వేరు (ఆంగ్లం: Root) వృక్ష దేహంలో భూగర్భంగా పెరిగే ప్రధానాక్షం. పిండాక్షంలోని ప్రథమ మూలం భూమిలోకి వేరుగా పెరుగుతుంది. ఇవి మొక్కని భూమిలో పాతుకునేలా చేసి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. నేలనుండి నీటిని, ఖనిజ లవణాలను శోషించి, ప్రకాండ వ్యవస్థ అంతటికీ సరఫరా చేస్తాయి[1].

భాషా విశేషాలు సవరించు

తెలుగు భాషలో వేరు పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి.[2] వేరు [ vēru ] vēru. [Tel.] n. A root. మూలము. బహువచనం వేరులు or వేళ్లు. వేరిడి vēr-iḍi. [వేరు+ఇడి.] n. A fool, a mad man. అవివేకి, వెర్రివాడు, వెర్రిస్త్రీ." వృథాబోధకుండు వేరిడికాడే." P. i. 729. వేరిడించు vēriḍintsu. v. n. To cause to become foolish, అవివేకమును పొందజేయు. వేరుపారు or వేరుతన్ను vēru-pāru. v. a. To take root. వేరుపనస vēru-panasa. n. That kind of jack tree, the fruit of which springs from the root. A. i. 21. వేరు మల్లె vēru-malle. n. A creeper called Ipomea cymosa. వేరు సంపెంగ vērē-sampenga. n. A plant called Polyanthes tuberosa. వేరుసెనగ vēru-senaga. n. The ground nut. Arachis hypogœa (Watts.) వేరునకాచే సెనగలు. వేరువిత్తు vēru-vittu. n. A bane, ruin, destroyer. నాశకము, నాశకుడు. "వినవేమీకెల్ల వేరువిత్తనినన్నున్." M. VIII. iv. 247. "పుంజులవేరువిత్తు." H. iii. 268.

 
వేరు వ్యవస్థలు

వేరు వ్యవస్థలు సవరించు

ఆవృతబీజాలలో రెండు రకాల వేరువ్యవస్థలు ఉంటాయి.

  • 1. తల్లి వేరు వ్యవస్థ (Tap root system) ద్విదళజీజ మొక్కలలో కనిపిస్తుంది.
  • 2. అబ్బురపు వేరు వ్యవస్థ (Adventitious root system) ఏకదళబీజ మొక్కలలో ఉంటుంది.

వేరు అంతర్నిర్మాణం సవరించు

ద్విదళ బీజ వేరు సవరించు

ద్విదళ బీజ వేరులో మూడు ముఖ్యమైన మండలాలు ఉంటాయి:

  • బాహ్యచర్మం: ఇవి సజీవకణాలతో ఏర్పడిన పొర. ఇది లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. ఏకకణయుత మూలకేశాలతో ఉండటంవల్ల బాహ్యచర్మాన్ని కేశధారి స్తరం అని కూడా అంటారు.
  • వల్కలం: ఇందులో కణాలు అనేక వరుసలలో అమరివుంటాయి. దీనిలోని పొరలను అధశ్చర్మం, సామాన్య వల్కలం, అంతశ్చర్మంగా విభజించారు.
    • అధశ్చర్మం 2-3 వరుసలలో మందమైన కణాలతో ఉండి కాండానికి తన్యతా బలాన్నిస్తుంది. బాహ్యచర్మం నశించినప్పుడు రక్షణ కవచంగా పనిచేస్తుంది.
    • సామాన్య వల్కలం ఆహారాన్ని నిలువ చేస్తుంది. గుండ్రటి మృదుకణాలు అనేక వరుసల్లో, పలుచని కణకవచాలతో, కణాల మధ్య ఖాళీలను ఏర్పరుస్తూ అమరివుంటాయి. నీటిని, లవణాలను ప్రసరణ కణజాలానికి చేర్చడానికి సహకరిస్తుంది.
    • అంతశ్చర్మంలో ఒకే వరుసలో పీపా ఆకార కణాలు, వ్యాసార్ధ గోడలపైన కాస్పేరియన్ మందాలు ఉంటాయి. వీటిలో నీటిని ప్రసరింపజేసేవి వాహక కణాలు.
  • ప్రసరణ స్తంభం: ఇది పరిచక్రం, నాళికాపుంజాలు, దవ్వ అనే భాగాలతో వేరు మధ్యభాగంలో ఉంటుంది.
    • పరిచక్రం దీర్ఘ చతురస్రాకార మృదుకణాలతో ఏర్పడుతుంది. కణాలు విభజన చెందగలిగి ప్రక్క వేర్లను ఉత్పత్తి చేయగలవు.
    • నాళికాపుంజాలు వేర్వేరు వ్యాసార్ధ రేఖలపై ప్రాథమిక దారువు, పోషక కణజాల పుంజాలు సమాన సంఖ్యలో ఏర్పడతాయి. పరిచక్రం వైపు ప్రథమ దారువు, దవ్వ వైపు అంత్యదారువు ఉంటాయి. ఆహారాన్ని దాచివుంచే సజీవ కణాలు దారువు పోషక కణజాలాల మధ్య అమరివుంటాయి. వీటిని సంశ్లేషక కణజాలం అని పిలుస్తారు.
    • దవ్వ ఏర్పడదు లేదా చాలా తక్కువ పరిమాణంలో ఉండి నీటిని, ఆహారాన్ని నిలువచేయడానికి తోడ్పడుతుంది.

ఏకదళ బీజ వేరు సవరించు

ద్విదళ బీజవేరుతో సారూప్యం కనిపిస్తుంది. నాళికాపుంజాలవద్ద కొన్ని మర్పులు ఉంటాయి. దారువు, పోషక కణజాల పుంజాలు వేర్వేరు వ్యాసార్ధాల రేఖలపై ఆరుకంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. దవ్వ అధికభాగాన్ని ఆక్రమించి ఆహారాన్ని నిలువచేయడానికి, యాంత్రికబలాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది.

వేరు రూపాంతరాలు సవరించు

కాంతి, నీరు, ఖనిజ లవణాలు, గాలి వంటి వాతావరణ కారకాలు తగినంతగా లేకపోతే మొక్కలు జీవించలేవు. మనుగడ కోసం జరిగే పోరాటంలో మొక్కలు వివిధ ఆవాసాల్లో జీవించవలసి ఉంటుంది. ఇటువంటి కొన్ని పరిసరాల్లో మొక్కలు జీవించాలంటే వాటిలోని వివిధ అంగాలు వాటి సామాన్య విధులతో పాటుగా కొన్ని ప్రత్యేక విధులు కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. ఇట్లా ప్రత్యేక విధులు నిర్వర్తించుటకు వేరు ఏర్పరుచుకున్న వివిధ వైవిధ్య నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పులను 'వేరు రూపాంతరాలు' అంటారు.

 
ఊడవేళ్ళు

దుంప వేళ్ళు సవరించు

వేర్లలో కొన్ని మొక్కలు ఆహరపదార్ధాల్ని నిలువచేసుకుంటాయి. వాటిని మనం ఆహారంగా ఉపయోగిస్తాము. వీటిని దుంపలు అంటాము.

అంటువేరు సవరించు

చెట్ల మీదనే పెరుగు చిన్న చిన్న మొక్కలు మర్రి కొన్నిగలవు. వాని వేళ్లును భూమిలోనికికేగవు. బదనిక వేళ్లవలె కొమ్మలోపలికిపోయి దాని ఆహారమును తస్కరింపవు. భూమిలో నాటుకొనుటకు బదులు ఆ కొమ్మను అంటి పెట్టుకొని గాలిలో దొరకు నావిరిని బీల్చుకొనుచుండును. ఇట్టివి అంటువేరులు.

ఊడ వేళ్ళు సవరించు

కొన్ని వృక్షాలలో మొదలు నుండి శాఖలు బయలుదేరి చాలా దూరం వరకు విస్తరిస్తాయి. ఇట్లాంటి శాఖలు నిలబడటానికి కొంత యాంత్రిక శక్తి అవసరం. శాఖలు వంగిపోకుండా వాటికి ఆధారంగా కొన్ని అబ్బురపు వేళ్ళు ఉద్భవించి భూమిలోకి చేరుతాయి. ఇవి స్తంభాలవలె నిలబడి విస్తరించిన శాఖలకు అధనపు ఆధారాన్ని ఇస్తాయి. ఇట్లాంటి వాయుగత వేళ్ళనే ఊడవేళ్ళు అంటారు. ఉదా: మెరేసి కుటుంబానికి చెందిన మర్రి, జువ్వి వంటి వృక్షాలలో ఈ వేళ్ళను చూడవచ్చు.

 
మొక్కజొన్నలో ఊతవేళ్ళు

ఊత వేళ్ళు సవరించు

కొన్ని మొక్కలలో కాండం ఏటవాలుగా వృద్ధి చెందుతుంది. ఇట్లాంటి కాండానికి ఆధారం ఇవ్వడానికి కాండం నుండి కొన్ని అబ్బురపు వేళ్ళు వృద్ధి చెంది భూమిలోకి చేరుతాయి. ఉదా: మొగలి

ఎగబ్రాకే వేళ్ళు సవరించు

కాండం బలహీనంగా ఉన్న మొక్కలలో ఈ వేళ్ళు ఉంటాయి. మొక్కలు వృద్ధి చెందటానికి, అన్ని పత్రాలకు సూర్యరశ్మి తాకడానికి ఇలాంటి మొక్కలు ఏదో ఒకటి ఆధారం చేసుకొని పైకి ఎగబాకుతాయి. మొక్కలు ఎగబాకటానికి అనువుగా కాండం నుండి ఉద్భవించే వేళ్ళనే ఎగబ్రాకే వేళ్ళు అంటారు. ఉదా: తమలపాకు

 
పిస్టియాలో సంతులనం జరిపే వేళ్ళు

సంతులనం జరిపే వేళ్ళు సవరించు

ఈ వేళ్ళను కొన్ని నీటి మొక్కలలో చూడవచ్చు. ఈ నీటి మొక్కలలో కణుపు భాగాల నుండి కొన్ని అబ్బురపు వేళ్ళు గుంపులుగా ఏర్పడతాయి. ఈ వేళ్ళు మొక్కను నీటిలో నిశ్చలంగా ఉంచటానికి,నీటి గాలి కెరటాల వలన మొక్క తలకిందులైనా తిరిగి యథాస్థితికి తీసుకరావటానికి ఈ వేళ్ళు ఉపయోగపడతాయి. ఉదా: పిస్టియా

 
ఉప్పునీటి మొక్కలలో శ్వాసవేళ్ళు

శ్వాస వేళ్ళు సవరించు

ఉప్పు నీటి మొక్కలు గాలి చొరబడని బురదనీటి ప్రాంతాలలో పెరుగుతాయి. వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ పెరుగుటకు మొక్కకు ఆక్సిజన్ ఎంతో అవసరం. లేని పక్షంలో మొక్కలు గిడసబారిపోతాయి. అందుకే ఉప్పునీటి మొక్కలు గాలిని తీసుకోవడానికి వీలుగా ఉండే వేరు వ్యవస్థను ఏర్పటు చేసుకుంటాయి. ఈ వేళ్ళనే న్యూమాటోఫోరులు అంటారు. ఇవి భూమ్యాకర్షణశక్తికి వ్యతిరేకంగా పెరిగి వాయుగతంగా వృద్ధి చెందుతాయి. వీటిపై అనేక శ్వాసరంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా గాలిని గ్రహించి మొక్కలు శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఈ విధంగా శ్వాసక్రియకు సహకరించే వేళ్ళనే శ్వాసవేళ్ళు అంటారు. ఉదా: అవిసినియా, రైజోఫొరా

వెలమన్ వేళ్ళు సవరించు

కొన్ని మొక్కలు భూమిపై కాకుండా ఇతర మొక్కల శాఖలపై ఆవాసం ఏర్పరుచుకొని స్వతంత్రంగా పెరుగుతాయి. వీటిని వృక్షోపజీవులు అంటారు. ఇవి నేలకు చాలా దూరం(ఎత్తు)లో ఉండటం వలన నీటిని గ్రహించడానికి అవరోధం ఏర్పడుతుంది. ఆ సమస్యను అధిగమించడానికి ఈ మొక్కలు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేకమైన వేళ్ళనే వెలమన్ వేళ్ళు అంటారు. ఈ వేళ్ళు స్వేచ్చగా గాలిలో వేలాడుతూ గాలిలోని తేమను, వర్షపు నీటిని గ్రహించి మొక్కకు అందిస్తాయి[3]. ఈ పని చేయడానికి ఈ వేళ్ళలో వెలమన్ అనే నిర్జీవ కణజాలం ఉంటుంది. అందుకే ఈ వేళ్ళకు ఆ పేరు పెట్టారు. ఉదా: వాండా

కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు సవరించు

కిరణజన్య సంయోగక్రియ నిర్వర్తించడం అన్నది ప్రధానంగా పత్రం పని అయినా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కాండం, వేరు కూడా ఈ పనిని చేస్తాయి. కొన్ని వృక్షోపజీవి మొక్కలలో కాండం బాగా క్షిణించి, పత్రాలు లేకుండా ఉండటం అన్నది కనిపిస్తుంది. ఈ పరిస్థితులలో వాయిగతమైన వేళ్ళను కలిగిన ఈ మొక్కలు హరితాన్ని ఏర్పరుచుకొని కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి. పోషక పదార్థాలను తయారుచేసుకుంటాయి. ఉదా: టినియోఫిల్లమ్

సహజీవనపు వేళ్ళు సవరించు

కొన్ని వేళ్ళు వాటి ప్రధాన క్రియతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుంటాయి. అలాంటి వాటిలో ఈ సహజీవనపు వేళ్ళు ఒకటి. ఈ వేళ్ళు రైజోబియం జాతికి చెందిన బాక్టీరియాతో సహజీవనం చేస్తాయి. డాలికస్, క్రొటలేరియా వంటి లెగుమినేసికి చెందిన మొక్కలలో వేళ్ళకు బుడిపెలు ఉంటాయి. వేరు బాగా లేతగా ఉన్న దశలో రైజోబియం బాక్టీరియా వీటిలోకి ప్రవేశిస్తుంది. బాక్టీరియా సమూహాలుగా ఆవాసం చేయడానికి ఈ రకమైన వేళ్ళు సహకరిస్తాయి. అలాగే బాక్టీరియా మొక్కలకు కావలసిన నత్రజని తయారిలో వేళ్ళకు సహకరిస్తాయి. అందుకే వీటిని సహజీవనపు వేళ్ళు అంటారు. ఉదా: వేరుశనగ

పరాన్నజీవుల వేళ్ళు సవరించు

తమకు కావలసిన ఆహారపదార్థాల తయారికి కొన్ని మొక్కలు ఇతర మొక్కలపై పాక్షికంగానో, పూర్తిగానో ఆధారపడతాయి. ఇట్లాంటి పరాన్నజీవి మొక్కలు హస్టోరియం అనే ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. హస్టోరియం ద్వారా అతిథేయి నుండి ఈ మొక్కలు తమకు కావలసిన పదార్థాలను గ్రహిస్తాయి. హస్టోరియాను రూపాంతరం చెందిన వేరుగానే శాస్త్రవేత్తలు భావించారు.

మూలాలు సవరించు

  1. Caldwell MM, Dawson TE, Richards JH (January 1998). "Hydraulic lift: consequences of water efflux from the roots of plants". Oecologia. 113 (2): 151–161. Bibcode:1998Oecol.113..151C. doi:10.1007/s004420050363. PMID 28308192.
  2. బ్రౌన్ నిఘంటువు ప్రకారం వేరు పదప్రయోగాలు.[permanent dead link]
  3. Nowak, Edward J.; Martin, Craig E. (1997). "Physiological and anatomical responses to water deficits in the CAM epiphyte Tillandsia ionantha (Bromeliaceae)". International Journal of Plant Sciences. 158 (6): 818–826. doi:10.1086/297495. hdl:1808/9858. JSTOR 2475361.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=వేరు&oldid=3985565" నుండి వెలికితీశారు