వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 51వ వారం
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రో గా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ఏర్పాటైంది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రో, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు కలిగి ఉంది. విక్రం సారాభాయ్ని భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధాన మంత్రి అయిన నెహ్రూకు వివరించి, 1962లో హోమీ బాబా పర్యవేక్షణలో Indian National Committee for Space Research (INCOSPAR) ఏర్పరిచాడు. కేరళలో త్రివేండ్రం వద్ద Thumba Equatorial Rocket Launching Station (TERLS) నెలకొల్పి అమెరికా, రష్యా నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ అనతికాలంలోనే స్వదేశీయంగా పూర్తి స్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయంలో పురోగతి సాధించారు. 1969లో ఇస్రో, అనగా Indian Space Research Organisation (ISRO), 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడ్డాయి.
భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమయిన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975న అప్పటి సోవియట్ యూనియన్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. 1979 నాటికి శ్రీహరికోటలో ప్రయోగించిన ఉపగ్రహం రెండవ దశలో ఎదురయిన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి-1 భారతదేశంలో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహం. 1987, 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ 1992లో ASLV ప్రయోగం విజయవంతమయింది. 1993లో PSLV ప్రయోగం విఫలమయింది. తిరిగి 1994లో PSLV ప్రయోగం విజయవంతమయింది. అప్పటినుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమయిన వేదికగా రక్షణ, విద్యా, వ్యవసాయాలకు అవసరమయిన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది.
.....పూర్తివ్యాసం: పాతవి