రాయలసీమ ప్రేమ కథలు

రాయలసీమ ప్రేమ కథలు కథా సంకలనం రాయలసీమ కథా రచయితల వస్తువైవిధ్యాన్ని, మంచి కథలను పాఠకులకు అందించడం కోసం డా. ఎం. హరికిషన్ గారి చేత 20కథలతో రూపొందించబడింది. 2020 నవంబరులో దీప్తి ప్రచురణలువారు ఈ సంకలనాన్ని ప్రచురించారు.

దస్త్రం:Rayalaseema prema kathalu (2).tif


సంపాదకుడు: డా.ఎం.హరికిషన్ - కర్నూలు మార్చు

ఈ సంకలనంలోని కథలు - కథా రచయితలు మార్చు

ముందుమాట: కిన్నెర శ్రీదేవి

ఆగామి వసంతం - బండి నారాయణస్వామి

ఇల్లీగల్ ప్రేమ కథ - సుంకోజి దేవేంద్రాచారి

ఓ ప్రేమ కథ - పేరం ఇందిరాదేవి

కరివేపాకు - పాలగిరి విశ్వప్రసాద్

క్లైమాక్స్ లేని కథ - సొదుం జయరాం

జాస్మిన్ - డా.ఎం. హరికిషన్

టోపీ జబ్బార్ - వేంపల్లి షరీఫ్

నీకూ నాకూ మధ్య నిశీధి - సింగమనేని నారాయణ

నిత్య కళ్యాణం పచ్చ తోరణం - గోపిని కరుణాకర్

పైరుగాలి - కలువకొలను సదానంద

ప్రియ బాంధవి - మధురాంతకం రాజారాం

బొగ్గుల బట్టి - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

మధురమీనాక్షి - ఆర్.ఎస్.సుదర్శనం

మన ప్రేమ కథలు - కేతు విశ్వనాథరెడ్డి

మనసున మల్లెలు - కేఎస్వీ

మొలకల పున్నమి - వేంపల్లి గంగాధర్

వెదురుపూవు - మధురాంతకం నరేంద్ర

శిల్ప సంగీతం - వి.ఆర్.రాసాని

హృదయం - రమణజీవి

ముందుమాట - కిన్నెర శ్రీదేవి మార్చు

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం తెలుగు శాఖలోలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిన్నెర శ్రీదేవిగారు ఈ పుస్తకానికి సవివరమైన ముందుమాటను అందించారు.

ఈ సంకలనంలో ఏముంది మార్చు

కిన్నెర శ్రీదేవిగారు ముందుమాటలో ఏమి చెప్పారో చూద్దాం

ఒకప్పుడు రాయలసీమ సాహిత్యం అనగానే శ్రీకృష్ణ దేవరాయల సాహితీవైభవమే గుర్తుకొచ్చేది. ఇప్పుడు కరువులు, కార్పణ్యాలు మాత్రమే రాయలసీమ అస్తిత్వంగా చూడబడుతున్న నేపథ్యంలో 'రాయలసీమ ప్రేమకథలు" సంకలనం రావడం పూర్వ పాక్షిక సత్యంగా ఋజువు చేస్తుంది. ఈ ప్రయత్నం సీమవాసులకు గర్వం. సీమేతర సహృదయుల స్పందనలకు ప్రేమాస్పద ఆహ్వానం కాగలవు.

రాయలసీమలో ప్రేమకథలు లేవా? అనే ఆలోచనలు కలిగినపుడంతా ఆసక్తిగా పుస్తకాలు తిరగేయడం, మరుసటిరోజు మరోపనిలో కూరుకుపోవడం జరిగేది. చలం కథలు చదివినపుడంతా ప్రేమ కోసం పరితపించిన స్త్రీమూర్తులందరూ కళ్ళ ముందు నుండి కదిలేవాళ్ళు కాదు. అలాంటి పాత్రలు రాయలసీమ నుండి కానీ, తెలంగాణ నుండి కానీ, ఉత్తరాంధ్ర నుండి కానీ ఎందుకు రాలేదా అని పరితపించేదాన్ని. దశాబ్దాల నుండి వెంటాడుతున్న బాధ నుండి విముక్తం చేసే సంకలనం తయారవుతుందని కర్నూలుకి చెందిన సాహితీ మిత్రుడు డా.ఎం.హరికిషన్ చెప్పినపుడే ఉద్వేగానికి లోనయ్యాను. సంకలనానికి ముందుమాట రాయమనగానే ఒప్పుకున్నందుకు మంచి ప్రతిఫలమే దొరికింది. చలం స్త్రీ పాత్రలకు దీటైన పాత్రలను బొగ్గులబట్టిలో కాలి పుటం పెట్టిన బంగారం లాంటి రంగమ్మను, మెర్సీని, మధుర మీనాక్షిని, సిస్టర్ రెజీనాను, జాస్మిన్, సుధారాణి, అచ్చమ్మవ్వను కలుసుకోగలిగాను.

సంపాదకుడు ఏర్పరచుకొన్న ప్రమాదాల నిర్దిష్టత సంకలనంలోని కథల ఎన్నిక క్రమమే ఎరుకజేస్తుంది. కర్నూలుకు చెందిన డా.ఎం.హరికిషన్ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు, మూడు పర్యాయాలు తర్కించుకుంటూ, మిత్రులతో గంటలకు గంటలు చర్చించి తేల్చుకొన్న క్రమ కూడా తెలుస్తుంది. ఈ సంకలనంలో కథల్ని చేర్చుకోవడానికి, మరి కొన్నింటిని చేర్చలేక పోవడానికి గానీ గల కారణాలు కూడా కథల ఎంపికే తెలుపుతుంది. ప్రేమకథల్లో అనుసంధానంగా వ్యక్తమయ్యే ఫ్యాక్షన్, హింస, జుగుప్స, సెక్స్ లాంటి కథావస్తువుల్ని పరిహరించగలిగారు. హృదయాన్ని కదిలించలేని కథను స్వీకరించలేదు. అనుభవజ్ఞులైన రచయితలైనా, వర్తమాన రచయితలైనా (వయసు రీత్యా) సమాన ప్రాతినిధ్యం. సామాన్య పాఠకున్ని సైతం సునాయాసంగా చదివించే గుణం వుండటం, చర్విత చరణ కథా వస్తువుకు మినహాయింపుగా నిలవటం ఈ సంకలనం ప్రత్యేకత.

ప్రేమ హృదయజనితమైనది. వెలుతురు, గాలిలాగా అది విశ్వమంతా వ్యాపించి వుంటుంది. ఎవరి మానసిక స్థాయిలో, వాళ్ళు దాన్ని అందుకో గలుగుతారు. అనుభవించగలుగుతారు. అటువంటి ప్రేమ గొప్ప విలువలకు, అనుభూతులకు దారి తీస్తుంది. పైకి కనబడే స్త్రీల జీవితానికీ హృదయగత అనుభవానికి గల అంతరాన్ని గురించి ప్రస్తావిస్తుంది 'కరివేపాకు' కథ. మగవాళ్ళ కంటే స్త్రీలకే ఎక్కువ ప్రేమలుంటాయని, ఆ ప్రేమలను బయటికి వ్యక్తం చేసే ధైర్యం సిస్టర్ రెజీనా, జాస్మిన్ లాంటి స్త్రీలకు సమాజం ఇవ్వలేదు. అందువల్లే వాళ్ళు పరిగెత్తే మనసును లోలోపలే కుకేస్తుంటారు. వ్యక్తం చేయగలిగిన మెర్సీలాంటి స్త్రీలు, ఫలించని ప్రేమల కోసం భావుకత్వంలో బ్రతుకుతుంటారని” విసు, అతని స్నేహితునిలాంటి కుసంస్కారుల హేళనలకు గురవుతారు.

స్త్రీపురుషుల మధ్య మోహాన్నీ, స్నేహాన్నీ, ప్రణయాన్ని అర్థం చేసుకోగలిగే స్థాయిగల వాళ్ళు చాలా తక్కువమంది. వారి వెనుక లేకిగా మాట్లాడేవారే ఎక్కువ. నాగరికతా శిఖరాలను అధిరోహించామని గర్వపడేవాళ్ళున్నా, ప్రేమ విషయంలో ఇంకా ఎదగలేదనే తెలుస్తుంది. అలాంటి వాళ్ళు హృదయౌన్నత్యాన్ని అలవరచుకోవాల్సి వుందన్న సత్యాన్ని ఋజువుపరిచిన కథానాయికలు 'కరివేపాకు', 'బొగ్గుల బట్టి' కథల్లో కనబడతారు. ఈ స్త్రీలలో ఎంత ప్రేమ లేకపోతే తాము ప్రేమించిన అతని కోసం అంతగా తాపత్రయపడతారు. ఎంత తీవ్రంగా ప్రేమ కోసం తపించారో అంతే స్థిరంగా వాళ్ళను త్యజించగలిగారు. (ఈ మాత్రం సైర్యం చలం రాజేశ్వరి కూడా చేయలేకపోయింది).

స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి శరీరాన్ని, మనసునూ ఏకకాలంలో ఒకేరీతిగా ప్రేమించగలిగే హృదయం 'జాస్మిన్' కథలో పరిమళిస్తుంది. ఈ నాటికీ స్త్రీకి గుర్తింపు భౌతికంగానే ఉంది. స్త్రీ శరీరం కోసం వేరే దారులు వెదుక్కొనే మగవాళ్ళు ఈనాటికీ కొత్తగాదు. కానీ పరిస్థితుల ప్రమేయంతో మరోదారి లేక తమ అందాన్నే జీవనోపాధిగా చేసుకొన్న స్త్రీల బతుకు గమ్యం బస్టాండులో భిక్షువర్షీయసై దర్శనమిస్తే, పగిలింది. ఆ ప్రేమికుని ఒక్క గుండేనా...? పాఠకుల గుండెలు కూడా.

సమాజం స్త్రీలకు పురుషులతో పాటు సమాన హోదా కలిగించడానికి, ఆమెను చైతన్యవంతురాలిని చేయడానికి విశాలభావాలు గల సహృదయులకు ఎలాంటి పేచీ లేకపోయినా, ఎంతమంది ఆమోదిస్తారనేది సందేహాస్పదం.

హృదయం పలికే మాటల్ని అలంకారాలూ, ఛందస్సులతో ప్రమేయం లేకుండా అదే తీరున కాగితం పైన పెట్టగలగడంలోనే రచయిత నేర్పు వుంటుంది. హృదయంలోని లయ రాతల్లో కనపడాలి. ఏం ఆలోచిస్తున్నాడో, ఏమి అనుభవిస్తున్నాడో దానిని అందరికీ అర్థమయేలా రాయడం రాయలసీమ రచయితలకు తెలుసనడానికి ఈ సంకలనమే ఒక ఆనవాలు.

కథల వివరణ మార్చు

ఆర్.యస్. సుదర్శనం "మధుర మీనాక్షి" కథలోని ప్రేమైక తత్వాన్ని ఆధ్యాత్మిక, అస్తిత్వ తాత్త్విక నేపథ్యం నుండి చిత్రించిన వైవిధ్యమైన కథ. మధుర మీనాక్షి దర్శనం ద్వారా పొందిన మానసిక అనుభూతి, తత్వశాస్త్ర అధ్యాపకురాలి శారీరక అనుభవంతో పొందిన సంతృప్తితో లంకె. అందుకే భౌతిక అనుభవాన్ని అందించిన మీనాక్షిని సొంతం చేసుకోవాలని తపిస్తాడు. రెండు సంవత్సరాల భార్యా వియోగంతో జీవితంలో ఏర్పడిన అనిశ్చిత మానసిక స్థితి కథ ముగింపులో కూడా చొరబడింది. కథ రొమాంటిక్ మూడ్ నుండి ధార్మిక విచికిత్సలోకి దారి తీస్తుంది. "ఆమెను వివాహం చేసుకుంటే... అనే ఆలోచన ప్రారంభమైంది. ఆమెను శాశ్వతంగా నాదాన్ని చేసి తీసుకొని వెళ్ళిపోవాలి అనే కోరిక కలిగింది. ఆమె ఎవరైనా సరే ఆమెను గూర్చిన వివరాలేవైనా సరే. ఆమె నాకు కావాలి అనే దృఢనిశ్చయానికి వచ్చాను" అంటాడు. అతనికి అమెపై కలిగిన ఇష్టానికి ప్రాతిపదికలు లేవు. కథంతా ఆమె పట్ల అతని అనుభూతులు, అనుభవాలే ఉన్నాయి. రెండవ పార్శ్వంలో అంటే ఆమె వైపు నుండి కూడా చిత్రించి వుంటే కథకు సమగ్రత చేకూరేది. అతని దృష్టిలో ఆమె ఒక విరాగి. అతనిగురించి ఆమె ఏమనుకుంటుందో రచయిత చెప్పలేదు. అతని కోరిక మేరకే ఆమె సమాగమానికి సంసిద్ధమవుతుంది. తరువాత దగ్ధమౌతుంది. భౌతిక సుఖాన్నిచ్చిన మీనాక్షి మరణించింది. పారలౌకిక ఆనందాన్ని అందించే మధుర మీనాక్షి శాశ్వతమైనదన్న గ్రహింపు కలుగుతుంది. ఈ అన్వేషణ అతనికి సంతృప్తినిచ్చింది. అయితే తన అనుభవాన్ని, అస్తిత్వ, అద్వైత సిద్ధాంతాలతో అంటే రెండు వైవిధ్యాంశాలను ముడిపెట్టి కథలో ఐక్యత సాధించాలనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సంక్లిష్టత అనివార్యమయ్యింది. ఇది కథానిర్మాణంలో జరిగిన లోపం కాదు, రచయితకు బహు భావజాల సంబంధిత సమస్యలేవో వున్నాయనిపిస్తుంది.

“వెదురుపువ్వు", "పదబంధరం" కథలు చదవడం ఒక అనుభవం. చాలా సరదాగా సాగే కథనం. ప్రేమలో పడినవాళ్ళు మూర్ఖత్వంలోకి జారిపోతారని, తమ తెలివి, హోదా ఇఎవీ మినహాయింపు కాకపోవడం ఈ కథల్లోని సారూప్యం. పాఠకుడు కథ మొదలు పెట్టిన రెండు నిమిషాల్లోనే గుర్తుపట్టలేనంతగా కథనం తనలోకి ఇముడ్చుకుంటుంది. పాఠకుడు తన మేధస్సును పూర్తిగా పక్కకు పెట్టేస్తాడు. కథ ముగిసేంతవరకు పాఠకుల్ని బిందీలుగా చేసే టెక్నిక్ ఈ కథల్లో ఉంది.

"వెదురుపువ్వు" కథలో ప్రేమపిచ్చితో పడిన పాట్లను పాఠకులు ఎంత ఎంజాయ్ చేస్తారంటే, తమ పరిసరాలనే కాదు సమస్త ప్రపంచాన్ని మరచిపోతారు. కథను ఆసాంతం చదివాకగానీ రచయిత చెప్పదలచుకున్న విషయం అర్థం కాదు. ఒక మామూలు “వెదురుపువ్వు " తన ప్రేమ విజయవంతమవుతుందో లేక విఫలమవుతుందో తెలిపే మంత్రపుష్పం అని భావించడంలోని అనౌచిత్యాన్ని నరేంద్ర వ్యంగ్యాత్మకంగా చిత్రించారు. ప్రేమలో పడిన వ్యక్తి ఎవరేం చెప్పినా నమ్మేస్తారు. తన ప్రేమను కాపాడుకోవడానికి ఏం చేయమన్నా చేస్తారు. అడవిలో తారసపడిన గిరిజనుడు చెప్పిన మాటల్ని, ప్రేమలో లేనివాడైతే అంతా ట్రాష్ అని కొట్టి పారేయగలడు. కానీ చంద్రం ఎలాగైనా చంచల ప్రేమను పొందాలనే తపనలో వుండటంతో, ఏ చిన్న అవకాశం కూడా వదలుకోలేకపోవడంలోని బలహీనతతో విచక్షణకు దూరమవుతాడు. అలా విచక్షణ కోల్పోతున్న కథాక్రమంలో ఎంత హాస్యం, వ్యంగ్యం వుందో అంతే వాస్తవం కూడా ఉంది. 'హేతుబద్ధమైన ఆలోచనకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రేమ ఒక ఉద్వేగ ఎమోషనల్) అనుభవం. దాన్ని అనుభవించి, పలవరించాలే తప్ప విశ్లేషించి వ్యాఖ్యానించడం కష్టం. ఎందుకంటే ఎవరి అనుభవం వారిదే. ఎమోషన్కు రీజనింగుకు పొత్తు కుదరదు. కథకుడు ప్రేమ ఎమోషన్లో ఉన్నంతవరకు అతనిలో రీజనింగ్ తలెత్తలేదు. రీజనింగ్ తలెత్తగానే "మేమిద్దరమూ ప్రేమ అన్న భావనను ప్రేమిస్తున్నామా? నిజానికి మా యిద్దరి ప్రేమల్లోనూ నిజాయితీ లేదా?" అన్న విచికిత్సకు లోనవుతాడు. చాలా సాధారణంగా అనిపించే ఈ ప్రశ్న వెనుక, అసాధారణ తాత్వికతలో నుంచి పుట్టుకొచ్చే జీవిత వాస్తవికత ఉంది. ఈ అంశమే “నీకూ నాకూ మధ్య నిశీధి"లోని సురేంద్రలో కూడా చూడగలం. సురేంద్ర జబ్బు పడినపుడు సుధారాణి చేసిన సేవలు, ఆమె చురుకుదనం, చొరవ నాలుగు రోజుల పరిచయాన్ని ప్రణయంగా భావిస్తాడు. సుధారాణి హేతుబద్ద వివరణ అతని ఎమోషనను నిర్వీర్యం చేస్తుంది.

ఏ అంశమైనా ఏ అనుభవమైనా స్త్రీలకెలా వుంటుందో ఆలోచించాలన్న కొత్త సంస్కారం “మొలకల పున్నమి" కథలో వ్యక్తమవుతుంది. కామందు తమ వ్యవసాయ క్షేత్రంలో పని చేసే శ్యామలను అనుభవించేందుకు అనేక విధాలా ప్రయత్నం చేస్తాడు. ఆమె తన వెంటబడుతున్న కామందును కాక అతని స్నేహితుడు, పాలేరులాంటి సాంబడిని ప్రేమిస్తుంది. సాంబడి మరణం తరువాత కూడా అతన్నే ప్రేమిస్తున్న శ్యామల నిర్మలమైన ప్రేమ అతని వాంఛను జయిస్తుంది. రాయలసీమలోని గిరిజన సుగాలీ బిడికీలలో "మొలకల పున్నమి" పండుగ చాలా విశేషంగా జరుపుకుంటారు. ఆరోజు మంచి భర్త కోసం, గంగమ్మకు మొక్కుతారు. తమ ప్రియునికి దైవ ప్రసాదాన్ని తినిపించే ఆచారం ఉంది. స్థానీయ, వైవిధ్య సాంస్కృతిక పరిమళం ఈకథ నిండా వుండటంతో పాఠకులు కరుణరసారతలలో తడిసిపోతారు.

విషమ పరిస్థితులలో విడాకులు తీసుకోవాల్సి వచ్చిన భార్యాభర్తలు వివాహానికి ముందు వివాహం తరువాతే కాక విడాకుల తరువాత కూడా వాళ్ళు ప్రేమికులుగానే కొనసాగుతారు. ప్రేమలో జీవించడమంటే, ప్రేమలో కొనసాగడమే. ఏ అవరోధాలు ఎదురైనా గుండె నిండా ప్రేమ నింపుకున్న వారికి ఏవీ అవరోధాలు కావన్న భరోసానిస్తుంది "ఇల్లీగల్ లవ్ స్టోరీ".

ప్రేమైనా, వ్యవసాయమైనా ఆర్థికాంశాలకు అతీతం కాదని చెప్పిన కథ “నీకూ నాకూ మధ్య నిశీధి", ఒకే వైద్య కళాశాలలో చదువుకున్న సుధారాణి, సురేంద్ర యాదృఛికంగా బస్సులో కలుసుకుంటారు. నాలుగు రోజులు కలిసి ప్రయాణం చేస్తారు. తిరుగు ప్రయాణంలో సురేంద్ర సుధారాణిని ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తాడు. కథంతా నాటకీయమైన ఎత్తుగడతోనే నడుస్తుంది. కానీ ముగింపులో కథ ఒక్కసారిగా నాటకీయత నుండి బయటపడి హేతుబద్దతను సంతరించుకుంటుంది. కులం, ఆర్థిక అసమానతల సామాజిక చట్రాన్ని అధిగమించలేని సురేంద్ర ప్రేమ పలాయనమంత్రం పటిస్తుంది. సుధారాణి పట్ల తనకు కలిగిన సంచలనాలను నిర్భయంగా బయట పెట్టగలిగిన సురేంద్ర, సుధారాణి సూటిగా వాస్తవ పరిస్థితుల్ని వివరించగానే, ఆమెకు ముఖం కూడా చూపించలేకపోతాడు. అందుకు అతని అవగాహనా లోపం ఒక కారణమైతే, సూటిగా స్థిరంగా ఆలోచించగల సుధారాణి వ్యక్తిత్వం ముందు అతని వ్యక్తిత్వం మరుగుజ్జుగా బహిర్గతమవుతుంది. ఆర్థిక విలువలు మానవీయ విలువల్ని కుంచింపజేస్తాయన్న సందేశాత్మక సూచన ఈ కథలో ఉంది. ఇక్కడే రచయిత ప్రాపంచిక దృక్పథం ప్రస్ఫుటంగా తెలుస్తుంది.ఈ కథకు 'ఆగామి వసంతం' కథ భిన్నమైనది. స్త్రీ పురుష సంబంధాలు అవసరాలకు అతీతమైనవేమీ కావనీ, మానవ సంబంధాలను నిర్దేశించే శక్తి ఆర్థిక అంశాలకు లేదనీ, అలా సిద్ధాంతీకరించే వారి వాదనను వ్యతిరేకిస్తూ, అలాంటి వ్యక్తీకరణలను అమానుషత్వంగా బండి నారాయణ స్వామి ప్రతిపాదించారు. అందుకు వివరణగా స్త్రీ పురుషుల మధ్య కొత్త అవసరాలు ఏర్పడటం వలన పాతవిలువలు, సంప్రదాయాలు తలకిందులవుతుంటాయంటారు. మనిషి జీవితం కాలానుగుణంగా మారుతున్న క్రమంలో ప్రేమ, స్నేహం, సహానుభూతుల స్వరూపం కూడా మారుతుంటాయన్న సూత్రీకరణ చేశారు. కథాంతంలో “అద్దాన్ని తలకిందులు చేయగలరా ఎవరైనా" అంటూ రచయిత వేసిన లోతైన ప్రశ్నకు పాఠక మిత్రులు సమాధానం వెతుక్కోవలసిందే.

'ప్రియ బాంధవి" పెద్దల అభిజాత్యం, అహంకారాల మధ్య మెల్లగా ప్రవహించే పిల్లకాలువలా హాయిగా సాగే కథనంతో సుఖాంతమైన ప్రేమకథ. ముగింపులో కనబడే కొసమెరుపు పాఠకులు ఊహించలేనిది. సత్యమూర్తి, పంకజంల ప్రేమకథకు మంగళం పలికారని నిట్టూర్చేలోగానే కథను మంచి ట్విస్టుతో ముగించి ప్రపంచ ప్రఖ్యాత కథకుడు ఓహెన్రీ సరసన నిలబడ్డారు మధురాంతకం రాజారాం.

రాసాని “శిల్ప సంగీతం" అమలిన శృంగారాన్ని (ప్లేటోనిక్ లవ్) ప్రతిపాదిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ లైంగికవాంఛకు అతీతమైనదని రచయిత ఉద్దేశంగా తెలుస్తుంది. తన ప్రేమకు ప్రతీక శిల్పసుందరి. ఎప్పుడైతే సమాగమానికి సిద్ధపడతాడో అతని ప్రేమకు ప్రతిరూపమైన శిల్పసుందరి మాయమవుతుంది. ఇది అతని అంతఃచేతనలోని అభివ్యక్తి. "పైరగాలి" స్వచ్ఛమైన జానపదుల ప్రేమకు ప్రతిరూపం.

మనసున మల్లెలు కథలో భార్యాభర్తలైన సునీత, శంకరాలు చూసిన మల్లీశ్వరి సినిమా వాళ్ళ గతజీవితంలోని ప్రేమ పరిమళాల అనుభూతులు జ్ఞాపకానికొస్తాయి. సునీత మనసులో ఆదిమూర్తి జ్ఞాపకాల మల్లెలు పూయిస్తే, ఆమె భర్త శంకరం మనసులోనూ పరిమళిస్తున్న మల్లెలు సునీతను ఆలోచనల్లో పడేస్తాయి.

కరుణరసాత్మకమైన “జాస్మిన్" కథ మంచితనం, ఔచిత్యం, నిలకడతనం లక్షణాలకు ప్రాతినిధ్యంగా నిలబడే కథ. ఆమె పేరు కూడా తెలియని ప్రేమికుడు పెట్టిన పేరు “జాస్మిన్". అంటే, మల్లెపూవు. తనలో ప్రేమ పరిమళాలను విరిజిమ్మిన స్త్రీమూర్తికి ప్రతీకగా ఒక పార్శ్వంలో ధ్వనిస్తే, మల్లెపూవులా పరిమళించాల్సిన ఆమె జీవితం కొన్ని రోజుల్లోనే వాడిన పూవుగా పరిణమించిందనేది మరో పార్శ్వంలో ద్యోతకమయ్యే ప్రతీకాత్మకత. ఏ సృజన సాహిత్య ప్రక్రియలకైనా మనిషిలోని అపసవ్యతలను, అక్రమ ఆలోచనలను ప్రక్షాళనం (కెథార్సిస్) చేయగల శక్తి వుంటుంది. ఏ సంఘటన మరో సంఘటనకు పరస్పరాశ్రయంగా మలచుకోగల శక్తి వుంటుందో, అది మానవుని దయార్ద్రతల మూర్తిగా మార్పు చెందించే తత్వం కలిగి వుంటుంది. ఈ స్థితి “జాస్మిన్", "గైమాక్స్ లేని కథ", "మొలకల పున్నమి" కథల్లో కనబడుతుంది.

స్త్రీ పురుషులలో వ్యక్త ప్రేమలున్నట్లే. అవ్యక్త ప్రేమలూ వుంటాయి. చాలా ప్రేమలు నిద్రాణంగా అణిగిపోయి, ఆగిపోయినవే. సాంఘిక ఆమోదం లభించదన్న అనుమానంతో చొరవ తీసుకోలేక పోవడం “నిత్యకళ్యాణం పచ్చతోరణం", *హృదయం" కథల్లో గోపిని కరుణాకర్, రమణజీవి చిత్రించారు. "హృదయం" కథ

మొత్తం కథకుని స్వగతంలో నడుస్తుంది. “నిజానికి ఇక్కడితో కథ అయిపోయింది" అంటాడు. కానీ కథ క్లైమాక్స్ లో కానీ అతని చేత అంతగా ఆరాధించబడిన ఆదిశేషమ్మ అతదేకమైన చూపు" దశాబ్దాలుగా అతని ఆరాధనకు లభించిన ఆమోదముద్ర. అలాగే

నిత్యకళ్యాణం పచ్చతోరణం" కథలోని కన్నీళ్ళు. "హృదయం” కనుకొలుకుల్లో నిలిచిన కన్నీటి చుక్కలు రెండు కథల్లో అవ్యక్త ప్రేమల అస్తిత్వాన్ని తెలిపేవి మాత్రమే కాదు. పాఠకులలో కలిగించే అపురూప రసార్ద్రతల వ్యక్తరూపం, రచయితలుగా సాధించిన విజయానికి గుర్తులు కూడా..

ప్రేమికులుగా తామున్న పరిస్థితులలో ప్రేమ సంబంధాలను నిలబెట్టుకోలేని ఆర్థిక అసహాయ స్థితికి కథారూపం "క్లైమాక్స్ లేని కథ". సరిగ్గా క్లైమాక్స్ వచ్చేసరికి కథను అర్థాంతరంగా ముగించినట్లుగా, కథకుడు భావించినట్లుగానే పాఠకుడూ

భావిస్తాడు. కానీ ఏ రచయితా కథను అర్థాంతరంగా ముగించడు. కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని పాఠకుల ఊహలకే వదిలేస్తాడు. అంతేకాదు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా వుండదు. సమస్యలు సమస్యలుగా మిగిలిపోవు. ఒక్కో సందర్భంలో ఒక సమస్య మరో సమస్యతో ముడిపడి వుంటుంది. లేదా మరో కొత్త సమస్యకు దారితీయొచ్చు. సమస్య తీవ్రతను బట్టి రచయిత ఎక్కడో ఒక దగ్గర కథను నీలపడం వల్లనే ప్రయోజనం చేకూరుతుంది. ఒక్కో పర్యాయం రచయిత కథను అలా వదిలేయకుండా క్లైమాక్స్ సూచిస్తే ఆ చట్రంలోంచే పాఠకులు పరిష్కారం వెదుక్కొనే ప్రయత్నం చేసే ఆస్కారం వుంటుంది. అందువల్ల కథను అలా వదిలేయడం వల్లనే పాఠకుల్ని ఆలోచింపజేయగలరు. అలా ఒనగూడే సాహిత్య ప్రయోజనం కచ్చితంగా ద్విగుణీకృతమవుతుంది.

"జాస్మిన్", "క్లైమాక్స్ లేని కథ", "మొలకలపున్నమి" కథలు ఒకరకంగా విషాదాంత కథలు. ఈ కథలు చదివిన పాఠకుల కనుకొలుకులలో నిలిచిన కన్నీటి చుక్కలతో హృదయం (కెథార్సిస్) ప్రక్షాళనమవుతుంది. ఆర్హత నుండి స్పష్టమైన, సమగ్రమైన ఆలోచనలు, నిర్ధారణలు నిర్దిష్ట రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. ఇలాంటి హృదయ సంస్కారాన్ని అందించగలిగిన కథలే చరిత్రలో గొప్ప కథల స్థానంలో నిలబడగలుగుతాయి.

ఏ ప్రేమకథలైనా ఇమాక్స్) ముగింపు వుంటుందా? ప్రేమకు ముగింపు లేనట్లే ప్రేమకథలకు కూడా ముగింపు వుండదు. అవి లీగలైనా, అలీగలైనా, స్వార్థమైనా, నిస్వార్థమైనా, రాయలసీమలో ప్రేమించాలన్నా, ప్రేమను వ్యక్తం చేయాలన్నా, ప్రేమలు నిలబడాలన్నా కూడా ఈ నేలలో ఆర్థికస్థితే ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ సంకలనంలోని “నీకూ నాకూ మధ్య నిశీధి”, “క్లైమాక్స్ లేని కథ", "ఇల్లీగల్ లవ్ స్టోరీ", "ప్రేమ రూపం", "ఆగామి వసంతం", "జాస్మిన్", "మనసున మల్లెలు" కథలు ఈ సత్యాన్నే ఎరుకపరిచాయి.

కొన్ని ప్రేమకథల్లోని పురుషపాత్రలు పితృస్వామిక ప్రయోజనాలను వదులుకొని అధిగమించే ప్రయత్నం చేయగలిగిగాయి. కానీ అణగారిన బ్రతుకులు అమలవుతున్న సమాజాన్ని వున్నదున్నట్లుగా అంగీకరించి అందులోనే జీవించాలనుకునే స్త్రీలు వుంటారు. కొత్త జీవితాన్ని ఆహ్వానించడానికి కావాల్సిన ధైర్యం వ్యక్తుల నుండి కాక సమాజం నుండి అందాల్సిన అవసరాన్ని "జాస్మిన్" పరోక్షంగా గుర్తు చేస్తుంది.

సామాజిక స్పృహతో కూడినా ప్రేమ స్వరూపం ఎలా వుంటుందో "ఓ ప్రేమ కథ"లో చూడగలం. సుజాత తనను ప్రేమించిన విశాలకు తన ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేక కారణం కనిపించదు. ఒక సందర్భంలో వైద్య సహాయం అవసరమున్న నిండుచూలాలికి సహాయం చేయకపోవడం వలన అతడు ప్రశాంతంగా వుండలేకపోతాడు. ఈ మానవీయ కోణంతో, అతని హృదయ ఔన్నత్యాన్ని గుర్తించి సుజాత (ఇంప్రెస్) ప్రేమోన్ముఖురాలవుతుంది. అతనిలోని మానవత్వం ఆమె మీదున్న ప్రేమను మించి విశాలత్వాన్ని పొందింది. వ్యక్తుల్ని అంచనా వేసే క్రమంలో మానవీయ స్పర్శ వుపయోగపడినంతగా మరొకటి వుపయోగపడదేమో.

ఈ సంకలనంలో టోపీ జబ్బార్ మైనారిటీ అస్తిత్వాన్ని, కౌమారదశలోని ప్రేమను రెండింటిని సమపాళ్ళలో రంగరించిన కథ అల్పసంఖ్యాకులకు సహజంగానే న్యూనతాభావం అంతర్లీనంగా వుంటుంది. మానసికమైన ఈ సమస్య భౌతికంగా సిగ్గు, బిడియాల రూపంలో వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమవడానికి షరీఫ్ ఎంచుకున్న పాత్రలు కౌమారదశలోని పాత్రలు కావడం వలన ఔచిత్య ప్రాధాన్యతను పొందింది. జబ్బార్ అమ్ములుకు టోపీతో కనబడకపోవడానికి కేవలం అందం మాత్రమే సమస్య కాదు. అది అస్తిత్వ సమస్య. ఏ జుట్టయితే మత ప్రాధాన్యం గల టోపీని జబ్బార్ పెట్టుకోకపోవడానికి కారణమయ్యిందో, అదే అందమైన జుట్టును వదులుకోవడం ఆమె స్వేచ్ఛగా అంటే అధిక సంఖ్యాకుల స్వేచ్చగా వ్యక్తీకరించబడింది. తలనీలాలు సమర్పించడం మత ప్రాధాన్యత గల అంశం. పైపెచ్చు అది అమ్ములు ద్వారా చెప్పించడంలో అధిక సంఖ్యాకులకున్న సౌలభ్యాలను కూడా పరోక్షంగా చర్చించగలిగింది. కథానిక ఎత్తుగడలో, పాత్రల ఎంపికలో చేసిన ప్రయత్నం శిల్పపరంగా సాధించిన విజయం.

రాయలసీమ ఫ్యూడల్ భూస్వామ్యవర్గం స్త్రీల పట్ల ఎంత గాఢమైన మోహావేశాలు కలిగివున్నా, అధిగమించలేని సామాజిక స్థితికి లోబడి వ్యవహరించాల్సివస్తుందనే ముసుగు వేయటం పరిపాటి. అలాంటి స్వార్థపూరిత అభిజాత్య ప్రవర్తనలను బట్టబయలు చేసిన శక్తివంతమైన స్త్రీ పాత్రలు పాలగిరి విశ్వప్రసాద్ "కరివేపాకు", సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి "బొగ్గులబట్టి" కథల్లో చూడగలం.

వీరిద్దరూ ఫ్యూడల్ కుటుంబ నేపథ్యం గల రచయితలు కావడం ఒక కారణమైతే, పితృస్వామిక తాత్విక రాజకీయాలను అర్థం చేసుకోవటం వలన కూడా ఇలాంటి పాత్ర చిత్రణ జరిగింది. స్త్రీల ప్రేమను పొందేంతవరకు తపించిన బొగ్గులబట్టి యజమాని మస్తాన్ రెడ్డిగానీ, కరివేపాకులా మెర్సీ ప్రేమను పరిత్యజించిన విస్సుగానీ వాళ్ళను వశం చేసుకునేంతవరకు చూపించింది భౌతిక పరమైన మోహావేశమే తప్ప, ప్రేమ కాదు. వాళ్ళు పరిచయమైనప్పుడే వాళ్ళ తత్వాన్ని గ్రహించలేనంత ప్రేమైక మోహంలో మునిగిన ప్రేమమూర్తులు ఈ కథల్లోని స్త్రీలు. కానీ తమను, తమ ప్రేమను నిర్లక్ష్యం చేసిన పురుష, భూస్వామ్య అహంభావాలను నిరాకరించి, తృణీకరించిన మానసిక స్టైర్యమే వీరి వ్యక్తిత్వం.

ఈ సంకలనంలోని ప్రతికథ మానవసంబంధాలను ముఖ్యంగా స్త్రీపురుష సంబంధాలను వ్యక్తం చేస్తాయి. ప్రేమస్వరూపాన్ని ఎంత విశాలార్థంలో అర్థం చేసుకోవాల్సి వుంటుందో తెలియజేస్తుంది. ప్రేమ అర్ధం కాని బ్రహ్మపదార్ధమో, అంతు చిక్కని, పరిష్కరించలేని గడ్డుసమస్యో కాదని అర్ధమౌతుంది. అంతేకాదు ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు అని వ్యాఖ్యానిస్తుంటారు. ఆ భాగమే కొరవడినా లేక పొందగలిగినా వాళ్ళ జీవితమంతా ఒక మధురమైన అనుభూతిగా, అందమైన అనుభవంగా మిగిలిపోతుందని “మనసున మల్లెలు', *హృదయం ", "మొలకల పున్నమి”, “జాస్మిన్", "క్లైమాక్స్ లేనికథ"ల ద్వారా తెలుస్తుంది.

రాయలసీమలో ప్రేమ కథలున్నాయా? అన్న పరిహాసపూర్వక ప్రశ్నలకు హరికిషన్ సంకలించిన ఈ ఇరవై ప్రేమకథలే సమాధానం.

రాయలసీమ ప్రేమకథలు ఈ నేలలోని వ్యవసాయ సంక్షోభం (నీకూ నాకూ మధ్య నిశీధి, ఆగామి వసంతం, ప్రేమరూపం), పేదరికం ( బాస్మిన్, క్లైమాక్స్ లేని కథ), భూస్వాముల అభిజాత్యం (ప్రియబాంధవి, బొగ్గులబట్టి, కరివేపాకు, మొలకల పున్నమి), మానవత్వం (ఓ ప్రేమ కథ), మైనారిటీ అస్తిత్వం (టోపీ జబ్బార్), భార్యాభర్తల అన్యోన్య ప్రేమ (పదబంభరం, ఇల్లీగల్ లవ్ స్టోరీ), తాత్త్విక కోణాన్ని అందించిన (మధుర మీనాక్షి, వెదురుపువ్వు) కథలు వస్తు, శిల్పపరంగా వైవిధ్యమైనవి. రాయలసీమ సాంస్కృతిక సరోవరంలో పరిమళించిన ప్రేమ కుసుమాలను సృజించిన కథాబ్రహ్మలకు, కదంబమాలగా ఏరి, కూర్చిన సంపాదకుడికి హృదయపూర్వక అభినందనలు.

రాయలసీమ కథా సాహిత్య విస్తృతిని, వైవిధ్యాన్ని పరిచయం చేయడం కోసం సాహితీ ప్రేమికుడు హరికిషన్ ఈ కర్తవ్యాన్ని తలకెత్తుకున్నందుకు, అభినందించడం కన్నా కృతజ్ఞతలు చెప్పడం ఉత్తమం.

మూలాలు మార్చు

*[https://www.andhrajyothy.com/telugunews/seema-love-story-from-different-angles-202011300255706 - రాయలసీమ ప్రేమ కథల గురించి ఆంధ్రజ్యోతి వివిధలో కిన్నెర శ్రీదేవి గారు భిన్న కోణాల సీమ ప్రేమ కథ అని రచించిన వ్యాసం.