విష్ణువు వేయి నామములు-1-100

(యోగః నుండి దారిమార్పు చెందింది)
విష్ణు సహస్రనామ స్తోత్రము
వేయి నామముల వివరణ
1 - 100
101 - 200
201 - 300
301 - 400
401 - 500
501 - 600
601 - 700
701 - 800
801 - 900
901 - 1000
1 - 1000 లఘు వివరణ

విష్ణు సహస్రనామ స్తోత్రములోని వేయి నామాలలో మొదటి 100 నామములకు క్లుప్తంగా అర్ధాలు ఇక్కడ ఇవ్వడమైనది.

కమలంపై పద్మాసనంలో కూర్చున్న విష్ణువు క్లోజప్. కవి జయదేవుడు విష్ణువుకు నమస్కరించడం, కాగితంపై గౌచే పహారీ, భక్తి చిత్రం, బేర్-బాడీ, తల వంచి, కాళ్లు, చేతులు ముడుచుకుని, జయదేవుడు ఎడమవైపు నిలబడి, పూజా సామగ్రిని పద్మాసనం ముందు ఉంచారు. అక్కడ కూర్చున్న విష్ణువు కవిని ఆశీర్వదించాడు.


విష్ణు సహస్రనామాల గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంథం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించింది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.

వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఈ వ్యాసం చివరిలో చూపిన వనరులు ఆధారంగా వివిధ భాష్యకారుల భాష్యాలను సంక్షిప్తంగా చెప్పే వివిధ భావాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది.

కొన్ని నామాలకు ప్రత్యేక వ్యాసాలు కూడా ఉన్నాయి.

శ్లోకం 01

మార్చు
  1. విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము), సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు
  2. విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు).
  3. వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు) ; అంతటినీ నియంత్రించి పాలించు వాడు.
  4. భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు.
  5. భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).
  6. భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.
  7. భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.
  8. భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.
  9. భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత.

శ్లోకం 02

మార్చు
  1. పూతాత్మా --- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. 'పూత' అనగా పవిత్రమైన, 'ఆత్మా' అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు. భూతములు ఆవిర్భవించి, వృద్ధిచెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు.
  2. పరమాత్మా --- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణములకంటె విలక్షణమైనవాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు.
  3. ముక్తానాం పరమాగతిః --- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటె ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమగమ్యమయిన వాడు - భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతియని తెలియదగును. నదికి సాగరము పరమగతి అయినట్లు-మానవులకు భగవానుడు పరమగమ్యమయి ఉన్నాడు. సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమయిన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది. అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు. "దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు.
  4. అవ్యయః --- తరుగు లేని వాడు; తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు, వికారము లేనివాడు. గోచరమగునది యేదయినను పరిణామము చెందును. పరిణామశీలమయిన వస్తువు నశించి తీరును. భగవానుడలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు.
  5. పురుషః --- ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు; శరీరమందు శయనించియున్నవాడు; సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు.
  6. సాక్షీ --- సర్వమును ప్రత్యక్షముగా (ఇంద్రియ సాధనములు అవుసరము లేకుండా) చూచువాడు; సమస్తము తెలిసినవాడు; భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు. సా+అక్షి = చక్కగా దర్శించువాడు. చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి యని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది.
  7. క్షేత్రజ్ఞః --- ఈ శరీరమను క్షేత్రమున విలసిల్లుచు, నాశనరహితుడై, క్షేత్ర తత్వమును తెలిసిన వాడు; ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పర బ్రహ్మానుభవము తెలిసి, వారినక్కడికి చేర్చువాడు.
  8. అక్షరః --- ఎన్నడునూ (కల్పాంతమునందు కూడ) నశింపక నిలచియుండువాడు; ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు.

శ్లోకం 03

మార్చు
  1. యోగః --- ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము; యోగము వలననే పొందదగినవాడు; కోర్కెలు తీరుటకు తిరుగులేణి ఉపాయము. ధ్యానము వలన, సమత్వ భావము వలన తెలియబడువాడు. యోగముచే పొందదగినవాడు - భగవానుడు. సాధ్య సాధనములు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. సాధ్యవస్తువయిన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, యోగయుక్తుడయిన భగవానునితో కలసి కరిగిపోవుటయే యోగము.
  2. యోగవిదాం నేతా --- తానే మార్గదర్శియై, నాయకుడై, యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. యోగులకు నేత; కర్మజ్ఞానాది సాధనాంతరములకు ఫలమునొసగువాడు.
  3. ప్రధాన పురుషేశ్వరః --- ప్రధానము (ఆనగా ప్రకృతి, మాయ), పురుషుడు (జీవుడు) - రెండింటికిని ఈశ్వరుడు (అధిపతి, నియామకుడు).
  4. నారసింహ వపుః --- ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు; అభయమునొసగువాడు. మంగళ మూర్తి.
  5. శ్రీమాన్ --- రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనారసింహ మూర్తిగా) ; సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు.
  6. కేశవః --- సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి) ; అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. 'కేశ' యనెడి అసురుని వధించినవాడు - విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు - శ్రీ కృష్ణుడు. "క + అ + ఈశ" కలసి "కేశ" శబ్దమయినది. 'క' అనగా బ్రహ్మ. 'అ' అనగా విష్ణువు, 'ఈశ' అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు.
  7. పురుషోత్తమః --- పురుషులలో ఉత్తముడు; త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) - ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు.

శ్లోకం 04

మార్చు
  1. సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.
  2. శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్ఠములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.
  3. శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.
  4. స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.
  5. భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములను సృష్టించిన వాడు.
  6. నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.
  7. సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.
  8. భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.
  9. భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.
  10. ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.
  11. ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడా భోగ మోక్షములోసగు సమర్ధుడు.
  12. ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.

శ్లోకం 05

మార్చు
  1. స్వయంభూః --- స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండా జన్మించువాడు.
  2. శంభుః --- శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు.
  3. ఆదిత్యః --- సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు; ద్వాదశాదిత్యులలో విష్ణువు;సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు; అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు - భగవానుడు. "ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే" యని భగవానుడు భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. 'ఆదిత్యః' అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును.
  4. పుష్కరాక్షః --- తామరపూవు వంటి కన్నులు గల వాడు.
  5. మహాస్వనః --- గంభీరమైన దివ్యనాద స్వరూపుడు; వేద నాదమునకు ప్రమాణమైనవాడు.
  6. అనాదినిధనః --- ఆది (మొదలు, పుట్టుక) లేనివాడు, నిధనము (తుది, నాశనము) లేనివాడు.
  7. ధాతా --- బ్రహ్మను కన్న వాడు; నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు.
  8. విధాతా --- బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు; విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగమంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆదిదేవుడు విధాత ఆయెను.
  9. ధాతురుత్తమః --- బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు; సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు.

శ్లోకం 06

మార్చు
  1. అప్రమేయః --- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకందనివాడు; సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము.
  2. హృషీకేశః --- ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి; సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయువాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు - భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది.
  3. పద్మనాభః --- నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మమునుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు - భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను.
  4. అమరప్రభుః --- అమరులైన దేవతలకు ప్రభువు
  5. విశ్వకర్మా --- విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు - భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్ధ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుదు సృష్టిరచన సాగించెను; కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. "సర్వభూతములు నాయందున్నవి. నేను వానియందు లేను" అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు.
  6. మనుః --- మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.
  7. త్వష్టా --- శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు; బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు.
  8. స్థవిష్ఠః --- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి; సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి.
  9. స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు
  10. ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు
    స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు

శ్లోకం 07

మార్చు
  1. అగ్రాహ్యః --- తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింప నలవి కానివాడు.
  2. శాశ్వతః --- కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.
  3. కృష్ణః --- సర్వమును ఆకర్షించువాడు; దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు; సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు..
  4. లోహితాక్షః --- తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.
  5. ప్రతర్దనః --- ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.
  6. ప్రభూతః --- పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.
  7. త్రికకుద్ధామః, త్రికకుబ్ధామః --- సామాన్యలోకము కంటే మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు; జాగ్రత్, స్వప్న, సుషుప్తి - మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.
    త్రికకుత్ --- మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి
    ధామః --- నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.
  8. పవిత్రం --- పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.
  9. మంగళం పరం --- అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు.

శ్లోకం 08

మార్చు
  1. ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.
  2. ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి) ;ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి) ; ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).
  3. ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము.
  4. జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.
  5. శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.
  6. ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.
  7. హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.
  8. భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.
  9. మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి (మా) కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు) ; మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.
  10. మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.

శ్లోకం 09

మార్చు
  1. ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
  2. విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.
  3. ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.
  4. మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.
  5. విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి) ; పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.
  6. క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి) ; సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక) ; అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు) ; సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).
  7. అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.
  8. దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.
  9. కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.
  10. కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.
  11. ఆత్మవాన్ --- సత్కార్యములోనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.

శ్లోకం 10

మార్చు
  1. సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.
  2. శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.
  3. శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.
  4. విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.
  5. ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.
  6. అహః --- ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.
  7. సంవత్సరః --- భక్తులనుద్ధరించుటకై (వెలసి) యున్నవాడు; కాల స్వరూపుడు.
  8. వ్యాళః --- భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)
  9. ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును) ; ప్రజ్ఞకు మూలమైనవాడు.
  10. సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు.

శ్లోకం 11

మార్చు
  1. అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.
  2. సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.
  3. సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
  4. సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
  5. సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రథమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.
  6. అచ్యుతః --- తన దివ్య తేజో విభూతి శక్తి సంపన్నత్వములనుండి యెన్నడును జారని (తరగని) వాడు; తన భక్తులెన్నడును పతనము చెందకుండ గాచువాడు; జన్మ, పరిణామ, వార్ధక్యము వంటి దశలకు అతీతమైనవాడు.
  7. వృషాకపిః --- జలములలో (అధర్మములో) మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; ధర్మ పరిరక్షకుడు.
  8. అమేయాత్మా --- ఆ పరమాత్ముని స్వరూపము కొలుచుటకు (తెలిసికొనుటకు) సాధ్యము కాదు; ఆశ్రితులను అనుగ్రహీంచుటలో పరిమితి లేనివాడు. ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు - భగవంతుడు. అందరి ఊహలకు తాను కారణమై యుండగా తన ఊహలను ఊహించు సామర్ధ్యమెవరికున్నది.
  9. సర్వ యోగ వినిసృతః --- అన్ని సంగములకు, బంధములకు, విషయ వాసనలకు అతీతుడు; ఎన్నో విధములైన (జ్ఞాన, కర్మ, భక్తి వంటి) యోగములద్వారా సులభముగా పొందనగువాడు.

వనరులు

మార్చు