసుకొని చివరకు దేవుడు లేని కోవెలలుగా మిగిలాయి. 1960వ సంవత్సరంలో వీరభద్ర స్వామి ఆభరణాలు దోపిడీకి గురి అయ్యాయి. 1963వ సంవత్సరంలో వీరభద్ర స్వామి దేవాలయం లోని నాలుగు పంచలోహ ఉత్సవ విగ్రహాలు దొంగల పాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు, పోయిన వీరభద్ర స్వామి ఆభరణాలు, నాలుగు ఉత్సవ విగ్రహాలు కొంతకాలానికి తిరిగి దొరికాయి. కానీ 1971 వ సంవత్సరములో మరలా దొంగలపాలు అయ్యాయి. 1971 సంవత్సరం జూన్ 22వ తేదీ రాత్రి వీరభద్ర స్వామి మూలవిరాట్టును పీఠముతో పాటు లేవనెత్తి పక్కన పెట్టి ప్రతిష్ఠ సమయంలో శాస్త్రయుక్తంగా ఉంచే వజ్రవైడూర్యాలను దొంగిలించారు. పీఠం కింద ఉన్న నేల పాటి మట్టి అయినందున వజ్రాలతో కూడిన బిందెను తొలగించినట్లు ఆ సంఘటన చూసిన వారు చెబుతున్నారు. ఆ సందర్భంలో వీరభద్ర స్వామి విగ్రహం చాతి పక్క భాగం పగిలింది. ఆ వీరభద్రుని మూలవిరాట్టు విగ్రహాన్ని వేళ్ళ గోటితో కొడితే ఖంగున శబ్దం రావడం విశేషం. ఆ తరువాత వీరభద్ర స్వామి దేవాలయం లోను, కోదండరామ స్వామి దేవాలయంలో అనేక పర్యాయములు అక్కడక్కడా తవ్వకాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. 1972 వ సంవత్సరంలో కలెక్టర్ కత్తి చంద్రయ్య వీరభద్ర స్వామి దేవాలయానికి సమీపంలోలో 80 మంది మత్స్యకారులకు నివాస వసతి కల్పించి ఆ గ్రామానికి రుద్రమాంబ పురం అని పేరు పెట్టారు ఆ గ్రామానికి చెందిన కఠారి వీరభద్రయ్య కూరగాయలు సాగు చేసుకునేందుకు నీటి వసతి కై పొలంలో దొరువు తవ్వుతున్న సమయంలో 1973 వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన 11 పంచలోహ దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. అందులో మూడున్నర అడుగుల ఎత్తు ఉన్న నటరాజ విగ్రహంతో పాటు పార్వతి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, భద్రకాళి, ఆళ్వారులు 2, మరో నాలుగింటిలో రెండు పురుష, 2 స్త్రీ మూర్తులు విగ్రహాలు ఉన్నాయి. వీటిని మొదట చీరాల సబ్ ట్రెజరీ కార్యాలయానికి తరలించి తదుపరి హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఉంచారు. అదేవిధంగా వీరభద్ర స్వామి విగ్రహాన్ని విజయవాడలోని విక్టోరియా మ్యూజియంలో భద్రపరిచారు. ఆ ప్రాంతంలో బయటపడిన దేవతామూర్తుల రాతి విగ్రహాలు కొన్నింటిని కనపర్తి మ్యూజియంలో భద్రపరిచారు. కోదండ రామ స్వామి దేవాలయం లోని సీతారామ లక్ష్మణ పంచలోహ ఉత్సవ విగ్రహాలను ఇప్పటి మోటుపల్లిలో కొత్తగా నిర్మించిన కోదండరామ స్వామి దేవాలయంలో కొలువుదీర్చారు. పురావస్తు శాఖ వారు 1973 సంవత్సరంలో బయటపడిన పంచలోహ విగ్రహాలను చోళ రాజుల కాలం నాటివిగా గుర్తించారు. 1974 సంవత్సరంలో మోటుపల్లి లోని కాసుల దిబ్బలో జరిగిన తవ్వకాలలో 22 ఇన్ టూ 5.5 మీటర్లు కస్టమ్స్ హాల్ పునాది, 11 12 శతాబ్దాల నాటి చైనా నాణెములు, రాజరాజు, రాజేంద్ర చోళ, గయాజుద్దిన్ తుగ్లక్ కాలం నాటి నాణేలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ వారు నిషేధాజ్ఞలు జారీ చేస్తూ చేసిన ప్రకటనల వల్ల ప్రయోజనమేమీ చేకూరలేదు. వీరభద్ర స్వామి దేవాలయాన్ని సంరక్షించేందుకు కాపలా ఉంచిన ఉద్యోగి కూడా ఇటీవల ఆ ప్రాంతంలో కనిపించడం లేదు. పురాతన కట్టడాలు, శిల్ప సంపదతో ప్రాధాన్యత సంపాదించుకున్న మోటుపల్లిని అభివృద్ధి పరిచి ప్రముఖ యాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సముద్రతీరంలో అతిథి గృహం, బస్ షెల్టర్ నిర్మించి సక్రమమైన రోడ్డు వసతి కల్పిస్తే మోటుపల్లిని సందర్శించేందుకు యాత్రికుల రద్దీ పెరుగుతుందని ఆ ప్రాంత వాసులు ఆశపడుతున్నారు. కాలగర్భంలో మాటు మణిగిన మోటుపల్లి ఏనాటికైనా మహా పట్టణంగా విరాజిల్లే రీతిగా కాలం అనుకూలిస్తుందని ఆశిద్దాం.

 
 
నటరాజ
ఛోళుల కాలంనాటి నటరాజుని కంచు విగ్రహం. ఆఘమశాస్త్ర సూత్రాధారం మైన అంసుమద్భేదగమలో చెప్పిన అన్ని లక్షణాలతో, గుణగణాలతో పరిపూర్ణ నిర్మాణాకృతిని కలిగిన అద్భుతమైనది ఈ నటరాజ విగ్రహం.

బధ్రపీఠము మీద ఉన్న పద్మపీఠం పైన అపస్మారపురుషుడ్ని వేసిన నటరాజు వాడి వీపుపై కుడిపాదం ఉంచి అణగతోక్కుతున్నాడు. ముప్పైఐదు జ్వాలా కుమ్ములు వాణ్ణి చుట్టుముట్టి  మంటలు రేపుతున్నాయి. ముప్పైఐదు జ్వాలా కుమ్ములు నటరాజును పరివేష్ఠించి వెలుగులు చిమ్ముతున్నాయి. గిటకబారిన మానవాకార పిచాచ భయంకరుడు ముయాలకుడనే రాక్షసుడు. దారుణ విధ్వేషాగ్నుల్ని రగల్చడంలో అపార శక్తి సామర్థ్యలు కలవాడు. అజ్ఞానాంధకారము మూర్తీబవించినవాడు, పేరాసకు ఆనవాలు, తన స్వార్దము తన సౌఖ్యము తన సంపదకోసం ఇతరులను పీడించేవాడు ఈ ముయాలకుడు. అలాంటి వాడి వీపుమాద ఉక్కు పాధము మోపి నడ్డివిరగగొట్టటం అంటే ఏమిటో సరిగ్గా నటరాజు అదే చేస్తున్నాడు. కుడికాలి పాదంక్రింద వాణ్ణి అణగదొక్కుతున్నాడు. 

నటరాజు డమరుకాన్ని ఒక పైచేతిలో, అగ్నిని ఇంకొక పైచేతిలో పట్టుకొని, క్రింది ఎడమచేతిని గజ హస్త ముద్రలోను కుడిచేతిని అభయముద్రలోను ఉంచారు. కుడికాలుని కొంచం వంచి ఎడమకాలుని పైకిలేపి కుడివైపుకు తిప్పినట్టుగా కనిపిస్తుంది.  జడలు సమాంతరంగా వ్యాపించి ఉన్నాయి. ఒకవైపు గంగ ఒకవైపు చంద్ర జడలను అంటిపెట్టుకొని ఉన్నారు. తలపాగాలో నెమలీకలు పొదగి నాగుపాము పడిగ ఒక కొసన కప్పిఉంది. ఫాలభాగములో త్రినేత్రం అధిష్టించిఉంది. సర్పకుండలాలని దరించి ఉన్నాడు. బుజకీర్తులు, మెడలో దండలు, కడియాలు, మొలత్రాడు, వేళ్ళకు ఉంగరాలు, అందెలు, వస్త్రాల అంచులకు వ్రేలాడే కుచ్చులు ఇరువైపులా ఊగుతున్నట్లుగా ఉన్నాయి.

ముయాలకుడు తన కుడిచేతిలో ఒకపాముని పట్టుకొని తర్జని ముద్ర (భయకంపిత) లో ఉన్నాడు. ఇతను తలపాగా, హారము, కేయురము, మోలత్రాడుతో బొడ్డులో పిజిబాకుని  దరించి ఉన్నాడు. నోటి కోరలు కూడా కనిపిస్తున్నాయి.

మోటుపల్లిలో (ఇప్పటి రుద్రమాంభాపురం లో) 1972లో దొరువు తవ్వుతూ ఈ విగ్రహంతో పాటు ఇంకా పది విగ్రహాలని వెలికితీసిన వీరభద్రునికి నా సాష్టంగ దండ ప్రమాణం

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి చినగంజాంలోను, మాధ్యమిక పాఠశాల కడవకుదురులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల చినగంజాంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు వేటపాలెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ వేటపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం వేటపాలెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

మోటుపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

మోటుపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 266 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 149 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 149 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 419 హెక్టార్లు
  • బంజరు భూమి: 170 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 437 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 543 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 64 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

మోటుపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 36 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 28 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

మోటుపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, కూరగాయలు

గ్రామ పంచాయతీ

మార్చు
  1. ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటయినప్పటినుండి 1963-64 నుండి 1989 వరకూ, 5 విడతలుగా శ్రీ పండ్రాజు వెంకటరామారావు, మొత్తం 25 సంవత్సరాలు, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. మొదటి ధరావతు రు. 100-00. ఈయనకు పెద్దలు సంపాదించిన 120 ఎకరాలూ, 1989 నాటికి 50 ఎకరాలకు వచ్చింది. అంతా గ్రామానికి ఖర్చు చేశారు. కృష్ణానగరులో పేదలకు ఎసైన్ మెంట్, సీలింగు భూములు 40 ఎకరాలు, అడవీధిపాలెంలో 20 ఎకరాలు, రుద్రమాంబాపురంలో 70 ఎకరాలు, పేదలకు పంపిణీ చేయించారు. ప్రభుత్వ పాఠశాలలు, పేదలకు ఇళ్ళు, రహదర్ల అభివృద్ధి చేశారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం.
  • శ్రీ కోదండస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గామ విశేషాలు

మార్చు

మోటుపల్లి గ్రామ పంచాయతీ యానాదిసంఘంలో, 2015, ఏప్రిల్-30వతేదీనాడు, సింహవాహనంపై ఉన్న, లోహంతో చేసిన కనకదుర్గమ్మ ప్రతిమ బయటపడింది.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,838. ఇందులో పురుషుల సంఖ్య 1,433, మహిళల సంఖ్య 1,405, గ్రామంలో నివాస గృహాలు 763 ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. Precolonial India in Practice: Society, Region, and Identity in Medieval Andhra By Cynthia Talbot పేజీ.131 [1]
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-19. Retrieved 2007-10-17.
  5. పోలవరపు, కోటేశ్వరరావు. "కొండవీటి ప్రాభవం - శ్రీనాథుని వైభవం". Internet Archive. p. 18. Retrieved 2024-09-30.

వెలుపలి లంకెలు

మార్చు