వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 24వ వారం

Freedomfighter kondavenkatappayya.jpg

కొండా వెంకటప్పయ్య (1866-1949) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవాడు. 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. తరువాత దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావుకు అప్పగించాడు. న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన, ధర్మాలకోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదానికేతన్‍కి వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మివేసి పది వేల రూపాయల విరాళం ప్రకటించాడు.

1912 మే నెలలో నిడదవోలు రాజకీయ మహాసభలో కొండా వెంకటప్పయ్య సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనాలు జరిపారు. 1913లో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది. అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా మేరకు ప్రధమాంధ్ర మహాసభ బి.ఎస్.శర్మ అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన రాయబార వర్గంలో కొండా వెంకటప్పయ్యదే ప్రధాన పాత్ర. నెల్లూరు లో జరిగిన ఆంధ్ర మహాసభకు అతనే అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించాడు. 1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలివిజయం. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి వెంకటప్పయ్యే. కొండా వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయలలో తన ప్రతిభకు, త్యాగానికి సముచిత స్థానం పొందలేకపోయాడు.

కడలూరు జైలులో వున్నప్పుడు "డచ్ రిపబ్లిక్" అనే గ్రంథాన్ని రచించాడు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశాడు. "శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి" అన్న భక్తి రసభరితమైన శతకాన్ని రచించాడు. కొండా వెంకటప్పయ్య ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. స్వాతంత్ర్యం తరువాత పెచ్చుపెరిగిన అవినీతి గురించి ఆయన మహాత్మా గాంధీకి ఇలా రాసాడు. "మనం మనస్ఫూర్తిగా కోరుకొన్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్య యోధులలో నీతి నియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెసు అవినీతికి ఆలవాలమైపోతున్నది. .." ....పూర్తివ్యాసం: పాతవి