వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్

వాసిరెడ్డి దుర్గా సదాశివేశ్వర ప్రసాదు (1899-1986)

పరిచయం మార్చు

జయంతిపురం రాజా అని ప్రసిధ్ధి పొందిన వాసిరెడ్డిదుర్గా సదాశివేశ్వర ప్రసాదు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వాస్తవ్యుడు. ఈయన ముక్త్యాల రాజా చంద్రమౌళీశ్వర ప్రసాద్ సోదరుడు. లోకమాన్య బాలగంగాధర తిలక్ సారథ్యములోనే ఆయన స్వతంత్రసమర యోధములో ప్రవేశించి, గాంధీ స్వాతంత్ర్యోద్యమములందు, కృష్ణాజిల్లా కాంగ్రెస్సు కార్యకలాపాలలో విశేష పాత్రవహించిన ప్రముఖుడు. ఈయన సంస్కృతాంధ్రములలో పండితుడు, ఇంతేగాక ఈయన అసాధారణ పాళీ భాషాకోవిదుడు. బౌధ్ధవాజ్ఞయ పరిశోధనలో ప్రవీణుడు. ఈయన 1926 లో రచించిన 'ధమ్మపదము' అను బౌధ్దమతానికి సంబంధించిన పుస్తకము చాల విశేషమైనది. 1906 లోకొమర్రాజు లక్ష్మణరావు గారు స్ధాపించిన విజ్ఞాన చంద్రికా మండలి అను సాహిత్య ప్రచురణ సంఘము నకు అయ్యంకి వెంకట రమణయ్యగారి తరువాత 1935 లో ఆ మండలికి కార్యదర్శిగా ఊన్నారు . వీరి పేరు తదుపరి సంబోధన జయంతిపురం రాజా గారని (రాజాగారనిీ) చేయబడింది. 1986 ఏప్రిల్ 13 వ తారీఖున పరమదించారు.[1],[2]

వంశము,పుట్టుపూర్వోత్తరాలు మార్చు

వాసిరెడ్డి వారిది చాల ప్రఖ్యాత వంశము. ముక్త్యాల రాజాల వంశమనవచ్చు. సాహిత్య సంస్కృతి, జపతపములుగల పెద్ద కమ్మవారు. వాసిరెడ్డి చిన వెంకటాద్రి గారి కుమారుడైన భవానీ ముక్తేశ్వర ప్రసాద్ గారు (1828- 1882) వారి వంశ మూల పురుషుడైన ముక్త్యాల రాజా గారు. వీరికి ఉమామహేశ్వర ప్రసాద్ ( రెండవతరం ముక్త్యాల రాజాగారు), వెంకటాద్రి నాయుడు గారు అను ఇద్దరు కుమారులు, విశాలాక్షమ్మఅను ఒక కుమార్తె యుండెను. రెండవతరం ముక్త్యాల రాజాగారి సోదరుడైన వెంకటాద్రి నాయుడు గారే మన సదాశివేశ్వర ప్రసాద్ గారి తండ్రిగారు. జయంతిపుర వాస్తవ్యులైన వెంకటాద్రి నాయుడుగారు (1843-1917) గారికి ప్రథమ భార్య పార్వతమ్మ గారి వల్ల కలిగిన కుమారుడు చంద్రమౌళేశ్వర ప్రసాదు గారు ముక్త్యాలరాజావారికి దత్తతవెళ్లి మూడవతరం ముక్త్యాల రాజాగారైనారు. పార్వతమ్మ గారి మరణంతో వెంకటాద్రినాయడుగారి ద్వతీయకళత్రం వల్ల వారికి శారదాంబ అను కుమార్తె కలిగినది. మృత్యు వాతలవల్ల కళత్రవిహీనం సర్వసాధారణమైన రోజులలో వెంకటాద్రినాయుడుగారికి ఐదవ భార్య త్రిపురాంబగారి వల్ల కలిగిన సంతానము నలుగురు కుమారులలో రెండవ వారు మన సదాశివేశ్వర ప్రసాదు గారు (జయంతిపురం రాజాగారు). వీరి అన్న గారు భవానీ ముక్తేశ్వర ప్రసాదు గారు చిన్న వయసులోనే పరమదించారు. సదాశివెేశ్వర ప్రసాదు గారి ఒక తమ్ముడు మహదేవ ప్రసాదు గారు గూడా చిన్న వయస్సు లోనే మరణించారు. ఆఖరి తమ్ముడు మహదేవటాగూర్ (Mahdev Tagore) గారు. సదాశివేశ్వర ప్రసాదుగారి మాతా మహుడు శాఖమూరి వేం కటప్పయ్య గారు సంస్కృత భాషాకోవిదులైనట్టి, పూజాపునస్సాకార నిష్ఠనియమాలు కలగినట్టియోగి లక్ష్మీనృసిహం గారి అల్లుడు. సదాశివేశ్వర ప్రసాద్ గారి సోదరి శారదాంబగారు నెల్లూరి జిల్లా ఇందుకూరుపేటకి చెందిన మక్కెన కొండప్పనాయడు గారి సతీమణి . సదాశివేశ్వర ప్రసాదు గారు 1899 ఏప్రిల్ 11 వికారి నామ సంవత్సరం ఉగాది నాడు బందరులో జన్మించిరి. మూలపురషుడైన పెద్ద ముక్త్యాల రాజాగారు (భవానీ ముక్తెేశ్వరప్రసాదుగారు) గూడా ఉగాది పర్వదినంనాడు జన్మించారుట. వెంకటాద్రినాయుడుగారు ఆయర్వేద శస్త్ర చికిత్సలో దక్షులని పేరుపొందినవారు. గొప్ప శివభక్తులు వారి దినచర్య ఒక ఆదర్శ భక్తిమార్గముతో కూడినది. వేకువజామున స్నాన జప తపం, విభూతితో ఆజానుభాహులైన నిండు విగ్రహం, మద్యాహ్నం భారత భాగవత పారాయణం మొదలగు నవి. ఆస్తిపాస్తుల పంపకాల్లో వారి స్వగ్రామమైన జయంతిపురం ఆస్తులు, తండ్రి వెంకటాద్రి నాయుడు గారి నివసించినయున్న గృహము మొదలగు స్ధిరాస్తులు రాజాగారి తమ్ములైన మహదేవ టాగూర్ గారికిచ్చుటకు వప్పందమైనందున రాజా గారు తమ నివాసమును జగయ్యపేటకి మార్చుకుని 1946 లో స్వగృహం నిర్మించి 'శాంతి సదనం' అని నామకరణం చేశారు. రాజాగారి అత్తమామలు చిరుమామిళ్ళ వారు. వీరు గూడా గొప్ప విష్ణుభక్తులు

విద్యాభ్యాసం మార్చు

రాజా గారి బాల్యం బందరు "రాబర్టసన్ పేట" తరువాత "చమ్మనగిరి పేట"లో గడచింది. ఐదవ ఏట అక్షరాభ్యాసము తరువాత విజయవాడ హిందూహైస్కూలులో ఒకటి రెండు ఫారములు చదివారు. కానీ, ఆంగ్లభాష మన జాతీయాభిమానమునకు విరుధ్ధమని ఆశయం కలిగిన వారి తండ్రిగారి అభిరుచిప్రకారం కుమారునికి సంస్కృతాంధ్ర భాషలలోనూ, భారతం, భాగవతం, పంచ కావ్యాలు, పురాణేతిహాసాలలో పాండిత్యము సాధించటానికి సంస్కృత పండితులైన ఫిరాట్ల శ్రీశైల శాస్త్రి గారిని గురువులుగా పెట్టి శిక్షణ ఇప్పించ సాగిరి. గురువులు శాస్త్రిగారు నిర్ధుష్టమైన సంస్కృత బోధనా విధానముతో అమరకోశము వెనకనుంచి ముందుకు చెప్పగలిగేంత వరకూ తమ శిష్యులకు తర్ఫీదు చేశేవారు. కానీ అప్పటికి ఆంగ్ల ప్రభుత్వ పరిపాలనజరుగుతున్నందున ఆంగ్లము రాకపోతే ముందుముందు కష్టమగునని వెంకటాద్రినాయడు గారికి తమ అల్లుడు కొండప్పనాయడుగారు నచ్చచెప్పి నెల్లూరు నుండి పూండ్ల వెంకటప్పయ్య గారను అధ్యాపకుని పంపించి ఆంగ్ల భాష బోధన గూడా చేయించారు. అప్పటికి ఫిరాట్ల శాస్త్రిగారి వద్ద పంచకావ్య పఠనగూడా పూర్తైనది. తదుపరి వారి అక్కగారైన శారదాంబ గారు తమ్మడుకు ఇంకా ఆంగ్లవిద్యాబోధన కావలని నెల్లూరు రప్పించి టౌన హైస్కూలులో కొన్నాళ్లు చదున సాగించారు కానీ తండ్రిగారు వృధ్ధాప్యంతో కుమారుని తన దగ్గరే వుంచుకుని కుటుంబ బాధ్యతలతో పాటు తమ వంశ పారంపర్యమైన జమీందారీ విధానములో శిక్షణనివ్వసాగిరి. వారి సొంత ఊరు జయంతిపురంలో కూడా కొన్నాళ్లు స్కూలులో 3వ ఫారం చదివారు. మృత్యుం జయశాస్త్రి అను సంస్కృత పండితులు దగ్గర గూడా 2 సంవత్సరములు సంస్కృతం చదివారు. ఆ విధముగా రాజాగారికి సంస్కృతములో చాల విశేషమైన జ్ఞానం ఉంది. అనేక సంస్కృతాంధ్ర గ్రంథములు చదువసాగిరి.వేటూరి ప్రభాకరశాస్త్రి గారి రచనలనేకము వీరికి ప్రోద్బలంచేశాయి. శాస్త్రిగారితో తదుపరి వ్యక్తిగత పరిచయంకలిగి వారి ప్రోద్బలము మరియూ మార్గదర్శనమువల్లనే రాజాగారికి సాహిత్య పరిశోధనపై అభిరుచి వృధ్ది అయినది. వారి చిన్ననాటి గురువులు ఫిరాట్ల శ్రీశైలం శాస్త్రి గారు కేవలం సంస్కృత బోధనే కాక రాజాగారికి జాతీయభావలకు స్వతంత్రదోమ్యపురోగతికి బీజములు నాటారనీ అవే వారిలో తదుపరి స్వతంత్రపోరాటముకు దృఢనిశ్చయముతో బాలగంగాధర తిలక్ గారి నినాదముతో గొంతుకలిపి స్వాతంత్ర్య సమరయోధునిగా చేశాయని వారి రాజకీయ జీవితములో వ్రాశారు. రాజాగారు ఎప్పడు ఎక్కడ పాళీ భాషలో పాండిత్యము సంపాదించినదీ తెలియలేదు. పాళీభాషలో పాండిత్యమువలన నే వారు పురాతన బౌధ్ధ స్థూపమలు, శిలాశాసనములనేకములను గూర్చి అవగాహనం చేసుకుని బౌధ్ధవాజ్ఞయములో పరిశోధన చేయగలిగారు.

జమీందారీ విన్యాసాలు మార్చు

వారి తండ్రారి గారి అభిరుచి ఆశయాల ప్రకారం ప్రసాద్ గారిని జయంతిపురంతీసుకు వచ్చి తండ్రిగారు జమీందారీ విన్యాసాలతో కూడిన నిత్యజీవత విధానము లలో తర్ఫీదునివ్వసాగిరి. ఆ రోజూలలో జమీందారీ విన్యాసాలైన గుర్రపు స్వారీ, వేట, తుపాకీ గురి నైపుణ్యము మొదలగు హుందాగల జమీందారీ విద్యలలో తరఫీదు పొందసాగిరి. సదాశివేశ్వర ప్రసాదుగారు యవ్వనంలో మంచి హుందాగా నుండేవారు. విశాలమైన కనులు, పెద్ద చెవులు మీసములు కలిగి చెప్పకనే చెప్పు రాజకళతో వారి రూపము చూపరులకు ఆశ్చర్యచకితులను చేసేవని ప్రసిధ్ధి. ప్రసాదు గారి 17 వ ఏటనే వారి తండ్రిగారైన వెంకటాద్రిగారు పరమదించటంతో వారికి కుటుంబ బాధ్యతల వలనే కాక వారు స్వభానము రీత్య చాల సాత్వికులై సాహిత్య అభిరుచి కలిగిన వారైనందున జమీందారీ విన్యాసాలు కట్టిపెట్టి గ్రంథ పఠనా సాహిత్యపరిశోధనలో నిమగ్నులై అనేక గ్రంథములు చదివి స్వయంకృషితో సాహిత్యకృషి, పరిశోధన చేయసాగిరి.

రాజకీయజీవితం మార్చు

1920 కి ముందు లోక మాన్య బాలగంగాధర తిలక్ మహాశయుని సారథ్యములో సాగుతున్న స్వాతంత్ర్యోద్యమం అనే రథములో 1920 దశాబ్ద ప్రారంభంలోనే ప్రవేశించి న రాజాగారు తదుపరి మహాత్మా గాంధీజీ సారథ్యములో ముందుకు సాగి కృష్ణాజిల్లా కాంగ్రెస్సు కార్యకలాప్పాలలో ముఖ్య పాత్రవహించారు. వారు స్వభావిక రీత్యా రాజకీయనాయకుడు కాదని తాము రచించిన రాజకీయ జీవితం గ్రంథములో (అప్రచురితము) పేర్కొన్నారు. సాహిత్యాబిరుచిగల ఇద్దరు రాజకీయనాయకులని దిగవల్లి వేంకట శివరావు గారిని, రాజాగారిని గురించి ఇండియన్ ఎక్సప్రెస్సు పత్రిక సంపాదకుడైన జి.కృష్ణ గారు 1972 లో జనేవరి 22 తారీకు ఇండియన్ ఎక్సప్రెస్సులో ఎడిటోరియల్ వ్రాశారు.[3] వారి అన్నగారైన ముక్త్యాల రాజాగారికి తన తమ్మడు రాజకీయాలలో ప్రనేశించటం వల్ల ఆంగ్లప్రభుత్వమువారు తమ జమీందారీకి కష్టాలు కలుగజేయుదరను సంకోచము కలిగినవారైనందున వీరిని జాతీయోద్యమములకు దూరముగానుంచుటకు ప్రయత్నించిరి. కానీ ఆకాలపు పెద్దలు కాశీనాధుని నాగేశ్వర రావు గారు, టంగుటూరి ప్రకాశం గారు ముత్యాలరాజాగారికి స్వయంగా సుపరిచితలుగుటవల్ల తెల్ల దొరలు మన దేశ ప్రజలకు, మన జమీందారీలకు చేసే పక్షపాతపు పరిపాలనా విధానములు వారి అత్యాచారములు నచ్చచెప్పి అనుమతింప జేసిరి. ఇక అప్పటినుండి మన రాజాగారు జాతీయోద్యమము లందునూ, స్వాతంత్ర్యసంగ్రామములోను చేసిన కృషి చాల విశేష మైనది. 1920 లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాజాగారికి కాశీనాధుని నాగేశ్వర రావు గారిని పరిచయం చేశారు. 1921 వ సంవత్సరంలో జరిగిన విశేష ఘటములు వారి రాజకీయ జీవితంలో (1) బెజవాడ కాంగ్రెస్సు మహా సభ సమావేశములకు వెళ్లటం, (2) మహాత్మా గాంధీ గారి స్వతంత్రోద్యమ చర్యలలో ఒకటైన నూలువణుకుట ప్రారంభించటం, (3) విదేశవస్తు బహిష్కరణోద్యమంలో జాతీయనాయకులు జగ్గయపేటవచ్చినప్పడు విదేశ వస్త్రములు అగ్నహోత్రం చేయటం, (4) ఖద్దరువస్త్రముల అమ్మకం చేయటం మొదలగునవి. 1922 వ సంవత్సరంలో ఖాదీ ఉద్యమానికి విరాళముల కోసం కాశీనాధుని నాగేశ్వర రావు గారు టంగుటూరి ప్రకాశం గారు జయంతిపురం వచ్చినప్పడు మనరాజాగారి అన్నగారైన ముక్త్యాలరాజా చంద్రమౌళేశ్వర ప్రసాదుగారు నాలుగు పుట్ల పత్తిని విరాళముగానిచ్చారు, మన రాజాగారు గూడా కొంత సొమ్ము విరాళంగానిచ్చారు. దక్షిణాఫ్రికా లోనున్న రాజాగారి మిత్రులు బత్తెన రామారావు నాయుడు గారి ద్వారా అక్కడి భారతీయల దీన పరిస్థితిని రాజాగారు తెలుసు కున్నాక వారికి మన జాతీయోద్యమములు స్వతంత్రపోరాటమునకు మరింత ప్రేరేపించినవి. అదేకాక జలియన్వాలా బాగ్లో జనరల్ డయ్యర్ కాల్పులు తరువాత విఠల్ భాయి పటేల్ గారి రిపోర్టులో పంజాబులో స్వతంత్రయేధులను ఏవిధంగా శిక్షించి అవమానపరచినదీ చదివిన తరువాత మరింత దృఢనిశ్చయముతో స్వతంత్రపోరాటములో కృషి చేశారు. 1922 దాకా రాజాగారు కాంగ్రెస్సులో సాధారణ సభ్యులు గానుండిరి. 1923నుండి రాజాగారు తాలూకాస్థాయి కాంగ్రెస్సు సమావేశాలు చెయించేవారు. 1923 నుండి 1927 దాకా వారు నందిగామాలో తాత్కాలీకంగావుంటూ వ్యవసాయాభివృధ్దికి నందిగామ కాలువ త్రవ్వించారు అప్పటి సబ్ కలెక్టరు టి.యల్ ఆర్ చంద్రన్ గారి సహకారం తో. 1923 మళ్లీ ఎన్నికలలో స్వరాజ్య పార్టీ అధికారంలోకి వచ్చింది. 1923 లో ఎలక్షన్లైన తరువాత సి.ఆర్ రెడ్డి గారు, కె.కోటి రెడ్డి గారు సి వి నరసింహం గారు కలసి ఒక కొత్త రాజకీయ పార్టీని జస్టిస్ పార్టీకి పోటీగా స్థాపించారు. 1924 లో బెజవాడ తాలూకాను విభజించి న తరువాత నందిగామా తాలూకా బోర్డుకు మొట్టమొదటి అధ్యక్షులుగా నుండిరి. 1927 మే నెలలోలో మహాత్మా గాంధీ గారు ఆంధ్ర దేశ పర్యటనకు వచ్చినప్పుడు కాశీనాధుని నాగేశ్వర రావు గారు, టంగుటూరి ప్రకాశం గార్లతో రాజాగారు బోనకల్లు వెళ్లి గాంధీగారిని ఆహ్వానించగా గాంధీగారు వారి ఆహ్వానం స్వీకరించి కస్తూరిబాయి గాంధీతో సహా జయంతిపురమునకు వచ్చి మన రాజాగారి బంగళా (భవంతి) లో బస చేశారు. గాంధీజీతో పాటు వారి సహచరులు మీరాబెన్, మహదేవ్ దేశాయ్ గార్లును, మన ఆంధ్ర రాజకీయనాయకులు కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్యగార్లు కూడా ఆరోజు మర్నాడు దాకా జయంతి పురంలోనే బసచేశారు. మన రాజాగారి రాజకీయజీవిత చరిత్రలో గాంధీగారికిచ్చినటువంటి ఆ ఆతిద్యం ఒక విశేష ఘటన. గాంధీ గారి పత్రిక హరిజనలో గూడా రాజాగారిని గురించి చెప్పబడింది. 1929 సైమన్ కమిషన్ కు నిరసనగా నల్లజండాల ప్రదర్శనానికి నాయకత్వంచేసినందుకు మొదటిసారిగా పోలీసువారిచే నిర్బందిచబడిరి. 1924 ఎన్నికల బహిష్కరణోద్యమములో ప్రముఖ పాత్రవహించారు. 1931 లో కరాచీ కాంగ్రెస్సు మహా సభలకు వెళ్ళారు. 1932 సత్యాగ్రహోద్యమ సమయంలో రాజాగారు ఇంట్లో జాతీయ పతాకము ఎగురవేసినతరువాత పోలీసు వారు ఇంటిని సోదా చేశారు. మద్యపాన నిషేధన ఉద్యమంలో తమ జమీందారీ తోపులోనున్న వందలాది తాటిచెట్లను నరికించి ఆదర్శప్రాయంగా నిలిచారు. 1934 లో మళ్లీ రెండవ సారి నందిగామా తాలూగా బోర్డుకు అధ్యక్షులైనారు కానీ యాడాదిలోపలే తాలూకా బోర్డులు రద్దు చేయబడ్డవి. 1936 లో గోగినేని రంగనాయకులు ఆంధ్రరాష్ట్ర ఉద్యమం, (ఎన్.జి.రంగా) గారు ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం స్దాపించారు రాజాగారిని మరి ఇతర నాయకులని కిసాన్ ఉద్యమంలోకి ప్రవేశపెట్టారు. 1936-37 లో మద్రాసు ప్రోవిన్షియల్ ఎన్నికలలో రాజాగారు, కాట్రగడ్డ నారాయణరావు గారు విజయవాడ గ్రామీణ నియోజకవర్గమ నుంచి యమ్ యల్ సిలుగా ఎన్నకైనారు.అయ్యదేవర కాళేశ్వరరావు గారు అర్బన్ నియేజగవర్గమునుండి ఎన్నికేనారు. అది మద్రాసు ప్రోవిన్సుకు సి.రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రి గానున్నకాలంలో. రాజాగారి సత్యాాగ్రహ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వము వారికి ఆందోళనకలుగ చెస్తున్నందున్న వారిని 1940 లో నందిగామలో అరెస్టు చేసి జైలుశిక్ష విదించి 5 నెలలపాటు కొన్నాళ్లు సేలం జైలులోనూ, మరికొన్నాళ్లు తిరుచునాపల్లి జైలులో నిర్బంధించి వుచారు. ఆ జైలు శిక్ష అనుభనిస్తున్న రోజులలోనే సి.రాజగోపాలాచారి గారు అదే జైలు లోనుండగా వారితో పరిచయమైనది. సంస్కృతవాంజ్ఞయలోనూ, భారత భాగవతంలోనూ రాజాగారి విశేషజ్ఞానమును గుర్తించిన రాజాజీ వారు రచించున్న మహాభారతం లోని కొన్ని ఘటనలు రాజాగారితో జైలులో సంప్రదించేవారుట. రాజగోపాలచారి గారు ఆంగ్లములో రచించిన మహాభారత కావ్యము 1953 లో భారతీయ విద్యాభవన్ వారిచే ప్రచురించబడింది. జైలునుండి వచ్చినతరువాత 1940 రాష్ట్రస్థాయి రాజకీయాలలో లక్షమయ్య నాయుడు గారు, రమణయ్య నాయుడు గారు, పట్టాభి సీతారామయ్య, రాజాగారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇంకా ఇతరులు కలసి పనిచేశారు. రాజాగారు నందిగామ తాలూకా కాంగ్రెస్సు ప్రెసిడెంటు గానుండిరి. 1945 ఎలక్షన్సు జరిగినవి 1946 లో టంగుటూరి ప్రకాశంగారు ప్రీమియర్ అవటం మళ్లీ 1947 లోనే వారిని పదవీ విహీనులవటం జరిగినవి. ప్రకాశంగారికి రాజా గారు చాల సన్నిహితులు చాలా సమావేశాలు చర్చలు వీరితో చేసేవారు. 1948 లో హైదరాబాదులో రజాకార్ల ఉద్యమ కాలం లోకె. యమ్. మున్షిీ గారు నిజాంరాజ్యమున హైకమీషనర్ గా నున్నప్పుడు వారు ప్రకాశంగారితో చర్చించుటకు జగ్గయ్యపేట రాజాగారింటిలో సమావేశమైనారు. రాజాగారు నిగర్వి, నిరాడంబరులు, అధికారవ్యామోహములేని వారు. వారికి ప్రకాశంగారితోనూ ఇతర రాజకీయనాయకులతోనూ పలుకుబడియుండినను స్వార్ధంకోసం, అధికారం కోసం వారు ప్రయత్నించలేదు.

సాహిత్యజీవితం,సాంస్కృతిక సేవ మార్చు

రాజాగారు రచించిన వి దాదాపు 31 పుస్తకాలున్నవి.అందులో ధమ్మపదము (1926) విశేషమైనది. 1956 లో ప్రచురితమైన వారి పుస్తకం "గీతామృతము". రాజా గారి మరో పుస్తకము "బౌధ్ధ సంస్కృతి, మంగళ సూత్రం పరిణామ లిపి" 1986 లోత్రిపురనేని వెంకటేశ్వరరావుగారు స్ధాపించిన వేమన వికాసకేంద్రము వారు సమావేశపరిచిన సభలోజస్టిస్ ఎ.పి చౌదరి గారు ఆవిష్కరించారు[4],[5], 1923 నుండే వారు రాజకీయాలతో పాటు సాహిత్య కృషి చేశారు. 1923 నుండి 1927 దాకా 'సరస్వతీ' అను పత్రికను జగ్గయ్యపేటలో ప్రచురించేవారు.1923-24 లో తునిలో ప్రారంభించబడిన సాహిత్య పరిషత్తులో రాజాగారుతో పాటు సభ్యులుగా నున్న ప్రముఖలలోవిక్రమదేవ వర్మ, మారేపల్లి రామచంద్ర కవి గారు గూడా యుండిరి. రాజాగారి సాహిత్య పురోగతిలో వారికి వేలూరి సత్యనారాయణ, మానికొండ సత్యనారాయణ గార్లతో అదే కాలంలో పరిచయము కలిగినది. వేలూరి సత్యనారాయణగారు గూడ బౌధ్ద వాంజ్ఞయ సాహిత్యవేత్త. 1924 లో భారతి మాస పత్రిక ప్రారంభించబడింది. ఆ కాలంలో రాజాగారు రచించిన వ్యాసములు భారతి పత్రికలో ప్రచురించ బడినవాట్లో (1) ధమ్మ పదం (2) సేవ్యసేనపోషణ్యసము (3) ఓట్ల దయ్యము ఇత్యాదులు. 1971 లో అప్పికట్లలో జరిగిన బౌధ్ధ సదస్సులో రాజాగారి బౌధ్ధ వాజ్ఞ్మయ పరిశోధనకి బౌధ్ధ సాహిత్య సార్వభౌమ అనే బిరుదివ్వబడింది. వారు రచనలు చాలమట్టుకు అముధ్రికములుగానే ఉన్నాయి. వారి రాజకీయ జీవితం చాల విశేషమైన గ్రంథం. చారిత్రాత్మక విశేషాలతో వున్నఆ గ్రంథముపూర్తిగా ఉపలబ్ధి అవలేదు వ్రాతప్రతి తొలిపలుకు పేజీలు మాత్రమే దొరికినవి. 1955 లో కృష్ణా నదీజలాలను మద్రాసుకు తరిలించుటకు నిరసనగా ఆచార్య రంగా గారి ఆధర్యములో జగయ్యపేటలో జరిగిన గొప్ప బహిరంగ సభ జరిపించుటకు రాజాగారు వారి అన్నగారు ముక్త్యాలరాజాగార్ల కృషి చాలా విశేషమైనది. ఆ ఆందోళన ఫలితము వలనే ఖోసలా కమిషన్ వారు కృష్ణాజిల్లాలో పర్యటనకు వచ్చి నందికొండ ప్రోజక్టు (నాగార్జునసాగర్) నిర్మాణమునకు స్ధళనిర్ణయము చేయటం జరిగింది. 1956 లో రాజాగారుబుధ్ధజయంతి ఉత్సవమును గౌతమ బుధ్ధుని 2500 వ జయంతిని ఘనముగా జరిపించారు. ఆరోజు ఉత్సవమునకు వారి అన్నగారు ముక్త్యాల రాజా శ్రీ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాదు గారు. కేంద్ర ప్రభుత్వములో గౌతమబుధ్ధ పీఠముకు అధ్యశ్క్షులైన అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు రాజాగారి బౌధ్ధవాజ్ఞయ కృషికి ఆంధ్రప్రదేశ్ లోని బౌధ్ధ పీఠమునకు రాజాగారి పేర రూ 10000/- చెక్కును సుభాకాంక్షల సందేశముతో పంపించారు. ఆ ఉత్సవము తరువాత బుధ్ధజయంతి సంచిక ప్రచురించి అందులో రాజాగారి వ్యాసము "బుధ్ధుని పిమ్మట బౌధ్దమతము" అను వ్యాసము ప్రచురించారు. రాజా గారికి భారత భాగవతాలపై విశేష అవగాహనంతోగూడిన పాండిత్యము ఉంది. వారికి ఆకాలంనాటి గొప్పసాహిత్యవేత్తలనేకమంది సుపరిచితులు. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు వారికి సాహిత్యపరిశోధనలో మార్గదర్సికులు. ప్రముఖ సాహిత్యవేత్త ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు కులపతిగా యుండిన కట్టమంచి రామలింగారెడ్డి గారు రాజాగారికి సుపరిచితులు మహా భారత అనేక ఘట్టముల విశ్లేషణం, పరిచర్చలు వీరిరువురూ చేసియున్నారు.

తుదిపలుకు మార్చు

పోతనామాత్యుని ( బమ్మెర పోతన) ఆంధ్రమహా భాగవతము లోని పద్యము "వాయు వశంబులై ఎగసి వారి ధరంబు మింటను కూడుచు పాయుచునుండు...ప్రపంచము సర్వము కాలతంత్రమై......" అను గొప్ప వేదాంత సారాంశమైన పద్యము రాజాగారు చెప్పుతూవుండేవారని వారి ఆప్త మిత్రులు దిగవల్లి వేంకటశివరావుగారు అనేక సందర్భములలో చెప్పేవారు. టూకీగా ఆ పద్య సారాంశమేమిటంటే ఎవ్వరు ఎంతవారైనా ఈ కాల చక్రములో పాత్ర ధారులేననిీ, కాలగర్భములో కలిసిపోవలసినదే నని. రాజాగారికి తిక్కన గారు రచించిన పద్యములు చాల ప్రీతి. వారి ధమ్మపదములో ఒక గొప్ప శ్లోకము " న జటాహి న గొత్తేన జచ్చాహోతి బ్రాహ్మణో యమ్హి నచ్చంచ దమ్మోచ సోమ చీసోచహ్రాహ్ణణో" అంటే వేషంతోగానీ, జాతివలనగానీ వంశము వలన గానీ బ్రాహ్మణుడు కాజాలడు; సత్యధర్మాలు తెలిసి సుచి శుభ్రం కలిగినవారే బ్రాహ్ముణుడని అర్ధము. ఆ శ్లోకములో చెప్పినట్లు రాజాగారు బ్రాహ్మణోత్తములు. ఇంతేకాక వారిని స్వయంగా ఎరిగినవారు వారి యొక్క విశేషమైన నియమానుబధ్ధమైన జీవిత విధానమును మరువజాలరు.

మూలాదారములు మార్చు

మూలాలు మార్చు

  1. శ్రీ వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ గారి కి శ్రధ్ధాజలి సమర్పణ. విద్యోదయ ప్రింటర్సు, విజయవాడ-2
  2. "వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాదు గారు"(అప్రచురిత వ్యాసము) దిగవల్లి వేంకట శివరావు
  3. " 2 Scholar Politicians with a difference " By G.Krishna. The Indian Express 22/01/1972
  4. ఆంధ్రజ్యోతి దిన పత్రిక నవంబరు 12,1986
  5. ఉదయం దిన పత్రిక నవంబరు 10, 1986