వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 42వ వారం

ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.

1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడినది. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి. అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది. ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.

ప్రముఖ పాత్రికేయుడైన ఎ.బి.కె. ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడు. 1975 డిసెంబర్ 17హైదరాబాదు లో రెండవ ప్రచురణ కేంద్రం మొదలైంది. అలా విస్తరిస్తూ 2005 అక్టోబర్ 9 నాటికి, రాష్ట్రంలోను, రాష్ట్రం బయటా మొత్తం 23 కేంద్రాలనుండి ప్రచురితమౌతూ, అత్యధిక ప్రచురణ, ఆదరణ కల భారతీయ భాషా పత్రికలలో మూడవ స్థానానికి చేరింది.

సమర్ధులైన సంపాదక సిబ్బంది, పటిష్టమైన సమాచార సేకరణ వ్యవస్థ, ఆధునిక సాంకేతిక అభివృద్ధిని సమర్ధంగా వాడుకోవడం మొదలైనవి ఈనాడు అభివృద్ధికి ముఖ్యమైన తెరవెనుక కారణాలు కాగా, స్థానిక వార్తలకు ప్రాధాన్యతనివ్వడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు కనిపించే కార్టూన్లు, పేజీలో వార్తల అమరిక, మొదలైనవి పాఠకులకు కనిపించే కారణాలు. పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికన్నది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. గుజరాత్ భూకంపం, హిందూ మహాసముద్రం సునామి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.


భాష విషయంలో ఈనాడు తెలుగు పత్రికలలో ఒక ఒరవడి సృష్టింది. ఈనాడు, సహజమైన, సులభమైన భాషలో వార్తలను అందించింది. తెలుగు భాష కొరకు ఆదివారం పుస్తకంలో ప్రత్యేక శిర్షికలను ఈనాడు అందిస్తూ ఉంది. మామూలుగా దినపత్రికలు అందించే కథలు, కథానికలే కాక, భాష విస్తృతికి దోహదం చేసే శీర్షికలను ప్రచురించింది. వాటిలో కొన్ని: తెలుగులో తెలుగెంత, మాటల మూటలు, తెలుగు జాతీయాలు, మాటల వాడుక, మాటలు, మార్పులు మొదలైనవి. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి